7.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునాలుగవ అధ్యాయము
వృత్రాసురుని పూర్వచరిత్ర
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పరీక్షిదువాచ
14.1 (ప్రథమ శ్లోకము)
రజస్తమఃస్వభావస్య బ్రహ్మన్ వృత్రస్య పాప్మనః|
నారాయణే భగవతి కథమాసీద్దృఢా మతిః॥5275॥
పరీక్షిత్తు పలికెను- మహాత్మా! శుకయోగీ! వృత్రాసురుడు రజోగుణ తమోగుణ స్వభావము గలవాడు. అతడు పాపాత్ముడు. ఇట్టి స్థితిలో అతనికీ సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని పాదముల యెడ దృఢమైన భక్తి ఎట్లు కుదురుకొనెను?
14.2 (రెండవ శ్లోకము)
దేవానాం శుద్ధసత్త్వానామృషీణాం చామలాత్మనామ్
భక్తిర్ముకున్దచరణే న ప్రాయేణోపజాయతే॥5276॥
సాధారణముగా శుద్ధసత్త్వ స్వభావులైన దేవతలకును, నిర్మల హృదయులైన ఋషిసత్తములకును ముకుందుని పాదపద్మములయెడ అనన్య భక్తి కనిపించుచుండును కదా! వాస్తవముగా భగవద్భక్తి కలుగుట దుర్లభమైనదే.
14.3 (మూడవ శ్లోకము)
రజోభిః సమసఙ్ఖ్యాతాః పార్థివైరిహ జన్తవః|
తేషాం యే కేచనేహన్తే శ్రేయో వై మనుజాదయః॥5277॥
మహాత్మా! ఈ జగత్తునందు ప్రాణులు భూమియొక్క ధూళికణములవలె అసంఖ్యాకము. వారిలో మనుష్యులు మొదలగు ఉత్తమజీవులు తమ శ్రేయస్సు కొరకు పాటుపడుదురు.
14.4 (నాలుగవ శ్లోకము)
ప్రాయో ముముక్షవస్తేషాం కేచనైవ ద్విజోత్తమ|
ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ముచ్యేత సిధ్యతి॥5278॥
ద్విజవరా! వారిలోగూడ సంసారము నుండి ముక్తి కోరుకొను వారు చాల అరుదుగా ఉందురు. ముక్తిని గోరుకొను వేలకొలది జనులలో ఎవరికో ఒక్కరికి మాత్రమే సిద్ధిలభించును.
14.5 (ఐదవ శ్లోకము)
ముక్తానామపి సిద్ధానాం నారాయణపరాయణః|
సుదుర్లభః ప్రశాన్తాత్మా కోటిష్వపి మహామునే॥5279॥
మహామునీ! ముక్తిని పొందిన, సిద్ధపురుషులలో గూడ కోటికొక్కడుకూడ శ్రీమన్నారాయణుని యెడభక్తిగల ప్రశాంత చిత్తులు ఉండుట కష్టముగదా!
థ14.6 (ఆరవ శ్లోకము)
వృత్రస్తు స కథం పాపః సర్వలోకోపతాపనః|
ఇత్థం దృఢమతిః కృష్ణ ఆసీత్సఙ్గ్రామ ఉల్బణే॥5280॥
వృత్రాసురుడు సకలలోకములను గడగడలాడించిన పాపాత్ముడు. అతడు భయంకరమైన సంగ్రామ సమయమున శ్రీకృష్ణునియెడ ఇంతగా దృఢమైన భక్తిని కలిగియుండుటకు కారణమేమి?
14.7 (ఏడవ శ్లోకము)
అత్ర నః సంశయో భూయాఞ్ఛ్రోతుం కౌతూహలం ప్రభో|
యః పౌరుషేణ సమరే సహస్రాక్షమతోషయత్॥5281॥
ప్రభూ! ఈ విషయమును తెలిసికొనవలెననెడి కుతూహలము మెండుగా గలదు. ఆహా! వృత్రుడు తన బలపరాక్రమములతో రణరంగమున వేయికన్నుల వేల్పుడగు ఇంద్రుని గూడ సంతోషపరచెను.
సూత ఉవాచ
14.8 (ఎనిమిదవ శ్లోకము)
పరీక్షితోఽథ సమ్ప్రశ్నం భగవాన్ బాదరాయణిః|
నిశమ్య శ్రద్దధానస్య ప్రతినన్ద్య వచోఽబ్రవీత్॥5282॥
సూతుడు పలికెను- శౌనకాదిమునులారా! పరమ శ్రద్ధాళువైన పరీక్షిత్తుయొక్క ప్రశ్నను విని, శుకయోగి అతనని అభినందించుచు ఇట్లనెను.
శ్రీశుక ఉవాచ
14.9 (తొమ్మిదవ శ్లోకము)
శృణుష్వావహితో రాజన్నితిహాసమిమం యథా|
శ్రుతం ద్వైపాయనముఖాన్నారదాద్దేవలాదపి॥5283॥
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసమును సావధానముగా వినుము. దీనిని నా తండ్రియైన వ్యాసభగవానుడును, దేవర్షియైన నారదుడును, మహర్షియైన దేవలుడును చెప్పగా నేను వినియుంటిని. ఇప్పుడు దానిని తెల్పెదను వినుము.
14.10 (పదియవ శ్లోకము)
ఆసీద్రాజా సార్వభౌమః శూరసేనేషు వై నృప|
చిత్రకేతురితి ఖ్యాతో యస్యాసీత్కామధుఙ్మహీ॥5284॥
రాజా! పూర్వకాలమున శూరసేన దేశమునందు చిత్రకేతుడను సార్వభౌముడు ఉండెను. అతడు మిగుల విఖ్యాతుడు. అతని రాజ్యమున భూమి స్వయముగా ప్రజలకు వారు కోరుకొనిన రీతిగా అన్నము, జలము మొదలగు వస్తువులను అన్నింటిని ప్రసాదించుచుండెను.
14.11 (పదకొండవ శ్లోకము)
తస్య భార్యాసహస్రాణాం సహస్రాణి దశాభవన్|
సాన్తానికశ్చాపి నృపో న లేభే తాసు సన్తతిమ్॥5285॥
అతనికి కోటిమంది రాణులు ఉండిరి. సంతానమును పొందుటకు అర్హుడుగూడ. కాని, వారిలో ఏ ఒక్కరికి సంతానము కలుగలేదు.
14.12 (పండ్రెండవ శ్లోకము)
రూపౌదార్యవయోజన్మవిద్యైశ్వర్యశ్రియాదిభిః|
సమ్పన్నస్య గుణైః సర్వైశ్చిన్తా వన్ధ్యాపతేరభూత్॥5286॥
ఆ చిత్రకేతుమహారాజునకు ఏ విషయముస గూడ లోటు లేకుండెను. సౌందర్యము, ఔదార్యము, యౌవనము, సద్వంశమున జననము, విద్య, ఐశ్వర్యము, సంపదలు మొదలగు అన్నిగుణములును అతనిలో ఉండెను. అయినను అతని పత్నులు సంతాన హీనులగుట వలన అతడు చింతాగ్రస్తుడై యుండెను.
14.13 (పదమూడవ శ్లోకము)
న తస్య సమ్పదః సర్వా మహిష్యో వామలోచనాః|
సార్వభౌమస్య భూశ్చేయమభవన్ ప్రీతిహేతవః॥5287॥
అతడు భూ మండలమునకు ఏకచ్ఛత్రాధిపతియై యుండెను. అతని రాణులు సౌందర్యవతులు. ఆయనకు అన్నివిధములగు సంపదలు ఉండెను. ఇవి ఏవియును ఆయనను ప్రీతిని గూర్చలేకుండెను.
14.14 (పదునాలుగవ శ్లోకము)
తస్యైకదా తు భవనమఙ్గిరా భగవాన్ ఋషిః|
లోకాననుచరన్నేతానుపాగచ్ఛద్యదృచ్ఛయా॥5288॥
ఇట్లుండగా పూజ్యుడైన అంగిరసమహర్షి సకల లోకములలో సంచరించుచు, ఒకనాడు అకస్మాత్తుగా చిత్రకేతు మహారాజు యొక్క భవనమునకు విచ్చేసెను.
14.15 (పదునైదవ శ్లోకము)
తం పూజయిత్వా విధివత్ప్రత్యుత్థానార్హణాదిభిః|
కృతాతిథ్యముపాసీదత్సుఖాసీనం సమాహితః॥5289॥
అప్పుడు చిత్రకేతు మహారాజు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే విధ్యుక్తముగా సత్కరించెను. అతిథిమర్యాదలు జరిగినపిదప అంగిరసుడు సుఖాసీనుడయ్యెను. అంతట చిత్రకేతువుగూడ ప్రశాంతముగా ఆయన సమీపమున కూర్చుండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
8.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునాలుగవ అధ్యాయము
వృత్రాసురుని పూర్వచరిత్ర
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
14.16 (పదునారవ శ్లోకము)
మహర్షిస్తముపాసీనం ప్రశ్రయావనతం క్షితౌ|
ప్రతిపూజ్య మహారాజ సమాభాష్యేదమబ్రవీత్॥5290॥
మహారాజా! ఆ చిత్రకేతు మహారాజు మిగుల వినమ్రతతో భక్తి పూర్వకముగా ఆయన యొద్ద నేలపై కూర్చొనియుండుటను అంగిరసుడు గమనించి ఇట్లు పలికెను.
అఙ్గిరా ఉవాచ
14.17 (పదునేడవ శ్లోకము)
అపి తేఽనామయం స్వస్తి ప్రకృతీనాం తథాఽఽత్మనః|
యథా ప్రకృతిభిర్గుప్తః పుమాన్ రాజాపి సప్తభిః॥5291॥
అంగిరస ఋషి పలికెను- "చిత్రకేతు మహారాజా! మహత్తత్త్వాది ఏడు ఆవరణములు జీవుని చుట్టును జేరి రక్షించుచుండునట్లు, గురువు, మంత్రి, రాజ్యము, దుర్గము, కోశము, సేనలు, మిత్రులు అను ఏడు ప్రకృతులు రాజు చుట్టును జేరి, ఆయనను రక్షించుచుండును. ఇవి అన్నియు భద్రముగనే ఉన్నవి గదా! ఏలయన, ఇవి అన్నియును సురక్షితముగా ఉన్నప్పుడే రాజు క్షేమముగా ఉండును.
14.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఆత్మానం ప్రకృతిష్వద్ధా నిధాయ శ్రేయ ఆప్నుయాత్|
రాజ్ఞా తథా ప్రకృతయో నరదేవాహితాధయః॥5292॥
రాజు ఈ సప్తప్రకృతులకు అనుకూలుడై యుండుటవలననే రాజ్యసుఖములు అనుభవించును. అట్లే ప్రకృతులు గూడ తమ రక్షణ భారమును రాజుపై నుంచి, సుఖమును, సమృద్ధిని పొందును.
14.19 (పందొమ్మిదవ శ్లోకము)
అపి దారాః ప్రజామాత్యా భృత్యాః శ్రేణ్యోఽథ మన్త్రిణః|
పౌరా జానపదా భూపా ఆత్మజా వశవర్తినః॥5293॥
రాజా! నీ రాణులు, ప్రజలు, ఆమాత్యులు, సేవకులు, వ్యాపారులు, మంత్రులు, పౌరులు, జానపదులు, సామంతులు, పుత్రులు నీ వశములో ఉన్నారా?
14.20 (ఇరువదియవ శ్లోకము)
యస్యాత్మానువశశ్చేత్స్యాత్సర్వే తద్వశగా ఇమే|
లోకాః సపాలా యచ్ఛన్తి సర్వే బలిమతన్ద్రితాః॥5294॥
వాస్తవముగా మనో నిగ్రహము గల వానికే ఇవి అన్నియును వశములో ఉండును. అంతేగాదు, సకల లోకములు, లోకపాలురు గూడ సావధానముగా అతనికి కానుకలు అర్పించి, ప్రసన్నులయ్యెదరు.
14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఆత్మనః ప్రీయతే నాత్మా పరతః స్వత ఏవ వా|
లక్షయేఽలబ్ధకామం త్వాం చిన్తయా శబలం ముఖమ్॥5295॥
కాని, నీవు అసంతృప్తితో ఉన్నట్లు కనబడుచున్నావు. నీ అభిలాష ఏదో నెరవేరినట్లున్నది. నీ ముఖము చూడగా నీవు చింతాగ్రస్తుడవైయున్నట్లు అనిపించుచున్నది. నీ అసంతోషమునకు కారణము నీవేనా? లేక ఇతరులా?"
14.22 (ఇరువది రెండవ శ్లోకము)
ఏవం వికల్పితో రాజన్ విదుషా మునినాపి సః|
ప్రశ్రయావనతోఽభ్యాహ ప్రజాకామస్తతో మునిమ్॥5296॥
రాజా! చిత్రకేతు మహారాజు యొక్క మనస్సులో ఏదో చింత ఉన్నట్లు అంగిరసునకు ముందే తెలియును. అయినను దానికి సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగెను. చిత్రకేతునకు సంతానాభిలాష ఉండెను. కనుక, అతడు అంగిరసమహర్షికి వినమ్రుడై ఇట్లు నివేదించెను-
చిత్రకేతురువాచ
14.23 (ఇరువది మూడవ శ్లోకము)
భగవన్ కిం న విదితం తపోజ్ఞానసమాధిభిః|
యోగినాం ధ్వస్తపాపానాం బహిరన్తః శరీరిషు॥5297॥
చిత్రకేతువు ఇట్లనెను- మహాత్మా! యోగులకు తపస్సు, జ్ఞానము, ధారణ, ధ్యాన సమాధులద్వారా వారి పాపములు అన్నియును నశించిపోవును. అట్టివారికీ లోపల, బయట తెలియని విషయములంటూ ఉండునా?
14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తథాపి పృచ్ఛతో బ్రూయాం బ్రహ్మన్నాత్మని చిన్తితమ్|
భవతో విదుషశ్చాపి చోదితస్త్వదనుజ్ఞయా॥5298॥
బ్రాహ్మణోత్తమా! మీరు అన్నియు ఎరిగినవారే గదా! ఐనప్పటికినీ, మీరు నా మనస్సులోగల చింతను గూర్చి అడుగుచున్నారు. కనుక, మీ ప్రేరణ పొంది, ఈ అనుజ్ఞతో నా మనస్సులోని చింతను నివేదించుచున్నాను.
14.25 (ఇరువది ఐదవ శ్లోకము)
లోకపాలైరపి ప్రార్థ్యాః సామ్రాజ్యైశ్వర్యసమ్పదః|
న నన్దయన్త్యప్రజం మాం క్షుత్తృట్కామమివాపరే॥5299॥
రాజులు సామ్రాజ్యమును, ఐశ్వర్యమును, సంపదలను కోరుకొనుచుందురు. ఇవి అన్నియును నాకు ప్రాప్తించినవి. సుఖభోగములకు ఏ మాత్రమూ లోటులేదు. ఐనను, సంతానము లేక పోవుటచే ఆకలి గొన్నవారికి అన్న పానాదులతో లభించి తృప్తి ఇతర వస్తువులచే లభించినట్లు ఈ భోగభాగ్యములు నాకు తృప్తిని గూర్చుట లేదు.
14.26 (ఇరువది ఆరవ శ్లోకము)
తతః పాహి మహాభాగ పూర్వైః సహ గతం తమః|
యథా తరేమ దుస్తారం ప్రజయా తద్విధేహి నః॥5300॥
మహానుభావా! సంతానము లేమిచే నేను దుఃఖితుడనై యున్నాను. వంశాభివృద్ధి లేకుండుటచే నా పితృదేవతలు గూడ దుఃఖితులైయున్నారు. కనుక, నీవు నాకు సంతానము కలుగు ఉపాయమును దెలిపి, నన్ను ఇహపరలోక దుఃఖములనుండి విముక్తుని జేయుము.
శ్రీశుక ఉవాచ
14.27 (ఇరువది ఏడవ శ్లోకము)
ఇత్యర్థితః స భగవాన్ కృపాలుర్బ్రహ్మణః సుతః|
శ్రపయిత్వా చరుం త్వాష్ట్రం త్వష్టారమయజద్విభుః॥5301॥
శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! చిత్రకేతు మహారాజు ఇట్లు ప్రార్థింపగా సర్వసమర్థుడు. దయామయుడు, బ్రహ్మదేవుని కుమారుడైన అంగిరసుడు త్వష్టదేవతకు నివేదింపదగిన చరువును (అన్నమును) వండింప జేసి, ఆ దేవతను తృప్తి పరచుచు యజ్ఞమును ఆచరించెను.
14.28 (ఇరువది ఎనిమిదివ శ్లోకము)
జ్యేష్ఠా శ్రేష్ఠా చ యా రాజ్ఞో మహిషీణాం చ భారత|
నామ్నా కృతద్యుతిస్తస్యై యజ్ఞోచ్ఛిష్టమదాద్ద్విజః॥5302॥
14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
అథాహ నృపతిం రాజన్ భవితైకస్తవాత్మజః|
హర్షశోకప్రదస్తుభ్యమితి బ్రహ్మసుతో యయౌ॥5303॥
రాజా! చిత్రకేతు మహారాజు యొక్క రాణులలో కృతద్యుతి అను నామె పెద్దది. ఆమె మిగుల ఉత్తమురాలు. అంగిరసమహర్ష ఆమెకు యజ్ఞావశిష్టమగు ప్రసాదమును ఇచ్చి, ఆ మహారాజుతో ఇట్లు పలికెను- "రాజా! నీకు ఒక కుమారుడు కలుగును. అతని వలన నీకు సంతోషము, దుఃఖము గూడ కలుగును" అని పలికి అంగిరసుడు వెళ్ళిపోయెను.
14.30 (ముప్పదియవ శ్లోకము)
సాపి తత్ప్రాశనాదేవ చిత్రకేతోరధారయత్|
గర్భం కృతద్యుతిర్దేవీ కృత్తికాగ్నేరివాత్మజమ్॥5304॥
యజ్ఞావశిష్టమైన ప్రసాదమును భుజించుటచే చిత్రకేతు మహారాజు వలన కృతద్యుతి, అగ్నిదేవుని వలన కృత్తికాదేవివలె గర్భమును దాల్చెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
8.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునాలుగవ అధ్యాయము
వృత్రాసురుని పూర్వచరిత్ర
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
తస్యా అనుదినం గర్భః శుక్లపక్ష ఇవోడుపః|
వవృధే శూరసేనేశ తేజసా శనకైర్నృప॥5305॥
మహారాజా! శూరసేన దేశాధిపతియైన చిత్రకేతువు యొక్క తేజస్సువలన ఆమె గర్భము శుక్లపక్ష చంద్రునివలె క్రమముగా దినదినాభివృద్ధి గాంచెను.
14.32 (ముప్పది రెండవ శ్లోకము)
అథ కాల ఉపావృత్తే కుమారః సమజాయత|
జనయన్ శూరసేనానాం శృణ్వతాం పరమాం ముదమ్॥5306॥
ప్రసవ సమయము ప్రాప్తించినంతనే కృతద్యుతికి ఒక కుమారుడు కలిగెను. అతడు మిగుల సుందరుడు. ఆ శుభవార్తకు శూరసేన దేశ ప్రజలు ఎంతయు ఆనందించిరి.
14.33 (ముప్పది మూడవ శ్లోకము)
హృష్టో రాజా కుమారస్య స్నాతః శుచిరలఙ్కృతః|
వాచయిత్వాఽఽశిషో విప్రైః కారయామాస జాతకమ్॥5307॥
చిత్రకేతుమహారాజు పుత్రప్రాప్తికి పరమానంద భరితుడాయెను. స్నానమాచరించి పవిత్రుడాయెను. వస్త్రాభరణములచే అలంకృతుడై వేదవేత్తలైన విప్రోత్తములచే స్వస్తివచనములను జరిపించి, వారి ఆశీస్సులను పొందెను. పిమ్మట పుత్రునకు జాతకర్మాది సంస్కారములను జరిపించెను.
