Saturday, 6 June 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - పదమూడవ అధ్యాయము


6.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదమూడవ అధ్యాయము

ఇంద్రునకు బ్రహ్మహత్యాదోషము అంటుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

13.1 (ప్రథమ శ్లోకము)

వృత్రే హతే త్రయో లోకా వినా శక్రేణ భూరిద

సపాలా హ్యభవన్ సద్యో విజ్వరా నిర్వృతేన్ద్రియాః॥5252॥

శ్రీ శుకుడు వచించెను- మహాదాతవైన పరీక్షీన్మహారాజా! వృత్రాసురుడు నిహతుడైనందులకు ఇంద్రుడు తప్ప ముల్లోకములును, లోకపాలురు, దిక్పాలురును వెంటనే  పరమానంద భరితులైరి. ఇంద్రుడు మాత్రము భయమునకు లోనై చింతింపసాగెను.

13.2 (రెండవ శ్లోకము)

దేవర్షిపితృభూతాని దైత్యా దేవానుగాః స్వయమ్

ప్రతిజగ్ముః స్వధిష్ణ్యాని బ్రహ్మేశేన్ద్రాదయస్తతః॥5253॥

యుద్ధము ముగియగనే దేవతలు, ఋషులు, పితృదేవతలు, భూతగణములు, దైత్యులు, దేవతలకు అనుయాయులైన గంధర్వాదులు ఎవరంతట వారు తమ తమ స్థానములకు చేరిరి. బ్రహ్మదేవుడు, పరమశివుడు ఇంద్రాదులును వెళ్ళిపోయిరి.

రాజోవాచ

13.3 (మూడవ శ్లోకము)

ఇన్ద్రస్యానిర్వృతేర్హేతుం శ్రోతుమిచ్ఛామి భో మునే|

యేనాసన్ సుఖినో దేవా హరేర్దుఃఖం కుతోఽభవత్॥5254॥

పరీక్షిన్మహారాజు పలికెను- మహామునీ! శుకయోగీ! వృత్రాసురుడు నిహతుడైనందులకు దేవతలు అందరును ఆనందించుచుండగా, ఇంద్రుడు మాత్రము దుఃఖితుడై, ఖిన్నుడగుటకు కారణమేమి? దయతో వివరింపుము.

శ్రీశుక ఉవాచ

13.4 (నాలుగవ శ్లోకము)

వృత్రవిక్రమసంవిగ్నాః సర్వే దేవాః సహర్షిభిః|

తద్వధాయార్థయన్నిన్ద్రం నైచ్ఛద్భీతో బృహద్వధాత్॥5255॥

శ్రీ శుకుడు వచించెను- మహారాజా! వృత్రాసురుని పరాక్రమమునకు దేవతలు, మహర్షులు అందరును మిగుల భీతిల్లి యుండిరి. కనుక, వారు అతనిని వధింపుమని ఇంద్రుని ప్రార్థించిరి. కాని, బ్రహ్మహత్యా భయముచే ఇంద్రుడు అతనిని వధించుటకు ఇష్టపడకుండెను.

ఇన్ద్ర ఉవాచ

13.5 ఐదవ శ్లోకము)

స్త్రీభూజలద్రుమైరేనో విశ్వరూపవధోద్భవమ్|

విభక్తమనుగృహ్ణద్భిర్వృత్రహత్యాం క్వ మార్జ్మ్యహమ్॥5256॥

ఇంద్రుడు వచించెను- దేవతలారా! ఋషులారా! విశ్వరూపుని వధించుటవలన కలిగిన బ్రహ్మహత్యా దోషము స్త్రీ, భూమి, జలములు, వృక్షములు దయతో పంచుకొనినవి. ఇప్పుడు వృత్రాసురుని వధించుటవలన వచ్చెడి హత్యా దోషము నుండి ఎట్లు విముక్తుడును అగుదును?

శ్రీశుక ఉవాచ

13.6 (ఆరవ శ్లోకము)

ఋషయస్తదుపాకర్ణ్య మహేన్ద్రమిదమబ్రువన్|

యాజయిష్యామ భద్రం తే హయమేధేన మాస్మ భైః॥5257॥

శ్రీ శుకుడు వచించెను- దేవేంద్రుని మాటలను వినిన పిదప ఋషులు ఇట్లనిరి - "దేవతలారా! మేము అశ్వమేధ యాగమును నిర్వహించి, నిన్ను సకల పాపములనుండి విముక్తుని గావించెదము. నీవు ఏ మాత్రమూ భయపడవలసిస పనిలేదు. నీకు శుభమగును".

13.7 (ఏడవ శ్లోకము)

హయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరమ్|

ఇష్ట్వా నారాయణం దేవం మోక్ష్యసేఽపి జగద్వధాత్॥5258॥

13.8 (ఎనిమిదవ శ్లోకము)

బ్రహ్మహా పితృహా గోఘ్నో మాతృహాఽఽచార్యహాఘవాన్|

శ్వాదః పుల్కసకో వాపి శుద్ధ్యేరన్ యస్య కీర్తనాత్॥5259॥

అశ్వమేధ యాగమును ఆచరించుట ద్వారా యజ్ఞపురుషుడు, పరమాత్ముడు, సర్వశక్తి మంతుడు ఐన శ్రీమన్నారాయణుని ఆరాధించినచో, సంపూర్ణ జగత్తును వధించిన దోషమునుండి విముక్తుడయ్యెదవు. ఇంక వృత్రాసురుని వధవిషయమును చెప్పనేల? భగవంతుని కీర్తించినంత మాత్రమున గోవును, బ్రాహ్మణుని, తల్లిదండ్రులను, ఆచార్యుని హత్యచేసిన మహాపాపియు, చండాలుడును, కసాయివాడును పరిశుద్ధులగుదురు.

13.9 (తొమ్మిదవ శ్లోకము)

తమశ్వమేధేన మహామఖేన శ్రద్ధాన్వితోఽస్మాభిరనుష్ఠితేన|

హత్వాపి సబ్రహ్మచరాచరం త్వం న లిప్యసే కిం ఖలనిగ్రహేణ॥5260॥

దేవేంద్రా! మేము అశ్వమేధ మహాయజ్ఞమును అనుష్ఠించెదము. దాని ద్వారా భక్తి శ్రద్ధలతో భగవంతుడైన శ్రీహరిని పూజించెదము. ఆ దేవదేవుని అనుగ్రహప్రభావమున బ్రహ్మదేవుని పర్యంతము సకల చరాచరజగత్తును వధించినను నీకు ఏ పాపమూ అంటదు. ఇంక, లోకకంటకుడైన వృత్రాసురుని వధ విషయమును గూర్చి చెప్పనేల?"

శ్రీశుక ఉవాచ

13.10 (పదియవ శ్లోకము)

ఏవం సఞ్చోదితో విప్రైర్మరుత్వానహనద్రిపుమ్|

బ్రహ్మహత్యా హతే తస్మిన్నాససాద వృషాకపిమ్॥5261॥

శ్రీశుకుడు నుడివెను- పరీక్షిన్మహారాజా! ఇట్లు ఋషులు ఇంద్రునకు ప్రేరణగూర్చిరి. వారి ప్రోత్సాహముతో అతడు వృత్రాసురుని వధించెను. వృత్రాసురుడు నిహతుడైన పిమ్మట బ్రహ్మహత్యా దోషము ఇంద్రుని చుట్టుకొనెను.

13.11 (పదకొండవ శ్లోకము)

తయేన్ద్రః స్మాసహత్తాపం నిర్వృతిర్నాముమావిశత్

హ్రీమన్తం వాచ్యతాం ప్రాప్తం సుఖయన్త్యపి నో గుణాః॥5262॥

ఆ కారణమున ఇంద్రుడు మిక్కిలి తాపమునకు గురియయ్యెను. ఒక్కక్షణము గూడ అతనికి మనశ్శాంతి లేకుండెను. సంకోచించు స్వభావముగల సజ్జనునికి ఏదైన నొక కళంకము వచ్చినచో, ధైర్యము మున్నగు గుణములుగూడ అతనికి సుఖముసు కూర్ప జాలవు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

7.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదమూడవ అధ్యాయము

ఇంద్రునకు బ్రహ్మహత్యాదోషము అంటుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

13.12 (పండ్రెండవ శ్లోకము)

తాం దదర్శానుధావన్తీం చాణ్డాలీమివ రూపిణీమ్|

జరయా వేపమానాఙ్గీం యక్ష్మగ్రస్తామసృక్పటామ్॥5263॥

బ్రహ్మహత్య సాక్షాత్తు చండాల స్త్రీవలె అతనిని వెంబడించి వచ్చుటను ఇంద్రుడు చూచెను. వార్ధక్యమువలన ఆమె శరీరము వణకుచుండెను. క్షయరోగము ఆమెసు పీడించుచుండెను. ఆమె వస్త్రములు రక్తముతో తడిసియుండెను.

13.13 (పదమూడవ శ్లోకము)

వికీర్య పలితాన్ కేశాంస్తిష్ఠ తిష్ఠేతి భాషిణీమ్|

మీనగన్ధ్యసుగన్ధేన కుర్వతీం మార్గదూషణమ్॥5264॥

నెరసిన ఆమె కేశములు విరబోసికొని యుండెను. నిలుపుము - నిలుపుము అని అరచుచు ఆమె వచ్చుచుండెను. ఆమె పీల్చి విడిచే శ్వాసనుండి చేపల దుర్గంధము బహిర్గతము అగుచుండెను. ఆ దుర్వాసన దారియందు అంతటను వ్యాపించి కంపుకొట్టు చుండెను.

13.14 (పదునాలుగవ శ్లోకము)

నభో గతో దిశః సర్వాః సహస్రాక్షో విశామ్పతే|

ప్రాగుదీచీం దిశం తూర్ణం ప్రవిష్టో నృప మానసమ్॥5265॥

రాజా! దేవేంద్రుడు ఆ బ్రహ్మహత్యా భయముతో సకల దిశలయందును, ఆకాశమునందును పరుగెత్తుచు తిరుగసాగెను. అతనికి ఎచ్చటను ఆశ్రయము లభింపకుండెను. అందువలన వెంటనే అతడు త్వరితగతిన ఈశాన్య దిక్కునగల మానససరోవరమున ప్రవేశించెను.

13.15 (పదునైదవ శ్లోకము)

స ఆవసత్పుష్కరనాలతన్తూ- నలబ్ధభోగో యదిహాగ్నిదూతః|

వర్షాణి సాహస్రమలక్షితోఽన్తః స చిన్తయన్ బ్రహ్మవధాద్విమోక్షమ్॥5266॥

దేవేంద్రుడు ఆ మానససరోవరము నంధలి తామరతూడులో దాగి, వేయి సంవత్సరములు గడపెను. బ్రహ్మహత్యా దోషమునుండి విముక్తి ఎట్లు కలుగును? అని ఆలోచింపసాగెను. అప్పుడు భుజించుటకు ఏ పదార్థము దొరకకుండెను. ఏలయన, అతడు అగ్నిదేవత ద్వారా ఆహారమును స్వీకరించును. కాని, అగ్నిదేవత జలములలో నున్న తామరతూడునందు ప్రవేశింప జాలదు గదా!

13.16 (పదునారవ శ్లోకము)

తావత్త్రిణాకం నహుషః శశాస విద్యాతపోయోగబలానుభావః|

స సమ్పదైశ్వర్యమదాన్ధబుద్ధి- ర్నీతస్తిరశ్చాం గతిమిన్ద్రపత్న్యా॥5267॥

దేవేంద్రుడు తామరతూడులో దాగికొనియున్న కాలమున నహుషుడు తన విద్య, తపస్సు, యోగ బలప్రభావమున స్వర్గమును   శాసించుచుండెను. కాని, నహుషుడు తన సంపద, అధికారములవలన మదాంధుడై ఇంద్రపత్నియైన శచీదేవితో చెడుగా ప్రవర్తింపగోరెను. అప్పుడు ఆమె ఋషుల ద్వారా అతనిని శాపమునకు గురిచేసెను. అంతట అతడు సర్పమై పోయెను.

13.17 (పదునేడవ శ్లోకము)

తతో గతో బ్రహ్మగిరోపహూత ఋతమ్భరధ్యాననివారితాఘః|

పాపస్తు దిగ్దేవతయా హతౌజాస్తం నాభ్యభూదవితం విష్ణుపత్న్యా॥5268॥

అనంతరము ఇంద్రుడు సత్యమును పోషించునట్టి శ్రీహరిని ధ్యానింపగా ఆ ప్రభువుయొక్క అనుగ్రహప్రభావమున అతని బ్రహ్మహత్యాపాపము తొలగిపోయెను. అప్పుడు బ్రహ్మదేవుని ఆహ్వానముచే అతడు మరల స్వర్గలోకమునకు చేరెను. కమల వనములో విహరించునట్టి లక్ష్మీదేవి ఇంద్రుని రక్షించుచుండెను. ఈశాన్యదిశకు అధిపతియైన పరమశివుడు అతని పాపమును ఇంతకుముందే నశింపజేసి యుండెను. కనుక, అతడు బ్రహ్మహత్యా దోషమునుండి విముక్తుడయ్యెను.

13.18 (పదునెనిమిదవ శ్లోకము)

తం చ బ్రహ్మర్షయోఽభ్యేత్య హయమేధేన భారత|

యథావద్దీక్షయాంచక్రుః పురుషారాధనేన హ॥5269॥

13.19 (పందొమ్మిదవ శ్లోకము)

అథేజ్యమానే పురుషే సర్వదేవమయాత్మని|

అశ్వమేధే మహేన్ద్రేణ వితతే బ్రహ్మవాదిభిః॥5270॥

13.20 (ఇరువదియవ శ్లోకము)

స వై త్వాష్ట్రవధో భూయానపి పాపచయో నృప|

నీతస్తేనైవ శూన్యాయ నీహార ఇవ భానునా॥5271॥

మహారాజా! ఇంద్రుడు స్వర్గమునకు చేరిన పిదప బ్రహ్మర్షులు అచటికి వచ్చి, యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆరాధించుటకై ఇంద్రునకు యజ్ఞదీక్షను ఇచ్చి, అతనిచే అశ్వమేధ యాగమును చేయించిరి. యాగము చేయింపగా అతడు సర్వదేవ స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించెను. తత్ప్రభావమున వృత్రాసురుని వధించుటవలన కలిగిన పాపము అంతయును, సూర్యోదయముచే పొగమంచువలె నశించెను.

13.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స వాజిమేధేన యథోదితేన వితాయమానేన మరీచిమిశ్రైః|

ఇష్ట్వాధియజ్ఞం పురుషం పురాణమిన్ద్రో మహానాస విధూతపాపః॥5272॥

మరీచి మొదలగు మహామునులు ఇంద్రునిచే అశ్వమేధ యాగమును విధ్యుక్తముగా చేయించిరి. అతడు సనాతనుడు, యజ్ఞపురుషుడు ఐన శ్రీమన్నారాయణుని ఆరాధించి, సకల పాపముల నుండి విముక్తుడయ్యెను. తిరిగి ఎప్పటివలె పూజ్యుడయ్యెను.

13.22 (ఇరువది రెండవ శ్లోకము)

ఇదం మహాఖ్యానమశేషపాప్మనాం ప్రక్షాలనం తీర్థపదానుకీర్తనమ్|

భక్త్యుచ్ఛ్రయం భక్తజనానువర్ణనం మహేన్ద్రమోక్షం విజయం మరుత్వతః॥5273॥

రాజా! సర్వోత్తమము ఐన ఈ ఆఖ్యానము నందు ఇంద్రుని విజయము, ఇంద్రుని, వృత్రాసురుని పాపవిముక్తి, భక్తుడైన వృత్రాసురుని కథ వర్ణింపబడినది. ఇందు తీర్థములను గూడ పవిత్రమొనర్చు భగవదనుగ్రహము మొదలగు గుణములను సంకీర్తనము గలదు. ఇది పాపములను ప్రక్షాళనము గావించి, భగవద్భక్తిని ఇనుమడింపజేయును.

13.23 (ఇరువది మూడవ శ్లోకము)

పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వన్త్యథో పర్వణి పర్వణీన్ద్రియమ్|

ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుఞ్జయం స్వస్త్యయనం తథాఽఽయుషమ్॥7274॥

ఇంద్రసంబంధమైన ఈ వృత్తాంతమును బుధులు సర్వదా పఠింపవలెను, పఠింపజేయవలెను, వినవలెను. విశేషముగా దీనిని పర్వదినములయందు తప్పక సేవించవలెను. ఇది ధనమును, యశస్సును వృద్ధిచేయును. పాపములను ప్రక్షాళనమొనర్చును. శత్రువులపై విజయమును ప్రాప్తింపజేయును. ఆయుర్వృద్ధిని, సకల శుభములను ప్రసాదించును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదమూడవ అధ్యాయము (13)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment