Sunday, 14 June 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము


14.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము

దితి, అదితుల సంతానము - మరుద్గణముల జన్మవృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

18.1 (ప్రథమ శ్లోకము)

పృశ్నిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్|

అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్॥ 5470॥

శ్రీశుకుడు వచించెను- సవితయొక్క భార్యయైన పృశ్నియొక్క గర్భమునందు సావిత్రి, వ్యాహృతి, త్రయి, అగ్నిహోత్రుడు, పశువు, సోముడు,  చాతుర్మాస్యుడు, పంచమహా యజ్ఞములు జన్మించెను.

18.2 (రెండవ శ్లోకము)

సిద్ధిర్భగస్య భార్యాఙ్గ మహిమానం విభుం ప్రభుమ్|

ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతామ్॥5471॥

భగుని పత్నియైన సిద్ధియందు మహిముడు, విభుడు, ప్రభుడు అను మువ్వురు పుత్రులు, ఆశిష అను కన్య జన్మించిరి. ఆ కన్య మిగుల సౌందర్యవతి, సదాచారిణి.

18.3 (మూడవ శ్లోకము)

ధాతుః కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా|

సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసమనుక్రమాత్॥5472॥

ధాతకు కుహువు, సినీవాలి, రాక, అనుమతి అని నలుగురు భార్యలు గలరు. వారికి క్రమముగా సాయంకాలము, దర్శ (అమావాస్య), ప్రాతఃకాలము, పూర్ణమాసుడు అను పుత్రులు కలిగిరి.

18.4 (నాలుగవ శ్లోకము)

అగ్నీన్ పురీష్యానాధత్త క్రియాయాం సమనన్తరః|

చర్షణీ వరుణస్యాసీద్యస్యాం జాతో భృగుః పునః॥5473॥

ధాతయొక్క తమ్ముడు విధాత. అతని పత్నియగు క్రియయందు పురీష్యులు అను పేర్లుగల ఐదుగురు అగ్నులు జన్మించిరి. వరుణుని భార్యపేరు చర్షణి. ఆమెయందు భృగువు మరల జన్మించెను. అంతకు ముందు ఆ భృగువు బ్రహ్మదేవుని కుమారుడై యుండెను.

18.5 (ఐదవ శ్లోకము)

వాల్మీకిశ్చ మహాయోగీ వల్మీకాదభవత్కిల|

అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోరృషీ॥5474॥

18.6 (ఆరవ శ్లోకము)

రేతః సిషిచతుః కుమ్భే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతమ్|

రేవత్యాం మిత్ర ఉత్సర్గమరిష్టం పిప్పలం వ్యధాత్॥5475॥

మహాయోగియైన వాల్మీకి గూడ వరుణుని సుతుడే. అతడు వల్మీకము నుండి జన్మించుటవలన వాల్మీకి అను పేర ప్రసిద్ధుడయ్యెను. అగస్త్యుడు, వసిష్ఠుడు అను వారు మిత్రావరుణుల కుమారులు. ఊర్వశిని చూచినంతనే మిత్రవరుణులకు వీర్యస్ఖలనమాయెను. వారు దానిని ఒక కుండయందు భద్రపరచిరి. ఆ రేతస్సులనుండి అగస్త్యముని, వసిష్ఠమహర్షి జన్మించిరి. మిత్రుని పత్ని పేరు రేవతి. ఆమెకు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అను పుత్రులు ఉదయించిరి.

18.7 (ఏడవ శ్లోకము)

పౌలోమ్యామిన్ద్ర ఆధత్త త్రీన్ పుత్రానితి నః శ్రుతమ్|

జయన్తమృషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః॥5476॥

నాయనా! పరిక్షిత్తూ! పులోముని కూతురగు శచీదేవి ఇంద్రుని పత్ని. ఆమెయందు జయంతుడు, ఋషుభుడు, మీధ్వానుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరని నేను వినియుంటిని.

18.8 (ఎనిమిదవ శ్లోకము)

ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః|

కీర్తౌ పత్న్యాం బృహచ్ఛ్లోకస్తస్యాసన్ సౌభగాదయః॥5477॥

శ్రీమహావిష్ణువే తన మాయాశక్తి వలన వామనునిగా (ఉపేంద్రుడుగా) అవతరించెను. అతడు బలిచక్రవర్తి నుండి మూడడుగుల నేలను యాచించి, ముల్లోకములను కొలిచెను. అందువలస అతడు ఉరుక్రముడు (త్రివిక్రముడు) అను పేర ప్రసిద్ధిగాంచెను. అతని భార్య కీర్తియందు బృహచ్ఛోకుడు అను పుత్రుడు ఉదయించెను. అతనికి సైభగుడు మొదలైనవారు కలిగిరి.

18.9 (తొమ్మిదవ శ్లోకము)

తత్కర్మగుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః|

పశ్చాద్వక్ష్యామహేఽదిత్యాం యథై వావతతార హ॥5478॥

మహాత్ముడైన వామనుడు అదితికశ్యపులకు జన్మించిన కారణమును,ఆ అవతారమున అతని గుణములను, లీలలను, పరాక్రమ విశేషములను మున్ముందు (ఎనిమిదవ స్కంధముస) వర్ణింతును.

18.10 (పదియవ శ్లోకము)

అథ కశ్యపదాయాదాన్ దైతేయాన్ కీర్తయామి తే|

యత్ర భాగవతః శ్రీమాన్ ప్రహ్లాదో బలిరేవ చ॥5479॥

రాజా! కశ్యపుని రెండవ భార్యయైన  దితియందు జన్మించిన సంతాన పరంపరను ఇప్పుడు వివరించెదను. వారిలో భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ప్రముఖులు.

10.11 (పదకొండవ శ్లోకము)

దితేర్ద్వావేవ దాయాదౌ దైత్యదానవవన్దితౌ|

హిరణ్యకశిపుర్నామ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ॥5480॥

దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను ఇద్దరు కుమారులు ఉదయించిరి. వారు దైత్య దానవులకు పూజ్యులు, వారి వృత్తాంతములను సంక్షిప్తముగా (మూడవ స్కంధమున) వివరించితిని.

18.12 (పండ్రెండవ శ్లోకము)

హిరణ్యకశిపోర్భార్యా కయాధుర్నామ దానవీ|

జమ్భస్య తనయా దత్తా సుషువే చతురః సుతాన్॥5481॥

18.13 (పదమూడవ శ్లోకము)

సంహ్లాదం ప్రాగనుహ్లాదం హ్లాదం ప్రహ్లాదమేవ చ|

తత్స్వసా సింహికా నామ రాహుం విప్రచితోఽగ్రహీత్॥5483॥

కయాధువు అను నామె హిరణ్యకశిపుని భార్య. ఆమె జంభుని కూతురు. ఆమెయందు సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అను నలుగురు తనయులు కలిగిరి. ఆమెకు సింహిక అను సోదరియు ఉండెను. సింహికయొక్క భర్త విప్రచిత్తుడు అను దానవుడు. ఆ దంపతులకు రాహువు అను నతడు జన్మించెను.

18.14 (పదునాలుగవ శ్లోకము)

శిరోఽహరద్యస్య హరిశ్చక్రేణ పిబతోఽమృతమ్|

సంహ్లాదస్య కృతిర్భార్యాసూత పఞ్చజనం తతః॥5483॥

ఈ రాహువు అమృతపానము చేయుచుండగా శ్రీహరి మోహినీ రూపధారియై తన చక్రముతో అతని శిరస్సును ఖండించెను. సంహ్లాదుని పత్నియైన కృతియందు పంచజనుడు అనువాడు జన్మించెను.

18.15 (పదునైదవ శ్లోకము)

హ్లాదస్య ధమనిర్భార్యాసూత వాతాపిమిల్వలమ్|

యోఽగస్త్యాయ త్వతిథయే పేచే వాతాపిమిల్వలః॥5484॥

హ్లాదుని భార్య ధమని, ఆమెకు వాతాపి, ఇల్వలుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. ఇల్వలుడు అగస్త్యమహర్షికి ఆతిథ్యము ఇచ్చుటకై వాతాపిని వండి వడ్డించెను.

18.16 (పదునారవ శ్లోకము)

అనుహ్లాదస్య సూర్మ్యాయాం బాష్కలో మహిషస్తథా|

విరోచనస్తు ప్రాహ్లాదిర్దేవ్యాస్తస్యాభవద్బలిః॥5485॥

అనుహ్లాదుని పత్నియగు సూర్మ్యయందు బాష్కలుడు, మహిషాసురుడు కలిగిరి. ప్రహ్లాదుని సుతుడు విరోచనుడు. అతని వలన ఆయన భార్యయగు దేవియందు బలిచక్రవర్తి ఉదయించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



14.6.2020    సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము


దితి, అదితుల సంతానము - మరుద్గణముల జన్మవృత్తాంతము


ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.17 (పదునేడవ శ్లోకము)


బాణజ్యేష్ఠం పుత్రశతమశనాయాం తతోఽభవత్|


తస్యానుభావం సుశ్లోక్యాః పశ్చాదేవాభిధాస్యతే॥5486॥


బలిచక్రవర్తి భార్యయైన అశనయందు వందమంది కుమారులు జన్మించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు. బలిచక్రవర్తి యొక్క ప్రశస్తి మిక్కిలి కీర్తింప దగినది. ఈయన వృత్తాంతము మున్ముందు (ఎనిమిదవ స్కంధమునందు) వివరింపబడును.


18.18 (పదునెనిమిదవ శ్లోకము)


బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గణముఖ్యతామ్।


యత్పార్శ్వే భగవానాస్తే హ్యద్యాపి పురపాలకః॥5487॥


బలికుమారుడైన బాణాసురుడు శంకరభగవానుని ఆరాధించి,  ఆయన గణములలో ప్రముఖుడు అయ్యెను. నేటికిని పరమశివుడు ఆయన పురమును రక్షించుచు, అతని యొద్దనే ఉండును.


18.19 (పందొమ్మిదవ శ్లోకము)


మరుతశ్చ దితేః పుత్రాశ్చత్వారింశన్నవాధికాః|


త ఆసన్నప్రజాః సర్వే నీతా ఇన్ద్రేణ సాత్మతామ్॥5488॥


దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడే గాక, ఇంకను నలుబదితొమ్మిదిమంది తనయులు ఉదయించిరి. వారిని మరుద్గణములు అందురు. వారికి సంతానము లేకుండెను. దేవేంద్రుడు వారిని తనతో సమానులైన దేవతలుగా ఆదరించెను.


రాజోవాచ


18.20 (ఇరువదియవ శ్లోకము)


కథం త ఆసురం భావమపోహ్యౌత్పత్తికం గురో|


ఇన్ద్రేణ ప్రాపితాః సాత్మ్యం కిం తత్సాధు కృతం హి తైః॥5489॥


పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను- యోగిపుంగవా! మరుత్తులు జన్మతః  అసుర లక్షణములు గలవారు. దేవేంద్రునిచే దేవతలుగ ఆదరింపబడుటకు వారు తమ అసురస్వభావమును వీడి చేసిన సత్కార్యములు ఎవ్వి?


18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


ఇమే శ్రద్దధతే బ్రహ్మన్నృషయో హి మయా సహ|


పరిజ్ఞానాయ భగవంస్తన్నో వ్యాఖ్యాతుమర్హసి॥5490॥


మహాత్మా! ఈ విషయము తెలిసికొనుటకై నాతో పాటు ఈ ఋషులును ఆసక్తితో ఉన్నారు. కనుక, ఆ విషయమును దయతో వివరింప ప్రార్థన.


సూత ఉవాచ


18.22 (ఇరువది రెండవ శ్లోకము)


తద్విష్ణురాతస్య స బాదరాయణిర్వచో  నిశమ్యాదృతమల్పమర్థవత్|


సభాజయన్ సన్నిభృతేన చేతసా జగాద సత్రాయణ సర్వదర్శనః॥5491॥


సూతుడు వచించెను- శౌనకాది మహర్షులారా! పరీక్షిన్మహారాజు వేసిన ప్రశ్న సంక్షిప్తమేయైనను మిక్కిలి అర్థవంతమైనది. దానిని ఆ మహారాజు ఎంతయు ఆదరముతో అడిగెను. సర్వజ్ఞుడైన శ్రీశుకుడు ఆ మహారాజునెడ ప్రసన్న చిత్తుడై అతనిని అభినందించుచు ఇట్లు పలికెను-


శ్రీశుక ఉవాచ


18.23 (ఇరువది మూడవ శ్లోకము)


హతపుత్రా దితిః శక్రపార్ష్ణిగ్రాహేణ విష్ణునా|


మన్యునా శోకదీప్తేన జ్వలన్తీ పర్యచిన్తయత్॥5492॥


శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! శ్రీమహావిష్ణువు ఇంద్రుని పక్షము వహించి, దితిపుత్రులైన హిరణ్యకశిపుని, హిరణ్యాక్షుని వధించెను. అంధులకు దితి శోకతప్తయై క్రోధావేశముతో చింతింపసాగెను-


18.24 (ఇరువది నాలుగవ శ్లోకము)


కదా ను భ్రాతృహన్తారమిన్ద్రియారామముల్బణమ్|


అక్లిన్నహృదయం పాపం ఘాతయిత్వా శయే సుఖమ్॥5493॥


దితి ఈ విధముగా చింతింపసాగెను


"వాస్తవముగా ఇంద్రుడు విషయలోలుడు, క్రూరుడు, నిర్దయుడు. ఆ పాపాత్ముడు తన సోదరులనే సంహరింపజేసెను. అతనిని చంపించినచో, నేను నిద్రింపగలను. ఆ శుభసమయము ఎప్పుడు వచ్చునో, గదా!


18.25 (ఇరువది ఐదవ శ్లోకము)


కృమివిడ్భస్మసంజ్ఞాఽఽసీద్యస్యేశాభిహితస్య చ|


భూతధ్రుక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః॥5494॥


జనులు రాజులయొక్క, దేవతలయొక్క శరీరములను ప్రభువు అను పేరుతో పిలుతురు. కాని, ఒకనాడు ఆ దేహము క్రిములుగా, మలముగా, బూడిదగా రూపొందును. ఇతర ప్రాణులను హింసించు వానికి నిజముగా ఎట్టి స్వార్థముగాని, పరమార్థముగాని లభింపదు. అతనికి నరకమే గతి.


18.26 (ఇరువది ఆరవ శ్లోకము)


ఆశాసానస్య తస్యేదం ధ్రువమున్నద్ధచేతసః|


మదశోషక ఇన్ద్రస్య భూయాద్యేన సుతో హి మే॥5495॥


ఇంద్రుడు తన శరీరము నిత్యముగా భావించి, గర్వితుడైయున్నాడు. వానికి తన వినాశమును గూర్చి తెలియదు. ఆ ఇంద్రుని గర్వమును అణచునట్టి పుత్రుని పొందుటకు తగిన ఉపాయమును గూర్చి ఆలోచించెదను?


18.27 (ఇరువది ఏడవ శ్లోకము)


ఇతి భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియమ్|


శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ॥5496॥


ఇట్లాలోచించిన, దితి సవినయముగా ఇంద్రియ నిగ్రహముతో తన పతియైన కశ్యపునకు శుశ్రూషలు ఒనర్చుచు ఆయనను ప్రసన్నునిగా చేసికొనసాగెను.


18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)


భక్త్యా పరమయా రాజన్ మనోజ్ఞైర్వల్గుభాషితైః|


మనో జగ్రాహ భావజ్ఞా సుస్మితాపాఙ్గవీక్షణైః॥5497॥


మహారాజా! దితి తన భర్త యొక్క మనస్సులోని భావములను అన్నింటిని తెలిసికొనుచుండెను. భక్తిశ్రద్ధలతో, మధురభాషణములతో, దరహాసపుక్రీగంటి చూపులతో ఆయన మనసును తనవైపు ఆకర్షించుకొనుచుండెను.


18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)


ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి విదగ్ధయా|


బాఢమిత్యాహ వివశో న తచ్చిత్రం హి యోషితి॥5498॥


కశ్యపుడు గొప్ప విద్వాంసుడు, వివేకియే.  ఐనను, మిక్కిలి నేర్పుగల దితియొక్క సేవలకు మోహితుడు అయ్యెను. అందులకు అతడు జడుడుగా మారి వివశుడై, ఆమె కోర్కెను తీర్చుటకు అంగీకరించెను. స్త్రీల విషయమున ఇది అంతగా ఆశ్చర్యకరము కాదు గదా!


18.30 (ముప్పదియవ శ్లోకము)


విలోక్యైకాన్తభూతాని భూతాన్యాదౌ ప్రజాపతిః|


స్త్రియం చక్రే స్వదేహార్ధం యయా పుంసాం మతిర్హృతా॥5489॥


సృష్టి ప్రారంభమున జీవులు అందరును నిరాసక్తులై ఉండుటను బ్రహ్మ గమనించెను. అప్పుడు అతడు తన శరీరములో సగభాగము నుండి స్త్రీని సృష్టించెను. అప్పటి నుండి, స్త్రీలు పురుషుల మనస్సును ఆకర్షించుచునే యున్నారు.


18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)


ఏవం శుశ్రూషితస్తాత భగవాన్ కశ్యపః స్త్రియా|


ప్రహస్య పరమప్రీతో దితిమాహాభినన్ద్య చ॥5500॥


రాజా! ఈ విధముగా దితి కశ్యపునకు సేవలు చేయుచునే యుండెను. అందులకు అతడు ఆమెయెడల మిగుల ప్రసన్నుడు అయ్యెను. అంతట అతడు దితిని అభినందించుచు చిరునవ్వుతో ఇట్లనెను-


కశ్యప ఉవాచ


18.32 (ముప్పది రెండవ శ్లోకము)


వరం వరయ వామోరు ప్రీతస్తేఽహమనిన్దితే|


స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః॥5501॥


కశ్యపుడు నుడివెను-సాధ్వీ! సుందరీ! నేను నీ యెడ ప్రసన్నుడను ఐతిని. వరమును కోరుకొనుము. భర్తసంతుష్టుడైనచో అతని భార్యకు ఈ లోకమునగానీ, పరలోకమునగానీ పొందరానిదేముండును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



15.6.2020    ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము


దితి, అదితుల సంతానము - మరుద్గణముల జన్మవృత్తాంతము


ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.33 (ముప్పది మూడవ శ్లోకము)


పతిరేవ హి నారీణాం దైవతం పరమం స్మృతమ్|


మానసః సర్వభూతానాం వాసుదేవః శ్రియః పతిః॥5502॥


కశ్యపుడు దితిని అభినందించుచూ చిరునవ్వుతో ఇట్లు చెప్పదొడగెను


పతియే స్త్రీలకు పరమ- ఆరాధ్యదైవము అని శాస్త్రములు తెలుపుచున్నవి. లక్ష్మీపతియైన వాసుదేవుడే సకల ప్రాణుల హృదయములలో విరాజిల్లుచున్నాడు.


18.34 (ముప్పది నాలుగవ శ్లోకము) 


స ఏవ దేవతాలిఙ్గైర్నామరూపవికల్పితైః|


ఇజ్యతే భగవాన్ పుమ్భిః స్త్రీభిశ్చ పతిరూపధృక్॥5503॥


శ్రీహరియే వేర్వేరు దేవతారూపములలో, నామములతో మానవులచే ఆరాధింపబడుచున్నాడు. ఏ రూపములో పూజించినను ఆది శ్రీహరిని ఉపాసించినట్లే యగును. అట్లే స్త్రీలు పతిరూపములో భగవంతుని పూజించుచున్నారు.


18.34 (ముప్పది నాలుగవ శ్లోకము)


తస్మాత్పతివ్రతా నార్యః శ్రేయస్కామాః సుమధ్యమే|


యజన్తేఽనన్యభావేన పతిమాత్మానమీశ్వరమ్॥5504॥


సుందరీ! అందువలన తమ శ్రేయస్సును గోరునట్టి సాధ్వీమణులైన స్త్రీలు అనన్యభక్తితో పతిని సేవించుచుందురు. ఏలయన, పతిదేవుడే వారికి ప్రియతముడు, ఆరాధ్యుడు.


18.36 (ముప్పది ఆరవ శ్లోకము)


సోఽహం త్వయార్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః|


తత్తే సమ్పాదయే కామమసతీనాం సుదుర్లభమ్॥5505॥


దేవీ! నీవు మిగుల భక్తి శ్రద్ధలతో నన్ను దైవముగా భావించి సేవించితివి. ఇప్పుడు నీ అభిలాషలను తీర్చెదను. సాధ్వీమణులు కానివారికి అది దుర్లభము.


దితిరువాచ


18.37 (ముప్పది ఏడవ శ్లోకము)


వరదో యది మే బ్రహ్మన్ పుత్రమిన్ద్రహణం వృణే|


అమృత్యుం మృతపుత్రాహం యేన మే ఘాతితౌ సుతౌ॥5506॥


దితి నుడివెను- మహాత్మా! శ్రీమహావిష్ణువు ద్వారా ఇంద్రుడు నా ఇద్దరు కుమారులను చంపించెను. ఇప్పుడు నేను పుత్రులను కోల్పోయితిని. నీవు నాకోరికను ఈడేర్చదలచినచో, ఇంద్రుని చంపగలిగినట్టి, మరణములేని పుత్రుని దయతో ప్రసాదింపుము.


18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)


నిశమ్య తద్వచో విప్రో విమనాః పర్యతప్యత|


అహో అధర్మః సుమహానద్య మే సముపస్థితః॥5507॥


ఆ విప్రోత్తముడు దితియొక్క మాటలను వినినంతనే మనస్సు వికలమై చింతింపసాగెను- "అయ్యో, నేడు నాకు ఒక గొప్ప సంకటపరిస్దితి వచ్చిపడినది' అని పరితపించసాగెను.


18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)


అహో అద్యేన్ద్రియారామో యోషిన్మయ్యేహ మాయయా|


గృహీతచేతాః కృపణః పతిష్యే నరకే ధ్రువమ్॥5508॥


'అయ్యో! ఇంద్రియ విషయములనే సుఖములుగా భావించితిని. మాయ స్త్రీ రూపములో నా చిత్తమును వశము చేసికొనినది. హతవిధీ! నేను దైన్యావస్థకు లోనైతిని. ఇక నాకు నరకము తప్పదు'.


18.40 (నలుబదియవ శ్లోకము)


కోఽతిక్రమోఽనువర్తన్త్యాః స్వభావమిహ యోషితః|


ధిఙ్ మాం బతాబుధం స్వార్థే యదహం త్వజితేన్ద్రియః॥5509॥


ఇందులో ఈమె తప్పు ఏమియును లేదు. ఈమె తన సహజమైన స్త్రీ స్వభావమునే అనుసరించినది. తప్పు అంతయును నాదే. అయ్యో! అవివేకినగు నేను ఇంద్రియములకు వశుడైన వాస్తవముగ స్వార్థపరమార్థములను విస్మరించితిని. ఛీ! ఛీ! మూర్ఖుడనైన నేను నిందార్హుడనైతిని.


18.41 (నలుబది ఒకటవ శ్లోకము)


శరత్పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతమ్|


హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితమ్॥5510॥


స్త్రీల ముఖము శరత్కాల పద్మమువలె ఆకర్షణీయముగా ఉండును. వాక్కులు అమృతతుల్యములై మధురిమలను చిలుకుచుండును. కాని, హృదయము మాత్రము కత్తివలె పదునుగా ఉండును. స్త్రీలచేష్టలను ఎవరెరుగుదురు?


18.42 (నలుబది రెండవ శ్లోకము)


న హి కశ్చిత్ప్రియః స్త్రీణామఞ్జసా స్వాశిషాత్మనామ్|


పతిం పుత్రం భ్రాతరం వా ఘ్నన్త్యర్థే ఘాతయన్తి చ॥5511॥


స్త్రీలకు వారి కోరికలే మిగుల ప్రియమైసవి. వాస్తవముగా వారు ఎవరిపైనను ప్రేమ చూపరు. స్వార్థమునకు వశులై వారు తన పతిని, పుత్రుని, కడకు సోదరుని గూడ చంపుటకుగాని, చంపించుటకుగాని వెనుకాడరు.


18.43 (నలుబది మూడవ శ్లోకము)


ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేత్|


వధం నార్హతి చేన్ద్రోపి తత్రేదముపకల్పతే॥5512॥


'నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము ఇచ్చెదను' అని వాగ్దానము చేసితిని. ఇది అసత్యము కారాదు. కానీ ఇంద్రుడు గూడ వధార్హుడు కాడు. ఇప్పుడు ఈ   విషయమును ఒక యుక్తిని పన్నెదను.


18.44 (నలుబది నాలుగవ శ్లోకము)


ఇతి సఞ్చిన్త్య భగవాన్ మారీచః కురునన్దన|


ఉవాచ కిఞ్చిత్కుపిత ఆత్మానం చ విగర్హయన్॥5513॥


రాజా! సర్వసమర్థుడు, మరీచిపుత్రుడైన కశ్యపుడు ఈ విధముగా ఆలోచించి, మనస్సులో తనను తానే నిందించుకొనుచు చిరుకోపమును ప్రదర్శించుచు దితితో ఇట్లనెసు-


కశ్యప ఉవాచ


18.45 (నలుబది ఐదవ శ్లోకము)


పుత్రస్తే భవితా భద్రే ఇన్ద్రహా దేవబాన్ధవః|


సంవత్సరం వ్రతమిదం యద్యఞ్జో ధారయిష్యసి॥5514॥


కశ్యపుడు నుడివెను- "దేవీ! నేనే ఒక వ్రతమును గూర్చి చెప్పెదను, దానిని ఒక సంవత్సరకాలము విధ్యుక్తముగా ఆచరించినచో, ఇంద్రుని సంహరింపగల పుత్రుడు నీకు కల్గును. కాని, అందు ఏమాత్రమయినను నియమభంగము గలిగినచో, అతడు దేవతలకు మిత్రుడగును.


దితిరువాచ


18.46 (నలుబది ఆరవ శ్లోకము)


ధారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణి యాని మే|


యాని చేహ నిషిద్ధాని న వ్రతం ఘ్నన్తి యాని తు॥5515॥


దితి పలికెను- మహాత్మా! నేను ఆ వ్రతమును తప్పక ఆచరించెదను. అందు పాటింపవలసిన నియమములెవ్వి?  నిషిద్ధకర్మలు ఏవి? ఆ వ్రతమునకు భంగకరములెవ్వి? అని అడిగెను. అందుకు కశ్యపుడు ఆమెతో ఇట్లు నుడివెను-


కశ్యప ఉవాచ


18.47 (నలుబది ఏడవ శ్లోకము)


న హింస్యాద్భూతజాతాని న శపేన్నానృతం వదేత్|


న ఛిన్ద్యాన్నఖరోమాణి న స్పృశేద్యదమఙ్గలమ్॥5516॥


కశ్యపుడు ఇట్లనెను- సుందరీ! మనోవాక్కాయముల ద్వారా ఏ ప్రాణిని హింసించరాదు. ఎవ్వరినీ శపింపరాదు. అసత్యమును పలుకరాదు. నఖములను, రోమములను ఖండింపరాదు. అమంగళకరములైన ఏ వస్తువునూ తాకరాదు.


18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)


నాప్సు స్నాయాన్న కుప్యేత న సమ్భాషేత దుర్జనైః|


న వసీతాధౌతవాసః స్రజం చ విధృతాం క్వచిత్॥5517॥


జలములలో ప్రవేశించి స్నానము చేయరాదు. ఎవరిమీదను కోపపడరాదు. దుర్జనులతో మాట్లాడరాదు. ఉతుకని వస్త్రములను ధరింపరాదు.ఇతరులు ఉపయోగించిన మాలలను ధరింపరాదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


15.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము

దితి, అదితుల సంతానము - మరుద్గణముల జన్మవృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

నోచ్ఛిష్టం చణ్డికాన్నం చ సామిషం వృషలాహృతమ్|

భుఞ్జీతోదక్యయా దృష్టం పిబేదఞ్జలినా త్వపః॥5518॥

ఇతరులు తినగా మిగిలిన అన్నముసు తినరాదు. భద్రకాళికి నివేదించిన పదార్థములను, లేక మాంసయుక్తమైన ఆహారమును స్వీకరింపరాదు. శూద్రుడు తీసికొనివచ్చిన పదార్థములను, రజస్వల దృష్టిపడిన అన్నమును భుజింపరాదు. దోసిలితో నీటిని త్రాగరాదు.

18.49 (ఏబదియవ శ్లోకము)

నోచ్ఛిష్టాస్పృష్టసలిలా సన్ధ్యాయాం ముక్తమూర్ధజా|

అనర్చితాసంయతవాక్ నాసంవీతా బహిశ్చరేత్॥5519॥

ముఖము కడుగు కొనకుండగాని, ఆచమనము చేయకుండగాని, సంధ్యాసమయమున గాని, జుట్ఠు విరబోసికొనిగాని, అలంకారము చేసి కొనకుండగాని, వాక్సంయమనము లేకుండగాని, శరీరమునిండా దుప్పటి (వస్త్రము) కప్పుకోకుండాగానీ బయట తిరుగరాదు.

18.51 (ఏబది ఒకటవ శ్లోకము)

నాధౌతపాదాప్రయతా నార్ద్రపాదా ఉదక్శిరాః|

శయీత నాపరాఙ్నాన్యైర్న నగ్నా న చ సన్ధ్యయోః॥5520॥

పాదప్రక్షాళన చేసికొనకుండగాని, అశుచిగా, తడికాళ్ళతో ఉండరాదు. ఉత్తరమువైపు, పడమరవైపు శిరస్సును ఉంచి పండుకొనరాదు. పరపురుషులతోగాని, దిగంబరముగాగాని, సంధ్యాసమయముల యందుగాని పరుండరాదు.

18.52 (ఏబది రెండవ శ్లోకము)

ధౌతవాసా శుచిర్నిత్యం సర్వమఙ్గలసంయుతా|

పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్గోవిప్రాఞ్శ్రియమచ్యుతమ్॥5521॥

ఈ విధముగా నిషిద్ధ కర్మలను త్యజించి, శుభ్రమైన వస్త్రములను ధరింపవలెను. అనుక్షణము శుచిగా ఉండవలెను. బొట్టు మొదలగు మంగళకరమగు వస్తువులను ధరింపవలెను. ప్రాతఃకాలమునందు భుజింపకముందు గోవులను, విప్రులను, లక్ష్మీనారాయణులను పూజింపవలెను.

18.54 (ఎబది నాలుగవ శ్లోకము)

స్త్రియో వీరవతీశ్చార్చేత్స్రగ్గన్ధబలిమణ్డనైః|

పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్కోష్ఠగతం చ తమ్॥5522॥

ముత్తైదువలను పూలమాలలతో, చందనాది సుగంధ వస్తువులతో, నైవేద్యముతో, భూషణములతో అర్చింపవలెను. పతిదేవుని పూజించి, ఆయన సేవలయందే నిమగ్నయై యుండవలెను. భర్త తేజస్సు తన గర్భమునందు ప్రవేశింప వలెనని ధ్యానింపవలెను.

18.54 (ఏబది నాలుగవ శ్లోకము)

సాంవత్సరం పుంసవనం వ్రతమేతదవిప్లుతమ్|

ధారయిష్యసి చేత్తుభ్యం శక్రహా భవితా సుతః॥5523॥

ఈ వ్రతమును, ఫుంసవనము అని యందురు. దీనిని ఒక సంవత్సరకాలము నిష్ఠతో ఆచరించినచో, ఇంద్రుని చంపగల కుమారుడు నీకు కలుగును.

18.54 (ఏబది ఐదవ శ్లోకము)

బాఢమిత్యభిప్రేత్యాథ దితీ రాజన్ మహామనాః|

కశ్యపాద్గర్భమాధత్త వ్రతం చాఞ్జో దధార సా॥5524॥

రాజా! దితి మిక్కిలి దృఢనిశ్చయముగలది. ఆమె సరే అని పలికి, భర్త ఆజ్ఞను అంగీకరించెను. కశ్యపుని తేజస్సును తన గర్భమున ధరించెను. ఆయన తెలిపిన వ్రత విధానములను నిష్ఠగా పాటించెను.

18.56 (ఏబది ఆరవ శ్లోకము)

మాతృష్వసురభిప్రాయమిన్ద్ర ఆజ్ఞాయ మానద|

శుశ్రూషణేనాశ్రమస్థాం దితిం పర్యచరత్కవిః॥5525॥

రాజా! నేర్పరియైన ఇంద్రుడు తన పినతల్లియైన దితియొక్క అభిప్రాయమును గ్రహించెను. అతడు తన వేషమును మార్ఛుకొని, దితి ఆశ్రమమునకు వచ్చి, ఆమెకు సేవలు చేయసాగెను.

19.57 (ఏబది ఏడవ శ్లోకము)

నిత్యం వనాత్సుమనసః ఫలమూలసమిత్కుశాన్|

పత్రాఙ్కురమృదోఽపశ్చ కాలే కాల ఉపాహరత్॥5526॥

అతడు దితికొరకు నిత్యము, ఆయా సమయములయందు వనమునుండి, ఫలములను, పుష్పములను, కందమూలములను, సమిధలను, దర్భలను, పత్రములను, అంకురములను, మట్టిని, జలములను తీసికొనివచ్చి ఆమెకు సమర్పించుచుండెను.

18.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

ఏవం తస్యా వ్రతస్థాయా వ్రతచ్ఛిద్రం హరిర్నృప|

ప్రేప్సుః పర్యచరజ్జిహ్మో మృగహేవ మృగాకృతిః॥5527॥

రాజా! జింకను వేటాడుటకై మృగాకృతిని ధరించిన వేటగాని వలె దేవేంద్రుడు కపట వేషమును ధరించి వ్రత పరాయణయైన దితియొక్క వ్రతపాలనమనందు లోపములను వెదకుటకై ఆమెకు సేవలు చేయసాగెను.

18.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

నాభ్యగచ్ఛద్వ్రతచ్ఛిద్రం తత్పరోఽథ మహీపతే|

చిన్తాం తీవ్రాం గతః శక్రః కేన మే స్యాచ్ఛివం త్విహ॥5528॥

దితియొక్క వ్రతమునందు లోపములను పట్టుకొనుటకై తత్పరుడైయున్న అతనికి ఎట్టిలోపము దొరకకుండెను. అప్పుడు అతడు ఏ ఉపాయము చేత నాకు మేలుకలుగును? అని తీవ్రముగా చింతింపసాగెను.

18.60 (అరువదియవ శ్లోకము)

ఏకదా సా తు సన్ధ్యాయాముచ్ఛిష్టా వ్రతకర్శితా|

అస్పృష్టవార్యధౌతాఙ్ఘ్రిః సుష్వాప విధిమోహితా॥5529॥

దితి వ్రతమును ఆచరించుటలో కృశించి యుండెను. విధాతగూడ ఆమెను మోహములో ముంచెత్తెను. ఇట్లుండగా దితి ఒకనాడు సంధ్యాసమయమున నోటిని కడుగుకొనకుండా, ఆచమింపకుండా, పాదప్రక్షాళన చేసికొనకుండా నిద్రించెను.

18.61 (అరువది ఒకటవ శ్లోకము)

లబ్ధ్వా తదన్తరం శక్రో నిద్రాపహృతచేతసః|

దితేః ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా॥5530॥

యోగశక్తులు గలిగిన ఇంద్రుడు ఆ అదను చూచుకొని, నిద్రలో మునిగియున్న దితియొక్క గర్భమునందు తన యోగమాయచేత ప్రవేశించెను.

18.62 (అరువది రెండవ శ్లోకము)

చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభమ్|

రుదన్తం సప్తధైకైకం మా రోదీరితి తాన్ పునః॥5531॥

అతడు బంగారు కాంతితో మెరయుచున్న ఆమె గర్భమునందు  తన వజ్రాయుధముతో ఏడు ముక్కలుగా జేసెను. ఆ గర్భస్థ శిశువు ఏడ్చుచుండగా (మారోదీః) ఏడవకుము అని పలుకుచు ఇంద్రుడు ఒక్కొక్క ముక్కను మరల ఏడు భాగములుగా చేసెను.

18.63 (అరువది మూడవ శ్లోకము)

తే తమూచుః పాట్యమానాస్తే సర్వే ప్రాఞ్జలయో నృప|

నో జిఘాంససి కిమిన్ద్ర భ్రాతరో మరుతస్తవ॥5532॥

మహారాజా! ఇంద్రుడు ఆ విధముగా ఆ గర్భమును ఖండఖండములుగా చేయుచున్నప్పుడు అవి చేతులు జోడించి, "దేవేంద్రా! మమ్ములను ఏల చంపుచున్నావు? మేము నీ సోదరులైన మరుత్తులము" అని పలికెను.

18.64 (అరువది నాలుగవ శ్లోకము)

మా భైష్ట భ్రాతరో మహ్యం యూయమిత్యాహ కౌశికః|

అనన్యభావాన్ పార్షదానాత్మనో మరుతాం గణాన్॥5533॥

అంతట ఇంద్రుడు మున్ముందు తనకు ప్రియమైన పార్షదులను మరుద్గణములతో ఇట్లనెను- "సరే మీరు నా సోదరులు. భయపడకుడు!"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

16.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము

దితి, అదితుల సంతానము - మరుద్గణముల జన్మవృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.65 (అరువది ఐదవ శ్లోకము)

న మమార దితేర్గర్భః శ్రీనివాసానుకమ్పయా|

బహుధా కులిశక్షుణ్ణో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్॥5534॥

రాజా! అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముచే మీకు ఎట్టి హానియు కలుగనట్లు ఆ శ్రీనివాసుని కృపచే దితిగర్భము వజ్రాయుధముతో ముక్కలు ముక్కలైనను మరణింపలేదు.

18.66 (అరువది ఆరవ శ్లోకము)

సకృదిష్ట్వాఽఽదిపురుషం పురుషో యాతి సామ్యతామ్|

సంవత్సరం కిఞ్చిదూనం దిత్యా యద్ధరిరర్చితః॥5535॥

18.67 (అరువది ఏడవ శ్లోకము)

సజూరిన్ద్రేణ పఞ్చాశద్దేవాస్తే మరుతోఽభవన్|

వ్యపోహ్య మాతృదోషం తే హరిణా సోమపాః కృతాః॥5536॥

ఇందులో ఏమాత్రమూ ఆశ్చర్యపడవలసిన పని లేదు. మానవుడు ఒక్కసారియైనను ఆ ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుని అర్చించినచో, సామాన్యముక్తిని పొందుదురు. దితి కొంచము తక్కువగా సంవత్సరకాలము శ్రీహరిని ఆరాధిఃచెను. కనుక, నలుబది తొమ్మిదిమంది మరుత్తులు ఇంద్రునితో గూడి ఏబదిమంది దేవతలైరి. ఇంద్రుడుగూడ తన సవతి తల్లి పిల్లలను శత్రుభావముతో చూడలేదు. వారికి యజ్ఞములలో సమర్పింపబడు సోమరసమునందు భాగమును కల్పించెను.

18.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)

దితిరుత్థాయ దదృశే కుమారాననలప్రభాన్|

ఇన్ద్రేణ సహితాన్ దేవీ పర్యతుష్యదనిన్దితా॥5537॥

దితి నిద్రనుండి లేవగనే అగ్నితేజస్సు గల నలుబది తొమ్మిది మంది బాలురు ఇంద్రునితో గూడి యుండుటను జూచెను. సరళస్వభావముగల ఆమె మిక్కిలి ప్రసన్నురాలయ్యెను.

18.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)

అథేన్ద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహమ్|

అపత్యమిచ్ఛన్త్యచరం వ్రతమేతత్సుదుష్కరమ్॥5538॥

18.70 (డెబ్బదియవ శ్లోకము)

ఏకః సఙ్కల్పితః పుత్రః సప్త సప్తాభవన్ కథమ్|

యది తే విదితం పుత్ర సత్యం కథయ మా మృషా॥5539॥

అప్పుడు ఆమె ఇంద్రునితో ఇట్లు పల్కెను- 'నాయనా! ఇంద్రా! అదితి పుత్రులైన దేవతలను భయపెట్టునట్టి సుతుని పొందుటకై దుష్కరమైన వ్రతమును ఆచరించితిని. నేను కేవలము ఒక సుతుని కొరకై ఈ వ్రతమును సంకల్పించి యుంటిని. కాని, నాకు నలుబది తొమ్మిది మంది పుత్రులు ఎట్లు కలిగిరి? ఈ రహస్యము నీకు తెలిసియున్నచో, యథార్థమును తెలుపుము.

ఇన్ద్ర ఉవాచ

18.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)

అమ్బ తేఽహం వ్యవసితముపధార్యాగతోఽన్తికమ్|

లబ్ధాన్తరోఽచ్ఛిదం గర్భమర్థబుద్ధిర్న ధర్మదృక్॥5540॥

18.72 (డెబ్బది రెండవ శ్లోకము)

కృత్తో మే సప్తధా గర్భ ఆసన్ సప్త కుమారకాః|

తేఽపి చైకైకశో వృక్ణాః సప్తధా నాపి మమ్రిరే॥5541॥

18.73 (డెబ్బది మూడవ శ్లోకము)

తతస్తత్పరమాశ్చర్యం వీక్ష్యాధ్యవసితం మయా|

మహాపురుషపూజాయాః సిద్ధిః కాప్యనుషఙ్గిణీ॥5542॥

18.74 (డెబ్బది నాలుగవ శ్లోకము)

ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః|

యే తు నేచ్ఛన్త్యపి పరం తే స్వార్థకుశలాః స్మృతాః॥5543॥

18.75 (డెబ్బది ఐదవ శ్లోకము)

ఆరాధ్యాత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరమ్|

కో వృణీతే గుణస్పర్శం బుధః స్యాన్నరకేఽపి యత్॥5544॥

18.76 (డెబ్బది ఆరవ శ్లోకము)

తదిదం మమ దౌర్జన్యం బాలిశస్య మహీయసి|

క్షన్తుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్థితః॥5545॥

ఇంద్రుడు ఇట్లు వివరించెను "అమ్మా! నీవు ఈ వ్రతమును ఆచరించుటకు కారణమును నేను ఎరిగితిని. అందువలన నా స్వార్థము కొరకు నేను ఇచటికి వచ్చితిని. నా మనస్సులో కొంచెము  గూడ ధర్మభావన లేదు. కనుక ఈ వ్రతాచరణలో దోషము దొరలినంతనే నీ గర్భమును ముక్కలు ముక్కలు గావించితిని. మొదట నేను నీ గర్భమును ఏడు ముక్కలు చేసితిని. ఆ ఏడును ఏడుగురు బాలకులైరి. పిమ్మట ఒక్కొక్కబాలకుని ఏడుముక్కలు గావించితిని. ఐనను, వారు మరణించలేదు. వారే నలుబది తొమ్మిది మంది బాలకులైరి. ఈ ఘటనను చూచినంతనే నాకు మిగుల ఆశ్చర్యము కలిగినది. ఆలోచింపగా ఇది పరమపురుషుడైన భగవంతుని ఉపాసనకు సంబంధించిన ప్రభావశాలియగు ఒక సిద్ధి అని నాకు బోధపడినది. నిష్కామభావముతో భగవంతుని ఆరాధించువారు, లౌకికములైన ఫలములను కోరరు సరిగదా, వారు మోక్షమును గూడ అభిలషింపరు. అట్టి వారే స్వార్థము, పరమార్థమునందు నిపుణులైయుందురు. జగదీశ్వరుడైన శ్రీహరి అందరికిని ఆరాధ్యుడు. ఆత్మస్వరూపుడు. అతడు ప్రసన్నుడైనచో, భక్తునకు తనను సైతము సమర్పించుకొనును. అమ్మా! వివేకము గలవాడు ఆ ప్రభువును ఆరాధించి విషయ భోగములను కోరుకొనడు. అది నరకములో గూడ లభించును. అమ్మా! నీవు అన్నివిదములుగా నాకు పూజ్యురాలవు, అజ్ఞానముచే నేను ఈ దుష్కార్యమును ఒడిగట్టితిని. నా ఈ అపరాధమును క్షమింపుము. అదృష్టవశమున నీ గర్భము ముక్కలు ముక్కలైననూ సజీవముగనే యున్నది? ఇది అంతయు భగవంతుని కృపతో జరిగినది".

శ్రీశుక ఉవాచ

18.77 (డెబ్బది ఏడవ శ్లోకము)

ఇన్ద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుష్టయా|

మరుద్భిః సహ తాం నత్వా జగామ త్రిదివం ప్రభుః॥5546॥

18.78 (డెబ్బది ఎనిమిదివ శ్లోకము)

ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి|

మఙ్గలం మరుతాం జన్మ కిం భూయః కథయామి తే॥ 5547॥

శ్రీ శుకుడు నుడివెను- రాజా! దేవేంద్రుని యొక్క నిష్కపట (నిర్మల) భావమునకు దితి సంతుష్టురాలయ్యెను. ఆమె ఆజ్ఞను  గైకొని, ఇంద్రుడు మరుద్గణములతో గూడి, ఆమెకు నమస్కరించి, స్వర్గలోకమునకు చేరెను. మహారాజా! మరుద్గణముల యొక్క జన్మ శుభప్రదమైసది. దానిని గూర్చి నీవు అడిగిన ప్రశ్నకు సాకల్యముగా సమాధానమును ఇచ్చితిని. ఇంకను నీవు ఏమి వినగోరుచున్నావు?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము (18)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment