శ్రీశుక ఉవాచ
18.1 (ప్రథమ శ్లోకము)
శ్రీశుకుడు నుడివెను దేహికి షడింద్రియములవలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను ఆరుగురు పుత్రులు విలసిల్లిరి.
నహుషుడు తన పెద్దకుమారుడైన యతి కి రాజ్యపాలన భారమును అప్పగించదలచెను. కాని, అతడు (యతి) అందులకు సమ్మతించలేదు. 'రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో, దుఃఖములే దప్ప సుఖములు సున్న, అంతేగాక, ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసివచ్చును' అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు.
ఇంద్రుని పట్టమహిషియైన శచీదేవిపై మోహపడి, దౌష్ట్యమునకు పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురియై, తన ఇంద్రపదవిని కోల్పోవుటయే గాక కొండచిలువయై పోయెను. అనంతరము యయాతి తన తండ్రిస్థానములో మహారాజయ్యెను.
ఆయువుయొక్క కుమారుడు నహుషుడు. ఇతని తల్లిపేరు స్వర్భానవి. ఇతని భార్య ప్రియంవద. ఇతడు నూరు యజ్ఞములను ఆచరించెను. బ్రహ్మహత్యయొనర్చిన (విశ్వరూపుని చంపిన) కారణముగా ఇంద్రుడు తన పదవిని (స్వర్గాధిపత్యమును) కోల్పోయెను. అప్పుడు నహుషుడు ఇంద్రపదవిని (స్వర్గాధిపత్యమును) పొందెను. అంతట అతడు గర్వోన్మత్తుడై శచీదేవిపై మోహితు డయ్యెను. బృహస్పతితో ఆలోచించిన పిమ్మట శచీదేవి అందులకు ఆమోదించెను. బ్రహ్మరథముపై తన భవనమునకు వచ్చినచోనహుషుని పొందుదునని అని తెలిపెను. బ్రహ్మరథముపై బయలుదేరిన నహుషుడు 'త్వరగా నడువుడు' అనుచు ('సర్ప సర్ప' అని పలుకుచు) రథమును మోయుచున్న అగస్త్యుని కాలితో తన్నెను. వెంటనే అగస్త్యమహర్షి అతనిని "సర్పోభవ' అనుచు (సర్పమై పొమ్ము అని) శపించెను. ఆ శాపఫలితముగా నహుషుడు కొండచిలువ అయ్యెను. (బ్రహ్మరథము = బ్రాహ్మణులు లాగెడి రథము).
యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను నలుగురిని నాలుగు దిక్కులకు (నాలుగు దిక్కులయందుగల రాజ్యములకు) పరిపాలకులనుగా జేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్యప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పాలింపసాగెను.
రాజోవాచ
పరీక్షిన్మహారాజు అడిగెను- "మునీంద్రా! పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రహ్మర్షి (బ్రాహ్మణుడు), యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్యయైన (శుక్రాచార్యుని కూతురైన) దేవయానిని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా! అది ఎట్లు సంభవించెను?
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు - అను నాలుగు వర్ణముల వారిలో అగ్రకుల కన్యతో వివాహము ప్రతిలోమ విధానము.
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు పలికెను దానవరాజైన వృషపర్వునకు శర్మిష్ఠ అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయానితోడను, ఇంకను వేలకొలది చెలులతోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూలచెట్లతో నిండియుండెను. ఆ వనమునగల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి.
ఆ చక్కనిచుక్కలు (శర్మిష్ఠ మొదలగు కన్యలు) సరోవరమును సమీపించి,తమ వస్త్రములను ఒడ్డున ఉంచి, నీళ్ళలోనికి దిగి, పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో గూడి నందివాహనముపై అటునుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నీళ్ళలోనుండి బయటికి వచ్చి, త్వరత్వరగా తమవస్త్రములను ధరించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
18.10 (పదియవ శ్లోకము)
ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే యనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితయై ఇట్లు పలికెను "చెలులారా! ఈ దాసి (శర్మిష్ఠ) చేసిన అనుచితమైన పనిని చూచితిరా? యజ్ఞమునందలి హవ్యమును కుక్క తినినట్లుగా, ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రమూ క్షమింపరానిపని.
ఈ (మా) బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తపఃప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖమునుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయములయందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు (బ్రాహ్మణులు) నిర్దేశించిన వైదికమార్గము లోకమునకు (సకలప్రాణులకును) శుభంకరమైనది. దిక్పాలురును, ఇంద్రాదిదేవతలును బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు. వారిని సేవించుచుందురు. అంతేగాదు, పరమపావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు ఐన ఆ రమాపతికి గూడ బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణులలో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మాకు (మా తండ్రికి) శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది".
గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తూలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయెను. దెబ్బతిన్న ఆడుపామువలె బుసలు కొట్టసాగెను. అంతట పండ్లు పటపట కొఱుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను-
"ఓ భిక్షుకీ! నీ స్దాయిని తెలిసికొనక (విస్మరించి) నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు, కుక్కలవలె నీవు నాలుగు మెతుకులు కొఱకు (ఉదరపోషణకై) మా ఇంటిచుట్టును తిరుగుచున్నదానవు కావా?"
శర్మిష్ఠ ఈ విధముగా ఇంకను పలువిధములగు దురుసుమాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమెనుండి తన వస్త్రములను లాగికొని, ఆమెను ఒక బావిలో పడద్రోసెను.
పిదప శర్మిష్ఠ (తన చెలులతో గూడి) ఇంటికి చేరెను. కొంతతడవునకు యయాతి మహారాజు వేటాడి, అలసిపోవుటతో మిగుల దప్పికగొనియుండెను. నీటికొఱకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావిసమీపమునకు వచ్చి, ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదుస్వభావముగల యయాతి, ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేసెను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి (ఆమె చేతిని తన చేతితో పట్టుకొని) ఆమెను ఆ బావినుండి పైకితీసెను.

18.20 (ఇరువదియవ శ్లోకము)
అంతట దేవయాని ప్రేమ పరవశయై , వీరుడగు యయాతితో మృదుమధురముగా ఇట్లనెను - "అజేయుడవైన ఓ మహారాజా! మొదఠిసారిగా ఇటుల నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరియొకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమాశాలీ! బావిలో పడియున్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన (మన ఇరువురి సంబంధము) దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినదికాదు. మహాబాహూ! నేనును, బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాపకారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు.
కచుడు బృహస్పతి కుమారుడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యునికడ మృతసంజీవని అను విద్య నభ్యసించెను. దేవయాని కచునిపై మనసు పడియుండెను. అతడు చదువు పూర్తిచేసికొని ఇంటికి వెళ్ళునప్పుడు దేవయాని తనను పెండ్లియాడుమని అతనిని కోరెను. గురుపుత్రియగు దేవయానిని వివాహము చేసికొనుటకు అతడు తిరస్కరించెను. అందులకు కుపితయైన దేవయాని "నీవు నేర్చిన విద్య నీకు పనిచేయకుండుగాక" అని అతనికి శాపమిచ్చెను. అంతట కచుడును 'బ్రాహ్మణుడెవ్వడును నిన్ను పత్నిగా స్వీకరించకుండునుగాక' అని ఆమెకు ప్రతిశాపమిచ్చెను.
అంతట యయాతి 'ఈ వివాహము శాస్త్రవిరుద్ధమే యైనను విధినిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సుగూడ ఆమె వైపు ఆకర్షితమైనది' అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను.
వీరుడైన యయాతి అచటినుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచు తన తండ్రి కడకు వెళ్ళెను. అనంతరము శర్మిష్ఠ చేసిన దష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపెను.
తన గారాలపట్టియగు దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడగు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యెను. పిమ్మట అతడు 'వృషపర్వునికడ పౌరోహిత్యమొనర్చుటకంటె, ఉంఛవృత్తి ద్వారా జీవించుటయే మేలు' అని తలంచెను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని, తన కుమార్తెతోగూడి అచటినుండి బయలుదేరెను. ఈ విషయము వృషపర్వునకు తెలిసెను. అప్పుడు అతడు 'ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో? తద్ద్వారా తనను శత్రువులు జయింతురేమో? లేదా ఆయన నన్ను శపించునేమో?' అని శంకించెను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయనకడకు చేరి, ఆయనను ప్రసన్నుని జేసికొనుటకై పాదములపై బడెను.
ఉంఛవృత్తి = ధాన్యందంపుడు రోళ్ళవద్ద పడిన గింజలు ఏరుకొని అవి తిని బ్రతుకుట. లేదా పంట కోసిన తరువాత పంట అక్కడనుండి తీసికొనిపోయిన తరువాత పొలంలో పడిన గింజలు ఏరుకుని భుక్తి గడపుట.
అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణకాలములోనే శాంతించెను. పిమ్మట పూజ్యుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను. "రాజా! నా ముద్దులపట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను. కనుక, ఆమె కోరినరీతిగా నడచుకొనవలెను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చెదను' అందులకు వృషపర్వుడు ఆమోదించెను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించెను. 'మా తండ్రి నన్ను ఎవరికైనను ఇచ్చి పెండ్లిచేసినను, లేక, నేను ఎచటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను".
అంతట శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకటపరిస్థితిని గమనించెను. దేవయాని కోరినట్లు చేయుటవలన కలిగెడి ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించెను. పిమ్మట ఆమె తన వేయిమంది పరిచారికలతోగూడి దేవయానికి సేవలు చేయసాగెను.
అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమెతో శర్మిష్ఠను గూడ దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను. "రాజా! శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోను తల్పముపై చేరనీయరాదు".

పరీక్షిన్మహారాజా! కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యెను. అంతట ఒకనాడు శర్మిష్ఠ తన ఋతుకాలమున రహస్యముగా యయాతిని పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించెను.
అంతట ధర్మజ్లుడైన యయాతి రాజపుత్రికయైన శర్మిష్ఠయొక్క అభ్యర్థన (సంతానప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన) సముచితమైనదే యని భావించెను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష (ఎట్టి పరిస్థితిలోను నీవు ఈమెను చేరదీయరాదు - అను వచనములు) గుర్తునకు వచ్చినను, 'ప్రారబ్ధము ప్రకారము జరుగవలసినది జరుగును' అని భావించి, ఆమె కోరికనుదీర్చెను. (కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లొనర్చెను. దైవప్రాపితమేవ తత్సంగమ్ - అభ్యపద్యత - నతు కామతః (వీరరాఘవీయ వ్యాఖ్య)
దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అను ముగ్గురు కుమారులు కలిగిరి.
రాక్షస రాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతివలననే సంతానము ప్రాప్తించినట్లు ఎఱింగి, అహంకారవతియైన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి (తండ్రి కడకు) వెళ్ళెను. కామియైన (స్త్రీ లోలుడైన) యయాతియు తనకు ప్రాణప్రియయైన దేవయానిని అనుసరించి వెళ్ళెను. పిమ్మట అతడు ఆమె కాళ్ళుపట్టుకొని అనునయవచనములతో ప్రసన్నురాలిని చేసికొనుటకై ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యెను.
పిమ్మట శుక్రాచార్యుడు కుపితుడై "యయాతీ! నీవు స్త్రీ లోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి. ముసలితనము వలన మానవుని రూపము కళావిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించుగాక" అని పలికెను.
యయాతిరువాచ
అప్పుడు యయాతి ఇట్లు పలికెను - బ్రాహ్మణోత్తమా! మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించినవాడను కాను (దేవయానితో నేను ఇంకను దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగునుగదా!" అంతట శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను- "యయాతీ! ఎవ్వరైనను మనస్ఫూర్తిగా తన యౌవనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి, నీవు సుఖముసు పొందవచ్చును".
శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్దకుమారుడగు యదువుతో ఇట్లనెను- "నాయనా! మీ మాతామహుని (తల్లియొక్క తండ్రి) వలన ప్రాప్తించిన నా ముసలితనమును దీసికొని, నీ యౌవనమును నాకు ఇమ్ము. నేను ఇంకను విషయసుఖములయందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసికొనిన యౌవనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను.
యదురువాచ
యదువు పలికెను - "తండ్రీ! నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్థక్యమును తీసికొనుటకు నేను సిద్ధముగా లేను. ఏలయన, మానవుడు విషయ సుఖములను అనుభవింపకముందే వైరాగ్యమును పొందజాలడు గదా!

18.41 (నలుబది ఒకటవ శ్లోకము)
పరీక్షిన్మహారాజా! యయాతి తన పుత్రులైన తుర్వసుని, ద్రుహ్యుని, అనువును గూడ ఇట్లే అర్థించెను. కాని అనిత్యమైన యౌవనమును శాశ్వతమని భావించుచున్న అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి.
అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికిని, గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరుని పిలిచి యయాతి ఇట్లడిగెను- "నాయనా! నీ అన్నలవలె నీవును నా కోరికను తిరస్కరింపవు గదా!"
పూరురువాచ
పూరువు పలికెను "తండ్రీ! మహారాజా!పుత్రునియొక్క శరీరము (జన్మ) నిజముగా తండ్రినుండియే లభించినది. పైగా, తండ్రి అనుగ్రహము ఉన్నచో (సుతునకు) పరమపదము గూడ ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రియొక్క మనస్సెరిగి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రియాజ్ఞ యైనంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరసావహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలోని స్థితిలో అశ్రద్ధతో ఆచరించువాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించువాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పికొనుటకే అర్హుడు కాడు. యదార్థముగా అతడు పురీషప్రాయుడు.
పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతట యయాతియు తన కుమారుడగు పూరుడు ఇచ్చిన యౌవనముతో తనివితీర సుఖములను అనుభవించెను.
అప్పుడు సప్తద్వీపాధిపతియైన యయాతి ప్రజలను తన కన్న బిడ్డలవలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియపటుత్వము కలిగియున్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోర్కెను దీర్చుకొనెను.
అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడగు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలొనర్చుచు, ఏకాంతముస ముద్దుమురిపెములతో సంతోషింపజేయుచుండెను.
వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాడ్రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు. ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలప్రదాత. అంతేగాదు తనను ఆరాధించిన వారియొక్క సకలబాధలను తొలగించువాడు ఆ పరమాత్మ.
క్రతుభిః సర్వదేవతా శరీరకం, ఆరాధక - ఆర్తిహరం, సర్వయజ్ఞారాధ్యం, తత్ఫలదం, తద్భోక్తారం భగవంతమ్ అయజత్ - (ఆరాధితవాన్) (వీరరాఘవీయ వ్యాఖ్య)
అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణల నొసంగి తృప్తి పరచెను.
హతో యజ్ఞస్త్వదక్షిణః = దక్షిణలను ఒసంగకుండ చేసెడి యజ్ఞము నిష్ఫలము (నీతిశాస్త్రము)
ఒక్కొక్కప్పుడు మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండును. మరియొకప్పుడు అవి అదృశ్యములగు చుండును. అట్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలోభాసిల్లుచుండును. మరియొకప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా - పాలనదశలో దేవమనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతమగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై, అవ్యక్తమగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథములవలె చంచలము, కల్పితము. శ్రీమన్నారాయణుడు సకలప్రాణుల హృదయములలో విరాజమానుడై యుండును. ఆస్వామి స్వరూపము సూక్ష్మాతిసూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి ఐన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామభావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను ఒనర్చెను.
ఈ విధముగా యయాతి, చంచలములైన షడింద్రియములచే వేయి సంవత్సరములపాటు మానసిక భోగములను అనుభవించుచున్నను అతనికి తనివిదీరకుండెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము (18)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--
శ్రీశుక ఉవాచ
18.1 (ప్రథమ శ్లోకము)
యతిర్యయాతిః సంయాతిరాయతిర్వియతిః కృతిః|
షడిమే నహుషస్యాసన్నింద్రియాణీవ దేహినః॥7910॥
శ్రీశుకుడు నుడివెను దేహికి షడింద్రియములవలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను ఆరుగురు పుత్రులు విలసిల్లిరి.
18.2 (రెండవ శ్లోకము)
రాజ్యం నైచ్ఛద్యతిః పిత్రా దత్తం తత్పరిణామవిత్|
యత్ర ప్రవిష్టః పురుష ఆత్మానం నావబుధ్యతే॥7911॥
నహుషుడు తన పెద్దకుమారుడైన యతి కి రాజ్యపాలన భారమును అప్పగించదలచెను. కాని, అతడు (యతి) అందులకు సమ్మతించలేదు. 'రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో, దుఃఖములే దప్ప సుఖములు సున్న, అంతేగాక, ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసివచ్చును' అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు.
18.3 (మూడవ శ్లోకము)
పితరి భ్రంశితే స్థానాదింద్రాణ్యా ధర్షణాద్ద్విజైః|
ప్రాపితేఽజగరత్వం వై యయాతిరభవన్నృపః॥7912॥
ఇంద్రుని పట్టమహిషియైన శచీదేవిపై మోహపడి, దౌష్ట్యమునకు పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురియై, తన ఇంద్రపదవిని కోల్పోవుటయే గాక కొండచిలువయై పోయెను. అనంతరము యయాతి తన తండ్రిస్థానములో మహారాజయ్యెను.
ఆయువుయొక్క కుమారుడు నహుషుడు. ఇతని తల్లిపేరు స్వర్భానవి. ఇతని భార్య ప్రియంవద. ఇతడు నూరు యజ్ఞములను ఆచరించెను. బ్రహ్మహత్యయొనర్చిన (విశ్వరూపుని చంపిన) కారణముగా ఇంద్రుడు తన పదవిని (స్వర్గాధిపత్యమును) కోల్పోయెను. అప్పుడు నహుషుడు ఇంద్రపదవిని (స్వర్గాధిపత్యమును) పొందెను. అంతట అతడు గర్వోన్మత్తుడై శచీదేవిపై మోహితు డయ్యెను. బృహస్పతితో ఆలోచించిన పిమ్మట శచీదేవి అందులకు ఆమోదించెను. బ్రహ్మరథముపై తన భవనమునకు వచ్చినచోనహుషుని పొందుదునని అని తెలిపెను. బ్రహ్మరథముపై బయలుదేరిన నహుషుడు 'త్వరగా నడువుడు' అనుచు ('సర్ప సర్ప' అని పలుకుచు) రథమును మోయుచున్న అగస్త్యుని కాలితో తన్నెను. వెంటనే అగస్త్యమహర్షి అతనిని "సర్పోభవ' అనుచు (సర్పమై పొమ్ము అని) శపించెను. ఆ శాపఫలితముగా నహుషుడు కొండచిలువ అయ్యెను. (బ్రహ్మరథము = బ్రాహ్మణులు లాగెడి రథము).
18.4 (నాలుగవ శ్లోకము)
చతసృష్వాదిశద్దిక్షు భ్రాతౄన్ భ్రాతా యవీయసః|
కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణః॥7913॥
యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను నలుగురిని నాలుగు దిక్కులకు (నాలుగు దిక్కులయందుగల రాజ్యములకు) పరిపాలకులనుగా జేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్యప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పాలింపసాగెను.
రాజోవాచ
18.5 (ఐదవ శ్లోకము)
బ్రహ్మర్షిర్భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః|
రాజన్యవిప్రయోః కస్మాద్వివాహః ప్రతిలోమకః॥7914॥
పరీక్షిన్మహారాజు అడిగెను- "మునీంద్రా! పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రహ్మర్షి (బ్రాహ్మణుడు), యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్యయైన (శుక్రాచార్యుని కూతురైన) దేవయానిని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా! అది ఎట్లు సంభవించెను?
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు - అను నాలుగు వర్ణముల వారిలో అగ్రకుల కన్యతో వివాహము ప్రతిలోమ విధానము.
శ్రీశుక ఉవాచ
18.6 (ఆరవ శ్లోకము)
ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా|
సఖీసహస్రసంయుక్తా గురుపుత్ర్యా చ భామినీ॥7915॥
18.7 (ఏడవ శ్లోకము)
దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమసంకులే|
వ్యచరత్కలగీతాలినలినీపులినేఽబలా॥7916॥
శ్రీశుకుడు పలికెను దానవరాజైన వృషపర్వునకు శర్మిష్ఠ అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయానితోడను, ఇంకను వేలకొలది చెలులతోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూలచెట్లతో నిండియుండెను. ఆ వనమునగల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి.
18.8 (ఎనిమిదవ శ్లోకము)
తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః|
తీరే న్యస్య దుకూలాని విజహ్రుః సించతీర్మిథః॥7917॥
18.9 (తొమ్మిదవ శ్లోకము)
వీక్ష్య వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితమ్|
సహసోత్తీర్య వాసాంసి పర్యధుర్వ్రీడితాః స్త్రియః॥7918॥
ఆ చక్కనిచుక్కలు (శర్మిష్ఠ మొదలగు కన్యలు) సరోవరమును సమీపించి,తమ వస్త్రములను ఒడ్డున ఉంచి, నీళ్ళలోనికి దిగి, పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో గూడి నందివాహనముపై అటునుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నీళ్ళలోనుండి బయటికి వచ్చి, త్వరత్వరగా తమవస్త్రములను ధరించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
18.10 (పదియవ శ్లోకము)
శర్మిష్ఠాజానతీ వాసో గురుపుత్ర్యాః సమవ్యయత్|
స్వీయం మత్వా ప్రకుపితా దేవయానీదమబ్రవీత్॥7919॥
18.11 (పదకొండవ శ్లోకము)
అహో నిరీక్ష్యతామస్యా దాస్యాః కర్మ హ్యసాంప్రతమ్|
అస్మద్ధార్యం ధృతవతీ శునీవ హవిరధ్వరే॥7920॥
ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే యనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితయై ఇట్లు పలికెను "చెలులారా! ఈ దాసి (శర్మిష్ఠ) చేసిన అనుచితమైన పనిని చూచితిరా? యజ్ఞమునందలి హవ్యమును కుక్క తినినట్లుగా, ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రమూ క్షమింపరానిపని.
18.12 (పండ్రెండవ శ్లోకము)
యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్య యే|
ధార్యతే యైరిహ జ్యోతిః శివః పంథాశ్చ దర్శితః॥7921॥
18.13 (పదమూడవ శ్లోకము)
యాన్ వందంత్యుపతిష్ఠంతే లోకనాథాః సురేశ్వరాః|
భగవానపి విశ్వాత్మా పావనః శ్రీనికేతనః॥7922॥
18.14 (పదునాలుగవ శ్లోకము)
వయం తత్రాపి భృగవః శిష్యోఽస్యా నః పితాసురః|
అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతీ॥7923॥
ఈ (మా) బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తపఃప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖమునుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయములయందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు (బ్రాహ్మణులు) నిర్దేశించిన వైదికమార్గము లోకమునకు (సకలప్రాణులకును) శుభంకరమైనది. దిక్పాలురును, ఇంద్రాదిదేవతలును బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు. వారిని సేవించుచుందురు. అంతేగాదు, పరమపావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు ఐన ఆ రమాపతికి గూడ బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణులలో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మాకు (మా తండ్రికి) శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది".
18.15 (పదునైదవ శ్లోకము)
ఏవం శపంతీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత|
రుషా శ్వసంత్యురంగీవ ధర్షితా దష్టదచ్ఛదా॥7924॥
గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తూలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయెను. దెబ్బతిన్న ఆడుపామువలె బుసలు కొట్టసాగెను. అంతట పండ్లు పటపట కొఱుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను-
18.16 (పదహారవ శ్లోకము)
ఆత్మవృత్తమవిజ్ఞాయ కత్థసే బహు భిక్షుకి|
కిం న ప్రతీక్షసేఽస్మాకం గృహాన్ బలిభుజో యథా॥7925॥
"ఓ భిక్షుకీ! నీ స్దాయిని తెలిసికొనక (విస్మరించి) నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు, కుక్కలవలె నీవు నాలుగు మెతుకులు కొఱకు (ఉదరపోషణకై) మా ఇంటిచుట్టును తిరుగుచున్నదానవు కావా?"
18.17 (పదిహేడవ శ్లోకము)
ఏవంవిధైః సుపరుషైః క్షిప్త్వాచార్యసుతాం సతీమ్|
శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాస ఆదాయ మన్యునా॥7926॥
శర్మిష్ఠ ఈ విధముగా ఇంకను పలువిధములగు దురుసుమాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమెనుండి తన వస్త్రములను లాగికొని, ఆమెను ఒక బావిలో పడద్రోసెను.
18.18 (పదునెనిమిదవ శ్లోకము)
తస్యాం గతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్|
ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్థీ తాం దదర్శ హ॥7927॥
18.19 (పందొమ్మిదవ శ్లోకము)
దత్త్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే|
గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః॥7928॥
పిదప శర్మిష్ఠ (తన చెలులతో గూడి) ఇంటికి చేరెను. కొంతతడవునకు యయాతి మహారాజు వేటాడి, అలసిపోవుటతో మిగుల దప్పికగొనియుండెను. నీటికొఱకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావిసమీపమునకు వచ్చి, ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదుస్వభావముగల యయాతి, ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేసెను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి (ఆమె చేతిని తన చేతితో పట్టుకొని) ఆమెను ఆ బావినుండి పైకితీసెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
యయాతి చరిత్రము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
18.20 (ఇరువదియవ శ్లోకము)
తం వీరమాహౌశనసీ ప్రేమనిర్భరయా గిరా|
రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయ॥7929॥
18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
హస్తగ్రాహోఽపరో మాభూద్గృహీతాయాస్త్వయా హి మే|
ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః|
యదిదం కూపలగ్నాయా భవతో దర్శనం మమ॥7930॥
18.22 (ఇరువది రెండవ శ్లోకము)
న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ|
కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా॥7931॥
అంతట దేవయాని ప్రేమ పరవశయై , వీరుడగు యయాతితో మృదుమధురముగా ఇట్లనెను - "అజేయుడవైన ఓ మహారాజా! మొదఠిసారిగా ఇటుల నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరియొకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమాశాలీ! బావిలో పడియున్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన (మన ఇరువురి సంబంధము) దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినదికాదు. మహాబాహూ! నేనును, బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాపకారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు.
కచుడు బృహస్పతి కుమారుడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యునికడ మృతసంజీవని అను విద్య నభ్యసించెను. దేవయాని కచునిపై మనసు పడియుండెను. అతడు చదువు పూర్తిచేసికొని ఇంటికి వెళ్ళునప్పుడు దేవయాని తనను పెండ్లియాడుమని అతనిని కోరెను. గురుపుత్రియగు దేవయానిని వివాహము చేసికొనుటకు అతడు తిరస్కరించెను. అందులకు కుపితయైన దేవయాని "నీవు నేర్చిన విద్య నీకు పనిచేయకుండుగాక" అని అతనికి శాపమిచ్చెను. అంతట కచుడును 'బ్రాహ్మణుడెవ్వడును నిన్ను పత్నిగా స్వీకరించకుండునుగాక' అని ఆమెకు ప్రతిశాపమిచ్చెను.
18.23 (ఇరువది రెండవ శ్లోకము)
యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః|
మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః॥7932॥
అంతట యయాతి 'ఈ వివాహము శాస్త్రవిరుద్ధమే యైనను విధినిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సుగూడ ఆమె వైపు ఆకర్షితమైనది' అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను.
18.24(ఇరువది నాలుగవ శ్లోకము)
గతే రాజని సా వీరే తత్ర స్మ రుదతీ పితుః|
న్యవేదయత్తతః సర్వముక్తం శర్మిష్ఠయా కృతమ్॥7933॥
వీరుడైన యయాతి అచటినుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచు తన తండ్రి కడకు వెళ్ళెను. అనంతరము శర్మిష్ఠ చేసిన దష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపెను.
18.25(ఇరువది ఐదవ శ్లోకము)
దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్|
స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్॥7934॥
18.26 (ఇరువది ఆరవ శ్లోకము)
వృషపర్వా తమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితమ్|
గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయోః పతితః పథి॥7935॥
తన గారాలపట్టియగు దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడగు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యెను. పిమ్మట అతడు 'వృషపర్వునికడ పౌరోహిత్యమొనర్చుటకంటె, ఉంఛవృత్తి ద్వారా జీవించుటయే మేలు' అని తలంచెను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని, తన కుమార్తెతోగూడి అచటినుండి బయలుదేరెను. ఈ విషయము వృషపర్వునకు తెలిసెను. అప్పుడు అతడు 'ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో? తద్ద్వారా తనను శత్రువులు జయింతురేమో? లేదా ఆయన నన్ను శపించునేమో?' అని శంకించెను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయనకడకు చేరి, ఆయనను ప్రసన్నుని జేసికొనుటకై పాదములపై బడెను.
ఉంఛవృత్తి = ధాన్యందంపుడు రోళ్ళవద్ద పడిన గింజలు ఏరుకొని అవి తిని బ్రతుకుట. లేదా పంట కోసిన తరువాత పంట అక్కడనుండి తీసికొనిపోయిన తరువాత పొలంలో పడిన గింజలు ఏరుకుని భుక్తి గడపుట.
18.27 (ఇరువది ఏడవ శ్లోకము)
క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః|
కామోఽస్యాః క్రియతాం రాజన్ నైనాం త్యక్తుమిహోత్సహే॥7936॥
18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతమ్|
పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను॥7937॥
అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణకాలములోనే శాంతించెను. పిమ్మట పూజ్యుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను. "రాజా! నా ముద్దులపట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను. కనుక, ఆమె కోరినరీతిగా నడచుకొనవలెను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చెదను' అందులకు వృషపర్వుడు ఆమోదించెను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించెను. 'మా తండ్రి నన్ను ఎవరికైనను ఇచ్చి పెండ్లిచేసినను, లేక, నేను ఎచటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను".
18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవమ్|
దేవయానీం పర్యచరత్స్త్రీసహస్రేణ దాసవత్॥7938॥
అంతట శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకటపరిస్థితిని గమనించెను. దేవయాని కోరినట్లు చేయుటవలన కలిగెడి ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించెను. పిమ్మట ఆమె తన వేయిమంది పరిచారికలతోగూడి దేవయానికి సేవలు చేయసాగెను.
18.30 (ముప్పదియవ శ్లోకము)
నాహుషాయ సుతాం దత్త్వా సహ శర్మిష్ఠయోశనా|
తమాహ రాజన్ శర్మిష్ఠామాధాస్తల్పే న కర్హిచిత్॥7939॥
అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమెతో శర్మిష్ఠను గూడ దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను. "రాజా! శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోను తల్పముపై చేరనీయరాదు".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
యయాతి చరిత్రము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
విలోక్యౌశనసీం రాజంఛర్మిష్ఠా సప్రజాం క్వచిత్|
తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ॥7940॥
పరీక్షిన్మహారాజా! కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యెను. అంతట ఒకనాడు శర్మిష్ఠ తన ఋతుకాలమున రహస్యముగా యయాతిని పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించెను.
18.32 (ముప్పది రెండవ శ్లోకము)
రాజపుత్ర్యార్థితోఽపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్|
స్మరన్ఛుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత॥7941॥
అంతట ధర్మజ్లుడైన యయాతి రాజపుత్రికయైన శర్మిష్ఠయొక్క అభ్యర్థన (సంతానప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన) సముచితమైనదే యని భావించెను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష (ఎట్టి పరిస్థితిలోను నీవు ఈమెను చేరదీయరాదు - అను వచనములు) గుర్తునకు వచ్చినను, 'ప్రారబ్ధము ప్రకారము జరుగవలసినది జరుగును' అని భావించి, ఆమె కోరికనుదీర్చెను. (కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లొనర్చెను. దైవప్రాపితమేవ తత్సంగమ్ - అభ్యపద్యత - నతు కామతః (వీరరాఘవీయ వ్యాఖ్య)
18.33 (ముప్పది మూడవ శ్లోకము)
యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత|
ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ॥7942॥
దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అను ముగ్గురు కుమారులు కలిగిరి.
18.34 (ముప్పది నాలుగ శ్లోకము)
గర్భసంభవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానినీ|
దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛితా॥7943॥
18.35 (ముప్పది ఐదవ శ్లోకము)
ప్రియామనుగతః కామీ వచోభిరుపమంత్రయన్|
న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః॥7944॥
రాక్షస రాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతివలననే సంతానము ప్రాప్తించినట్లు ఎఱింగి, అహంకారవతియైన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి (తండ్రి కడకు) వెళ్ళెను. కామియైన (స్త్రీ లోలుడైన) యయాతియు తనకు ప్రాణప్రియయైన దేవయానిని అనుసరించి వెళ్ళెను. పిమ్మట అతడు ఆమె కాళ్ళుపట్టుకొని అనునయవచనములతో ప్రసన్నురాలిని చేసికొనుటకై ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యెను.
18.36 (ముప్పది ఆరవ శ్లోకము)
శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష|
త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణామ్॥7945॥
పిమ్మట శుక్రాచార్యుడు కుపితుడై "యయాతీ! నీవు స్త్రీ లోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి. ముసలితనము వలన మానవుని రూపము కళావిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించుగాక" అని పలికెను.
యయాతిరువాచ
18.37 (ముప్పది ఏడవ శ్లోకము)
అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరి స్మ తే|
వ్యత్యస్యతాం యథాకామం వయసా యోఽభిధాస్యతి॥7946॥
అప్పుడు యయాతి ఇట్లు పలికెను - బ్రాహ్మణోత్తమా! మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించినవాడను కాను (దేవయానితో నేను ఇంకను దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగునుగదా!" అంతట శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను- "యయాతీ! ఎవ్వరైనను మనస్ఫూర్తిగా తన యౌవనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి, నీవు సుఖముసు పొందవచ్చును".
18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత|
యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయః॥7947॥
18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహమ్|
వయసా భవదీయేన రంస్యే కతిపయాః సమాః॥7948॥
శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్దకుమారుడగు యదువుతో ఇట్లనెను- "నాయనా! మీ మాతామహుని (తల్లియొక్క తండ్రి) వలన ప్రాప్తించిన నా ముసలితనమును దీసికొని, నీ యౌవనమును నాకు ఇమ్ము. నేను ఇంకను విషయసుఖములయందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసికొనిన యౌవనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను.
యదురువాచ
18.40 (నలుబదియవ శ్లోకము)
నోత్సహే జరసా స్థాతుమంతరా ప్రాప్తయా తవ|
అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః॥7949॥
యదువు పలికెను - "తండ్రీ! నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్థక్యమును తీసికొనుటకు నేను సిద్ధముగా లేను. ఏలయన, మానవుడు విషయ సుఖములను అనుభవింపకముందే వైరాగ్యమును పొందజాలడు గదా!
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
18.41 (నలుబది ఒకటవ శ్లోకము)
తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత|
ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయః॥7950॥
పరీక్షిన్మహారాజా! యయాతి తన పుత్రులైన తుర్వసుని, ద్రుహ్యుని, అనువును గూడ ఇట్లే అర్థించెను. కాని అనిత్యమైన యౌవనమును శాశ్వతమని భావించుచున్న అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి.
18.42 (నలుబది రెండవ శ్లోకము)
అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికమ్|
న త్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి॥7951॥
అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికిని, గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరుని పిలిచి యయాతి ఇట్లడిగెను- "నాయనా! నీ అన్నలవలె నీవును నా కోరికను తిరస్కరింపవు గదా!"
పూరురువాచ
18.43 (నలుబది ఒకటవ శ్లోకము)
కో ను లోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్|
ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరమ్॥7952॥
18.44 (నలుబది నాలుగవ శ్లోకము)
ఉత్తమశ్చింతితం కుర్యాత్ప్రోక్తకారీ తు మధ్యమః|
అధమోఽశ్రద్ధయా కుర్యాదకర్తోచ్చరితం పితుః॥7953॥
పూరువు పలికెను "తండ్రీ! మహారాజా!పుత్రునియొక్క శరీరము (జన్మ) నిజముగా తండ్రినుండియే లభించినది. పైగా, తండ్రి అనుగ్రహము ఉన్నచో (సుతునకు) పరమపదము గూడ ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రియొక్క మనస్సెరిగి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రియాజ్ఞ యైనంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరసావహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలోని స్థితిలో అశ్రద్ధతో ఆచరించువాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించువాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పికొనుటకే అర్హుడు కాడు. యదార్థముగా అతడు పురీషప్రాయుడు.
18.45 (నలుబది ఐదవ శ్లోకము)
ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః|
సోఽపి తద్వయసా కామాన్ యథావజ్జుజుషే నృప॥7954॥
పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతట యయాతియు తన కుమారుడగు పూరుడు ఇచ్చిన యౌవనముతో తనివితీర సుఖములను అనుభవించెను.
18.46 (నలుబది ఆరవ శ్లోకము)
సప్తద్వీపపతిః సంయక్ పితృవత్పాలయన్ ప్రజాః|
యథోపజోషం విషయాంజుజుషేఽవ్యాహతేంద్రియః॥7955॥
అప్పుడు సప్తద్వీపాధిపతియైన యయాతి ప్రజలను తన కన్న బిడ్డలవలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియపటుత్వము కలిగియున్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోర్కెను దీర్చుకొనెను.
18.47 (నలుబది ఏడవ శ్లోకము)
దేవయాన్యప్యనుదినం మనోవాగ్దేహవస్తుభిః|
ప్రేయసః పరమాం ప్రీతిమువాహ ప్రేయసీ రహః॥7956॥
అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడగు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలొనర్చుచు, ఏకాంతముస ముద్దుమురిపెములతో సంతోషింపజేయుచుండెను.
18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః|
సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిమ్॥7957॥
వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాడ్రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు. ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలప్రదాత. అంతేగాదు తనను ఆరాధించిన వారియొక్క సకలబాధలను తొలగించువాడు ఆ పరమాత్మ.
క్రతుభిః సర్వదేవతా శరీరకం, ఆరాధక - ఆర్తిహరం, సర్వయజ్ఞారాధ్యం, తత్ఫలదం, తద్భోక్తారం భగవంతమ్ అయజత్ - (ఆరాధితవాన్) (వీరరాఘవీయ వ్యాఖ్య)
అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణల నొసంగి తృప్తి పరచెను.
హతో యజ్ఞస్త్వదక్షిణః = దక్షిణలను ఒసంగకుండ చేసెడి యజ్ఞము నిష్ఫలము (నీతిశాస్త్రము)
18.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః|
నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః॥7958॥
18.50 (ఏబదియవ శ్లోకము)
తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయమ్|
నారాయణమణీయాంసం నిరాశీరయజత్ప్రభుమ్॥7959॥
ఒక్కొక్కప్పుడు మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండును. మరియొకప్పుడు అవి అదృశ్యములగు చుండును. అట్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలోభాసిల్లుచుండును. మరియొకప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా - పాలనదశలో దేవమనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతమగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై, అవ్యక్తమగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథములవలె చంచలము, కల్పితము. శ్రీమన్నారాయణుడు సకలప్రాణుల హృదయములలో విరాజమానుడై యుండును. ఆస్వామి స్వరూపము సూక్ష్మాతిసూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి ఐన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామభావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను ఒనర్చెను.
18.51 (ఏబది ఒకటవ శ్లోకము)
ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనఃసుఖమ్|
విదధానోఽపి నాతృప్యత్సార్వభౌమః కదింద్రియైః॥7960॥