షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.
దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను.
మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.
ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.
మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.
కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.
విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.
మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.
ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.
సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు,
అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.
కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.
వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.
విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.
దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.
ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.
కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.
తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.
వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.
పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.
చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.
సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.
క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.
అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-
ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.
స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.
దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.
ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.
విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.
రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.
అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.
వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.
వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.
అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.
పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.
త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.
ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించెను. అప్ఫుడు దేవతలు దైత్యులకు మేనల్లుడాయెనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసికొనిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్డోఽధ్యాయః (6)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment