Friday, 5 June 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - పదకొండవ అధ్యాయము


4.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదకొండవ అధ్యాయము

వృత్రాసురుని వీరాలాపములు - భగవంతుని స్తుతించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

11.1 (ప్రథమ శ్లోకము)

త ఏవం శంసతో ధర్మం వచః పత్యురచేతసః|

నైవాగృహ్ణన్ భయత్రస్తాః పలాయనపరా నృప॰5190॥

శ్రీ శుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! అసురసేనలు భయభ్రాంతులై పారిపోవుచుండిరి. వారికి తమ ప్రభువైన వృత్రాసురుని ధర్మవచనములు ఏ మాత్రమూ చెవికెక్కకుండెను.

11.2 (రెండవ శ్లోకము)

విశీర్యమాణాంపృతనామాసురీమసురర్షభః|

కాలానుకూలైస్త్రిదశైః కాల్యమానామనాథవత్॥5191॥

11.3 (మూడవ శ్లోకము)

దృష్ట్వాతప్యత సఙ్క్రుద్ధ ఇన్ద్రశత్రురమర్షితః|

తాన్ నివార్యౌజసా రాజన్ నిర్భర్త్స్యేదమువాచ హ॥5192॥

దేవతలకు కాలము కలిసి వచ్చినది. ఇందువలన వారు అసురసేనలను తరిమివేయుచుండిరి. సరియైన నాయకుడు లేనివారివలె చెల్లాచెదరై పోయిరి. అట్టి తమ సైన్యమును జూచి, వృత్రాసురుడు క్రోధముతో ఊగిపోవుచుండెను. ఎట్టకేలకు అతడు తన బలములతో దేవసైన్యమును నిలువరించెను. పిమ్మట వారిని ఎదురించుచు ఇట్లు పలికెను.

11.4 (నాలుగవ శ్లోకము)

కిం వ ఉచ్చరితైర్మాతుర్ధావద్భిః పృష్ఠతో హతైః|

న హి భీతవధః శ్లాఘ్యో న స్వర్గ్యః శూరమానినామ్॥5193॥

'పిరికివారైన సైనికులు తల్లి కడుపున చెడపుట్టినవారు. రణభూమిలో పారిపోవుచున్న వారిని వెనుకనుండి దెబ్బతీయుట గొప్పదనము కాదు. శూరులమనుకొను మీవంటి వారికి అది తగదు. అట్టి చర్య ప్రశంసా పాత్రముగాదు. అంతేగాదు,, దానివలన స్వర్గప్రాప్తియు కలుగదు'

11.5 (ఐదవ శ్లోకము)

యది వః ప్రధనే శ్రద్ధా సారం వా క్షుల్లకా హృది|

అగ్రే తిష్ఠత మాత్రం మే న చేద్గ్రామ్యసుఖే స్పృహా॥5194॥

అధములారా! మీలో యుద్ధము చేయుటకు శక్తి ఉన్నచో నాయెదుట నిలువుడు. మీకు జీవించి విషయసుఖములను అనుభవింపవలెనను లాలన లేనట్లున్నది. ఏ కొంచమైనను మీలో రణోత్సాహము ఉన్నచో, క్షణకాలము నా యెదుట నిలిచి నా యుద్ధ కౌశలమును రుచి, చూడుడు.

11.6 (ఆరవ శ్లోకము)

ఏవం సురగణాన్ క్రుద్ధో భీషయన్ వపుషా రిపూన్|

వ్యనదత్సుమహాప్రాణో యేన లోకా విచేతసః॥5195॥

మిగుల బలశాలియైన వృత్రాసురుడు కోపముతో శత్రువులైన దేవతలను భయ భ్రాంతులను గావించుచు బిగ్గరగా సింహనాద మొనర్చెను. ఆ గర్జనకు లోకములు అన్నియును అచేతనమలయ్యెను.

11.7 (ఏడవ శ్లోకము)

తేన దేవగణాః సర్వే వృత్రవిస్ఫోటనేన వై|

నిపేతుర్మూర్చ్ఛితా భూమౌ యథైవాశనినా హతాః॥5196॥

వృత్రాసురుని భయంకర గర్జనకు దేవగణములు తమపై పిడుగు పడుచున్నదా యనునట్లు భీతిల్లిరి. పిమ్మట మూర్ఛిల్లి నేలపై పడిపోయిరి.

11.8 (ఎనిమిదవ శ్లోకము)

మమర్ద పద్భ్యాం సురసైన్యమాతురం నిమీలితాక్షం రణరఙ్గదుర్మదః|

గాం కమ్పయన్నుద్యతశూల ఓజసా నాలం వనం యూథపతిర్యథోన్మదః॥5197॥

అప్పుడు మదించిన గజరాజు తామరవనములో ప్రవేశించినట్లు,  వృత్రాసురుడు త్రిశూలమును చేబూని దేవసైన్యములో చొచ్చుకొని పోయి, వారిని తన పాదములతో త్రొక్కివేయసాగెను. దేవతా సైన్యముల కనులు భయముతో మూసికొనిపోయెను.అతని పాదఘట్టనలకు భూమి కంపించెను.

11.9 (తొమ్మిదవ శ్లోకము)

విలోక్య తం వజ్రధరోఽత్యమర్షితః   స్వశత్రవేఽభిద్రవతే మహాగదామ్|

చిక్షేప తామాపతతీం సుదుఃసహాం జగ్రాహ వామేన కరేణ లీలయా॥5198॥

'ఆ పరిస్థితిని వజ్రాయుధమును ధరించియున్న ఇంద్రుడు సహింపజాలక బలమైన తన గదను  వృత్రునిపై విసరెను. తన మీదికి దూసికొనివచ్చుచున్న దుస్సహమైన ఆ గదను వృత్రాసురుడు అవలీలగా తన యెడమచేతితో పట్టుకొనెను'.

11.10 (పదియవ శ్లోకము)

స ఇన్ద్రశత్రుః కుపితో భృశం తయా మహేన్ద్రవాహం గదయోరువిక్రమః|

జఘాన కుమ్భస్థల ఉన్నదన్ మృధే తత్కర్మ సర్వే సమపూజయన్ నృప ॥5199॥

రాజా! మహాపరాక్రమశాలియైన వృత్రాసురుడు ఉగ్రుడై ఊగిపోవుచు అదేగదతో ఇంద్రుని వాహనమైస ఐరావతము యొక్క కుంభస్థలము పై బలముగా కొట్టెను. యుద్ధరంగమున వృత్రాసురుడు ప్రదర్శించిన ఘనకార్యమును అందరును ప్రశంసించిరి.

11.11 (పదకొండవ శ్లోకము)

ఐరావతో వృత్రగదాభిమృష్టో విఘూర్ణితోఽద్రిః కులిశాహతో యథా |

అపాసరద్భిన్నముఖః సహేన్ద్రో ముఞ్చన్నసృక్ సప్తధనుర్భృశార్తః॥5200॥

వృత్రాసురుని గదా ఘాతముతో ఐరావతము వజ్రాయుధము దెబ్బకు పర్వతమువలె కంపించెను. ఆ గదాప్రహారమునకు తల దెబ్బతినగా రక్తము స్రవింప సాగెను. అంతట అది ఇంద్రునితో సహా ఏడు ధనుస్సుల దూరము అనగా ఇరవై ఎనిమిది మూరలు వెనుకకు తగ్గెను.

11.12 (పండ్రెండవ శ్లోకము)

న సన్నవాహాయ విషణ్ణచేతసే ప్రాయుఙ్క్త భూయః స గదాం మహాత్మా|

ఇన్ద్రోఽమృతస్యన్దికరాభిమర్శ- వీతవ్యథక్షతవాహోఽవతస్థే॥5201॥

తన వాహనమైన ఐరావతము మూర్ఛిల్లుటను జూచి, దేవేంద్రుడు మిగుల విషాదగ్రస్తుడయ్యెను. యుద్ధ నియమములను తెలిసికొని వృత్రాసురుడు అతనిపై మరల గదను విసరకుండెను. పిమ్మట ఇంద్రుడు అమృతమును చిందించే తన హస్తముతో స్పృశించి, దాని గాయములను మాన్చెను. పిదప అతడు (ఇంద్రుడు) మరల యుద్ధరంగమున నిలిచెను.

11.13 (పదమూడవ శ్లోకము)

స తం నృపేన్ద్రాహవకామ్యయా రిపుం వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య|

స్మరంశ్చ తత్కర్మ నృశంసమంహః శోకేన మోహేన హసన్ జగాద॥5202॥

రాజా! తన సోదరుడైన విశ్వరూపుని వధించిన ఇంద్రుడు తనతో యుద్ధము చేయుటకై వజ్రాయుధమును చేబూని వచ్చుటను వృత్రాసురుడు గమనించెను. అప్పుడు ఇంద్రుడుొనర్చిన ఆ పాపకృత్యము స్మరణకు రాగా అతడు శోకమోహములలో మునిగి పోయెను. పిదప వెటకారముగ నవ్వుచు అతడు ఇట్లనెను-

వృత్ర ఉవాచ

11.14 (పదునాల్గవ శ్లోకము)

దిష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుర్యో బ్రహ్మహా గురుహా భ్రాతృహా  చ|

దిష్ట్యానృణోఽద్యాహమసత్తమ త్వయా మచ్ఛూలనిర్భిన్నదృషద్ధృదాచిరాత్ ॥5203॥

వృత్రాసురుడు ఇట్లనెను- ఓరీ! ఇంద్రా! నేడు నా అదృష్టము పండిన దినము. నీవంటి శత్రువు నా యెదుట పడెను. నీవు మిగుల దుర్మార్గుడవు. బ్రాహ్మణోత్తముడైన విశ్వరూపుడు నీకు గురువు, నాకు సోదరుడు. ఆయనను హతమార్చితివి. ఇప్పుడే రాయివంటి నీ కఠోర హృదయమును నా శూలముచే బ్రద్దలు గావించి, నా సోదరుని ఋణమును తీర్చుకొందును.

11.15 (పదునైదవ శ్లోకము)

యో నోఽగ్రజస్యాత్మవిదో ద్విజాతేర్గురోరపాపస్య చ దీక్షితస్య|

విశ్రభ్య ఖడ్గేన శిరాంస్యవృశ్చత్పశోరివాకరుణః స్వర్గకామః॥5204॥^

నా సోదరుడైన విశ్వరూపుడు ఆత్మజ్ఞాని, ఏ పాపమునూ ఎరుగనివాడు. అతడు బ్రాహ్మణోత్తముడు, పైగా నీకు గురువు. యజ్జ దీక్షితుడైయున్న అతనిని నీవు నమ్మించి, నిర్దయుడైన వాడు యజ్ఞపశువును వధించినట్లు అతని శిరస్సులను ఖండించితివి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

5.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదకొండవ అధ్యాయము

వృత్రాసురుని వీరాలాపములు - భగవంతుని స్తుతించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

11.16 (పదునారవ శ్లోకము)

శ్రీహ్రీదయాకీర్తిభిరుజ్ఝితం త్వాం స్వకర్మణా పురుషాదైశ్చ గర్హ్యమ్|

కృచ్ఛ్రేణ మచ్ఛూలవిభిన్నదేహ- మస్పృష్టవహ్నిం సమదన్తి గృధ్రాః॥5205॥

దయ, లజ్జ, లక్ష్మి, కీర్తి నిన్ను విడిచి పెట్టినవి. నీ వొనర్చిన నీచ కార్యములను నరమాంస భక్షకులైన  రాక్షసులు గూడ గర్హింతురు. నేడు నా శూలముచే నీ శరీరమును ముక్కలు ముక్కలు గావింతును. పాపాత్ముడైన నీకు దహన సంస్కారము కూడ కలుగదు. పైగా గ్రద్దలు నీ దేహముసు పొడిచి, పొడిచి తినివేయును.

11.17 (పదిహేడవ శ్లోకము)

అన్యేఽను యే త్వేహ నృశంసమజ్ఞా యే హ్యుదుద్యతాస్త్రాః ప్రహరన్తి మహ్యమ్|

తైర్భూతనాథాన్ సగణాన్ నిశాత- త్రిశూలనిర్భిన్నగలైర్యజామి॥5206॥

అజ్ఞానులైన ఈ దేవతలు నీచుడవు, క్రూరుడవైన నీకు అనుయాయులై నా పై శస్త్రములను ప్రయోగించుచున్నారు. నేను వాడియైన నా త్రిశూలముతో వారి కంఠములను నరికివేసెదను. ఆ విధముగా వారిని భైరవుడు మొదలగు భూతగణములకు బలి ఇచ్చెదను.

11.18 (పదునెనిమిదవ శ్లోకము)

అథో హరే మే కులిశేన వీర హర్తా ప్రమథ్యైవ శిరో యదీహ|

తత్రానృణో భూతబలిం విధాయ మనస్వినాం పాదరజః ప్రపత్స్యే॥5207॥

మహావీరా! ఇంద్రా! నీవు నా సేనలను ఛిన్నా భిన్నమొనర్చి, నీ వజ్రాయుధముతో నా శిరస్సును ఖండించుటయు సంభవము కావచ్చును. అప్ఫుడు నా శరీరము పశుపక్ష్యాదులకు భూత బలిగా సమర్పించి, కర్మబంధములనుండి విముక్తులయిన మహాపురుషుల పాదరజమును ఆశ్రయించి, వారు చేరు లోకములకు నేనును వెళ్ళెదను.

11.19 (పందొమ్మిదవ శ్లోకము)

సురేశ కస్మాన్న హినోషి వజ్రం పురః స్థితే వైరిణి మయ్యమోఘమ్|

మా సంశయిష్ఠా న గదేవ వజ్రః స్యాన్నిష్ఫలః కృపణార్థేవ యాచ్ఞా॥5208॥

దేవేంద్రా! నేను నీ శత్రువును, ఎదుటనే నిలిచియున్నాను. అమోఘమైన వజ్రాయుధమును ఏల ప్రయోగింపవు? నీ గద నిష్ఫలమైనది. అట్లే కృపణుని చేరి అర్థమును యాచించినట్లు నీ వజ్రాయుధము గూడ నిష్ఫలమగునని సందేహింపవలదు.

11.20 (ఇరువదియవ శ్లోకము)

నన్వేష వజ్రస్తవ శక్ర తేజసా హరేర్దధీచేస్తపసా చ తేజితః|

తేనైవ శత్రుం జహి విష్ణుయన్త్రితో యతో హరిర్విజయః శ్రీర్గుణాస్తతః॥5209॥

ఇంద్రా! నీ వజ్రాయుధము శ్రీహరి తేజస్సుతో, దధీచి మహర్షి తపఃప్రభావముతో శక్తివంతమైనది. నన్ను సంహరింపుమని శ్రీమహావిష్ణువు గూడ ఆజ్ఞాపించియున్నాడు. కనుక, నీ వజ్రాయుధముతో నన్ను సంహరింపుము. ఏలయన శ్రీహరియున్న పక్షముననే విజయము, లక్ష్మి, సకల సద్గుణములు నివసించుచుండును గదా!

11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అహం సమాధాయ మనో యథాఽఽహ సఙ్కర్షణస్తచ్చరణారవిన్దే|

త్వద్వజ్రరంహోలులితగ్రామ్యపాశో గతిం మునేర్యామ్యపవిద్ధలోకః॥5210॥

దేవరాజా! సంకర్షుణుని ఆజ్ఞానుసారము నేను నా మనస్సును ఆయస పాపపద్మములయందు నిలిపెదను. నీ వజ్రాయుధవేగము నన్ను మాత్రమే గాదు, నా విషయభోగముల బంధములను గూడ భేదించును. నేను నా శరీరమును త్యజించి, మునులు చేరెడి లోకములను పొందెదను.

11.22 (ఇరువది రెండవ శ్లోకము)

పుంసాం కిలైకాన్తధియాం స్వకానాం యాః సమ్పదో దివి భూమౌ రసాయామ్|

న రాతి యద్ద్వేష ఉద్వేగ ఆధిర్మదః కలిర్వ్యసనం సమ్ప్రయాసః॥5211॥

పరమాత్మయగు శ్రీహరి తన అనన్య భక్తులకు స్వర్గ సుఖములనుగాని, పృథ్వియందలి, రసాతలము నందలి సంపదలను గాని ఇయ్యడు,  ఏలయన, వాటి వలన శాశ్వతమైన పరమానంద ప్రాప్తికలుగదు. పైగా, వాటివలన ద్వేషము, ఉద్వేగము, అహంకారము, మనోవ్యథ, కలహములు, దుఃఖములు, శ్రమయు కలుగుచుండును.

11.23 (ఇరువది మూడవ శ్లోకము)

త్రైవర్గికాయాసవిఘాతమస్మ- త్పతిర్విధత్తే పురుషస్య శక్ర|

తతోఽనుమేయో భగవత్ప్రసాదో యో దుర్లభోఽకిఞ్చనగోచరోఽన్యైః॥5212॥

ఇంద్రా! మన ప్రభువైన శ్రీహరి తన భక్తులకు ధర్మార్థకామములకు సంబంధించిన ప్రయాసలను వమ్ము చేయును. వాస్తవముగా అది ఆయన కృపావిశేషమే. ఏలయన, ఆయన అనుగ్రహము అకించనులైన భక్తులకు మాత్రమే లభించును. ఇతరులకు అది మిగుల దుర్లభము.

11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

అహం హరే తవ పాదైకమూల- దాసానుదాసో భవితాస్మి భూయః|

మనః స్మరేతాసుపతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయః॥5213॥

(వృత్రాసురుడు మనస్సునందే భగవానుని ప్రత్యక్షానుభవమును పొంది ఇట్లు ప్రార్థించెను-) "శ్రీహరీ! నాకు రాబోవు జన్మయందు అనన్య భావముతో నీ పాదపద్మములనే ఆశ్రయించునట్టి భక్తులను సేవించు  భాగ్యమును ప్రసాదింపుము. జగన్నాథా! నా మనస్సు మంగళకరములైన నీ గుణములను స్మరించునట్లును, నా వాక్కు ఆ దివ్యగుణములను కీర్తించుచుండునట్లును, నా శరీరము నీ సేవలోనే నిమగ్నమగుచుండునట్లును అనుగ్రహింపుము".

11.25 (ఇరువది ఐదవ శ్లోకము)

న నాకపృష్ఠం న చ పారమేష్ఠ్యం న సార్వభౌమం న రసాధిపత్యమ్|

న యోగసిద్ధీరపునర్భవం వా సమఞ్జస త్వా విరహయ్య కాంక్షే॥5214॥

వృత్రాసురుడు ఇంకను శ్రీహరిని ఇట్లు ప్రార్థించెను:-

సకల సౌభాగ్యనిధీ! నీ సేవా భాగ్యమునకు దూరమై నేను స్వర్గ సుఖములనుగాని, బ్రహ్మలోకమునుగాని, భూమండలసామ్రాజ్యమునుగాని, రసాతలముయొక్క ఏకఛత్రాధి పత్యమునుగాని, యోగసిద్ధులనుగాని కోరను. అంతేగాదు, మోక్షమును సైతము కోరను".

11.26 (ఇరువది ఆరవ శ్లొకము)

అజాతపక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః|

ప్రియం ప్రియేవ వ్యుషితం విషణ్ణాః మనోఽరవిన్దాక్ష దిదృక్షతే త్వామ్॥5215॥

వృత్రాసురుడు ఇంకను శ్రీహరిని ఇట్లు ప్రార్థించెను:-

అరవిందాక్షా! రెక్కలు రాని పక్షులు తమ తల్లికొరకు నిరీక్షించుచుండును. ఆకలిగొన్న దూడలు తమ తల్లియొక్క స్తన్యమును గ్రోలుటకు ఆరాటపడుచుండును. దూరదేశమునకేగిన పతియొక్క ఎడబాటునకు గురియైన పత్ని తన ప్రియ భర్తయొక్క సమాగమమునకు ఉత్కంఠతో ఎదురుచూచుచుండును. అట్లే నా మనస్సు నీ దర్శన భాగ్యమునకై తల్లడిల్లుచున్నది.

11.27 (ఇరువది ఏడవ శ్లోకము)

మమోత్తమశ్లోకజనేషు సఖ్యం  సంసారచక్రే భ్రమతః స్వకర్మభిః| 

త్వన్మాయయాఽఽత్మాఽఽత్మజదారగేహేష్వాసక్తచిత్తస్య న నాథ భూయాత్॥5216॥

ప్రభూ! నేను ముక్తిని గూడ అభిలషించుటలేదు. నా కర్మలఫలముగా జననమరణ చక్రములో పదే పదే తిరుగవలసియున్నను నేను దానిని లెక్కచేయను. కాని, నాకు ఎట్టి జన్మలభించినను భగవద్భక్తులతో మైత్రి మాత్రము నన్ను విడువకుండుగాక! నీ మాయలోబడి దేహగేహములయందును, స్త్రీపుత్రాదులయందును ఆసక్తుడను కాకుండునట్లును, అట్లు ఆసక్తులైన వారితో ఎట్టి సంబంధమూ లేకుండునట్లును నన్ను అనుగ్రహింపుము. ఇదియే నా ప్రార్థన.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదకొండవ అధ్యాయము (11)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment