సింధురాజు (సైంధవుణ్ణి ).వధ !
_
సమరవేషాలు తీసేసి శూన్యాకారాల్తో ధర్మజాదులు శోకసంతప్తులయారు. ధర్మరాజు “నన్ను సంతోషపరచాలని యోధానుయోధుల రక్షణలో ఉన్న నిర్భేద్యమైన సైనిక వ్యూహాన్ని ఛేదించి ఒంటరిగా ఎందరో మహారథుల్ని వధించాడు. దుశ్శాసనుణ్ణి ఓడించి చతురంగబలాల్ని తూర్పారబట్టాడు. ఇది మరెవరికైనా సాధ్యమయే పనేనా? ఇప్పుడు అర్జునుడు వచ్చి కొడుకెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పగలన్నేను? కృష్ణుడికి అతని చెల్లెలికి ఎంత దుఃఖం తెచ్చిపెట్టాను ! బాలుడే, సుకుమారుడే, యుద్ధాల్లో అనుభవం లేనివాడే, అలాటి వాణ్ణి చూస్తూ చూస్తూ మొన చీల్చమని పంపిన నన్ను ఏమనుకోవాలి? వాడితో నేను కూడ పోయివుంటే బాగుండేది, ఇప్పుడు అర్జునుడికి నా మొహం ఎట్లా చూపిస్తాను? ఇంద్రుడంతటి వాడే సాయం కోరి వస్తే వెళ్లి కాలకేయాది రాక్షసుల్ని సంహరించిన వాడి కొడుకు శత్రువుల చేత చిక్కి మరణించాడని అతనికి మచ్చ తెచ్చిపెట్టాను కదా. ఇప్పుడీ మాట విని అర్జునుడేం చేస్తాడో! బతికితే రాజ్యం వస్తుందని, మరణిస్తే స్వర్గం, సద్గతి కలుగుతాయని చెప్పుకునే మాటలన్నీ ఇలా మన ఆత్మీయులు పోయినప్పుడు కలిగే దుర్భరశోకం ముందు వట్టిమాటలుగానే అనిపిస్తయ్. నిరర్థకాలుగా కనిపిస్తయ్” అంటూ తనని తను రకరకాలుగా నిందించుకుంటూంటే వ్యాసమహాముని ప్రత్యక్షమై అతనికి మృత్యుదేవతా మహత్యాన్ని, షోడశమహారాజుల చరిత్రల్ని వినిపించి కొంత ఉపశమింపజేసి అంతర్ధానమయాడు.
అర్జునుడు సంశప్తక సేనా వనాన్ని అనలుడిలా హరించి వస్తూ “కృష్ణా, నాకెందుకో దుశ్శకునాలు తోస్తున్నయ్, మనసు కీడు శంకిస్తున్నది. ఒకవేళ ద్రోణుడి చేతికి ధర్మరాజు చిక్కలేదు గదా” అన్నాడు విచారంగా. “నీ సోదరులంతా కుశలమే. మరేదో అశుభం జరిగింది, మనం వెళ్లి తెలుసుకుందాం” అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ తమ శిబిరానికి చేరారు. అక్కడంతా విషణ్ణవదనాల్తో అర్జునుణ్ణి తప్పించుకు తిరగటం చూసి “కృష్ణా, ఏదో జరక్కూడనిది జరిగింది. నవ్వు మొహంతో రోజూ కనిపించే అభిమన్యుడు కనిపించటం లేదు. నా మనస్సు కలత చెందుతున్నది” అంటే కృష్ణుడు సమాధానం చెప్పకుండా వూరుకున్నాడు. అర్జునుడు హడావుడిగా ధర్మరాజు శిబిరానికి వెళ్లాడు.
అక్కడ ధర్మరాజుని చుట్టుకుని పెద్దలంతా వున్నారు కాని అభిమన్యుడు కనిపించలేదు. కంపించే గొంతుతో –
“ఇంతమంది ఇక్కడ ఉన్నా అభిమన్యుడు మాత్రం కనపడడు. ఈ మౌనం వదిలి ఏమైందో చెప్పండి. ద్రోణుడు పద్మవ్యూహం పన్నితే దాన్ని భేదించటానికి వాణ్ణి పంపుదామనే పనికిమాలిన ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఏమిటి? అలా మీరు పంపితే పోయి ఒక్కడే వాళ్ల చేతికి చిక్కలేదు గదా? వాడికి ప్రవేశించటమే చెప్పాను గాని నిర్గమించటం తెలియదని మీకు తెలీదా?
దివ్యశరాఢ్యుడు, సంగరకేళీనిపుణుడు వాణ్ణి పడేసిన వాడు ఎవడు?
ఐనా వాణ్ణి పడెయ్యటం ఏ ఒక్కడి వల్లా కాదు, ఇదేదో పదిమంది కలిసి చేసిన కుట్ర ఫలితం.
అయ్యో, నాలాటి మందభాగ్యుడికా అలాటి విలువైన పుత్రరత్నం దక్కేది? ఐనా మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు వాడికి సాయపడకుండా?
అంతమంది శత్రువులు ఒక్కటై నానా శస్త్రాస్త్రాల్తో నరుకుతుంటే నన్ను తలుచుకుని తోడుగా రాలేకపోయానని ఎంత కలవరపడ్డాడో ! కాదు కాదు, అంతటి మహావీరుడు ఎప్పుడూ అలా ఆలోచించడు. ఐనా అంతమంది ఒక్కసారి మీదపడి బాలుణ్ణి వధించేముందు నన్ను గాని కృష్ణుణ్ణి గాని తలుచుకోలేదా ఆ దుర్మార్గులు?
సంశప్తకుల్తో ఘోరపోరాటం సాగిస్తున్నప్పుడు యుయుత్సుడు తండ్రినేమీ చెయ్యలేక ఇలా చిన్నపిల్లవాణ్ణి పదిమంది కలిసి అన్యాయంగా చంపుతారా అని కౌరవుల్ని ఆక్షేపించటం విన్నట్టనిపించింది కాని అప్పుడంతగా పట్టించుకోలేదు, కృష్ణుడు విని వుండడా, అంత ముఖ్యమైన విషయమైతే చెప్పడా అని. అప్పుడైనా వచ్చివుంటే వాణ్ణి రక్షించుకుని వుండేవాణ్ణేమో”
అంటూ రకరకాలుగా పలవిస్తూ మాట్టాడుతున్న అర్జునుణ్ణి పొదివిపట్టుకుని కృష్ణుడు “ఇలా ఉండటం నీకు తగదు. శూరుల జీవితాలు ఇలాటివే కదా – శత్రువుల్ని తుంచి ఇక్కడ యశస్సు, పైన స్వర్గమూ పొందిన కొడుకుని చూసి ఆనందించాలి గాని బాధ పడతారా నీలాటి జ్ఞానులు? నీ దుఃఖం చూసి మిగిలిన వాళ్లెంత చిన్నబోయారో చూడు” అంటే “అలాగే, వాడి యుద్ధప్రకారం నాకు వివరించి చెప్పండి. వాడి చావుకి కారణమైన వాళ్లని త్వరగా వాడి దగ్గరికి పంపించాల్సిన పని వుంది నాకు. ఐనా ఇంతమంది మహారథులు మనలో వుండి ఒక్కరూ వాడికి తోడు కాలేకపోవటం నమ్మ శక్యంగా లేదు. మిమ్మల్ని మీ మగతనాల్ని నమ్మి వాణ్ణి మీకప్పగించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. అసలిలాటి బలహీనులు, భీరువులు మీకు తోడు ఈ గదలూ ఖడ్గాలూ విల్లమ్ములూ ఎందుకు సింగారానికి కాక?” అని గద్దిస్తుంటే నోరెత్తి మాట్టాడాటానికి ఎవరూ సాహసించలేకపోయారు. కృష్ణుడొక్కడే అనునయవాక్యాలు పలికాడు.
చివరికి ధర్మరాజు సాంత్వనస్వరంతో -“నువ్వు సంశప్తకుల్తో పోరుకి పోతే ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేం వెళ్లి అతనితో తలపడ్డాం గాని అతని బాణాగ్ని జ్వాలకి తట్టుకోలేక వెనక్కి తిరిగాం. అప్పుడు నాకు గుర్తొచ్చింది అభిమన్యుడికి పద్మవ్యూహ భేదనం తెలుసునని. వాడు దాన్ని భేదిస్తే వాడి వెనకే మేమందరం వెళ్లాలని బయల్దేరాం. వాడు త్రుటిలో దాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. ద్రోణాదులు వాడిని చుట్టుముడితే సాయంగా మేం వెళ్తుంటే రుద్రవరగర్వంతో సైంధవుడు మమ్మల్నడ్డుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మేం వాణ్ణి దాటలేకపోయాం.
అభిమన్యుడు ద్రోణ, కర్ణ, కృతవర్మ, కృప, అశ్వత్థామాది మహావీరుల్ని చిక్కుపరిచి కురుసేనని కాల్చి కర్ణాదుల్ని పరిగెత్తించి బృహద్బల లక్ష్మణుల్ని సంహరించి అనేకమంది రాజుల్ని మర్దించి చివరికి విరథుడై పదాతిగా గదతో తూగాడుతూనే యుద్ధం చేస్తూ దుశ్శాసనుడి కొడుకు వస్తే వాడి రథాన్ని నుగ్గు చేసి వాడూ గదతో వస్తే ఇద్దరూ మహాఘోరంగా గదాయుద్ధం చేసి ఒకరి చేతిలో ఒకరు మరణించారు” అని చెప్పేసరికి అర్జునుడు గుండె చెదిరి మూర్ఛితుడయ్యాడు. అప్పటివరకు అతనిలో మినుకుమినుకుమంటున్న కొద్దిపాటి ఆశ కూడ ఆ మాటల్తో ఆరిపోయింది.
కృష్ణుడు, ధర్మరాజు అతన్ని పట్టుకుని ఉపచారాలు చేస్తే లేచి మహోద్వేగంతో “ఇదే నా ప్రతిజ్ఞ, అందరూ వినండి. రేపు నేను సింధురాజుని చంపి తీరతాను. వాడు భయపడి ధర్మజుణ్ణి గాని, కృష్ణుణ్ణి గాని, నన్ను గాని శరణు వేడితేనో లేకపోతే అసలు యుద్ధానికే రాకపోతేనో తప్ప దీనికిక తిరుగులేదు. ఇలా చెయ్యలేకపోతే నేను గురుద్రోహులు, బ్రహ్మహంతకులు, మద్యపానరతులు పోయే దుర్గతులకి పోతా. అంతే కాదు, రేపు సూర్యాస్తమయం లోగా నేను వాణ్ణి చంపకపోతే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తా” అంటూ కఠోరప్రతిజ్ఞ చేసి, గాండీవాన్ని తెప్పించి దాని గుణధ్వని మోగించాడు. కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం పూరించారు.
ఆ పాంచజన్య దేవదత్తాల ధ్వనులకు మనసేనలు తల్లడిల్లినయ్. వేగపు చారులు పరుగున వచ్చి అర్జున ప్రతిజ్ఞని వినిపించారు. సైంధవుడి గుండె ఝల్లుమంది. తన చుట్టాల్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి శిబిరానికి వెళ్లాడు.
“అక్కడికి నేనొక్కణ్ణే అభిమన్యుడి చావుకి కారణమైనట్టు అర్జునుడిలా నా వెంట పడటం ఏమిటి? ఇప్పుడు నన్ను రక్షించగలిగే వాళ్లెవరింక? ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా వెళ్తా, నాకు సెలవిప్పించండి” అన్నాడు.
ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యటం తనకి ఉపయోగపడొచ్చని గ్రహించాడు దుర్యోధనుడు. “మేం అందరమూ నీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డం వేస్తాం. నీకేం భయం అక్కర్లేదు, రాజధర్మం తప్పకుండా రేపు యుద్ధరంగానికి రా.” అని భరోసా ఇచ్చాడు. సైంధవుడు కొంత శాంతించాడు.
ఐనా అనుమానం పూర్తిగా పోక వాళ్లని వెంటబెట్టుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. ద్రోణుడు కూడ “నా బాణాలతో కోట కట్టి నిన్ను రక్షిస్తా. అర్జునుడు నిన్నేమీ చెయ్యలేకుండా ఒక గొప్ప దురవగాహమైన వ్యూహాన్ని పన్నుతా. కనక రాజధర్మానికి హాని కలక్కుండా యుద్ధానికి రా. పైగా రాచపుటక పుట్టి శరీరం మీద ఇంత ప్రేమ పెంచుకోవటం మంచిది కాదు. అందరూ ఏదో ఒక రోజు వెళ్లేవాళ్లే కదా” అని బోధిస్తే ఒప్పుకున్నాడు. మన శిబిరాల్లో తూర్యఘోషలు మిన్ను ముట్టినయ్.
ధర్మరాజు రాజులందర్నీ వాళ్ల శిబిరాలకి పంపాడు. కేవలం అతని సోదరులు, కృష్ణుడే అక్కడున్నారు. కృష్ణుడు అర్జునుడితో “నాతో మాట మాత్రం చెప్పకుండా అందరూ వింటుండగా ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశావ్. సూర్యాస్తమయంలోగా వాణ్ణి చంపటం అంత తేలిగ్గాదు. ద్రోణుడొక అద్భుతమైన వ్యూహాన్ని పన్ని వాణ్ణి దాని వెనక దాచబోతున్నాడని మన చారులు చెప్తున్నారు. వాళ్ల మహావీరుల్ని ఒక్కొక్కర్ని ఓడించటమే కష్టం, అలాటప్పుడు వాళ్లందరూ కలిసి ఒకే పనికి నడుం కడితే అందర్ని ఉమ్మడిగా ఓడించటం ఇంకెంత కష్టమో ఆలోచించావా?” అన్నాడు.
ప్రతిగా అర్జునుడు నవ్వాడు. “కృష్ణా, నా గురించి వాళ్లకి తెలుసు, వాళ్ల సంగతి నాకు తెలుసు. నేనా సైంధవుణ్ణి చంపటానికి తరుముతుంటే ఎవరూ అడ్డం ఆగలేరు. చూస్తుండు. గాండీవం సాధనం, సమరకర్త అర్జునుడు, సారథి అబ్జనాభుడు. అలాటి రథాన్ని ప్రతిఘటించటం హరుడి వల్ల కూడ కాదు, వీళ్ల సంగతి చెప్తావెందుకు? నీ అండ ఉండగా ఈ కార్యం సాధించటం అనివార్యం. ఈ పూటకి వెళ్లి నిద్ర పో, పొద్దున్నే మళ్లీ సారథ్యం పని ఉంది” అని మాట్లాడుకుంటూ పట్టరాని కోపంతో వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ నడిచారు.
కృష్ణుడి కోరిక మేరకు కొద్దిరోజుల క్రితమే అక్కడికొచ్చి వున్న సుభద్రని, ఉత్తరని అనునయించమని అర్జునుడు కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు సుభద్ర మందిరానికి వెళ్లి శోకిస్తున్న ఆమెతో “రాచకూతురికి వీరపత్ని కావటం, కొడుకుని కనటం, వాణ్ణి మహావీరుణ్ణి చెయ్యటం, ధర్మాలు. నువ్వు ఈ మూటిలో ప్రసిద్ధి పొందావు. రాచధర్మాన్నాచరించి శత్రువుల్ని వధించి వీరస్వర్గం పొందిన కొడుకు గురించి విచారపడొచ్చునా? తగుమాటల్తో నీ కోడలి దుఃఖాన్ని ఉపశమింప చెయ్యి. నీ భర్త రేపా సైంధవుణ్ణి చంపి మనందరికీ సంతోషం కలిగిస్తాడు” అని చెప్పాడు. ఐతే ఆమె శోకం ఆపుకోలేక కొడుకుని తలుచుకుని బిగ్గరగా ఏడ్చింది. ద్రౌపది కూడ వచ్చి సుభద్ర, ఉత్తరలతో తనూ కలిసి విలపించింది. ముగ్గురూ నేల మీద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి హృదయవిదారకంగా ఆక్రందించారు. తనూ శోకమానసుడైనా కృష్ణుడు ఎలాగో వాళ్లని సమాధానపరిచి అర్జునుడి శిబిరానికి వచ్చాడు.
పవిత్రజలాల్తో ఆచమనం చేశాడు. దర్భశయ్యని చేసి అక్షతలు, గంధ పుష్పాల్తో దాన్ని అలంకరించి ఆయుధాల్ని అర్చించి చుట్టూ పెట్టి అర్జునుణ్ణి మధ్యలో కూర్చోబెట్టాడు. “నువ్వు రోజూ రాత్రివేళ చేసే దేవపూజ ఇప్పుడు చెయ్యమం”టే అర్జునుడు తను రోజూ చేసే శివపూజ మార్గాన ధూప దీప నైవేద్యాలు కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడవి స్వీకరించి అతన్ని దీవించి సుఖనిద్ర చేయమని చెప్పి తన సారథి దారుకుడిని తీసుకుని తన శిబిరానికి వెళ్లాడు.
మర్నాడు జరపవలసిన కార్యం గురించి ఆలోచిస్తూ కొంతసేపు పడుకున్నాడు కృష్ణుడు. తర్వాత లేచి దారుకుడితో “దూరం ఆలోచించకుండా అర్జునుడు ఘోరప్రతిజ్ఞ చేశాడు. దీన్ని తీర్చటం సామాన్యమైన విషయమా? వ్యవహారం అడ్డుతిరిగితే అర్జునుడు లేకుండా నేనుండటం అసాధ్యం. ఆరు నూరైనా నూరు ఆరైనా రేపు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరేట్టు చేస్తా. అవసరమైతే నేనే యుద్ధం చేసి అడ్డమైన వాళ్లందర్నీ హతమారుస్తా. నువ్వు వెళ్లి మన రథాన్ని సిద్ధం చెయ్యి. యుద్ధ రంగానికి దగ్గర్లో ఉండు. నా పాంచజన్య ధ్వని నీకు గుర్తు. అది వినబడితే వెంటనే నా దగ్గరకు వచ్చెయ్యి” అని వివరించాడు. దానికి దారుకుడు “అలాగే చేస్తా. ఐతే నువ్వూ అర్జునుడు పూనుకుని సైంధవుణ్ణి చంపబోతుంటే మిమ్మల్ని అడ్డుకోగలిగిన వాళ్లు ఎవరున్నారక్కడ?” అని అతని ఉద్రేకాన్ని కొంత ఉపశమింప చేశాడు. ఏ రకమైన పాంచజన్యధ్వని సంకేతమో ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు.
అక్కడ అర్జునుడు దర్భశయ్య మీద కలత నిద్రలో ఉన్నాడు. అతనికో కల వచ్చింది. అందులో కృష్ణుడు కనపడ్డాడు. “నీకు రేపు యుద్ధంలో పాశుపతాస్త్రం అవసరం కలగొచ్చు. ఆ మహాస్త్రం మంత్రాన్ని, పిడికిట పట్టే విధానాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అందుకు పరమశివుణ్ణి తలుచుకో” అని చెప్తే అర్జునుడు ఆచమనం చేసి పరమేశ్వర ధ్యానం చేస్తుంటే ఇద్దరూ ఆకాశాని కెగిరారు. దార్లో అనేక విశేషాలు చూస్తూ కైలాసగిరిని చేరారు. ప్రమథనాథుణ్ణి దర్శించి ప్రణమిల్లారు. అంతకుముందు నిత్యార్చన ప్రకారంగా కృష్ణుడికి తను సమర్పించిన గంధ మాలాక్షతలు ఇక్కడ శివుడి శరీరం మీద అర్జునుడికి కనిపించినయ్. శివకేశవుల అభేదాన్ని అలా చూసి ఆశ్చర్యపడ్డాడతను. పరమేశ్వరుడు వాళ్లకి స్వాగతం పలికి ఎందుకు వచ్చారని అడిగాడు. పాశుపతం ఇమ్మని కోరమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అతనలాగే చేశాడు. పరమశివుడు వాళ్లతో “ఆ సరోవరంలో నా ధనుర్బాణాలున్నయ్, వెళ్లి తీసుకురండి” అని చెప్పాడు. వాళ్లు వెళ్లి చూస్తే విషజ్వాలలు కక్కుతూ మహోరగాలు వాళ్లకి కనిపించినయ్. అవే దివ్యబాణాలని గ్రహించి వాళ్లు పాదప్రక్షాళనం చేసుకుని శతరుద్రీయం జపిస్తే అవి వాటి పూర్వాకారాలు ధరించినయ్. వాళ్లా ధనుర్బాణాల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడొక మహాబలశాలి ఐన బాలుడు ఆ వింటిని తీసుకుని శరాన్నెక్కు పెడితే అర్జునుడతన్ని చూసి ఆ పద్ధతి నేర్చుకున్నాడు. అప్పుడే శివుడు కూడ అతనికి మంత్రోపదేశం చేశాడు. అలా అర్జునుడప్పుడు మంత్రం, ప్రయోగవిధానంతో సహా పాశుపతాస్త్రాన్ని సంపూర్ణంగా అందుకున్నాడు. ఇద్దరూ పరమేశ్వరుడి సెలవు తీసుకుని తిరిగివచ్చారు. అర్జునుడు కల నుంచి లేచి చూస్తే తెల్లవారుతున్నది.
అవతల కృష్ణుడు మిగిలిన రాత్రంతా అర్జునుడికి తనను ఉన్న అనుబంధం గురించి, మర్నాడు యుద్ధంలో జరిపించవలసిన కార్యక్రమం గురించి దారుకుడితో మాట్లాడుతూనే గడిపాడు.
పద్నాలుగవ రోజు
ఉదయాన్నే ధర్మరాజు దేవార్చన చేసి కొలువు తీరాడు. తమ్ముళ్లు, రాజులు వచ్చారు. కృష్ణుడు కూడ అక్కడికి వచ్చాడు. ధర్మరాజు అతనితో “నువ్వు ఇప్పటికి ఎన్నో సార్లు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు అర్జునుడి ప్రతిజ్ఞ మనసులో పెట్టుకుని మాకు జయం కలిగించు” అని ప్రార్థించాడు. “ఇవాళ అర్జునుడు వైరి సేనల్ని పిండిపిండి చేసి సైంధవుడి తల నరుకుతాడు. ఇది నిశ్చయం” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. ఇంతలో అర్జునుడక్కడికి వచ్చి తన స్వప్న వృత్తాంతం వినిపించాడు. అందరూ ఆశ్చర్యంతో ఆ పరమేశ్వరుణ్ణి తల్చుకుని నమస్కరించారు.
కృష్ణుడు రథానికి జయప్రదాలైన మంత్రాలు ప్రయోగించాడు. అర్జునుడు దానికి ప్రదక్షిణం చేసి అధిరోహించాడు. నొగల్లో కృష్ణుడు, అర్జునుడి పక్కన సాత్యకి కూర్చున్నారు. కొంత దూరం వెళ్లాక అర్జునుడు సాత్యకికి ధర్మరాజు రక్షణ భారం అప్పగించి పంపించాడు.
ద్రోణుడు ఇరవైనాలుగు కోసుల పొడవు, పది కోసుల వెడల్పుతో శకటవ్యూహం కట్టి అందులో పశ్చిమార్థంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. దాని పక్కనే సూచీవ్యూహాన్ని పన్నాడు. సైంధవుణ్ణి ఆ సూచీవ్యూహం మూలంలో సేనకి వెనక భాగంలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థ్హామ, వృషసేనుడు, కృపుడు అతని పక్కన వుండేట్టు ఏర్పరచి నిలబెట్టాడు. వాళ్లకి బలంగా పద్నాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథాలు, లక్ష గుర్రాలు, పదిలక్షల పదాతులు ఉన్నారు.
ఆ మహావ్యూహాన్ని ఖేచరులు కూడ మెచ్చుకున్నారు. ఒక్క దుర్మర్షణుడు మాత్రం అర్జునుడి అంతు చూట్టానికి నేనొక్కణ్ణి చాలు అంటూ వ్యూహం బయటికి వెళ్లి దానికి ముందు పదిహేడు వందల విండ్లంత దూరాన తన సైన్యంతో నిలబడ్డాడు. ద్రోణుడు శకటవ్యూహం ముఖస్థానాన నిలిచాడు. దుర్యోధనుడు, మన సైన్యాన ఇతర దొరలు సంతృప్తిగా తలలు పంకించారు. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలుపుతూ భయంకరంగా అర్జునుడు దూసుకు వచ్చాడు. అతనికి కొద్దిగా వెనగ్గా ధృష్టద్యుమ్నుడు, నకులుడి కొడుకు శతానీకుడు మొగ్గరం పన్ని నిలిచారు. అర్జునుడు తన రథాన్నాపి దేవదత్తం ఒత్తితే పాంచజన్యరవం కూడ దానికి తోడైంది.
దుర్మర్షణుడు వీరావేశంగా తన బలగంతో అర్జునుడి మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు “మదంతో ముందుకి దూకుతున్నాడు, వీడే మనకివాళ తొలిముద్ద” అని వాణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడు ఒక్కడే కదా అని దుర్మర్షణుడి సైన్యం అతన్ని చుట్టుముట్టి వివిధ శస్త్రాస్త్రాల్తో ముంచెత్తింది. అతనా సైన్యాన్ని చిందరవందర చేసి భీభత్సంగా నాశనం చేస్తే దుర్మర్షణుడు వెనక్కు తిరిగి పారిపోయాడు. వాడితో పాటే వాడి సైన్యాలూ పరిగెత్తినయ్.
అది చూసి సహించక యువరాజు దుశ్శాసనుడు అర్జునుడితో తలపడ్డాడు. అతన్ని చూసి అర్జునుడు ఒక పెలుచ నవ్వు నవ్వాడు. దేవదత్తాన్ని పూరించి గాండీవజ్యానాదం దిక్కుల పిక్కటిల్లగా అతని సైన్యాన్ని ఊచకోత కోశాడు. పీనుగుపెంటలైన సేనని చూసుకుని దుశ్శాసనుడు పారిపోతుంటే విజయుడు వదలక తరిమాడు. “పారిపోతే చావు తప్పుతుందా? అప్పుడు సభలో అవాకులూ చవాకులూ పేలి ఇప్పుడు నీ చావుకి తెచ్చుకున్నావ్” అంటూ అతని వీపున పది అమ్ములు నాటితే వెనక్కి తిరిగైనా చూడకుండా పరిగెత్తాడు దుశ్శాసనుడు. సైంధవుడి విషయం తలుచుకుని వాణ్ణి అప్పటికి వదిలేసి వ్యూహం వైపుకి తిరిగొచ్చాడు అర్జునుడు.
వచ్చి ద్రోణుడికి కొద్ది దూరంలో రథాన్ని ఆపి కృష్ణుడి అనుజ్ఞ తీసుకుని ఆచార్యుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. “నా మంచి కోరేవాళ్లలో పాండురాజు, ధర్మజుడు, కృష్ణులతో సాటివాడివి నువ్వు. నీ దృష్టిలో నేనూ అశ్వత్థామ ఒక రకంగా పెరిగాం. సైంధవుణ్ణి చంపాలనే నా ధర్మబద్ధమైన ప్రతిజ్ఞని సాధించటానికి ఈ వ్యూహంలో చొరటానికి నాకు అనుమతివ్వు.” ఆ మాటలకి చిన్న నవ్వుతో ద్రోణుడు నన్ను గెలవకుండా నువ్వు సైంధవుణ్ణి ఎలా చేరతావ్ అంటూ అతని మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడతనితో యుద్ధం చెయ్యటానికి ద్రోణుడి నుంచి అనుజ్ఞ తీసుకుని తొమ్మిది నారాచాలు వేస్తే వాటిని దార్లోనే తుంచాడు ద్రోణుడు. తుంచి వేగంగా కృష్ణార్జునుల మీద అనేక బాణాలేస్తే అతని విల్లు విరచటానికి అర్జునుడు బాణం వెయ్యబోయేంతలో అతని వింటితాటిని తెగ్గొట్టాడు ద్రోణుడు. అర్జునుడు మరొక తాటిని సంధించేలోగా చిరునవ్వుతో అతన్ని బాణవర్షంలో ముంచాడు ద్రోణుడు. అర్జునుడికి అమిత క్రోధం కలిగింది. వర్షపు చినుకుల్లా బాణాలు కుమ్మరిస్తూ ద్రోణుణ్ణి దాటి సైన్యం లోకి వెళ్లి కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నరకటం సాగించాడు.
ద్రోణుడు వచ్చి అతనికి అడ్డుపడి అతని వక్షానికి గురిగా పెద్ద నారసాన్ని వేస్తే కొంచెం తూలి నిలదొక్కుకున్నాడు అర్జునుడు. ద్రోణుడి మీద నానాబాణాలేశాడు. ద్రోణుడు కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలు గుప్పించాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పోరుతుంటే ఇదే అదునని మన సైన్యం కొంత అర్జునుడి మీదికి దూకింది. ఇలా వృద్ధుడైనా అర్జునుడితో పోటీగా యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి చూసి కృష్ణుడు “ఈయనతో యుద్ధం ఇక చాలు, మనం శకటవ్యూహం లోకి జొరబడదాం, ఇదే కర్తవ్యం” అని అర్జునుడితో అంటే “నీ ఇష్టం” అని పార్థుడంటే ద్రోణుడికి ప్రదక్షిణంగా రథాన్ని పోనిచ్చాడు కృష్ణుడు. అదిచూసి నవ్వుతూ ద్రోణుడు “అర్జునా, ఇలాటివి ఎక్కడైనా చూశామా, శత్రువుని జయించకుండా ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళటమేనా?” అంటే “నువ్వు గురువువి గాని నాకు శత్రువువెలా ఔతావ్? యుద్ధంలో నువ్వు కోపం తెచ్చుకుని నిలిస్తే నిన్ను గెలవటం నాకే కాదు ఆ హరుడికైనా సాధ్యమా?” అంటూ ఆగకుండా సాగాడు.
ఇలా మన సైన్యం లోకి వచ్చిన అర్జునుడి తోనే అతని చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడ ప్రవేశించారు. అప్పుడు కృతవర్మ, కాంభోజుడు, శ్రుతాయువు ఉన్నచోటనే ఉండి తలలెత్తి అర్జునుడి రథాన్ని, దాని వెనకనే తరుముకొస్తున్న ద్రోణుణ్ణి చూసి అర్జునుడి మీద దూకాలనుకునేంతలో నారాయణగోపాలకులు అర్జునుణ్ణి పొదివి యుద్ధం చెయ్యసాగారు. అతను వాళ్లందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే ద్రోణుడు వచ్చి అమ్ములవాన కురిపిస్తే అర్జునుడు అతన్ని నేరుగా ఎదుర్కోకుండా అతను వేసిన బాణాల్ని మధ్యలోనే నరికేశాడు. ఐతే ద్రోణుడు వదలకుండా అర్జునుడి మీద ఇరవై ఐదు, కృష్ణుడి మీద డెబ్బై నారసాల్ని కురిపిస్తే వాటన్నిటిని వారించలేక పక్కకి దాటి కృతవర్మ బలాల్ని దాడిచేశాడు అర్జునుడు. ఇంక చేసేది లేక ద్రోణుడు వెనక్కి తిరిగి తన పూర్వస్థానానికి వెళ్లాడు.
కృతవర్మ అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. అతను కృష్ణార్జునులు ఒక్కొకరి మీద అరవై బాణాలేస్తే అర్జునుడు అతని వింటిని విరిచి ఇరవయ్యొక్క బాణాల్తో అతన్ని నొప్పించాడు. అతనింకొక విల్లు తీసుకుని ఐదుబాణాలు విజయుడి వక్షాన నాటితే కృష్ణుడు “ఆ పక్క ఆలస్యమౌతున్నది, వీడేం మనకి చుట్టమా పక్కమా తొందరగా ముగించు” అంటే వాణ్ణి కీలుబొమ్మలా మూర్ఛపుచ్చి కిందపడేశాడు అర్జునుడు. అప్పుడిక కాంభోజసైన్యాన్ని కలగిస్తూ దారి చేసుకుని వెళ్తుంటే మూర్ఛ లేచి కృతవర్మ అర్జునుడి చక్రరక్షకుల్ని అడ్డుకున్నాడు.
కౌరవసేనని చీల్చుకు వెళ్తున్న అర్జునుణ్ణి శ్రుతాయుధుడు ఎదిరించాడు. అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదిహేడు అమ్ములు వేసి ఒక బాణాన కేతువుని కొట్టాడు. క్రీడి తొంభై బాణాల్తో వాణ్ణి వారిస్తే వాడు డెబ్భై ఐదు అతని మీద వేశాడు. కోపంతో అర్జునుడు వాడి విల్లు తుంచి ఏడు శరాల్తో వాడి ఉరాన్ని చొప్పించాడు. వాడు తీవ్రంగా ఇంకో విల్లు తీసుకుని తొమ్మిది బాణాల్తో అర్జునుడి చేతుల్ని వక్షాన్ని కొడితే ఎలనవ్వుతో పార్థుడు వాడి సారథిని, అశ్వాల్ని చంపి డెబ్భై క్రూరశరాల్తో వాణ్ణి నొప్పిస్తే వాడొక పెద్దగదని తీసుకుని రథం దిగి అర్జునుడి రథమ్మీదికి పరిగెత్తాడు.
మహారాజా! ఆ శ్రుతాయుధుడు వరుణవరప్రసాది. ఆ గద వాడికి వరుణుడిచ్చింది. ఆ గద వాణ్ణి అజేయుణ్ణి చేస్తుందని, ఐతే యుద్ధం చెయ్యని వాళ్ల మీద దాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతిరిగి వాడినే చంపుతుందని వరుణుడు వాడికి చెప్పాడు కాని పోయే కాలం వచ్చినవాడికి అవి గుర్తుండవు కదా, వాడా గదతో కృష్ణుణ్ణి మోదాడు. అది కృష్ణుణ్ణి ఏమీ చెయ్యకపోగా అతనికి పూలమాలికలా అయింది. వెంటనే పిడుగులా శ్రుతాయుధుణ్ణి హతమార్చింది. అంతకు ముందే అర్జునుడు వాడి బాహువుల్ని ఖండిస్తే వాడో పర్వతంలా కింద పడ్డాడు. అదిచూసి వాడి సేనలు, ఆ చుట్టుపక్కల వున్న మిగతా రాజుల సేనలూ చెల్లాచెదురైనై.
అప్పుడు కాంభోజుడు సుదక్షిణుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు కుపితుడై పద్నాలుగు బాణాల్తో వాడి సూతుణ్ణి, గుర్రాల్ని, వింటిని, కేతనాన్ని నరికి ఒక నిశితాస్త్రంతో వాడి గుండె పగిలేట్టు కొట్టాడు. మొదల్నరికిన చెట్టులా వాడు కూలాడు. సుదక్షిణుడి చావుతో శూరసేనుడు, శిబి, వసాతి చుట్టుముడితే అర్జునుడు బాణవర్షంతో వాళ్ల ఆరువేల రథాల్ని నుగ్గుచేశాడు. వాళ్లు పారిపోయారు.
శ్రుతాయువు, అయుతాయువు రెండు వైపుల నుంచి వేలకొద్ది బాణాలు కురిపిస్తూ అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శ్రుతాయువు తోమరంతో అర్జునుణ్ణి దిమ్మదిరిగేట్టు కొట్టాడు. దానికితోడు అయుతాయువు కూడ శూలంతో పొడిచాడు. సొమ్మసిల్లి అర్జునుడు తన కేతనం పట్టుకుని తూలితే కృష్ణుడతన్ని తెలివిలోకి రప్పించాడు. కురుసైన్యంలో సింహనాదాలు చెలరేగినై. తెలివి తెచ్చుకున్న అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగిస్తే అది ఆ ఇద్దర్నీ అంగాంగాలు ఖండించి చంపింది. వాళ్ల అనుచరులు ఐదువందల మంది రథికుల్ని కూడ వధించింది. అది చూసి వాళ్ల కొడుకులు నియుతాయువు, దీర్ఘాయువు ఏమైతే అదైందని అతని మీద పడితే త్వరితంగా వాళ్లని కూడ తండ్రులకి తోడు పంపించేశాడు.
దుర్యోధనుడు మ్లేచ్ఛబలాల్ని అతని మీదికి పురిగొల్పితే వాళ్లు మహాసాహసంతో అతనితో పోరారు. ఐతే అతను కార్చిచ్చులా ఆ బలాల్ని కాలుస్తుంటే అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు ఉద్రేకంగా అర్జునుడి నొగల్ని తాకేంత దగ్గరికి తన రథాన్ని నడిపితే అర్జునుడతని వింటిని తుంచి గుర్రాలని కూల్చాడు. వాడొక భీకరమైన గదని తీసుకుని కృష్ణుణ్ణి కొడితే అర్జునుడా గదని విరిచాడు. వాడు మరో గదతో లంఘిస్తే వేగంగా వాడి భుజాల్ని కంఠాన్ని తుంచాడు.
ఇలా ద్రోణుణ్ణి దాటుకుని, కృతవర్మని చీకాకు పెట్టి, శ్రుతాయుధుణ్ణి దండాయుధుడి దగ్గరికి పంపి, కాంభోజుణ్ణి కాటికి పంపి, శ్రుతాయువుని గతాయువుగా చేసి నీ సైన్యంలోకి చొచ్చుకుపోయి వీరయోధుల ప్రాణాల్ని తన బాణాల్తో బయటికి లాగేస్తున్న అర్జునుణ్ణి చూసి దుర్యోధనుడు కుతకుతలాడాడు. ఒంటిగా రథాన్ని తోలుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతన్ని నానా దుర్భాషలాడాడు – “నిన్ను అవలీలగా దాటి మన సైన్యం లోకి జొరబడి అతలాకుతలం చేస్తున్న అర్జునుడి వంక కన్నెత్తైనా చూడవు. పాండవపక్షపాతీ! పాము రక్షణలో వున్న కప్పల్లా వున్నాం, నిన్ను నమ్ముకుని. ఏదో కంటితుడుపుగా నాకు వరమిచ్చావ్, ఏం సాధించావ్? నువ్వేదో రక్షిస్తావని సైంధవుడు సైన్యంలోనే వున్నాడు. వాణ్ణి చంపించటానికి పూనుకున్న తేనె పూసిన కత్తివి నువ్వు” అంటూ. అంతలోనే సంభాళించుకుని, “బాధలో నేనన్న మాటలు పట్టించుకోవద్దు. ఎలాగైనా సైంధవుణ్ణి రక్షించు” అని వేడుకున్నాడు.
దానికి ద్రోణుడు “నాకేం బాధలేదు, నాకు నువ్వూ అశ్వత్థామ వేరువేరు కారు. ఇప్పుడు నేను సేనాముఖాన్ని విడిచి లోనికి వెళ్తే పాండవబలగాలు మన సేనల్ని చెల్లాచెదురు చేస్తయ్, సైంధవుడికి కూడ ముప్పు రావొచ్చు. అదీగాక నేను ధర్మరాజుని బంధించాల్సిన పని కూడ వుంది కదా! పైగా, నేను వృద్ధుణ్ణి, అర్జునుణ్ణి వెంటబడి తరమలేను. నువ్వూ అతనూ కుర్రవాళ్లు. కొంతమందిని వెంట తీసుకు వెళ్లి అతనితో నువ్వే తలపడి ఆపరాదూ” అన్నాడు. “నిన్నూ కృతవర్మనీ ఓడించి, అనేక మంది రాజుల్ని హతమార్చిన అర్జునుణ్ణి నేను ఎదుర్కోవాలా? కాదూ కూడదూ అదే ఇప్పుడు కర్తవ్యం అంటే నా పరువు పోని మార్గం చెప్పు, అలాగే చేస్తా” అన్నాడు దుర్యోధనుడు. “నువ్వన్నది నిజమే. ఐతే నీకో మహత్తు చూపిస్తాను. ఇదుగో ఈ బంగారు కవచానికి కవచధారణ విద్యని ఆవహింపజేసి ఇస్తున్నాను. దీన్ని ధరిస్తే ఎవరి బాణాలూ నిన్ను ఏమీ చెయ్యలేవు. దీన్ని బ్రహ్మ ఇంద్రుడికిస్తే అతను అంగిరసుడికి, అంగిరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికి, అగ్నివైశ్యుడు నాకు ఇచ్చారు” అని దాన్ని తొడిగి దీవించి పంపాడు ద్రోణుడు. దాంతో సుయోధనుడు సంతుష్టుడై చమూసమూహాల్తో అర్జునుడి మీదికి బయల్దేరాడు.
ఇక్కడ పాండవబలాలు మన మొగ్గరం మీదికి దండెత్తినయ్. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడితో ఘోరంగా పోరాడు. మనవైపు నుంచి మేటిదొరలు అక్కడికి చేరారు. ఇరువైపుల వారు ఒకర్నొకరు తలపడ్డారు. వికర్ణుడు, వివింశతి, చిత్రసేనుడు – భీముడితో కలబడ్డారు. బాహ్లికుడు ద్రౌపదేయుల్తో. దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవుల్ని, సోమదత్తుడు శిఖండిని, అలంబుసుడు ఘటోత్కచుణ్ణి ఎదుర్కున్నారు. సైంధవుడికి తోడుగా వుంటూనే అప్పుడప్పుడు మొన ముందుకి కూడ వచ్చి చూసిపోతున్న శల్యుడు అక్కడే వున్నాడప్పుడు. ధర్మజుడితో అతను తలపడ్డాడు. అందరూ ఇక రేపు లేదన్నట్టు శక్తంతా కూడగట్టి శరయుద్ధాలు చేస్తున్నారు. ఐతే ద్రోణాచార్యుడి రక్షణలో మన వ్యూహం పటిష్టంగా నిలబడటం చూసి సహించలేక ధృష్టద్యుమ్నుడు మహాక్రోధంతో ద్రోణుడి గుర్రాల్ని తాకేంత దగ్గరకి తన రథాన్ని నడిపించి ఒక వాలుని పలకని తీసుకుని ద్రోణుడి రథమ్మీదికి గెంతి చిత్ర విచిత్ర విన్యాసాల్తో అతని బాణాలు తనకి తగలకుండా చూసుకుంటూ అతన్ని చేరబోతూ వాలుతో గుర్రాల్ని కొట్టి గాయాలు చేశాడు. ఐతే ఆ అదునులో ద్రోణుడతని వాలుని విరిచి సారథిని గుర్రాల్ని చంపి ఒక పదునైన నారసాన్ని అతని మీదికి వేస్తే – వేగంగా సాత్యకి దాన్ని మధ్యలోనే నరికి సింహం చేతిలో చిక్కిన లేడిని రక్షించినట్టు ధృష్టద్యుమ్నుణ్ణి అక్కణ్ణుంచి తప్పించాడు.
దానికి ద్రోణుడు కోపించి సాత్యకి మీద క్రూరశరాలు ప్రయోగించాడు. సాత్యకి కూడ తన సారథితో “ద్రోణుడి అభిమతం ధర్మరాజుని పట్టటం. అతనికా అవకాశం ఇవ్వకుండా మనం అతనితో తలపడదాం” అని తన రథాన్ని ద్రోణుడికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ తీవ్ర బాణజాలాల్తో చూసేవాళ్లకి కళ్లపండగ్గా సమానంగా పోరారు. అతని లాఘవానికి ద్రోణుడు కూడ సాత్యకిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ద్రోణుడి వింటిని సాత్యకి రెండుగా నరికితే అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని కూడ సాత్యకి నరికాడు. ఇలా అతను ఎన్ని తీసినా సాత్యకి నరుకుతూనే వుంటే అంతా విస్తుపోయారు. ఇక సహించలేక ద్రోణుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే సాత్యకి వారుణాస్త్రంతో దాన్నెదుర్కున్నాడు. ఆకాశంలో ఆ రెండు అస్త్రాలూ ఘోరంగా పోరి కొంతసేపటికి శాంతించినయ్. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి అండగా వచ్చి నిలిస్తే దుశ్శాసనుడు ముందుండగా మన కుమారవర్గం వాళ్లని తాకింది.
అక్కడ దారంతా పీనుగుపెంటలు చేస్తూ అర్జునుడు సైంధవుడున్న చోటికి
దగ్గరౌతున్నాడు. అప్పుడు అవంతీశ్వరులు విందానువిందులు ఒకే రథమ్మీద వచ్చి అర్జునుణ్ణి అడ్డుకున్నారు. అర్జునుడి బాణాల్ని లెక్కచెయ్యకుండా అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద అనేక శరాలు పంపారు. ఐతే అర్జునుడు తీవ్రవేగంతో సారథిని, గుర్రాల్ని చంపి, కేతనాన్ని కూల్చి దాంతో పాటే విందుడి తలనీ నేలకూల్చాడు. అన్న చావు చూసి అనువిందుడు రోషంతో గద తీసుకుని రథాన్నుంచి దూకి పరిగెత్తి కృష్ణుడి ఫాలాన మోదాడు. అర్జునుడు తటాల్న వాడి గద విరిచి కాళ్లూ చేతులూ తలా నరికి యుద్ధభూమికి బలిచ్చాడు. వాడి సేనలు ధైర్యంగా నిలబడి చుట్టుముడితే విజయుడు వాటిని నాశనం చేసి కదిలాడు.
ఐతే సమయం మధ్యాన్నాన్ని మించటం, అర్జునుడూ అతని గుర్రాలూ అలిసినట్టు కనిపించటం, సైంధవుడున్న చోటు ఇంకా చాలా దూరం వుండటంతో మనసైన్యంలో ఉత్సాహం కలిగింది. అందరూ సింహనాదాలు చేశారు. అర్జునుడు కృష్ణుడితో, “గుర్రాలకి చాలా బాణాలు గుచ్చుకుని వున్నయ్, ఇంకా చాలా దూరం వెళ్లాల్సుంది. వాటికి కాస్త విశ్రాంతి ఇచ్చి, ఆ బాణాల్ని లాగి వైద్యం చేస్తే మంచిదేమో” అంటే అలాగే చేశాడు కృష్ణుడు.
--((***))--