శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....41 వ, శ్లోకము ..
శ్లో .. ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥
ప్రతిపదార్థం :
374) ఉద్భవః = సృష్టి ఉద్భవ స్థితికి మూలకారణమైనవాడు.
375) క్షోభణః = వర్తమాన ప్రకృతి లో స్త్రీ , పురుష సమాగమన సమ్మోహనా ప్రేరణలను కలిగించి అభినవ జీవజాతుల సంతతీ సంభవ కారకుడు.
376) దేవః = దైవాత్మ.
377) శ్రీగర్భః = లక్ష్మీదేవిని (విశ్వ సంపదను) తన గర్భంలో (హృదయం) లో నుంచుకున్నవాడు.
378) పరమేశ్వరః = పరమ ప్రభువు.
379) కరణం = జగత్తుకు మూలమైన వాడు.
380) కారణం = సమస్త సృష్టికి కారణమైనవాడు.
381) కర్తా = తానే సమస్త జగత్తుకు జీవ కర్త.
382) వికర్త = ఈ బ్రహ్మాండం లోని సర్వ సాకారాలకూ, వికారాలకూ కర్త ఆయనే.
383) గహనః = అవగాహనకు, అత్యంత కష్ట సాధ్యమైనవాడు.
384) గుహః = జీవాత్మ గా జీవుల మనో గుహాల్లో ఉండేవాడు.
41. సీస
ఉద్భవ ఉజ్వల ఉన్నత లక్ష్యము
క్షోభణ శ్రీ గర్భ పూజ్య భవము
పరమేశ్వర కరుణ పాశము బంధము
కారణ మేమన కర్త భవము
దైవత్మ జ్ఞానము దైవంబు తీరుగా
శ్రీధరా శ్రీకరా సృష్టి కర్త
గుహవికర్త గహన పుడమి గాంచగలుగు
బ్రహ్మాండ లీలలు రమ్యత భవ
ఆంధ్ర పద్యము:
తె. గీ. సృష్టి యుద్భవ కారక, సృజన క్షోభ
ణలకు ప్రేరణ దైవాత్మ జ్ఞాన కరణ
శ్రీధర, పర మేశ్వర, సర్వ సృష్టి కర్త,
గహన, గుహ వికర్త, నిమిత్త, గడన నీకు
41.సవరించిన భావసారాంశం:
సృష్టి ఉద్భవానికి పరమేశ్వరుడు కారణభూతుడు. శ్రీగర్భమైన లక్ష్మీదేవి దైవవైభవానికి ప్రతీక. జీవనమనోగుహలో కలిగే వికారాలను అధిగమించి, దైవాత్మజ్ఞానాన్ని పొందాలి. శ్రీధరుని సృష్టిశక్తి, కరుణ, బ్రహ్మాండలీలలు విశ్వమంతటా రమ్యతను నింపుతున్నాయి.
పద్యభావము :
సృష్టి ఉద్భవ స్థితికి మూలకారణమైనవాడు. వర్తమాన ప్రకృతిలో స్త్రీ పురుష సమాగమన సమ్మోహనల ప్రేరణతో అభినవ జీవజాతుల సంభవ కారకుడైన వాడు. దైవాత్మ. లక్ష్మీదేవిని (విశ్వ సంపదను) తన గర్భంలో (హృదయం) లో నుంచు కున్నవాడు. పరమ ప్రభువు. జగత్తుకు మూలమైన వాడు. సమస్త సృష్టికి కారణమైనవాడు. సమస్త జగత్తుకు జీవ కర్త తానే. ఈ బ్రహ్మాండం లోని సర్వ సాకారాలకూ, వికారాలకూ కర్త ఆయనే. అవగాహనకు, అత్యంత కష్ట సాధ్యమైనవాడు. జీవాత్మ గా జీవుల గుండె గుహాల్లో కొలువైన వాడు. అటువంటి నీకు సంస్తుతి దేవా! ---
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....42 వ, శ్లోకము ..
శ్లో .. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥
ప్రతిపదార్థం:
385) వ్యవసాయం (వి + అవ + సో + ఘఇఞ్-వ్యవసాయం)=విశిష్టమైన
నిశ్చయముతో కూడిన ప్రయత్నమును – వ్యవసాయమంటారు. గమ్య
సాధన కోసం చేసే 'జ్ఞాన' సంపాదనా మార్గాన్నిచూపు కృషీవలుడు.
386) వ్యవస్థానః=విశ్వ వ్యవహారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించేవాడు.
387) సంస్థానః=సమస్త జీవుల సుపరిపాలనకు గమ్యస్థానమైనవాడు.
388) స్థానదః = జీవుల స్థితిని వారి అర్హతను బట్టి సంస్కరించువాడు.
389) ధ్రువః= సత్య నిత్యుడు – సర్వ కాలమందునూ స్థిరమైనవాడు.
390) పరర్థిః = (పర-శ్రేష్ఠమైన, అర్థి =సంపన్నుడు) = అత్యున్నతమైన ఐశ్వర్యవంతుడు.
391) పరమస్పష్టః=సుస్పష్టంగా నిరూపితమైన వాడు.
392) తుష్టః=జీవుల నిమిత్త కర్మాచరణలతో సంతుష్టి చెందువాడు.
393) పుష్టః= సర్వ సంపూర్ణ గుణ శక్తితో జగత్తునంతటినీ వృద్ధి పరచు వాడు.
394) శుభేక్షణః=శుభకరమైన ప్రసన్నతా దృష్టి తో జీవులను అలరార్చువాడు.
42. సీస
జ్ఞానసంపాదనా జ్ఞప్తిసంస్థానము
ధ్రువ పరర్దిగా పుష్ట తుష్ట
గమ్యసాధన విద్య గమన మార్గపు భక్తి
స్థానద సంస్థాన
శాంతి పధము
నిత్య సుభేక్షణ నిర్మల భవభావ
అంతయు సమమగు అక్షరమగు
వ్యవసహాయాత్మగా వ్యాక్య పరము తీరు
పరమస్పష్ట కళలు పాఠ్య మగుట
తె. గీ. వ్యవసహాయతాత్మ, వ్యవస్థ, వర్ధ మాన,
స్థానద, ధ్రువ, సంస్థాన, పావన, పరర్థి,
పరమ స్పష్ట, తుష్ట శుభేక్షణా, రమేశ,
అంతయూ నీవ స్వామి నీకంజ లిడుదు
42\. సీస పద్య భావ విశ్లేషణ
జ్ఞానసంపాదనా జ్ఞప్తిసంస్థానము జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దానిని జ్ఞాపకంలో నిలుపుకోవడం మనస్సుకు స్థిరమైన స్థానాన్ని కల్పిస్తుంది.
ధ్రువ పరర్దిగా పుష్ట తుష్ట ధ్రువమైన, ఉన్నతమైన భావాలతో జ్ఞానం పుష్టిని, తృప్తిని కలిగిస్తుంది.
గమ్యసాధన విద్య గమన మార్గపు భక్తి విద్య గమ్యసాధనకు మార్గం. ఆ మార్గంలో భక్తి తోడైతే ప్రయాణం సార్థకమవుతుంది.
స్థానద సంస్థాన శాంతి పధము జ్ఞానం, భక్తి మనిషికి స్థిరమైన స్థానాన్ని, శాంతిమార్గాన్ని ప్రసాదిస్తాయి.
నిత్య సుభేక్షణ నిర్మల భవభావ నిత్యమూ శుభదృష్టితో, నిర్మలమైన భావాలతో జీవించాలి.
అంతయు సమమగు అక్షరమగు సమత్వభావం అక్షరసత్యంగా నిలిచి, జీవితమంతటా వ్యాపించాలి.
వ్యవసహాయాత్మగా వ్యాక్య పరము తీరు వ్యవహారంలో సహాయకరమైన ఆత్మభావంతో, వాక్యప్రయోగంలో స్పష్టతతో ఉండాలి.
పరమస్పష్ట కళలు పాఠ్య మగుట స్పష్టమైన కళలు, భావాలు విద్యాబోధనకు పాఠ్యాంశాలుగా నిలవాలి.
పద్య భావము:
గమ్య సాధన కోసం చేసే 'జ్ఞాన' సంపాదనా మార్గాన్నిచూపు కృషీవలుడు. విశ్వ వ్యవహారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించేవాడు. సమస్త జీవుల సుపరిపాలనతో గమ్యస్థానమును చూపు వాడు. జీవుల స్థితిని వారి అర్హతను బట్టి సంస్కరించువాడు సత్య నిత్యుడు – సర్వ కాలమందునూ స్థిరమైన వాడు; అత్యున్నతమైన ఐశ్వర్యవంతుడు. సుస్పష్టంగా నిరూపితమైన వాడు. జీవుల నిమిత్త కర్మాచరణలతో సంతుష్టి చెందువాడు. సర్వ సంపూర్ణ గుణ శక్తితో జగత్తునంతటినీ వృద్ధి పరచు వాడు. శుభకరమైన ప్రసన్నతా దృష్టి తో జీవులను అలరార్చువాడు . అట్టి నీకు నా నమస్కారము స్వామీ. –
ఈ శ్లోక ప్రత్యేకం: జీవితంలో ఉన్నతి, వృత్తిపరమైన స్థిరత్వం ఆశించేవారు ఈ 42వ శ్లోకాన్ని నిత్యం అర్థవంతంగా పఠించడం - అత్యంత ఫలప్రదమని చాలా మందిలో నిరూపించ బడింది.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....43 వ, శ్లోకము ..
రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః ।
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥
ప్రతిపదార్థం:
395) రామః = "రమంతే సర్వభూతాని అస్మిన్ ఇతి రామః"-ఎవ్వరి వలన సమస్త
ప్రాణులు ఆనందాన్ని పొందుతాయో ఆయనే రాముడు. తన కళ్యాణ గుణాలతో,
సుందర రూపంతో లోకంలోని అందరికీ సంతోషాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించే
వాడే ఆయన.
396) విరామః =సర్వ ప్రాణులకూ పుట్టుకేలాగో, సమయుటలాగే – జీవన్ముక్తి నిచ్చు విరామకారుడు.
397) విరజః =వి-లేని, రజః – రజము – మలినము, దుమ్ము. అమలినమైన అత్యంత పరిశుద్ధుడు.
398) మార్గః = జీవుల నిమిత్త మారాగానికి దారి ఆయనే.
399) నేయః = "నేతుం యోగ్యః ఇతి నేయః"-జీవులను తన జ్ఞానము చేత తమ తమ గమ్యములకు నడిపించువాడు-పరమాత్మ.
400) నయః = "నీయతే అనేన ఇతి నయః" – జీవులు చేరవలసిన ఆ గమ్యము -తానే.
401) అనయః = ఒక సరియైన నిర్దేశత తనకు మాత్రము లేని ‘విధి అనే నియంత ’-తానే.
402) వీరః = విక్రముడు. ఎవరైతే తన పరాక్రమంతో శత్రువులను నిర్జించి, లోకాన్ని రక్షిస్తారో
ఆయనే వీరుడు .
403) శక్తిమతాం శ్రేష్ఠః = "బలవంతులందరిలోనూ అత్యంత శ్రేష్ఠుడు-గొప్పవాడు"- శ్రీ మహా విష్ణువు.
404) ధర్మః = "ధారయతి ఇతి ధర్మః" - ఏది సమస్త ప్రాణులను రక్షిస్తుందో అదే 'ధర్మము'
- సకల జీవులను పోషించు ఆ ధర్మమే – తానైన వాడు.
405) ధర్మవిదుత్తమః = "ధర్మవిదాం ఉత్తమః ధర్మవిదుత్తమః" — ధర్మమును తెలిసిన వారందరిలోనూ అత్యంత శ్రేష్ఠుడైనవాడు.
43. సీస
రామవిరామ సరాగసమయ భావ
విరజ మార్గ భవము నేయ మదియు
నయ అనయ విధము నమ్మ వీర భవము
శక్తి మతాం శ్రేష్ట సమయ విలువ
ధర్మ విదుత్తమ ధర్మా చరణ బంధ
విదిత గమ్య మనసు వివరణగను
జీవన్ముక్తి పరుడు జీవుల స్థితిపరా
లోకాన్ని రక్షిత లోక నాధ
ఆంధ్ర పద్యము:
తె. గీ. రాముడు, విరామకారుడు, రహ విదురుడు;
విరజుడు, విదిత గమ్య వివరణ నేయ;
నయ, అనయ, ధర్మ, ధర్మ జ్ఞాన పరమేశ;
వీర, శక్తిమతాం శ్రేష్ఠ, వినుతి నీకు.
3. సీస పద్యం — విష్ణు సహస్రనామ ఆధారిత భావం
రామవిరామ — రామనామం, విశ్రాంతి లేదా పరమశాంతి ప్రసాదించే విష్ణుస్వరూపం.
సరాగసమయ భావ — అనురాగం, సమయోచితమైన దైవభావం.
విరజ మార్గ — నిర్మలమైన, రజోగుణరహిత మార్గం.
నయ అనయ విధము — న్యాయాన్యాయాలను, ధర్మాధర్మాలను గుర్తించే వివేకం.
వీరభవము — వీరత్వం, ధైర్యం.
శక్తిమతాం శ్రేష్ఠ — శక్తిమంతులలో శ్రేష్ఠుడైన పరమాత్మ.
ధర్మవిదుత్తమ — ధర్మాన్ని తెలిసినవారిలో ఉత్తముడు.
ధర్మాచరణ బంధ — ధర్మాచరణకు కట్టుబడిన జీవన విధానం.
విదిత గమ్య మనసు — పరమగమ్యాన్ని తెలిసిన జ్ఞానమనస్సు.
జీవన్ముక్తి పరుడు — ముక్తిని ప్రసాదించే పరమాత్మ.
పద్యభావం:
తన కళ్యాణ గుణాలతో, మనోరమ రూపంతో లోకంలోని అందరికీ సంతోషాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించే రాముడు - ఆయన. సర్వ ప్రాణులకూ పుట్టుకేలాగో, సమయుటలాగే – జీవన్ముక్తి నిచ్చు విరామకారుడు. అమలినమైన అత్యంత పరిశుద్ధుడు. జీవుల నిమిత్త మార్గానికి దారి ఆయనే. తన జ్ఞానము చేత తమ తమ గమ్యములకు నడిపించువాడు-పరమాత్మ. జీవులు చేరవలసిన ఆ గమ్యము -తానే. ‘విధి అనే నియంత ’-తానే. ఎవరైతే తన పరాక్రమంతో శత్రువులను నిర్జించి, లోకాన్ని రక్షిస్తారో ఆయనే వీరుడు. "బలవంతులందరిలోనూ అత్యంత శ్రేష్ఠుడు-గొప్పవాడు. సకల జీవులను పోషించు ఆ ధర్మమే – తానైన వాడు. ధర్మమును తెలిసిన వారందరిలోనూ అత్యంత శ్రేష్ఠుడైనవాడు. అటువంటి నీకు నమస్సులు.---
శుభోదయము.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....44 వ, శ్లోకము ..
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥
406) వైకుణ్ఠః = వై – తొలగించిన, కుంఠః - ఆటంకములు, అడ్డంకులు, వైకల్యము, (జీవుల పరస్పర ప్రయాణ మార్గాలలో లేదా, సృష్టి గతులు/అడ్డంకులు). యస్మాత్ సః (యస్య) = ఎవరి వలన అయితే జరిగాయో, సః = ఆ పరమాత్ముడే... వైకుంఠః = వైకుంఠుడు (భూమి, నీరు, వాయువు వంటి పంచభూతాలను సృష్టించేటప్పుడు వాటి పరస్పర కలయికకు ఎటువంటి అడ్డులేకుండా చేసి, లయబద్ధంగా కలిపి నడిపించువాడు.
407) పురుషః = పురు- శరీరము (లోని), ష- విజ్ఞత, -అదే జీవాత్మ – అంతర్బలము
408) ప్రాణః = సమస్త జీవుల లోని ప్రాణ శక్తి, మరియు నిర్జీవుల లోని ధాతు శక్తి – అది తానై
విశ్వాన్ని నడిపించేవాడు (చేతనా శక్తి).
409) ప్రాణదః = జీవుల్లో ప్రాణశక్తిని ప్రసాదించేవాడు.
410) ప్రణవః = ఓంకార స్వరూపుడు – పరమాత్మ ప్రతీక.
411) పృథుః = విశ్వమంతా విస్తరించి ఉన్న మహా వ్యాపితుడు.
412) హిరణ్యగర్భః = బ్రహ్మాండాల సంస్థితికి కారణమైన హిరణ్యమును (ద్రవ్య శక్తి ) తనలో కలిగిన వాడు.
413) శత్రుఘ్నః= శత్రు-అజ్ఞాన మనే వైరిని, ఘ్న – రూపుమాపి ధర్మమార్గమును జూపువాడు.
414) వ్యాప్తః = బహుళ శక్తి రూపంలో సమస్త జగత్తులో అంతటా నిండి ఉన్నవాడు.
415) వాయుః = వాయు రూపంలో ఉండి సమస్త జీవులకు ప్రాణాధార మైన వాడు.
416) అధోక్షజః (అధః -నిగ్రహించిన, అక్ష-ఇంద్రియ, జః -పుట్టిన (జ్ఞానము) = ఇంద్రియ జ్ఞానావగాహనకు అందని వాడు-కంటికి కనిపించనిశక్తి స్వరూపుడు.
44.సీస
వైకుంఠ పురుషుడు కైంకర్య ధీరుడు
ప్రణవ నాద పరుడు ప్రభలు తీరు
ప్రాణదా ప్రముఖగా ప్రదాణ్య తాభావ
ప్రాణ ప్రభావమే ప్రీతి గొలుపు
హిరణ్యగర్భుడు హితము పంచగలుగు
శత్త్రుగ్న సర్వార్ధ శాంతి దాత
అంతర్భలముగాను అక్షర సత్యమై
వాయు అదోక్షజ వ్యాప్త పృథడు
ఆంధ్ర పద్యము:
తె. గీ. ప్రాణ పురుష, వైకుంఠుడ; ప్రాణ దాత,
ప్రణవ, ప్రత్యయ; పృథునాథ, ప్రణుత ప్రభువ,
వర హిరణ్యగర్భుడవీవు, వాయు దేవ,
ఓ యధోక్షజ, శత్రుఘ్న దయను జూపు!
ప్రాణదా ప్రముఖగా ప్రదాణ్య తాభావ
ప్రాణ ప్రభావమే ప్రీతి గొలుపు
ప్రాణాలను ప్రసాదించేవాడు, జీవుల ప్రాణశక్తికి ఆధారమైనవాడు. ఆయన ప్రాణప్రభావమే జీవులలో ప్రేమ, ఆనందం, జీవనోత్సాహాన్ని కలిగిస్తుంది.
హిరణ్యగర్భుడు హితము పంచగలుగు
శత్త్రుగ్న సర్వార్ధ శాంతి దాత
హిరణ్యగర్భుడై సృష్టికి మూలమైనవాడు. హితాన్ని ప్రసాదించేవాడు. శత్రువులను సంహరించేవాడు; సమస్త ప్రయోజనాలను, శాంతిని అందించే దైవం.
అంతర్భలముగాను అక్షర సత్యమై
వాయు అదోక్షజ వ్యాప్త పృథడు
అంతర్గత శక్తిగా నిలిచి, నాశనం కాని అక్షరసత్య స్వరూపుడై ఉంటాడు. వాయువువలె సర్వవ్యాపకుడై, ఇంద్రియాలకు అందని అదోక్షజుడిగా విశ్వమంతటా వ్యాపిస్తాడు.
పద్యభావం:
భూమి, నీరు, వాయువు వంటి పంచభూతాలను సృష్టించేటప్పుడు వాటి పరస్పర కలయికకు ఎటువంటి అడ్డులేకుండా చేసి, లయబద్ధంగా కలిపి నడిపించువాడు. జీవాత్మ – అంతర్బలము
సమస్త జీవుల లోని ప్రాణ శక్తి, మరియు నిర్జీవుల లోని ధాతు శక్తి – అది తానై విశ్వాన్ని నడిపించు వాడు (చేతనా శక్తి). జీవుల్లో ప్రాణశక్తిని ప్రసాదించేవాడు. ఓంకార స్వరూపుడు – పరమాత్మ ప్రతీక.
విశ్వమంతా విస్తరించి ఉన్న మహా వ్యాపితుడు. = బ్రహ్మాండాల సంస్థితికి కారణమైన హిరణ్యమును (ద్రవ్య శక్తి ) తనలో కలిగిన వాడు. శత్రు-అజ్ఞాన మనే వైరిని, ఘ్న – రూపుమాపి ధర్మమార్గమును జూపువాడు. బహుళ శక్తి రూపంలో సమస్త జగత్తులో అంతటా నిండి ఉన్నవాడు.
వాయు రూపంలో ఉండి సమస్త జీవులకు ప్రాణాధార మైన వాడు. ఇంద్రియ జ్ఞానావగాహనకు అందని వాడు.
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....45 వ, శ్లోకము ..
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥
ప్రతిపదార్థము:
417) ఋతుః = కాలగమనమున, ఋతు మార్పిడులతో విశ్వాన్ని క్రమబద్ధంగా నడిపించేవాడు.
418) సుదర్శనః = సర్వ జీవ సృష్టికి శుభప్రదమైన దృష్టిని (మంచి జ్ఞానాన్ని) ప్రసాదించేవాడు.
419) కాలః = సృష్టి సమన్యాయం కోసం – సదా నవ నవోన్మేష ప్రమాణ ప్రతిపత్తి కోసం పురాతనాలను సమయ దీర్చి, విలీన మైన ఆ ధాతు శక్తితో నూతన జీవ సంతతీ చైతన్యాలతో జీవుల నిమిత్త నియమితాలతో విశ్వ పరిణతిని తీర్చు వాడు.
420) పరమేష్ఠీ = పరమ + స్థ + ఇన్ (ప్రత్యయం). సంస్కృత వ్యాకరణ నియమాల ప్రకారం 'స్థ' ధాతువు 'ష్ఠీ'గా మారుతుంది- ఉత్కృష్టమైన స్థానంలో నిలిచి ఉండేవాడు – పరమ ప్రభువు.
421) పరిగ్రహః = పురాతనాన్ని తనలో లీనమైనట్లు పరగ్రహించి- నూతన జీవన సృష్టికి నాంది పలుకు వాడు.
422) ఉగ్రః =దుష్టుల పట్ల అత్యంత భయంకరమైన రూపం ధరించి వారిని నాశనము జేయువాడు.
423) సంవత్సరః =కాల స్వరూపమైన సంవత్సరాలుగా – కాలచక్ర పరిభ్రమణల విశ్వ భాండాలను జీవుల కనుకూల పరచువాడు.
424) దక్షః =సమస్త జగత్తును సృష్టించడం, రక్షించడం మరియు లయం చేయడం వంటి పనులను అత్యంత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించగల సర్వసమర్థుడు.
425) విశ్రామః = జీవులను వారి నిమిత్త కార్యాల పిదప ఐహికముల నుండి విముక్తి పరచి, పరమ శాంతిని ప్రసాదించేవాడు.
426) విశ్వదక్షిణః =విశ్వంలో జరిగే సమస్త కర్మలకు లేదా సదాచారాలకు తానే దక్షితుడుగా ఉండువాడు.
45. సీస
ఋతుడవు రుద్రుడవు ఋషుల రక్షకుడవు
కాల సుదర్శన గమ్యధీర
పరమేష్టి పరిగ్రహ పరమాత్మ లీలలై
ఉగ్ర సంవత్సర ఉగ్రుడుగను
విశ్వ దక్షిణ గాను విశ్వనేతగనౌను
దక్ష దీక్షగ నున్న ధరణి నాధ
కాల చక్ర మయము కాంచన ధారిగా
సర్వ సమర్ధత సాక్షి గాను
ఆంధ్ర పద్యము:
తె. గీ. ఋతుడవు, సుదర్శనుడవు కాల తుర నియత
నిష్ఠ, పరమేష్ఠి, ఉగ్రుడు, నీవ, దేవ
దక్షుడవు, పరిగ్రహ, విశ్వ దక్షిణుడవు
నీవె, సంవత్సర, విరామ నీకు వినుతి
45\. సీస పద్యం – విష్ణు సహస్రనామ
భావం:
నీవు సత్యధర్మ స్వరూపుడవు. రుద్రరూపుడవై దుష్టశక్తులను అణచి, ఋషులను రక్షించేవాడవు.
కాలచక్రాన్ని నడిపించే సుదర్శన స్వరూపుడవు. సమస్త జీవుల గమ్యాన్ని నిర్దేశించే ధీరుడు
పరమాత్మ స్వరూపుడవై సృష్టి వ్యవహారాలను దైవలీలగా నిర్వహించేవాడవు.
కాలప్రభావంలో ఉగ్రత్వాన్ని ప్రదర్శించే శక్తివంతుడవు. అధర్మాన్ని నిర్మూలించే ఉగ్రస్వరూపుడవు.
విశ్వవ్యవస్థలో దక్షత కలిగినవాడవు. సమస్త జగత్తుకు నాయకుడవు.
దక్షతతో కూడిన సంకల్పశక్తి కలిగిన భూమినాథుడవు.
కాలచక్ర స్వరూపుడవై, బంగారు కాంతివలె ప్రకాశించే దివ్య తేజస్సును ధరించినవాడవు.
సర్వశక్తిమంతుడవై సమస్త జగత్తు కార్యకలాపాలకు సాక్షిగా నిలిచేవాడవు.
భావం
కాలగమనమున, ఋతు మార్పిడులతో విశ్వాన్ని క్రమబద్ధంగా నడిపించేవాడు. సర్వ జీవ సృష్టికి శుభప్రదమైన దృష్టిని (మంచి జ్ఞానాన్ని) ప్రసాదించేవాడు. జీవ సంతతీ చైతన్యాలతో వారి నిమిత్త నియమితాలతో విశ్వ పరిణతిని తీర్చు వాడు. పరమేష్ఠి (పరమప్రభువు). పురాతనాన్ని తనలో లీనమయేట్లు పరిగ్రహించి- నూతన జీవన సృష్టికి నాంది పలుకు వాడు. దుష్టుల పట్ల అత్యంత భయంకరమైన రూపంగా వారిని నాశనము జేయువాడు. కాల స్వరూపమైన సంవత్సరంగా – కాలచక్ర పరిభ్రమణలతో విశ్వ భాండాలను జీవుల కనుకూల పరచువాడు. సమస్త జగత్తును సృష్టించడం, రక్షించడం మరియు లయం చేయడం వంటి పనులను అత్యంత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించగల సర్వసమర్థుడు. జీవులకు వారి నిమిత్త కార్యాచరణములు ముగియగానే ఐహికముల నుండి విముక్తి పరచి, వారికి పరమ శాంతిని ప్రసాదించేవాడు. విశ్వంలో జరిగే సమస్త కర్మలకు లేదా సదాచారాలకు తానే దక్షితుడుగా ఉండువాడవైన నీకు నమస్కారము. ---
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....46 వ, శ్లోకము ..
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥
ప్రతిపాదార్థము:
ప్రతిపదార్థము (పదాల అర్థాలు):
427) విస్తారః = విశ్వమంతా విస్తరించి యున్నవాడు.
428) స్థావరః = సమస్త చరాచరానికి స్థావరమైనవాడు- సమస్తాశ్రితుడు.
429) స్థాణుః = తన యూనికిని ఎల్లప్పుడూ సృజనాత్మకుడై సుస్థిర పరచుకొను వాడు
430) ప్రమాణం = సత్యజ్ఞానానికి ప్రమాణమైనవాడు.
431) బీజమవ్యయం = సృష్టికి మూల కారణమైనవాడు- బీజాత్మకుడు.
432) అర్థః =అర్+ర్థ, అరణే జ్ఞానే తిష్ఠతి; సృష్టి పోషణార్థములను సమకూర్చువాడు.
433) అనర్థ =నిమిత్త పరిపూర్ణతన జీవులను అనర్థ పరచి తనలో విలీనపరచు వాడు.
434) మహాకోశః = "మహాంతః కోశాః అస్య సః మహాకోశః"– అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశములూ తానే యైన పరమాత్మ.
435) మహాభోగః = పరమానంద స్వరూపమై జీవులకు ఆనందాన్ని ప్రసాదించువాడు
436) మహాధనః = మహాధనుడు-సర్వ సంపదా తానే అయినవాడు.
46. సీస
విస్తార వినిమయ విజ్ఞాన స్థావర
స్థాణు సకామ్యము సాధు ప్రభువు
బీజ మవ్యయ మూల పోషణార్ధతగను
అర్ధ మనార్ధమ హామయండు
ఇచ్చమహాకోశ ఇచ్ఛమహాభాగ
ఇచ్ఛ మహాధన ఇష్ట సౌరి
పంచకోశములుగా పరమాత్మ తత్త్వమ్ము
సత్య ధర్మా జ్ఞాన సమయ స్థాణు
ఆంధ్ర పద్యము:
తె. గీ. స్థావరుడవు , విస్తారుడ వీవ, స్థాణు,
అర్థము ననర్థము, మహాధనతరిదాల్పు
ఈశ, బీజమవ్యయ, మహా కోశ, శౌరి,
ప్రభు, మహాబోగ, నీకుమా ప్రణుతి తతులు
46.భావము
విస్తారమైన విజ్ఞానానికి, వినిమయానికి పరమాత్మయే ఆధారం. స్థాణువుగా, స్థిరమైన తత్త్వంగా నిలిచి, సకామ జీవుల కోరికలను సాధించే సాధుప్రభువుగా ఉంటాడు.
అవ్యయమైన బీజమై, సమస్త సృష్టికి మూలంగా నిలిచి, జీవుల పోషణకు అవసరమైన శక్తిని అందిస్తాడు. అర్థవంతమైన జీవనానికి, అనర్థాలను తొలగించడానికి మూలాధారమవుతాడు.
ఇచ్ఛాశక్తితో మహాకోశమై, మహాభాగ్యాన్ని ప్రసాదించే మహాధనమై, ఇష్టమైన సౌరి తత్త్వంగా వెలుగొందుతాడు.
పంచకోశాల ద్వారా పరమాత్మ తత్త్వం జీవిలో వ్యక్తమవుతూ, సత్యం, ధర్మం, జ్ఞానం అనే విలువలతో సమయానుగుణంగా స్థిరమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతుంది.
పద్య భావము:
విశ్వమంతా విస్తరించి యున్నవాడు. సమస్త చరాచరానికి స్థావరమైన సమస్తాశ్రితుడు.
తన యూనికిని ఎల్లప్పుడూ సృజనాత్మకుడై సుస్థిర పరచుకొను వాడు. సత్యజ్ఞానానికి ప్రమాణమైనవాడు. సృష్టికి మూల కారణమైనవాడు- బీజాత్మకుడు. సృష్టి పోషణకు కావలిసిన జీవార్థాలను సమకూర్చువాడు. నిమిత్త పరిపూర్ణతన జీవులను, అనర్థ పరచి తనలో విలీనపరచు కొనువాడు. (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే)- పంచకోశములూ తానే యైన పరమాత్మ. పరమానంద స్వరూపమై తానే జీవులకు ఆనందాన్ని ప్రసాదించువాడు. సర్వ సంపదా తానే అయిన మహాధనుడైన భావనుడికి ప్రార్థనలు.
---
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....47 వ, శ్లోకము ..
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥
ప్రతిపదార్థము:
437) అనిర్విణ్ణః = న+నిర్విణ్ణః – అనిర్విణ్ణః - స్థిత ప్రజ్ఞత కలిగిన, కలిగించిన వాడు.
438) స్థవిష్ఠః = విశ్వ విశాల రూపముతో విరాజిల్లువాడు.
439) భూః = సమస్త చరాచర జగత్తుకు భూధరాశ్రయము తానైన వాడు.
440) ధర్మయూపః = సర్వ ధర్మముల ప్రతిష్ఠాపనాధారభూత సంస్థిత స్తంభము తానే.
441) మహామఖః = సంస్కృతంలో "మఖ" అంటే వైభవము, శక్తి లేదా దానగుణము అని అర్థం.
మహా మఖ – సృష్టిప్రగతి కోసం – సర్వమూ సమకూర్చిన మహా కారుణ్య మూర్తి.
442) నక్షత్రనేమిః =నక్షత్ర- సమస్త నక్షత్ర మండలములకు – నేమి – కేంద్రమైన వాడు.
443) నక్షత్రీ = న క్షరతి ఇతి నక్షత్రం- నాశనము లేనిది, నక్షత్రం – సుస్థిర మహా బ్రహ్మాండాల నన్నిటినీ శాసించువాడు.
444) క్షమః = సృష్టి సమస్త కర్మలనూ ఓర్పుతో చక్కబెట్టగల సమర్థుడు.
445) క్షామః = పురాతన సృష్టిని రుగ్మతలతో, ప్రళయాలతో నశింప జేసి, తనలో లీనం చేసుకొని – ఆ ధాతుజాలం నుంచి నూతన జీవ జాలమును విశ్వంలో కొత్త చైతన్యాన్ని నింపు వాడు.
446) సమీహనః = సమ్ (చక్కగా) + ఈః + ల్యూట్ (అన్వయం) ప్రత్యయం చేరడం వల్ల 'సమీహన' అనే రూపం ఏర్పడుతుంది. పుంలింగంలో ఇది 'సమీహనః' అవుతుంది-
అనగా చక్కగా లేదా గట్టిగా ప్రయత్నించడం- సృష్టి, స్థితి, లయల, జీవ ధర్మ కార్యములను చక్కగా నెరవేర్చువాడు.
47 సీస
స్థితిప్రజ్ఞగలిగి విశ్వ విశాలుడు
సర్వ ధర్మము గాను సమయ సాక్షి
గుణసంపదాశక్తి సుకృత కాల మయము
నక్షత్ర మండల నయన సాక్షి
కర్మల తీరుగా కార్య సమర్ధత
క్షేమము చేకూర్చ నేత సాక్షి
నిత్య సమీహన నిర్మల బవుడుగా
వివిధ ప్రశస్తిగా వినయ సాక్షి
ఆంధ్రపద్యము:
తె. గీ. భువి, స్థవిష్ఠ, అనిర్విణ్ణ భువుడవీవు,
ధర్మయూప, మహామఖ, దానవారి;
క్షమి, సమీహన, నక్షత్ర నేమి, క్షామ,
విధుడవీవ, నక్షత్రీ, వివిధ ప్రశస్తి.
47. భావం
స్థిరమైన జ్ఞానం, విశాలమైన హృదయం, ధర్మనిష్ఠ, గుణసంపద, కార్యదక్షత, క్షేమదాయకమైన నాయకత్వం, నిర్మలత్వం, వినయం వంటి సద్గుణాల సమాహారమే ఆదర్శ వ్యక్తిత్వం.
కాలానికి, కర్మలకు, విశ్వగమనానికి సాక్షిగా నిలుస్తూ, సమస్త జీవుల శ్రేయస్సును కోరే మహత్తర చైతన్యాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తోంది.
పద్యభావము:
స్థిత ప్రజ్ఞత కలిగిన, కలిగించిన వాడు. విశ్వ విశాల రూపముతో విరాజిల్లువాడు. సమస్త చరాచర
జగత్తుకు ధరాశ్రయము తానైన వాడు. సర్వ ధర్మముల ప్రతిష్ఠాపనాధారభూత సంస్థిత స్తంభము తానే. సృష్టిప్రగతి కోసం – సర్వమూ సమకూర్చిన మహా కారుణ్య మూర్తి. నక్షత్ర- సమస్త నక్షత్ర మండలములకు – నేమి – కేంద్రమైన వాడు. సుస్థిర మహా బ్రహ్మాండాల నన్నిటినీ శాసించువాడు. సృష్టి సమస్త కర్మలనూ ఓర్పుతో చక్కబెట్టగల సమర్థుడు. పురాతన సృష్టిని రుగ్మతలతో, ప్రళయాలతో నశింప జేసి, తనలో లీనం చేసుకొని – ఆ ధాతుజాలం నుంచి నూతన జీవ జాలమును విశ్వంలో కొత్త చైతన్యాన్ని నింపు వాడు. సృష్టి, స్థితి, లయల, జీవ ధర్మ కార్యములను చక్కగా నెరవేర్చువాడు. – రాజశేఖరు సామల.
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....48 వ, శ్లోకము ..
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ 48 ॥
ప్రతిపదార్థము:
447) యజ్ఞః= సృష్టి, స్థితి, లయలనే త్రివృత్తులను నిష్ఠగా సమయానుగుణంగా సమర్థ వంతంగా ఒక క్రతువుగా నిర్వహించువాడు.
448) ఇజ్యః= సంస్కృతంలో 'యజ్' అంటే పూజించడం, లేదా ఆరాధించడం అని అర్థం- కాబట్టి ‘ఇజ్యః -అంటే, ఆరాధించటగిన మహాత్మ. పూజ్యుడు.
449) మహేజ్యః(మహా+ఇజ్యః) = పూజింప బడేవారందరిలోకి పరమపూజ్యుడు.
450) క్రతుః=క్రతుః - అనే సంస్కృత పదానికి తెలుగులోయజ్ఞం, యాగం, సంకల్పం, బుద్ధి లేదా శక్తి అని అర్థం. అటువంటి మహా శక్తి.
451) సత్రం: సంస్కృతంలో "సద్" (సత్) అనే ధాతువు నుండి ఈ పదం ఏర్పడింది. దీనికి "కూర్చుండటం", "నివసించడం", "శ్రేష్ఠమైనది" లేదా "దానం చేయడం" అనే అర్థాలు ఉన్నాయి – జీవులకు, నిర్జీవులకూ ప్రకృతీ పథంగా ఆశ్రయం కల్పించు వాడు.
452) సతాంగతిః=సతాం – ధర్మ మార్గమున, గతిః – నడుపువాడు—ప్రాణికోటిని ఒక నిమిత్త ధర్మ గమ్యం వైపు నడిపించు వాడు.
453) సర్వదర్శి= సర్వమును సదా వీక్షించు వాడు.
454) విముక్తాత్మ = భ్రమాభూతమైన బాంధవ్యాలను విడగొట్టి విరక్తిని కలిగించువాడు.
455) సర్వజ్ఞః= అంతయూ తానే అని తెలియజేయువాడు.
456) జ్ఞానముత్తమం= ఉత్తమమైన జ్ఞానము తానే.
48. సీస
సృష్టి స్థితి లయలు కృతుల పూజ్యు డగుట
సంకల్ప బుద్ధియు శాంతి యోగ
ధర్మ మార్గముగాను ధన్యతా భవముగా
జీవ నిర్జీవుల శీఘ్ర యోగ
సర్వదర్శి కళలు సమయమార్గ మగుట
సర్వజ్ఞ జ్ఞానము సరళ యోగ
యజ్ఞపురుష యోగ యశము విముక్తత్మా
సృజనావసరమేను శృతిల యోగ
ఆంధ్ర పద్యము:
తె. గీ. యజ్ఞపురుష, ఇజ్య, మహేజ్య, విజ్ఞ విదిత,
క్రతు, సతాంగతి, సత్రమా, కమల నేత్ర,
సర్వ దర్శి, విముక్తాత్మ, సర్వ రచన,
నేమ సర్వజ్ఞ, జ్ఞానముత్తమ, విశిష్ట.
48..అంతరార్థం
సృష్టి ఒక సంకల్పం, స్థితి ఒక ధర్మం, లయం ఒక సహజ పరిణామం. వీటన్నింటినీ నడిపించేది దైవశక్తి. మానవుడు తన బుద్ధిని సంకల్పంతో, సంకల్పాన్ని ధర్మంతో, ధర్మాన్ని శాంతితో అనుసంధానించినప్పుడు జ్ఞానయోగం సిద్ధిస్తుంది. ఆ యోగమే జీవన సార్థకతకు, ఆత్మవిముక్తికి దారి చూపుతుంది.
పద్య భావం:
సృష్టి, స్థితి, లయలనే త్రివృత్తులను నిష్ఠగా సమయానుగుణంగా సమర్థ వంతంగా ఒక క్రతువుగా నిర్వహించువాడు. ఆరాధించతగిన మహాత్ముడు. పూజ్యుడు. పూజింప బడేవారందరిలోకి పరమ పూజ్యుడు. మహా శక్తి. జీవులకు, నిర్జీవులకూ ప్రకృతీ పథంగా ఆశ్రయం కల్పించు వాడు. ప్రాణి కోటిని ఒక నిమిత్త ధర్మ గమ్యం వైపు నడిపించు వాడు. సర్వమును సదా వీక్షించు వాడు. సృజనావసర భ్రమా భూతమైన బాంధవ్యాలను – వివేదనా పశ్చిమాన, వాటిని విడగొట్టి విరక్తిని కలిగించువాడు. ఉత్తమమైన జ్ఞానమూ తానే. ---
శుభోదయం .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....49 వ, శ్లోకము ..
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥
ప్రతిపదార్థము:
457) సువ్రతః (సు +వ్రతః) = ఈ చరాచర జగత్తు పై నిర్దిష్ట నియమములు గలవాడు.
458) సుముఖః (సు+ముఖః)=ప్రసన్నవదనుడు.
459) సూక్ష్మః = అతి వాడి యైన – అన్నిటి లోనికి చొరబడి వ్యాపితము కాగలవాడు.
460) సుఘోషః (సు+ఘోషః)=శుభకరమైన నాద కరుడు.
461) సుఖదః (సుఖ+దః): =ప్రకృతీ సృజన ప్రసాదాలతో, సర్వ జీవుల బ్రతుకుల్లో సుఖాన్ని ప్రసాదించు వాడు.
462) సుహృత్ (సు+హృత్)= సుమనస్కుడు.
463) మనోహరః (మనః +హరః): = మనోహరుడు.
464) జితక్రోధః (జిత+క్రోధః)- క్రోధాన్ని జయించినవాడు-శాంతాకారుడు)
465) వీరబాహుః (వీర+బాహుః): పరాక్రమముతో నిండిన బాహువులు కలవాడు.
466) విదారణః (విదారణః): ధర్మ సంస్థాపన లో దుష్టులను చీల్చి చెండాడేవాడు.
49. సీ స
సుప్రతుడు లోకాన సుముఖుడు శాంతుడు
సూక్ష్మ సుఘోషగా సూత్ర ధారి
సుమనస్క సుఖధరా సుమధుర దక్షత
సుఖద శృతిలయలు సూత్ర ధారి
వీర బాహు వినయ విద్య కృప విచారి
జితి క్రోధగ విదార జీవ ధారి
ఈచరాచరమయి నిర్ధిష్ట నిలకడా
ధర్మ సంస్థాపన ధరణి ధారి
ఆంధ్ర పద్యము:
తె. గీ. సువ్రతుడు,సుముఖుడ వీవ, సూక్ష్మ, సుఖద,
సిరివరుడ, సుఘోష, సుహృత్మురారి, భూరి,
ధర, మనోహర, జిత క్రోధ, వీర బాహు,
హరి, విదారణా నీకు సౌహార్ద్ర నుతులు
49.
సుప్రతుడైన భగవంతుడు లోకమంతటికీ సుముఖుడై, శాంత స్వభావంతో ఉంటాడు. సూక్ష్మమైన నాదాన్ని, సుఘోషమైన శబ్దాన్ని తన ఆధీనంలో ఉంచుకొని, సృష్టికి సూత్రధారిగా వ్యవహరిస్తాడు.
మంచి మనస్సు కలవాడై, సుఖాన్ని ప్రసాదిస్తూ, మధురమైన మాటతీరుతో సమర్థతను ప్రదర్శిస్తాడు. సుఖాన్ని అందించే శ్రుతి, లయల సమన్వయానికి కూడా ఆయనే సూత్రధారి.
వీరత్వం, బాహుబలం కలిగి ఉన్నప్పటికీ వినయాన్ని విడువడు. విద్యను, కృపను ప్రసాదిస్తూ, క్రోధాన్ని జయించి, జీవులను సంరక్షించే వాడిగా నిలుస్తాడు.
చరాచర జగత్తు అంతటా వ్యాపించి, నిర్దిష్టమైన నియమంతో సృష్టిని నిలబెడతాడు. ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించి, భూమిని ధర్మమార్గంలో నడిపించే ధరణీధరుడు.
పద్య భావము:
ఈ చరాచర జగత్తు పై నిర్దిష్ట నియమములు గలవాడు. ప్రసన్నవదనుడు. అన్నిటి లోనికి చొరబడి వ్యాపితము కాగలవాడు, శుభకరమైన నాద కరుడు. ప్రకృతీ సృజన ప్రసాదాలతో,
సర్వ జీవుల బ్రతుకుల్లో సుఖాన్ని ప్రసాదించు వాడు. సుమనస్కుడు. మనోహరుడు.
క్రోధాన్ని జయించినవాడు-(శాంతాకారుడు), పరాక్రమముతో నిండిన బాహువులు కలవాడు.
ధర్మ సంస్థాపన లో దుష్టులను చీల్చి చెండాడేవాడు- అయినటువంటి నీకు మా హృదయ పూర్వక వందనములు. ---
శుభోదయము :
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....50 వ, శ్లోకము ..
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥
ప్రతిపదార్థం:
467) స్వాపనః = స్వాపన – నిదుర పుచ్చు - జీవులు తమతమ నిమిత్త ములు తీరిన పిదప- వారిని దీర్ఘ నిద్ర పుచ్చి తనలో లీనం జేసుకొనువాడు.
468) స్వవశః =స్వ + వశః - ఆత్మ బోధనకు తప్ప తానెవ్వరికీ లోబడని వాడు.
469) వ్యాపీ = సర్వ వ్యాపితుడైన వాడు.
470) నైకాత్మ = నైక + ఆత్మ - తానొక్కడే – అన్ని జీవాత్మలకు కారణ భూతమైనవాడు.
471) నైకకర్మకృత్ = సృష్టి, స్థితి, లయము వంటి అనేక రకములైన లీలామానస సూత్రధారి.
472) వత్సరః = కాల ప్రమాణాంతరంగుడు.
473) వత్సలః = ప్రాణ వత్సలుడు.
474) వత్సీ = వత్స+ ఈ - తాను సృజించిన నూతన సంతతిని సంరక్షించు వాడు.
475) రత్నగర్భః = తానే సర్వాశ్రయమైన విశ్వగర్భ.
476) ధనేశ్వరః = తానే సర్వ ధన దాక్షిణ్యాలకధిపతి.
50 సీస
స్వాపన స్వవసడు సర్వదా సహకారి
వ్యాపించ నైకాత్మ వాక్య సకల
వత్సర వత్సలా వరదరాజఘనుడు
రత్న గర్భ ధరుడు రమ్య సకల
నిత్య దనేశ్వరా నిర్మల నిర్వాహ
ఆత్మ భోధకుడుగా ఆశ సకల
సర్వలక్షణ ధారి సమయ తృప్తి వినయ
ధన ధనేశ్వరుడు ధరణి సకల
ఆంధ్ర పద్యము:
తె. గీ. స్వాపన కృతాత్మ, సర్వదా స్వవశ, వ్యాపి,
నైక, కర్మకృత్నైకాత్మ సకల సవ్య,
వత్సలుడవు, వత్సీ, నీవ వత్సర వర,
రత్న గర్భ, ధనేశ్వర, రమ నివాస.
50వ సీస పద్యం – భావసూచన
* స్వాపన స్వవసడు సర్వదా సహకారి – సర్వకాలాల్లో సహకరించే, సమస్త జీవులకు విశ్రాంతినిచ్చే దైవస్వరూపుడు.
* వ్యాపించ నైకాత్మ వాక్య సకల – సమస్త జగత్తులో వ్యాపించి, ఏకాత్మ భావాన్ని తెలియజేసేవాడు.
* వత్సర వత్సలా వరదరాజఘనుడు – కాలస్వరూపుడు, వాత్సల్యమూర్తి, వరాలనిచ్చే వరదరాజు.
* రత్న గర్భ ధరుడు రమ్య సకల – రత్నగర్భమైన భూమిని ధరించి, సమస్త సౌందర్యానికి ఆధారమైనవాడు.
* నిత్య దనేశ్వరా నిర్మల నిర్వాహ – నిత్య సంపదలకు అధిపతి, నిర్మలమైన నిర్వహణకర్త.
* ఆత్మ భోధకుడుగా ఆశ సకల – ఆత్మజ్ఞానాన్ని బోధించి, సమస్త ఆశలకు ఆధారమైనవాడు.
* సర్వలక్షణ ధారి సమయ తృప్తి వినయ – సర్వశుభ లక్షణాలు కలిగి, సమయపాలన, తృప్తి, వినయాలకు ప్రతిరూపమైనవాడు.
* ధన ధనేశ్వరుడు ధరణి సకల – సమస్త సంపదలకు అధిపతి, ధరణికి ఆధారమైన పరమేశ్వరుడు.
పద్య భావము:
జీవులు తమతమ నిమిత్త ములు తీరిన పిదప- వారిని దీర్ఘ నిద్ర పుచ్చి తనలో లీనం జేసుకొను-స్వాపనుడు. ఆత్మ బోధనకు తప్ప తానెవ్వరికీ లోబడని - స్వవశుడు. సర్వ వ్యాపితుడైన వాడు.
అన్ని జీవాత్మలకు కారణ భూతమైన-నైక. సృష్టి, స్థితి, లయముల వంటి అనేక రకములైన లీలామానస సూత్రధారి అయిన- కర్మకృత్నైక. కాల ప్రమాణాంతరంగుడైన – వత్సరుడు. ప్రాణ వత్సలుడు. తాను సృజించిన నూతన సంతతిని సంరక్షించు - వత్సీ. తానే సర్వా శ్రయమైన రత్నగర్భుడు. తానే సర్వ ధన దాక్షిణ్యాలకధిపతియైన – ధనేశ్వరుడు.
---