Tuesday, 7 July 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము
ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము
ఓం నమో భగవతే వాసుదేవాయ
నారద ఉవాచ
నారదుడు వచించెను- వరములను కోరుకొనుట భక్తి యోగమునకు ఆటంకమని బాలుడైన ప్రహ్లాదుడు భావించెను. అందువలన అతడు మందహాసము  చేయుచు భగవానునితో ఇట్లనెను-

ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు పలికెను) - దేవా! అసురవంశములో పుట్టిన నేను సహజముగా విషయ భోగాసక్తుడను. ఇప్పుడు నన్ను వరములతో ప్రలోభ పెట్టవలదు. నేను ఆ భోగముల సాంగత్యమునకు భయపడి, వాటివలన కలుగు తీవ్రవేదనలను తెలిసికొని వీటిని త్యజింపదలచి, నిన్ను ఆశ్రయించితిని.

ప్రభూ! నాలో భక్తుని లక్షణములు ఉన్నవా? లేవా? అని తెలిసికొనుటకే నీ భక్తుడ నైన నన్ను వరములను కోరుకొమ్మని ప్రేరేపించితివి. ఈ విషయభోగములు హృదయగ్రంథిని  ఇంకను దృఢపఱచి, జనన మరణ చక్రములో పడవేయుచుండును కదా!

ప్రభూ! నీవు సకలలోకములకును గురుడవు. పరమ దయాళుడవగు నీవు భక్తులను పరీక్షింపకయే ఇట్లు పలుకుటకు వేరు కారణము కనబడదు. నీ భక్తుని విషయ భోగములకు గురిచేయునట్టి వరములను నీవు ఎట్లు ప్రసాదించెదవు. తన కోరికలను ప్రసాదింపుము అని కోరువాడు నిజముగా సేవకుడు గాడు. అతడు కేవలము వ్యాపారియే యగును.

తన కోరికలను కోరుకొనుటకై ప్రభువును సేవించువాడు, నిజముగా సేవకుడు గాడు. సేవకుని నుండి  సేవలను అందుకొనుటకై, అతని కోరికలను తీర్చు యజమాని నిజముగా యజమాని కాడు.

నేను నీకు నిష్కామ సేవకుడను. నీవును నాకు నిరపేక్ష స్వామివి. రాజు తన సేవకునకు జీతమిచ్చి, అతని వలన సేవలను అందుకొనును. కాని, నీకు నాకును అట్టి హంబంధము లేదు.

స్వామీ! నీవు వరములను అనుగ్రహించుటలో శ్రేష్ఠుడవు. నేను కోరుకొనిన వరమును ప్రసాదింపదలచినచో, నా హృదయమున ఎట్టి కోరిక అంకురింపకుండ చేయుము. ఇదియే నా కోరిక. హృదయమునందు ఏదేని ఒక కోరిక కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, లజ్జ, సంపదలు, తేజస్సు, స్మృతి, సత్యము, మొదలగునవి అన్నియును నష్టమైపోవును సుమా!

పుండరీకాక్షా! మానవుడు తన మనస్సులోని కోరికలను పరిత్యజించి నంతనే, అతనికి భగవత్స్వరూపము ప్రాప్తించును.

పరమపురుషా! నీవు సకల ప్రాణులహృదయములలో విరాజీల్లుచుందువు. ఉదారశిరోమణివి, పరబ్రహ్మ, పరమాత్ముడవు. అద్భుతమైన నృసింహస్వరూపమును ధరించిన శ్రీహరివి. నీ పాదములకడ పదేపదే ప్రణమిల్లుచున్నాను.

నృసింహ భగవానుడు పలికెను- ప్రహ్లాదా! నీవంటి పరమభక్తుడు ఈ లోకమునగాని, పరలోకమునగాని ఏ వస్తువును గూడ ఎన్నడును ఆశింపడు. ఐనను, కేవలము ఒక మన్వంతరము వరకు నా సంతోషము కొరకు నీవు దైత్యులకు అధిపతివై సమస్త భోగములను అనుభవింపుము.

సమస్త ప్రాణుల హృదయములలో యజ్ఞభోక్తయైన ఈశ్వరుడుగా నేనే విరాజిల్లుచుందును. నీవు నీ హృదయములో నన్నే దర్శించుచుందుము. నీకు అత్యంత ప్రియమైన నా లీలా గాథలను వినుచుండుము. సమస్తకర్మలద్వారా నన్ను ఆరాధించుచు నీ ప్రారబ్ధకర్మను నశింపజేయుము.

భోగముల ద్వారా పుణ్యకర్మల ఫలములను, నిష్కామపుణ్య కర్మల ద్వారా పాపములను నశింపజేయుము. సమయము ఆసన్నమైనప్పుడు శరీరమును త్యజించి, సకలబంధముల నుండి ముక్తుడవై నా చెంతకు చేరగలవు. దేవలోకమునందు గూడ జనులు విశుద్ధమైన నీ కీర్తిని గానము చేయుదురు.

నీవు ఒనర్చిన నా యీ స్తుతిని కీర్తించువారును, నన్ను నిన్ను స్మరించిన వారును, తగిన సమయమున కర్మ బంధముల నుండి ముక్తులగుదురు.
ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు పలికెను- మహేశ్వరా! నీవు వరములను ఇచ్చు వారిలో శ్రేష్ఠుడవు. నిన్ను మరియొక వరమును కోరుచున్నాను, నా తండ్రి నీ తేజఃప్రభావమును తెలిసికొనజాలక సకల చరాచరములకు గురుడవు, సర్వశక్తిమంతుడువు ఐన నిన్ను నిందించెను. "ఈ విష్ణువు నా తమ్ముడైన హిరణ్యాక్షుని వధించిన అపరాధి" అని మిథ్యానిందలు మోపి క్రోధావేశమును అతిక్రమింపలేక అసమర్థుడయ్యెను. అందువలన, నీ భక్తుడైన నాకును ద్రోహమొనర్చెను. దీనబంధూ! నీదృష్టి సోకినంతనే అతడు పవిత్రుడాయెను. ఐనను, దుస్తరమైన అతని పాపములను ప్రక్షాళితమొనర్చి అతనిని పునీతుని గావింపుము. ఇదియే నా ప్రార్థన.

శ్రీభగవానువాచ

శ్రీభగవానుడు పలికెను- పుణ్యాత్ముడా! ప్రహ్లాదా! నీవు వంశపావనుడవు. ఆ వంశమున నీవు జన్మించుటవలన నీ తండ్రియే గాక, అతనికి పూర్వజులైన ఇరువది యొక్క తరముల పితృదేవతలు గూడ పునీతులైరి.

ప్రశాంతచిత్తులు, సమదర్శనులు, సదాచారపరులైన నీ వంటి నా భక్తులు నివసించు దేశములు అన్నియును పవిత్రములైనవి. అంతేగాక, అపవిత్రములైన కీకట దేశములును పునీతములగును.

దైత్యరాజా! నా యందలి భక్తిభావ ప్రభావమున కోరికలు నశించిన వారు సర్వత్ర తమ ఆత్మనే దర్శించుచుందురు. వారు చిన్న, పెద్ద అను భేద భావములు లేకుండ ఏ ప్రాణిని ఎన్నడును హింసింపరు.

ప్రహ్లాదా! నిన్ను అనుసరించువారుగూడ నా భక్తులే యగుదురు. నాయనా! వారందరికిని నీవు ఆదర్శభక్తుడవు అగుదువు. నా అంగస్పర్శవలన నీ తండ్రి పూర్తిగా పవిత్రుడైనాడు. ఐనను, నీవు ఆయనకు అంత్యక్రియలను ఆచరింపుము. నీ వంటి కుమారులను గన్నవారికి ఉత్తమ లోకములే ప్రాప్తించును.

నాయనా! నీవు నీ తండ్రి యొక్క రాజ్య సింహాసనమును అధిష్ఠింపుము. నా యందు మనస్సును నిలిపి నన్ను శరణు పొందుము. బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల ఆజ్ఞానుసారము నాకు సేవలను ఒనర్చుచు సకల కార్యములను నిర్వహించుచుండుము.

నారద ఉవాచ
నారదుడు పలికెను- ధర్మరాజా! నృసింహ భగవానుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు తన తండ్రికి అంత్య క్రియలను ఆచరించెను. అనంతరము బ్రాహ్మణోత్తములు అతనికి రాజ్య పట్టాభిషేకమును ఒనర్చిరి.

నృసింహరూపుడుగా నున్న శ్రీహరియొక్క ప్రసన్న వదనమును జూచి, బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో గూడి ఆ దేవదేవుని పవిత్ర వచనములతో స్తుతించుచు ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ

బ్రహ్మదేవుడు పలికెను- దేవదేవా! నీవు సకలదేవతలకు ఆరాధ్యుడవు. సర్వాంతర్యామివి. జీవులకు ప్రాణదాతవు. నాకు తండ్రివి. పాపాత్ముడైన ఈ దైత్యుడు  లోకములను బాధించుచుండెను. వానిని వధించి లోకములకు మహోపకార మొనర్చితివి.

నేను సృష్టించినట్టి ఏ ప్రాణి చేతను మరణింపకుండునట్లు, ఈ హిరణ్యకశిపుడు నా నుండి వరమును పొందియుండెను. అందు వలన ఇతడు గర్వోన్మత్తుడు అయ్యెను. తపస్సు చేసి, యోగబలమును సంపాదించిన కారణముగా ఇతడు విశృంఖలుడయ్యెను. వేదోక్త కర్మలను అన్నింటిని చెడగొట్టెను.

దేవా! మా అదృష్టవశమున ఇతని తనయుడైన ప్రహ్లాదకుమారుడు భాగవతోత్తముడయ్యెను. అతనిని నీవు మృత్యుముఖమునుండి రక్షించితివి. నేడు అతడు నిన్ను శరణుజొచ్చెను.

పరమాత్మా! నీ ఈ నృసింహరూపము ఏకాగ్రచిత్తముతో ధ్యానించినవాడను. అన్ని విధముల భయముల నుండి ముక్తుడగును. అంతేగాదు, ఏ ప్రాణిని ఐనను సంహరింపదలచి దగ్గరకు చేరిన మృత్యుదేవత కూడ అతనిని ఏమియు చేయజాలదు.

నృసింహ ఉవాచ

శ్రీనృసింహభగవానుడు పలికెను- పద్మసంభవా! దైత్యులకు ఇట్టి వరములను ఇయ్యరాదు. వారు సహజముగనే క్రూరులు. అట్టివారికి వరములను ఇచ్చినచో, పాములకు పాలుబోసినట్లు అగును.

నారదుడు వచించెను- ధర్మరాజా! నృసింహ భగవానుడు ఈ విధముగా పలికి, బ్రహ్మదేవుని పూజలను స్వీకరించి, అచటనే అంతర్ధానమయ్యెను. సకల ప్రాణులకును అదృశ్యుడయ్యెను.

అనంతరము ప్రహ్లాదుడు బ్రహ్మదేవుని, పరమశివుని, ప్రజాపతులను, దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి, శిరసా ప్రణమిల్లెను.

పిమ్మట, శుక్రాచార్యుడు మొదలగు మునులతో గూడి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని సమస్త దైత్యులకును, దానవులకును ప్రభువుగా జేసెను.

ధర్మరాజా! బ్రహ్మాదిదేవతలు ప్రహ్లాదుని అభినందించి, అతనికి శుభాశీస్సులను పలికిరి. ప్రహ్లాదుడు  గూడా వారందరిని యథాయోగ్యముగా సత్కరించెను. పిమ్మట వారు తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి.

యుధిష్ఠిరా! ఈ విధముగా విష్ణుపార్షదులైన జయ విజయులు దితికి పుత్రులై జన్మించిరి. వారుభగవంతుని పైైర భావముతోనైనను తమ హృదయములలో ఆ ప్రభువును నిలుపుకొనిరి. శ్రీహరి వారిని హతమార్చి, ఉద్ధరించెను.

మహర్షుల శాపకారణముగా వారికి అంతటితో ముక్తి లభింపలేదు. వారే మరుజన్మలో రావణ, కుంభకర్ణులను రాక్షసులై జన్మించిరి. వారిని శ్రీరామచంద్రుడు తన బల పరాక్రమములతో హతమార్చెను.

భగవానుడైన శ్రీరాముడు యుద్ధమునందు వారి హృదయములను భిన్నమొనర్చెను. వారు పూర్వజన్మలలో వలెనే భగవంతుని స్మరించుచు తమ దేహములను త్యజించిరి.

వారే ఇప్పుడు ఈ యుగమున శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. భగవంతుని యెడ వారికి గల వైర కారణముగా శ్రీకృష్ణునిచే వధింపబడి నీవు చూచుచుండగనే ఆయనలో లీనమైరి.

ధర్మరాజా! శ్రీకృష్ణునియెడ వైరభావముతో నున్న రాజులందరును అవసానదశయందు ఆ స్వామిని స్మరించి, తుమ్మెదచే పట్టు కొనబడిన పురుగువలె, తద్రూపమును పొందిరి. అంతవరకును వారు చేసికొనిన పాపములు అన్నియును ప్రక్షాళితములయ్యెను.

భగవంతునకు ప్రియమైన భక్తులు భేద భావరహితులై అనన్య భక్తి ద్వారా భగవత్స్వరూపమును పొందిరి. ఆ విధముగనే శిశుపాలాదిరాజులు గూడ వైర భావముతో నైనను, ఆ దేవదేవుని స్మరించుటవలన భగవానుని సారూప్యమును పొందిరి.

ధర్మరాజా! భగవంతునిపై ద్వేషము వహించు శిశుపాలాదులకును, ఆయన సారూప్యము ఎట్లు లభించినది? అని నీవు అడిగియుంటివి. దానికి సమాధానమును ఇచ్చియున్నాను.

శ్రీకృష్ణపరమాత్మ వేదవేత్తలైన బ్రాహ్మణుల యెడ పూజ్య భావము కలిగియుండువాడు. ఇది ఆయన యొక్క పవిత్రమైన అవతారముల చరిత్ర. ఇందు దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారము వర్ణింపబడినది.

ఈ సందర్భమున భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క వృత్తాంతమును, భక్తి, జ్ఞాన, వైరాగ్యములును  వర్ణింపబడినవి. అట్లే జగత్తు యొక్క సృష్టిస్థితి లయములకు కారణమైన శ్రీహరి యొక్క యథార్ధస్వరూపమును, అట్లే ఆ ప్రభువు యొక్క దివ్యగుణములును, లీలలును వర్ణింపబడినవి. కాలక్రమముగా దేవతల, దైత్యుల అధికారముల యందు జరిగిన మార్ఫులు గూడ నిరూపింపబడినవి.

భగవత్ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు ఈ గాథయందు తెలుపబడినవి. తెలిసికొనదగిన ఆధ్యాత్మిక విషయములును ఇందులో చక్కగా వివరింపబడినవి.

భగవంతుని పరాక్రమమును గూర్చి తెలుపుచున్న ఈ పవిత్ర వృత్తాంతములను భక్తి, శ్రద్ధలతో కీర్తించిన వారును, వినిన వారును సర్వ కర్మాబంధములనుండి విముక్తులగుదురు.

ఇందు పరమపురుషుడైన పరమాత్మయొక్క ఈ నృసింహావతారగాథయు, హిరణ్యకశిపుని యొక్క ఆయన సేనాపతుల యొక్క వధలును, భక్తశిరోమణియైన ప్రహ్లాదుని పావన చరితము వర్ణింపబడినవి. వీటిని ఏకాగ్రచిత్తముతో వినినవారు, పఠించినవారు, పఠింపజేసినవారు భయరహితమైన పరంధామమును పొందుదురు.

ధర్మరాజా! ఈ మానవలోకములో మీరు మిగుల భాగ్యశాలులు. ఎందుకనగా, సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మయే మనుష్యరూపమున గుప్తముగా మీ యింట నివసించుచున్నాడు. జగత్తును పునీతమొనర్చునట్టి ఋషులు, మునులు ఆ ప్రభుదర్శనమునకై నలు దిక్కులనుండి పదే పదే మీ ఇంటికి వచ్చుచున్నారు.

శ్రీకృష్ణుడు మాయాస్పర్శ ఏ మాత్రమూ లేని పరమశాంత స్వరూపుడు. ఆయన పరమానంద విగ్రహుడు. ఆ పరబ్రహ్మ పరమాత్మ దర్శనమునకై మహాత్ములు నిరంతరము తహతహ లాడుచుందురు. అట్టి శ్రీకృష్ణుడు మీకు ప్రియమైనవాడు, హితైషి, మేనబావ, పూజ్యుడు, కార్యసహాయకారి, అంతేగాక, సాక్షాత్తుగా గురువు, ఆత్మీయుడు.

సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు మున్నగువారుగూడ అవాఙ్మానసగోచరుడైన ఆ స్వామి రూపమును వాస్తవముగ వర్ణింపజాలరు. మేమైతే ఆయనకు మౌనముతో భక్తియుక్తులమై సంయమనము ద్వారా నమస్కరించెదము. దానినే ఆ ప్రభువు పూజగా స్వీకరించును. భక్తవత్సలుడైన ఆ ప్రభువు మా పూజలను స్వీకరించి, మమ్ము అనుగ్రహించుగాక!
ధర్మరాజా! శ్రీకృష్ణుడు ఒక్కడే ఆరాధ్యదైవము. పూర్వకాలమునందు గొప్ప మాయావియైన మయాసురుడు శంకరుని యొక్క కీర్తికి కళంకము తెచ్చుటకు ప్రయత్నించెను. అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయన యశస్సును రక్షించి విస్తరింపజేసెను.

రాజోవాచ

యుధిష్ఠిరుడు నుడివెను నారద మహర్షీ! మయాదానవుడు ఏ కార్యముద్వారా జగదీశ్వరుడైన శివుని యశస్సును నష్ట పరుచదలచెను? శ్రీకృష్ణభగవానుడు ఆయన కీర్తిని ఎట్లు రక్షించెను? దయతో వివరింపుము.

నారద ఉవాచ

నారద మహర్షి నుడివెను ఒకానొకసారి శ్రీకృష్ణ భగవానునిచే శక్తిని పొంది, దేవతలు యుద్ధమున అసురులను జయించిరి. అపుడు అసురులు అందరును మాయావులకు పరమగురువైన మయదానవుని శరణు జొచ్చిరి.

శక్తిశాలియైన మయాసురుడు బంగారము, వెండి, ఇనుములతో మూడు పురములను నిర్మించి ఇచ్చెను. అవి విమానాకారములో ఉండెను. వాటి గమనాగమనములు ఎవ్వరికిని తెలియకుండెను. అవి అపరిమితమైన యుద్ధసామాగ్రితో నిండియుండెను.

ధర్మరాజా! దైత్య సేనాధిపతుల మనస్సులలో ముల్లోకముల పైనను, లోకపాలుర యెడలను వైరభావము ఉండెను. ఇప్పుడు దానిని స్మరించుచు, వారు తమ మూడు విమానములయందు దాగికొని, వాటి ద్వారా వారిని అందరిని అంతమొందింపసాగిరి.

అంతట లోకపాలురతో గూడి, ప్రజలు అందరును పరమేశ్వరుని శరణుజొచ్చి ఇట్లు ప్రార్దించిరి.- "ప్రభూ! అసురులు త్రిపురములలో నుండి మమ్ములను నాశమొందించుచున్నారు. దేవా! నీవారమైన మమ్ములను రక్షింపుము"

దేవతల ప్రార్థనలను విని, దయాళువైన పరమశివుడు 'భయపడకుడు' అని పలికి తన ధనుస్సునందు బాణములను సంధించి, ఆ మూడు పురములపై ప్రయోగించెను.

సూర్యమండలము నుండి వెలువడు కిరణములవలె పరమేశ్వరుని బాణమునుండి అసంఖ్యాకములైన బాణములు వెలువడెను. వాటినుండి అగ్నిజ్వాలలు బయలుదేరుచుండెను. ఆ కారణముగా పురములు కనబడకుందెను.

పరమేశ్వరుని బాణముల తాకిడికి ఆ విమానములలోని వారందరును అసువులను బాసి, క్రిందబడిపోవుచుండిరి. మహా మాయావియైన మయుడు పెక్కు మాయోపాయములను ఎరిగినవాడు. అందువలన అతడు తస మాయల ద్వారా వారిని బ్రతికించుచు తాను నిర్మించిన అమృతకూపమునందు పడవేయుచుండెను.

ఆ సిద్ధామృతము యొక్క రస స్పర్శచే అసురుల శరీరములు మిక్కిలి తేజస్సుతో ఒప్పుచు  వజ్రమువలె బలిష్ఠములగు చుండెను. అంతట వారు మేఘములను చీల్చుకొని  వచ్చుచున్న మెరుపు తీగలవలె లేచి నిలబడుచుండిరి.

మహాదేవుడు తన సంకల్పము నెరవేరక పోవుటచే నిరాశకు లోనగుచుండెను. శ్రీకృష్ణభగవానుడు అతనిని జూచి, అసురులను జయించుటకు ఒక ఉపాయమును పన్నెను.

వెంటనే శ్రీమహావిష్ణువు గోవుగను, బ్రహ్మదేవుడు దూడగను మారిపోయిరి. వారు ఇద్దరు మధ్యాహ్న సమయమున అభిజిన్మూహూర్తమునందు ఆ మూడుపురముల యందు ప్రవేశించి, అమృత కూపము నందలి అమృతమును త్రాగివేసిరి.

ఆ అమృతకూపమును రక్షించు దైత్యులు ఆ ఆవును, దూడను చూచుచున్నప్పటికిని విష్ణుమాయా మోహితులై వాటిని అడ్డగింపరైరి. పెక్కు ఉపాయములను ఎరిగిన మయాసురునకు ఈ విషయము తెలిసెను. అప్పుడు అతడు భగవంతుని ఈ లీలను స్మరించినంత మాత్రముననే అతనికి ఎట్టి శోకమూ కలుగలేదు. అప్పుడు అమృతరక్షకులైన అసురులతో ఇట్లనెను- "సోదరులారా! దేవతలు, అసురులు, మానవులు మరే ప్రాణికైనను తమకు, ఇతరులకు విధింపబడిన ప్రారబ్ధమును తుడిచిపెట్టలేరు. కానున్నది కాకమానదు కదా! శోకించనందువలన ప్రయోజనము ఏమి?" అనంతరము శ్రీకృష్ణభగవానుడు తన శక్తులతో శంకరునకు యుద్ధ సామాగ్రిని సమకూర్చెను.

ఆ ప్రభువు ధర్మముతో రథమును, జ్ఞానముచే సారథిని, వైరాగ్యముచే ధ్వజమును, ఐశ్వర్యముల ద్వారా గుర్రములను, తపోబలముతో ధనుస్సును, విద్యచే కవచమును, క్రియలచే బాణములను నిర్మించెను. తన ఇతర శక్తుల ద్వారా ఇతర వస్తువులను నిర్మించెను.

ఆ సామాగ్రులతో సన్నద్ధుడైన శంకర భగవానుడు రథమును అధిరోహించి, ధనుర్బాణములను ధరించెను. అభిజిన్ముహూర్తమున ధనుస్సునందు బాణములను సంధించి, దుర్భేద్యమైన ఆ మూడు విమానములను భస్మమొనర్చెను. ధర్మరాజా! ఆ సమయమున స్వర్గమునందు దుందుభులు మ్రోగెను. వందలకొలది విమానములు ఆకాశమునందు గుంపులు గట్టెను. దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు ఆనందముతో జయజయధ్వానములు పలికిరి. పుష్పవర్షములు కురిపించిరి. అప్సరసలు నృత్యములు చేసిరి.

ధర్మరాజా! ఈ విధముగా మూడు పురములను దహించి, పరమశివుడు పురారి అని ప్రసిద్ధికెక్కెను. బ్రహ్మాది దేవతలు ఆ శంకరభగవానుని స్తుతించుచు తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి.

సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు, జగద్గురువు ఐన శ్రీకృష్ణభగవానుడు తస మాయచే మానవులవలె లీలలను నెరపెను. లోకపావనుడైన ఆ స్వామి యొక్క లీలలను, బలపరాక్రమములను ఋషులు కీర్తించిరి. లోకములను పావనము చేయునట్టి ఆ స్వామి గాథలను గురుంచి ఇంకను ఏమి చెప్పవలెను?
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమోఽధ్యాయః (10)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***

7.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

10.1 (ప్రథమ శ్లోకము)

భక్తియోగస్య తత్సర్వమంతరాయతయార్భకః|

మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ హ॥6021॥

నారదుడు వచించెను- వరములను కోరుకొనుట భక్తి యోగమునకు ఆటంకమని బాలుడైన ప్రహ్లాదుడు భావించెను. అందువలన అతడు మందహాసము  చేయుచు భగవానునితో ఇట్లనెను-

ప్రహ్లాద ఉవాచ

10.2 (రెండవ శ్లోకము)

మా మాం ప్రలోభయోత్పత్త్యాఽఽసక్తంకామేషు తైర్వరైః|

తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః॥6012॥

ప్రహ్లాదుడు పలికెను) - దేవా! అసురవంశములో పుట్టిన నేను సహజముగా విషయ భోగాసక్తుడను. ఇప్పుడు నన్ను వరములతో ప్రలోభ పెట్టవలదు. నేను ఆ భోగముల సాంగత్యమునకు భయపడి, వాటివలన కలుగు తీవ్రవేదనలను తెలిసికొని వీటిని త్యజింపదలచి, నిన్ను ఆశ్రయించితిని.

10.3 (మూడవ శ్లోకము)

భృత్యలక్షణజిజ్ఞాసుర్భక్తం కామేష్వచోదయత్|

భవాన్ సంసారబీజేషు హృదయగ్రంథిషు ప్రభో॥6023॥

ప్రభూ! నాలో భక్తుని లక్షణములు ఉన్నవా? లేవా? అని తెలిసికొనుటకే నీ భక్తుడ నైన నన్ను వరములను కోరుకొమ్మని ప్రేరేపించితివి. ఈ విషయభోగములు హృదయగ్రంథిని  ఇంకను దృఢపఱచి, జనన మరణ చక్రములో పడవేయుచుండును కదా!

10.4 (నాలుగవ శ్లోకము)

నాన్యథా తేఽఖిలగురో ఘటేత కరుణాత్మనః|

యస్త ఆశిష ఆశాస్తే న స భృత్యః స వై వణిక్॥6024॥

ప్రభూ! నీవు సకలలోకములకును గురుడవు. పరమ దయాళుడవగు నీవు భక్తులను పరీక్షింపకయే ఇట్లు పలుకుటకు వేరు కారణము కనబడదు. నీ భక్తుని విషయ భోగములకు గురిచేయునట్టి వరములను నీవు ఎట్లు ప్రసాదించెదవు. తన కోరికలను ప్రసాదింపుము అని కోరువాడు నిజముగా సేవకుడు గాడు. అతడు కేవలము వ్యాపారియే యగును.

10.5 (ఐదవ శ్లోకము)

ఆశాసానో న వై భృత్యః స్వామిన్యాశిష ఆత్మనః|

న స్వామీ భృత్యతః స్వామ్యమిచ్ఛన్ యో రాతి చాశిషః॥6025॥

తన కోరికలను కోరుకొనుటకై ప్రభువును సేవించువాడు, నిజముగా సేవకుడు గాడు. సేవకుని నుండి  సేవలను అందుకొనుటకై, అతని కోరికలను తీర్చు యజమాని నిజముగా యజమాని కాడు.

10.6 (ఆరవ శ్లోకము)

అహం త్వకామస్త్వద్భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయః|

నాన్యథేహావయోరర్థో రాజసేవకయోరివ॥6026॥

నేను నీకు నిష్కామ సేవకుడను. నీవును నాకు నిరపేక్ష స్వామివి. రాజు తన సేవకునకు జీతమిచ్చి, అతని వలన సేవలను అందుకొనును. కాని, నీకు నాకును అట్టి హంబంధము లేదు.

10.7 (ఏడవ శ్లోకము)

యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభ|

కామానాం హృద్యసంరోహం భవతస్తు వృణే వరమ్॥6027॥

10.8 (ఎనిమిదవ శ్లోకము)

ఇంద్రియాణి మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతిః|

హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం యస్య నశ్యంతి జన్మనా॥6028॥

స్వామీ! నీవు వరములను అనుగ్రహించుటలో శ్రేష్ఠుడవు. నేను కోరుకొనిన వరమును ప్రసాదింపదలచినచో, నా హృదయమున ఎట్టి కోరిక అంకురింపకుండ చేయుము. ఇదియే నా కోరిక. హృదయమునందు ఏదేని ఒక కోరిక కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, లజ్జ, సంపదలు, తేజస్సు, స్మృతి, సత్యము, మొదలగునవి అన్నియును నష్టమైపోవును సుమా!

10.9 (తొమ్మిదవ శ్లోకము)

విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్|

తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్త్వాయ కల్పతే॥6028॥

పుండరీకాక్షా! మానవుడు తన మనస్సులోని కోరికలను పరిత్యజించి నంతనే, అతనికి భగవత్స్వరూపము ప్రాప్తించును.

10.10 (పదియవ శ్లోకము)

ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే|

హరయేఽద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే॥6030॥

పరమపురుషా! నీవు సకల ప్రాణులహృదయములలో విరాజీల్లుచుందువు. ఉదారశిరోమణివి, పరబ్రహ్మ, పరమాత్ముడవు. అద్భుతమైన నృసింహస్వరూపమును ధరించిన శ్రీహరివి. నీ పాదములకడ పదేపదే ప్రణమిల్లుచున్నాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

7.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నృసింహ ఉవాచ

10.11 (పదకొండవ శ్లోకము)

నైకాంతినో మే మయి జాత్విహాశిష ఆశాసతేఽముత్ర చ యే భవద్విధాః|

అథాపి మన్వంతరమేతదత్ర  దైత్యేశ్వరాణామనుభుంక్ష్వ భోగాన్॥6031॥

నృసింహ భగవానుడు పలికెను- ప్రహ్లాదా! నీవంటి పరమభక్తుడు ఈ లోకమునగాని, పరలోకమునగాని ఏ వస్తువును గూడ ఎన్నడును ఆశింపడు. ఐనను, కేవలము ఒక మన్వంతరము వరకు నా సంతోషము కొరకు నీవు దైత్యులకు అధిపతివై సమస్త భోగములను అనుభవింపుము.

10.12 (పడ్రెండవ శ్లోకము)

కథా మదీయా జుషమాణః ప్రియాస్త్వమావేశ్య మామాత్మని సంతమేకమ్|

సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వ యోగేన చ కర్మ హిన్వన్॥6032॥

సమస్త ప్రాణుల హృదయములలో యజ్ఞభోక్తయైన ఈశ్వరుడుగా నేనే విరాజిల్లుచుందును. నీవు నీ హృదయములో నన్నే దర్శించుచుందుము. నీకు అత్యంత ప్రియమైన నా లీలా గాథలను వినుచుండుము. సమస్తకర్మలద్వారా నన్ను ఆరాధించుచు నీ ప్రారబ్ధకర్మను నశింపజేయుము.

10.13 (పదమూడవ శ్లోకము)

భోగేన పుణ్యం కుశలేన పాపం  కలేవరం కాలజవేన హిత్వా|

కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం  వితాయ మామేష్యసి ముక్తబంధః॥6033॥

భోగముల ద్వారా పుణ్యకర్మల ఫలములను, నిష్కామపుణ్య కర్మల ద్వారా పాపములను నశింపజేయుము. సమయము ఆసన్నమైనప్పుడు శరీరమును త్యజించి, సకలబంధముల నుండి ముక్తుడవై నా చెంతకు చేరగలవు. దేవలోకమునందు గూడ జనులు విశుద్ధమైన నీ కీర్తిని గానము చేయుదురు.

10.14 (పదునాలుగవ శ్లోకము)

య ఏతత్కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః|

త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ప్రముచ్యతే॥6034॥

నీవు ఒనర్చిన నా యీ స్తుతిని కీర్తించువారును, నన్ను నిన్ను స్మరించిన వారును, తగిన సమయమున కర్మ బంధముల నుండి ముక్తులగుదురు.

ప్రహ్లాద ఉవాచ

10.15 (పదునైదవ శ్లోకము)

వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర|

యదనిందత్పితా మే త్వామవిద్వాంస్తేజ ఐశ్వరం॥6035॥

10.16 (పదునారవ శ్లోకము)

విద్ధామర్షాశయః సాక్షాత్సర్వలోకగురుం ప్రభుం|

భ్రాతృహేతి మృషాదృష్టిస్త్వద్భక్తే మయి చాఘవాన్॥6036॥

10.17 (పదునేడవ శ్లోకము)

తస్మాత్పితా మే పూయేత దురంతాద్దుస్తరాదఘాత్|

పూతస్తేఽపాంగసందృష్టస్తదా కృపణవత్సల॥6037॥

ప్రహ్లాదుడు పలికెను- మహేశ్వరా! నీవు వరములను ఇచ్చు వారిలో శ్రేష్ఠుడవు. నిన్ను మరియొక వరమును కోరుచున్నాను, నా తండ్రి నీ తేజఃప్రభావమును తెలిసికొనజాలక సకల చరాచరములకు గురుడవు, సర్వశక్తిమంతుడువు ఐన నిన్ను నిందించెను. "ఈ విష్ణువు నా తమ్ముడైన హిరణ్యాక్షుని వధించిన అపరాధి" అని మిథ్యానిందలు మోపి క్రోధావేశమును అతిక్రమింపలేక అసమర్థుడయ్యెను. అందువలన, నీ భక్తుడైన నాకును ద్రోహమొనర్చెను. దీనబంధూ! నీదృష్టి సోకినంతనే అతడు పవిత్రుడాయెను. ఐనను, దుస్తరమైన అతని పాపములను ప్రక్షాళితమొనర్చి అతనిని పునీతుని గావింపుము. ఇదియే నా ప్రార్థన.

శ్రీభగవానువాచ

10.18 (పదునెనిమిదవ శ్లోకము)

త్రిఃసప్తభిః పితా పూతః పితృభిః సహ తేఽనఘ|

యత్సాధోఽస్య గృహే జాతో భవాన్ వై కులపావనః॥6038॥

శ్రీభగవానుడు పలికెను- పుణ్యాత్ముడా! ప్రహ్లాదా! నీవు వంశపావనుడవు. ఆ వంశమున నీవు జన్మించుటవలన నీ తండ్రియే గాక, అతనికి పూర్వజులైన ఇరువది యొక్క తరముల పితృదేవతలు గూడ పునీతులైరి.

10.19 (పందొమ్మిదివ శ్లోకము)

యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః|

సాధవః సముదాచారాస్తే పూయంత్యపి కీకటాః॥6039॥

ప్రశాంతచిత్తులు, సమదర్శనులు, సదాచారపరులైన నీ వంటి నా భక్తులు నివసించు దేశములు అన్నియును పవిత్రములైనవి. అంతేగాక, అపవిత్రములైన కీకట దేశములును పునీతములగును.

10.20 (ఇరువదియవ శ్లోకము)

సర్వాత్మనా న హింసంతి భూతగ్రామేషు కించన|

ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావేన గతస్పృహాః॥6040॥

దైత్యరాజా! నా యందలి భక్తిభావ ప్రభావమున కోరికలు నశించిన వారు సర్వత్ర తమ ఆత్మనే దర్శించుచుందురు. వారు చిన్న, పెద్ద అను భేద భావములు లేకుండ ఏ ప్రాణిని ఎన్నడును హింసింపరు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

8.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

భవంతి పురుషా లోకే మద్భక్తాస్త్వామనువ్రతాః|

భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్॥6041॥

10.22 (ఇరువది రెండవ శ్లోకము)

కురు త్వం ప్రేతకృత్యాని పితుః పూతస్య సర్వశః|

మదంగస్పర్శనేనాంగ లోకాన్ యాస్యతి సుప్రజాః॥6042॥

ప్రహ్లాదా! నిన్ను అనుసరించువారుగూడ నా భక్తులే యగుదురు. నాయనా! వారందరికిని నీవు ఆదర్శభక్తుడవు అగుదువు. నా అంగస్పర్శవలన నీ తండ్రి పూర్తిగా పవిత్రుడైనాడు. ఐనను, నీవు ఆయనకు అంత్యక్రియలను ఆచరింపుము. నీ వంటి కుమారులను గన్నవారికి ఉత్తమ లోకములే ప్రాప్తించును.

10.23 (ఇరువది మూడవ శ్లోకము)

పిత్ర్యం చ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః|

మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః॥6043॥

నాయనా! నీవు నీ తండ్రి యొక్క రాజ్య సింహాసనమును అధిష్ఠింపుము. నా యందు మనస్సును నిలిపి నన్ను శరణు పొందుము. బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల ఆజ్ఞానుసారము నాకు సేవలను ఒనర్చుచు సకల కార్యములను నిర్వహించుచుండుము.

నారద ఉవాచ

10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ప్రహ్లాదోఽపి తథా చక్రే పితుర్యత్సాంపరాయికమ్|

యథాఽఽహ భగవాన్ రాజన్నభిషిక్తో ద్విజోత్తమైః॥6044॥

నారదుడు పలికెను- ధర్మరాజా! నృసింహ భగవానుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు తన తండ్రికి అంత్య క్రియలను ఆచరించెను. అనంతరము బ్రాహ్మణోత్తములు అతనికి రాజ్య పట్టాభిషేకమును ఒనర్చిరి.

10.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ప్రసాదసుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిమ్|

స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః॥6045॥

నృసింహరూపుడుగా నున్న శ్రీహరియొక్క ప్రసన్న వదనమును జూచి, బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో గూడి ఆ దేవదేవుని పవిత్ర వచనములతో స్తుతించుచు ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ

10.26(ఇరువది ఆరవ శ్లోకము)

దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ|

దిష్ట్యా తే నిహతః పాపో లోకసంతాపనోఽసురః॥6046॥

బ్రహ్మదేవుడు పలికెను- దేవదేవా! నీవు సకలదేవతలకు ఆరాధ్యుడవు. సర్వాంతర్యామివి. జీవులకు ప్రాణదాతవు. నాకు తండ్రివి. పాపాత్ముడైన ఈ దైత్యుడు  లోకములను బాధించుచుండెను. వానిని వధించి లోకములకు మహోపకార మొనర్చితివి.

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

యోఽసౌ లబ్ధవరో మత్తో న వధ్యో మమ సృష్టిభిః|

తపోయోగబలోన్నద్ధః సమస్తనిగమానహన్॥6047॥

నేను సృష్టించినట్టి ఏ ప్రాణి చేతను మరణింపకుండునట్లు, ఈ హిరణ్యకశిపుడు నా నుండి వరమును పొందియుండెను. అందు వలన ఇతడు గర్వోన్మత్తుడు అయ్యెను. తపస్సు చేసి, యోగబలమును సంపాదించిన కారణముగా ఇతడు విశృంఖలుడయ్యెను. వేదోక్త కర్మలను అన్నింటిని చెడగొట్టెను.

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

దిష్ట్యాస్య తనయః సాధుర్మహాభాగవతోఽర్భకః|

త్వయా విమోచితో మృత్యోర్దిష్ట్యా త్వాం సమితోఽధునా॥6048॥

దేవా! మా అదృష్టవశమున ఇతని తనయుడైన ప్రహ్లాదకుమారుడు భాగవతోత్తముడయ్యెను. అతనిని నీవు మృత్యుముఖమునుండి రక్షించితివి. నేడు అతడు నిన్ను శరణుజొచ్చెను.

10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః ప్రయతాత్మనః|

సర్వతో గోప్తృ సంత్రాసాన్మృత్యోరపి జిఘాంసతః॥6049॥

పరమాత్మా! నీ ఈ నృసింహరూపము ఏకాగ్రచిత్తముతో ధ్యానించినవాడను. అన్ని విధముల భయముల నుండి ముక్తుడగును. అంతేగాదు, ఏ ప్రాణిని ఐనను సంహరింపదలచి దగ్గరకు చేరిన మృత్యుదేవత కూడ అతనిని ఏమియు చేయజాలదు.

నృసింహ ఉవాచ

10.30 (ముప్పదియవ శ్లోకము)

మైవం వరోఽసురాణాం తే ప్రదేయః పద్మసంభవ|

వరః క్రూరనిసర్గాణామహీనామమృతం యథా॥6050॥

శ్రీనృసింహభగవానుడు పలికెను- పద్మసంభవా! దైత్యులకు ఇట్టి వరములను ఇయ్యరాదు. వారు సహజముగనే క్రూరులు. అట్టివారికి వరములను ఇచ్చినచో, పాములకు పాలుబోసినట్లు అగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

8.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ఇత్యుక్త్వా భగవాన్ రాజంస్తత్రైవాంతర్దధే హరిః|

అదృశ్యః సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా॥6051॥

నారదుడు వచించెను- ధర్మరాజా! నృసింహ భగవానుడు ఈ విధముగా పలికి, బ్రహ్మదేవుని పూజలను స్వీకరించి, అచటనే అంతర్ధానమయ్యెను. సకల ప్రాణులకును అదృశ్యుడయ్యెను.

10.32 (ముప్పది రెండవ శ్లోకము)

తతః సంపూజ్య శిరసా వవందే పరమేష్ఠినమ్|

భవం ప్రజాపతీన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాః॥6052॥

అనంతరము ప్రహ్లాదుడు బ్రహ్మదేవుని, పరమశివుని, ప్రజాపతులను, దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి, శిరసా ప్రణమిల్లెను.

10.33 (ముప్ఫది మూడవ శ్లోకము)

తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః|

దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పతిమ్॥6053॥

పిమ్మట, శుక్రాచార్యుడు మొదలగు మునులతో గూడి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని సమస్త దైత్యులకును, దానవులకును ప్రభువుగా జేసెను.

10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః|

స్వధామాని యయూ రాజన్ బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః॥6054॥

ధర్మరాజా! బ్రహ్మాదిదేవతలు ప్రహ్లాదుని అభినందించి, అతనికి శుభాశీస్సులను పలికిరి. ప్రహ్లాదుడు  గూడా వారందరిని యథాయోగ్యముగా సత్కరించెను. పిమ్మట వారు తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి.

10.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఏవం తౌ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః|

హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ॥6055॥

యుధిష్ఠిరా! ఈ విధముగా విష్ణుపార్షదులైన జయ విజయులు దితికి పుత్రులై జన్మించిరి. వారుభగవంతుని పైైర భావముతోనైనను తమ హృదయములలో ఆ ప్రభువును నిలుపుకొనిరి. శ్రీహరి వారిని హతమార్చి, ఉద్ధరించెను.

10.36 (ముప్పది ఆరవ శ్లోకము)

పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః|

కుంభకర్ణదశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమైః॥6056॥

మహర్షుల శాపకారణముగా వారికి అంతటితో ముక్తి లభింపలేదు. వారే మరుజన్మలో రావణ, కుంభకర్ణులను రాక్షసులై జన్మించిరి. వారిని శ్రీరామచంద్రుడు తన బల పరాక్రమములతో హతమార్చెను.

10.37 (ముప్పది ఏడవ శ్లోకము)

శయానౌ యుధి నిర్భిన్నహృదయౌ రామసాయకైః|

తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని॥6057॥

భగవానుడైన శ్రీరాముడు యుద్ధమునందు వారి హృదయములను భిన్నమొనర్చెను. వారు పూర్వజన్మలలో వలెనే భగవంతుని స్మరించుచు తమ దేహములను త్యజించిరి.

10.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ|

హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః॥6058॥

వారే ఇప్పుడు ఈ యుగమున శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. భగవంతుని యెడ వారికి గల వైర కారణముగా శ్రీకృష్ణునిచే వధింపబడి నీవు చూచుచుండగనే ఆయనలో లీనమైరి.

10.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఏనః పూర్వకృతం యత్తద్రాజానః కృష్ణవైరిణః|

జహుస్త్వంతే తదాత్మానః కీటః పేశస్కృతో యథా॥6059॥

ధర్మరాజా! శ్రీకృష్ణునియెడ వైరభావముతో నున్న రాజులందరును అవసానదశయందు ఆ స్వామిని స్మరించి, తుమ్మెదచే పట్టు కొనబడిన పురుగువలె, తద్రూపమును పొందిరి. అంతవరకును వారు చేసికొనిన పాపములు అన్నియును ప్రక్షాళితములయ్యెను.

10.40 (నలుబదియవ శ్లోకము)

యథా యథా భగవతో భక్త్యా పరమయాభిదా|

నృపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేస్తచ్చింతయా యయుః॥6060॥

భగవంతునకు ప్రియమైన భక్తులు భేద భావరహితులై అనన్య భక్తి ద్వారా భగవత్స్వరూపమును పొందిరి. ఆ విధముగనే శిశుపాలాదిరాజులు గూడ వైర భావముతో నైనను, ఆ దేవదేవుని స్మరించుటవలన భగవానుని సారూప్యమును పొందిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

9.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.41 (నలుబది ఒకటవ శ్లోకము)

ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్|

దమఘోషసుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషామ్॥6061॥

ధర్మరాజా! భగవంతునిపై ద్వేషము వహించు శిశుపాలాదులకును, ఆయన సారూప్యము ఎట్లు లభించినది? అని నీవు అడిగియుంటివి. దానికి సమాధానమును ఇచ్చియున్నాను.

10.42 (నలుబది రెండవ శ్లోకము)

ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః|

అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః॥6062॥

శ్రీకృష్ణపరమాత్మ వేదవేత్తలైన బ్రాహ్మణుల యెడ పూజ్య భావము కలిగియుండువాడు. ఇది ఆయన యొక్క పవిత్రమైన అవతారముల చరిత్ర. ఇందు దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారము వర్ణింపబడినది.

10.43 (నలుబది మూడవ శ్లోకము)

ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ|

భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథాత్మ్యం చాస్య వై హరేః॥6063॥

10.44 (నలుబది నాలుగవ శ్లోకము)

సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనం|

పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్॥6064॥

ఈ సందర్భమున భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క వృత్తాంతమును, భక్తి, జ్ఞాన, వైరాగ్యములును  వర్ణింపబడినవి. అట్లే జగత్తు యొక్క సృష్టిస్థితి లయములకు కారణమైన శ్రీహరి యొక్క యథార్ధస్వరూపమును, అట్లే ఆ ప్రభువు యొక్క దివ్యగుణములును, లీలలును వర్ణింపబడినవి. కాలక్రమముగా దేవతల, దైత్యుల అధికారముల యందు జరిగిన మార్ఫులు గూడ నిరూపింపబడినవి.

10.45 (నలుబది ఐదవ శ్లోకము)

ధర్మో భాగవతానాం చ భగవాన్ యేన గమ్యతే|

ఆఖ్యానేఽస్మిన్ సమామ్నాతమాధ్యాత్మికమశేషతః॥6065॥

భగవత్ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు ఈ గాథయందు తెలుపబడినవి. తెలిసికొనదగిన ఆధ్యాత్మిక విషయములును ఇందులో చక్కగా వివరింపబడినవి.

10.46 (నలుబది ఆరవ శ్లోకము)

య ఏతత్పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితమ్|

కీర్తయేచ్ఛ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే॥6066॥

భగవంతుని పరాక్రమమును గూర్చి తెలుపుచున్న ఈ పవిత్ర వృత్తాంతములను భక్తి, శ్రద్ధలతో కీర్తించిన వారును, వినిన వారును సర్వ కర్మాబంధములనుండి విముక్తులగుదురు.

10.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం  దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత|

దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం  శ్రుత్వానుభావమకుతోభయమేతి లోకం॥6067॥

ఇందు పరమపురుషుడైన పరమాత్మయొక్క ఈ నృసింహావతారగాథయు, హిరణ్యకశిపుని యొక్క ఆయన సేనాపతుల యొక్క వధలును, భక్తశిరోమణియైన ప్రహ్లాదుని పావన చరితము వర్ణింపబడినవి. వీటిని ఏకాగ్రచిత్తముతో వినినవారు, పఠించినవారు, పఠింపజేసినవారు భయరహితమైన పరంధామమును పొందుదురు.

10.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

యూయం నృలోకే బత భూరిభాగాః  లోకం పునానా మునయోఽభియంతి|

యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్॥6068॥.

ధర్మరాజా! ఈ మానవలోకములో మీరు మిగుల భాగ్యశాలులు. ఎందుకనగా, సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మయే మనుష్యరూపమున గుప్తముగా మీ యింట నివసించుచున్నాడు. జగత్తును పునీతమొనర్చునట్టి ఋషులు, మునులు ఆ ప్రభుదర్శనమునకై నలు దిక్కులనుండి పదే పదే మీ ఇంటికి వచ్చుచున్నారు.

10.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యకైవల్యనిర్వాణసుఖానుభూతిః|

ప్రియః సుహృద్వః ఖలు మాతులేయః ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ॥6069॥

శ్రీకృష్ణుడు మాయాస్పర్శ ఏ మాత్రమూ లేని పరమశాంత స్వరూపుడు. ఆయన పరమానంద విగ్రహుడు. ఆ పరబ్రహ్మ పరమాత్మ దర్శనమునకై మహాత్ములు నిరంతరము తహతహ లాడుచుందురు. అట్టి శ్రీకృష్ణుడు మీకు ప్రియమైనవాడు, హితైషి, మేనబావ, పూజ్యుడు, కార్యసహాయకారి, అంతేగాక, సాక్షాత్తుగా గురువు, ఆత్మీయుడు.

10.50 (ఏబదియవ శ్లోకము)

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ  రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్|

మౌనేన భక్త్యోపశమేన పూజితః  ప్రసీదతామేష స సాత్వతాం పతిః॥6070॥

సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు మున్నగువారుగూడ అవాఙ్మానసగోచరుడైన ఆ స్వామి రూపమును వాస్తవముగ వర్ణింపజాలరు. మేమైతే ఆయనకు మౌనముతో భక్తియుక్తులమై సంయమనము ద్వారా నమస్కరించెదము. దానినే ఆ ప్రభువు పూజగా స్వీకరించును. భక్తవత్సలుడైన ఆ ప్రభువు మా పూజలను స్వీకరించి, మమ్ము అనుగ్రహించుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

9.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.51 (ఏబది ఒకటవ శ్లోకము)

స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః|

పురా రుద్రస్య దేవస్య మయేనానంతమాయినా॥6071॥

ధర్మరాజా! శ్రీకృష్ణుడు ఒక్కడే ఆరాధ్యదైవము. పూర్వకాలమునందు గొప్ప మాయావియైన మయాసురుడు శంకరుని యొక్క కీర్తికి కళంకము తెచ్చుటకు ప్రయత్నించెను. అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయన యశస్సును రక్షించి విస్తరింపజేసెను.

రాజోవాచ

10.52 (ఏబది రెండవ శ్లోకము)

కస్మిన్ కర్మణి దేవస్య మయోఽహన్ జగదీశితుః|

యథా చోపచితా కీర్తిః కృష్ణేనానేన కథ్యతామ్॥6072॥

యుధిష్ఠిరుడు నుడివెను నారద మహర్షీ! మయాదానవుడు ఏ కార్యముద్వారా జగదీశ్వరుడైన శివుని యశస్సును నష్ట పరుచదలచెను? శ్రీకృష్ణభగవానుడు ఆయన కీర్తిని ఎట్లు రక్షించెను? దయతో వివరింపుము.

నారద ఉవాచ

నిర్జితా అసురా దేవైర్యుధ్యనేనోపబృంహితైః|

మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః॥6073॥

నారద మహర్షి నుడివెను ఒకానొకసారి శ్రీకృష్ణ భగవానునిచే శక్తిని పొంది, దేవతలు యుద్ధమున అసురులను జయించిరి. అపుడు అసురులు అందరును మాయావులకు పరమగురువైన మయదానవుని శరణు జొచ్చిరి.

10.54 (ఏబది నాలుగవ శ్లోకము)

స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభుః|

దుర్లక్ష్యాపాయసంయోగా దుర్వితర్క్యపరిచ్ఛదాః॥6074॥

శక్తిశాలియైన మయాసురుడు బంగారము, వెండి, ఇనుములతో మూడు పురములను నిర్మించి ఇచ్చెను. అవి విమానాకారములో ఉండెను. వాటి గమనాగమనములు ఎవ్వరికిని తెలియకుండెను. అవి అపరిమితమైన యుద్ధసామాగ్రితో నిండియుండెను.

10.55 (ఏబది ఐదవ శ్లోకము)

తాభిస్తేఽసురసేనాన్యో లోకాంస్త్రీన్ సేశ్వరాన్నృప|

స్మరంతో నాశయాంచక్రుః పూర్వవైరమలక్షితాః॥6075॥

ధర్మరాజా! దైత్య సేనాధిపతుల మనస్సులలో ముల్లోకముల పైనను, లోకపాలుర యెడలను వైరభావము ఉండెను. ఇప్పుడు దానిని స్మరించుచు, వారు తమ మూడు విమానములయందు దాగికొని, వాటి ద్వారా వారిని అందరిని అంతమొందింపసాగిరి.

10.56 (ఏబది ఆరవ శ్లోకము)

తతస్తే సేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం విభో|

త్రాహి నస్తావకాన్ దేవ వినష్టాంస్త్రిపురాలయైః॥6074॥

అంతట లోకపాలురతో గూడి, ప్రజలు అందరును పరమేశ్వరుని శరణుజొచ్చి ఇట్లు ప్రార్దించిరి.- "ప్రభూ! అసురులు త్రిపురములలో నుండి మమ్ములను నాశమొందించుచున్నారు. దేవా! నీవారమైన మమ్ములను రక్షింపుము"

10.57 (ఏబది ఏడవ శ్లోకము)

అథానుగృహ్య భగవాన్మా భైష్టేతి సురాన్ విభుః|

శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత॥6077॥

దేవతల ప్రార్థనలను విని, దయాళువైన పరమశివుడు 'భయపడకుడు' అని పలికి తన ధనుస్సునందు బాణములను సంధించి, ఆ మూడు పురములపై ప్రయోగించెను.

10.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

తతోఽగ్నివర్ణా ఇషవ ఉత్పేతుః సూర్యమండలాత్|

యథా మయూఖసందోహా నాదృశ్యంత పురో యతః॥6078॥

సూర్యమండలము నుండి వెలువడు కిరణములవలె పరమేశ్వరుని బాణమునుండి అసంఖ్యాకములైన బాణములు వెలువడెను. వాటినుండి అగ్నిజ్వాలలు బయలుదేరుచుండెను. ఆ కారణముగా పురములు కనబడకుందెను.

10.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుః స్మ పురౌకసః|

తానానీయ మహాయోగీ మయః కూపరసేఽక్షిపత్॥6079॥

పరమేశ్వరుని బాణముల తాకిడికి ఆ విమానములలోని వారందరును అసువులను బాసి, క్రిందబడిపోవుచుండిరి. మహా మాయావియైన మయుడు పెక్కు మాయోపాయములను ఎరిగినవాడు. అందువలన అతడు తస మాయల ద్వారా వారిని బ్రతికించుచు తాను నిర్మించిన అమృతకూపమునందు పడవేయుచుండెను.

10.60 (అరువదియవ శ్లోకము)

సిద్ధామృతరసస్పృష్టా వజ్రసారా మహౌజసః|

ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుతా ఇవ వహ్నయః॥6080॥

ఆ సిద్ధామృతము యొక్క రస స్పర్శచే అసురుల శరీరములు మిక్కిలి తేజస్సుతో ఒప్పుచు  వజ్రమువలె బలిష్ఠములగు చుండెను. అంతట వారు మేఘములను చీల్చుకొని  వచ్చుచున్న మెరుపు తీగలవలె లేచి నిలబడుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

10.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదియవ అధ్యాయము

ప్రహ్లాదునకు రాజ్యపట్టాభిషేకము - త్రిపురాసుర సంహారము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.61 (అరువది ఒకటవ శ్లోకము)

విలోక్య భగ్నసంకల్పం విమనస్కం వృషధ్వజమ్|

తదాయం భగవాన్ విష్ణుస్తత్రోపాయమకల్పయత్॥6081॥

మహాదేవుడు తన సంకల్పము నెరవేరక పోవుటచే నిరాశకు లోనగుచుండెను. శ్రీకృష్ణభగవానుడు అతనిని జూచి, అసురులను జయించుటకు ఒక ఉపాయమును పన్నెను.

10.62 (అరువది రెండవ శ్లోకము)

వత్స ఆసీత్తదా బ్రహ్మా స్వయం విష్ణురయం హి గౌః|

ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ॥6082॥

వెంటనే శ్రీమహావిష్ణువు గోవుగను, బ్రహ్మదేవుడు దూడగను మారిపోయిరి. వారు ఇద్దరు మధ్యాహ్న సమయమున అభిజిన్మూహూర్తమునందు ఆ మూడుపురముల యందు ప్రవేశించి, అమృత కూపము నందలి అమృతమును త్రాగివేసిరి.

10.63 (అరువది మూడవ శ్లోకము)

తేఽసురా హ్యపి పశ్యంతో న న్యషేధన్ విమోహితాః|

తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ॥6083॥

10.64 (అరువది నాలుగవ శ్లోకము)

స్వయం విశోకః శోకార్తాన్ స్మరన్ దైవగతిం చ తామ్|

దేవోఽసురో నరోఽన్యో వా నేశ్వరోఽస్తీహ కశ్చన॥6084॥

10.65 (అరువది ఐదవ శ్లోకము)

ఆత్మనోఽన్యస్య వా దిష్టం దైవేనాపోహితుం ద్వయోః|

అథాసౌ శక్తిభిః స్వాభిః శంభోః ప్రాధనికం వ్యధాత్॥6085॥

ఆ అమృతకూపమును రక్షించు దైత్యులు ఆ ఆవును, దూడను చూచుచున్నప్పటికిని విష్ణుమాయా మోహితులై వాటిని అడ్డగింపరైరి. పెక్కు ఉపాయములను ఎరిగిన మయాసురునకు ఈ విషయము తెలిసెను. అప్పుడు అతడు భగవంతుని ఈ లీలను స్మరించినంత మాత్రముననే అతనికి ఎట్టి శోకమూ కలుగలేదు. అప్పుడు అమృతరక్షకులైన అసురులతో ఇట్లనెను- "సోదరులారా! దేవతలు, అసురులు, మానవులు మరే ప్రాణికైనను తమకు, ఇతరులకు విధింపబడిన ప్రారబ్ధమును తుడిచిపెట్టలేరు. కానున్నది కాకమానదు కదా! శోకించనందువలన ప్రయోజనము ఏమి?" అనంతరము శ్రీకృష్ణభగవానుడు తన శక్తులతో శంకరునకు యుద్ధ సామాగ్రిని సమకూర్చెను.

10.66 (అరువది ఆరవ శ్లోకము)

ధర్మజ్ఞానవిరక్త్యృద్ధితపోవిద్యాక్రియాదిభిః|

రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మశరాది యత్॥6086॥

ఆ ప్రభువు ధర్మముతో రథమును, జ్ఞానముచే సారథిని, వైరాగ్యముచే ధ్వజమును, ఐశ్వర్యముల ద్వారా గుర్రములను, తపోబలముతో ధనుస్సును, విద్యచే కవచమును, క్రియలచే బాణములను నిర్మించెను. తన ఇతర శక్తుల ద్వారా ఇతర వస్తువులను నిర్మించెను.

10.67 (అరువది ఏడవ శ్లోకము)

సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే|

శరం ధనుషి సంధాయ ముహూర్తేఽభిజితీశ్వరః॥6087॥

10.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)

దదాహ తేన దుర్భేద్యా హరోఽథ త్రిపురో నృప|

దివి దుందుభయో నేదుర్విమానశతసంకులాః॥6088॥

10.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)

దేవర్షిపితృసిద్ధేశా జయేతి కుసుమోత్కరైః|

అవాకిరన్ జగుర్హృష్టా  ననృతుశ్చాప్సరోగణాః॥6089॥

ఆ సామాగ్రులతో సన్నద్ధుడైన శంకర భగవానుడు రథమును అధిరోహించి, ధనుర్బాణములను ధరించెను. అభిజిన్ముహూర్తమున ధనుస్సునందు బాణములను సంధించి, దుర్భేద్యమైన ఆ మూడు విమానములను భస్మమొనర్చెను. ధర్మరాజా! ఆ సమయమున స్వర్గమునందు దుందుభులు మ్రోగెను. వందలకొలది విమానములు ఆకాశమునందు గుంపులు గట్టెను. దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు ఆనందముతో జయజయధ్వానములు పలికిరి. పుష్పవర్షములు కురిపించిరి. అప్సరసలు నృత్యములు చేసిరి.

10.70 (డెబ్బదియవ శ్లోకము)

ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్ పురహా నృప|

బ్రహ్మాదిభిః స్తూయమానః స్వధామ ప్రత్యపద్యత॥6090॥

ధర్మరాజా! ఈ విధముగా మూడు పురములను దహించి, పరమశివుడు పురారి అని ప్రసిద్ధికెక్కెను. బ్రహ్మాది దేవతలు ఆ శంకరభగవానుని స్తుతించుచు తమ తమ లోకములకు వెళ్ళిపోయిరి.

10.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)

ఏవం విధాన్యస్య హరేః స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః|

వీర్యాణి గీతాన్యృషిభిర్జగద్గురోర్లోకాన్  పునానాన్యపరం వదామి కిం॥6091॥

సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు, జగద్గురువు ఐన శ్రీకృష్ణభగవానుడు తస మాయచే మానవులవలె లీలలను నెరపెను. లోకపావనుడైన ఆ స్వామి యొక్క లీలలను, బలపరాక్రమములను ఋషులు కీర్తించిరి. లోకములను పావనము చేయునట్టి ఆ స్వామి గాథలను గురుంచి ఇంకను ఏమి చెప్పవలెను?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమోఽధ్యాయః (10)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment