వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు పలికెను- దైత్యులు పూజ్యుడైన శుక్రాచార్యుని తమ పురోహితునిగా నియమించుకొనియుండిరి. అతనికి శందుడు, అమర్కుడు అను ఇరువురు కుమారులు గలరు. వారు రాజభవనమునకు సమీపమునందే నివసించుచుండిరి. హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు నీతికోవిదుడైన ప్రహ్లాదునకును, ఇంకను ఇతర దైత్యబాలురకును రాజనీతి, అర్థనీతి శాస్త్రములను నేర్పుచుండిరి.
ప్రహ్లాదుడు గురువు నేర్పిన పాఠమును వినుచుండెను. యథాతథముగ వినిపించుచుండెను. కాని, అవి అతని మనస్సునకు నచ్చకుండెను. ఏలయన, ఆ పాఠములు స్వ-పరభేదములను తెలుపుచుండెను.
ధర్మరాజా! ఒకనాడు హిరణ్యకశిపుడు తనపుత్రుడైన ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో చేర్చుకొని, ఇట్లు ప్రశ్నించెను. 'కుమారా! నీవు నేర్చిన వాటిలో నీకు మంచిదని తోచిన ఒకదానిని వినిపింపుము'.
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు పలికెను - "నాయనా! ఈ జగత్తున మానవులు 'నేను, నాది' అను మాయలోబడి మిథ్యావిషయములను పట్టుకొని సర్వదా ఉద్విగ్నులగుచుందురు. ఇదే వారి అధఃపతనమునకు మూలకారణము' - అని నేను తలంతును. గృహము గడ్డితో కప్పబడిన అంధకార మయమైన బావి వంటిది. జనులు దానిని త్యజించి, వనములలో సాధుపురుషుల సాంగత్యమును నెఱపుచు శ్రీహరిని శరణు వేడుటయే మేలు"
నారద ఉవాచ
నారదుడు పలిచెను- ప్రహ్లాదునినోట శత్రువుల యొక్క ప్రశంసను విని, హిరణ్యకశిపుడు బిగ్గరగా నవ్వి ఇట్లనెను- 'శత్రుపక్షపాతము గలవారు బాలుర బుద్ధులను వక్రమార్గమును పట్టింతురు. గురువు గారి ఇంటిలో కొందరు విష్ణు పక్షపాతము గల బ్రాహ్మణులు మారు వేషములతో నివసించుచున్నారని నేను అనుకొందును. ఈ బాలుని బుద్ధి అపమార్గము పట్టకుండ చక్కగా శిక్షణ గరపవలెను".
దైత్యులు ప్రహ్లాదుని మరల గురువుల ఇంటికి చేర్చిరి. అప్పుడు వారు ప్రహ్లాదుని బుజ్జగించుచు మధురముగా అనునయవచములను పలికిరి-
"కుమారా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక! నిజము పలుకుము. నీ బుద్ధి ఇట్లు ఏల వక్రించినది. ఇతర బాలకుల బుద్ధి ఇట్లు లేదుగదా! వంశోద్ధారకా! నీ బుద్ధిని ఇతరులు ఎవరైనను ఇట్లు వక్రమార్గమును పట్టించిరా? లేక సహజముగనే నీకు తోచినదా! గురువులమైన మేము తెలిసికొనగోరుచున్నాము. తెలుపుము.
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు పలికెను - "భగవంతుని మాయకు వశులైన మనుష్యులయొక్క బుద్ధి మోహగ్రస్తమగుచుండును. దానివలన వారు స్వ-పర భేదమునకు లోనగుచుందురు. అట్టి మాయాధీశుడగు ఆ భగవంతునకు నమస్కారము. పశుబుద్ధి కారణముగనే మానవులకు 'ఇది నేను, ఇది నాకంటెను వేరైనది' అను భేదబుద్ధి కలుగును. భగవంతుని కృపకలిగిన నాడు ఈ పశుబుద్ధి తొలగిపోవును. ఈ ఆత్మయే ఆ పరమాత్మ. అజ్ఞానులు ఇది - నేను, ఇతడు పరాయివాడు అను భేదముతో ఆ ఆత్మనే వర్ణింతురు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనుట మిగుల కష్టము. బ్రహ్మాది వేదజ్ఞులు గూడ ఆ విషయమున మోహితులగు చుందురు. ఆ పరమాత్మయే నా బుద్ధి వక్రించినది అని మీతో పలికించుచున్నాడు. గురువులారా! అయస్కాంతము వైఫు ఇనుము స్వయముగా ఆకర్షింపబడును. అట్లే చక్రధారియైన ఆ శ్రీహరివైపు నా మనస్సు తనంతటతానే భక్తిప్రపత్తులతో ఆకృష్టమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు ఇట్లు పలికెను- పరమజ్ఞానియైన ప్రహ్లాదుడు తన గురువుతో ఇట్లు పలికి మిన్నకుండెను. ఆ పురోహితుడు రాజునకు సేవకుడు, పరాధీనుడు. అతనిలో కోపము ముంచుకొనివచ్చెను. అపుడు ఆ పురోహితుడు ప్రహ్లాదుని మందలించుచు ఇట్లు పలికెను-
"అరే, ఎవ్వరైనను ఒక బెత్తమును తీసికొనిరండు. ఈ బాలుడు మా కీర్తికి కళంకమును తెచ్చుచున్నాడు. తమ వంశమునకు చిచ్చు పెట్టుచున్నాదు. ఈ దుర్బుద్ధిని బాగుచేయుటకు చతురుపాయములలో నాల్గవదియైన దండనయే సరియైనది. దైత్యవంశమనెడి చందనవనమునందు ఇతడు ఒక ముండ్ల పొదవలె జన్మించినాడు. విష్ణువు ఈ వనమును భేదించునట్టి గొడ్డలివంటివాడు. ఈ ఆర్భకుడు అతనికే తోడ్పడుచున్నాడు"
ఈ విధముగా గురువు పలు విధములుగా మందలించుచు ప్రహ్లాదుని భయపెట్టెను. ధర్మార్ధకామముల యందు అతనికి శిక్షణను ఇచ్చెను.
ప్రహ్లాదుడు సామదానభేద దండోపాయములను గూర్చి చక్కగా తెలిసినవాడని గురువు గ్రహించెను. అపుడు అతడు ప్రహ్లాదుని అతని తల్లి దగ్గరకు తీసికొనిపోయెను. తల్లి మిక్కిలి వాత్సల్యముతో అతనిచే స్నానము చేయించి, మంచి వస్త్రాభరణములను అలంకరింప జేసినది. పిమ్మట ఆమె అతనిని హిరణ్యకశిపుని కడకు తీసికొని పోయెను.
ప్రహ్లాదుడు తన తండ్రిపాదములకు నమస్కరించెను. హిరణ్యకశిపుడు అతనిని ఆశీర్వదించి తన రెండు చేతులతో లేవనెత్తి అక్కున జేర్చుకొనెను. ఆ సమయమున ఆ దైత్యరాజుయొక్క హృదయము ఆనందముతో నిండిపోయెను.
హిరణ్యకశిపురువాచ
ధర్మరాజా! హిరణ్యకశిపుడు ప్రసన్నముఖుడైన ప్రహ్లాదుని తన యొడిలోనికి చేర్చుకొని శిరమును మూర్కొనెను. అతని నేత్రములనుండి జాలువాఱిన ఆనందాశ్రువులు ప్రహ్లాదుని శరీరమును తడిపివేసేను.పిమ్మట హిరణ్యకశిపుడు తన పుత్రునితో ఇట్లు పలికెను "చిరంజీవీ! ప్రహ్లాదా! ఇంతవరకును గురువునొద్ద నీవు అభ్యసించిన విద్యలో శ్రేష్ఠమైన విషయమును వివరింపుము"
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు వచించెను తండ్రీ శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగు వానిని వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామ రూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మనివేదనము చేయుట. ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తియని వ్యవహరింతురు.
ప్రహ్లాదుని ఈ వచనములను వినగనే హిరణ్యకశిపుడు క్రోధావిష్టుడు అయ్యెను. పెదవులు వణక సాగెను. పిదప గురుపుత్రునితో ఇట్లనెను- "ఓరీ! బ్రాహ్మణాధమా! నీవు కుబుద్ధివి. ఇదియేనా నీవు నేర్పిన విద్య? నన్ను ఏమాత్రమూ లక్ష్యపెట్టక మా కుమారునకు ఇట్టి సారరహితమైన విషయములను నేర్పితివి. నీవు నా శత్రుపక్షమును వహించినట్లున్నది. లోకములో మిత్రులవలె నటించుచు శత్రువుల కార్యములను నెరవేర్చు దుష్టులకు కొదువలేదు. కాని, రహస్యముగ పాపకృత్యములను ఒనర్చిన వారి పాపములు సమయము వచ్చినప్ఫుడు రోగముల రూపములో బయటపడినట్లు ఈ దుష్టాత్ముల దుర్బుద్ధి ఏదేని యొక సమయమున బహిర్గతము కాక తప్ఫదు.
గురుపుత్ర ఉవాచ
గురుపుత్రుడు పలికెను ఇంద్రశత్రూ! మీ పుత్రుడు పలుకుచున్న మాటలు నేనుగాని, మరెవ్వరైనగాని నేర్పినవి కావు. ప్రభూ! ఇతనికి ఈ బుద్ధి జన్మతః అబ్బినది. కోపమును వీడి శాంతి వహింపుము. మాపై దోషారోపము చేయవద్దు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు వచించెను- ధర్మరాజా! గురువు ఈ విధముగా సమాధానము ఇచ్చినంతనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరల ఇట్లు ప్రశ్నించెను- 'బాలకా! ఇట్లు అమంగళకరమైన ఈ దుర్బుద్ధి గురువునుండి నీకు ప్రాప్తింపనిచో, మరి ఎట్లు అబ్బినది?'
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు నుడివెను- తండ్రీ! ప్రపంచములో జనులు ఇంద్రియములకు వశులై అనుభవించిన విషయ సుఖములనే మరలమరల అనుభవింపగోరుదురు. ఇవి చర్విత చరణములే (నమలిన వాటినే మరల నమలుటవంటిది). అట్టివారు సంసార రూప ఘోరనరకమున పడియుందురు. అట్టి గృహాసక్తులైన వారి బుద్ధి సహజముగా గాని, ఇతరులు నేర్పుటవలనగాని శ్రీహరియందు కుదురుకొనదు. ఇంద్రియములకు గోచరించు బాహ్యవిషయములే పరమార్థములని భావించునట్టి మూర్ఖులు, అంధుని మార్గనిర్దెశములో నడచునట్టి అంధునివలె గోతులలో పడుదురు. వారు వేదములో వర్ణింపబడు కామ్యకర్మలచే బంధింపబడుదురు. అట్టి వారికి స్వార్థపరమార్థములు శ్రీమహావిష్ణువు అని తెలియదు. అట్లు అజ్ఞానులను ఆశ్రయించుట వలన పురుషార్థములు ఎట్లు సిద్ధించును?
శ్రీహరిపాదపద్మముల యందే నిమగ్నమైన బుద్ధిగల వారిని జనన మరణరూప అనర్థములు అన్నియును పూర్తిగా వదలిపోవును. కాని, భగవద్భక్తులైన అకించనుల పాదధూళిలో స్నానమొనర్పనివారు, కామ్యకర్మలను ఎంతగా సేవించినను వారి బుద్ధి భగవచ్చరణారవిందములయందు లగ్నముకాదు.
ప్రహ్లాదుడు ఈ విధముగ పలికి మిన్నకుండెను. హిరణ్యకశిపుడు మాత్రము క్రోధాంధుడై అతనిని తనయొడి నుండి నేలపై పడద్రోసెను.
ప్రహ్లాదుని వచనములకు హిరణ్యకశిపుడు కోపావిష్టుడయ్యెను. అతని కనులు ఎర్రబారెను. వెంటనే అతడు ఇట్లుపలికెను- "దైత్యులారా! వీనిని ఇప్ఫుడే ఇచటి నుండి గొనిపోయి చంపివేయుడు. ఇతడు వధార్హుడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఈ బాలుడు తన తోడివారిని, స్వజనులను కాదని, తన పినతండ్రిని చంపిన విష్ణుని పాదములనే ఒక సేవకునివలె పూజించుచున్నాడు. నా సోదరుని చంపిన విష్ణువే ఈ రూపమున వచ్చినట్లున్నది.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఇతడు విశ్వాసపాత్రుడు కాడు. ఐదు సంవత్సరముల వయస్సులోనే విడదీయరాని మాతాపితరుల ప్రేమానురాగాలను మరచిపోయినాడు. ఇంతటి కృతఘ్నుడైన ఇతడు ఆ విష్ణువునకు మాత్రము ఎట్టి మేలు చేయగలడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
పరాయివాడైనను ఔషధమువలె మేలు చేకూర్చినచో, అతడొక విధముగా పుత్రుడేయగును. కాని, తన కుమారుడే కీడుతలపెట్టినచో, అతడు రోగమువలె శత్రువేయగును. శరీరములోని ఒక అంగము వలన శరీరమంతటికిని హాని జరిగినచో, వెంటనే దానిని ఖండింపవలెను. అట్లొనర్చినచో, మిగిలిన శరీరము సురక్షితముగును. అప్పుడు ఆ వ్యక్తి హాయిగ జీవింపగలడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
స్వజనునివలె నటించుచున్న వీడు నిజముగా నాకు శత్రువే. భోగలాలసుడైన యోగికి అతని యింద్రియములే నష్టము కలిగించునటులు, పుత్రుడైన ఇతడే నాకు ద్రోహమును తలపెట్టినాడు. కనుక, భుజించు సమయమునగాని, నిద్రించునపుడుగాని, కూర్చొనియున్నప్పుడుగాని, ఏదైనా ఒక ఉపాయముచే ఇతనిని చంపివేయుడు".
హిరణ్యకశిపుడు ఇట్లు ఆదేశింపగనే దైత్యులు త్రిశూలములను చేబూని కొట్టుడు, చంపుడు అని బిగ్గరగా అరవసాగిరి. ఆ దైత్యుల కోరలు వాడిగా నుండెను. ముఖములు భయంకరముగా నుండెను. గడ్డములు, మీసములు, కేశములు రాగి వన్నెలో ఉండెను. ప్రహ్లాదుడు మాత్రము మౌనము వహించి యుండెను. వారు అతని ఆయువుపట్టులను శూలములతో పొడుచుచుండిరి.
ఆ సమయమున ప్రహ్లాదుడు తన చిత్తమును పరబ్రహ్మమునందే నిలిపియుండెను. ఆ పరమాత్మ అవాఙ్మానస గోచరుడు, సకల ప్రాణులలో విలసిల్లుచుండు వాడు. ఆ ప్రభువు సమస్త శక్తులకును ఆధారమైనవాడు. కనుక ఆ దైత్యుల ప్రహారములు అన్నియును అదృష్టహీనుని కార్యములవలె నిష్ఫలములయ్యెను.
ధర్మరాజా! శూలములచే పొడుచుటవలన ప్రహ్లాదుని శరీరముపై ఎట్టి గాయము కలుగకపోవుటను జూచి, హిరణ్యకశిపునకు గొప్ప సంశయము గలిగెను. అప్పుడు అతడు ప్రహ్లాదుని వధించుటకై పలు ఉపాయములను పన్నసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మద గజములచే త్రొక్కించెను. విషసర్పములచే కరిపించెను. కృత్య అను రాక్షసిచే బాధింపజేసెను. పర్వత శిఖరములనుండి పడద్రోయించెను. శంబరాసురుని మాయోపాయములను ప్రయోగించెను. చీకటి కొట్లలో బంధించెను. విషమును త్రాగించెను. భోజనమును లేకుండజేసెను. మంచు తిన్నెలపై నిలిపెను. తీవ్రమైన గాలులతో బాధించెను. అగ్ని కుండములలో పడద్రోయించెను. సముద్ర జలములలో ముంచెను. పర్వతముల క్రింద నలిగి పోవునట్లు చేసెను. కానీ, ఈ ఉపాయములలో దేనిచేతను గూడ నిర్దోషియైన తన పుత్రుని చంపలేకపోయెను. అప్పుడు అతడు దీర్ఘముగా ఆలోచింపసాగెను. ప్రహ్లాదుని చంపించుటకు ఎట్టి ఉపాయమూ తోచలేదు.
అతడు ఇట్లు ఆలోచింపసాగెను- 'ఇతనిని ఎన్నియో పరుషోక్తులాడితిని, చంపించుటకు పెక్కు ప్రయత్నములు చేసితిని. కాని, నేను చేసిన అపచారములు, దుష్టప్రయత్నములు, అతని తేజస్సుముందు ఏమాత్రమూ పనిచేయకుండెను.
ఇతడు బాలుడేయైనను గొప్పతెలివి గలవాడు. నా సమీపముననే నిర్భయముగానుండెను. ఇతనిలో ఏదో తెలియని ఒక అద్భుతశక్తి యున్నది. పూర్వము శునశ్శేపుడు తన తండ్రి చేసిన కార్యము ఫలితముగా అతనికి విరోధియయ్యెను.అట్లే ఇతడు గూడ నా దుష్కార్యములను మరచిపోడు. ఇతడు ఎవరికి భయపడుట లేదు. ఇంతగా ప్రయత్నించినను మృతుడు కాలేదు. ఇతని శక్తి ఎంతటిదో అర్థమగుటలేదు. ఇతని యెడ శత్రుత్వము వహించుట వలన ఇతని వలననే నాకు చావు తప్పనట్లున్నది.
శునశ్శేపుని వృత్తాంతము (సంక్షిప్తముగా - పూర్తికథ నవమస్కంధమునందు ఏడవ అధ్యాయమునందు వచ్చును. ఇక్కడ కూడా ప్రత్యేక సందేశముగా నీయబడినది)
శునశ్శేపుడు అజీగర్తుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు. వరుణయాగమునందు బలియిచ్చుటకై అతని తండ్రి హరిశ్చంద్రుని పుత్రుడైన లోహితాస్యునకు అమ్మివేసెను. అప్పుడు అతని మామయైన విశ్వామిత్రుడు అతనిని రక్షించెను. అంతట అతడు తన తండ్రికి విరోధియై విశ్వామిత్రుని పక్షమున చేరెను.
ఇట్లు చింతించుటవలన హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. అంతట అతడు తలవంచుకొని యుండుటను శుక్రాచార్యుని కుమారులైన శండామార్కులు చూచిరి. వారు ఏకాంతముగా ఆయనతో ఇట్లు పలికిరి-"ప్రభూ! నీవు ఒక్కడవే ముల్లోకములను జయించితివి. నీవు కోపముతో బొమముడి వైచినంతనే లోకపాలురు గడగడలాడెదరు. ఈ బాలుని విషయములో నీవు ఏమాత్రము చింతింపవలదు. పిల్లల విషయములో మంచి చెడులను గూర్చి అంతగా మథనపడవలసిన పనియేలేదు. మా తండ్రియైన శుక్రాచార్యుడు ఇచటికి రానంత వరకును ఇతడు భయపడి ఎక్కడికిని పారిపోడు. కనుక ఇతని వరుణపాశముతో బంధింపుడు. వయస్సు పెరుగుచున్న కొలదియు గురువుల సేవల ప్రభావమువలన ఇతని బుద్ధి మారవచ్చును.
'సరే! మంచిది!. అని పలికి హిరణ్యకశిపుడు గురుపుత్రుల సూచనను మన్నించెను. పిదప, గృహస్థులైన రాజులు పాటించునట్టి ధర్మములను ఇతనికి ఉపదేశింపుడు' అని పలికెను.
ధర్మరాజా! అంతట పురోహితులు ప్రహ్లాదుని తీసికొని తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. అతనికి క్రమముగ ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములలో శిక్షణను ఇచ్చిరి. ప్రహ్లాదుడు అచట మిక్కిలి వినమ్రుడై సేవకునివలె ఉండసాగెను. కాని, గురువుల ఉపదేశము ప్రహ్లాదునకు నచ్చలేదు. ఏలయన,అది కేవలము ధర్మార్థకామములకు సంబంధించినది మాత్రమే అయియుండెను. ఆ విద్య రాగద్వేషాది ద్వంద్వములలో విషయభోగములకు మాత్రమే ప్రయోజనకరము.
ఒకనాడు గురువు ఇంటి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళియుండెను. అవకాశము దొరికినందులకు సమవయస్కులైన బాలురు తమతో ఆడుకొనుటకు పిలిచిరి. ప్రహ్లాదుడు పరమ జ్ఞాని. తనయెడ వారికిగల ప్రేమనుజూచి అతడు మధుర వచనములతో వారిని తన యొద్దకు పిలిచెను. వెంటనే ప్రేమపూర్వకముగా వారికి అతడు ఉపదేశింప సాగెను.
ధర్మరాజా! వారు ఇంకను పిన్నవయస్కులే. కావున రాగద్వేషములతో, విషయ భోగలాలసులైన పురుషుల ఉపదేశముల వలనను, చేష్టల వలనను వారి బుద్ధులు ఇంకనూ కలుషితములు కాలేదు. ప్రహ్లాదునిపై గల గౌరవభావముతో వారు తమ ఆట వస్తువులను త్యజించి, అతని చుట్టును చేరిరి. ఏకాగ్రచిత్తముతో అతని ఉపదేశములను వినుచు ప్రేమ పూర్వకముగ అతని వైఫు చూడసాగిరి. పరమభాగవతుడు, సుహృదుడు ఐన ప్రహ్లాదుడు వారిపై కరుణచూపుచు ఇట్లు పలుకసాగెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమోఽధ్యాయః (5)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
No comments:
Post a Comment