14.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
తేభ్యో హిరణ్యం రజతం వాసాంస్యాభరణాని చ|
గ్రామాన్ హయాన్ గజాన్ ప్రాదాద్ధేనూనామర్బుదాని షట్॥5308॥
ఆ శుభసమయమును పురస్కరించుకొని, అతడు బ్రాహ్మణోత్తములకు ఒక్కొక్కరికి బంగారమును, వెండిని, వస్త్రాభరణములను, గ్రామములను, అశ్వములను, ఏనుగులను, అరవైకోట్ల పాడియావులను దానము చేసెను.
14.35 (ముప్పది ఐదవ శ్లోకము)
వవర్ష కామమన్యేషాం పర్జన్య ఇవ దేహినామ్
ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహామనాః॥5309॥
ఉదార శిరోమణియైన చిత్రకేతువు పుత్రునకు సంపదలు, కీర్తి, ప్రతిష్ఠలు, ఆయురారోగ్యములు ప్రాప్తించుటకై ఇతర ప్రజలందరికిని మేఘములు జీవుల కోరికలను సఫలము చేయుటకై వర్షించునట్లు పుష్కలముగా దానము లొనర్చెను.
14.36 (ముప్పది ఆరవ శ్లోకము)
కృచ్ఛ్రలబ్ధేఽథ రాజర్షేస్తనయేఽనుదినం పితుః|
యథా నిఃస్వస్య కృచ్ఛ్రాప్తే ధనే స్నేహోఽన్వవర్ధత॥5310॥
నిర్ధనునకు ఎంతో కష్టపడి సంపాదించిన ధనముపై ఆసక్తి ఏర్పడినట్లు రాజర్షియైన చిత్రకేతునకు లేక లేక కలిగిన కుమారునిపై ప్రేమ అనుదినము దృఢమయ్యెను.
14.37 (ముప్పది ఏడవ శ్లోకము)
మాతుస్త్వతితరాం పుత్రే స్నేహో మోహసముద్భవః|
కృతద్యుతేః సపత్నీనాం ప్రజాకామజ్వరోఽభవత్॥5311॥
తల్లియైన కృతద్యుతికి గూడ పుత్రవ్యామోహము ఇనుమడించెను. సవతులైన రాణులకు మాత్రము సంతానము లేమిచే పుత్రప్రాప్తికై కోరిక మెండయ్యెను.
14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
చిత్రకేతోరతిప్రీతిర్యథా దారే ప్రజావతి|
న తథాన్యేషు సఞ్జజ్ఞే బాలం లాలయతోఽన్వహమ్॥5312॥
ప్రతిదినము చిత్రకేతు మహారాజు తన పుత్రుని మిక్కిలి ప్రేమతో లాలింపసాగెను. అట్లే సంతానవతియైన కృతద్యుతిపై ఇతర రాణులమీది కంటె మక్కువ ఎక్కువయ్యెను.
14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
తాః పర్యతప్యన్నాత్మానం గర్హయన్త్యోఽభ్యసూయయా|
ఆనపత్యేన దుఃఖేన రాజ్ఞోఽనాదరేణ చ॥5313॥
ఇతర రాణులు సంతానము లేకుండుట వలన మిగుల దుఃఖితులైయుండిరి. పైగా చిత్రకేతువు గూడ వారి యెడల ఉపేక్ష వహింపసాగెను. ఆ కారణముగా వారు తమలోతాము అసూయతో పరితపించుచుండిరి.
14.40 (నలుబదియవ శ్లోకము)
ధిగప్రజాం స్త్రియం పాపాం పత్యుశ్చాగృహసమ్మతామ్|
సుప్రజాభిః సపత్నీభిర్దాసీమివ తిరస్కృతామ్॥5314॥
14.41 (నలుబది ఒకటవ శ్లోకము)
దాసీనాం కో ను సన్తాపః స్వామినః పరిచర్యయా|
అభీక్ష్ణం లబ్ధమానానాం దాస్యా దాసీవ దుర్భగాః॥5315॥
ఇతర రాణులు తమలో తాము ఇట్లనుకొనసాగిరి- "సోదరీమణులారా! సంతానములేని స్త్రీలు మిగుల దురదృష్టవతులు. పుత్రవతులైన సవతులు వారిని దాసీలను వలె తిరస్కరింతురు. పైగా భర్తకూడ వారిని పత్నులుగా పరిగణింపడు. ఇట్టి స్థితి మిక్కిలి విచారకరము. దాసీలకేమి దుఃఖముండును? రాజునకు పరిచర్యలు చేయు చుండుట వలన రాజుగారి మెప్పును పొందుచుందురు. కాని, మేము దాసీలకు దాసీలవలె హీనమైతిమి"
14.42 (నలుబది రెండవ శ్లోకము)
ఏవం సన్దహ్యమానానాం సపత్న్యాః పుత్రసమ్పదా|
రాజ్ఞోఽసమ్మతవృత్తీనాం విద్వేషో బలవానభూత్॥5316॥
పరీక్షిన్మహారాజా! కృతద్యుతి సంతానవతియగుట వలన ఆ రాణులెంతయు పరితపించుచుండిరి. పైగా రాజుయొక్క నిరాదరణ కారణముగా వారిలో కృతద్యుతి యెడ ద్వేషము మెండయ్యెను.
14.43 (నలుబది మూడవ శ్లోకము)
విద్వేషనష్టమతయః స్త్రియో దారుణచేతసః|
గరం దదుః కుమారాయ దుర్మర్షా నృపతిం ప్రతి॥5317॥
ద్వేష కారణముగా ఆ రాణుల బుద్ధులు భ్రష్టములయ్యెను. చిత్తములు క్రౌర్యముతో నిండిపోయెను. కుమారునిపై రాజునకు గల ప్రేమను సహింపలేకుండిరి. కావున, వారు దుర్బుద్ధితో ఆ శిశువునకు విషమిచ్చిరి.
14.44 (నలుబది నాలుగవ శ్లోకము)
కృతద్యుతిరజానన్తీ సపత్నీనామఘం మహత్|
సుప్త ఏవేతి సఞ్చిన్త్య నిరీక్ష్య వ్యచరద్గృహే॥5318॥
మహారాణియైన కృతద్యుతికి తన సవతులు చేసిన ఘోరమగు ఆ పాపకృత్యము తెలియకుండెను. ఆ బాలుని చూచి నిద్రించుచున్నాడని భావించి, ఆమె భవనమున ఇటునటు తిరుగసాగెను.
14.45 (నలుబది ఐదవ శ్లోకము)
శయానం సుచిరం బాలముపధార్య మనీషిణీ|
పుత్రమానయ మే భద్రే ఇతి ధాత్రీమచోదయత్॥5319॥
బాలుడు ఎంతకును నిద్రనుండి మేల్కొనకుండుట చూచి, ఆ రాణీ దాసితో - 'సఖీ! నా కుమారుని తీసుకొని రమ్ము' అని పలికెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
9.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునాలుగవ అధ్యాయము
వృత్రాసురుని పూర్వచరిత్ర
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
14.46 (నలుబది ఆరవ శ్లోకము)
సా శయానముపవ్రజ్య దృష్ట్వా చోత్తారలోచనమ్|
ప్రాణేన్ద్రియాత్మభిస్త్యక్తం హతాస్మీత్యపతద్భువి॥5320॥
ఆ దాసి పడుకొన్న బాలుని సమీపించి ఆ బాలుడు గ్రుడ్లు తేలవేసియుండుటను గమనించెను. ఆ బాలుని ప్రాణములు, ఇంద్రియములు, ఆత్మ శరీరమును వీడియున్నట్లు తెలిసికొని 'అయ్యో! హతాస్మి' అనుచు నేలపై పడిపోయెను.
14.47 (నలుబది ఏడవ శ్లోకము)
తస్యాస్తదాకర్ణ్య భృశాతురం స్వరం ఘ్నన్త్యాః కరాభ్యాముర ఉచ్చకైరపి||
ప్రవిశ్య రాజ్ఞీ త్వరయాఽఽత్మజాన్తికం దదర్శ బాలం సహసా మృతం సుతమ్॥5321॥
అంతట దాసి తన రెండు చేతులతో గుండెలు బాదుకొనుచు, బిగ్గరగ ఆర్తనాదము చేయుచు ఏడువ సాగెను. ఆమె ఏడుపు విని మహారాణి యగు కృతద్యుతి పరుగు పరుగున తన పుత్రుడు శయనించిన చోటికి వచ్చెను. తన పసికూన అకస్మాత్తుగా మృతుడై యున్నట్లు గమనించెను.
14.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
పపాత భూమౌ పరివృద్ధయా శుచా ముమోహ విభ్రష్టశిరోరుహామ్బరా॥5322॥
అంతట, ఆమె అంతులేని దుఃఖముతో మూర్ఛిల్లి నేలపై పడిపోయెను. ఆమె శిరోజములు చెల్లాచెదరై పోయెను. కట్టుకొనియున్న వస్త్రము అస్తవ్యస్తమాయెను.
14.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
థతతో నృపాన్తఃపురవర్తినో జనా నరాశ్చ నార్యశ్చ నిశమ్య రోదనమ్|
ఆగత్య తుల్యవ్యసనాః సుదుఃఖితాస్తాశ్చ వ్యలీకం రురుదుః కృతాగసః॥5323॥
మహారాణి యొక్క రోదన ధ్వనిని వినినంతనే రాజాంతఃపురములో స్త్రీ పురుషులు అందరును అచటికి పరుగెత్తుకొనివచ్చి, వారును ఆమెవలె మిగుల దుఃఖింపసాగిరి. బాలుని మృతికి కారణమైనవారు కూడా వచ్చి, కపట దుఃఖముతో ఏడ్చిరి.
14.50 (ఏబదియవ శ్లోకము)
శ్రుత్వా మృతం పుత్రమలక్షితాన్తకం వినష్టదృష్టిః ప్రపతన్ స్ఖలన్ పథి|
స్నేహానుబన్ధైధితయా శుచా భృశం విమూర్చ్ఛితోఽనుప్రకృతిర్ద్విజైర్వృతః॥5324॥
14.51 (ఏబది ఒకటవ శ్లోకము)
పపాత బాలస్య స పాదమూలే మృతస్య విస్రస్తశిరోరుహామ్బరః|
దీర్ఘం శ్వసన్ బాష్పకలోపరోధతో నిరుద్ధకణ్ఠో న శశాక భాషితుమ్॥5325॥
చిత్రకేతుమహారాజునకు ఆయన పుత్రుని యొక్క హఠాన్మరణ వార్త తెలియవచ్చెను. పుత్రవాత్సల్య కారణముగా శోకాతిరేకముతో ఆయన కనులు బైర్లు గమ్మెను. పడుచు, లేచుచు ఆయన తన మంత్రులతోను, బ్రాహ్మణునితో గూడ మృత బాలుని కడకు వచ్చి, మూర్ఛితుడై ఆ బాలుని పాదములకడ పడిపోయెను. అతని కేశములు, వస్త్రములు చెల్లాచెదరయ్యెను. దీర్ఘనిశ్వాసముతో ఏడువసాగెను. నిరంతర దుఃఖాశ్రువులతో అతని కంఠము రుద్ధమాయెను. అతడు ఏమియు మాట్లాడలేక పోయెను.
14.52 (ఏబది రెండవ శ్లోకము)
పతిం నిరీక్ష్యోరుశుచార్పితం తదా మృతం చ బాలం సుతమేకసన్తతిమ్|
జనస్య రాజ్ఞీ ప్రకృతేశ్చ హృద్రుజం సతీ దధానా విలలాప చిత్రధా॥5326॥
అప్పుడు శోకాతిరేకముతో మూర్ఛితుడై నేలపై పడియున్న తన భర్తయగు చిత్రకేతువును, మృతుడై పడియున్న తన ఏకైక పుత్రుని జూచి, కృతద్యుతి మహారాణి పలువిధముల విలపింపసాగెను. ఆమె దుఃఖమును జూచి, మంత్రులు మొదలగు వారందరును శోకగ్రస్తులైరి.
14.53 (ఏబది మూడవ శ్లోకము)
స్తనద్వయం కుఙ్కుమగన్ధమణ్డితం నిషిఞ్చతీ సాఞ్జనబాష్పబిన్దుభిః|
వికీర్య కేశాన్ విగలత్స్రజః సుతం శుశోచ చిత్రం కురరీవ సుస్వరమ్॥5327॥
ఆమె నేత్రముల నుండి కాటుకతోనిండిన దుఃఖాశ్రువులకు కుంకుమ గంధలేపనములతో నున్న వక్షస్థలమంతయును తడిసి ముద్దయ్యెను.కేశములు చెల్లాచెదరై యుండుటచే ఆమె కొప్పుననున్న మాలలోని పూవులన్నియును ఇటునటు పడిపోయెను. ఆమె పుత్రశోకముతో లకుముకి పిట్టవలె బిగ్గరగా ఏడువసాగెను.
14.54 (ఏబది నాలుగవ శ్లోకము)
అహో విధాతస్త్వమతీవ బాలిశో యస్త్వాత్మసృష్ట్యప్రతిరూపమీహసే|
పరే ను జీవత్యపరస్య యా మృతిర్విపర్యయశ్చేత్త్వమసి ధ్రువః పరః॥5328॥
ఆ రాజదంపతులు ఇట్లు పలుకసాగిరి - 'బ్రహ్మదేవుడా! వాస్తవముగా నీవు ఎంతయు మూర్ఖుడవు. నీ సృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించుచున్నావు. పెద్దలు బ్రతికియుండగా బాలుడు మరణించుట ఆశ్చర్యకరము సుమా! యథార్థముగా విపరీతమైన స్వభావము కలిగినవాడైనచో, నీవు జీవులకు నిజమైన శత్రుడవే.
14.55 (ఏబది ఐదవ శ్లోకము)
న హి క్రమశ్చేదిహ మృత్యుజన్మనోః శరీరిణామస్తు తదాత్మకర్మభిః|
యః స్నేహపాశో నిజసర్గవృద్ధయే స్వయం కృతస్తే తమిమం వివృశ్చసి ॥5329॥
ప్రపంచమున ప్రాణుల జనన మరణములు ఎట్టి నియమములు లేకుండా ప్రారబ్ధమును అనుసరించియే జరుగుచున్నచో, ఇంక నీ అవసరమేముండును? నీ సృష్టి వృద్ధియగుటచే ఇట్లు ఆత్మీయులలో పరస్పర ప్రేమ (మమకార) బంధములను కల్పించుచున్నావు. కాని, ఈ విధముగా పసిబాలురను మృత్యువుపాలు చేసి, ఆ బంధములను నీవే తెగగొట్టుచున్నావు'
14.56 (ఏబది ఆరవ శ్లోకము)
.
త్వం తాత నార్హసి చ మాం కృపణామనాథాం త్యక్తుం విచక్ష్వ పితరం తవ శోకతప్తమ్|
అఞ్జస్తరేమ భవతాప్రజదుస్తరం యద్- ధ్వాన్తం న యాహ్యకరుణేన యమేన దూరమ్॥5330॥
పిదప, ఆ రాణి తన మృతపుత్రుని జూచుచు ఇట్లు విలపింపసాగెను - "అయ్యో! కుమారా! నీవు లేనిచో నేను అనాథను, దీనురాలను అగుదును. నీవు నన్ను వీడి ఇట్లు వెళ్ళుట ఏమాత్రమూ తగదు. నాయనా! ఒక్కసారి కనులు తెరచి చూడుము. నీ తండ్రి నీ ఎడబాటునకు తట్టుకొనలేక మిగుల శోకసంతప్తుడై యున్నాడు. సంతానము లేనివారు ఘోరనరకము నుండి బయటపడుట మిక్కిలి కష్టము. నీవు జీవించినచో సులభముగా నరకయాతన నుండి బయటపడుదుము. యముడు మిగుల నిర్దయుడు. నీవు అతనితో గూడి మాకు దూరమై వెళ్ళవద్దు.
14.57 (ఏబది ఏడవ శ్లోకము)
ఉత్తిష్ఠ తాత త ఇమే శిశవో వయస్యాస్త్వామాహ్వయన్తి నృపనన్దన సంవిహర్తుమ్|
సుప్తశ్చిరం హ్యశనయా చ భవాన్ పరీతో భుఙ్క్ష్వ స్తనం పిబ శుచో హర నః స్వకానామ్॥5331॥
ప్రియమైన రాకుమారా! లెమ్ము. నీ తోడి బాలురు నీతో ఆడుకొనుటకు నిన్ను పిలుచుచున్నారు. నీవు నిద్రించి, చాల తడవైనది. ఆకలిగొని యున్నావు కాబోలు. నీవు ఏదైన భుజింపుము. నా స్తన్యమును త్రాగుము. ఆత్మీయులైన మా దుఃఖమును తొలగింపుము.
14.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)
నాహం తనూజ దదృశే హతమఙ్గలా తే ముగ్ధస్మితంముదితవీక్షణమాననాబ్జమ్|
కిం వా గతోఽస్యపునరన్వయమన్యలోకం నీతోఽఘృణేన న శృణోమి కలా గిరస్తే॥5332॥
నా ముద్దులకుమారా! నేను ఎంతో దురదృష్టవంతురాలను. నేను నీ ముఖారవిందమును, అమాయికమైన నీ చిఱునవ్వును, ఆనందముతో నిండిన నీ చూపులను ఇక చూచుకొనెడి అదృష్టమునకు నేను నోచుకొనను. మధురమైన నీ చిలుకపలుకులు ఇక నాకు వినపడవు. కఠినాత్ముడైన యముడు నిన్ను తన లోకమునకు తీసికొనిపోయెను. అచటి నుండి ఎవ్వరును తిరిగి రారుగదా" (ఈ విధముగా మహారాణి కృతద్యుతి రోదించెను)
శ్రీశుక ఉవాచ
14.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)
విలపన్త్యా మృతం పుత్రమితి చిత్రవిలాపనైః|
చిత్రకేతుర్భృశం తప్తో ముక్తకణ్ఠో రురోద హ॥5333॥
14.60 (అరువదియవ శ్లోకము)
తయోర్విలపతోః సర్వే దమ్పత్యోస్తదనువ్రతాః|
రురుదుః స్మ నరా నార్యః సర్వమాసీదచేతనమ్॥5334॥
శ్రీ శుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! మహారాణియైన కృతద్యుతి తన మృతకుమారునికై ఇట్లు పలు విధములుగా విలపించుచుండుటను జూచి, చిత్రకేతువు తానుగూడ వెక్కి వెక్కి ఏడువసాగెను. రాజ దంపతులు ఈ విధముగా విలపించుచుండగా వారి అనుచరులైన స్త్రీ పురుషులందరును దుఃఖముతో క్రుంగిపోసాగిరి. ఇట్లు నగరవాసులు అందరును శోకమున మునిగిపోయి నిశ్చేష్టులైరి.
14.61 (అరువది ఒకటవ శ్లోకము)
ఏవం కశ్మలమాపన్నం నష్టసంజ్ఞమనాయకమ్|
జ్ఞాత్వాఙ్గిరా నామ మునిరాజగామ సనారదః॥5335॥
రాజా, చిత్రకేతు మహారాజు పుత్రశోకముచే అచేతనుడై యుండుటను మహర్షియగు అంగిరసుడు, దేవర్షియగు నారదుడు చూచిరి. వారిని ఓదార్చెడి వారుగూడ లేకుండుటను గమనించిరి. అప్ఫుడు వారు ఉభయులును అచటికి విచ్చేసిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదునాలుగవ అధ్యాయము (14)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment