వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు వచించెను- యుధిష్ఠిర మహారాజా! హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఈ విధముగా అత్యంతదుర్లభములైన వరములను కోరెను. అతని తపస్సునకు మిక్కిలి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు, ఆ వరములను అన్నింటిని ప్రసాదించెను.
బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను - నాయనా! నీవు జీవులకు దుర్లభములైన వరములను నా నుండి కోరితివి. అవి దుర్లభములే యైనను వాటిని నీకు ప్రసాదించుచున్నాను.
నారదుడు ఇట్లు వివరించెను- "బ్రహ్మదేవుడు సర్వ సమర్థుడైన భగవత్స్వరూపుడు. అతడు ప్రసాదించిన వరములు ఎన్నడును అసత్యములుకావు. వరములను పొందిన పిదప హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజించెను. అనంతరము ప్రజాపతులు తనను స్తుతించుచుండగా బ్రహ్మదేవుడు (తన) సత్యలోకమునకు చేరెను".
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
"బ్రహ్మదేవుని నుండి ఇట్లు వరములను పొందిన యహిరణ్యకశిపుని శరీరము బలిష్ఠమై బంగారు కాంతులీనుచుండెను. అతడు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధను గూర్చి స్మరించుచు శ్రీహరియెడ ద్వేష భావమును పెంచుకొనెను"
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
పిమ్మట అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపుడు సకల దిక్కులను, ముల్లోకములను, జయించెను. దేవతలను, అనుచరులను, మహరాజులను, గంధర్వులను, గరుడజాతికి చెందిన ప్రముఖులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరులను, ఋషులను, పితరులను, మనువులను, యక్షరాక్షసులను, పిశాచప్రభువులను, ప్రేతములను, భూతపతులను, సమస్తప్రాణులను జయించెను. ఈ విధముగా విశ్వవిజేతయైన ఆ హిరణ్యకశిపుడు లోకపాలుర స్థానములను, తేజస్సులను హరించెను.
"నందనవనము మొదలగు దివ్య-ఉద్యానములతో శోభిల్లునట్టి, స్వర్గము నందు అతడు నివసింపసాగెను. సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మితమైన ఇంద్ర భవనమే అతని నివాసస్థానమాయెను. ఆ భవనమునందు ముల్లోకముల సౌందర్యము రాశీభూతమై యుండెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు సకల సంపదలతో తులతూగెను"
ఆ ఇంద్రభవనము నందలి మెట్లు పగడములతో చెక్కబడెను. నేలకు మరకతమణులు తాపబడి యుండెను. గోడలు స్ఫటికములతో నిర్మింపబడి యుండెను. స్తంభములు వైడూర్యఖచితములు. అందు చిత్రవిచిత్రములైన తెరలు, పద్మరాగముల ఆసనములు, పాలనురుగుల వంటి తెల్లని శయ్యలపై ముత్యాలకంబళ్ళు శోభాయమానముగ నుండెను.
సర్వాంగ సుందరులైన అప్సరసలు రత్నఖచితములైన నేలలపై అటునిటు తిరుగుచుండగా వారి కాలి అందెల ధ్వనులు వినసొంపుగా నుండెను. వారు ఆ రత్నములలో తమ ముఖముల ప్రతిబింబమును చూచుకొనుచుండిరి.
మహాబలశాలి, మహామనస్వియు ఐన ఆ హిరణ్యకశిపుడు ముల్లోకములను జయించి, ఏకచ్ఛత్రాధిపతియై, మహేంద్రభవనమును స్వేచ్ఛగా విహరించుచుండెను. అతని కఠోర శాసనమునకు భీతిల్లి, దేవదానవులు ఆయన పాదముల కడ మోకరిల్లుచుండిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ధర్మరాజా! ఘాటైన వాసన గల మధ్యమును సేవించి అతడు మత్తిల్లియుండెను. అతని కనులు కైపెక్కి ఎర్రబారియుండెను. అతడు తపస్సుతో, యోగముతో, శారీరక దారుఢ్యముతో, మనోబలముతో ఒప్పుచుండెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప మిగిలిన దేవతలు అందరును కానుకలను చేబూని, అతనిని సేవించుచుండిరి.
ధర్మరాజా! అతడు తన బలపరాక్రమములచే ఇంద్రుని సింహాసనమును ఆక్రమించెను. అప్పుడు విశ్వావసువు, తుంబురుడు, మేము అందరము అతనియెదుట నిలిచి, గానము చేయుచుంటిమి. గంధర్వులు, సిద్ధులు, ఋషిగణములు, విద్యాధరులు, అప్సరసలు పదేపదే అతనిని స్తుతించుచుండిరి.
వర్ణాశ్రమ ధర్మములను పాటించువారు దక్షిణలతో గూడిన యజ్ఞములను ఆచరించుచుండిరి. మహాతేజస్వియైన హిరణ్యకశిపుడు , ఆ యజ్ఞముల హవిర్భాగములను తానే బలవంతముగా లాగికొనుచుండెను.
సప్తద్వీపములతో గూడిన భూమండలము అతని అధీనములో ఉండెను. దున్నకుండగనే భూములు పంటలను ఇచ్చుచుండెను. అంతరిక్షమునుండి అతడు కోరుకొనిన వస్తువులు అన్నియును లభించుచుండెను. ఆకాశము పలు విధములైన ఆశ్చర్యకరమైన వస్తువులను అందజేయుచు, అతని మనస్సును రంజింపజేయుచుండెను.
ఉప్పునీరు, మద్యము, నేయి, చెఱకురసము, పెరుగు, పాలు, తీయని జలములు గల సముద్రములు గూడ తమ పత్నులైన నదులతోగూడి తరంగముల ద్వారా రత్న రాసులను అతనికడకు చేర్చుచుండెను.
పర్వతములు, తమ లోయలయందు అతనికి క్రీడా స్థలములను ఏర్పరచు చుండెను. వృక్షములు అన్ని ఋతువులయందును పుష్పములతో ఫలములతో శోభిల్లుచుండెను. లోకపాలుర అధికారములను, అన్నింటిని అతడు ఒక్కడే చేపట్టుచుండెను.
ఆ హిరణ్యకశిపుడు సకల దిక్కులను జయించి, ఏకచ్ఛత్రాధిపతి యయ్యెను. తనకు ఇష్టమైన విషయములను అన్నింటిని యధేచ్ఛగా అనుభవించు చుండెను. ఐనను, ఇంద్రియనిగ్రహము లేనియతడు విషయ భోగములతో తృప్తి పడకుండెను.
సనకాదిమునుల శాపప్రభావమున శ్రీహరిపార్షదుడే హిరణ్యకశిపుడుగ జన్మించెను. అతడు ఐశ్వర్యముచే మత్తిల్లి గర్వితుడై యుండెను. శాస్త్రమర్యాదలను ఉల్లంఘించు చుండెను. ఈ విధముగా అతని జీవితములో చాలాభాగము గడచిపోయెను.
హిరణ్యకశిపుని కఠోరశాసనము వలన సమస్తలోకముల వారును, లోకపాలురును చాల భయపడుచుండిరి. వారిని రక్షించువారు ఎవ్వరును లేకుండిరి. అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి.
వారు తమ మనస్సులలో ఇట్లు భావింపసాగిరి- "సకల ప్రాణులకును ఆత్మ సర్వేశ్వరుడు ఐన శ్రీహరినివాసము పరంధామము. పవిత్రులై ప్రశాంతచిత్తులైన సన్న్యాసులు ఆ పరంధామమునకు చేరి, ఈ లోకమునకు తిరిగిరారు. అట్టి పరంధామమునకు నమస్కారము.
ఇట్లు భావించుచు, వారు ఇంద్రియనిగ్రహము గలవారై ఏకాగ్ర చిత్తములతో, నిర్మల హృదయములతో నిద్రాహారములను మాని, వాయువునే భక్షించుచు భగవంతుని ఆరాధించిరి".
ఒకనాడు మేఘగంభీరరవముతో వారికి ఆకాశవాణి వినబడెను. ఆ ధ్వనికి దిక్కులన్నియును మారుమ్రోగెను. సత్పురుషులకు అభయమునిచ్చు ఆ వాణి యిట్లు పలికెను-
ఆకాశవాణి ఇట్లనుచుండెను
"దేవతా శ్రేష్ఠులారా! భయపడకుడు. మీకు అందరికిని మేలగుగాక! నా దర్శనమే సకల ప్రాణులకు పరమ శ్రేయస్కరము. నీచుడైన ఈ దైత్యుని దుర్మార్గములను నేను ఎరుగుదును. వాటిని అన్నింటిని అరికట్టెదను. కొంతకాలము వేచియుండుడు. ఎవ్వడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, సాధుపురుషులను, ధర్మములను, నన్ను ద్వేషించినచో వానికి శీఘ్రముగా వినాశము తప్పదు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు ఏ ప్రాణిని గూడ ద్వేషింపడు. అతడు ప్రశాంతచిత్తుడు. మహాత్ముడు. అట్టి ప్రహ్లాదునకు హాని తలపెట్టినపుడు, వరప్రభావమున ఆ హిరణ్యకశిపుడు శక్తిసంపన్నుడైనను నేను అతనిని తప్పక వధించెదను".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపునకు విలక్షణులైన నలుగురు కుమారులుండిరి. వారిలో ప్రహ్లాదుడు అందరికంటెను చిన్నవాడు. కాని, సుగుణములలో మిన్నయైనవాడు. సత్పురుషులను సేవించువాడు. అతడు బ్రాహ్మణులయెడ భక్తితత్పరుడు. సౌమ్యస్వభావుడు. సత్యసంధుడు, జితేంద్రియుడు. సకల ప్రాణులను తనతో సమానముగా చూచుకొనువాడు. అందరికిని ప్రియమును గూర్చువాడు. అందరియెడ అవ్యాజమైన సుహృద్భావము గలవాడు. పెద్దలయెడ సేవకునివలె వినమ్రుడై ఉండెడివాడు. దీనులయెడ తండ్రివలె వాత్సల్యమును చూపువాడు. సమవయస్కులయెడ సోదరభావము నెరపుచుండెడివాడు. గురుజనులను దైవసమానులుగ భావించుచుండువాడు. విద్య, సంపదలు, సౌందర్యము, ఉత్తమ వంశములలో జన్మ మొదలగు సుగుణములు ఉన్నను, అతనిలో అభిమానము, గర్వము మచ్చునకైనను లేకుండెను..
ఎన్ని కష్టములు వచ్చినను ఉద్వేగరహితుడు (ఏమాత్రమూ తొణకనివాడు). తాను చూచిన, వినిన ఇహపరలోకవిషయములను నిస్సారముగ, అసత్యములుగా భావించువాడు. కనుక, అతని మనస్సులో ఎట్టి ఏ వస్తువు మీదను కోరిక లేకుండెను. ఇంద్రియములు, ప్రాణములు, శరీరము, మనస్సు సర్వదా అతని అదుపులో నుండెను. అతని చిత్తములో ఎట్టి కోరికలును తలయెత్తకుండెను. అసురవంశములో జన్మించినను అసుర లక్షణములు ఏమాత్రమూ లేకుండెను.
భగవంతుని యందువలె ప్రహ్లాదుని యందు సుగుణములు అనంతములు. వాటిని మహాత్ములు ఎల్లప్పుడును వర్ణించుచు, వాటిని అలవరచుకొనుచుండిరి. అయినను నేటివరకు అవి మొక్కవోని రీతిలో విరాజిల్లుచున్నవి.
మహారాజా! దేవతలు అసురులకు శత్రువులేయైనను వారు భగవద్భక్తుల గాధలను చర్చించు సభలయందు ప్రహ్లాదునే దృష్టాంతముగా తీసికొనుచుండెడివారు. ఇక మీవంటి భగవద్భక్తులు అతనిని ఆదర్శవ్యక్తిగా భావించుటలో ఆశ్చర్యము ఏముండును?
ప్రహ్లాదుని గుణగణములు ఇన్ని అని చెప్పుటకు వలను పడదు. అతని మహత్త్వమును వర్ణించుటకు అలవికాదు. ఇంతయేల? భగవంతుడైన వాసుదేవునియందు అతనికిగల భక్తి స్వాభావికమైనది. పుట్టుకతోడనే అబ్బినది. అది మహత్త్వపూర్ణమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
ధర్మరాజా! ప్రహ్లాదుడు బాల్యము నుండియే ఆటపాటలు మాని భగవద్ధ్యానములో జడునివలె తన్మయుడు అగుచుండెడివాడు. శ్రీహరి అనుగ్రహము అతని హృదయములో నిండారియుండెను. కనుక, ఈ జగత్తుపై అతనికి ధ్యాసయే లేకుండెను.
భగవంతుడే అతనిని తన యొడిలో చేర్చుకొని ఆలింగన మొనర్చుకొనియున్నట్లు తలపోయుచుండెడి వాడు. కనుక, కూర్చున్నను, పరుండినను, ఇటునటు సంచరించుచున్నను, అన్నపానాదులను స్వీకరించుచున్నను, సంభాషించుచున్నను ఆ విషయములపై అతనికి ధ్యాసయే ఉండెడిదికాదు.
ఒక్కొక్కసారి భగవంతుడు తనకు దూరమైనట్లు భావించి దుఃఖములో మునిగి బిగ్గరగా ఏడ్చుచుండెడివాడు. మరియొకప్పుడు శ్రీహరి తనయెదుటనే ఉన్నట్లు భావించుచు ఆనందాతిరేకమున నవ్వుచుండెడి వాడు. ఎప్పుడైనను భగవద్భావనలో ఆనందానుభవమును పొంది, గానము చేయుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు ఉత్సాహముతో కేకలు పెట్టుచుండెడివాడు. కొన్ని సమయములయందు బిడియమును వీడి నాట్యము చేయుచుండెడి వాడు. భగవంతుని లీలలను గూర్చి ఆలోచించుచు తనను తానే మరచిపోయి, ఆ లీలలను అనుకరించుచుండెడివాడు. ఒక్కొక్కసారి భగవంతుని కోమల స్పర్శను అనుభవించుచు, మౌనముగా ఉండెడివాడు అప్పుడు అతడు పులకాంకితుడై కనులనుండి ఆనందాశ్రువులు స్రవించుచుండ నిమీలిత నేత్రుడగుచుండెడివాడు.
సర్వసంగ పరిత్యాగులైన భగవద్భక్తుల సాంగత్యముచే అతనికి శ్రీహరి పాదారవిందములపై భక్తి ప్రగాఢమగు చుండెను. అందువలన తాను పరమాత్మమీద లగ్నమగుటయేగాక, దుస్సాంగత్యకారణముగా దీనులైనవారి మనస్సులయందు కూడ శాంతిని చేకూర్చుచుండెను.
ధర్మరాజా! ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు. భాగ్యశాలి. మహితాత్ముడు. అట్టి సత్పుత్రునిగూడ అపరాధిగా భావించి, హిరణ్యకశిపుడు అతనిని ఇడుములపాలు చేయుటకు ప్రయత్నించెను.
యుధిష్ఠిర ఉవాచ
యుధిష్ఠిరుడు వచించెను- దేవర్షీ! నియమనిష్ఠలు గలవాడగు హిరణ్యకశిపుడు సత్పురుషుడైన ప్రహ్లాదునకు తండ్రియే యైనను పవిత్రాత్ముడైన సుతుని కష్టముల పాలు చేయుటకు కారణమేమిటో తెలిసికొనగోరుచున్నాను? తండ్రి సహజముగనే పుత్రులయెడ ప్రేమకలిగి యుండును. పుత్రులు ఒకవేళ ఏదైనను దుష్కార్యమొనర్చినచో, అతనిని దండించెదనని మందలించును. కాని, శత్రువుని వలె అతనిని ఎన్నడును వైరభావముతో చూడడు కదా! ఇంక సత్పురుషుడు, పవిత్రహృదయుడు, పెద్దలను దైవమును వలె భావించువాడు, ఐన ప్రహ్లాదుని వంటి మహాత్ముని ఎట్లు ద్వేషించును? మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు. తండ్రి తన తనయుని ద్వేషించి చంపగోరుటకు కారణమేమి? దయతో నా ఈ సందేహమును దీర్చుడు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్థోఽధ్యాయః (4)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు నాలుగవ అధ్యాయము (4)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
No comments:
Post a Comment