Wednesday, 3 June 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - పదియవ అధ్యాయము

3.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదియవ అధ్యాయము

దధీచిమహర్షి ఎమకల నుండి దేవతలు వజ్రాయుధమును సిద్ధపరచుట - వృత్రాసురుని సేనపై దండెత్తుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ శుక ఉవాచ

10.1 (ప్రథమ శ్లోకము)

ఇన్ద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః।

పశ్యతామనిమేషాణాం తత్రైవాన్తర్దధే హరిః॥5157॥

శ్రీ శుకుడు వచించెను - పరీక్షిన్మహారాజా! దేవేంద్రునకు ఇట్లు ఉపదేశించిన పిమ్మట విశ్వ రక్షకుడైన శ్రీహరి దేవతలు చూచుచుండగానే అంతర్ధానమయ్యెను.

10.2 (రెండవ శ్లోకము)

తథాభియాచితో దేవైరృషిరాథర్వణో మహాన్|

మోదమాన ఉవాచేదం ప్రహసన్నివ భారత॥5158॥

మహారాజా! మహాత్ముడు అథర్వవేదజ్ఞుడు ఐన దధీచి కడకేగి దేవతలు అతని శరీరాంగమును యాచించిరి. అప్పుడు దధీచి సంతోషముథో నవ్వుచు వారితో ఇట్లు పల్కెను-

10.3 (మూడవ శ్లోకము)

అపి వృన్దారకా యూయం న జానీథ శరీరిణామ్|

సంస్థాయాం యస్త్వభిద్రోహో దుఃసహశ్చేతనాపహః॥5159॥

10.4 (నాలుగవ శ్లోకము)

జిజీవిషూణాం జీవానామాత్మా ప్రేష్ఠ ఇహేప్సితః|

క ఉత్సహేత తం దాతుం భిక్షమాణాయ విష్ణవే॥5160॥॥

"దేవతలారా! మరణ సమయమునందు ప్రాణులకు దుస్సహమైన కష్టము కల్గును. శరీరమునందు చైతన్యము ఉన్నంతవరకును ఈ బాధలను అనుభవింపవలసియే ఉండును. చివరకు వారు మూర్చితులగుదురు. బహుశః మీకు ఈ విషయము తెలయదు. జగత్తునందు జీవింపగోరు వారికి ఈ  శరీరము మిక్కిలి అమూల్యము, ప్రియము, అభీష్టమైన వస్తువు. ఇట్టి స్థితిలో స్వయముగా శ్రీహరియే వచ్చి అడిగిననూ, తన శరీరమును ఇచ్చుటకు ఎవరు సాహసింపగలరు?"

దేవా ఊచుః

॥0.5 (ఐదవ శ్లోకము)

కిం ను తద్దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకమ్పినామ్|

భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేడ్యకర్మణామ్॥5161॥

దేవతలు నుడివిరి- మహాత్మా! నీవు ఉదారస్వభావము గలవాడవు. భూతదయగల మహాపురుషుడవు. నీ కర్మలను గొప్ప పేరు ప్రతిష్ఠలుగలవారుగూడ ప్రశంసింతురు. ప్రాణుల శ్రేయస్సు కొరకు నీవు త్యజింపజాలని వస్తువేమున్నది?

10.6 (ఆరవ శ్లోకము)

న ను స్వార్థపరో లోకో న వేద పరసఙ్కటమ్

యది వేద న యాచేత నేతి నాహ యదీశ్వరః॥5162॥

మహానుభావా! యాచించువారు స్వార్థపరులై యుందురు. వారు దాత యొక్క ఇబ్బందులను గూర్చి ఏమియును ఆలోచింపరు. దాతల ఇబ్బందులను గూర్చిన అవగాహనయున్నచో, అట్లు అడుగనే అడుగరు. దాత ఉదారుడైనచో, యాచకుని కవ్టములను గుర్తెరిగి లేదు అని పలుకడు కదా! (కనుక నీవును ఆపదను గుర్తించి మేము యాచించిన దానిని అనుగ్రహింపుము)

ఋషిరువాచ

10.7 (ఏడవ శ్లోకము)

ధర్మం వః శ్రోతుకామేన యూయం మే ప్రత్యుదాహృతాః|

ఏష వః ప్రియమాత్మానం త్యజన్తం సన్త్యజామ్యహమ్॥5163॥

దధీచి మహర్షి పలికెను- దేవతలారా! మీ నోట ధర్మవచనములను వినుటకొరకే మీ కోరికలయెడ ఉపేక్ష వహించితిని. మీరు చింతింపవలదు. నా ప్రియమైన శరీరమును మీ కొరకు ఇప్పుడే త్యజించెదను. ఏదియో ఒకనాడు ఈ తనువు స్వయముగా నన్ను విడిచిపెట్టునదే కదా!

10.8 (ఎనిమిదవ శ్లోకము)

యోఽధ్రువేణాత్మనా నాథా న ధర్మం న యశః పుమాన్|

ఈహేత భూతదయయా స శోచ్యః స్థావరైరపి॥5164॥

అనిత్యమైన ఈ శరీరముతో దుఃఖితులైన ప్రాణులకొరకు కనీస ధర్మమును ఆచరింపని వ్యక్తి యశస్సును పొందజాలడు. అట్లు చేయనివాడు చేట్లు-చేమలకంటే హీనుడైపోవును.

10.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏతావానవ్యయో ధర్మః పుణ్యశ్లోకైరుపాసితః|

యో భూతశోక హర్షాభ్యామాత్మా శోచతి హృష్యతి॥5165॥

గొప్ప  గొప్ప మహాత్ములు శాశ్వతమైన ధర్మమునే ఉపాసింతురు. ఇతరులకు దుఃఖము వచ్చినప్పుడు తాము దుంఖించుట, సుఖములు కలిగినప్పుడు సంతోషపడుట వారి స్వభావము.

10.10 (పదియవ శ్లోకము)

అహో దైన్యమహో కష్టం పారక్యైః క్షణభఙ్గురైః|

యన్నోపకుర్యాదస్వార్థైర్మర్త్యః స్వజ్ఞాతివిగ్రహైః॥5166॥

జగత్తునందు ధనము, పరివారము, శరీరము మొదలగునవి క్షణ భంగురములు. వీటి వలన మానవులకు ఏమాత్రమూ ఉపయోగములేదు. కనుక ఇతరులకును ఉపయోగపడడు. మనుజులకు మృత్యువు అనివార్యము. అట్టి ఈ శరీరము ద్వారా ఇతరులకు మేలు చేయకుండుట కడు శోచనీయము.

10.11 (పదకొండవ శ్లోకము)

శ్రీశుక ఉవాచ

ఏవం కృతవ్యవసితో దధ్యఙ్ఙాథర్వణస్తనుమ్

పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం సన్నయన్ జహౌ॥5167॥

శ్రీశుకుడు ఇట్లనెను- అథర్వణ వేదజ్ఞుడైన దధీచి మహర్షి ఇట్లు నిశ్చయించుకొని తన ఆత్మను పరమాత్మయందు లీనమొనర్చెను. అంతట స్థూలశరీరమును త్యజించెను.

10.12 (పండ్రెండవ శ్లోకము)

యతాక్షాసుమనోబుద్ధిస్తత్త్వదృగ్ ధ్వస్తబన్ధనః|

ఆస్థితః పరమం యోగం న దేహం బుబుధే గతమ్॥5168॥

దధీచి మహర్షి ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును, బుద్ధిని నిగ్రహించియుండెను. అతని దృష్టి తత్త్వమయమయ్యెను. వివిధబంధములును తొలగిపోయెను. అప్పుడు భగవదైక్య స్థితిని పొందుటచే అతనికి దేహముపై ధ్యాసయే లేకుండెను. అట్టిస్థితిలో అతని శరీరము విడివడిపోయెను.

10.13 (పదమూడవ శ్లోకము)

అథేన్ద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణా|

మునేః శుక్తిభిరుత్సిక్తో భగవత్తేజసాన్వితః ॥5169॥

10.14 (పదునాలుగవ శ్లోకము)

వృతో దేవగణైః సర్వైర్గజేన్ద్రోపర్యశోభత

స్తూయమానో మునిగణైస్త్రైలోక్యం హర్షయన్నివ॥5170॥

10.15 (పదునైదవ శ్లోకము)

వృత్రమభ్యద్రవచ్ఛత్రుమసురానీకయూథపైః|

పర్యస్తమోజసా రాజన్ క్రుద్ధో రుద్ర ఇవాన్తకమ్॥5171॥

శ్రీహరి యొక్క శక్తిని పొంది ఇంద్రుని యొక్క బల పౌరుషములు ఇనుమడించెను. దధీచి యొక్క ఎముకలనుండి విశ్వకర్మ వజ్రాయుధమును సిద్ధపరచి ఇంద్రునకు ఇచ్చెను. దేవేంద్రుడు ఆ వజ్రాయుధమును గ్రహించి ఐరావతమును అధిష్టించెను. అతనితోబాటు దేవతలందరును యుద్ధమునకు సిద్ధమైరి. గొప్ప గొప్ప ఋషులు, మునులు అతనిని స్తుతింపసాగిరి. ముల్లోకములు హర్షించునట్లుగా వృత్రాసురుని వధించుటకై తన శక్తిని కూడగట్టుకొని, క్రుద్ధుడైన పరమశివుడు మృత్యుదేవత మీదికి వలె విజృంభించెను. వృత్రాసురుడు గూడ దైత్య సేవావాహినిని సన్నద్ధము చేసి, యుద్దమునకు సిద్ధమయ్యెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


4.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - పదియవ అధ్యాయము

దధీచిమహర్షి ఎమకల నుండి దేవతలు వజ్రాయుధమును సిద్ధపరచుట - వృత్రాసురుని సేనపై దండెత్తుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.16 (పదునారవ శ్లోకము)

తతః సురాణామసురై రణః పరమదారుణః|


త్రేతాముఖే నర్మదాయామభవత్ప్రథమే యుగే॥5172॥

ఆ సమయమున వైవస్వత మన్వంతరమునందలి మొదటి చతుర్యుగమున త్రేతాయుగము ఆరంభమగుచుండెను. అప్పుడు నర్మదాతీరమున దేవతలకును, దైత్యులకును ఘోరయుద్ధము జరిగెను.

10.17 (పదిహేడవ శ్లోకము)

రుద్రైర్వసుభిరాదిత్యైరశ్విభ్యాం పితృవహ్నిభిః|

మరుద్భిరృభుభిః సాధ్యైర్విశ్వేదేవైర్మరుత్పతిమ్॥5173॥

10.18 (పదునెనిమిదవ శ్లోకము)

దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం స్వయా శ్రియా|

నామృష్యన్నసురా రాజన్ మృధే వృత్రపురఃసరాః॥5174॥

రాజా! అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధమును చేబూని యుండెను. రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినీ కుమారులు, పితృగణములు, అగ్ని, మరుద్గణములు, ఋభుగణములు, సాధ్యులు, విశ్వేదేవతలు మొదలగువారు తమ తేజస్సులతో ఇంద్రునకు తోడుగా నిలిచి యుండిరి. వృత్రాసురుడు మొదలగు దైత్యులు తమ యెదుటనున్న వారిని జూచి, యుద్ధభూమి యందు ఇంకను రెచ్చి పోయిరి.

10.19 (పందొమ్మిదవ శ్లోకము)

నముచిః శమ్బరోఽనర్వా ద్విమూర్ధా ఋషభోఽసురః

హయగ్రీవః శఙ్కుశిరా విప్రచిత్తిరయోముఖః॥5175॥

10.20 (ఇరువదియవ శ్లోకము)

పులోమా వృషపర్వా చ ప్రహేతిర్హేతిరుత్కలః

దైతేయా దానవా యక్షా రక్షాంసి చ సహస్రశః॥5176॥

10.21 (ఇరువదియొకటవ శ్లోకము)

సుమాలిమాలిప్రముఖాః కార్తస్వరపరిచ్ఛదాః|

ప్రతిషిధ్యేన్ద్రసేనాగ్రం మృత్యోరపి దురాసదమ్॥5177॥

అప్పుడు సముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ఖుడు, ఋషభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు. విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు, సుమాలి, మాలి మొదలగు వేలకొలది దైత్యులు, దానవులు, యక్షరాక్షసులు, బంగారు ఆభరణములు ధరించి, దేవేంద్రుని సేనను ఎదుర్కొనిరి. దేవతలసేన మృత్యుదేవతకు కూడ అజేయముగా ఉండెను.

10.22 (ఇరువది రెండవ శ్లోకము)

అభ్యర్దయన్నసమ్భ్రాన్తాః సింహనాదేన దుర్మదాః|

గదాభిః పరిఘైర్బాణైః ప్రాసముద్గరతోమరైః॥5178॥

10.23 (ఇరువది మూడవ శ్లోకము)

శూలైః పరశ్వధైః ఖడ్గైః శతఘ్నీభిర్భుశుణ్డిభిః|

సర్వతోఽవాకిరన్ శస్త్రైరస్త్రైశ్చ విబుధర్షభాన్॥5179॥

గర్వితులైన అసురులు సింహగర్జనలను జేయుచు ఏ మాత్రము తొట్రుపడక దేవతల సైన్యము పైన విరుచుకొని పడిరి. వారు గదలు, పరిఘలు, బాణములు, ఈటెలు, ముద్గరములు, తోమరములు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, ఖడ్గములు, శతఘ్నులు, సమ్మెటలు మొదలగు అస్త్ర శస్త్రములను వర్షించుచు దేవతలను అన్ని వైపులనుండి అడ్డగించిరి.

10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

న తేఽదృశ్యన్త సఞ్ఛన్నాః శరజాలైః సమన్తతః|

పుఙ్ఖానుపుఙ్ఖపతితైర్జ్యోతీంషీవ నభోఘనైః॥5180॥

అన్నివైపుల నుండియు శరపరంపరలు చుట్టుముట్టుట వలన మేఘాచ్ఛాదితమైన ఆకాశమునందు నక్షత్రములు గోచరములు కానట్లు, దేవతలు రణరంగమున కనబడకుండిరి.

10.25 (ఇరువది ఐదవ శ్లోకము)

న తే శస్త్రాస్త్రవర్షౌఘా హ్యాసేదుః సురసైనికాన్|

ఛిన్నాః సిద్ధపథే దేవైర్లఘుహస్తైః సహస్రధా॥5181॥

దైత్యులయొక్క అస్త్రశస్త్రములు దేవతల సైన్యముల దరిదాపులకుగూడ రాలేకుండెను. ఏలయన, దేవతలు తమచేతి ఒడుపుతో వాటిని ఆకాశమునందే ముక్కలుముక్కలు గావించుచుండిరి.

10.26 (ఇరువదియారవ శ్లోకము)

అథ క్షీణాస్త్రశస్త్రౌఘా గిరిశృఙ్గద్రుమోపలైః|

అభ్యవర్షన్ సురబలం చిచ్ఛిదుస్తాంశ్చ పూర్వవత్॥5182॥

అసురుల యొక్క అస్త్ర శస్త్రములు అన్నియును క్రమముగా క్షీణించిపోయెను. అప్పుడు వారు పర్వత శిఖరములను, వృక్షములను, బండరాళ్ళను దేవతల సైన్యముపై వర్షించిరి. కాని దేవతలు వాటిని గూడ మునుపటివలె ఛిన్నాభిన్నమొనర్చిరి.

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తానక్షతాన్ స్వస్తిమతో నిశామ్య శస్త్రాస్త్రపూగైరథ వృత్రనాథాః|


ద్రుమైర్దృషద్భిర్వివిధాద్రిశృఙ్గైరవిక్షతాంస్తత్రసురిన్ద్రసైనికాన్॥5183॥

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సర్వే ప్రయాసా అభవన్ విమోఘాః కృతాః కృతా దేవగణేషు దైత్యైః|

కృష్ణానుకూలేషు యథా మహత్సు క్షుద్రైః ప్రయుక్తా రుశతీ రూక్షవాచః॥5184॥

వృత్రాసురుని అనుయాయులైన అసురులు అసంఖ్యాకములైన తమ అస్త్ర శస్త్రములు దేవతా సైన్యమును ఏమియూ చేయలేకుండుటను గమనించిరి. వారు ప్రయోగించిన వృక్షములు, బండరాళ్ళు, పర్వత శిఖరములు దేవతల సైన్యములను గాయపరచ లేకుండెను. వారు సురక్షితముగా ఉండుటను జూచి, దైత్యులు మిగుల భయపడిరి. దేవతలను పరాజితులను గావించుటకై వారు చేసిన ప్రయత్నము లన్నియును శ్రీకృష్ణానుగ్రహముచే సురక్షితులైన భక్తులపై దుష్టుల కఠోర వాక్యములవలె నిష్ఫలములయ్యెను.

10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తే స్వప్రయాసం వితథం నిరీక్ష్య హరావభక్తా హతయుద్ధదర్పాః|

పలాయనాయాజిముఖే విసృజ్య పతిం మనస్తే దధురాత్తసారాః॥5185॥

భగవద్విముఖులైన అసురులు తమ ప్రయత్నములు అన్నియును వ్యర్థములగుట చూచి నిరుత్సాహమునకు లోనైరి. వారి యుద్ధగర్వమంతయు అణగారిపోయెను. వారు తమ నాయకుడైన వృత్రాసురుని యుద్ధభూమియందే విడిచిపెట్టి పారి పోయిరి. ఏలయన దేవతలు వారి బల పౌరుషములను నిర్వీర్యమొనర్చిరి.

10.30 (ముప్పదియవ శ్లోకము)

వృత్రోఽసురాంస్తాననుగాన్ మనస్వీ ప్రధావతః ప్రేక్ష్య బభాష ఏతత్|

పలాయితం ప్రేక్ష్య బలం చ భగ్నం భయేన తీవ్రేణ విహస్య వీరః॥5186॥

తన అనుయాయులు అందరును పారిపోవుటను, తన సైనికులందరును మిక్కిలి భీతావహులై చెల్లా చెదరగుటను, ధీరుడు, వీరుడు ఐన వృత్రాసురుడు గమనించెను. అప్పుడు అతడు వారి పిరికి తనమునకు నవ్వుచు ఇట్లు పలుకసాగెను.

10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

కాలోపపన్నాం రుచిరాం మనస్వినాం ఉవాచ వాచం పురుషప్రవీరః|

హే విప్రచిత్తే నముచే పులోమన్ మయానర్వన్ఛమ్బర మే శృణుధ్వమ్॥5187॥

వీరశిరోమణియైన వృత్రాసురుడు సమయానుకూలముగ వీరోచితమైన ఈ మాటలను పలికెను ఓ విప్రచిత్తీ! నముచీ! పులోమా! మయా! అనర్వా! శంబరా! నా మాటను వినుడు

10.32 (ముప్పది రెండవ శ్లోకము)

జాతస్య మృత్యుర్ధ్రువ ఏవ సర్వతః ప్రతిక్రియా యస్య న చేహ కౢప్తా|

లోకో యశశ్చాథ తతో యదిహ్యముం కో నామ మృత్యుం న వృణీత యుక్తమ్॥5188॥

వృత్రాసురుడు ఇంకను ఇట్లు పలుకసాగెను-

పుట్టిన ప్రతి వానికి ఏదేని ఒకనాడు మృత్యువు తప్పదు. ఇందు సందేహములేదు. మృత్యువును తప్పించుకొనుటకు ఈ జగత్తులో విధాత ఎట్టి ఉపాయములను చేయలేదు. ఇట్టి స్థితిలో మృత్యువు ద్వారా స్వర్గాదిలోకములు, కీర్తియు ప్రాప్తించుచున్నప్పుడు, అట్టి యోగ్యమగు వీరోచితమైన మృత్యువును ఎవరు వరించకుండును? అనగా - బుద్ధిమంతుడగువాడు ఇట్టి వీరోచితమైన మృత్యువును తప్పక వరించును.

10.33 (ముప్పది మూడవ శ్లోకము)

ద్వౌ సమ్మతావిహ మృత్యూ దురాపౌ యద్బ్రహ్మసన్ధారణయా జితాసుః|

కలేవరం యోగరతో విజహ్యాద్యదగ్రణీర్వీరశయేఽనివృత్తః॥5189॥

వృత్రాసురుడు ఇంకను ఇట్లు పలుకుట కొనసాగించెను-

లోకమున రెండు విధములైన మృత్యువు దుర్లభము, శ్రేష్ఠము అని భావింపబడును. మొదటిది యోగులు తమ ప్రాణములను వశపరచుకొని బ్రహ్మమును ధ్యానించుచు శరీరమును త్యజింతురు. ఇక రెండవది యుద్ధభూమియందు సైనికులు ముందుగానిలిచి వెన్ను చూపక మరణింతురు. ఈ రెండు విధములైన మృత్యువులు శ్రేష్ఠములే! ఇట్టి శుభావకాశమును ఎందులకు వదులుకొందురు?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే దశమోఽధ్యాయః (10)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment