Sunday, 2 September 2018


Chandan Yatra Special Darshan at ISKCON Ujjain on 03 June 2013
ప్రాంజలి ప్రభ .com
- శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

శా|| శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనొబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!
.
తా|| సంపదలనెడి మెరుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన పాపములనెడి నీటిధారాచేత నామన: పద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు . ఇంక నా మన: పద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు గలవాడనై
నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను.
--((**))--

దశావతారములు వర్ణన ! 

“ సలిల విహారులిద్దరును – సంతత కాననచారు లిద్దరున్- 
వెలయగ విప్రులిద్దరును – వీర పరాక్రమశాలు రిద్దరున్ 
పొలతుల డాయువాడొకడు- భూమిన పుట్టెడువాడు నొక్కడున్ 
చెలువుగ మీ కభీష్ట ఫలసిద్ది ఘటింతు రానంత కాలమున్!” 

పై పద్యంలో దశావతారములు వర్ణన ఉంది. 

భావం చూడండి---- 
“ సలిల = నీటిలో విహరించేవారు యిద్దరు. 
‘ మత్స్యావతారం,కూర్మావతారం’. 
కానన = అడవిలో తిరిగేవారు యిద్దరు.‘ 
వరాహం, నారసింహం’ 
విప్రులు=బ్రాహ్మణులు గా పుట్టిన వారు యిద్దరు. ‘ 
వామన,పరశురామ’ 
పరాక్రమ వంతులు యిద్దరు. 
‘రామ, బలరామ’ 
పొలతులు=స్త్రీలతో ( గోపికలతో) తిరిగినవాడు ఒక్కడు. 
శ్రీకృష్ణుడు. 
భూమిపై జన్మించిన వాడు ఒక్కడు. 
‘ కల్కి’ అవతారం. 
ఇలా దశావతారాలు ఎత్తిన ఆ “ శ్రీమన్నారాయణుడు” 
మీ కోరికలను తీర్చి సదా మిమ్ము కాపాడు గాక. శుభం. 
“ఓం శాంతి శాంతి శాంతి:”


గోకులాష్టమి Special

ఇవన్నీ శ్లోకములు మాత్రమే కాక, ఎనిమిది అక్షరములతో నుండే అర్ధసమ వృత్తములు కూడ.

సరి పాదములకు సరిపోయే వృత్తములు -
క్షమా - మ/ర/లగ UUUU IUIU
నాగరక - భ/ర/లగ UIIU IUIU
నారాచ - త/ర/లగ UUIU IUIU
ప్రమాణికా - జ/ర/లగ IUIU IUIU
బేసి పాదములకు సరిపోయే వృత్తములు -
సుచంద్రప్రభా - జ/ర/గల IUIU IUUI
విభా - త/ర/గగ UUIU IUUU
శ్యామా - త/స/గగ UUII IUUU
పద్మమాలా - ర/ర/గగ UIUU IUUU
గాథ - ర/స/గగ UIUI IUUU
అర్ధసమ వృత్తములుగా శ్లోకములు -
గాథ / నాగరక - UIUI IUUU // UIIU IUIU
ముద్దు మోము గనన్ లేవే
హద్దులు మోదమొందఁగా
సద్దు సేయక రావా నా
వద్దకుఁ గృష్ణమోహనా
నీవె నాకు నిధుల్ దేవా
జీవము నీవు మన్కిలో
నావ నాదు భవాంభోధిన్
నీవని నమ్మియుంటిరా
శ్యామా / నారాచ - UUII IUUU // UUIU IUIU
కన్నయ్యను గనంగా నా
కిన్నాళ్లకు మనమ్ములో
పన్నీరు జలపాతమ్మే
సన్నాయి మ్రోఁతలే సదా
నవ్వించు నను నీనవ్వో
పువ్వై విరియుఁ దావితో
మువ్వల్ సడుల మ్రోఁగంగా
దివ్వెల్ వెలుఁగు దివ్యమై
సుచంద్రప్రభా / ప్రమాణికా - IUIU IUUI // IUIU IUIU
అలోల మా విలాసమ్ము
కళామయమ్ము లాసముల్
కలాపపిచ్ఛ శీర్షమ్ము
చలించఁగా ముదమ్ములే
స్మరించెదన్ సదా నిన్ను
స్మరున్ గన్న పితా హరీ
భరించలేను బాధాగ్నిన్
హరించరా జనార్దనా
పద్మమాలా / క్షమా - UIUU IUUU // UUUU IUIU
జాలి లేదా జగజ్జాలా
బాలా రావేల యింటికిన్
నీలవర్ణా నిశిన్ రావా
జాలమ్మేలా జయోన్ముఖా
కల్లలింకేల కంజాక్షా
నల్లయ్యా నన్ను జూడరా
ఉల్లమందుండు మో దేవా
మల్లారీ యిందిరాపతీ
విభా / నారాచ - UUIU - IUUU // UUIU - IUIU
గోపాల గోపికానందా
మాపాలి దైవమా ప్రభూ
కాపాడ రమ్ము గోవిందా
శ్రీపాదధూళి సద్గతుల్
నీవేగదా సదా నాయీ
భావాల రూపవైఖరుల్
దేవాధిదేవ శ్రీకృష్ణా
జీవమ్ము నీవె నామదిన్
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


Image may contain: 1 person, smiling



ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో...
కృష్ణ.. కృష్ణ...కృష్ణ
కనులకు కనరావా..

వెన్నముద్ద కోసం అల్లరిదొంగగా మారి ఎక్కడ నక్కి ఉన్నావో..
చక్కన్ని చుక్కల పక్కన్న చేరి చక్కిలిగిలిగింతలు పెడుతున్నావో...

ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో..
కృష్ణ కృష్ణ కృష్ణ కనులకు కనరావా..
చెట్టుమీద ఎక్కి చీరలన్ని దాచి చిలిపి పనులు ఎన్ని చేస్తున్నావో..
మట్టిముద్దలు తింటూ అమ్మ అడగంగానే విశ్వమంతా చూపిస్తున్నావో..
ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో..
కృష్ణ కృష్ణ కృష్ణ కనులకు కనరావా..
పిల్లనగ్రోవితోన మధురంగా ఆలపిస్తూ అలరింపజేస్తున్నావో..
రాధ ఒడిలో ఒదిగి ప్రేమ మాధుర్యాన్ని పంచుతున్నావో..
ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో..
కృష్ణ కృష్ణ కృష్ణ కనులకు కనరావా...
రఘుపతి
అన్నాప్రగడ వేంకట నరసింహారావు
--((**))--

Image may contain: 1 person, flower

శ్రీకృష్ణ జన్మాష్టమి 

మిత్రులు ,బంధువులు అందరికీ శ్రీకృష్ణజన్మాష్టమి 
శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు 

(02_9_2018) 

తేగీ 

నిఖిల జగముల పున్నెంబు నిండు కొనగ 
అష్టమీ తిథిన్ శ్రీకృష్ణుఁ డవతరించ 
జగము సౌందర్య మయము విశ్వంబు సౌఖ్య 
మయము లోకంబు లానంద మయముగాగ 

కనుల పండువ యయ్యె లోకమున కెల్ల 
హృదయమున భక్తి భావము కుదురుకొనగ 
కన్ను లఱమోడ్చి హస్తయుగంబుఁ గూర్ప 
సౌఖ్య శుభ సంపద లొసంగి సాకుఁ గాక !! 

తేగీ 

బాల కృష్ణు యద్భుతమగు లీలల విన 
యుల్ల మల్లన రంజిలు యెల్ల రకును 
కర్ణ పేయము లైయున్న కతన, మనదు 
పూర్వ జన్మ సుకృత మగు పుణ్యమునను !! 

తేగీ 

అందె ఘల్లన వేణువు నూదు ౘుండ 
అవ్యయానందమెదలోన హత్తు కొనగ 
నంద నందనుండు కనుల విందు జేయ 
శాశ్వ తానందమునకు నాస్థాన మగును !! 

తేగీ కలువ రేకుల సరితూగు కన్ను లందు 
కరుణ రసము లొలుకు చుండ , చిరునగవుల 
చక్కనయ్య , దిక్కు లన్నియు పిక్కటిల్ల 
మురళి నూదుచు మీయిల్లు జేర వచ్చె !! 

శిరమున నెమలి పింఛము దురిమి, మెరుపు 
వన్నె పట్టు ధోవతి గట్టి , కృష్ణ మేఘ 
మటుల శ్రావణ బహుళాష్ట మందు వచ్చి 
నవ్య నవనీత ఖాదియై నవ్వు చుండ 

సంత తానంద మందించు చక్కనయ్య 
ముగ్ధ మోహను గోపాలు మోము గాంచ 
మనసుఁ గన్నులున్ విచ్చి దర్శనముగోరి 
వేచి యున్నారు భక్తులు వేచె జగము !! 

తేగీ 

శిరమున నెమలి పురి తోడ కరమున ముర 
ళియు గలుగఁ జేతి మురుగు తళ తళ లాడ 
కాలి యందియల్ మాటికి ఘల్లు మనగ 
వేణు గానంబు జేయుచు కృష్ణు డొచ్చు !! 

తేగీ అందె ఘల్లు ఘల్లు మన నానంద తాండ 
వంబు నన్ త్రి లోకాద్భుత వింత బాలుఁ 
గ్రక్కున ను యక్కుఁ జేర్చుకో గాను రండు 
శ్రావణ బహుళాష్టమి నాడు శ్రద్ధతోడ !! 

తేగీ గొల్ల కాంతల మానస ముల్లసింప 
ముని మనస్సులకున్ దూర మగుచు లీలఁ 
శైశవమ్మును గడిపెడి వేష ధారి 
కృష్ణుడేతెంచు గృహ సీమ కృపను జూడ !! 

తేగీ మధుర మీ కృష్ణదేవుని మంద హాస 
మంత కంటెను మధురమ్ము మేను , మధుర 
ము వదనమ్ము ముమ్మాటికి మధుర మంత 
యున్ మధురము వేణు రవళి యున్ మృదువుగఁ !! 

తేగీ దట్టమౌ జుట్టు ముద్దుగ మాట లంద 
మైన మొగమును పెద్ద వౌ కన్ను గవయు 
పలుచ జులపాలతో నిరుపమము గాను 
మోవి యందు మ్రోగ గ పిల్లఁ గ్రోవి రవళి 

ఉల్లముల్ పల్లవింపగా బాల కృష్ణు 
డాడు కొన బోయి వచ్చెడి యందె మ్రోత 
కనుచు వినుచును మసలుచు కలసి మెలగు 
గోకుల జన భాగ్యమ్మది గొప్ప గాదె !! 

తేగీ నందన మెట నున్నదొ లేదొ యందరకును 
నందనంపు భావానంద మంద దలతు 
నందనమ్మె మీ గృహము సౌగంధ భర మ 
హోత్తమ సు సౌరభము లెన్నొ హత్తు కొనగ 

నందముగ తరతరము లానంద మొందు 
రీతి చెడని వాడని సు పరీమళములు 
జల్లి హృద్యమౌ భావ గేయాల పాడి 
నంద నందను నానంద మొంద జేయ 

తేగీ చూడ మిక్కిలి చక్కని చక్కనయ్య 
నెమలి పింఛము శిఖనున్న నల్లనయ్య 
మురళి వాయించి మురిపించు ముద్దుల య్య 
అందముల్ చిందు దరహాస వదను డయ్య 

తేనె మాటల శిశురూప తేజ మయ్య 
మూడు లోకమ్ము లానంద మొందు చుండ 
చంద్రుడుదయింప పొంగెడి సంద్ర మటుల 
కృష్ణుడు దయింప జనులకు తృష్ణ దీరు !! 

తేగీ 

నంద నందను నవనవ నీత చోరు 
పూతనా సంహరున్ గృష్ణు పూత చరితు 
భవ్య వైకుంఠ మేలెడి భద్ర మూర్తిఁ 
దలౘుౘుంటి భక్తిగను చిత్తమ్మునందు!! 

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా 

శుభాకాంక్షలతో శుభాభినందనలతో 

మీ యందరి వాడు 

మునీశ్వరరావు యనమండ్రం 
(02_9_2018)
 --((**))--

No comments:

Post a Comment