Monday, 13 July 2020

సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

[03:10, 12/07/2020] +91 95058 13235: 12.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

బ్రహ్మచర్య, వానప్రస్థాశ్రమముల నియమములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

12.1 (ప్రథమ శ్లోకము)

బ్రహ్మచారీ గురుకులే వసన్ దాంతో గురోర్హితమ్|

ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢసౌహృదః॥6127॥

నారదుడు పలికెను- ధర్మరాజా! బ్రహ్మచారి గురుకులము నందు నివసించుచు, ఇంద్రియ నిగ్రహము కలిగియుండవలెను. దాసునివలె వినమ్రుడై గురుదేవుని పాదములయందు దృఢమైన అనురాగము కలిగి, ఆయనకు హితమైన కార్యములను ఆచరించుచుండవలెను.

12.2 (రెండవ శ్లోకము)

సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యర్కసురోత్తమాన్|

ఉభే సంధ్యే చ యతవాగ్జపన్ బ్రహ్మ సమాహితః॥6128॥

ప్రాతఃకాలమునందు, సాయం సమయము నందును (ఉభయసంధ్యల యందును), గురువును సేవించుచుండవలెను. అగ్నిని, సూర్యుని, శ్రీహరిని ఉపాసించుచుండవలెను. మౌనము వహించి, ఏకాగ్రతతో గాయత్రీ మంత్రమును జపించుచు సంధ్యావందనమును చేయుచుండవలెను.

12.3 (మూడవ శ్లోకము)

ఛందాంస్యధీయీత గురోరాహూతశ్చేత్సుయంత్రితః|

ఉపక్రమేఽవసానే చ చరణౌ శిరసా నమేత్॥6129॥

గురువు పిలిచిన సమయములలో ఆయన కడకు వెళ్ళి, ఆయన ఆజ్ఞలను పాటించుచుండవలెను. వేదాధ్యయనము చేయుచుండవలెను. అధ్యయనమునకు ముందును, తరువాతను ఆయన పాదములకు శిరసా ప్రణమిల్లవలెను.

12.4 (నాలుగవ శ్లోకము)

మేఖలాజినవాసాంసి జటాదండకమండలూన్|

బిభృయాదుపవీతం చ దర్భపాణిర్యథోదితమ్॥6130॥

12.5 (ఐదవ శ్లోకము)

సాయం ప్రాతశ్చరేద్భైక్షం గురవే తన్నివేదయేత్|

భుంజీత యద్యనుజ్ఞాతో నో చేదుపవసేత్క్వచిత్॥6131॥

శాస్త్రములలో పేర్కొనబడినట్లుగా, కటిసూత్రమును, జింకచర్మమును, వస్త్రములను, జడలను, దండమును, కమండలమును, యజ్ఞోపవీతమును కలిగియుండవలెను. చేతితో దర్భలను, ధరించి యుండవలెను. ప్రాతఃకాలమునందును, సాయం సమయమునను భిక్షలను తీసికొని వచ్చి గురువునకు నివేదించుచుండవలెను. ఆయన ఆజ్ఞయైనచో, దానిని భుజించుచుండవలెను. లేనిచో, ఉపవసించుచుండవలెను.

12.6 (ఆరవ శ్లోకము)

సుశీలో మితభుగ్దక్షః శ్రద్దధానో జితేంద్రియః|

యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు  స్త్రీనిర్జితేషు చ॥6132॥

బ్రహ్మచారి తన శీలమును రక్షించుకొనుచు మితముగా భుజించుచుండవలెను. తన కార్యములను దక్షతతో ఆచరించుచుండవలెను. జాగరూకుడై ఇంద్రియ నిగ్రహము కలిగియుండవలెను. స్త్రీలతోను, స్త్రీకి సంబంధించినవారితోను అవసరము ఉన్నంతవరకే మాట్లాడవలెను.

12.7 (ఏడవ శ్లోకము)

వర్జయేత్ప్రమదాగాథామగృహస్థో బృహద్వ్రతః|

ఇంద్రియాణి ప్రమాథీని హరంత్యపి యతేర్మనః॥6133॥

గృహస్థుడు అగునంతవరకును బ్రహ్మచర్యవ్రతమును పాటింపవలెను. స్త్రీల చర్చలకు దూరముగా ఉండవలెను. ఇంద్రియములు బలీయమైనవి. అవి యతీశ్వరుల మనస్సులను గూడ క్షోభపెట్టగలవు.

12.8 (ఎనిమిదవ శ్లోకము)

కేశప్రసాధనోన్మర్దస్నపనాభ్యంజనాదికమ్|

గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా॥6134॥

యువకుడైన బ్రహ్మచారి యువతులైన స్త్రీల తోడను, గురు పత్నులతోడను కేశాలంకరణమును, నలుగు బెట్టి స్నానాది కృత్యములను చేయించుకొనరాదు.

12.9 (తొమ్మిదవ శ్లోకము)

నన్వగ్నిః ప్రమదా నామ ఘృతకుంభసమః పుమాన్|

సుతామపి రహో జహ్యాదన్యదా యావదర్థకృత్॥6135॥

స్త్రీలు నిప్పువంటివారు. పురుషులు నేతికుండల వంటివారు. ఏకాంతమున కుమార్తెలతోను ఉండరాదు. ఇతర సమయములయందు అవసరము ఉన్నంతవరకే మసలు కొనవలెను.

12.10 (పదియవ శ్లోకము)

కల్పయిత్వాఽఽత్మనా యావదాభాసమిదమీశ్వరః|

ద్వైతం తావన్న విరమేత్తతో హ్యస్య విపర్యయః॥6136॥

జీవుడు స్వయంగా ఈ విశ్వమంతయు ఆభాసమైనదని (కాంతివంతమైనదని), ప్రతీతి మాత్రమే కాని, సత్యమైనది కాదని ఆత్మచింతనద్వారా నిశ్చయింపవలెను. అంతవరకు అతనికి స్త్రీ-పురుషుడు అనే ద్వైత లేదా భేదబుద్ధి నశింపదు. ద్వైతబుద్ధి నశించునంత వరకు అజ్ఞానమే ఆవరించియున్నదని గమనింపవలెను. అంతేగాక, అట్టి ద్వైతబుద్ధి ఉండుటవలన స్త్రీయెడల కామన గలిగి, భోగ్యబుద్ధి కలుగునుకదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
[20:11, 12/07/2020] +91 95058 13235: 12.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

బ్రహ్మచర్య, వానప్రస్థాశ్రమముల నియమములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

12.11 (పదకొండవ శ్లోకము)

ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి|

గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః॥6137॥

శమ-దమాది గుణములన్నియును బ్రహ్మచారికే గాక గృహస్థునకును, యతీశ్వరునకు గూడ విహితములు. కాని భార్యతో కాపురము చేయుచున్న పురుషుడు గురువునొద్దయుండి ఆయనకు అవసరము ఉన్నంతవరకే సేవచేయుచుండవలెను.

12.12 (పండ్రెండవ శ్లోకము)

అంజనాభ్యంజనోన్మర్దస్త్ర్యవలేఖామిషం మధు|

స్రగ్గంధలేపాలంకారాంస్త్యజేయుర్యే ధృతవ్రతాః॥6138॥

బ్రహ్మచర్యవ్రతమును అనుష్ఠించువాడు కన్నులకు కాటుక పెట్టుకొనుట, శరీరమున తైలమర్దనమును చేసికొనుట మొదలగు వాటిని వర్జింపవలయును. మద్యమాంసములను, పూలదండలను, చందనాదిలేపనములను, భూషణములను త్యజింపవలయును.

12.13 (పదమూడవ శ్లోకము)

ఉషిత్వైవం గురుకులే ద్విజోఽధీత్యావబుధ్య చ|

త్రయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలమ్॥6139॥

ఈ విధముగా బ్రహ్మచర్యము నందు  ఉన్న ద్విజులు గురుకులమునందు నివసించుచు తనశక్తి, అవసరముల మేరకు వేదములను, వేదాంగములను, ఉపనిషత్తులను అధ్యయనము చేయుచు జ్ఞానమును ఆర్జింపవలెను.

12.14 (పదునాలుగవ శ్లోకము)

దత్త్వా వరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వరః|

గృహం వనం వా ప్రవిశేత్ప్రవ్రజేత్తత్ర వా వసేత్॥6140॥

తన సామర్థ్యము మేరకు (యథాశక్తి) గురువునకు కోరినంత దక్షిణను సమర్పింపవలెను. అనంతరము ఆయన ఆజ్ఞతో గృహస్థాశ్రమమును, వానప్రస్థమును, లేక సన్న్యాసమును స్వీకరింపవలయును. యావజ్జీవితము బ్రహ్మచర్యమును పాటించువారు అదే ఆశ్రమమునందు ఉండవచ్చును.

12.15 (పదునైదవ శ్లోకము)

అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజమ్|

భూతైః స్వధామభిః పశ్యేదప్రవిష్టం ప్రవిష్టవత్॥6141॥

భగవంతుడు సర్వత్ర వ్యాపించియున్నాడు. కావున, ఆ ప్రభువు ఒక చోట ప్రవేశించినాడని చెప్పుట ఔపచారికమే కాని, సముచితముకాదు. కావున, ప్రాణులన్నింటియందు భగవద్బుద్ధిని కలిగియుండవలెను. అయితే, అగ్నియందు, గురువునందు, ఆత్మయందు, తనను ఆశ్రయించియున్న జీవులయందు విశేషమైన భగద్బుద్ధిని కలిగియుండవలెను.

12.16 (పదునారవ శ్లోకము)

ఏవం విధో బ్రహ్మచారీ వానప్రస్థో యతిర్గృహీ|

చరన్ విదితవిజ్ఞానః పరం బ్రహ్మాధిగచ్ఛతి॥6142॥

ఈ నియమములను ఆచరించు బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్న్యాసి మరియు గృహస్థుడుగూడ విజ్ఞానసంపన్నుడై పరబ్రహ్మ తత్త్వమును అనుభవించును.

12.17 (పదునేడవ శ్లోకము)

వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ మునిసమ్మతాన్|

యానాతిష్ఠన్ మునిర్గచ్ఛేదృషిలోకమిహాంజసా॥6143॥

ఇప్పుడు నేను ఋషి ప్రోక్తములైన వానప్రస్థాశ్రమ నియమములను గూర్చి తెలిపెదను. వాటిని ఆచరించుటవలన వానప్రస్థాశ్రమమున ఉండెడివారు అనాయాసముగా ఋషిలోకమైన మహర్లోకమును చేరుదురు.

12.18 (పదునెనిమిదవ శ్లోకము)

న కృష్టపచ్యమశ్నీయాదకృష్టం చాప్యకాలతః|

అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహరేత్॥6144॥

వానప్రస్థుడు పొలమును దున్ని పండించిన బియ్యము, గోధుమలు మొదలగు ఆహార పదార్థములను తినకూడదు. భూమినుండి సహజముగా ఉత్పన్నమైన ఆహారపదార్థములను గూడ కాలముగాని కాలములో తినరాదు. అట్లే, అగ్ని పక్వమైన ఆహారపదార్థములను, ఉడకబెట్టని పచ్చి పదార్థములను భుజింపరాదు. కేవలము సూర్యతాపముచే పండిన కందమూల ఫలాదులను స్వీకరింపవలెను.

12.19 (పందొమ్మిదవ శ్లోకము)

వన్యైశ్చరుపురోడాశాన్ నిర్వపేత్కాలచోదితాన్|

లబ్ధే నవే నవేఽన్నాద్యే పురాణం తు పరిత్యజేత్॥6145॥

వనములలో సహజముగా పండిన ధాన్యములతో, చరువును (హవ్యము), పురోడాశమును (యజ్ఞార్థము చేయు పిండివంట), తయారుచేసి నిత్యనైమిత్తిక కార్యములయందు హోమము చేయవలెను. నూతనముగా ఆహారపదార్థములు, ఫలములు, పుష్పములు దొరికినచో, పాతవాటిని పరిత్యజింపవలెను.

12.20 (ఇరువదియవ శ్లోకము)

అగ్న్యర్థమేవ శరణముటజం వాద్రికందరామ్|

శ్రయేత హిమవాయ్వగ్నివర్షార్కాతపషాట్ స్వయమ్॥6146॥

వానప్రస్దుడు హోమాగ్నులను రక్షించుటకొరకే పర్ణశాలనుగాని, కొండగుహనుగాని ఆశ్రయింపవలెను. తాను చలిని, వాయువును, అగ్నిని, వర్షములను, వేసవితాపములను సహింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


13.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము

బ్రహ్మచర్య, వానప్రస్థాశ్రమముల నియమములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

కేశరోమనఖశ్మశ్రుమలాని జటిలో దధత్|

కమండల్వజినే దండవల్కలాగ్నిపరిచ్ఛదాన్॥6147॥

శిరమున జడలను ధరించవలెను. కేశములు, రోమములు, గడ్డములు, మీసములు తీసివేయరాదు. శరీరమునగల మాలిన్యములను ఉపేక్షింపవలెను. కమండలవు, జింకచర్మము, దండము, వల్కలములు, అగ్నిహోత్రమునకు సంబంధించిన స్రుక్కు (యజ్ఞములో నెయ్యి వేయు కర్రగరిట) మొదలగు సామాగ్రులను కలిగియుండవలెను.

12.22 (ఇరువది రెండవ శ్లోకము)

చరేద్వనే ద్వాదశాబ్దానష్టౌ వా చతురో మునిః|

ద్వావేకం వా యథా బుద్ధిర్న విపద్యేత కృచ్ఛ్రతః॥6148॥

వానప్రస్థుడు పన్నెండు, ఎనిమిది, నాలుగు, రెండు లేక ఒక సంవత్సరము వరకు వానప్రస్థనియమములను పాటింపవలెను. ధ్యానము, తపశ్చర్యలు మొదలగు సాధనలో కష్టములు ఎక్కువైనప్పుడు బుద్ధి నష్టము కాకుండ చూచుకొనవలెను.

12.23 (ఇరువది మూడవ శ్లోకము)

యదాకల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా|

ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికమ్॥6149॥

వానప్రస్థుడు రోగములవలనగాని, వార్థక్యకారణమునగాని తన విధులను ఆచరింపజాలక వేదాంత చర్చలకు సమర్థుడు కాకున్నచో, అతడు నిరాహారాది వ్రతములను ఆచరింపవలెను.

12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్న్యస్యాహంమమాత్మతామ్|

కారణేషు న్యసేత్సమ్యక్ సంఘాతం తు యథార్హతః॥6150॥

అనశనవ్రతమునకు ముందుగా వానప్రస్థుడు ఆహవనీయాది అగ్నులను తన ఆత్మయందే లీనమొనర్చుకొనవలెను. నేను-నాది అను భావములను (అహంకార-మమకారములను ) త్యజించి, శరీరమును దానికి కారణభూతములైన తత్త్వములయందు యథాయోగ్యముగా లీనమొనర్చు కొనవలెను.

12.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఖే ఖాని వాయౌ నిశ్వాసాంస్తేజస్యూష్మాణమాత్మవాన్|

అప్స్వసృక్శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవమ్॥6151॥

పురుషుడు జితేంద్రియుడై తన శరీరము యొక్క ఇంద్రియములను ఆకాశమునందును, ప్రాణాపానములను వాయువునందును, శరీరపు వేడిని అగ్నియందును, చీము, రక్తము, కఫము, మూత్రము మొదలగు జలతత్త్వములను జలములయందును, ఎముకలు స్థూల వస్తువులను పృథ్వియందు లీనమొనర్పవలయును.

12.26 (ఇరవది ఆరవ శ్లోకము)

వాచమగ్నౌ సవక్తవ్యామింద్రే శిల్పం కరావపి|

పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ॥6152॥

12.27 (ఇరువది ఏడవ శ్లోకము)

మృత్యౌ పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్|

దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శమధ్యాత్మని త్వచమ్॥6153॥

12.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

థరూపాణి చక్షుషా రాజన్ జ్యోతిష్యభినివేశయేత్|

అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్॥6154॥

అదే విధముగా వాక్కును, దాని కర్మయైన భాషణమును, వాటి అధిష్ఠాన దేవతయైన అగ్నియందును, హస్తములను, వాటితో నెరవేరు కళాకౌశలములను ఇంద్రునియందును, పాదములను వాటియొక్క గతిని కాలస్వరూపుడైన విష్ణువు నందును, రతి-ఉపస్థలను ప్రజాపతి యందును, మలమూత్రములను వాటికి ఆశ్రయము ఐన మృత్యువునందును లీన మొనర్పవలెను. శ్రోత్రేంద్రియమును దాని ద్వారా వినునట్టి శబ్దములను దిశలయందు లీనము చేయవలెను. స్పర్శ, చర్మములను వాయువునందును, నేత్రములతో సహా రూపమును జ్యోతులయందును, మాధుర్యము మొదలగు రుచులతో సహా రసేంద్రియమును జలమునందును, ఘ్రాణేంద్రియమును, దానిద్వారా వాసనను చూచునట్టి గంధమును పృథ్వియందును లీనమొనర్పవలెను.

12.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

మనో మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే|

కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహంమమతాక్రియా|

సత్త్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే॥6155॥

మనోరథములతో బాటు మనస్సును చంద్రునియందును, అవగాహన చేసికొన్నట్టి పదార్థములతో సహా బుద్ధిని బ్రహ్మయందును, అహంకార-మమకార క్రియలకు కారణమైన అహంకారమును, దాని కర్మలను రుద్రునియందు లీనము చేయవలెను. అదేవిధముగా చేతనా సహితమైన చిత్తమును క్షేత్రజ్ఞుని (జీవుని) యందును, గుణములకు కారణమైన వికారములతో ప్రతీతమగు జీవుని పరబ్రహ్మము నందును, లీనమొనర్పవలెను.

12.30 (ముప్పదియవ శ్లోకము)

అప్సు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముమ్|

కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేఽక్షరే చ తత్॥6156॥

పృథ్విని జలమునందును, జలమును అగ్నియందును, అగ్నిని వాయువునందును, వాయువును ఆకాశమునందును, ఆకాశమును అహంకారమునందును, అహంకారమును మహత్తత్త్వమునందును, మహత్తత్త్వమును అవ్యక్తము నందును, అవ్యక్తమును శాశ్వతుడైన పరమాత్మ యందును లయమొనర్పవలెను.

12.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

థఇత్యక్షరతయాఽఽత్మానం చిన్మాత్రమవశేషితమ్|

జ్ఞాత్వాద్వయోఽథ విరమేద్దగ్ధయోనిరివానలః॥6157॥

ఈ విధముగా అనాత్మలను అన్నింటిని నిషేధించగా చివరకు మిగిలిన శుద్ధచైతన్య స్వరూపమగు ఆత్మను నేను అని తెలిసికొని, అద్వితీయమైన శాశ్వతుడైన పరమాత్మయందు (అద్వైత) భావమునందు స్థితుడు కావలెను. అగ్నికి ఆశ్రయమైన కాష్ఠాదులు భస్మమైన పిమ్మట అగ్ని శాంతమై స్వస్వరూపమునందు స్థితమైనట్లు ఆత్మ తన స్వరూపమునందు స్థితమగును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వాదశోఽధ్యాయః (12)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పండ్రెండవ అధ్యాయము (12)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment