Friday, 5 June 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

5.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

వృత్రాసురవధ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఋషిరువాచ

12.1 (ప్రథమ శ్లోకము)

ఏవం జిహాసుర్నృప దేహమాజౌ మృత్యుం వరం విజయాన్మన్యమానః

శూలం ప్రగృహ్యాభ్యపతత్సురేన్ద్రం యథా మహాపురుషం కైటభోఽప్సు॥5217॥

శ్రీ శుకుడు ఇట్లు పలికెను-పరీక్షిన్మహారాజా! వృత్రాసురుడు సమరభూమియందు తన దేహమును త్యజింపగోరెను. ఏలయన, ఇంద్రుని జయించి, స్వర్గసుఖములను పొందుటకంటె, మరణించి భగవంతుని చేరుటయే శ్రేష్ఠమని నిశ్చయించుకొనెను. అందవలన ప్రళయకాల జలములయందు కైటభాసురుడు శ్రీమహావిష్ణువును గాయపరచుటకై వెంటాడినట్లు వృత్రాసురుడు త్రిశూలమును చేబూని ఇంద్రునిమీదకు విజృభించెను.

12.2  (ద్వితీయ శ్లోకము)

తతో యుగాన్తాగ్నికఠోరజిహ్వ- మావిధ్య శూలం తరసాసురేన్ద్రః|

క్షిప్త్వా మహేన్ద్రాయ వినద్య వీరో హతోఽసి పాపేతి రుషా జగాద॥5218॥

వీరుడైన వృత్రాసురుడు ప్రళయాగ్ని జ్వాలలవలె తీవ్రమైన మొనలుగల త్రిశూలమును త్రిప్పుచు వేగముగా ఇంద్రునిపైకి విసరెను. మిక్కిలి క్రుద్ధుడైయున్న వృత్రాసురుడు ఓరీ! పాపీ! ఇంద్రుడా! ఇప్పుడు నీవు మృత్యువునుండి తప్పించుకొనజాలవు అని పలికెను.

12.3 (మూడవ శ్లోకము)

ఖ ఆపతత్తద్విచలద్గ్రహోల్కవ- న్నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాతవిక్లవః|

వజ్రేణ వజ్రీ శతపర్వణాచ్ఛినద్భుజం చ తస్యోరగరాజభోగమ్॥5219॥

వృత్రాసురుడు ప్రయోగించిన భయంకర త్రిశూలము గ్రహమువలె, ఉల్కలవలె తిరుగుచు ఆకాశమున వచ్చుచుండుటను ఇంద్రుడు చూచెను. 

12.4 (నాలుగవ శ్లోకము)

ఛిన్నైకబాహుః పరిఘేణ వృత్రః సంరబ్ధ ఆసాద్య గృహీతవజ్రమ్|

హనౌ తతాడేన్ద్రమథామరేభం వజ్రం చ హస్తాన్న్యపతన్మఘోనః॥5220॥

ఒక భుజము ఖండింపబడినంతనే మిగుల క్రుద్ధుడైన వృత్రాసురుడు ఒక పరిఘను గైకొని ఇంద్రునిపై విజృంభించెను. ఆ పరిఘతో అతని  వాహనమైన ఐరావతమును కొట్టగా, ఆ దెబ్బతో ఇంద్రుని వజ్రాయుధము చేయి జారి క్రిందబడెను.

12.5 (ఐదవ శ్లోకము)

వృత్రస్య కర్మాతిమహాద్భుతం తత్సురాసురాశ్చారణసిద్ధసఙ్ఘాః|

అపూజయంస్తత్పురుహూతసఙ్టటం నిరీక్ష్య హా హేతి విచుక్రుశుర్భృశమ్॥5221॥

వృత్రాసురుని యొక్క ఈ అత్యద్భుత కార్యమును గాంచి, దేవతలు, అసురులు, చారణులు, సిద్ధులు అందరు ప్రశంసించిరి. కాని, ఇంద్రుని సంకటపరిస్థితిని జూచి, వారు ఎల్లరును పదేపదే అయ్యో! అయ్యో! అనుచు గగ్గోలు పెట్టసాగిరి.

12.6 (ఆరవ శ్లోకము)

ఇన్ద్రో న వజ్రం జగృహే విలజ్జితశ్చ్యుతం స్వహస్తాదరిసన్నిధౌ పునః|

తమాహ వృత్రో హర ఆత్తవజ్రో జహి స్వశత్రుం న విషాదకాలః॥5222॥

ఆ వజ్రాయుధము ఇంద్రుని చేతినుండి జారి వృత్రాసురునకు సమీపమున పడియుండెను. దానిని మరల తీసికొనుటకు ఇంద్రుడు సిగ్గుపడెను. అప్పుడు వృత్రాసురుడు అతనితో ఇట్లనెను. "ఇంద్రా! ఇది చింతింపవలసిన సమయము కాదు. నీ వజ్రాయుధమును తీసికొని నీ శత్రువును జయింపుము"

12.7 ( ఏడవ శ్లోకము)

యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం జయః సదైకత్ర న వై పరాత్మనామ్|

వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనమ్॥5223॥

శ్రీహరి సర్వజ్ఞుడు, సనాతనుడు, ఆదిపురుషుడు. అతడే జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారకుడు. అతనికి సర్వదా విజయమే చేకూరును. ఆయనను తప్ప, యుద్ధోత్సాహులు, దేహాభిమానులు ఐన ఆతతాయులను సర్వదా విజయము వరింపదు. ఒక్కొప్పుడు వారు జయింతురు, లేక ఒక్కొక్కప్పుడు ఓటమి పాలగుచుందురు.

12.8 (ఎనిమిదవ శ్లోకము)

లోకాః సపాలా యస్యేమే శ్వసన్తి వివశా వశే|

ద్విజా ఇవ శిచా బద్ధాః స కాల ఇహ కారణమ్॥5224॥

ఈ లోకములు, లోకపాలురు వలలో చిక్కుకొనిన పక్షులవలె కాలమునకు అధీనులైయుందురు. దానికి వశులై జీవించిదెరు. అందరి జయాపజయములకు కాలమే కారణము.

12.9 (తొమ్మిదవ శ్లోకము)

ఓజః సహో బలం ప్రాణమమృతం మృత్యుమేవ చ|

తమజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడమ్॥5225॥

ఆ కాలమే మానవుల మనోబలము, ఇంద్రియబలము, శరీరబలము, ప్రాణము, జీవనము. అది మృత్యురూపమున నిలిచియుండును. దానిని తెలిసకొనలేక జడమైన శరీరమునే జయాపజయములకు కారణమని వారు భావింతురు.

12.10 (పదియవ శ్లోకము)

యథా దారుమయీ నారీ యథా యన్త్రమయో మృగః|

ఏవం భూతాని మఘవన్నీశతన్త్రాణి విద్ధి భోః॥5226॥

ఓయీ! ఇంద్రా! చెక్కతో చేసిన బొమ్మ యంత్రమయమైన మృగము ఆడించువాని చేతిలో ఉండును. అట్లే సమస్త ప్రాణులును భగవంతునకు అధీనులైయుందురని తెలిసికొనుము.

12.11 (పదకొండవ శ్లోకము)

పురుషః ప్రకృతిర్వ్యక్తమాత్మా భూతేన్ద్రియాశయాః|

శక్నువన్త్యస్య సర్గాదౌ న వినా యదనుగ్రహాత్॥5227॥

భగవంతుని కృపలేనిదే పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వము, అహంకారము, పంచభూతములు, ఇంద్రియములు, అంతకరణ చతుష్టయము మొదలగునవి ఏవియు ఈ విశ్వముయొక్క ఉత్పత్తి మొదలగువాటిని సృష్టించుటకు సమర్థములు కావు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉️🕉️🕉️🕉️

అంతఃకరణ చతుష్టయము

శరీరం లోపల అంతర్గతముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మాంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారములతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. 

అంతఃకరణము- ఆకాశతత్త్వం కాగా, మనస్సు-వాయుతత్త్వం, బుద్ధి-అగ్ని తత్త్వం, చిత్తము-జలతత్త్వం, అహం-పృథ్వితత్త్వం.

మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.

బుద్ధి:- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్థ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.

చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.

అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.

ఈ అంతఃకరణ చతుష్టయం విజృంభణ ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతఃశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

12.12 (పండ్రెండవ శ్లోకము) 

అవిద్వానేవమాత్మానం మన్యతేఽనీశమీశ్వరమ్|

భూతైః సృజతి భూతాని గ్రసతే తాని తైః స్వయమ్॥5228॥

భగవంతుడే సర్వమును నియంత్రించువాడు. ఈ విషయమును ఎరుంగక పరతంత్రుడై, జీవుడు తాను స్వతంత్రుడననియు, కర్తయు, భోక్తయు తానే అనియు భావించును. వాస్తవముగా భగవంతుడే ప్రాణులద్వారా ప్రాణులను సృష్టించును, సంహరించును.

12.13 (పదమూడవ శ్లోకము)

ఆయుః శ్రీః కీర్తిరైశ్వర్యమాశిషః పురుషస్య యాః|

భవన్త్యేవ హి తత్కాలే యథానిచ్ఛోర్విపర్యయాః॥5229॥

మనుష్యుడు అభిలషింపకున్నను కాలవైపరీత్యమున అతనికి మృత్యువుగాని, అపకీర్తిగాని లభించును. అట్లే కాలము కలసి వచ్చినచో, ఇచ్ఛలేకున్ననూ ఆయువు, సంపదలు, యశస్సు, ఐశ్వర్యము మొదలగు సుఖములు లభించును.

12.14 (పదునాలుగవ శ్లోకము)

తస్మాదకీర్తియశసోర్జయాపజయయోరపి|

సమః స్యాత్సుఖదుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా॥5230॥

అందువలన కీర్తి, అపకీర్తులు, జయాపజయములు, సుఖదుఃఖములు, జీవన్మ రణములు మొదలగు వాటి యందు దేనిని కోరిననూ, కోరక పోయినను, అన్ని పరిస్థితులలో సమ భావముతోనే ఉండవలెను. హర్షశోకములకు వశము కాకూడదు.

12.15 (పదునైదవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః|

తత్ర సాక్షిణమాత్మానం యో వేద న స బధ్యతే॥5231॥

సత్త్వరజస్తములు అనెడి త్రిగుణములు ప్రకృతికి సంబంధించినవి. ఆత్మకు వీటితో ఎట్టి సంబంధము లేదు. ఆత్మను కేవలము సాక్షిగా తెలిసికొనినవాడు వాటి గుణదోషములచే లిప్తుడుకాడు.

12.16 (పదునారవ శ్లోకము)

పశ్య మాం నిర్జితం శక్ర వృక్ణాయుధభుజం మృధే|

ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా॥5232॥

దేవేంద్రా! నన్ను చూడుము. నీవు నా భుజమును, శస్త్రమును ఖండించి, ఒక విధముగా నన్ను పరాజితుని గావించితివి. ఐననూ నీ ప్రాణములను హరించుటకు యథాశక్తి నేను ప్రయత్నించుచునే యున్నాను.

12.17 (పదిహేడవ శ్లోకము)

ప్రాణగ్లహోఽయం సమర ఇష్వక్షో వాహనాసనః

అత్ర న జ్ఞాయతేఽముష్య జయోఽముష్య పరాజయః॥5233॥

ఈ యుద్ధము ఒక ద్యూతక్రీడ (జూదము) వంటిది. ఇందు ప్రాణములే పణముగా ఒడ్డ బడును. బాణములే పాచికలు, వాహనమే జూదపు పలకలు. జయాపజయములు ఎవరికి దక్కునో తెలియదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

6.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

వృత్రాసురవధ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

12.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఇన్ద్రో వృత్రవచః శ్రుత్వా గతాలీకమపూజయత్॥

గృహీతవజ్రః ప్రహసంస్తమాహ గతవిస్మయః॥5234॥

శ్రీ శుకుడు నుడివెను- మహారాజా! వృత్రాసురుని యొక్క సత్యమైన, నిష్కపటమైన వచనములను విని ఇంద్రుడు అతనిని ఆదరించెను. 

ఇన్ద్ర ఉవాచ

12.19 (పందొమ్మిదవ శ్లోకము)

అహో దానవ సిద్ధోఽసి యస్య తే మతిరీదృశీ|

భక్తః సర్వాత్మనాఽఽత్మానం సుహృదం జగదీశ్వరమ్॥

ఇంద్రుడు పలికెను- "అహో! దానవరాజా! వాస్తవముగా నీవు సిద్ధపురుషుడవు. అందువలననే నీ ధైర్యమూ, నిశ్చయమూ, భగవద్భావము విలక్షణములుగా ఉన్నవి. నీవు సమస్తప్రాణులను సుహృదులుగా, ఆత్మస్వరూపులుగా భావించుచున్నావు. జగదీశ్వరుడైన శ్రీహరిపై అనన్యభక్తిని కలిగియున్నావు.

12.20 (ఇరువదియవ శ్లోకము)

భవానతార్షీన్మాయాం వై వైష్ణవీం జనమోహినీమ్|

యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః॥5236॥

ఇంద్రుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

"జనులను మోహింపజేయు భగవన్మాయను నీవు అతిక్రమించితివి. ఇది సత్యము. అందువలననే, నీవు అసురీభావమును వీడి మహాపురుషుడవు కాగలిగితివి".

12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఖల్విదం మహదాశ్చర్యం యద్రజఃప్రకృతేస్తవ|

వాసుదేవే భగవతి సత్త్వాత్మని దృఢా మతిః॥5237॥

ఇంద్రుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

"సహజముగా నీవు రజోగుణ స్వభావుడవు. కాని, నీ బుద్ధి శుద్ధసత్త్వస్వరూపుడైన వాసుదేవ భగవానునియందు దృఢముగా నిలచినది. ఇది మిగుల ఆశ్చర్యకరము.".

12.22 (ఇరువది రెండవ శ్లోకము)

యస్య భక్తిర్భగవతి హరౌ నిఃశ్రేయసేశ్వరే

విక్రీడతోఽమృతామ్భోధౌ కిం క్షుద్రైః ఖాతకోదకైః॥5238॥

ఇంద్రుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

"పరమాత్ముడైన శ్రీహరి పరమ శుభప్రదుడు. అతని పాద పద్మముల యందే అనన్య భక్తి గలవానికి ఈ జగత్తునందలి తుచ్ఛములైన భోగములతో పనియేమున్నది. అమృత సముద్రములో ఓలలాడుచు వానికి క్షుద్రమైన గుంటలలోని మురికి నీటితో ప్రయోజనము ఏమున్నది?"

శ్రీశుక ఉవాచ

12.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మజిజ్ఞాసయా నృప|

యుయుధాతే మహావీర్యావిన్ద్రవృత్రౌ యుధామ్పతీ॥5239॥

శ్రీ శుకుడు నుడివెను - పరీక్షిన్మహారాజా! దేవరాజైన ఇంద్రుడు, వృత్రాసురుడు ఎంతయు పరాక్రమశాలులు, మహాయోధులు. ధర్మతత్త్వమును తెలిసి కొనవలెనను కోరికతో వారు ఈ విధముగా పరస్పరము సంభాషించుకొనుచు యుద్ధము చేయసాగిరి.

12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఆవిధ్య పరిఘం వృత్రః కార్ష్ణాయసమరిన్దమః|

ఇన్ద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష॥5240॥

శ్రీ శుకుడు ఇట్లు చెప్ఫుచుండెను

రాజా! శత్రుసూదనుడైన వృత్రాసురుడు ఎడమ చేతితో ఘోరమైన ఇనుప పరిఘను తీసికొని గిరగిర త్రిప్ఫుచు ఇంద్రునిపై విసరెను.

12.25 (ఇరువది ఐదవ శ్లోకము)

స తు వృత్రస్య పరిఘం కరం చ కరభోపమమ్|

చిచ్ఛేద యుగపద్దేవో వజ్రేణ శతపర్వణా॥5241॥

శ్రీ శుకుడు ఇట్లు చెప్ఫుచుండెను

అంతట ఇంద్రుడు వృత్రాసురుడు ప్రయోగించిన పరిఘను, ఏనుగు తొండము వంటి అతని బాహువును  నూరంచులు గల తన వజ్రాయుధముతో ఒకేసారి నరికివేసెను.

12.26 (ఇరువది ఆరవ శ్లోకము)

దోర్భ్యాముత్కృత్తమూలాభ్యాం బభౌ రక్తస్రవోఽసురః|

ఛిన్నపక్షో యథా గోత్రః ఖాద్భ్రష్టో వజ్రిణా హతః॥5242॥

మొండెమునుండి ఛేదింపబడిన వృత్రాసురుని రెండు భుజముల నుండి రక్తము స్రవింపసాగెను. అప్పుడు అతడు ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు రెక్కలు తెగి, ఆకాశమునుండి పడిన పర్వతమువలె ఒప్పారెను.

12.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కృత్వాధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుమ్|

నభోగమ్భీరవక్త్రేణ లేలిహోల్బణజిహ్వయా॥5243॥

12.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

దంష్ట్రాభిః కాలకల్పాభిర్గ్రసన్నివ జగత్త్రయమ్|

అతిమాత్రమహాకాయ ఆక్షిపంస్తరసా గిరీన్॥5244॥

12.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

గిరిరాట్ పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్ మహీమ్|

జగ్రాస స సమాసాద్య వజ్రిణం సహవాహనమ్॥5245॥

శ్రీ శుకుడు ఇట్లు చెప్ఫుచుండెను

అంతట, మహాకాయుడైన వృత్రాసురుడు ఆకాశమువలె విశాలమైన తన నోటిని తెరచెను. అప్పుడు అతని క్రిందిదవుడ నేలను తాకుచుండగా మీది దౌడ ఆకాశమును అంటుకొని యుండెను. అతని నాలుక మహాసర్పము యొక్క నాలుకవలె భయంకరముగా ఉండెను. కోరలు మృత్యుదేవత కోరలవలె ఒప్పుచుండెను. అట్టి నాలుకతో, కోరలతో ముల్లోకములను మ్రింగివేయుచున్న వానివలె నుండెను. అతడు అప్పుడు నడచుచున్న పర్వతమువలె విలసిల్లుచు పాదములతో ముందుకు జరుగుచుండెను. అతని వేగమునకు ప్రక్కన ఉన్న పర్వతములు పడిపోవుచుండెను. పిమ్మట, అతడు ఇంద్రుని, అతని వాహనమైన ఐరావతమును సమీపించి, మిక్కిలి బలపరాక్రమములు గల కొండ చిలువ ఏనుగును వలె గ్రహింపసాగెను.

12.30 (ముప్పదియవ శ్లోకము)

మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపమ్|

వృత్రగ్రస్తం తమాలక్ష్య సప్రజాపతయః సురాః|

హా కష్టమితి నిర్విణ్ణాశ్చుక్రుశుః సమహర్షయః॥5246॥

వృత్రాసురుడు ఇంద్రుని గ్రహించు చుండుటను జూచి, ప్రజాపతులు, మహర్షులు, దేవతలు మిగుల మిక్కిలి ఖేదము నొందుచు అయ్యో! ఎంతటి కష్టము వచ్చిపడినది అనుచు గగ్గోలు పెట్టసాగిరి.

12.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

నిగీర్ణోఽప్యసురేన్ద్రేణ న మమారోదరం గతః

మహాపురుషసన్నద్ధో యోగమాయాబలేన చ॥5247॥

వృత్రాసురునిచే మ్రింగివేయబడుచున్నను ఇంద్రుడు మహాపురుష విద్య (నారాయణ కవచ) ప్రభావము చేతను, యోగమాయా శక్తి వలనను అతడు సురక్షితుడై యుండెను. అందువలన, అతడు వృత్రాసురుని ఉదరములో చేరియున్నను మరణింపలేదు.

12.32 (ముప్పది రెండవ శ్లోకము)

భిత్త్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బలభిద్విభుః|

ఉచ్చకర్త శిరః శత్రోర్గిరిశృఙ్గమివౌజసా॥5248॥

అంతట, బలాసురుని సంహరించిన దేవరాజగు ఇంద్రుడు తన వజ్రాయుధముతో వృత్రాసురుని ఉదరమును చీల్ఛుకొని బయటికి వచ్చెను. పిమ్మట, పర్వతశిఖరమువలె దృఢముగనున్న వృత్రుని శిరస్సును వెంటనే ఖండింపసాగెను.

12.33 (ముప్పది మూడవ శ్లోకము)

వజ్రస్తు తత్కన్ధరమాశువేగః కృన్తన్ సమన్తాత్పరివర్తమానః|

న్యపాతయత్తావదహర్గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే॥ 5249॥

క్రమముగా ఆ వజ్రాయుధము ఒక సంవత్సరకాలము గిరగిర తిరుగుచు తీవ్రమైన వేగముతో వృత్రాసురుని మెడను అన్ని వైపులను ఖండించుచు, దానిని నేలపై పడగొట్టెను.

12.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

తదా చ ఖే దున్దుభయో వినేదు- ర్గన్ధర్వసిద్ధాః సమహర్షిసఙ్ఘాః|

వార్త్రఘ్నలిఙ్గైస్తమభిష్టువానా మన్త్రైర్ముదా కుసుమైరభ్యవర్షన్॥5250॥

ఆ సమయమున ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. మహర్షులు,గంధర్వులు, సిద్ధులు వృత్రాసురుని తుదముట్టించిన ఇంద్రుని పరాక్రమమును వెల్లడించునట్టి మంత్రములతో ఆయనను ప్రశంసించిరి. ఆనందముతో పూలను వర్షించిరి.

12.35 (ముప్పది ఐదవ శ్లోకము)

వృత్రస్య దేహాన్నిష్క్రాన్తమాత్మజ్యోతిరరిన్దమ|

పశ్యతాం సర్వలోకానామలోకం సమపద్యత॥5251॥

శత్రుదమనా! వృత్రాసురుని శరీరమునుండి వెడలిన ఆత్మజ్యోతి ఇంద్రాదులు చూచుచుండగనే సర్వలోకాతీతుడైన శ్రీహరిలో లీనమయ్యెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వాదశోఽధ్యాయః (12)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పండ్రెండవ అధ్యాయము (12)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment