Tuesday, 5 November 2019







ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: హరిః ఓం

01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర  సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు

మీ ప్రాంజలి ప్రభ 
సేకరణ : రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
అందరికీ ధన్యవాదములు 
--(())--

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(01_8_2019)
హరిః ఓం
01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
ఈరీతిగా స్తవనీయుండును మహాత్ముండును అగు శ్రీ మహావిష్ణువు
దివ్యాతి దివ్యములయిన వేయి పుణ్యనామములు సంకీర్తనము చేయబడినవి.
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
పరమ మంగళకరములగు ఈ సహస్రనామములను శ్రద్ధగా శ్రవణము
చేయునట్టిగానీ, కీర్తనము చేయునట్టిగాని మానవులకు ఇహ లోకమందును పరలోకమందును యెట్టి అశుభములును కలుగవు.
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
ఈ సహస్రనామ పారాయణముచేత బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త యగును . క్షత్రియుడు విజయపరంపరలనొందును. వైశ్యుడు ధనసంపన్ను
డగును . శూద్రుడు సుఖభోగముల ననుభవింౘును.
( అనగా బ్రహ్మజ్ఞానాభిలాషతో, అద్వైత సిద్ధిని గోరి పారాయణము
చేసినచో బ్రహ్మస్వరూపుడే యగును. లౌకిక కార్య విజయ కాంక్షలు గలవానికి
అదియే సిద్ధింౘును. ధనసంపన్నత అభిలషింౘు వానికి ధనరాసులు సిద్ధింౘును.
లౌకిక భోగ సుఖములు కాంక్షింౘు వానికి అవియే లభింౘునని భావము).
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
ధర్మాభిలాషికి ధర్మపరంపరలు అర్థార్థులకు సమస్తములగు
అర్థములు. వివిధవాంఛలు గలవారికి ఆయా మనోవాంఛలును ఈ సహస్రనామ
పారాయణము వలన లభింౘును. ( ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములును సిద్ధిౘునని భావము )
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
ప్రాతఃకాలము నందు మేల్కొని, శుచిర్భూతుడై భక్తిభావముతో
ప్రతిదినమును (నిరంతరమును) సర్వమంగళకరుడగు వాసుదేవుని ఈ సహస్ర
నామములను పారాయణ మొనర్పవలెను.
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
ఈరీతిగా సంకీర్తనము చేయుటవలన గొప్ప యశస్సు కలుగును. జ్ఞాతులందు ప్రాధాన్యము పొందును. స్థిరముగా సంపదలు వర్ధిల్లును. ఉత్తమ శ్రేయస్సు లభింౘును.
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
దీనిని పఠింౘు పుణ్యాత్మునకు యెట్టి భయమును కలుగదు.
అతడు ప్రతిభా సంపన్నుడును గొప్ప తేజశ్శాలియునగును. శారీర మానసిక రోగములు కలుగవు . గొప్ప దీప్తిగలవాడును ,ౘక్కని ఆరోగ్యము, బలము, కాంతి
సద్గుణములు గలవాడును అగును.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(02_8_2019)
హరిః ఓం
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
వ్యాధిహరణమును గోరి పారాయణము చేయువారలకు అట్టి వ్యాధులు
నశింౘును. సాంసారిక బంధనములతో కలతచెందు వారికి సమస్త భయములును
హరింౘును. సమస్త కష్టములును ఈపుణ్యపారాయణము వలన నశింౘును.
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
భక్తితో నిరంతరమును మంగళకరములగు భగవానుని సహస్రనామ
ముల పారాయణము చేత సమస్తములగు భయంకరక్లేశములు మహాదుఃఖములు
హరింౘును.
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
వాసుదేవుని ఆశ్రయించి, వాసుదేవుడే పరమ గతి యని భావించి మనుష్యుడు సకల పాపముల నుండియును విముక్తుడై, చిత్తశుద్ధి గలవాడై
సనాతన పరబ్రహ్మమునే పొందును.
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
భగవానుని శరణాగతిని పొందిన భక్తులకు అశుభములెన్నడును
కలుగనే కలుగవు. జనన, మరణ, జరా (ముసలితనము) రోగాది భయము లెంత
మాత్రమును గలుగవు.
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
శ్రద్ధా భక్తి సమన్వితుడై ఈపవిత్ర స్తవరాజమును పారాయణము గావింౘు భక్తులకు అంతఃకరణ శుద్ధి కలుగును. గొప్ప సహనము, మహైశ్వర్యము, చిత్తస్థైర్యము, మేధాసంపద, సత్కీర్తి లభింౘును. ఏకాగ్ర చిత్తము, సదాచార
సంపద, శుచిత, భగవానునియందు పూర్ణ విసశ్వాసము, అనురాగమును కలిగి పారాయణము చేసిన వారికి పైన వివరించిన మహా ఫలము లన్నియును కలుగునని భావము.
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
భగవానునియందు భక్తిగల పుణ్యాత్ములకు కామ, క్రోధ, లోభ
మద, మాత్సర్యములు మున్నగు దుర్గుణములుండవు (వారు అరిషడ్వర్గములను
జయించిన వారగుదురు. అట్టి పవిత్రులకు అశుభములగు భావనలే యుండవు.
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
సూర్యచంద్ర నక్షత్రములతో కూడిన స్వర్గలోకమును, ఆకాశము
దిక్కులు, భూమి, మహాసాగరములు మున్నగునవన్నియును మహాత్ముండగు
శ్రీకృష్ణపరమాత్మ యొక్క బలవీర్యములచేతనే ధరింపబడి యున్నవి.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(03_8_2019)
హరిః ఓం
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
దేవదానవ గంధర్వులతో కూడినట్టియు యక్షోరగ రాక్షస గణములతో
కూడినట్టిదియును నగు విశాల సచరాచర విశ్వమంతయును భగవానుడగు
శ్రీకృష్ణుని వశవర్తియైయున్నది.
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
సర్వేంద్రియములు, మనస్సు, బుద్ధి అహంకారము, తేజస్స్సు, బలము,ధారణ, ప్రతిభా సంపత్తి, క్షేత్రము (శరీరము) క్షేత్రజ్ఞుడు (దేహి) మున్నగు
సమస్తమునూ వాసుదేవుని స్వరూపములేయని తెలుపబడుౘున్నవి.
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
సర్వ శాస్త్రములందును సదాచారమే ప్రధానముగా చెప్పబడి యున్నది. సదాచారము నుండియే ధర్మముత్పన్న మగును. అట్టి ధర్మమునకు పరమాత్మయే ప్రభువు.
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
ఋషులు , పితరులు, సమస్త దేవతలు, మహాభూతములు,
సువర్ణాది ధాతువులు జంగమ స్థావరములగు నీ యనంత విశ్వము నారాయణుని
వలననే యుద్భవించినది.
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
యోగము, జ్ఞానము, సాంఖ్యము, సకలవిద్యలు , సమస్తములగు
శిల్పాది కర్మలు, వేద శాస్త్రాదులు ఈ విజ్ఞానమంతయును పరమాత్మ నుండియే
కలుగుౘున్నవి.
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
మహారూపుడై, సమస్తభూత స్వరూపుడై , సర్వమును భరింౘు
వాడును, నాశన రహితుడును, అద్వితీయుండునునగు శ్రీమహావిష్ణువు ముల్లోకములందును వ్యాపించి సకలభూతజాలములందును వేరువేరు వివిధ
రూపములతో ననుభవింౘుౘున్నాడు.
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
సర్వ విజ్ఞాన సాగరుండును భగవానుండును నగు శ్రీకృష్ణద్వైపాయనుని చేత గానము చేయబడిన నీ విష్ణసహస్రనామ స్తోత్రమను
దివ్యస్తవరాజమును పరమశ్రేయస్సును, సకలఫలసిద్ధులను వాంఛింౘు వారందరును సాదరముతో పఠింపవలయును.
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
సర్వలోక మహేశ్వరుండును , ఆదిమధ్యాంత రహితుండును,
తేజోమూర్తియును, సృష్టిస్థితి లయకారకుండును, సర్వశక్తిసంపన్నుడును నగు
శ్రీకృష్ణపరమాత్మను భక్తిభావముతో (స్మరణ చింతన ధ్యాన కీర్తనాదులచే)
భజింౘువాఱికి ఎట్టి అపజయములుగాని, పరాభవములుగాని దుఃఖములుగాని
యెన్నడును కలుగవని వ్యాసదేవుని వాక్యమై యున్నది.
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు
సౌందర్యలహరి శివానందలహరి స్తోత్రము ల నాస్వాదించి ఆదరించినటులే శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము ను
గూడా భక్తి శ్రద్ధలతో నాస్వాదించి యాదరించి ప్రోత్సహించిన
మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, భగవద్భక్తు లందరికీ
శ్రావణమాస శుభాకాంక్షలతో
శుభాభినందనలతో
సదా మీయందఱి శ్రేయోభిలాషి
మునీశ్వరరావు యనమండ్రం
(03_8_2019)

Thursday, 5 September 2019

సింధురాజు (సైంధవుణ్ణి ).వధ !
_
సమరవేషాలు తీసేసి శూన్యాకారాల్తో ధర్మజాదులు శోకసంతప్తులయారు. ధర్మరాజు “నన్ను సంతోషపరచాలని యోధానుయోధుల రక్షణలో ఉన్న నిర్భేద్యమైన సైనిక వ్యూహాన్ని ఛేదించి ఒంటరిగా ఎందరో మహారథుల్ని వధించాడు. దుశ్శాసనుణ్ణి ఓడించి చతురంగబలాల్ని తూర్పారబట్టాడు. ఇది మరెవరికైనా సాధ్యమయే పనేనా? ఇప్పుడు అర్జునుడు వచ్చి కొడుకెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పగలన్నేను? కృష్ణుడికి అతని చెల్లెలికి ఎంత దుఃఖం తెచ్చిపెట్టాను ! బాలుడే, సుకుమారుడే, యుద్ధాల్లో అనుభవం లేనివాడే, అలాటి వాణ్ణి చూస్తూ చూస్తూ మొన చీల్చమని పంపిన నన్ను ఏమనుకోవాలి? వాడితో నేను కూడ పోయివుంటే బాగుండేది, ఇప్పుడు అర్జునుడికి నా మొహం ఎట్లా చూపిస్తాను? ఇంద్రుడంతటి వాడే సాయం కోరి వస్తే వెళ్లి కాలకేయాది రాక్షసుల్ని సంహరించిన వాడి కొడుకు శత్రువుల చేత చిక్కి మరణించాడని అతనికి మచ్చ తెచ్చిపెట్టాను కదా. ఇప్పుడీ మాట విని అర్జునుడేం చేస్తాడో! బతికితే రాజ్యం వస్తుందని, మరణిస్తే స్వర్గం, సద్గతి కలుగుతాయని చెప్పుకునే మాటలన్నీ ఇలా మన ఆత్మీయులు పోయినప్పుడు కలిగే దుర్భరశోకం ముందు వట్టిమాటలుగానే అనిపిస్తయ్. నిరర్థకాలుగా కనిపిస్తయ్” అంటూ తనని తను రకరకాలుగా నిందించుకుంటూంటే వ్యాసమహాముని ప్రత్యక్షమై అతనికి మృత్యుదేవతా మహత్యాన్ని, షోడశమహారాజుల చరిత్రల్ని వినిపించి కొంత ఉపశమింపజేసి అంతర్ధానమయాడు.

అర్జునుడు సంశప్తక సేనా వనాన్ని అనలుడిలా హరించి వస్తూ “కృష్ణా, నాకెందుకో దుశ్శకునాలు తోస్తున్నయ్, మనసు కీడు శంకిస్తున్నది. ఒకవేళ ద్రోణుడి చేతికి ధర్మరాజు చిక్కలేదు గదా” అన్నాడు విచారంగా. “నీ సోదరులంతా కుశలమే. మరేదో అశుభం జరిగింది, మనం వెళ్లి తెలుసుకుందాం” అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ తమ శిబిరానికి చేరారు. అక్కడంతా విషణ్ణవదనాల్తో అర్జునుణ్ణి తప్పించుకు తిరగటం చూసి “కృష్ణా, ఏదో జరక్కూడనిది జరిగింది. నవ్వు మొహంతో రోజూ కనిపించే అభిమన్యుడు కనిపించటం లేదు. నా మనస్సు కలత చెందుతున్నది” అంటే కృష్ణుడు సమాధానం చెప్పకుండా వూరుకున్నాడు. అర్జునుడు హడావుడిగా ధర్మరాజు శిబిరానికి వెళ్లాడు.
అక్కడ ధర్మరాజుని చుట్టుకుని పెద్దలంతా వున్నారు కాని అభిమన్యుడు కనిపించలేదు. కంపించే గొంతుతో –

“ఇంతమంది ఇక్కడ ఉన్నా అభిమన్యుడు మాత్రం కనపడడు. ఈ మౌనం వదిలి ఏమైందో చెప్పండి. ద్రోణుడు పద్మవ్యూహం పన్నితే దాన్ని భేదించటానికి వాణ్ణి పంపుదామనే పనికిమాలిన ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఏమిటి? అలా మీరు పంపితే పోయి ఒక్కడే వాళ్ల చేతికి చిక్కలేదు గదా? వాడికి ప్రవేశించటమే చెప్పాను గాని నిర్గమించటం తెలియదని మీకు తెలీదా?

దివ్యశరాఢ్యుడు, సంగరకేళీనిపుణుడు వాణ్ణి పడేసిన వాడు ఎవడు?
ఐనా వాణ్ణి పడెయ్యటం ఏ ఒక్కడి వల్లా కాదు, ఇదేదో పదిమంది కలిసి చేసిన కుట్ర ఫలితం.

అయ్యో, నాలాటి మందభాగ్యుడికా అలాటి విలువైన పుత్రరత్నం దక్కేది? ఐనా మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు వాడికి సాయపడకుండా?

అంతమంది శత్రువులు ఒక్కటై నానా శస్త్రాస్త్రాల్తో నరుకుతుంటే నన్ను తలుచుకుని తోడుగా రాలేకపోయానని ఎంత కలవరపడ్డాడో ! కాదు కాదు, అంతటి మహావీరుడు ఎప్పుడూ అలా ఆలోచించడు. ఐనా అంతమంది ఒక్కసారి మీదపడి బాలుణ్ణి వధించేముందు నన్ను గాని కృష్ణుణ్ణి గాని తలుచుకోలేదా ఆ దుర్మార్గులు?

సంశప్తకుల్తో ఘోరపోరాటం సాగిస్తున్నప్పుడు యుయుత్సుడు తండ్రినేమీ చెయ్యలేక ఇలా చిన్నపిల్లవాణ్ణి పదిమంది కలిసి అన్యాయంగా చంపుతారా అని కౌరవుల్ని ఆక్షేపించటం విన్నట్టనిపించింది కాని అప్పుడంతగా పట్టించుకోలేదు, కృష్ణుడు విని వుండడా, అంత ముఖ్యమైన విషయమైతే చెప్పడా అని. అప్పుడైనా వచ్చివుంటే వాణ్ణి రక్షించుకుని వుండేవాణ్ణేమో”

అంటూ రకరకాలుగా పలవిస్తూ మాట్టాడుతున్న అర్జునుణ్ణి పొదివిపట్టుకుని కృష్ణుడు “ఇలా ఉండటం నీకు తగదు. శూరుల జీవితాలు ఇలాటివే కదా – శత్రువుల్ని తుంచి ఇక్కడ యశస్సు, పైన స్వర్గమూ పొందిన కొడుకుని చూసి ఆనందించాలి గాని బాధ పడతారా నీలాటి జ్ఞానులు? నీ దుఃఖం చూసి మిగిలిన వాళ్లెంత చిన్నబోయారో చూడు” అంటే “అలాగే, వాడి యుద్ధప్రకారం నాకు వివరించి చెప్పండి. వాడి చావుకి కారణమైన వాళ్లని త్వరగా వాడి దగ్గరికి పంపించాల్సిన పని వుంది నాకు. ఐనా ఇంతమంది మహారథులు మనలో వుండి ఒక్కరూ వాడికి తోడు కాలేకపోవటం నమ్మ శక్యంగా లేదు. మిమ్మల్ని మీ మగతనాల్ని నమ్మి వాణ్ణి మీకప్పగించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. అసలిలాటి బలహీనులు, భీరువులు మీకు తోడు ఈ గదలూ ఖడ్గాలూ విల్లమ్ములూ ఎందుకు సింగారానికి కాక?” అని గద్దిస్తుంటే నోరెత్తి మాట్టాడాటానికి ఎవరూ సాహసించలేకపోయారు. కృష్ణుడొక్కడే అనునయవాక్యాలు పలికాడు.

చివరికి ధర్మరాజు సాంత్వనస్వరంతో -“నువ్వు సంశప్తకుల్తో పోరుకి పోతే ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేం వెళ్లి అతనితో తలపడ్డాం గాని అతని బాణాగ్ని జ్వాలకి తట్టుకోలేక వెనక్కి తిరిగాం. అప్పుడు నాకు గుర్తొచ్చింది అభిమన్యుడికి పద్మవ్యూహ భేదనం తెలుసునని. వాడు దాన్ని భేదిస్తే వాడి వెనకే మేమందరం వెళ్లాలని బయల్దేరాం. వాడు త్రుటిలో దాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. ద్రోణాదులు వాడిని చుట్టుముడితే సాయంగా మేం వెళ్తుంటే రుద్రవరగర్వంతో సైంధవుడు మమ్మల్నడ్డుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మేం వాణ్ణి దాటలేకపోయాం.

అభిమన్యుడు ద్రోణ, కర్ణ, కృతవర్మ, కృప, అశ్వత్థామాది మహావీరుల్ని చిక్కుపరిచి కురుసేనని కాల్చి కర్ణాదుల్ని పరిగెత్తించి బృహద్బల లక్ష్మణుల్ని సంహరించి అనేకమంది రాజుల్ని మర్దించి చివరికి విరథుడై పదాతిగా గదతో తూగాడుతూనే యుద్ధం చేస్తూ దుశ్శాసనుడి కొడుకు వస్తే వాడి రథాన్ని నుగ్గు చేసి వాడూ గదతో వస్తే ఇద్దరూ మహాఘోరంగా గదాయుద్ధం చేసి ఒకరి చేతిలో ఒకరు మరణించారు” అని చెప్పేసరికి అర్జునుడు గుండె చెదిరి మూర్ఛితుడయ్యాడు. అప్పటివరకు అతనిలో మినుకుమినుకుమంటున్న కొద్దిపాటి ఆశ కూడ ఆ మాటల్తో ఆరిపోయింది.

కృష్ణుడు, ధర్మరాజు అతన్ని పట్టుకుని ఉపచారాలు చేస్తే లేచి మహోద్వేగంతో “ఇదే నా ప్రతిజ్ఞ, అందరూ వినండి. రేపు నేను సింధురాజుని చంపి తీరతాను. వాడు భయపడి ధర్మజుణ్ణి గాని, కృష్ణుణ్ణి గాని, నన్ను గాని శరణు వేడితేనో లేకపోతే అసలు యుద్ధానికే రాకపోతేనో తప్ప దీనికిక తిరుగులేదు. ఇలా చెయ్యలేకపోతే నేను గురుద్రోహులు, బ్రహ్మహంతకులు, మద్యపానరతులు పోయే దుర్గతులకి పోతా. అంతే కాదు, రేపు సూర్యాస్తమయం లోగా నేను వాణ్ణి చంపకపోతే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తా” అంటూ కఠోరప్రతిజ్ఞ చేసి, గాండీవాన్ని తెప్పించి దాని గుణధ్వని మోగించాడు. కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం పూరించారు.

ఆ పాంచజన్య దేవదత్తాల ధ్వనులకు మనసేనలు తల్లడిల్లినయ్. వేగపు చారులు పరుగున వచ్చి అర్జున ప్రతిజ్ఞని వినిపించారు. సైంధవుడి గుండె ఝల్లుమంది. తన చుట్టాల్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి శిబిరానికి వెళ్లాడు.

“అక్కడికి నేనొక్కణ్ణే అభిమన్యుడి చావుకి కారణమైనట్టు అర్జునుడిలా నా వెంట పడటం ఏమిటి? ఇప్పుడు నన్ను రక్షించగలిగే వాళ్లెవరింక? ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా వెళ్తా, నాకు సెలవిప్పించండి” అన్నాడు.

ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యటం తనకి ఉపయోగపడొచ్చని గ్రహించాడు దుర్యోధనుడు. “మేం అందరమూ నీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డం వేస్తాం. నీకేం భయం అక్కర్లేదు, రాజధర్మం తప్పకుండా రేపు యుద్ధరంగానికి రా.” అని భరోసా ఇచ్చాడు. సైంధవుడు కొంత శాంతించాడు.

ఐనా అనుమానం పూర్తిగా పోక వాళ్లని వెంటబెట్టుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. ద్రోణుడు కూడ “నా బాణాలతో కోట కట్టి నిన్ను రక్షిస్తా. అర్జునుడు నిన్నేమీ చెయ్యలేకుండా ఒక గొప్ప దురవగాహమైన వ్యూహాన్ని పన్నుతా. కనక రాజధర్మానికి హాని కలక్కుండా యుద్ధానికి రా. పైగా రాచపుటక పుట్టి శరీరం మీద ఇంత ప్రేమ పెంచుకోవటం మంచిది కాదు. అందరూ ఏదో ఒక రోజు వెళ్లేవాళ్లే కదా” అని బోధిస్తే ఒప్పుకున్నాడు. మన శిబిరాల్లో తూర్యఘోషలు మిన్ను ముట్టినయ్.

ధర్మరాజు రాజులందర్నీ వాళ్ల శిబిరాలకి పంపాడు. కేవలం అతని సోదరులు, కృష్ణుడే అక్కడున్నారు. కృష్ణుడు అర్జునుడితో “నాతో మాట మాత్రం చెప్పకుండా అందరూ వింటుండగా ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశావ్. సూర్యాస్తమయంలోగా వాణ్ణి చంపటం అంత తేలిగ్గాదు. ద్రోణుడొక అద్భుతమైన వ్యూహాన్ని పన్ని వాణ్ణి దాని వెనక దాచబోతున్నాడని మన చారులు చెప్తున్నారు. వాళ్ల మహావీరుల్ని ఒక్కొక్కర్ని ఓడించటమే కష్టం, అలాటప్పుడు వాళ్లందరూ కలిసి ఒకే పనికి నడుం కడితే అందర్ని ఉమ్మడిగా ఓడించటం ఇంకెంత కష్టమో ఆలోచించావా?” అన్నాడు.

ప్రతిగా అర్జునుడు నవ్వాడు. “కృష్ణా, నా గురించి వాళ్లకి తెలుసు, వాళ్ల సంగతి నాకు తెలుసు. నేనా సైంధవుణ్ణి చంపటానికి తరుముతుంటే ఎవరూ అడ్డం ఆగలేరు. చూస్తుండు. గాండీవం సాధనం, సమరకర్త అర్జునుడు, సారథి అబ్జనాభుడు. అలాటి రథాన్ని ప్రతిఘటించటం హరుడి వల్ల కూడ కాదు, వీళ్ల సంగతి చెప్తావెందుకు? నీ అండ ఉండగా ఈ కార్యం సాధించటం అనివార్యం. ఈ పూటకి వెళ్లి నిద్ర పో, పొద్దున్నే మళ్లీ సారథ్యం పని ఉంది” అని మాట్లాడుకుంటూ పట్టరాని కోపంతో వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ నడిచారు.

కృష్ణుడి కోరిక మేరకు కొద్దిరోజుల క్రితమే అక్కడికొచ్చి వున్న సుభద్రని, ఉత్తరని అనునయించమని అర్జునుడు కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు సుభద్ర మందిరానికి వెళ్లి శోకిస్తున్న ఆమెతో “రాచకూతురికి వీరపత్ని కావటం, కొడుకుని కనటం, వాణ్ణి మహావీరుణ్ణి చెయ్యటం, ధర్మాలు. నువ్వు ఈ మూటిలో ప్రసిద్ధి పొందావు. రాచధర్మాన్నాచరించి శత్రువుల్ని వధించి వీరస్వర్గం పొందిన కొడుకు గురించి విచారపడొచ్చునా? తగుమాటల్తో నీ కోడలి దుఃఖాన్ని ఉపశమింప చెయ్యి. నీ భర్త రేపా సైంధవుణ్ణి చంపి మనందరికీ సంతోషం కలిగిస్తాడు” అని చెప్పాడు. ఐతే ఆమె శోకం ఆపుకోలేక కొడుకుని తలుచుకుని బిగ్గరగా ఏడ్చింది. ద్రౌపది కూడ వచ్చి సుభద్ర, ఉత్తరలతో తనూ కలిసి విలపించింది. ముగ్గురూ నేల మీద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి హృదయవిదారకంగా ఆక్రందించారు. తనూ శోకమానసుడైనా కృష్ణుడు ఎలాగో వాళ్లని సమాధానపరిచి అర్జునుడి శిబిరానికి వచ్చాడు.

పవిత్రజలాల్తో ఆచమనం చేశాడు. దర్భశయ్యని చేసి అక్షతలు, గంధ పుష్పాల్తో దాన్ని అలంకరించి ఆయుధాల్ని అర్చించి చుట్టూ పెట్టి అర్జునుణ్ణి మధ్యలో కూర్చోబెట్టాడు. “నువ్వు రోజూ రాత్రివేళ చేసే దేవపూజ ఇప్పుడు చెయ్యమం”టే అర్జునుడు తను రోజూ చేసే శివపూజ మార్గాన ధూప దీప నైవేద్యాలు కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడవి స్వీకరించి అతన్ని దీవించి సుఖనిద్ర చేయమని చెప్పి తన సారథి దారుకుడిని తీసుకుని తన శిబిరానికి వెళ్లాడు.

మర్నాడు జరపవలసిన కార్యం గురించి ఆలోచిస్తూ కొంతసేపు పడుకున్నాడు కృష్ణుడు. తర్వాత లేచి దారుకుడితో “దూరం ఆలోచించకుండా అర్జునుడు ఘోరప్రతిజ్ఞ చేశాడు. దీన్ని తీర్చటం సామాన్యమైన విషయమా? వ్యవహారం అడ్డుతిరిగితే అర్జునుడు లేకుండా నేనుండటం అసాధ్యం. ఆరు నూరైనా నూరు ఆరైనా రేపు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరేట్టు చేస్తా. అవసరమైతే నేనే యుద్ధం చేసి అడ్డమైన వాళ్లందర్నీ హతమారుస్తా. నువ్వు వెళ్లి మన రథాన్ని సిద్ధం చెయ్యి. యుద్ధ రంగానికి దగ్గర్లో ఉండు. నా పాంచజన్య ధ్వని నీకు గుర్తు. అది వినబడితే వెంటనే నా దగ్గరకు వచ్చెయ్యి” అని వివరించాడు. దానికి దారుకుడు “అలాగే చేస్తా. ఐతే నువ్వూ అర్జునుడు పూనుకుని సైంధవుణ్ణి చంపబోతుంటే మిమ్మల్ని అడ్డుకోగలిగిన వాళ్లు ఎవరున్నారక్కడ?” అని అతని ఉద్రేకాన్ని కొంత ఉపశమింప చేశాడు. ఏ రకమైన పాంచజన్యధ్వని సంకేతమో ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు.

అక్కడ అర్జునుడు దర్భశయ్య మీద కలత నిద్రలో ఉన్నాడు. అతనికో కల వచ్చింది. అందులో కృష్ణుడు కనపడ్డాడు. “నీకు రేపు యుద్ధంలో పాశుపతాస్త్రం అవసరం కలగొచ్చు. ఆ మహాస్త్రం మంత్రాన్ని, పిడికిట పట్టే విధానాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అందుకు పరమశివుణ్ణి తలుచుకో” అని చెప్తే అర్జునుడు ఆచమనం చేసి పరమేశ్వర ధ్యానం చేస్తుంటే ఇద్దరూ ఆకాశాని కెగిరారు. దార్లో అనేక విశేషాలు చూస్తూ కైలాసగిరిని చేరారు. ప్రమథనాథుణ్ణి దర్శించి ప్రణమిల్లారు. అంతకుముందు నిత్యార్చన ప్రకారంగా కృష్ణుడికి తను సమర్పించిన గంధ మాలాక్షతలు ఇక్కడ శివుడి శరీరం మీద అర్జునుడికి కనిపించినయ్. శివకేశవుల అభేదాన్ని అలా చూసి ఆశ్చర్యపడ్డాడతను. పరమేశ్వరుడు వాళ్లకి స్వాగతం పలికి ఎందుకు వచ్చారని అడిగాడు. పాశుపతం ఇమ్మని కోరమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అతనలాగే చేశాడు. పరమశివుడు వాళ్లతో “ఆ సరోవరంలో నా ధనుర్బాణాలున్నయ్, వెళ్లి తీసుకురండి” అని చెప్పాడు. వాళ్లు వెళ్లి చూస్తే విషజ్వాలలు కక్కుతూ మహోరగాలు వాళ్లకి కనిపించినయ్. అవే దివ్యబాణాలని గ్రహించి వాళ్లు పాదప్రక్షాళనం చేసుకుని శతరుద్రీయం జపిస్తే అవి వాటి పూర్వాకారాలు ధరించినయ్. వాళ్లా ధనుర్బాణాల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడొక మహాబలశాలి ఐన బాలుడు ఆ వింటిని తీసుకుని శరాన్నెక్కు పెడితే అర్జునుడతన్ని చూసి ఆ పద్ధతి నేర్చుకున్నాడు. అప్పుడే శివుడు కూడ అతనికి మంత్రోపదేశం చేశాడు. అలా అర్జునుడప్పుడు మంత్రం, ప్రయోగవిధానంతో సహా పాశుపతాస్త్రాన్ని సంపూర్ణంగా అందుకున్నాడు. ఇద్దరూ పరమేశ్వరుడి సెలవు తీసుకుని తిరిగివచ్చారు. అర్జునుడు కల నుంచి లేచి చూస్తే తెల్లవారుతున్నది.

అవతల కృష్ణుడు మిగిలిన రాత్రంతా అర్జునుడికి తనను ఉన్న అనుబంధం గురించి, మర్నాడు యుద్ధంలో జరిపించవలసిన కార్యక్రమం గురించి దారుకుడితో మాట్లాడుతూనే గడిపాడు.
పద్నాలుగవ రోజు

ఉదయాన్నే ధర్మరాజు దేవార్చన చేసి కొలువు తీరాడు. తమ్ముళ్లు, రాజులు వచ్చారు. కృష్ణుడు కూడ అక్కడికి వచ్చాడు. ధర్మరాజు అతనితో “నువ్వు ఇప్పటికి ఎన్నో సార్లు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు అర్జునుడి ప్రతిజ్ఞ మనసులో పెట్టుకుని మాకు జయం కలిగించు” అని ప్రార్థించాడు. “ఇవాళ అర్జునుడు వైరి సేనల్ని పిండిపిండి చేసి సైంధవుడి తల నరుకుతాడు. ఇది నిశ్చయం” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. ఇంతలో అర్జునుడక్కడికి వచ్చి తన స్వప్న వృత్తాంతం వినిపించాడు. అందరూ ఆశ్చర్యంతో ఆ పరమేశ్వరుణ్ణి తల్చుకుని నమస్కరించారు.

కృష్ణుడు రథానికి జయప్రదాలైన మంత్రాలు ప్రయోగించాడు. అర్జునుడు దానికి ప్రదక్షిణం చేసి అధిరోహించాడు. నొగల్లో కృష్ణుడు, అర్జునుడి పక్కన సాత్యకి కూర్చున్నారు. కొంత దూరం వెళ్లాక అర్జునుడు సాత్యకికి ధర్మరాజు రక్షణ భారం అప్పగించి పంపించాడు.

ద్రోణుడు ఇరవైనాలుగు కోసుల పొడవు, పది కోసుల వెడల్పుతో శకటవ్యూహం కట్టి అందులో పశ్చిమార్థంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. దాని పక్కనే సూచీవ్యూహాన్ని పన్నాడు. సైంధవుణ్ణి ఆ సూచీవ్యూహం మూలంలో సేనకి వెనక భాగంలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థ్హామ, వృషసేనుడు, కృపుడు అతని పక్కన వుండేట్టు ఏర్పరచి నిలబెట్టాడు. వాళ్లకి బలంగా పద్నాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథాలు, లక్ష గుర్రాలు, పదిలక్షల పదాతులు ఉన్నారు.

ఆ మహావ్యూహాన్ని ఖేచరులు కూడ మెచ్చుకున్నారు. ఒక్క దుర్మర్షణుడు మాత్రం అర్జునుడి అంతు చూట్టానికి నేనొక్కణ్ణి చాలు అంటూ వ్యూహం బయటికి వెళ్లి దానికి ముందు పదిహేడు వందల విండ్లంత దూరాన తన సైన్యంతో నిలబడ్డాడు. ద్రోణుడు శకటవ్యూహం ముఖస్థానాన నిలిచాడు. దుర్యోధనుడు, మన సైన్యాన ఇతర దొరలు సంతృప్తిగా తలలు పంకించారు. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలుపుతూ భయంకరంగా అర్జునుడు దూసుకు వచ్చాడు. అతనికి కొద్దిగా వెనగ్గా ధృష్టద్యుమ్నుడు, నకులుడి కొడుకు శతానీకుడు మొగ్గరం పన్ని నిలిచారు. అర్జునుడు తన రథాన్నాపి దేవదత్తం ఒత్తితే పాంచజన్యరవం కూడ దానికి తోడైంది.

దుర్మర్షణుడు వీరావేశంగా తన బలగంతో అర్జునుడి మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు “మదంతో ముందుకి దూకుతున్నాడు, వీడే మనకివాళ తొలిముద్ద” అని వాణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడు ఒక్కడే కదా అని దుర్మర్షణుడి సైన్యం అతన్ని చుట్టుముట్టి వివిధ శస్త్రాస్త్రాల్తో ముంచెత్తింది. అతనా సైన్యాన్ని చిందరవందర చేసి భీభత్సంగా నాశనం చేస్తే దుర్మర్షణుడు వెనక్కు తిరిగి పారిపోయాడు. వాడితో పాటే వాడి సైన్యాలూ పరిగెత్తినయ్.

అది చూసి సహించక యువరాజు దుశ్శాసనుడు అర్జునుడితో తలపడ్డాడు. అతన్ని చూసి అర్జునుడు ఒక పెలుచ నవ్వు నవ్వాడు. దేవదత్తాన్ని పూరించి గాండీవజ్యానాదం దిక్కుల పిక్కటిల్లగా అతని సైన్యాన్ని ఊచకోత కోశాడు. పీనుగుపెంటలైన సేనని చూసుకుని దుశ్శాసనుడు పారిపోతుంటే విజయుడు వదలక తరిమాడు. “పారిపోతే చావు తప్పుతుందా? అప్పుడు సభలో అవాకులూ చవాకులూ పేలి ఇప్పుడు నీ చావుకి తెచ్చుకున్నావ్” అంటూ అతని వీపున పది అమ్ములు నాటితే వెనక్కి తిరిగైనా చూడకుండా పరిగెత్తాడు దుశ్శాసనుడు. సైంధవుడి విషయం తలుచుకుని వాణ్ణి అప్పటికి వదిలేసి వ్యూహం వైపుకి తిరిగొచ్చాడు అర్జునుడు.

వచ్చి ద్రోణుడికి కొద్ది దూరంలో రథాన్ని ఆపి కృష్ణుడి అనుజ్ఞ తీసుకుని ఆచార్యుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. “నా మంచి కోరేవాళ్లలో పాండురాజు, ధర్మజుడు, కృష్ణులతో సాటివాడివి నువ్వు. నీ దృష్టిలో నేనూ అశ్వత్థామ ఒక రకంగా పెరిగాం. సైంధవుణ్ణి చంపాలనే నా ధర్మబద్ధమైన ప్రతిజ్ఞని సాధించటానికి ఈ వ్యూహంలో చొరటానికి నాకు అనుమతివ్వు.” ఆ మాటలకి చిన్న నవ్వుతో ద్రోణుడు నన్ను గెలవకుండా నువ్వు సైంధవుణ్ణి ఎలా చేరతావ్ అంటూ అతని మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడతనితో యుద్ధం చెయ్యటానికి ద్రోణుడి నుంచి అనుజ్ఞ తీసుకుని తొమ్మిది నారాచాలు వేస్తే వాటిని దార్లోనే తుంచాడు ద్రోణుడు. తుంచి వేగంగా కృష్ణార్జునుల మీద అనేక బాణాలేస్తే అతని విల్లు విరచటానికి అర్జునుడు బాణం వెయ్యబోయేంతలో అతని వింటితాటిని తెగ్గొట్టాడు ద్రోణుడు. అర్జునుడు మరొక తాటిని సంధించేలోగా చిరునవ్వుతో అతన్ని బాణవర్షంలో ముంచాడు ద్రోణుడు. అర్జునుడికి అమిత క్రోధం కలిగింది. వర్షపు చినుకుల్లా బాణాలు కుమ్మరిస్తూ ద్రోణుణ్ణి దాటి సైన్యం లోకి వెళ్లి కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నరకటం సాగించాడు.

ద్రోణుడు వచ్చి అతనికి అడ్డుపడి అతని వక్షానికి గురిగా పెద్ద నారసాన్ని వేస్తే కొంచెం తూలి నిలదొక్కుకున్నాడు అర్జునుడు. ద్రోణుడి మీద నానాబాణాలేశాడు. ద్రోణుడు కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలు గుప్పించాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పోరుతుంటే ఇదే అదునని మన సైన్యం కొంత అర్జునుడి మీదికి దూకింది. ఇలా వృద్ధుడైనా అర్జునుడితో పోటీగా యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి చూసి కృష్ణుడు “ఈయనతో యుద్ధం ఇక చాలు, మనం శకటవ్యూహం లోకి జొరబడదాం, ఇదే కర్తవ్యం” అని అర్జునుడితో అంటే “నీ ఇష్టం” అని పార్థుడంటే ద్రోణుడికి ప్రదక్షిణంగా రథాన్ని పోనిచ్చాడు కృష్ణుడు. అదిచూసి నవ్వుతూ ద్రోణుడు “అర్జునా, ఇలాటివి ఎక్కడైనా చూశామా, శత్రువుని జయించకుండా ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళటమేనా?” అంటే “నువ్వు గురువువి గాని నాకు శత్రువువెలా ఔతావ్? యుద్ధంలో నువ్వు కోపం తెచ్చుకుని నిలిస్తే నిన్ను గెలవటం నాకే కాదు ఆ హరుడికైనా సాధ్యమా?” అంటూ ఆగకుండా సాగాడు.
ఇలా మన సైన్యం లోకి వచ్చిన అర్జునుడి తోనే అతని చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడ ప్రవేశించారు. అప్పుడు కృతవర్మ, కాంభోజుడు, శ్రుతాయువు ఉన్నచోటనే ఉండి తలలెత్తి అర్జునుడి రథాన్ని, దాని వెనకనే తరుముకొస్తున్న ద్రోణుణ్ణి చూసి అర్జునుడి మీద దూకాలనుకునేంతలో నారాయణగోపాలకులు అర్జునుణ్ణి పొదివి యుద్ధం చెయ్యసాగారు. అతను వాళ్లందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే ద్రోణుడు వచ్చి అమ్ములవాన కురిపిస్తే అర్జునుడు అతన్ని నేరుగా ఎదుర్కోకుండా అతను వేసిన బాణాల్ని మధ్యలోనే నరికేశాడు. ఐతే ద్రోణుడు వదలకుండా అర్జునుడి మీద ఇరవై ఐదు, కృష్ణుడి మీద డెబ్బై నారసాల్ని కురిపిస్తే వాటన్నిటిని వారించలేక పక్కకి దాటి కృతవర్మ బలాల్ని దాడిచేశాడు అర్జునుడు. ఇంక చేసేది లేక ద్రోణుడు వెనక్కి తిరిగి తన పూర్వస్థానానికి వెళ్లాడు.
కృతవర్మ అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. అతను కృష్ణార్జునులు ఒక్కొకరి మీద అరవై బాణాలేస్తే అర్జునుడు అతని వింటిని విరిచి ఇరవయ్యొక్క బాణాల్తో అతన్ని నొప్పించాడు. అతనింకొక విల్లు తీసుకుని ఐదుబాణాలు విజయుడి వక్షాన నాటితే కృష్ణుడు “ఆ పక్క ఆలస్యమౌతున్నది, వీడేం మనకి చుట్టమా పక్కమా తొందరగా ముగించు” అంటే వాణ్ణి కీలుబొమ్మలా మూర్ఛపుచ్చి కిందపడేశాడు అర్జునుడు. అప్పుడిక కాంభోజసైన్యాన్ని కలగిస్తూ దారి చేసుకుని వెళ్తుంటే మూర్ఛ లేచి కృతవర్మ అర్జునుడి చక్రరక్షకుల్ని అడ్డుకున్నాడు.

కౌరవసేనని చీల్చుకు వెళ్తున్న అర్జునుణ్ణి శ్రుతాయుధుడు ఎదిరించాడు. అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదిహేడు అమ్ములు వేసి ఒక బాణాన కేతువుని కొట్టాడు. క్రీడి తొంభై బాణాల్తో వాణ్ణి వారిస్తే వాడు డెబ్భై ఐదు అతని మీద వేశాడు. కోపంతో అర్జునుడు వాడి విల్లు తుంచి ఏడు శరాల్తో వాడి ఉరాన్ని చొప్పించాడు. వాడు తీవ్రంగా ఇంకో విల్లు తీసుకుని తొమ్మిది బాణాల్తో అర్జునుడి చేతుల్ని వక్షాన్ని కొడితే ఎలనవ్వుతో పార్థుడు వాడి సారథిని, అశ్వాల్ని చంపి డెబ్భై క్రూరశరాల్తో వాణ్ణి నొప్పిస్తే వాడొక పెద్దగదని తీసుకుని రథం దిగి అర్జునుడి రథమ్మీదికి పరిగెత్తాడు.

మహారాజా! ఆ శ్రుతాయుధుడు వరుణవరప్రసాది. ఆ గద వాడికి వరుణుడిచ్చింది. ఆ గద వాణ్ణి అజేయుణ్ణి చేస్తుందని, ఐతే యుద్ధం చెయ్యని వాళ్ల మీద దాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతిరిగి వాడినే చంపుతుందని వరుణుడు వాడికి చెప్పాడు కాని పోయే కాలం వచ్చినవాడికి అవి గుర్తుండవు కదా, వాడా గదతో కృష్ణుణ్ణి మోదాడు. అది కృష్ణుణ్ణి ఏమీ చెయ్యకపోగా అతనికి పూలమాలికలా అయింది. వెంటనే పిడుగులా శ్రుతాయుధుణ్ణి హతమార్చింది. అంతకు ముందే అర్జునుడు వాడి బాహువుల్ని ఖండిస్తే వాడో పర్వతంలా కింద పడ్డాడు. అదిచూసి వాడి సేనలు, ఆ చుట్టుపక్కల వున్న మిగతా రాజుల సేనలూ చెల్లాచెదురైనై.

అప్పుడు కాంభోజుడు సుదక్షిణుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు కుపితుడై పద్నాలుగు బాణాల్తో వాడి సూతుణ్ణి, గుర్రాల్ని, వింటిని, కేతనాన్ని నరికి ఒక నిశితాస్త్రంతో వాడి గుండె పగిలేట్టు కొట్టాడు. మొదల్నరికిన చెట్టులా వాడు కూలాడు. సుదక్షిణుడి చావుతో శూరసేనుడు, శిబి, వసాతి చుట్టుముడితే అర్జునుడు బాణవర్షంతో వాళ్ల ఆరువేల రథాల్ని నుగ్గుచేశాడు. వాళ్లు పారిపోయారు.

శ్రుతాయువు, అయుతాయువు రెండు వైపుల నుంచి వేలకొద్ది బాణాలు కురిపిస్తూ అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శ్రుతాయువు తోమరంతో అర్జునుణ్ణి దిమ్మదిరిగేట్టు కొట్టాడు. దానికితోడు అయుతాయువు కూడ శూలంతో పొడిచాడు. సొమ్మసిల్లి అర్జునుడు తన కేతనం పట్టుకుని తూలితే కృష్ణుడతన్ని తెలివిలోకి రప్పించాడు. కురుసైన్యంలో సింహనాదాలు చెలరేగినై. తెలివి తెచ్చుకున్న అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగిస్తే అది ఆ ఇద్దర్నీ అంగాంగాలు ఖండించి చంపింది. వాళ్ల అనుచరులు ఐదువందల మంది రథికుల్ని కూడ వధించింది. అది చూసి వాళ్ల కొడుకులు నియుతాయువు, దీర్ఘాయువు ఏమైతే అదైందని అతని మీద పడితే త్వరితంగా వాళ్లని కూడ తండ్రులకి తోడు పంపించేశాడు.

దుర్యోధనుడు మ్లేచ్ఛబలాల్ని అతని మీదికి పురిగొల్పితే వాళ్లు మహాసాహసంతో అతనితో పోరారు. ఐతే అతను కార్చిచ్చులా ఆ బలాల్ని కాలుస్తుంటే అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు ఉద్రేకంగా అర్జునుడి నొగల్ని తాకేంత దగ్గరికి తన రథాన్ని నడిపితే అర్జునుడతని వింటిని తుంచి గుర్రాలని కూల్చాడు. వాడొక భీకరమైన గదని తీసుకుని కృష్ణుణ్ణి కొడితే అర్జునుడా గదని విరిచాడు. వాడు మరో గదతో లంఘిస్తే వేగంగా వాడి భుజాల్ని కంఠాన్ని తుంచాడు.

ఇలా ద్రోణుణ్ణి దాటుకుని, కృతవర్మని చీకాకు పెట్టి, శ్రుతాయుధుణ్ణి దండాయుధుడి దగ్గరికి పంపి, కాంభోజుణ్ణి కాటికి పంపి, శ్రుతాయువుని గతాయువుగా చేసి నీ సైన్యంలోకి చొచ్చుకుపోయి వీరయోధుల ప్రాణాల్ని తన బాణాల్తో బయటికి లాగేస్తున్న అర్జునుణ్ణి చూసి దుర్యోధనుడు కుతకుతలాడాడు. ఒంటిగా రథాన్ని తోలుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతన్ని నానా దుర్భాషలాడాడు – “నిన్ను అవలీలగా దాటి మన సైన్యం లోకి జొరబడి అతలాకుతలం చేస్తున్న అర్జునుడి వంక కన్నెత్తైనా చూడవు. పాండవపక్షపాతీ! పాము రక్షణలో వున్న కప్పల్లా వున్నాం, నిన్ను నమ్ముకుని. ఏదో కంటితుడుపుగా నాకు వరమిచ్చావ్, ఏం సాధించావ్? నువ్వేదో రక్షిస్తావని సైంధవుడు సైన్యంలోనే వున్నాడు. వాణ్ణి చంపించటానికి పూనుకున్న తేనె పూసిన కత్తివి నువ్వు” అంటూ. అంతలోనే సంభాళించుకుని, “బాధలో నేనన్న మాటలు పట్టించుకోవద్దు. ఎలాగైనా సైంధవుణ్ణి రక్షించు” అని వేడుకున్నాడు.

దానికి ద్రోణుడు “నాకేం బాధలేదు, నాకు నువ్వూ అశ్వత్థామ వేరువేరు కారు. ఇప్పుడు నేను సేనాముఖాన్ని విడిచి లోనికి వెళ్తే పాండవబలగాలు మన సేనల్ని చెల్లాచెదురు చేస్తయ్, సైంధవుడికి కూడ ముప్పు రావొచ్చు. అదీగాక నేను ధర్మరాజుని బంధించాల్సిన పని కూడ వుంది కదా! పైగా, నేను వృద్ధుణ్ణి, అర్జునుణ్ణి వెంటబడి తరమలేను. నువ్వూ అతనూ కుర్రవాళ్లు. కొంతమందిని వెంట తీసుకు వెళ్లి అతనితో నువ్వే తలపడి ఆపరాదూ” అన్నాడు. “నిన్నూ కృతవర్మనీ ఓడించి, అనేక మంది రాజుల్ని హతమార్చిన అర్జునుణ్ణి నేను ఎదుర్కోవాలా? కాదూ కూడదూ అదే ఇప్పుడు కర్తవ్యం అంటే నా పరువు పోని మార్గం చెప్పు, అలాగే చేస్తా” అన్నాడు దుర్యోధనుడు. “నువ్వన్నది నిజమే. ఐతే నీకో మహత్తు చూపిస్తాను. ఇదుగో ఈ బంగారు కవచానికి కవచధారణ విద్యని ఆవహింపజేసి ఇస్తున్నాను. దీన్ని ధరిస్తే ఎవరి బాణాలూ నిన్ను ఏమీ చెయ్యలేవు. దీన్ని బ్రహ్మ ఇంద్రుడికిస్తే అతను అంగిరసుడికి, అంగిరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికి, అగ్నివైశ్యుడు నాకు ఇచ్చారు” అని దాన్ని తొడిగి దీవించి పంపాడు ద్రోణుడు. దాంతో సుయోధనుడు సంతుష్టుడై చమూసమూహాల్తో అర్జునుడి మీదికి బయల్దేరాడు.

ఇక్కడ పాండవబలాలు మన మొగ్గరం మీదికి దండెత్తినయ్. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడితో ఘోరంగా పోరాడు. మనవైపు నుంచి మేటిదొరలు అక్కడికి చేరారు. ఇరువైపుల వారు ఒకర్నొకరు తలపడ్డారు. వికర్ణుడు, వివింశతి, చిత్రసేనుడు – భీముడితో కలబడ్డారు. బాహ్లికుడు ద్రౌపదేయుల్తో. దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవుల్ని, సోమదత్తుడు శిఖండిని, అలంబుసుడు ఘటోత్కచుణ్ణి ఎదుర్కున్నారు. సైంధవుడికి తోడుగా వుంటూనే అప్పుడప్పుడు మొన ముందుకి కూడ వచ్చి చూసిపోతున్న శల్యుడు అక్కడే వున్నాడప్పుడు. ధర్మజుడితో అతను తలపడ్డాడు. అందరూ ఇక రేపు లేదన్నట్టు శక్తంతా కూడగట్టి శరయుద్ధాలు చేస్తున్నారు. ఐతే ద్రోణాచార్యుడి రక్షణలో మన వ్యూహం పటిష్టంగా నిలబడటం చూసి సహించలేక ధృష్టద్యుమ్నుడు మహాక్రోధంతో ద్రోణుడి గుర్రాల్ని తాకేంత దగ్గరకి తన రథాన్ని నడిపించి ఒక వాలుని పలకని తీసుకుని ద్రోణుడి రథమ్మీదికి గెంతి చిత్ర విచిత్ర విన్యాసాల్తో అతని బాణాలు తనకి తగలకుండా చూసుకుంటూ అతన్ని చేరబోతూ వాలుతో గుర్రాల్ని కొట్టి గాయాలు చేశాడు. ఐతే ఆ అదునులో ద్రోణుడతని వాలుని విరిచి సారథిని గుర్రాల్ని చంపి ఒక పదునైన నారసాన్ని అతని మీదికి వేస్తే – వేగంగా సాత్యకి దాన్ని మధ్యలోనే నరికి సింహం చేతిలో చిక్కిన లేడిని రక్షించినట్టు ధృష్టద్యుమ్నుణ్ణి అక్కణ్ణుంచి తప్పించాడు.

దానికి ద్రోణుడు కోపించి సాత్యకి మీద క్రూరశరాలు ప్రయోగించాడు. సాత్యకి కూడ తన సారథితో “ద్రోణుడి అభిమతం ధర్మరాజుని పట్టటం. అతనికా అవకాశం ఇవ్వకుండా మనం అతనితో తలపడదాం” అని తన రథాన్ని ద్రోణుడికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ తీవ్ర బాణజాలాల్తో చూసేవాళ్లకి కళ్లపండగ్గా సమానంగా పోరారు. అతని లాఘవానికి ద్రోణుడు కూడ సాత్యకిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ద్రోణుడి వింటిని సాత్యకి రెండుగా నరికితే అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని కూడ సాత్యకి నరికాడు. ఇలా అతను ఎన్ని తీసినా సాత్యకి నరుకుతూనే వుంటే అంతా విస్తుపోయారు. ఇక సహించలేక ద్రోణుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే సాత్యకి వారుణాస్త్రంతో దాన్నెదుర్కున్నాడు. ఆకాశంలో ఆ రెండు అస్త్రాలూ ఘోరంగా పోరి కొంతసేపటికి శాంతించినయ్. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి అండగా వచ్చి నిలిస్తే దుశ్శాసనుడు ముందుండగా మన కుమారవర్గం వాళ్లని తాకింది.

అక్కడ దారంతా పీనుగుపెంటలు చేస్తూ అర్జునుడు సైంధవుడున్న చోటికి 
దగ్గరౌతున్నాడు. అప్పుడు అవంతీశ్వరులు విందానువిందులు ఒకే రథమ్మీద వచ్చి అర్జునుణ్ణి అడ్డుకున్నారు. అర్జునుడి బాణాల్ని లెక్కచెయ్యకుండా అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద అనేక శరాలు పంపారు. ఐతే అర్జునుడు తీవ్రవేగంతో సారథిని, గుర్రాల్ని చంపి, కేతనాన్ని కూల్చి దాంతో పాటే విందుడి తలనీ నేలకూల్చాడు. అన్న చావు చూసి అనువిందుడు రోషంతో గద తీసుకుని రథాన్నుంచి దూకి పరిగెత్తి కృష్ణుడి ఫాలాన మోదాడు. అర్జునుడు తటాల్న వాడి గద విరిచి కాళ్లూ చేతులూ తలా నరికి యుద్ధభూమికి బలిచ్చాడు. వాడి సేనలు ధైర్యంగా నిలబడి చుట్టుముడితే విజయుడు వాటిని నాశనం చేసి కదిలాడు.

ఐతే సమయం మధ్యాన్నాన్ని మించటం, అర్జునుడూ అతని గుర్రాలూ అలిసినట్టు కనిపించటం, సైంధవుడున్న చోటు ఇంకా చాలా దూరం వుండటంతో మనసైన్యంలో ఉత్సాహం కలిగింది. అందరూ సింహనాదాలు చేశారు. అర్జునుడు కృష్ణుడితో, “గుర్రాలకి చాలా బాణాలు గుచ్చుకుని వున్నయ్, ఇంకా చాలా దూరం వెళ్లాల్సుంది. వాటికి కాస్త విశ్రాంతి ఇచ్చి, ఆ బాణాల్ని లాగి వైద్యం చేస్తే మంచిదేమో” అంటే అలాగే చేశాడు కృష్ణుడు.

--((***))--

Sunday, 6 January 2019

462--549

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(08_01_2019)
హరిః ಓమ్

49 వ. శ్లోకము
సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

462) జితక్రోధః - ఓం జితక్రోధాయనమః

కోపమును జయించిన వాడు అని అర్థము. " క్రోధమూలాని
పాపాని". మానవుడాచరింౘు సమస్తపాపములకునూ " క్రోధమే" మూలకారణము
క్రోధము నరకద్వారముగా గీతలో చెప్పబడింది (గీ 16_21).

రజోగుణము వలన కలిగే కోపము ఆధ్యాత్మిక సాధనకు
పరమ శత్రువు. కావున దానిని జయింపుమని గీతాశాస్త్ర ప్రబోధము (గీ3_37_4)
ఈ సందర్భంగా క్రోధమనగా కోపమొక్కటే కాదనియూ దాని
సహచరులగు కామ, లోభ, మద, మాత్సర్యములు (అరిషడ్వర్గములు) అనియు,
ఈ దుర్గుణములు లేనివాడే శ్రీమన్నారాయణుడు. కాన "జితక్రోధః" అను దివ్య
నామముచే సంకీర్తనీయుడు అగుౘున్నాడు.
సాధకులు కోపమును జయింపవలెను. సాత్వికాహార

విహారములవలననూ, సత్సాంగత్యము వలననూ, సదా హరిచింతనము వలననూ ఇది సాధ్యమగును. ఈ స్తవరాజము అనుష్ఠాన వేదాంతమునే తెలుపుౘున్నదని పాఠకులు గమనింౘగలరు.

462) వీరబాహుః- ఓం వీరబాహవేనమః

శక్తివంతములయిన బాహువులు గలవాడని యర్థము.
తన అవతారముల యందు దేవవిరోధులగు రాక్షసులమూకలను సంహరించిన
కారణమున వీరబాహుడని ప్రస్తుతింపబడెను.
వీరబాహుడగు భగవానుని స్మరణమాత్రము చేతనే భక్తుల
మనస్సు లలోనున్న రాక్షసులందరూ (రాక్షసగుణములు) నశింౘు నని పాఠకులు
గమనింపగలరు.

463) విదారణః - ఓం విదారణాయనమః

చీల్చి ౘంపివేయువాడని ఈ నామముయొక్క సామాన్యార్థము.  నృసింహావతారమున శ్రీహరి హిరణ్యకశిపుని తన గోళ్ళతో
చీల్చి సంహరించుటచేత "విదారణః" అని కీర్తిగాంచెను. హిరణ్యాక్షుని సంహరించి
న వరాహావతారమునుకూడా ఈనామము సూచింౘును.

ప్రహ్లాదునివలె భక్తితో ప్రార్థించినచో శ్రీహరి నీలోఉన్న
హిరణ్యకశిపుని (అనగా నీలోఉన్న దురహంకార రాక్షసిని) చీల్చి చెండ చెండాడు
నని ఆంతరంగికార్థమును సాధకులు గుర్తింపగలరు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(09_01_2019)

హరిః ಓమ్
50 వ. శ్లోకము

స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును

465) స్వాపనః- ఓం స్వాపనాయనమః
స్వాపనుడనగా నిద్రపుచ్చువాడని సామాన్యార్థము. భగవానుడు
తన మాయచేత సమస్తలోకములను మోహితులగావింౘును.(నిద్రపుచ్చునని భావము). ఇంద్రాది దేవతలే ఆయనమాయకు వశులుగాగా, ఇతరులగూర్చి
చెప్పనేల ?. మాయను జయింౘ వలెనన్న మాయాధిపతియగు మాధవునే
ఆశ్రయింౘవలెనని భావము. (గీత 7_14).

466) స్వవశః- ఓం స్వవశాయనమః

అనంతకోటి విశ్వములు, విశ్వేశులు, లోకులు, సకల భూత జాలములు ఆ జగన్నాటక సూత్రదారి వశమునందే క్రీడింౘుౘుండును. కావున
"స్వవశః" అను మహత్తర నామముచే మాననీయుడగుౘున్నాడు.

467) వ్యాపీ- ఓం వ్యాపినేనమః

కార్యకారణ రూపమున అంతటనూ వ్యాపింౘి విస్తరించి, విరాజిల్లి న వాడగుటచేత పరమాత్మ. "వ్యాపీ". యను భవ్యనామమున భజనీయుడు. సాధకులు "విశ్వసేవయే విశ్వనాథుని సేవ " యని సర్వభూతహిత
రతులై వర్తింౘవలెనని భావము.

468) నైకాత్మా- ఓం నైకాత్మనేనమః

అనేకరూపములతో విస్తరించి నవాడని భావము. తాను ఒక్కడేయయ్యును, నామరూపాత్మక ప్రపంచమునంతటనూ వివిధ నామ
రూపములతో విరాజిల్లుౘున్న వాడగుటచేత " నైకరూపః" అని ప్రస్తుతింపబడెను.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(10_01_2019)
హరిః ಓమ్
50 వ. శ్లోకము
స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును

469) నైకకర్మకృత్ - ఓం నైకకర్మకృతేనమః

విశ్వమునందుగల సమస్తకార్యకలాపములను, సృష్టిస్థితి, లయములను మఱొక్కరి సాహాయ్యము గానీ సహకారముగానీలేక తానొక్కడే
ౘక్కగా నిర్వహింౘు మహాశక్తి సంపన్నుడు , సర్వకార్యదక్షుడు ఈశ్వరుడే
యగుటచేత "నైకకర్మకృత్" అను శబ్దవాచ్యుడగుౘున్నాడు.

470) వత్సరః - ఓంవత్సరాయనమః

సకలజీవులయొక్క నివాసమునకు ఆధారమైనవాడు లేక నిలయమైన వాడగుటచేత "వత్సరః" అని పిలవబడెను. సర్వభూతములును
ఆయనయందే వసింౘుటచేతను, ఆయన యే సమస్త భూతములయందును
వసింౘుటచేతను "వత్సరః" అని ప్రసిద్ధిగాంచెను..‌‌‌‍‍

471) వత్సలః - ఓం వత్సలాయనమః

వాత్సల్యస్వరూపుడని శబ్దార్థము. తల్లికి తమ బిడ్డలపై ఎంత వాత్సల్యముండునో భగవంతునికి తన భక్తులపై అంతకంటెను ఎక్కువ వాత్సల్యముండునని భావము.కావుననే ఆయన భక్తవత్సలుడని ప్రసిద్ధుడాయెను

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(11_01_2019)

హరిః ಓమ్

50 వ. శ్లోకము

స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును.

472) వత్సీ - ఓం వత్సినేనమః
వత్సములను పాలింౘు వాడు గనుక "వత్సీ" అనబడును. విశ్వమందలి
జనులందరును ఆయనకు వత్సములు (సంతానములు) వంటివారే. భగవానుడు
జగత్పిత , జగన్మాత " త్వమేవ మాతాచ- పితాత్వమేవ". అని భక్తులు ఆ వాత్సల్యరూపుని ప్రార్థింతురు. కాన " వత్సీ" అని ప్రసిద్ధి గాంచెను.

473) రత్నగర్భః - ఓం రత్నగర్భాయనమః

"రత్నరాశులు తనయందు కలిగియున్న కారణమువలన సముద్రమునకు "రత్నగర్భ" యనిపేరు. సముద్రము భగవంతుని విభూతిగదా!
" సరసామస్మి సాగరః " అని గీతావాక్యము (10_24).

రత్నగర్భయగు మహాసాగరములో ప్రవేశించి శ్రద్ధ గా అన్వేషింౘువారికి
వలువైన రత్నములు లభింౘునట్లు ఆధ్యాత్మిక మహాసాగరమున ప్రవేశించి
భక్తిశ్రద్ధలతో అన్వేషణము చేయు తీవ్రసాధకులకు రత్నములకంటెనూ మిక్కిలి విలువగల శాంత్యానందసౌఖ్యములు లభింౘునని భావార్థము.

474) ధనేశ్వరః - ఓంధనేశ్వరాయనమః

ధనరాశులకు అధిపతియని అర్థము. శ్రీహరి లక్ష్మీపతియగుటచేత
ధనకనక వస్తు వాహనాదులకు లోటులేదుకదా, తన్నాశ్రయించిన భక్తులకు వారి
అర్హతలననుసరించి ధనధాన్యములను, పాడిపంటలను, సుఖభోగముల నిచ్చు
వాడు గనుక "ధనేశ్వరః" అనబడెను.
వైరాగ్యసంపన్నులగు ముముక్షువులకు మోక్షధనమును ప్రసాదింౘు వాడును ఆయనయే గదా!

ఈ స్తవరాజమును శ్రద్ధగా పఠనశ్రవణములు గావింౘువారికి
సర్వధనములును సిద్ధింౘునని భావము. "అర్థార్థీ చార్థమాప్నుయాత్" అని
తెలుపబడెనుగదా!

==((**))==


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(13_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

475) ధర్మగుప్ - ఓం ధర్మగుపేనమః

ధర్మ రక్షకుడు, ధర్మస్వరూపుడు అగుటచేత "ధర్మగుప్". అని పేరు
వహించెను. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (4_8). అను
గీతావాక్యము స్మరణీయము.

476) ధర్మకృత్.- ఓం ధర్మకృతేనమః

ధర్మానుష్ఠానము చేయువాడు. ధర్మాధర్మములతో తనకు నిమిత్తము లేకున్ననూ ధర్మసంస్థాపనార్థముగా నవతరించిన భగవానుడు తాను స్వయముగా ధర్మమును అనుష్ఠింౘుౘు లోకమునకు తాను ఆదర్శమూర్తియై
యుండునుగనుక "ధర్మకృత్" అనబడును.

477) ధర్మీ- ఓం ధర్మిణేనమః

మూర్తీభవించిన ధర్మమే భగవానుడగుటచేత "ధర్మీ " యనబడును. " రామో విగ్రహవాన్ ధర్మః " అను రామాయణ వచనము
స్మరణీయము.
475,476,477. నామములు ధర్మ ప్రాశస్త్యమును తెలుపు
నామము లైనందున సాధకులు నిత్య జీవితమున ధర్మానుష్ఠానపరులు
గావలయునని సూచన.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(15_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

478) సత్ - ఓం సతేనమః
సకల భూతములయందునూ శాశ్వతమై, స్థిరమై, నిత్యమై యుండు
పరబ్రహ్మమే "సత్" అను శబ్దముచే స్తవము చేయబడును.
479) అసత్- ఓం అసతేనమః

నామరూపకాత్మకమై నశింౘు స్వభావముగల ప్రపంచ మంతయును "అసత్". అనబడును. "అసత్" దీనినే అపరమ్ అనియును కూడా
వేదాంతశాస్త్రము చెప్పును. "క్షరము - అక్షరము" " పర - అపర "‌ ఇవి రెండును
భగవత్స్వరూపములే యని గీతావాక్యము (7_5).
కాన ఇచ్చట పరమాత్మ "అసత్" నామవాచ్యుడగును.

480) క్షరమ్ - ఓం క్షరాయనమః
" నశింౘు నది". అని ఈశబ్దమునకర్థము. కానవచ్చునదంతయూ
నశింౘునదే యగును. సాగరమునుండి తరంగములు పుట్టి, నాట్యమాడి, తిరిగి
సాగరమందే లీనమగు నట్లు, విశ్వమంతయు ను పరమాత్మ యందే పుట్టి ఆయన
యందే లయముచెందును. నశింౘు జగముగూడా భగవత్స్వరూపమే యగుటచేత " క్షరమ్" అను శబ్దవాచ్యుడగుౘున్నాడు.

481) అక్షరమ్ - ఓం అక్షరాయనమః
నాశనము లేని వాడగుటచేత పరమాత్మ "అకమానసిక అను దివ్యనామ
వాచ్యుడగును.

482) అవిజ్ఞాతా - ఓం అవిజ్ఞాత్రేనమః

" విజ్ఞాత" కానివాడు " అవిజ్ఞాత " అనబడును. జీవుడు వాస్తవము

గా పరమాత్మయే. అయిననూ శరీరమునందు బంధింపబడి మాలిన్యములగు మానసిక సంస్కారములతో కప్పబడి యున్న కారణమున " విజ్ఞాత " అని చెప్పబడును. పరమాత్మ ఇట్టి వాడు కాడు. బంధరహితుడు, మాలిన్యరహితుడు , నిర్లిప్తుడు, నిస్సంగుడు అగుటచేత " అవిజ్ఞాతా" అను ప్రసిద్ధనామమున కీర్తనీయుడగును.

సంగరరహితముగా జీవింౘుమని ఈ నామము యొక్క బోధ.
--((**))--
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(16_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

483) సహస్రాంశుః - ఓం సహస్రాంశవేనమః
వేలకొలది కిరణములతో కూడియున్న వాడని యర్థము. సూర్యుడు తన అనంతకోటి కిరణములతో విలసిల్లి లోకమునంతనూ చైతన్య
వంతము గావింౘుౘున్నాడు. " యదాదిత్య గతం తేజః " (గీత 15_10) సూర్యుని
యందుగల తేజస్సు అంతయును నాదే. అని గీతాచార్యుని వచనము గాన
భగవానుడు " సహస్రాంశుః". అని ప్రసిద్దుడగుౘున్నాడు.

484) విధాతా- ఓం విధాత్రేనమః

సర్వమును ధరింౘు వాడు, సర్వాధారమూర్తి, శేషుడు ,
దిగ్గజములు, పర్వతములు, వీనినిగూడా ధరింౘు వాడు నారాయణుడే
యగుటచేత "విధాతా" అను దివ్యనామ వాచ్యుడగును.

485) కృతలక్షణః- ఓం కృతలక్షణాయనమః

1) అనేక దివ్యలక్షణములతో కూడియున్న వాడగుటచేత "కృతలక్షణః" అని
పిలువబడును.

2) ఐశ్వర్య, ధర్మ, యశో, వీర్య, జ్ఞాన, వైరాగ్యము లనబడు షడ్గుణైశ్వర్య
సంపన్నుడగచేత కృతలక్షణుడాయెను.

3) శ్రీవత్సలాంఛనము కలిగియున్న కారణమున శ్రీహరి కృతలక్షణుడాయెను.

4) "లక్షణముల" ను శబ్దమునకు వేదాంతశాస్త్రము లనియును అర్థము
గలదు " వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వమ్ జనార్దనాత్ " అను
వచనాను సారముగా సర్వ వేద శాస్త్ర ములును భగవానుడి నుండియే
కలిగిన వనుటచేత "కృతలక్షణః" అని దివ్యగానము చేయబడుౘున్నాడు.

--((**))--



విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(17_01_2019)

హరిః ಓమ్

52 వ. శ్లోకము

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః ।।

486) గభస్తినేమిః- ఓం గభస్తినేమయేనమః
కిరణచక్రము యొక్క. మధ్యభాగమునందు సూర్యరూపమున
విలసిల్లి భాసిల్లువాడు ఆ పరమాత్మయే గదా, కాన "గభస్తినేమిః" అనబడెను.

487). సత్త్వస్థః- ఓం సత్త్వస్థాయనమః

సత్త్వగుణము నందు ప్రతిష్ఠితుడై యున్నవాడని భావము. "సత్త్వాత్ సంజాయతే జ్ఞానమ్" సత్త్వమువలన జ్ఞానము కలుగును (గీత14_15)
దేవుడు జ్ఞానస్వరూపుడని తాత్పర్యము.

మరియొక వివరణము: సత్త్వేషు- సకలభూతములందును, స్థః ఉన్నవాడు అగుటచేత. సర్వభూతాంతరవాసి భగవానుడే గనుక సత్త్వస్థః అని కీర్తింపబడును. సత్త్వగుణమును పెంపొందింౘు కొనవలెను.
శ్రీహరిని అన్నిభూతములలో నున్నవానినిగా ధ్యానింౘవలెను
అని దీనిచే గ్రహింౘవలెను.
488) సింహః

ఓం సింహాయనమః
సింహగర్జనమున అరణ్యమునందలి సకల జంతువులును
పరుగెత్తునట్లు సాధకుల మనఃక్షేత్రములయందు గల సకల దుర్గుణములను
జంతుసంతానములు శ్రీహరి నామ గర్జనమున నశింౘునని భావము. 200 వ
నామముయొక్క వివరణమును గమనింప ప్రార్థన. ఈనామము రెండవ పర్యాయముగా ఇక్కడ గానము చేయబడినది.

200వ. నామము

200) సింహః

ఓం సింహాయనమః

" హింసింౘువాడు " అని ఈ శబ్దముయొక్క సామాన్యార్థము.

1) " మృగాణాంచ మృగేంద్రో√హం ". మృగములలో సింహమును నేనైయున్నాను‌. అని భగవద్వాక్యము.(గీత 10_30). కనుక. భగవానుడు
" సింహః" అని పిలువబడెను

2). దుర్మార్గులను, అవినీతిపరులను హింసిౘువాడు గనుక
". సింహః ". అని పిలువబడుౘున్నాడు. " వినాశాయచ దుష్కృతామ్ ". అని
గీతావాక్యము, ( 4_8 )

3) " సింహః ". అను శబ్దము భగవానుని సూచింౘును గనుక
" సింహః " అను దివ్యనామా‍‌చ్యుడ.
4) సింహము గర్జించినంత మాత్రము చేతనే అరణ్యములో
నున్న మృగములన్నియు పారిపోవునట్లు శక్తివంతమగు భగవన్నామము యొక్క
గర్జనము వలన( అనగా నామ జప తపః కీర్తన ధ్యానాదుల వలన) సాధకుల యొక్క మనస్సు లను భయంకరారణ్యములయందు దాగి యున్న మృగము
లన్నియును (అనగా కామ క్రోధాది దుష్టగుణములు ) నశించిపోవునని ఈ శబ్దము
యొక్క గ్రాహ్యార్థముగా భావింౘ నగును. కావున భగవానుడు " సింహః ". అని
సంకీర్తనీయుడు.

--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(19_01_2019)

హరిః ಓమ్
52 వ. శ్లోకము

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః ।।

ఈ దివ్యశ్లోకము అష్టవిధ. దివ్యనామకుసుమపరాగ పరిమిళితము.
492) దేవేశః - ఓం దేవేశాయనమః

దేవ+ఈశః = దేవేశః దేవతల కందఱకును ప్రభువైనవాడు.
దేవతలకు శక్తిని ప్రసాదింౘువాడు పరమాత్మయే యగుటచేత "దేవేశః" అనబడును.

493) దేవభృద్గురుః - ఓం దేవభృద్గురవేనమః

దేవభృత్ అనగా దేవతలకందఱకును అధిపతియైనవాడు
ఇంద్రుడని అర్థమగును. ఇంద్రునకు కూడా గురువగుటచేత పరమాత్మ "దేవభృద్గురుః " అనబడెను. దేవశబ్దము ఇంద్రియములను సూచింౘును.
దేవేంద్రుడు అనగా ఇంద్రియములకు రాజు మనస్సు అని భావము. మనస్సునకు కూడా అధిపతి "ఆత్మ". యగుౘున్నది. కనుక పరమాత్మ " దేవభృద్గురుః" అను దివ్యనామమున స్తవనీయుడగుౘున్నాడు.

శరీరము జడమైనది. శరీరముకంటే ఇంద్రియములు శక్తివంతములు. ఇంద్రియములకంటే మనస్సు, మనస్సు కంటే ఆత్మయును శక్తివంతములు. కనుక ఆత్మజ్ఞానము బొందినపుడే సర్వేంద్రియ నిగ్రహము సాధ్యమగును. (గీతఅ 3_శ్లో42) 49౦ వ నామమునుండి దేవశ్దము ప్రతి నామము తోనూ సంబంధింపబడి యుండుట గమనార్హము. దేవశబ్దము నకు ప్రకాశింౘు వాడు, జయింౘువాడు, క్రీడింౘువాడు, గమనింౘువాడు, స్తవము చేయబడువాడు అను అర్థములను గ్రహింపవలెను.

--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(20_01_2019)

హరిః ಓమ్
53 వ. శ్లోకము
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।
494) ఉత్తరః - ఓం ఉత్తరాయనమః
సర్వశ్రేష్ఠుడని ఈనామముయొక్క అర్థము. పరమాత్మ అందరి
కంటెను శ్రేష్ఠుడగుట చేత "ఉత్తరః " అను నామమున విఖ్యాతుడగునని
మరియొక అర్థము. సంసార సాగరమునుండి జీవులనుద్దరింౘువాడు గాన
శ్రీహరి "ఉత్తరః" అని ప్రఖ్యాతి గాంచెను. "తేషాంమహంసముద్దర్తా మృత్యు
సంసార సాగరాత్". నా భక్తులను మృత్యురూప సంసార సాగరము నుండి
ఉద్ధరింతునని భగవద్వాక్యము (గీత 12_7).
నామ సందేశము : సంసార తాపత్రయములు నశింౘుట కు ఈశ్వర
చింతనమే సాధనము.
495) గోపతిః - ఓం గోపతయేనమః
ఈనామమునకు గోవులకు అధిపతి లేక గోపాలుడని అర్థము.
1) భగవానుడు కృష్ణావతారమెత్తి నపుడు గోవులమందలను పాలించినాడు గనుక "గోపతి" అనబడెను.
2) గోవులనగా పశువులు జీవులందరునూ పశువులేగదా! పశువులకు
పతి, జీవులందరకును పతియగుటచేత శ్రీహరి "గోపతి" యనబడును.
3) "గో " అనగా భూమి యను అర్థము గలదు. కావున భూమికి పతి
యగుటచేత " గోపతి " యగును.
4) "గో" అనగా వాక్కు, వాక్కునకు పతి, అనగా విద్యాధిష్ఠానమూర్తి
యగుటచేత "గోపతి " యగును.
5) "గౌ" అనగా వేదము అనియునూ అర్థమగును. ఆయన వేదవిదుడు.
వేదకర్తయగుటచేత "గోపతి" యగును. గోసేవ భగవత్ర్రీతికరమగునని గ్రహింౘ
వలయును.
496) గోప్తా - ఓం గోప్త్రేనమః
సంరక్షకుడని శబ్దార్థము. సకల జీవులను కాపాడువాడు, పోషింౘువాడు

రక్షింౘువాడును శ్రీహరియే యగుటచేత "గోప్తా". అనబడుౘున్నాడు.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)
(06_01_2019)
హరిః ಓమ్
49 వ. శ్లోకము

సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

458) సుఘోషః - ఓం సుఘోషాయనమః

1) సుందరమగు మధుర నాదము కలవాడు గాన " సుఘోషః " అనబడును.

2) మనోహరమగు వేదనాదము ఇతనినుండియే వెలువడినదగుటచేత
" సుఘోషః" అనబడెను.

3) తన దివ్యశంఖనాదము చేతనే దేవవిరోధులగు రాక్షసులను సంహరించిన
వాడగుటచేత "సుఘోషః" అనబడెను. పరమాత్మ నామగానముచేత దుష్ట శక్తులు నశింౘు ను. పుణ్యశక్తులు వికసింౘును అని తాత్పర్యము.

459) సుఖదః - ఓం సుఖదాయనమః

"ద" యను అక్షరము రెండు భావములనిచ్చునది యని లోగడ
వివరింపబడినదికదా ! "ద= ఇచ్చువాడు, "ద" = నాశనముచేయువాడు అను 
రెండర్థములను తెల్పును.

"సుఖ + దః". తన భక్తులకు సుఖమునిచ్చువాడని భావము.
మఱియును సుఖ+దః దుర్మార్గులకు సుఖశాంతులను నశింపజేయువాడు
అని భావము. మఱియును మోక్షకాముకులై తన్నారాధింౘు ముముక్షువులకు
ప్రాపంచిక భోగములు ప్రతిబంధకములు గనుక వానిని నాశనముచేసి వైరాగ్యమును కల్గించి మోక్షసుఖమును ప్రసాదింౘు వాడు గావున "సుఖదః" అని
కీర్తనీయుడగుౘున్నాడు.

460) సుహృత్ - ఓంసుహృదేనమః

ప్రత్యుపకారమును కాంక్షింపక పరులకుపకారమును చేయువానికి " సుహృత్" అనిపేరు. భగవానుడు కరుణాసాగరుడు, ప్రేమాంబుధియు నగుటచేత భక్తులకు తనకెట్టి ప్రతిఫలాపేక్షయు లేకయే వరములను , సుఖములను ప్రసాదింౘును.
వర్షింౘుట యే మేఘములకు సహజమగునట్లు , సువాసనలు వెదజల్లడం పూవులకు సహజమగునట్లు, కాంతినిచ్చుటయే సూర్యునకు సహజలక్షణము అగునట్లు భక్తులకభీష్టము లిచ్చుటయే శ్రీపతికి సహజలక్షణము. కాన " సుహృత్" అను భవ్యనామమున భజనీయుడగు ౘున్నాడు . నిర్హేతుక జాయమాన కరుణా కటాక్ష నిధియే భగవానుడు.

ప్రతిఫలాపేక్షలేక సేవా ధర్మమును బూని పరులను సేవింపుము. ఈశ్వరారాధనయే యిదియని ఈనామము యొక్క సాధనా ప్రబోధము.
--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(07_01_2019)
హరిః ಓమ్

49 వ. శ్లోకము

సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

461) మనోహరః - ఓం మనోహరాయనమః

మనస్సును హరింౘు (దొంగలింౘు) వాడు కనుక భగవానుడు మనోహరుడు అగును. శ్రీకృష్ణుడు గోపికా చిత్తచోరుడు, నవనీతచోరుడు అని భాగవతములో వర్ణింపబడెను. గోవిందుడు దొంగలింౘునవి ధనకనక వస్తువాహనములు కావు. భక్తుల మనస్సులనే హరింౘును. మనస్సు అన గా మలినములగు సాంసారిక వాంఛలు, కోరికలు, మమకారాహంకారములు, రాగద్వేషములు మున్నగునవి. వీనిని గోపాలుడు హరింౘును.
మనస్సు నశించినపుడే మానవుడు మాధవుడగును.

పరమశివునకు అభిషేకము చేయునపుడు స్తేనానాం పతయేనమః
తస్కరాణాం పతయే నమోనమః (అనగా ఓ దొంగలనాయకుడా! నీకు నమస్కారము, ఓ చోరశిఖామణీ నీకు వందనము.) అని నమకములోని మంత్రముల భావమును గ్రహింపుడు. పరమశివుడు హరింౘునది వాసనలతో కూడిన మనస్సు, మోక్షము కావలయునన్నచో " మయ్యేవమన ఆధత్స్వ" 
నీ మనస్సును నాయందుంౘుము (గీత 12_8) మయ్యాసక్తమనాః (7_1)
నాయందాసక్తిగల మనస్సు గలవాడవుగమ్ము, మన్మనాభవ (18_65) నీ మనస్సు నాకిమ్ము .
 అని గీతాచార్యుడు వచింౘును. శ్రీకృష్ణుడు గోపకన్యల చీరలను దొంగలించిన కథాఘట్టము లోని లాక్షణికార్థము, వారి మనస్సు లలోని అహంకార, మమకార, మాలిన్యములను హరింౘు టయే యని అర్థము కదా, కావున "మనోహరః" అను మంగళనామముతో మాననీయుడగు ౘున్నాడు.

మనస్సును దుర్విషయములనుండి మరల్పుము. చిత్తమును భగవత్పరము చేయుము అని దీని ప్రబోధము.


--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(21_01_2019)

హరిః ಓమ్
53 వ. శ్లోకము
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।
ఈ మధురశ్లోకము నవవిధ మధుర నామములతో మాధుర్యవంత
మగుౘున్నది.
497) జ్ఞానగమ్యః
ఓం జ్ఞానగమ్యాయనమః
పరమాత్మ జ్ఞానమువలన మాత్రమే పొందబడువాడగుటచేత
"జ్ఞానగమ్యః" అని పిలువబడును. "జ్ఞానాదేవతు కైవల్యం" జ్ఞానము వలననే
కైవల్యప్రాప్తియని శాస్త్రవాక్యము. కర్మలకంటే జ్ఞానము గొప్పది కనుక దానిని
సాధన చేయుము అని నామ సందేశము.
498) పురాతనః
ఓం పురాతనాయనమః
పూర్వమునుండియే యున్నవాడని యర్థము. పరమాత్మ సనాతనుడు, కాలాతీతుడు, పుట్టువులేనివాడు గాన "పురాతనః" అనబడెను.
499) శరీరభూతభృత్
ఓం శరీరభూతభృతేనమః
శరీర నిర్మాణమును చేయునట్టియును, శరీర పోషణము గావింౘునట్టియును అగు పంచభూతములకును , శక్తిని ప్రసాదింౘువాడు 
పరమాత్మ యగుటచేత " శరీరభూతభృత్" అని ప్రసిద్దుడగుౘున్నాడు.
ఈ దేహ నిర్మాత భగవానుడే యని తెలిసికొని ఆయనను
సేవింపుము.
500) భోక్తా
ఓంభోక్త్రేనమః
ఈనామముయొక్క అర్థము 1) అనుభవింౘువాడు
2) పాలనచేయువాడు.
మన శరీరమునందున్న జీవుడు వాస్తవముగా పరమాత్మయే. పరమాత్మ నిస్సంగుడు, నిర్లిప్తుడు, కర్తయును భోక్తయును కాదు. కానీ జీవుడు
శరీరబద్దుడై, మాయావరణకు లోనై , తానేకర్తనని, తానేకర్మఫలములకు భోక్త
ననియును అజ్ఞానవశమున భావింౘుౘున్నందున " భోక్తా " అను నామమున
కీర్తనీయుడగుౘున్నాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(22_01_2019)
హరిః ಓమ్
53 వ. శ్లోకము

ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।

ఈ మధురశ్లోకము నవవిధ మధుర నామములతో మాధుర్యవంత మగుౘున్నది.

501) కపీంద్రః - ఓం కపీంద్రాయనమః

కపి+ఇంద్రః = కపీంద్రః "కపి" అనగా వరాహము అని అర్థము కపీంద్రుడు అనగా ఆదివరాహమూర్తి. జలమునుండి భూమినుద్దరించిన వరాహావతారమును సూచింౘునామమిది. "కపి". అను నామమునకు "వానరము". అను అర్థముగలదు. "కపీంద్రః" అనగా వానరములకెల్లను ప్రభువైన శ్రీరామచంద్రుడు అని అర్థము. రామావతారమును తెలుపుౘున్న
దివ్యనామమిది. భక్తులకు అవతారములు నిరంతరమును పూజనీయములే అని గ్రాహ్యము.

502) భూరిదక్షిణః - ఓం భూరిదక్షిణాయనమః

విశేషముగా దానములు, దక్షిణలు ప్రసాదింౘు వాడని ఈనామముయొక్క సామాన్య అర్థము. మానవుడు చేయుౘుండు యజ్ఞయాగ వ్రతాది సకల పుణ్యకర్మలకును తగినరీతిగా భగవానుడు తగు ఫలములను ప్రసాదింౘుౘుండును. ఆయన కర్మఫలదాతయునగుటచేత "భూరిదక్షిణః" అని ఖ్యాతి గాంచెను. మానవుడు నిరంతరమును పుణ్యకర్మలనే చేయవలెను. వాని వలననే సకల సుఖములును కలుగును. అని గమనింపవలెను.
--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(23_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

503) సోమపః
ఓం సోమపాయనమః

యజ్ఞములయందు సోమరసపానము చేయువాడని ఈ నామముయొక్క
భావము. సారాంశమేమనగా, భగవానుడు యజ్ఞేశ్వరుడు, యజ్ఞభోక్త, మానవు
లాచరింౘు సమస్త పుణ్యకార్యములందును (అనగా వ్రతములు, ఆరాధనలు,
యజ్ఞములు మున్నగునవి) భక్తితో సమర్పింౘు పదార్థములను ప్రీతితో స్వీకరింౘువాడని భావార్థమగును. కావున" సోమపః". అను దివ్యనామ వాచ్యుడగుౘున్నాడు.

సమస్త పుణ్యకర్మలు ను అత్యంత భక్తిప్రపత్తులతో నాచరింపుమని
భావము.

504) అమృతపః
ఓం అమృతపాయనమః

అమృతపానము చేయువాడు, శ్రీహరి అమృతస్వరూపుడు , తన
స్వరూపామృతమునే సదాపానము చేయువాడగుటచేత "అమృతపః" అనబడెను.

దేవదానవులు క్షీరసాగర మథనమునందు బుట్టిన అమృతము శ్రీహరి మోహినీరూపమును ధరించి దేవతలకే అమృతము పంచియిచ్చి తానుకూడా
పావము చేసెనని పురాణగాథ స్మరణీయము.

భగవంతుని శరణాగతిని బొందినవారికి అమృతత్వము సిద్ధిమౘునని గమనింౘవలెను.

5౦5) సోమః
ఓం సోమాయనమః

సోముడనగా చంద్రుడు. " నేను రసస్వరూపుడగు సోముడనై
(చంద్రుడనై) సస్యములను ౘక్కగా ఫలింపజేయుౘున్నానని" భగవద్వాక్యము
(గీత 15_13) మఱియొక అర్థము. "ఉమ" అనగా పార్వతీదేవి. స+ఉమ=సోమ
"ఉమ" తో కూడియున్న వాడగుటచేత ఈశ్వరుడు "సోమః " అనబడుౘున్నాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(24_01_2019)
హరిః ಓమ్
54 వ. శ్లోకము
సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।
ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.
506) పురుజిత్
ఓం పురుజితేనమః
"పురు". శబ్దమునకు శత్రువు అని అర్థము. "జిత్". అనగా జయించిన వాడు . దేవ విరోధులగు రాక్షసగణములను తానొక్కడే జయించిన వాడగుటచేత
శ్రీహరి "పురుజిత్" అనబడుౘున్నాడు.
ఆధ్యాత్మిక సాధనలు చేయుౘున్న తన భక్తుల మనస్సులలో తాండవింౘుౘున్న రాక్షసులను (అనగా కామాది రాక్షస వికారములను) నాశనము
చేసి వారికి శాంత్యానందసౌఖ్యములు నిచ్చువాడు శ్రీపతియే గావున "పురుజిత్"
నామమున భజనీయుడు.
507) పురుసత్తమః
ఓం పురుసత్తమాయనమః
విశ్వరూపుడగుటవలన "పురుః " అనబడెను . సర్వశ్రేష్ఠుడగుటచే
"సత్తమః" అనబడెను. శ్రేష్ఠుడగు విశ్వరూపుడని భావార్థము. మఱియొక అర్థము
"పురులు " అనగా గొప్పవారు, సత్తమణ అనగా శ్రేష్ఠుడని అర్థము. గొప్పవారిలో
కెల్లా శ్రేష్ఠుడని భావార్థము.
508) వినయః
ఓమ వినయాయనమః
వినయము దేవతా లక్షణము. శ్రీరామచంద్రుడు పెద్దలయెడల
గురువులయెడల వినయవిధేయతలతో నున్న విషయము రామాయణమునందు
వర్ణింపబడియున్నది. కృష్ణావతారమునగూడా పెద్దలయెడల బ్రాహ్మణులయెడల
ఆ స్వామి ౘూపిన వినయవిధేయతలు ప్రసిద్ధములు కనుక "వినయః" అను దివ్యనామము చేత ప్రసిద్ధుడగును.
మఱియొక అర్థము
నయవర్థనము లేనివారిని(దుర్మార్గులను ) దండింౘువాడని
శ్రీహరి "వి - నయః" అని కీర్తింపబడును.
తన్నాశ్రయించిన ఆధ్యాత్మిక సాధకులను నయమార్గమున
(ధర్మమార్గమున నడుపువాడు గాన " వి_నయః". అని స్తవనీయుడగును.


( సంగ్రహ తాత్పర్య వివరణము)

(25_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

509) జయః - ఓం జయాయనమః

"జయోస్మి" నేను జయశీలుడను అని భగవద్వాక్యము స్మరణీయము.
(గీ 10_36) సకలపుణ్యకార్యములందును జయమును ప్రసాదింౘువాడు ఈశ్వరుడే.

ఆధ్యాత్మిక సాధకుల చిత్తములలోని మాలిన్యమును హరించి వారికి సాధనలలో విజయమును చేకూర్చినవాడు ఈశ్వరుడే "వాసుదేవపరాయణునకు అపజయముగానీ, పరాభవముగానీ లేదని " ఉత్తర పీఠికయందు పాఠకులు ౘూడగలరు.

510) సత్యసన్ధః - ఓం సత్యసన్ధాయనమః

సత్యస్వరూపుడు భగవానుడు. సత్యసంకల్పుడని శ్రుతి గానము
చేయును. అవతారములయందు ఆయన పలికినపలుకులు , వాగ్దానములు, క్రియలు అన్నియునూ సత్యములే.ఆకాశము పడిపోవునుగాక , హిమాలయములు కృంగిపోవునుగాక , భూమిబ్రద్ధలగునుగాక , నా పలుకులెన్నడును వ్యర్థములు గావు, అవి పరమ సత్యములే యని భగవానుడు పలికిన వాక్యములు వివిధ పురాణములలో స్మరణీయములే గదా! కనుక " సత్యసన్ధః " అని కీర్తిగాంచెను.

511) దాశార్హః- ఓం దాశార్హాయనమః

దానమునకు అర్హుడైన వాడని ఈ శబ్దమునకు అర్థము. యజ్ఞయాగాదులందు భక్తులిచ్చు కానుకలను స్వీకరింౘుటకు అర్హుడైనవాడు భగవానుడొక్కడే యగుటచేత " దాశార్హః " అనబడును. ( దాశః అనగా దానము అని అర్థము).

" దాశార్హ ". వంశమున (యాదవ వంశమున) జన్మించిన కారణాన
శ్రీహరి " దాశార్హః" అని పిలువబడును.

దానమును స్వీకరింౘుటకు అర్హుడు భగవానుడొక్కడే కనుక
బ్రహ్మప్రీతంబుగా దానము చేయవలయును. అదియే సత్పాత్రదానము అగునని భావము.
--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(26_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

512) సాత్త్వతాంపతిః - ఓం సాత్త్వతాంపతయేనమః

సత్వగుణ సంపన్నుల కందరికినీ అధిపతియగుటచేత భగవంతుడు
సాత్త్వతాంపతియని భావింప బడుౘున్నాడు. సాత్త్వతవంశస్థులకు(యాదవులకు)
ప్రభుడగుటచేత కూడా శ్రీకృష్ణుడట్టి నామముతో పూజనీయుడగును. సాత్త్వతముులనగా తంత్రములనియు అర్థముగలదు. వానిననుసరింౘువారు
సాత్త్వతులన బడుదురు. వారికికూడా శ్రీహరియే ప్రభువగుటచేత సాత్త్వతాంపతి
యని అర్చనీయుడగును.

త్రిగుణములలో శ్రేష్ఠమైనది సత్త్వగుణము. దానిని బాగుగా
నలవరౘుకొన్నచో ఆత్మజ్ఞానము కల్గునని భావము.

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

513) జీవః- ఓం జీవాయనమః

పరమాత్మయే మనశరీరములందు జీవుడై వెలయుౘున్నాడు.
మాయావశుడై, కర్మబద్ధుడై, కర్తృత్వభోక్తృత్వముల ననుభవింౘుౘు నున్న
జీవుడు వాస్తవముగా పరబ్రహ్మమగుట చేత "జీవ" శబ్ద వాచ్యుడగును.
"క్షేత్రజ్ఞంచాపిమాంవిద్ధి సర్వక్షేత్రేషు భారత ". అన్ని క్షేత్రములయందును నేను
క్షేత్రజ్ఞుడనయి యున్నాను. (గీత 13_2) క్షేత్రజ్ఞుడే జీవుడు.

కర్తృత్వభోక్తృత్వములు తనకు లేవని తలచి నిష్కామకర్మానుష్ఠానము
చేయవలెను. అప్పుడు " జీవ " స్వరూపము నశించి బ్రహ్మతత్త్వమును బొందునని
గ్రహింపవలెను.
--((**))--



విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(28_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

515) ముకుందః
ఓం ముకుందాయనమః

మోక్షము నిచ్చువాడని ఈ నామముయొక్క భావము. సమస్త కర్మ
బంధములనుండి తొలగించి జననమరణ, జరా వ్యాధి క్లేశములను బోగొట్టి
మోక్షమును ప్రసాదింౘువాడు కావున "ముకుందః" అను పవిత్ర నామవాచ్యుడు
అగుౘున్నాడు. "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ అహం త్వాసర్వ
పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ".

సకల ధర్మములను విడనాడి నన్నే శరణుబొందుము. సమస్తపాపముల
నుండియును నిన్ను విముక్తుని గావించెదను. దుఃఖింపకుము అని గీతాచార్యుని
వాగ్దానము స్మరణీయము (అ 18 శ్లో 66).

516) అమితవిక్రమః
ఓం అమితవిక్రమాయనమః

తన అవతారములయందు అనంత బలపరాక్రమములను ప్రదర్శించి
రాక్షస సంహారము గావించిన కారణమున "అమితవిక్రమః" అని అర్చనీయు డగును. మఱియొక వివరణము విక్రమములనగా పాదములని అర్థము. అమిత
విక్రమః అనగా కొలుౘుటకు వీలుగానంత పెద్దవగు పాదవిన్యాసములు గలవాడని
భావము.

కావున బలిచక్రవర్తినుండి మూడడుగులు దానముగా స్వీకరించి
తన పాదములచేత ముల్లోకములందునూ వ్యాపించిన వామనావతారమును
ఈ పవిత్రనామము విశదీకరింౘుౘున్నది అని గ్రహింపనగును.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(29_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

517) అంభోనిధిః
ఓం అంభోనిధయేనమః

(1) మహాసాగరమునకు "అంభోనిధి" యని పేరు. అంభస్సులనగా
జలములు. వానికి నిధి కావున సాగరము "అంభోనిధి" యని పేరు గాంచెను.
"సరసామస్మిసాగరః " జలాశయములలో నేను "సముద్రమును" అని భగవద్వాక్యము స్మరణీయము (10_24).

(2) దేవతలు, పితృదేవతలు,మనుష్యులు, అసురులు. ఈనలుగురకును
అంభస్సులని పేరుగా శ్రుతి వాక్యము గలదు. ఇట్టి అంభస్సులు తనయందు
విహితములై యున్నందున. శ్రీహరి "అంభోనిధి" యని పేరు గాంచెను.

(3] అలంకారిక భాషలో భగవానుడు "సాగరముగా "(అంభోనిధిగా)
ప్రసిద్ధుడయ్యెనని విజ్ఞులు భావింతురు. నిశ్చలత్వమునకును, గాంభీర్యమునకును, స్థితప్రజ్ఞత్వమునకును సాగరము చిహ్నము (భగవద్గీత
2_70).

సాగరము సదాప్రణవము (ఓంకారోపాసనము) చేయునుగాన సాగరుడు
భగవద్విభూతి అయ్యెను.

518) అనంతాత్మా
ఓం అనంతాత్మనేనమః

(1) "దేశ కాల, వస్తు, పరిచ్ఛేదములు లేనివాడగుటచేత అనంతాత్ముడని భజనీయుడయ్యెను.

(2) తానొక్కడే అయిననూ విశ్వమంతయును చిత్ర విచిత్ర రూపములతో వివిధ నామభేద రూపములతో విస్తరించి, వికసించి, విరాజిల్లి వ్యాపించి యున్నవాడు ఈశ్వరుడేయగుటచేత " అనంతాత్మా" అని స్తవనీయుడగుౘున్నాడు.

విశ్వమంతయును విశ్వనాథుని విరాట్స్వరూపమే గాన సర్వభూత
సేవనమే ఈశ్వరసేవ యగునని సాధకులు గ్రహింపవలెను.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(30_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

519) మహోదధిశయః
ఓం మహోదధిశయాయనమః

1) క్షీరసాగరము నందు ఫణిరాజు శయ్యపై సుఖముగా శయనించినవాడు (శేషసాయి) అని ఈ నామమునకు భావము.

2) ప్రళయ జలరాశిపై వటపత్రముపై పరుండి తన కరారవిందము
చేత పదారవిందమునుబట్టి తనముఖారవిందము నందుంౘుకొని తన స్వస్వరూపామృతమును ఆస్వాదింౘు వాడనియును భావము కావున (వటపత్రశాయి) "మహోదధిశయః" అని వర్ణింపబడెను.

520) అన్తకః
ఓం అన్తకాయనమః

నాశనము చేయువాడని ఈనామముయొక్క సామాన్యార్థము.
అనగా ప్రళయకాలమునందు సమస్తభూతములను లయము గావింౘు పరమేశ్వర స్వరూపమగుటచేత "అన్తకః" అను నామమున శ్రీహరి పేరుగాంచెను.

తన భక్తులలోనుండి కామక్రోధాది దుర్గుణములన్నింటిని
అంతము (నాశనము) చేయువాడగుటచేత కూడా "అన్తకః" అని ప్రసిద్ధుడగును.

మనస్సులోని దుర్గుణములను హరికీర్తనా బలముచే నాశనము
చేయవలెనని గ్రహింౘునది.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(31_01_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

521) అజః
ఓం అజాయనమః

1) పుట్టుక లేని వాడు గనుక పరమాత్మ "అజః" అని ప్రసిద్ధుడు.

2) రజోగుణమునాశ్రయించి చతుర్ముఖబ్రహ్మయై సృష్టిని గావించిన
వాడు పరమాత్మయే గాన "అజః " నామవాచ్యుడగును.

3) "అ". అనగా విష్ణువు అని అర్థము. "జ". అనగా జన్మించిన వాడు.
విష్ణువునకు జన్మించినవాడు మన్మథుడు గదా. మన్మథుడు భగవద్విభూతి గీతలో చెప్పబడెను. (ప్రజనశ్చాస్మి కందర్పః) (గీత 10_28) కనుక అజుడని
ప్రఖ్యాతి గాంచెను.

522) మహార్షః
ఓం మహార్షాయనమః

ౘక్కగా పూజింౘుటకు అర్హుడైనవాడని ఈ శబ్దార్థమైయున్నది.

"త్వమస్యపూజ్యశ్చ". నీవు పూజనీయుడవు. అని గీతావాక్యము
గదా (గీ 11_13).

పూజింపదగినవాడును, కీర్తింపదగినవాడును, స్మరింపదగిన
వాడును ఒక్క భగవానుడేకదా! కావుననే గీతలో _ మన్మనా భవమద్భక్తః _
మద్యాజీ _ మాం నమస్కురు_ మామేవైష్యసి" అని భగవానుడు పలికినాడు.

నాయందు మనస్సునుంౘుము, నన్ను ప్రేమింపుము, నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము, నీవు నన్నే పొందుదువు (గీ_18_65)
అని శ్యామసుందరుని దివ్యవాణి. కనుక భగవానుడు " మహార్షః " అని
కీర్తనీయుడగుౘున్నాడు.

523) స్వాభావ్యః
ఓం స్వాభావ్యాయనమః

నిరంతరమును తన స్వస్వరూపాత్మ భావనయందే యుండు
వాడగుటచేత, అనాదియగుటచేతను " స్వాభావ్యః " అని ప్రస్తుతింపబడెను.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(01_02_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

524) జితామిత్రః
ఓం జితామిత్రాయనమః

జిత+అమిత్రః = జితామిత్రః, జిత= జయింపబడిన, అమిత్రః = శత్త్రువులు గలవాడు, అనగా సర్వశత్రు సంహారకుడని అర్థము.

తన అవతారములలో దేవవిరోధులగు రాక్షసగణములను
సంహరించుటచేత " జితామిత్రః ". అనబడును. ఆధ్యాత్మికసాధకుల మనస్సు
లలో సంక్షోభము కలుగచేయుౘుండు రాక్షసులను (అనగా కామక్రోధాది వికారములను), సంహరింౘువాడు శ్రీహరియేయగుటచేత "జితామిత్రః" అనికీర్తిమపబడెను. అరిషడ్వర్గములను జయింపవలెనని గ్రాహ్యము.

525) ప్రమోదనః
ఓం ప్రమోదనాయనమః

ఆనందమును కల్గింౘు వాడని భావము.
తన్నాశ్రయించిన భక్తులకు ఆనందమును కల్గింౘు వాడగుటచేత
ప్రమోదనః అనబడుౘున్నాడు.

526) ఆనందః
ఓం ఆనందాయనమః

"ఆనందోబ్రహ్మ". పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన అనంతానందములోని ఒక్క అంశమే సకల భూతములకును ఆనందకారణమని శ్రుతి గానము చేయును.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(02_02_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

527) నన్దనః
ఓం నన్దనాయనమః

తన్నాశ్రయించి న వారలందరకును ఆనందమును గలిగింౘు వాడు ఈశ్వరుడేయగుటచేత " నన్దనః " అనబడెను.

525,526,527. నామములు భగవానుని పరమానందస్ఫూర్తిని
వివరింౘుౘున్నవి. విశ్వమునందుగల ఏ పదార్థములోనూ ఆనందములేదు.
ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఆనందమూర్తి.

యేహి సంస్పర్శజా భోగః దుఃఖయోనయ ఏవతే ।
ఆద్యంతవన్తః కౌంతేయ, నతేషురమతే బుధః ।।

ఇంద్రియ భోగములన్నియునూ దుఃఖములతో కూడియున్నవే యగును. అందలి సుఖములు కేవలము పరిమితకాలము మాత్రమే యుండునవి.
కనుకజ్ఞానులు వానియందనురాగమును బొందరు. . అని భగవద్వాక్యము
(అ 5_శ్లో_22). అక్షయమగు సుఖానందములు ఆత్మయందేగలవు. బాహ్యపదార్థములలో లేవు. కనుక సాధకుడు ఇంద్రియ సుఖములనపేక్షింపక అతర్ముఖుడై తనయందేయున్న అనంతానందామృతమును . ఆస్వాదింపుమని
సారాంశము. " యో వై భూమాతత్సుఖం నాతః సుఖమస్తి" ( ఏది భూమమో అనగా అఖండమో అదియే సుఖప్రదమనియును, పరిమితములగువానియందు
సుఖానందములులేవనియును చాందోగ్యోపనిషత్తు తెలుపును.

528) నన్దః
ఓం నన్దాయనమః

సమస్త సుఖ సిద్ధులతోను కూడిన వాడగుటచేత " నన్దః " అని
పరమాత్మ ప్రశంసనీయుడయ్యెను.

529) సత్యధర్మా
ఓం సత్యధర్మణేనమః

సత్యమునకును ధర్మమునకును మూలమైనవాడు పరమాత్మ. అంతమాత్రమేకాదు ఉత్తమధర్మములయిన, అహింస, కరుణ, ప్రేమ, త్యాగము, శౌచము మున్నగు వానికి విధానము భగవానుడే. కావున రామాయణమున
" రామో విగ్రహవాన్ ధర్మః " రాముడు మూర్తీభవించిన ధర్మమని వర్ణింపబడి యున్నది. సారాంశమేమనగా సత్యధర్మాదులను నిత్యదైనందిన జీవితములో
అనుష్ఠింౘినవానికే మోక్షలక్ష్మి సిద్ధిౘునని తాత్పర్యము. " సత్యంవద ధర్మంచర ".

530) త్రివిక్రమః
ఓం త్రివిక్రమాయనమః

విక్రమములనగా పాదములు. మూడు పాదములచేత ముల్లోకములనూ ఆక్రమించిన వామనావతారము ఈ పవిత్ర నామమున గానము చేయబడుౘున్నది.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(10_02_2019)

హరిః ಓమ్

58_వ. శ్లోకము

మహావరావహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ।।

ఈ మంగళశ్లోకము తొమ్మిది పుణ్యనామములతో విలసిల్లు ౘున్నది.

544) గహనః - ఓం గహనాయనమః

తేలికగా లోనికి ప్రవేశింప శక్యము కానివాడని ఈ నామము యొక్క
భావము. భగవంతుడు చక్షురాది యింద్రియములకగోచరుడు . అంతర్ముఖమైన
యింద్రియముల ద్వారా, యమ, నియమ, ప్రాణాయామాది యోగానుష్టానముల
ద్వారా మిగుల కష్టములతో పొందబడువాడు కావున " గహనః " అని ప్రసిద్ధుడగును.

545) గుప్తః - ఓం గుప్తాయనమః

మనస్సుచేత తెలియబడజాలని వాడగుటచేత " గుప్తః " " ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే " అని శ్రుతివాక్యము.
ఆత్మ సర్వభూతములయందునూ గూఢముగా నున్నందున ప్రకాశించుటలేదని
భావము.

546) చక్రగదాధరః - ఓం చక్రగదాధరాయనమః

చక్రమును, గదను ధరించిన మహావిష్ణువని యర్థము. ధర్మ
సంస్థాపనార్థముగ భగవానుడు చర్రగదాధారియై అవతరింౘు నని పురాణ వర్ణనము. చక్రముపేరు సుదర్శనము, గదపేరు కౌమోదకి. వేదాంత భావమున
చక్రము మనస్తత్త్వమును, " గద " బుద్ధితత్త్వమును సూచింౘునని భావము.
--((**))--

(11_02_2019)

హరిః ಓమ్

59 వ. శ్లోకము

వేధాః స్వాంగో√జితః కృష్ణోదృఢః సంకర్షణో √ చ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ।।

ఈ దివ్యశ్లోకము నందు పదకొండు భగవన్నామములు వర్ణితములు.

547) వేధాః
ఓం వేధసేనమః

వేధాః అనునామమునకు సృష్టికర్తయని అర్థము. నామరూపాత్మక
మగు సృష్టికంతకునూ హిరణ్యగర్భ రూపమున శ్రీహరియే కారకుడగుటచేత
" వేధాః " అను దివ్యనామవాచ్యుడగుౘున్నాడు.

548) స్వాంగః
ఓం స్వాంగాయనమః

సుందరమగు అవయవములతో శోభిల్లుౘున్న వాడని ఈనామము యొక్క భావార్థము. శ్రీరాముడు పుంసాం మోహనరూపుడుకదా. ఇక శ్రీకృష్ణుడా
మన్మథమన్మథుడు. ఇట్టి సుకుమార సుందర మనోజ్ఞములగు అవయవములతో
శోభిల్లు సగుణసాకార పరబ్రహ్మము భక్తులకు ధ్యానయోగ్యమగును. కావున
స్వాంగః అని భావింపబడుౘున్నాడు.

మఱొక అర్థము: సృష్టి కార్యాదులను రచింౘుటకు మఱియెట్టి
యితర సాధనములతోను ( అంగములతోను) నిమిత్తము లేకుండగనే, తనంతటతానే సర్వకార్యనిర్వహణము చేయువాడు పరమేశ్వరుడగుటచేత
" స్వాంగః ". అనుదివ్యనామవాచ్యుడగును.

ఆధ్యాత్మిక సాధకుడు తనసర్వకార్యములను యితరులపై
ఆధారపడక తనంతతానే చేసికొనుౘుండవలెనని గురువులు బోధింతురు.

549) అజితః
ఓం అజితాయనమః

అపజయము లేనివాడని ఈశబ్దముయొక్క అర్థము. అనగా
తనయవతారములయందెన్నడు అపజయము నెఱుంగడు. వాసుదేవుని
ఆశ్రయించినవాడికి ఎన్నడూ అపజయముండదని భావన. భక్తున కెన్నడునూ
పతనము లేదని భగవద్వాక్యము గదా!(గీత 9_31)