Friday, 29 May 2020

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము



28.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

7.1 (ప్రథమ శ్లోకము)

కస్య హేతోః పరీత్యక్తా ఆచార్యేణాత్మనః  సురాః|

ఏతదాచక్ష్య భగవన్ శిష్యాణామక్రమం గురౌ॥5020॥

పరీక్షిన్మహారాజు పలికెను-మహాత్మా! దేవగురువైన బృహస్పతి తన ప్రియ శిష్యులైన దేవతలను పరిత్యజించుటకు కారణమేమి? దేవతలు ఆయనయెడ చేసిన అపచారమేమి? దయతో తెలుపుము.

శ్రీశుక ఉవాచ

7.2 (రెండవ శ్లోకము)

ఇంద్రస్త్రిభువనైశ్వర్యమదోల్లంఘితసత్పథః|

మరుద్భిర్వసుభీరుద్రైరాదిత్యైరృభుభిర్నృప॥5021॥

7.3 (మూడవ శ్లోకము)

విశ్వేదేవైశ్చ సాధ్యైశ్చ నాసత్యాభ్యాం పరిశ్రితః|

సిద్ధచారణగందర్వైర్మునిభిర్బ్రహ్మవాదిభిః॥5022॥

7.4 (నాలుగవ శ్లోకము)

విద్యాధరాప్సరోభిశ్చ కిన్నరైైః పతగోరగైః|

నిషేవ్యమాణో మఘవాన్ స్తూయమానశ్చ భారత॥5023॥

శ్రీ శుకుడు నుడివెను- ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యములను పొందుటచే గర్వితుడయ్యెను. అందువలన ధర్మమర్యాదలను, సదాచారములను ఉల్లంఘింపసాగెను. ఒకానొకనాడు అతడు తనపత్నియైన శచీదేవితో గూడి నిండుసభలో సింహాసనముపై  ఆసీనుడైయుండెను. నలుబది తొమ్మిది మంది మరుద్గణములు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ-ఆదిత్యులు, ఋభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, అశ్వినీకుమారులు అతనిని సేవించు చుండిరి. సిద్ధులు,  చారణులు, గంధర్వులు, బ్రహ్మవాదులైన మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పక్షిగణములు, నాగులు అతనిని సేవించుచు స్తుతించుచుండిరి.

7.5 (ఐదవ శ్లోకము)

ఉపగీయమానో లలితమాస్థానాధ్యాసనాశ్రితః|

పాండురేణాతపత్రేణ చంద్రమండలచారుణా॥5023॥

7.6 (ఆరవ శ్లోకము)

యుక్తశ్చాన్యైః పారమేష్ఠ్యైశ్చామరవ్యజనాదిభిః|

విరాజమానః పౌలోమ్యా సహార్ధాసనయా భృశమ్॥5025॥

వారు అందరును మధురమైన స్వరములతో ఇంద్రుని కీర్తించుచుండిరి. చంద్రమండలము వలె సుందరమైన శ్వేతచ్ఛత్రము శోభిల్లుచుండెను. వింజామరలు, వీవనలు మొదలగు మహారాజోచితమైన మర్యాదలు నిర్వహింపబడు చుండెను.

7.7 (ఏడవ శ్లోకము)

స యదా పరమాచార్యం దేవానామాత్మనశ్చ హ|

నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః॥5026॥

7.8 (ఎనిమిదవ శ్లోకము)

వాచస్పతిం మునివరం సురాసురనమస్కృతమ్|

నోచ్చచాలాసనాదింద్రః పశ్యన్నపి సభాగతమ్॥5027॥

ఆ సమయమున దేవేంద్రాదిదేవతలకు పరమగురువైన బృహస్పతి అచటికి ఏతెంచెను. అతనికి సురాసురులందరునూ నమస్కరింతురు. అయితే, సురాసురులందరకును పూజ్యుడైన బృహస్పతి సభలో ప్రవేశించుటను ఇంద్రుడు చూచెను. ఐనను, అతడు సింహాసనము నుండి లేచుట గాని, గురువును సత్కరించుటగాని చేయక అటుఇటు కదలకుండా కూర్చొనియుండెను.

7.9 (తొమ్మిదవ శ్లోకము)

తతో నిర్గత్య సహసా కవిరాంగిరసః ప్రభుః|

ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమదవిక్రియామ్॥5028॥

త్రికాలదర్శి, సమర్థుడు ఐన బృహస్పతి, ఇదీ ఐశ్వర్యమద దోషము అని భావించి, వెంటనే అతడు అచటి నుండి మౌనముగా వెను దిరిగి, తన ఇంటికి చేరెను.

7.10 (పదియవ శ్లోకము)

తర్హ్యేవ ప్రతిబుధ్యేంద్రో గురుహేళనమాత్మనః|

గర్హయామాస సదసి స్వయ మాత్మానమాత్మనా॥5029॥

అంతట ఇంద్రుడు తనవలన బృహస్పతికి అవమానము జరిగినదను విషయమును గ్రహించెను. అప్పుడు నిండు సభలో తనను తాను నిందించుకొనసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


29.5.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.11 (పదకొండవ శ్లోకము)

అహో బత మయాఽసాధు కృతం వై దభ్రబుద్ధినా|

యన్మయైశ్వర్యమత్తేన గురుః సదసి కాత్కృతః॥5030॥

బృహస్పతికి నిండుసభలో జరిగిన అవమానమునకు దేవేంద్రుడు తనను తానిట్లు నిందించుకొనసాగెను:

అయ్యో! నేడు ఈ నిండుసభలో నేను ఎంతటి అపరాధమొనర్చితిని? ఐశ్వర్యభమదోన్మత్తుడనై మూర్ఖముగ ప్రవర్తించి గురువునెడ తీరని అపరాధమొనర్చితిని. వాస్తవముగా నేను ఇట్లు వ్యవహరించుట మిగుల గర్హణీయము.

7.12 (పండ్రెండవ శ్లోకము)

కో గృధ్యేత్ పండితో లక్ష్మీం త్రివిష్టపపతేరపి|

యయాహమాసురం భావం నీతోఽద్య విబుధేశ్వరః॥5031॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

బుద్ధిమంతుడైన వాడెవడు ఈ స్వర్గరాజ్య సంపదలను పొందుటకు ఇష్టపడడు. చూడుడు! నేడు ఈ సంపదయే దేవతలకు ప్రభువైన నన్ను గూడ అనుచరులవలె రజోగుణ భావమునకు గురిచేసినది.

7.13 (పదమూడవ శ్లోకము)

యే పారమేష్ఠ్యం ధిషణమధితిష్ఠన్న కంచన|

ప్రత్యుత్తిష్ఠేదితి బ్రూయుర్ధర్మం తే న పరం విదుః॥5032॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనసాగెను:

'సార్వభౌమ అధికారముతో రాజ్యసభ సింహాసనముపై కూర్చున్న చక్రవర్తి ఎవరు వచ్చిననూ సింహాసనమునుండి లేవగూడదు' అని కొందరు చెప్ఫెదరు. వారు వాస్తవముగా ధర్మస్వరూపమును ఎరుగనివారే.

17.14 (పదునాలుగవ శ్లోకము)

తేషాం కుపథదేష్టౄణాం పతతాం తమసి హ్యధః|

యే శ్రద్దధ్యుర్వచస్తే వై మజ్జంత్యశ్మప్లవా ఇవ॥5033॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

ఏలయన, ఇట్లు ఉపదేశించువారు జనులను చెడు మార్గములలో తీసికొనిపోవుదురు. అట్టివారు స్వయముగా ఘోర నరకమున పడుదురు. వారి పలుకులను విశ్వసించినవారు రాతిపడవవలె నీటిలో మునిగిపోవుదురు.

7.15 (పదునైదవ శ్లోకము)

అధాఽహమమరాచార్యమగాధధిషణం ద్విజమ్|

ప్రసాదయిష్యే నిశఠః శీర్ష్ణా తచ్చరణం స్పృశమ్॥5034॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

నా గురువైన బృహస్పతి అగాధమైన జ్ఞానసముద్రుడు. అట్టి వానియెడ నేను గొప్ప అపరాధమొనర్చితిని. ఇప్పుడు నేను ఆ మహాత్ముని పాదములపై వ్రాలి ఆయనను ప్రసన్నుని చేసికొనుటయే నా కర్తవ్యము".

7.16 (పదునారవ శ్లోకము)

ఏవం చింతయతస్తస్య మఘోనో భగవాన్ గృహాత్|

బృహస్పతిర్గతోఽదృష్టాం గతిమధ్యాత్మమాయయా॥5035॥

అని దేవేంద్రుడు ఈ విధముగా అనుకొనుచుండగనే మహాత్ముడైన బృహస్పతి తన ఇంటినుండి వెడలి యోగబలముచే అంతర్హితుడయ్యెను. 

7.17 (పదునేడవ శ్లోకము)

గురోర్నాధిగతః సంజ్ఞాం పరీక్షన్ భగవాన్ స్వరాట్|

ధ్యాయన్ ధియా సురైర్యుక్తః శర్మ నాలభతాత్మనః॥5036॥

దేవేంద్రుడు తన గురువును తాను స్వయముగ వెదకుటయేగాక, ఇతరులచే వెదకించెను. కాని, ఆయన ఆ చూకీ దొరకలేదు. గురువులేకుండా తనకు రక్షణ యుండదని ఇంద్రుడు భావించెను. అంతట ఇతర దేవతలతో గూడి స్వర్గ రక్షణకై తగిన ఉపాయము కొరకై ఆలోచించెను. కాని, వారి నుండి ఎట్టి ఉపాయము లభింపకుండుటచే అతడు అశాంతికి గురియయ్యెను.

7.18  (పదునెనిమిదవ శ్లోకము)

తచ్ఛ్రుత్వైవాసురాః సర్వే ఆశ్రిత్యౌశనసం మతమ్|

దేవాన్ ప్రత్యుద్యమం చక్రుర్దుర్మదా ఆతతాయినః॥5037॥

దేవగురువైన బృహస్పతి దేవతలను వదలివెళ్ళిన సమాచారము దైత్యులకు తెలిసెను. అప్ఫుడు మదోన్మత్తులు, ఆతతాయులు ఐన దైత్యులు శుక్రాచార్యుని ఆదేశానుసారము దేవతలను జయించుటకు ఉద్యమించిరి.

7.19 (పందొమ్మిదవ శ్లోకము)

తైర్విసృష్టేషుభిస్తీక్ష్ణ్-ణ్యైర్నిర్భిన్నాంగోరుబాహవః|

బ్రహ్మాణం శరణం జగ్ముః సహేంద్రా నతకంధరాః॥5038॥

ఆ దైత్యులు దేవతలపై తీవ్రమైన బాణములను వర్షింపజేసి, వారి మస్తకములు, ఊరువులు, బాహువులు మొదలగు అంగములను భేదింపసాగిరి. అప్పుడు ఇంద్రాదిదేవతలు వినమ్రులై బ్రహ్మదేవుని శరశుజొచ్చిరి.

7.20 (ఇరువదియవ శ్లోకము)

తాంస్తథాభ్యర్ధితాన్ వీక్ష్య భగవానాత్మభూరజః|

కృపయా పరయా దేవ ఉవాచ పరిసాంత్వయన్॥5039॥

సర్వసమర్థుడు, స్వయంభువు ఐన బ్రహ్మదేవుడు వాస్తవముగ దేవతలకు దుర్దశ ఏర్పడినదని గ్రహించెను. అందుకు అతని హృదయము దయార్ద్రమయ్యెను. అంతట దేవతలకు ధైర్యము గొలుపుటకై అతడు ఇట్లు పలికెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

29.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

బ్రహ్మోవాచ

7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అహో బత సురశ్రేష్డా హ్యభద్రం వ కృతం మహత్|

బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం దాంతమైశ్వర్యాన్నాభ్యనందత॥5040॥

7.22 (ఇరువది రెండవ శ్లోకము)

తస్యాయమనయస్యాసీత్ పరేభ్యో వః పరాభవః|

ప్రక్షీణేభ్యః స్వవైరిభ్యః సమృద్ధానాం చ యత్సురాః॥5041॥

బ్రహ్మదేవుడు ఇట్లనెను- దేవతలారా! వాస్తవముగా మీరు గొప్ప తప్పుపని చేసితిరి. ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను గానక బ్రహ్మజ్ఞాని జితేంద్రియుడు ఐన బ్రాహ్మణశ్రేష్ఠుని నిరాదరించితిరి. ఇది మిగుల శోచనీయము. మీరొనర్చిన అపరాధమునకు ఇది ఫలితము. మీరు సంపదలతో తులతూగుచున్నను దుర్భలులైన శత్రువులచే పరాభవమును ఎదుర్కొనవలసి వచ్చినది.

7.23 (ఇరువది మూడవ శ్లోకము)

మఘవన్ ద్విషతః పశ్య ప్రక్షీణాన్ గుర్వతిక్రమాత్|

సంప్రత్యుపచితాన్ భూయః కావ్యమారాధ్య భక్తితః|

ఆదదీరన్ నిలయనం మమాపి భృగుదేవతాః॥5042॥

7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

త్రివిష్టపం కిం గణయంత్యభేద్యమంత్రా భృగూణామనుశిక్షితార్థాః|

న విప్రగోవిందగవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణామ్॥5043॥

ఇంద్రా! చూడుము. నీ శత్రువులు గూడ మొదట తమకు గురువైన శుక్రాచార్యుని అవమాన పరచినందులకు మిక్కిలి బలహీనులైరి. కాని భక్తి భక్తిభావముతో అతనిని ఆరాధించి ధనముతోను, బలముతోను తులతూగిరి. శుక్రుని తమ ఆరాధ్యదైవముగా భావించునట్టి ఈ దైత్యులు కొలది దినములలో నా బ్రహ్మలోకములను గూడ ఆక్రమించెదరని నాకు తోచుచున్నది. భృగువంశీయులు వీరికి అర్థశాస్త్రమునందు పూర్తిగ శిక్షణను ఇచ్చినది. వారి పన్నాగములను త్రిప్పికొట్టు మార్గములు మీకు గూడ తెలియవు. అవి చాల గుప్తముగా ఉండును. ఇట్టి స్థితిలో స్వర్గమునే గాదు, వారు ఏ లోకమునైనను జయింపగలరు. బ్రాహ్మణులను, గోవిందుని, గోవులను తమ సర్వస్వముగా భావించెడు రాజులకు ఎన్నిటికినీ, అశుభము కలుగదు.

7.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తద్విశ్వరూపం భజతాశు విప్రం తపస్వినం త్వాష్ట్రమథాత్మవంతమ్|

సభాజితోఽర్థాన్  స విధాస్యతే వో యది క్షమిష్యధ్వమూతాస్య కర్మ॥5044॥

కనుక, ఇప్పుడు మీరు వెంటనే త్వష్టపుత్రుడైన విశ్వరూపునికడకేగి, ఆయనను సేవింపుడు. అతడు విప్రోత్తముడు, తపస్సంపన్నుడు, జితేంద్రియుడు. కాని, అతని తల్లి అసురకులమునకు చెందినది. కనుక, మీరు అసురులను ప్రేమతో క్షమింఛి, అతనిని గౌరవించినచో, అతడు మీకార్యమును నెరవేర్చగలడు.

శ్రీ శుక ఉవాచ

త ఏవముదితా రాజన్ బ్రహ్మణా విగతజ్వరాః|

ఋషిం త్వాష్ట్రముపవ్రజ్య పరిష్వజ్యేదమబ్రువన్॥5045॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహాజా! బ్రహ్మదేవుడు ఈ విధముగ సూచించిన పిమ్మట దేవతలకు చింతతొలగి ధైర్యము వచ్చెను. వెంటనే వారు విశ్వరూపమహర్షి కడకేగి, ఆయనను అక్కున జేర్చుకొని ఇట్లు నుడివిరి.

దేవా ఊచుః

7.27 (ఇరువది ఏడవ శ్లోకము)

వయం తేఽతిథయః ప్రాప్తా ఆశ్రమం భద్రమస్తు తే|

కామః సంపాద్యతాం తాత పితౄణాం సమయోచితః॥5046॥

దేవతలు ఇట్లనిరి- నాయనా! విశ్వరూపా! నీకు శుభమగుగాక! మేము నీ ఆశ్రమమునకు అతిథులమై వచ్చితిమి. ఒక విధముగా మేము నీకు పితృతుల్యులము. కనుక సమయోచితమైన మా అభిలాషను నెరవేర్చుము.

7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

పుత్రాణాం హి పరో ధర్మః పితృ శుశ్రూణం సతామ్|

అపి పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణామ్॥5047॥

బ్రాహ్మణోత్తమా! సంతానవంతులైన సత్పుత్రులు తమ తల్లిదండ్రులసు, ఇతర గురుజనులను సేవించుటయే పరమధర్మమని భావింతురు. ఇక బ్రహ్మచారిగా ఉన్న నీ విషయము చెప్పనేల?

7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ఆచార్యో బ్రహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతే|

భ్రాతా మరుత్పతేర్మూర్తిర్మాతా సాక్షాత్ క్షితేస్తనుః॥5048॥

7.30 (ముప్పదియవ శ్లోకము)

దయాయా భగినీ మూర్తిర్ధర్మస్యాత్మాతిథిః స్వయమ్|

అగ్నేరభ్యాగతో మూర్తిః సర్వభూతాని చాత్మనః॥5049॥

గురువు వేదస్వరూపుడు. తండ్రి బ్రహ్మదేవుని వంటివాడు. సోదరుడు ఇంద్రునితో సమానము. ఇంక తల్లి సాక్షాత్తు భూదేవి స్వరూపము. చెల్లెలు దయామూర్తి. అతిథి, సాక్షాత్తు ధర్మమూర్తియే. అభ్యాగతుడు అగ్నితో సమానుడు. జగత్తునందలి సకల ప్రాణులు ఆత్మ స్వరూపులే.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


30.5.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తస్మాత్పితౄణామార్తానామార్తిం పరపరాభవమ్|

తపసాపనయంస్తాత సందేశం కర్తుమర్హసి॥5050॥

నాయనా! విశ్వరూపా! మేము నీకు పితృసమానులము. ఇప్పుడు శత్రువులు మమ్ము జయించిరి. మేము ఆపదలపాలైయున్నాము నీవు నీ తపోబలముతో మా దుఃఖమును, దారిద్ర్యమును, పరాజయమును పారద్రోలుము. మా అభిప్రాయమును ఆలకించి, మాకు మేలు చేయుము.

7.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృణీమహే త్వోపాధ్యాయం బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం గురుమ్|

యథాఽంజసా విజేష్యామః సపత్నాంస్తవ తేజసా॥5051॥

నీవు బ్రహ్మనిష్ఠాపరుడవైన (వేదధర్మజ్ఞుడవైన) విప్రవరుడవు. కావున, జన్మతః మాకు గురుడవు. నిన్ను మేము మా ఆచార్యునిగా ఎన్నుకొనుచున్నాము. నీ తపోబలముతో మేము సులభముగ మా శత్రువులపై విజయమును సాధింపగలము.

7.33 (ముప్పది మూడవ శ్లోకము)

న గర్హయంతి హ్యర్థేషు యవిష్ఠాంఘ్ర్యభివాదనమ్|

చందోభ్యోఽన్యత్ర న బ్రహ్మన్ వయో జైష్ఠ్యస్య కారణమ్॥5052॥

మహాత్మా! సందర్భమును బట్టి తమకంటెను చిన్నవారిపదములకు నమస్కరించుట తప్పుగాదని విజ్ఞులందురు. పెద్దరికము వయస్సునుబట్టిగాక వేదజ్ఞానముబట్టి నిర్ణయింపవలెను. కావున, వయస్సునుబట్టి పెద్దరికము లభింపదు. నీవు వేదజ్ఞానసంపన్నుడవు ఐనందున, మా అందరికి నీవు పెద్దవాడవు ఐతివి.

ఋషిరువాచ

7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అభ్యర్థితః సురగణైః పౌరోహిత్యే మహాతపాః|

స విశ్వరూపస్తానాహ ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా॥5053॥

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఈ విధముగా విశ్వరూపుని తమకు పురోహితునిగా ఉండుమని ప్రార్థించిరి. అప్పుడు పరమతపస్వియైన విశ్వరూపుడు ప్రసన్నుడై వారితో ప్రియముగా, మధురముగా ఇట్లనెను-

విశ్వరూప ఉవాచ

7.35 (ముప్పది ఐదవ శ్లోకము)

విగర్హితం ధర్మశీలైర్బ్రహ్మవర్చ ఉపవ్యయమ్|

కథం ను మద్విధో నాథా లోకేశైరభియాచితమ్|

ప్రత్యాఖ్యాస్యతి తచ్ఛిష్యః స ఏవ స్వార్ధ ఉచ్యతే॥5054॥

విశ్వరూపుడు పలికెను "పెద్దలారా! పౌరోహిత్యము బ్రహ్మతేజస్సును క్షీణింప జేయును. కనుక, అది గర్హింపదగినది అని ధర్మజ్ఞులు నుడువుదురు. కాని, మీరు నాకు పితృతుల్యులు, లోకపాలురు. ఐనను, మీరు నన్ను పురోహితునిగా ఉండుమని వేడుకొనుచున్నారు. ఇట్టి స్థితిలో నా వంటి వాడు మీ కోరికను ఎట్లు తిరస్కరింపగలడు? నేను మీ సేవకుడను. మీ ఆజ్ఞను పాటించుటయే నా ధర్మము.

7.36 (ముప్పది ఆరవ శ్లోకము)

అకించనానాం హి ధనం శిలోంఛనం తేనేహ నిర్వర్తితసాధుసత్క్రియః|

కథం విగర్హ్యం ను కరోమ్యధీశ్వరాః పౌరోధసం హృష్యతి యేన దుర్మతిః॥5055॥

దేవతలారా! మేము అకించనులము. పొలములో పైర్లు కోసిన పిదప రాలిన ధాన్యములను ఏరుకొందుము. దానితో దేవకార్యమును, పితృకార్యమును ఆచరించుచుందుము. ఆ విధముగా శిలోంఛవృత్తితో జీవితమును గడుపునట్టి నేను నింద్యమగు పౌరోహిత్యమును ఎట్లు చేయగలను? అట్టి వృత్తిచే సంతోషించువారు బుద్ధిహీనులు.

7.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తథాపి న ప్రతిబ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్|

భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే॥5056॥

ఐనను, నేను మీ కోరికను తిరస్కరింపజాలను. మీ ప్రార్థన మిగుల స్వల్పమైనది. నా ప్రాణమును, తపోబలమును ఒడ్డియైనను మీ మనోరథమును నెరవేర్చెదను".

శ్రీ శుక ఉవాచ

తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః|

పౌరోహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధినా॥5057॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! మహాతపస్వియైన  విశ్వరూపుడు దేవతలకు ఇట్లు ప్రతిజ్ఞ చేసి, వారిప్రార్థన మేరకు పౌరోహిత్య వృత్తిని చేపట్టెను. మిక్కిలి ఏకాగ్రతతో తన వృత్తిధర్మమును నెరవేర్చెను.

7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

సురద్విషాం శ్రియం గుప్తామౌ శనస్యాపి విద్యయా|

ఆచ్ఛిద్యాదాన్మహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభుః॥5058॥

శుక్రాచార్యుడు తన నీతి బలముతో అసురుల సంపదను సురక్షితముగా భద్రపరచెను. ఐనను, సర్వసమర్థుడైన విశ్వరూపుడు తన వైష్ణవ విద్య (నారాయణ కవచ) ప్రభావముచే ఆ సంపదలను మరల గ్రహించి, దేవేంద్రునకు అప్పగించెను.

7.40 (నలుబదియవ శ్లోకము)

యయా గుప్తః సహస్రాక్షో జిగ్యేఽసురచమూర్విభుః|

తాం ప్రాహ స మహేంద్రాయ విశ్వరూప ఉదారధీః॥5059॥

రాజా! ఉదారశీలుడైన విశ్వరూపుడు ఆ వైష్ణవి విద్యను దేవేంద్రునకు బోధించెను. తత్ప్రభావమున వేయికన్నుల వేల్పుడగు దేవేంద్రుడు అసురసైన్యములపై విజయమును సాధించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తమోఽధ్యాయః (7)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



No comments:

Post a Comment