Sunday, 1 November 2020

నవమ స్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

1.11.2020   ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

అను, ద్రుహ్యు, తుర్వసు, యదు వంశముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

23.1 (ప్రథమ శ్లోకము)

అనోః సభానరశ్చక్షుః పరోక్షశ్చ త్రయః సుతాః|

సభానరాత్కాలనరః సృంజయస్తత్సుతస్తతః॥8114॥

23.2 (రెండవ శ్లోకము)

జనమేజయస్తస్య పుత్రో మహాశీలో మహామనాః|

ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ॥8115॥

శ్రీశుకుడు పలికెను యయాతి కుమారుడైన అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అను మువ్వురు పుత్రులు కలిగిరి. సభానరునకు కాలనరుడు, అతనికి సృంజయుడు అను కుమారులు కలిగిరి. సృంజయుని సుతుడు జనమేజయుడు. అతని తనయుడు మహాశీలుడు. మహాశీలుని తనూజుడు మహామనసుడు. మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అను ఇద్దరు కొడుకులు కలిగిరి.

23.3 (మూడవ శ్లోకము)

శిబిర్వనః శమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః|

వృషాదర్భః సువీరశ్చ మద్రః కైకేయ ఆత్మజాః॥8116॥

23.4 (నాలుగవ శ్లోకము)

శిబేశ్చత్వార ఏవాసంస్తితిక్షోశ్చ రుషద్రథః|

తతో హేమోఽథ సుతపా బలిః సుతపసోఽభవత్॥8117॥

ఉశీనరునివలన శిబి, వనుడు, శమి, దక్షుడు అను నలుగురు పుత్రులు జన్మించిరి. శిబికి వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అను నలుగురు తనయులు ఉద్భవించిరి. ఉశీనరుని తమ్ముడైన తితిక్షువునకు రుశద్రక్షుడు, అతని వలన హేముడు పుట్టిరి. హేముని కుమారుడు సుతపుడు, అతని సుతుడు బలి.

23.5 (ఐదవ శ్లోకము)

అంగవంగకలింగాద్యాః సుహ్మపుండ్రాంధ్రసంజ్ఞితాః|

జజ్ఞిరే దీర్ఘతమసో బలేః క్షేత్రే మహీక్షితః॥8118॥

23.6 (ఆరవ శ్లోకము)

చక్రుః స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే|

ఖనపానోఽఙ్గతో జజ్ఞే తస్మాద్దివిరథస్తతః॥8119॥

బలియొక్క భార్యయగు సుధేష్ణయందు దీర్ఘతముడు అను మహర్షివలన అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్రులు అనెడి ఆరుగురు పుత్రులు కలిగిరి. (బలియొక్క ప్రార్థనపై దీర్ఘతముడు అను మహర్షి ఆయన మందిరమునకు ఏతెంచెను. బలియొక్క భార్యయగు సుధేష్ణ తన భర్త నియోగమును అనుసరించి, ఆ మహర్షి అనుగ్రహముతో ఆరుగురు పుత్రులను పొందెను) ఈ ఆరుగురును బలికి క్షేత్రజులు. ఈ ఆరుమందియు తమ తమ పేర్లతో తూర్పుభాగమున ఆరు రాజ్యములను స్థాపించిరి. అతనికి దివిరథుడు పుట్టెను.

23.7 (ఏడవ శ్లోకము)

సుతో ధర్మరథో యస్య జజ్ఞే చిత్రరథోఽప్రజాః|

రోమపాద ఇతి ఖ్యాతస్తస్మై దశరథః సఖా॥8120॥

23.8 (ఎనిమిదవ శ్లోకము)

శాంతాం స్వకన్యాం ప్రాయచ్ఛదృష్యశృంగ ఉవాహ తామ్|

దేవేఽవర్షతి యం రామా ఆనిన్యుర్హరిణీసుతమ్॥8121॥

23.9 (తొమ్మిదవ శ్లోకము)

నాట్యసంగీతవాదిత్రైర్విభ్రమాలింగనార్హణైః|

స తు రాజ్ఞోఽనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతః॥8122॥

23.10 (పదియవ శ్లోకము)

ప్రజామదాద్దశరథో యేన లేభేఽప్రజాః ప్రజాః|

చతురంగో రోమపాదాత్పృథులాక్షస్తు తత్సుతః॥8123॥

దివిరథునకు ధర్మరథుడు, అతనికి చిత్రరథుడు కలిగిరి. చిత్రరథునకు రోమపాదుడు అను నామాంతరము గలదు. అతడు అయోధ్యాపతియగు దశరథ మహారాజునకు మిత్రుడు. రోమపాదునకు సంతానము లేకుండుట వలన దశరథుడు తన కుమార్తెయగు శాంతను దత్తపుత్రికగా ఒసంగెను. విభాండకుని కుమారుడగు ఋష్యశృంగుడు ఆమెను పెండ్లియాడెను. ఋష్యశృంగుడు లేడి గర్భమున జన్మించి విభాండక మహర్షికడ పెరిగి పెద్దవాడయ్యెను.. రోమపాదుని రాజ్యమున ఒకానొక సమయమున పెక్కు సంవత్సరముల వరకు వర్షములు లేక కఱవు కాటకములు ఏర్పడెను. అప్పుడు రోమపాదుని ఆదేశముపై వారాంగనలు తమ నాట్యభంగిమల చేతను, గాన మాధుర్యముల చేతను, వీణావేణుమృదంగ కళాకౌశలము చేతను, హావభావముల చేతను (ఒయ్యారముల చేతను), ఆలింగనముల వలనను, ఇంకను వివిధ సేవలచేతను ఋష్యశృంగుని ఆకర్షించి, ఆయనను రోమపాదుని రాజ్యమునకు తీసికొనివచ్చిరి. ఋష్యశృంగుడు మధుత్వద్దేవతాత్మకమైన (ఇంద్రదేవతా ప్రధానమైన) ఇష్టిని (యజ్ఞమును) రోమపాదునిచే నిర్వహింపజేసెను. ఆ యజ్ఞాచరణ ఫలముగా రోమపాదునకు సంతానము కలిగెను. పుత్రసంతానములేని దశరథమహారాజు ఋష్యశృంగుని పిలిపించి, ఆయన పర్యవేక్షణములో పుత్రకామేష్టి అను యజ్ఞమును ఆచరించెను. తత్ఫలితముగా ఆ మహారాజు నలుగురు పుత్రులను పొందెను. రోమపాదునకు చతురంగుడు, అతనికి పృథులాక్షుడు అను తనయులు కలిగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


23.11 (పదకొండవ శ్లోకము)

బృహద్రథో బృహత్కర్మా బృహద్భానుశ్చ తత్సుతాః|

ఆద్యాద్బృహన్మనాస్తస్మాజ్జయద్రథ ఉదాహృతః॥8124॥

పృథులాక్షునకు బృహద్రథుడు, బృహత్కర్మ, బృహద్భానుడు అను మువ్వురు కుమారులు జన్మించిరి. బృహద్రథుని సుతుడు బృహన్మనసుడు. అతని తనూజుడు జయద్రథుడు.

 23.12 (పండ్రెండవ శ్లోకము)

విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయత|

తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః॥8125॥

జయద్రథుని వలన భార్యయగు సంభూతియందు విజయుడు అను కుమారుడు జన్మించెను. విజయుని పుత్రుడు ధృతి. అతని తనయుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని తనూజుడు సత్కర్ముడు. సత్కర్ముని కొడుకు అధిరథుడు.

 23.13 (పదమూడవ శ్లోకము)

యోఽసౌ గంగాతటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుమ్|

కుంత్యాపవిద్ధం కానీనమనపత్యోఽకరోత్సుతమ్॥8126॥

అధిరథునకు సంతానము లేకుండెను. అతడు ఒకనాడు గంగాతీరమున విహరించుచుండగా శిశువుతో గూడిన ఒక పెట్టె ఆ నదియొద్దకు చేరెను. వెంటనే అధిరథుడు ఆ శిశువును తీసికొనిపోయి తన కుమారునిగా జేసికొనెను. ఆ శిశువు ఎవరోగాదు. కన్యగా నున్న కుంతీ దేవికి సూర్యుని వరప్రభావమున జన్మించినవాడు. ఆ కానీనుని (కన్యకు జన్మించినవాని) పేరు కర్ణుడు.

 23.14 (పదునాలుగవ శ్లోకము)

వృషసేనః సుతస్తస్య కర్ణస్య జగతీపతేః|

ద్రుహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః॥8127॥

 23.15 (పదునైదవ శ్లోకము)

ఆరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతో ధృతః|

ధృతస్య దుర్మదస్తస్మాత్ప్రచేతాః ప్రాచేతసం శతమ్॥8128॥

పరీక్షిన్మహారాజా! కర్ణుని కుమారుడు వృషసేనుడు. యయాతి కుమారుడైన ద్రుహ్యుని పుత్రుడు బభ్రువు. అతని తనయుడు సేతువు. అతని సుతుడు అరబ్ధుడు. ఆ అరబ్ధునకు గాంధారుడు, అతనికి ధర్ముడు పుట్టిరి. ధర్ముని తనూజుడు ధృతుడు. అతని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని కొడుకు ప్రచేతసుడు. అతనికి వందమంది కుమారులు జన్మించిరి.

23.16 (పదహారవ శ్లోకము)

మ్లేచ్ఛాధిపతయోఽభూవన్నుదీచీం దిశమాశ్రితాః|

తుర్వసోశ్చ సుతో వహ్నిర్వహ్నేర్భర్గోఽథ భానుమాన్॥8129॥

ప్రచేతసుని సుతులైన నూరుగురును ఉత్తరదిశయందలి మ్లేచ్ఛులకు ప్రభువులైరి. యయాతియొక్క మరియొక కుమారుడైన తుర్వసునకు వహ్ని అను పుత్రుడు కలిగెను. అతనికి భర్గుడు, భర్గునకు భానుమంతుడు పుట్టిరి.

 23.17 (పదిహేడవ శ్లోకము)

త్రిభానుస్తత్సుతోఽస్యాపి కరంధమ ఉదారధీః|

మరుతస్తత్సుతోఽపుత్రః పుత్రం పౌరవమన్వభూత్॥8130॥

భానుమంతుని సుతుడు త్రిభానుడు. అతని తనయుడు కరంధముడు. అతడు మిక్కిలి ఉదారబుద్ధిగలవాడు. కరంధముని పుత్రుడు మరుత్తు. అతనికి సంతానము లేకుండుటవలన పూరువంశమునకు చెందిన దుష్యంతుని తన కుమారునిగా జేసికొనెను.

 23.18 (పదునెనిమిదవ శ్లోకము)

దుష్యంతః స పునర్భేజే స్వం వంశం రాజ్యకాముకః|

యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ॥8131॥

కాని, దుష్యంతుడు రాజ్యాధికారముపైగల అభిలాషతో తిరిగి తన వంశమునకే చేరెను. పరీక్షిన్మహారాజా! ఇక యయాతియొక్క జ్యేష్ఠకుమారుడైన యదువుయొక్క వంశమును గూర్చి వివరించెదను వినుము.

 23.19 (పందొమ్మిదవ శ్లోకము)

వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణామ్|

యదోర్వంశం నరః శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే॥8132

 23.20 (ఇరువదియవ శ్లోకము)

యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతిః|

యదోః సహస్రజిత్క్రోష్టా నలో రిపురితి శ్రుతాః॥8133॥

రాజా! ఈ యదువంశ వృత్తాంతము  మిగుల పవిత్రమైనది. మానవుల సర్వపాపములను హరించునది. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ మానవాకృతిలో అవతరించినది ఈ  వంశమునందే. కనుక, ఈ వంశవృత్తాంతమును వినినవారు,  చదివినవారు, చదివించినవారు సకల పాపములనుండి విముక్తులగుదురు. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపువు అను కుమారులు కలిగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment