Friday, 17 July 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - పదునాలుగవ అధ్యాయము


15.7.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునాలుగవ అధ్యాయము

గృహస్థాశ్రమ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

యుధిష్ఠిర ఉవాచ

14.1 (ప్రథమ శ్లోకము)

గృహస్థ ఏతాం పదవీం విధినా యేన చాంజసా|

యాతి దేవఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీః॥6204॥

ధర్మరాజు వచించెను- దేవర్షీ! గృహాసక్తులైన మా వంటి గృహస్థులు సులభముగా ఏ విధానముద్వారా ఈ పదవిని పొందగలరో, దయతో తెలుపుము.

నారద ఉవాచ

14.2 (రెండవ శ్లోకము)

గృహేష్వవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ గృహోచితాః|

వాసుదేవార్పణం సాక్షాదుపాసీత మహామునీన్॥6205॥

నారదుడు వచించెను - మహారాజా! గృహస్థాశ్రమమునకు చెందిన మానవులు తమ తమ గార్హస్థ్య ధర్మములను ఆచరించుచుండవలెను. వాటిని సాక్షాత్తుగా భగవంతునకే సమర్పించుచుండవలెను. మహామునులను గూడ సేవింపవలెను. ఈ మూడు విధములగు నియమములను పాటింపవలెను.

14.3 (మూడవ శ్లోకము)

శృణ్వన్ భగవతోఽభీక్ష్ణమవతారకథామృతమ్|

శ్రద్దధానో యథాకాలముపశాంతజనావృతః॥6206॥

గృహస్థుడు సమయానుసారము విరాగులతోగూడి యుండవలెను. పదే పదే భక్తి శ్రద్ధలతో భగవంతునియొక్క అవతారలీలామృతమును గ్రోలుచుండవలెను.

14.4 (నాలుగ శ్లోకము)

సత్సంగాచ్ఛనకైః సంగమాత్మజాయాత్మజాదిషు|

విముచ్యేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థితః॥6207॥

నిద్రనుండి లేచిన మనుష్యుడు తాను స్వప్నములో చూచిన విషయములయందు ఆసక్తుడు కాడు. అట్లే అతడు సత్సాంగత్యము వలన పరిశుద్ధ మనస్కుడై శరీరము, భార్యాపుత్రులు, ధనము మొదలగు  వాటియందు ఆసక్తిని విడచి పెట్టవలెను. ఏలయన, ఏదో ఒకరోజు వాటిని విడిచి పెట్టవలసియేయుండును కదా!

14.5 (ఐదవ శ్లోకము)

యావదర్థముపాసీనో దేహే గేహే చ పండితః|

విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం న్యసేత్॥6208॥

బుద్ధిమంతుడు అవసరము ఉన్నంతవరకే శరీరమునకును, గృహమునకు సంబంధించిన కృత్యములను చేయుచుండవలెను. ఆంతరికముగా నిరాసక్తుడైనను, బయటికి ఆసక్తియున్న సామాన్య మానవునివలె ప్రవర్తించవలెను.

14.6 (ఆరవ శ్లోకము)

జ్ఞాతయః పితరౌ పుత్రా భ్రాతరః సుహృదోఽపరే|

యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః॥6209॥

తల్లిదండ్రులు, సోదరులు, పుత్రులు, బంధుమిత్రులు మొదలగు వారు చెప్పిన విషయములను, అంశములను విని, ఎట్టి మమకారమూ లేకుండా వాటిని ఆమోదింపవలెను.

14.7 (ఏడవ శ్లోకము)

దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుతనిర్మితమ్|

తత్సర్వముపయుంజాన ఏతత్కుర్యాత్స్వతో బుధః॥॥6210॥

బుద్ధిమంతుడు వర్షము ద్వారా లభ్యమైన ఆహార పదార్థములను, పృథ్వినుండి ఉత్పన్నమైన బంగారము మొదలగు ఖనిజములకును, అకస్మాత్తుగా లభించిన ద్రవ్యము మున్నగువాటిని భగవంతునిచే ఇయ్యబడినవని తెలిసికొనవలెను. ప్రారబ్ధానుసారము లభించినవాటిని  అనుభవించుచుండవలెను. వాటిని ఎన్నడును కూడబెట్టకుండ సత్పురుషుల సేవలు మొదలగు కార్యములయందు వినియోగింపవలెను.

14.8 (ఎనిమిదవ శ్లోకము)

యావద్భ్రియేత జఠరం తావత్స్వత్వం హి దేహినామ్|

అధికం యోఽభిమన్యేత స స్తేనో దండమర్హతి॥6211॥

ఎంతటి సంపదతో తన పొట్ట నిండగలదో, అంతటి సంపదపైననే ఆ వ్యక్తికి అధికారముండును. దానికి మించిన సంపదను తనదని భావించువాడు చోరుడు అగును. అందుకు ఆ వ్యక్తి శిక్షార్హుడు కాగలడు.

14.9 (తొమ్మదవ శ్లోకము)

మృగోష్ట్రఖరమర్కాఖుసరీసృప్ఖగమక్షికాః|

ఆత్మనః పుత్రవత్పశ్యేత్తైరేషామంతరం కియత్॥6212॥

మృగములు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, సరీసృపములు (ప్రాకుచు వెళ్ళుజీవులు), పక్షులు, ఈగలు మున్నగువాటిని గృహస్థుడు   తన పుత్రులుగా భావింపవలెను. వాటికిని, తన పుత్రులకునుగల భేదమేమి?

14.10 (పదియవ శ్లోకము)

త్రివర్గం నాతికృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపి|

యథాదేశం యథాకాలం యావద్దైవోపపాదితమ్॥6213॥

గృహస్థుడు ధర్మార్థకామములకు ఎక్కువ శ్రమపడరాదు. దేశము, కాలము ప్రారబ్ధమును బట్టి దొరికిన దానితో సంతష్టుడై ఉండవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



16.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునాలుగవ అధ్యాయము

గృహస్థాశ్రమ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

14.11 (పదకకొండవ శ్లోకము)

ఆశ్వాఘాంతేఽవసాయిభ్యః కామాన్ సంవిభజేద్యథా|

అప్యేకామాత్మనో దారాం నృణాం స్వత్వగ్రహో యతః॥6214॥

గృహస్థుడు తన సమస్త భోగసామాగ్రిని కుక్కలు, నిమ్నజాతులవారు మొదలగు ప్రాణులకు యథాయోగ్యముగా పంచియిచ్చి, పిదప వాటిని తాను ఉపయోగింపవలెను. తనకు ఆత్మీయురాలైన భార్యకు కూడ అతిథులు మొదలగు వారి సేవలయందు నియమింపవలెను.

14.12 (పండ్రెండవ శ్లోకము)

జహ్యాద్యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుమ్|

తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాద్యస్తేన హ్యజితో జితః॥6215॥

మానవుడు తన భార్యకొరకై తన ప్రాణములను గూడ త్యజించుటకు సిద్ధపడును. ఒక్కొక్కసారి తన తల్లిదండ్రులను, గురువునుగూడ ఆమె కొఱకై హతమార్చును. భార్యయందుగల తన వ్యామోహమును విడిచి పెట్టినవాడే, ఒటమినెరుగని భగవంతునిపైగూడ విజయమును సాధించును.

14.13 (పదమూడవ శ్లోకము)

కృమివిడ్భస్మనిష్ఠాంతం క్వేదం తుచ్ఛం కలేవరమ్|

క్వ తదీయరతిర్భార్యా క్వాయమాత్మా నభశ్ఛదిః॥6216॥

తుదకు క్రిములు, మలము, బూడిదరాశిగా మార్పును చెందునట్టి తుచ్ఛమగు ఈ శరీరమెక్కడ? ఆ శరీరమునందు ప్రీతిగల భార్య ఎక్కడ? ఆకాశమువలె వీటన్నిటికి అతీతమైన ఆత్మ ఎక్కడ? (ఆత్మ శరీరము కంటెను, ప్రేమాస్పదులగు భార్యాపుత్రులకంటెను, అతీతమైనది).

14.14 (పదునాలుగవ శ్లోకము)

సిద్ధైర్యజ్ఞావశిష్టార్థైః కల్పయేద్వృత్తిమాత్మనః|

శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్॥6217॥

గృహస్థుడు తన ప్రారబ్ధము మేరకు ప్రాప్తించిన ఆహార పదార్థములను పంచయజ్ఞములకు వినియోగించిన పిదప, మిగిలిన దానితో తన జీవితమును గడపవలెను. అంతేకాని, ప్రాజ్ఞుడు దేనిపైననూ ఇదినాది అను భావము కలిగియుండరాదు. అప్పుడు అతనికి సత్పురుషులు పొందు పదవి లభింపగలదు.

14.15 (పదునైదవ శ్లోకము)

దేవాన్ ఋషీన్ నృభూతాని పితౄనాత్మానమన్వహమ్॥

స్వవృత్త్యాగతవిత్తేన యజేత పురుషం పృథక్॥6218॥

గృహస్థుడు తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా ప్రాప్తించిన సంపదతో ప్రతిదినము దేవతలు, ఋషులు, మనుష్యులు, ప్రాణులు, పితృగణములు, ఇతర ప్రాణులు, మొదలగువాటిని తృప్తిపరచుటద్వారా ఆరాధింపవలెను. అట్లే తన ఆత్మను  గూడ సేవింపవలెను. తద్ద్వారా వేర్వేరు రూపములలో గల భగవంతుని ఆరాధించినట్లగును.

14.16 (పదునారవ శ్లోకము)

యర్హ్యాత్మనోఽధికారాద్యాః సర్వాః స్యుర్యజ్ఞసంపదః|

వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్॥6219॥

గృహస్థుడు తన యోగ్యతను అనుసరించి, యజ్ఞములను అవసరమగు వస్తువులను అన్నింటిని సమకూర్చుకొన గలిగినప్పుడే గొప్ప గొప్ప యజ్ఞములద్వారా, అగ్నిహోత్రాదుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను.

14.17 (పదునేడవ శ్లోకము)

న హ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్|

ఇజ్యేత హవిషా రాజన్ యథా విప్రముఖే హుతైః॥6220॥

ధర్మరాజా! సకల యజ్ఞములకును భోక్త భగవంతుడే. కాని, బ్రాహ్మణుని ముఖముద్వారా అర్పింపబడిన హవిష్యాన్నముతో తృప్తిపడినంతగా, అగ్నిద్వారా సమర్పించిన హవిస్సుద్వారా ఆ పరమాత్మ తృప్తి చెందడు.

14.18 (పదునెనిమిదవ శ్లోకము)

తస్మాద్బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః|

తైస్తైః కామైర్యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను॥6221॥

అందువలన బ్రాహ్మణులు, దేవతలు, మనుష్యులు మున్నగు ప్రాణులయందు అంతర్యామి రూపములో విరాజిల్లుచున్న భగవంతుని యథాయోగ్యముగా ఉపయుక్తములైన పదార్థముల ద్వారా పూజింపవలెను. వీరిలో బ్రాహ్మణులే ముఖ్యులు.

14.19 (పందొమ్మిదవ శ్లోకము)

కుర్యాదాపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః|

శ్రాద్ధం పిత్రోర్యథావిత్తం తద్బంధూనాం చ విత్తవాన్॥6222॥

ధనికుడైన బ్రాహ్మణుడు తన యొద్దనున్న ద్రవ్యమును అనుసరించి, భాద్రపదమాసమునందలి, కృష్ణపక్షమున  తన తల్లిదండ్రులకును అట్లే, ఇతర బంధువులకును (అనగా పితామహ, మాతామహాదులకును)  మహాలయ శ్రార్ధమును ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


16.7.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునాలుగవ అధ్యాయము

గృహస్థాశ్రమ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

14.20 (ఇరువదియవ శ్లోకము)

అయనే విషువే కుర్యాద్వ్యతీపాతే దినక్షయే|

చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీశ్రవణేషు చ॥6223॥

14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే|

చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా॥6224॥

14.22 (ఇరువది రెండవ శ్లోకము)

మాఘే చ సితసప్తమ్యాం మఘారాకాసమాగమే|

రాకయా చానుమత్యా వా మాసర్క్షాణి యుతాన్యపి॥6225॥

14.23 (ఇరువది మూడవ శ్లోకము)

ద్వాదశ్యామనురాధా స్యాచ్ఛ్రవణస్తిస్ర ఉత్తరాః|

తిసృష్వేకాదశీ వాఽఽసు జన్మర్క్షశ్రోణయోగయుక్॥6226॥

14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

త ఏతే శ్రేయసః కాలా నృణాం శ్రేయోవివర్ధనాః|

కుర్యాత్సర్వాత్మనైతేషు శ్రేయోఽమోఘం తదాయుషః॥6227॥

ఇదిగాక, ఆయనములు (కర్కాటక, మకర సంక్రాంతులు), విషువత్తులు (తులా, మేష సంక్రాంతులు), వ్యతీపాతము, దినక్షయము, చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయములు, శ్రవణము, ధనిష్ఠ, అనూరాధా నక్షత్రములతో గూడిన ద్వాదశి, వైశాఖశుక్ల తృతీయ (అక్షయతృతీయ), కార్తీక శుక్లనవమి (అక్షయనవమి), హేమంత, శిశిర ఋతువులలోని (మార్గశిర, పుష్య - మాఘ, ఫాల్గుణ మాసములలో), కృష్ణ పక్షములలో గల నాలుగు అష్టములు, మాఘశుక్ల సప్తమి, మఖా నక్షత్రముతో గూడిన పూర్ణిమ, మాస నక్షత్రములతో గూడిన శుక్ల చతుర్దశీ పూర్ణిమలు, అనూరాధా, శ్రవణము, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, జన్మనక్షత్రము, శ్రవణములతో గూడిన ఏకాదశి దినములందు పితృశ్రాద్ధములను ఆచరించుటకు శ్రేష్ఠములు. ఈ దినములు, మానవులకు శభములను వర్ధిల్లజేయునట్టివి. మానవుడు ఈ దినములయందు శ్రాద్ధ కార్యములనేగాక, ఇతర పుణ్యకార్యములను తన శక్త్యనుసారము ఆచరింపవలెను. అట్లు చేయుటవలన అతని జీవితము సఫలమగును.

14.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనమ్|

పితృదేవనృభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనశ్వరమ్॥6228॥

ఈ దినములలో చేసిన తీర్థస్నానము, జపము, హోమము, వ్రతము, దేవబ్రాహ్మణపూజలు, పితృశ్రాద్ధము, దేవతలకు నైవేద్యాదులను సమర్పించుట, మానవులకు దానము చేయుట, పశుపక్ష్యాదులకు ఆహారమును ఇచ్చుట అను కర్మలు అక్షయ ఫలములను ఇచ్చును.

14.26 (ఇరువది ఆరవ శ్లోకము)

సంస్కారకాలో జాయాయా అపత్యస్యాత్మనస్తథా|

ప్రేతసంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప॥6229॥

ధర్మరాజా! భార్యకు చేసే పుంసవనము, సంతానమునకు చేయు జాతకర్మ, గృహస్థులు తాము  చేసికొను యజ్ఞోపవీత ధారణము, మొదలగు సంస్కార కార్యములయందును, ప్రేత కార్యములయందును, వార్షిక శ్రాద్ధమునందును ఇతర శుభకర్మల యందును చేసిన దాన ధర్మములు అక్షయ ఫలములను ఇచ్చును.

14.27 (ఇరువది ఏడవ శ్లోకము)

అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయ ఆవహన్|

స వై పుణ్యతమో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే॥6230॥

మహారాజా! ధర్మము మొదలగు శ్రేయస్సును కలిగించునట్టి స్థానములనుగూర్చి నేను ఇప్పుడు వర్ణించెదను. సజ్జనుడు నివసించుచుండెడి దేశమే అన్నింటికంటెను పవిత్రమైనది.

14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరమ్|

యత్ర హ బ్రాహ్మణకులం తపోవిద్యాదయాన్వితమ్॥6231॥

14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యత్ర యత్ర హరేరర్చా స దేశః శ్రేయసాం పదమ్|

యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః॥6232॥

సకల చరాచర జగత్తునందు నిలిచియున్న పరమాత్ముని ప్రతిమ (విగ్రహము) గల దేశము, తపస్సు, విద్య, దయ మొదలగు గుణములుగల బ్రాహ్మణ పరివారములు నివసించు దేశము, భగవంతుని అర్చనలు నిరంతరము  జరుగుచుండెడి దేశము, పురాణములలో ప్రసిద్ధమైన గంగ మొదలగు నదులు ప్రవహించు దేశము మిగుల పవిత్రములైనవి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

17.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునాలుగవ అధ్యాయము

గృహస్థాశ్రమ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

14.30 (ముప్పదియవ శ్లోకము)

సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత|

కురుక్షేత్రం గయశిరః ప్రయాగః పులహాశ్రమః॥6233॥

14. 31 (ముప్పది ఒకటవ శ్లోకము)

నైమిషం ఫాల్గునం సేతుః ప్రభాసోఽథ కుశస్థలీ|

వారాణసీ మధుపురీ పంపా బిందుసరస్తథా॥6234॥

14. 32 (ముప్పది రెండవ శ్లోకము)

నారాయణాశ్రమో నందా సీతారామాశ్రమాదయః|

సర్వే కులాచలా రాజన్ మహేంద్రమలయాదయః॥6235॥

14. 33 (ముప్పది మూడవ శ్లోకము)

ఏతే పుణ్యతమా దేశా హరేరర్చాశ్రితాశ్చ యే|

ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః|

ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాధిఫలోదయః॥6236॥

పుష్కరాది సరోవరములు, సిద్ధపురుషులు సేవించు క్షేత్రములు, కురుక్షేత్రము, గయ, ప్రయాగ, పులహాశ్రమము (సాలగ్రామతీర్థము), నైమిశారణ్యము, ఫాల్గుణ క్షేత్రము (కన్యాకుమారి),  సేతుబంధము, ప్రభాసతీర్థము, ద్వారక, కాశి, మధుర, పంపాసరోవరము, బిందుసరోవరము, బదరికాశ్రమము, అలకనంద, సీతారాములు నివసించిన అయోధ్య, చిత్రకూటము మున్నగునవి. మహేంద్ర మలయాది కులపర్వతములు, భగవంతుని అర్చావతారమును సేవించు దేశములు అన్నియును పవిత్రములైనవే, శ్రేయస్కాములు పదే పదే ఈ ప్రదేశములను సేవించుచుండవలెను. ఈ స్థానములయందు పుణ్యకార్యములు చేయుచుండువారికి సహస్రాధికముగా ఫలములు లభించుచుండును.

14. 34 (ముప్పది నాలుగవ శ్లోకము)

పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః|

హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరమ్॥6237॥

ధర్మరాజా! పాత్రతను నిర్ణయించు విషయమున వివేకవంతులు భగవంతుడొక్కడే సత్పాత్రుడు (పూజ్యుడు) అని పేర్కొనిరి. ఈ చరాచర జగత్తు సమస్తము ఆయన స్వరూపమే.

14. 35 (ముప్పది ఐదవ శ్లోకము)

దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు|

రాజన్ యదగ్రపూజాయాం మతః పాత్రతయాచ్యుతః॥6238॥

నీవు చేసిన రాజసూయయాగము విషయమును గూర్చియే ఆలోచింపుము. దేవతలు, ఋషులు, సిద్ధులు, సనకాది మునులు ఉన్నప్పటికిని శ్రీకృష్ణభగవంతుడే అగ్రపూజకు అర్హుడని నిర్ణయింపబడినది.

14. 36 (ముప్పది ఒకటవ శ్లోకము)

జీవరాశిభిరాకీర్ణ ఆండకోశాంఘ్రిపో మహాన్|

తన్మూలత్వాదచ్యుతేజ్యా సర్వజీవాత్మతర్పణం॥6239॥

అసంఖ్యాక జీవులతో నిండిన ఈ బ్రహ్మాండమను మహావృక్షమునకు మూలము శ్రీకృష్ణభగవానుడు ఒక్కడే. కనుక, ఆయనను పూజించినచో, సమస్తజీవుల ఆత్మలు తృప్తిపడును.

14. 37 (ముప్పది ఏడవ శ్లోకము)

పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః|

శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ॥6240॥

ఆ పరమాత్మ మనుష్యులు, పశుపక్ష్యాదులు, ఋషులు, దేవతలు మొదలగువారి శరీరములనెడి పురములను సృష్టించెను. ఈ పురములలో జీవరూపమున ఆయనయే శయనించియున్నాడు. అందువలన ఆయనకు పురుషుడు - అను పేరు కలిగినది.

14. 38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తేష్వేషు భగవాన్ రాజంస్తారతమ్యేన వర్తతే|

తస్మాత్పాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే॥6241॥

ధర్మరాజా! భగవంతుడొక్కడేయైనను, మనుష్యాది శరీరములలో వేర్వేఱుగా న్యూనాధిక రూపములలో ప్రకాశించుచున్నాడు. కనుక పశుపక్ష్యాది శరీరముల కంటెను మానవుడే శ్రేష్ఠుడుగా భావింపబడుచున్నాడు. మానవులలో గూడ తపస్సు, యోగము మొదలగు భగవంతుని అంశలు అధికముగా గలవాడు ఇంకను శ్రేష్ఠుడు.

14. 39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

దృష్ట్వా తేషాం మిథో నృణామవజ్ఞానాత్మతాం నృప|

త్రేతాదిషు హరేరర్చా క్రియాయై కవిభిః కృతా॥6242॥

14. 40  (నలుబదియవ శ్లోకము)

తతోఽర్చాయాం హరిం కేచిత్సంశ్రద్ధాయ సపర్యయా|

ఉపాసత ఉపాస్తాపి నార్థదా పురుషద్విషామ్॥6243॥

ధర్మరాజా! కృతయుగమునందు ప్రాణిమాత్రులైన అన్నింటిని భగవత్స్వరూపులునుగా భావించి పూజించెదరు. కాని, త్రేతాయుగమునందు ద్వైతభావము ప్రారంభమగుటచే ప్రతిమ- విగ్రహపూజ ప్రారంభమైనది. కావున, విద్వాంసులు ఉపాసనసిద్ధికొరకు భగవంతుని ప్రతిమలను ప్రతిష్ఠించిరి. అందువలననే పెక్కుమంది మిక్కిలి శ్రద్ధతో పూజసామాగ్రి ద్వారా ప్రతిమలను భగవద్రూపములుగా పూజించుచున్నారు. కాని, పరస్పర ద్వేషభావము గలవారు ప్రతిమలను ఉపాసించినప్పటికిని వారికి సిద్ధి కలుగదు.

14. 41 (నలుబది ఒకటవ శ్లోకము)

పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః|

తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుమ్॥6244॥

ధర్మరాజా! మానవులలో గూడ బ్రాహ్మణులు విశేషముగా పూజార్హులు. ఏలయన, వారు తమ తపస్సు, విద్య, సంతోషము మొదలగు సుగుణములచే భగవంతుని వేదరూపమైన శరీరమును ధరించెదరు.

14. 42 (నలుబది రెండవ శ్లోకము)

నన్వస్య బ్రాహ్మణా రాజన్ కృష్ణస్య జగదాత్మనః|

పునంతః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్॥6245॥

మహారాజా! మనకేగాదు, సర్వాత్ముడైన శ్రీకృష్ణభగవానుడు గూడ బ్రాహ్మణులచే తన ఇష్టదైవముగ భావించును. ఏలయన, వారి పాదధూళిచే ముల్లోకములును పవిత్రములగును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదునాలుగవ అధ్యాయము (14)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment