16.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము
పుంసవన వ్రత విధానము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
19. 1 (ప్రథమ శ్లోకము)
వ్రతం పుంసవనం బ్రహ్మన్ భవతా యదుదీరితమ్|
తస్య వేదితుమిచ్ఛామి యేన విష్ణుః ప్రసీదతి॥5548॥
పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను - మహాత్మా! నీవు పుంసవన వ్రతమును గూర్చి తెల్పితివి. దానివలన శ్రీహరి ప్రసన్నుడగునని నుడివితివి. ఆ వ్రత విధానమును తెలియగోరుచున్నాను.
శ్రీశుక ఉవాచ
19.2 (రెండవ శ్లోకము)
శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయా|
ఆరభేత వ్రతమిదం సార్వకామికమాదితః॥5549॥
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఈ పుంసవన వ్రతము సమస్త అభీష్టములను ప్రసాదించును. స్త్రీ తన భర్తయొక్క అనుమతిని గైకొని, మార్గశిరమాసమున శుక్లపక్ష పాడ్యమినాడు దీనిని ప్రారభింపవలెను.
19.3 (మూడవ శ్లోకము)
నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాననుమన్త్ర్య చ|
స్నాత్వా శుక్లదతీ శుక్లే వసీతాలఙ్కృతామ్బరే|
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్భగవన్తం శ్రియా సహ॥5550॥
మొదట మరుద్గణముల జన్మవృత్తాంతమును విని, వ్రతమును ఆచరించుటకై వేదవేత్తలైన బ్రాహ్మణుల అనుమతిన గైకొనవలెను. ప్రతిదినము ఉదయమున దంతధావనమొనర్చుకొని, స్నానమాచరించవలెను. రెండు ధౌత వస్త్రములను, ఆభరణములను ధరింపవలెను. ప్రాతఃకాలమున ఎట్టి ఆహారమును గైకొనకముందే లక్ష్మీనారాయణులను ఆరాధించి, ఇట్లు ప్రార్థింపవలెను-
19.4 (నాలుగవ శ్లోకము)
అలం తే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తు తే|
మహావిభూతిపతయే నమః సకలసిద్ధయే॥5551॥
"ప్రభూ! నీవు పూర్ణకాముడవు. నీవు అపేక్షింపవలసిన వస్తువు ఏదియును లేదు. నీవు! సకల విభూతులకును, సిద్ధులకు నిధివి. అట్టి నీకు నమస్కారము.
19.5 (ఐదవ శ్లోకము)
యథా త్వం కృపయా భూత్యా తేజసా మహిమౌజసా|
జుష్ట ఈశ గుణైః సర్వైస్తతోఽసి భగవాన్ ప్రభుః॥5552॥
లక్ష్మీనారాయణులను ఆరాధించిన పిదప ఇంకను ఇట్లు ప్రార్థింపవలెను-
ప్రభూ! నీవు నాకు ఆరాధ్యుడవు. కృప, విభూతి (ఐశ్వర్యము), తేజస్సు, మహిమ, బలపరాక్రమములు మొదలగు సకల గుణములకు ఆశ్రయుడవు. నీవు షడ్గుణైశ్వర్యసంపన్నుడవు. అందువలన నీవు భగవంతుడుగ ఖ్యాతి వహించితివి. నీవు సర్వశక్తిమంతుడవు.
19.6 (ఆరవ శ్లోకము)
విష్ణుపత్ని మహామాయే మహాపురుషలక్షణే|
ప్రీయేథా మే మహాభాగే లోకమాతర్నమోస్తు తే॥5553॥
లక్ష్మీనారాయణులను ఆరాధించి ఇంకను ఇట్లు ప్రార్థింపవలెను-
అమ్మా! లక్ష్మీదేవీ! నీవు శ్రీ మహావిష్ణువునకు అర్ధాంగివి. మహామాయా స్వరూపిణివి. పురుషోత్తముని సకల సద్గుణములను పుణికి పుచ్చుకొన్నదానవు. భాగ్యములకు నిధివి. జగన్మాతవు. నాయెడ ప్రసన్ను రాలవు కమ్ము. నీకు నమస్కారము".
19.7 (ఏడవ శ్లోకము)
ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహావిభూతిభిర్బలిముప- హరాణీతి అనేనాహరహర్మన్త్రేణ విష్ణోరావాహనా- ర్ఘ్యపాద్యోపస్పర్శనస్నాన వాసౌపవీతవిభూషణ గన్ధపుష్పధూపదీపోపహారాద్యు చారాంశ్చ సమాహితోపాహరేత్॥5554॥
రాజా! శ్రీమహావిష్ణువును ఏకాగ్రచిత్తముతో ఇట్లు ప్రార్థింపవలెను- ఓం నమోభగవతే మహాపురుషాయ, మహానుభావాయ, మహావిభూతిపతయే సహ మహావిభూతిభిర్ బలిముపహరాణి. "ప్రభూ! నీవు ఓంకార స్వరూపుడవు. మహానుభావుడవు, సమస్త మహావిభూతులకు స్వామివి. పురుషోత్తముడవైన నీకు, నీ మహావిభూతులకు నమస్కరించుచున్నాను. పూజోపహారపదార్థములను నీకు సపర్పించుచున్నాను" అను ఈ మంత్రము ద్వారా ప్రతిదినము స్థిరచిత్తముతో శ్రీమహావిష్ణువునకు ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధపుష్పాక్షతలు, ధూప, దీప, నైవేద్యములు మున్నగువాటితో షోడశోపచారములను ఆచరింపవలెను.
19.8 (ఎనిమిదవ శ్లోకము)
హవిఃశేషం తు జుహుయాదనలే ద్వాదశాహుతీః|
ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి॥5555॥
శ్రీమహావిష్ణువును ఏకాగ్రచిత్తముతో ఇంకను ఇట్లు ప్రార్థింపవలెను:-
ఓం నమో భగవతే మహాపురుషాయ మహా విభూతిపతయే స్వాహా ఓం కార స్వరూపుడవైన స్వామీ! నీవు మహదైశ్వర్యములకు అధిపతివి. పురుషోత్తమా! నీకు నమస్కారము. ఈ హవిస్సును నీ కొరకై ఆహుతులుగా సమర్పించు చున్నాను. అను ఈ మంత్రమును పఠించుచు మిగిలిన హవిస్సులను అగ్నియందు పన్నెండు ఆహుతులుగ సమర్పింపవలెను.
19.9 (తొమ్మిదవ శ్లోకము)
శ్రియం విష్ణుం చ వరదావాశిషాం ప్రభవావుభౌ|
భక్త్యా సమ్పూజయేన్నిత్యం యదీచ్ఛేత్సర్వసమ్పదః॥5556॥
రాజా! సకలసంపదలను పొందగోరువారు ప్రతిదినము భక్తి భావముతో భగవంతుడైన లక్ష్మీనారాయణులను పూజింపవలెను. ఏలయన, సకల అభీష్టములను అనుగ్రహించు వారు శ్రేష్ఠములైన వరములను ప్రసాదించువారు ఆ ఆదిదంపతులే.
19.10 (పదియవ శ్లోకము)
ప్రణమేద్దణ్డవద్భూమౌ భక్తిప్రహ్వేణ చేతసా|
దశవారం జపేన్మన్త్రం తతః స్తోత్రముదీరయేత్॥5557॥
అనంతరము భక్తిభావముతో, వినమ్రతతో దండప్రణామములను ఆచరింపవలెను. పైన చెప్పిన మంత్రమును పదిమారులు జపింపవలెను. పిదప ఈ స్తోత్రమును పఠింపవలెను.
19.11 (పదకొండవ శ్లోకము)
యువాం తు విశ్వస్య విభూ జగతః కారణం పరమ్|
ఇయం హి ప్రకృతిః సూక్ష్మా మాయాశక్తిర్దురత్యయా॥5558॥
"లక్ష్ళీనారాయణులారా! మీరు సర్వవ్యాపకులు. సకల చరాచర జగత్తునకు పరమకారణులు. మీ ఉనికికి మరియొక కారణములేదు. మహాత్మా! లక్ష్మీదేవి నీ మాయాశక్తియే. అమెయే స్వయముగా అవ్యక్తప్రకృతి. ఆ మాయను అతిక్రమించుట మిగుల కష్టము, అసాధ్యము.
19.12 (పండ్రెండవ శ్లోకము)
తస్యా అధీశ్వరః సాక్షాత్త్వమేవ పురుషః పరః|
త్వం సర్వయజ్ఞ ఇజ్యేయం క్రియేయం ఫలభుగ్భవాన్॥5559॥
సర్వేశ్వరా! నీవే ఈ మహామాయకు అధీశ్వరుడవు. సాక్షాత్తుగా పరమ పురుషుడవు. సమస్తయజ్ఞములను, యజ్ఞ క్రియలును నీవే. యజ్ఞఫల భోక్తవు నీవే. వాటిని ఉత్పన్నము చేయువాడవును నీవే. స్వామి! నీకు నమస్కారము.
19.13 (పదమూడవ శ్లోకము)
గుణవ్యక్తిరియం దేవీ వ్యఞ్జకో గుణభుగ్భవాన్|
త్వం హి సర్వశరీర్యాత్మా శ్రీః శరీరేన్ద్రియాశయా|
నామరూపే భగవతీ ప్రత్యయస్త్వమపాశ్రయః॥5560॥
పరమాత్మా! లక్ష్మీదేవి సత్త్వరజస్తమో గుణములకు అభివ్యక్తి. నీవు వాటిని వ్యక్తపరచువాడవు. భోక్తవు నీవు. సకల ప్రాణులకు ఆత్మవు. వాటి శరీర ఇంద్రియ, అంతఃకరణములు లక్ష్మీదేవియే. ఆ జగన్మాత నామరూపములు కాగా, నీవు ఆ నామరూపములకు ప్రకాశకుడవు, ఆశ్రయుడవు.
19.14 (పదునాలుగవ శ్లోకము)
యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ|
తథా మ ఉత్తమశ్లోక సన్తు సత్యా మహాశిషః॥5561॥
ప్రభూ! నీ కీర్తి పవిత్రమైనది. మీ ఇరువురును ముల్లోకములకు, వరములను ప్రసాదించునట్టి పరమేశ్వరులు, కావున, గొప్పనైన నా ఆశలు, అభిలాషలు మీ అనుగ్రహముచే యథార్థములుగ నేరవేరునుగాక.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
17.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము
పుంసవన వ్రత విధానము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
19.15 (పదునైదవ శ్లోకము)
ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియా సహ|
తన్నిఃసార్యోపహరణం దత్త్వాచమనమర్చయేత్॥5562॥
19.16 (పదునారవ శ్లోకము)
తతః స్తువీత స్తోత్రేణ భక్తిప్రహ్వేణ చేతసా|
యజ్ఞోచ్ఛిష్టమవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిమ్॥5563॥
రాజా! ఈ విధముగా వరప్రదాతలైన లక్ష్మీ నారాయణులను స్తుతింపవలెను. పిమ్మట అచటి నుండి నైవేద్యములను తొలగించి, ఆచమించి, పూజలను ఆచరింపవలెను. అనంతరము భక్తిపూర్ణమైన హృదయముతో భగవంతుని స్తుతింపవలెను. యజ్ఞశేషములను ఆఘ్రాణించి, మఱల ఆ శ్రీహరిని ఆరాధింపవలెను.
19.17 (పదిహేడవ శ్లోకము)
పతిం చ పరయా భక్త్యా మహాపురుషచేతసా|
ప్రియైస్తైస్తైరుపనమేత్ప్రేమశీలః స్వయం పతిః|
బిభృయాత్సర్వకర్మాణి పత్న్యా ఉచ్చావచాని చ॥5564॥
భగవదారాధన అనంతరము పతిని సాక్షాత్తు దైవముగా భావించి, పరమభక్తితో ఆయనకు ఇష్టమైన వస్తువులను సమర్పింపవలెను. భర్తయు ప్రేమ స్వభావముతో తన పత్నికి ప్రియమైన పదార్థములను సమకూర్చి, ఆమెకు అందింపవలెను. ఆమె నిర్వర్తించునట్టి అన్ని విధములగు పనులలో చేదోడువాదోడుగా ఉండవలెను.
19.18 (పదునెనిమిదవ శ్లోకము)
కృతమేకతరేణాపి దమ్పత్యోరుభయోరపి|
పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్సమాహితః॥5565॥
దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు చేసినప్పటికినీ, దాని ఫలము ఇరువురికి లభించును. వ్రతమును ఆచరించుటలో (రజోధర్మమువంటి వాటివలన) భార్య పనికిరాని పక్షమునందు భర్తయే ఏకాగ్రచిత్తముతో, కడు జాగ్రత్తగా వ్రతమును అనుష్ఠించవలెను.
19.19 (పందొమ్మిదవ శ్లోకము)
విష్ణోర్వ్రతమిదం బిభ్రన్న విహన్యాత్కథఞ్చన|
విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గన్ధబలిమణ్డనైః|
అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థితా॥5566॥
ఇది విష్ణుభగవానుని వ్రతము. దీనిని ఆచరించుటకు దీక్షవహించినచో, మధ్యలో దీనిని ఆపివేయరాదు. ఈ వ్రతము చేయబూనిన వారు ప్రతి దినము బ్రాహ్మణులను, ముత్తైదువలను పూలమాలలు, చందనము, నైవేద్యము (ఆహారము), ఆభరణములు మున్నగు వాటితో భక్తి పూర్వకముగా పూజీంపవలెను. అట్లే శ్రీహరిని గూడ ఆరాధింపవలెను.
19.20 (ఇరువదియవ శ్లోకము)
ఉద్వాస్య దేవం స్వే ధామ్ని తన్నివేదితమగ్రతః|
అద్యాదాత్మవిశుద్ధ్యర్థం సర్వకామర్ధయే తథా॥5567॥
అనంతరము శ్రీహరిని తన ధామమునకు సాగనంపుటకై ఉద్వాసన (ఉపచారమును) చేయవలెను). ఆత్మశుద్ధి కొరకై తమ మనోరథములు ఈడేరుటకై ఆ స్వామికి నివేదించిన ప్రసాదములను మున్ముందుగా స్వీకరింపవలెను.
19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఏతేన పూజావిధినా మాసాన్ ద్వాదశ హాయనమ్|
నీత్వాథోపరమేత్సాధ్వీ కార్తికే చరమేఽహని॥5568॥
పతివ్రతయగు స్త్రీ పన్నెండు నెలల పాటు (పూర్తిగా ఒక సంవత్సరము) విధ్యుక్తముగా ఈ వ్రతమును ఆచరింపవలెను. పిమ్మట కార్తీక అమావాస్యనాడు ఉద్యాపనము గావించుటకై ఉపవాసము చేయవలెను.
19.22 (ఇరువది రెండవ శ్లోకము)
శ్వోభూతేఽప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్
పయఃశృతేన జుహుయాచ్చరుణా సహ సర్పిషా|
పాకయజ్ఞవిధానేన ద్వాదశైవాహుతీః పతిః॥5569॥
మఱునాడు ఉదయమున ప్రాతఃకాలమునందే శ్రీమహావిష్ణువును ఎప్పటివలె పూజింపవలెను. ఆ సాధ్వియొక్క పతి పాకయజ్ఞ విధానముతో ఘృతముతో గూడిన పాయసాన్నముతో అగ్నియందు పన్నెండు ఆహుతులను సమర్పింపవలెను.
19.23 (ఇరువది మూడవ శ్లోకము)
ఆశిషః శిరసాదాయ ద్విజైః ప్రీతైః సమీరితాః|
ప్రణమ్య శిరసా భక్త్యా భుఞ్జీత తదనుజ్ఞయా॥5570॥
పిమ్మట ఆ భార్యాభర్తలు, బ్రాహ్మణులకు సాదరముగా సాష్టాంగముగా నమస్కరించవలెను. వారు ప్రసన్నులై ఆశీర్వదించిన పిమ్మట వారి అనుజ్ఞతో భుజింపవలెను. ముందుగ గురువు భుజించిన పిమ్మట మౌనముగా వారు బంధుమిత్రులతో గూడి భుజింపవలెను.
19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బన్ధుభిః|
దద్యాత్పత్న్యై చరోః శేషం సుప్రజస్త్వం సుసౌభగమ్॥5571॥
పిదప చరుశేషమును (హోమము చేయగా మిగిలిన పాయసాన్నమును) పత్నికి ఈయవలెను. ఈ ప్రసాద ప్రభావము తో స్త్రీకి సత్సంతానము, సౌభాగ్యము ప్రాప్తించును.
19.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోరభీప్సితార్థం లభతే పుమానిహ|
స్త్రీ త్వేతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహమ్॥5573॥
పరీక్షిన్మహారాజా! శ్రీహరియొక్క ఈ పుంనవన వ్రతమును విధ్యుక్తముగా అనుష్ఠించిన పురుషునకు అభీప్సితార్థములు సిద్ధించును. అట్లే ఈ వ్రతమును ఆచరించిన స్త్రీకి సౌభాగ్యము, సంపదలు, సంతానము, యశస్సు, గృహము ప్రాప్తించును. ఆమె భర్త ఆయురారోగ్యములతో వర్ధిల్లును.
19.26 (ఇరువది ఆరవ శ్లోకము)
కన్యా చ విన్దేత సమగ్రలక్షణం వరం త్వవీరా హతకిల్బిషా గతిమ్|
మృతప్రజా జీవసుతా ధనేశ్వరీ సుదుర్భగా సుభగా రూపమగ్ర్యమ్॥5573॥
19.27 (ఇరువది ఏడవ శ్లోకము)
విన్దేద్విరూపా విరుజా విముచ్యతే య ఆమయావీన్ద్రియకల్పదేహమ్|
ఏతత్పఠన్నభ్యుదయే చ కర్మ- ణ్యనన్తతృప్తిః పితృదేవతానామ్॥5574॥
19.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తుష్టాః ప్రయచ్ఛన్తి సమస్తకామాన్ హోమావసానే హుతభుక్ శ్రీర్హరిశ్చ|
రాజన్ మహన్మరుతాం జన్మ పుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే॥5575॥
కన్య ఈ వ్రతమును ఆచరించినచో, సకల శుభలక్షణములు గల పతిని పొందును. ఈ వ్రతము ద్వారా విధవ స్త్రీ పాపములు తొలగిపోయి మోక్షమును పొందును. సంతానమును కోల్పోయిన స్త్రీకి, దీర్ఘాయువైన పుత్రుడు కలుగును. అదృష్టహీనయైన స్త్రీకి సౌభాగ్యము, సంపదలు అబ్బును. ఆమె కురూపియైనచో సౌందర్యవతియగును. రోగగ్రస్తుడు ఈ వ్రతప్రభావమువలన ఆరోగ్యవంతుడై బలమును, ఇంద్రియ శక్తిని పొందును. యజ్ఞము, దానము మున్నగు అభ్యుదయ కర్మలను చేయు సమయమున దీనిని పఠించినచో, అతని పితృదేవతలకు అంతులేని తృప్తి కలుగును. హోమము ముగిసిన పిమ్మట పితృదేవతలు మరియు సకలయజ్ఞములకు భోక్తయైన శ్రీలక్ష్మీనారాయణులు గూడ సంతుష్టులై వ్రతకర్తల సకలమనోరథములను తీర్చెదరు. మహారాజా! మరుద్గణముల యొక్క పుణ్య ప్రదమైన జన్మ వృత్తాంతమును నీకు వినిపించితిని. అట్లే దితియొనర్చిన పుంసవనవ్రతమును వర్ణించితిని.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)
ఇది మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము (19)
🙏 ఇతి షష్ఠస్కన్ధః సమాప్తః🙏
🙏🙏ఓం తత్సత్ 🙏🙏
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment