Friday, 19 August 2016

రుక్మిణీ సందేశము

రచయత :మల్లాప్రగడ రామకృష్ణ
పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!
(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. ఏవిధముగా పార్ధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదుకుంటాడని మనసు శాంతికి సాహకరిస్తాడని అందరి నమ్మకం అందుకే ఆరాధ్య దేవునిగా మారాడు.

మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -
"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"

సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.



రుక్మిణీ సందేశము (ఏడవభాగము)
(కృతజ్ఞతలు ...పిస్కా సత్యనారయణ హారు.)

ఆరవ పద్యము

లోపలి సౌధంబులోన వర్తింపంగఁ
....... దేవచ్చునే నిన్ను! దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి
....... కాని తేరాదని కమలనయన!
భావించితేని, నుపాయంబుఁ జెప్పెద
....... నాలింపు! కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ
....... బెండ్లికి మునుపడ బెండ్లికూతు

నెలమి మావారు పంపుదు, రేను నట్లు
పురము వెలువడి యేతెంచి, భూతనాథు
సతికి మ్రొక్కంగ, నీవు నా సమయమునకు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత

క్రిందటి పద్యములో రుక్మిణి తనను క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ వంశీమోహనుడికి విన్నవించింది. ఇప్పుడు ప్రస్తుత పద్యములో అందుకు తగిన సమయమూ, సందర్భమూ కూడా తానే సూచిస్తున్నది.

"ఓ కమలాక్షా! 'రాజనగరులోని అంతఃపురసౌధము లోపల సంచరించే నిన్ను హరించి తీసుకురావడం సులభమైన కార్యమా?! ఒకవేళ, అందుకు సిద్ధపడి వచ్చినా ద్వారపాలకులనూ, నీ చుట్టూ పరివేష్ఠించివున్న బంధుజనులనూ నిర్మూలించకుండా నిన్ను బైటకు తేవడం సాధ్యమా?' అని తలుస్తున్నావేమో! అందుకు నేనొక ఉపాయం చెప్తాను. చిత్తగించు! వివాహానికి ముందు వధువు చేత మా ఇలవేల్పు అయిన గౌరీదేవికి పూజ చేయించడం మా కుటుంబ ఆచారం. ఆ పద్ధతి ప్రకారం మావాళ్ళు నన్ను పెళ్ళికూతురును చేసిన పిదప, నగర పొలిమేరలలో ఉన్న పార్వతీదేవి మందిరానికి పంపుతారు. నేను నగరం వెలువడి వచ్చి భూతనాథుని సతికి మ్రొక్కే సమయానికి నీవు అక్కడికి చేరుకుని నన్ను తీసుకువెళ్ళు స్వామీ!" అని రుక్మిణి విన్నవిస్తున్నది.

వివాహానికి ముందు పెళ్ళికుమార్తె గౌరీపూజ చేయడం ఈనాటికీ ఆచారంగానే వస్తున్నది. పల్లెటూళ్ళలోనైతే జనులు ఊరి శివార్లలో ఉండే గ్రామదేవత పోచమ్మ గుడికి వెళ్ళి పూజలు సలుపుతారు. ఇదే ఆచారం రుక్మిణి పుట్టింటివారికి కూడా ఉన్నదన్నమాట!

పద్యం చివర్లో రుక్మిణి కృష్ణమూర్తిని "అవార్యచరిత!" అని సంబోధించింది. అనగా "అడ్డులేని నడవడి కలవాడా!" అని అర్థం. ' ఈ కార్యం సాధించుటలో నిన్ను వారించడానికి కానీ, ఎదుర్కోవడానికి కానీ ఎవరికీ సాధ్యం కాదు ' అనే ధ్వని ఆ సంబోధనలో గోచరిస్తున్నది

ఇప్పుడు ఏడవ పద్యాన్ని ఆస్వాదిద్దాము.



రుక్మిణీ కళ్యాణం:
. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు.
రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది.
రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది.
అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి.
ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది.
ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.




రుక్మిణీ సందేశము
.(వివరణ ..... శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)
నాలుగవ పద్యము
వ్రతముల్, దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్, హరి, జగత్కళ్యాణు గాంక్షించి చే
సితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక! ని
ర్జితులై బోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్
ఈ పద్యములో తన పూర్వజన్మ సుకృతఫలంగా శ్రీకృష్ణుడే తనకు భర్తగా లభించాలని రుక్మిణి కోరుకుంటున్నది.
వెనుకటి జన్మలలో నేను వ్రతములను, దేవతలకు, ఆచార్యులకు, బ్రాహ్మణులకు, జ్ఞానులకు సేవలను, దానధర్మాదులను సర్వేశ్వరుడైన శ్రీవిష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం చేసివుంటే, ఈ జన్మలో నాకు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడే ప్రాణనాథుడు కావాలనీ, శిశుపాలాది నీచులు ఆ యదువీరుని చేతిలో సంగరరంగాన నిర్జింపబడాలనీ రుక్మిణి ప్రార్థిస్తున్నది.
భగవంతుని ప్రీతి కొరకు ఆయనకు సేవాపరంగా కర్మలను ఆచరిస్తే, అవి  భగత్ప్రాప్తిని కలిగిస్తాయని శ్రుతులు, స్మృతులు బోధిస్తున్నాయి. పుణ్యకర్మల చేత భగవానుడు తృప్తినొందినప్పుడు, తానే జీవులను చేబట్టి తన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకే "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. కాబట్టి తన పూర్వజన్మ పుణ్యఫలమే తన మనోభీష్టాన్ని పూర్తిచేయగలదని రుక్మిణి విశ్వాసం!
"వసుదేవనందనుడు" అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆయనను "వాసుదేవుడు" అంటారు....... దశరథ పుత్రుడైన శ్రీరాముణ్ణి "దాశరథీ" అని సంబోధించడం కూడా ఇట్టిదే!రుక్మిణీ సందేశము
.
ఐదవ పద్యము
మరి, ఐదవ పద్యములో రుక్మిణి ఏమంటున్నదో చూడండి.
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది.
పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.
(మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.)
విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది.
వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి!
ఇకపోతే, వివాహాలు 8 రకములని పెద్దలు చెప్పారు. ఈ ఎనిమిదింటిని "అష్టవిధ వివాహములు" గా మన పూర్వులు వర్గీకరించారు.
1) బ్రాహ్మము : ప్రతిఫలాపేక్ష లేకుండా సాలంకృతయైన కన్యను సమర్థుడైన వరునకు ఇచ్చి వివాహం చేయడం.
2) దైవము : కన్యాదాత యజ్ఞం చేసి, ఋత్విక్కును పూజించి, అతనికి కన్యను ఇచ్చి పెళ్ళి చేయడం.
3) ఆర్షము : కన్య తల్లిదండ్రులు వరుని నుండి గోమిధునాన్ని స్వీకరించి, శాస్త్రవిధేయంగా కన్యను ఇచ్చి వివాహం చేయడం.
4) ప్రాజాపత్యము : ' నేను సంతానార్థం పెళ్ళి చేసికొని, గృహస్థాశ్రమధర్మాలు ఆచరిస్తాను ' అని వరునితో ప్రతిజ్ఞ చేయించి, కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళి చేయడం.
5) రాక్షసము : కన్య తనకు నచ్చినవానిని తనవారి అంగీకారం ఉన్నా, లేకపోయినా (వరునిచే బలాత్కారంగానైనా సరే తీసుకొని వెళ్ళబడి) వివాహం చేసుకోవడం.
6) ఆసురము: కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకోవడం.
7) గాంధర్వము: పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పర ప్రేమానురాగాలతో చేసుకొనే వివాహం.
8) పైశాచము: స్పృహలేని, తనను తాను రక్షించుకోలేని దశలో ఉన్న కన్యను, కేవలం కామదృష్టితో పెళ్ళి చేసుకోవడం.
వీటిలో గాంధర్వము, రాక్షసము అనేవి క్షత్రియులకు శాస్త్రసమ్మతమైనవని "మహాభారతము - ఆదిపర్వము" లో చెప్పబడింది - "గాంధర్వ రాక్షసే క్షత్రే ధర్మ్యౌతౌ మా విశంకిధాః" అని.
స్త్రీపురుషులు పరస్పరం ఒకరినొకరు ఇష్టపడి, రహస్యంగా వివాహం చేసుకోవడం ' గాంధర్వము ' అనబడుతుంది. "మహాభారతము" లో శకుంతలా దుష్యంతుల పరిణయం ఈ పద్ధతిలోనే జరిగింది.
పురుషుడు తనను ఇష్టపడిన స్త్రీని ఎత్తుకువెళ్ళి వివాహం చేసుకోవడం ' రాక్షసము ' గా చెప్పబడింది. "మహాభారతము" లోనే భీష్ముడు తన తమ్ముడైన విచిత్రవీర్యుని కొరకు కాశీరాజు కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరమంటపములోని రాజులందరినీ జయించి, హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపిస్తాడు. (వారిలో పెద్దదైన అంబ తాను సాళ్వుణ్ణి ప్రేమించానని చెప్తే, ఆమెను వెనక్కి పంపిస్తాడు.)
ఇటీవలి చారిత్రికకాలానికి వస్తే, జయచంద్రుని కుమార్తెయైన సంయుక్తను, పృథ్వీరాజు పైవిధంగా స్వయంవరమంటపము నుండి ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటనలు రాక్షసవివాహ పరిధిలోకి వస్తాయి.
ఇక్కడ రుక్మిణి సైతం తనను రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ దేవదేవుణ్ణి అర్థిస్తున్నది. అది క్షత్రియోచితమైన కార్యమే కనుక, ఎవరికీ ఆక్షేపించే అవకాశం లేదని ఆమె భావన.
ఇక, ఆరవ పద్యము.







 రుక్మిణి కుమారి శ్రీ కృష్ణుని పంపిన లేఖ.!
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.)

.
తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషి
సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు
స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు
ష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. ‘మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.
కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేతూ అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.
ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.
ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి.  కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.
రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు ణా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”.
నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.



రుక్మిణీ సందేశము (ఎనిమిదవభాగము)
(విశ్లేషణ...శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

ఏడవ పద్యము

ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱు జన్మంబులన్
నిను జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

నూఱు జన్మలెత్తినా సరే, తాను శ్రీకృష్ణుని సతిగానే ఉంటాననే దృఢనిశ్చయాన్ని రుక్మిణీదేవి ప్రకటిస్తున్నది ఈ పద్యములో!

"నా మనోనాయకుడవైన ఓ కృష్ణా! పెద్దలు, బుధులు తమ అజ్ఞానమును తొలగించుకోవడానికి శివునివలె ఎవరి పాదతీర్థమందు స్నానం చేయగోరుతారో, అట్టి నీ కృపకు నేను పాత్రురాలను కాకపోయినట్టయితే, నూఱు జన్మలను ఎత్తియైనా బ్రహ్మచర్య వ్రతదీక్షతో నిన్నే ధానిస్తూ ప్రాణాలను విడుస్తాను. ఇది సత్యం సుమా!" అంటున్నది రుక్మిణి.

ఈ పద్యములో "గౌరీశు మర్యాదన్" అని చెప్పారు పోతనామాత్యులు. అనగా, "పరమశివుని వలె" అని అర్థం! మరి, ఎందుకు ఆ విధంగా చెప్పారు?! "వైష్ణవానాం యథా శంభుః" అని వ్యాసభగవానుల సూక్తి. శంకరుడు ఎప్పుడూ ధ్యానముద్రలో, తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు మనకు! ఆయన సదా తన మనసులో మహావిష్ణువునే ధ్యానిస్తుంటాడట! నిజానికి, శివకేశవులకు భేదమే లేదు........ గోస్వామి తులసీదాసుగారు తమ "రామచరిత మానస్" లో, శివుడు సర్వదా రామనామ జపం చేస్తుంటాడని అనేకమార్లు స్పష్టంగా చెప్పారు.

"తమో" శబ్దానికి అజ్ఞానం, చీకటి, తమోగుణం, శోకం అని నానార్థాలు ఉన్నాయి. తమస్సు పారమార్థిక జ్ఞానాన్ని కలుగనీయదు. భగవంతుని పాదతీర్థమే ఆ తమస్సును తొలగించి జనులను పవిత్రులను చేస్తుంది. భగవత్పాదజలమే పావనగంగ! వామనావతార ఘట్టములో విష్ణుమూర్తి త్రివిక్రమరూపాన్ని దాల్చినప్పుడు, తన సత్యలోకానికి చేరిన ఆయన పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో ప్రక్షాళన చేశాడు. ఆ జలమే పవిత్రగంగగా భాసించినది. అందుకే గంగను "విష్ణుపాదోద్భవి" అనీ, "నారాయణుని పుత్రిక" అనీ వ్యవహరిస్తారు. ఈ ఘట్టమును పురస్కరించుకునే ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అయిన అన్నమయ్య "బ్రహ్మ కడిగిన పాదమూ" అని కీర్తించాడు భగీరథుని ప్రార్థన ఆలకించి, పరమశివుడు సైతం విష్ణుపాదోద్భవియైన గంగను తన శిరసున ధరించాడు.

"అభ్యాగతః స్వయం విష్ణుః" అనే పురాణోక్తిని అనుసరించి, ఈనాటికీ భారతీయ గృహస్థులు తమ ఇళ్ళకు విచ్చేసిన సాధుపుంగవుల పాదాలను కడిగి, పూజించి, ఆ పాదతీర్థాన్ని తమ శిరసులపై చల్లుకొని, లోనికి పుచ్చుకొని తమను, తమ గృహాలను పవిత్రం చేసుకోవడం లోక పరిపాటి!

ఇక్కడ మరొక సంగతి కూడా మనం విస్మరించకూడదు రుక్మిణి తాను శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది. కాని, 'ఆయన తనను ప్రేమిస్తాడా? ఆయన హృదయంలో తనకు స్థానం లభిస్తుందా?' అనే విషయాలు ఆమెకు తెలియవు. మాధవుడు తన మనవిని మన్నించి తనను చేరదీయకపోతే, తన పరిస్థితి ఏమిటి?! ఆభిజాత్యమూ, అభిమానమూ గల అతివకు అంతకన్నా అవమానం ఏముంటుంది? అటువంటి పరిస్థితే ఎదురైననాడు తనకు ప్రాణత్యాగమే శరణ్యమని రుక్మిణి తలంపు! తన మనస్సులోనైనా వేరొకరిని భర్తగా భావించలేననీ, వంద జన్మలెత్తినా వంశీధరుడే తన వల్లభుడనీ, అందుకు ఆటంకం ఏర్పడితే ఆయననే ధ్యానిస్తూ తన అసువులను అర్పిస్తాననీ చెప్తున్నది. పద్యము చివరిలో "నిక్కంబు ప్రాణేశ్వరా!" అని నొక్కి వక్కాణించడం రుక్మిణీదేవి తెగువను, సాహసాన్ని సూచిస్తున్నది. "ప్రాణేశ్వరా!" అనే సమయోచితమైన సంబోధన కూడా ఈ పద్యానికి మకుటాయమానమై ప్రకాశిస్తున్నది. తన ప్రాణాలకు అధినాథుడుగా భావించుకుంటున్న శ్రీకృష్ణుడు తనను కరుణించకపోతే, ప్రాణాలు తనువును వదిలివెళ్ళడం సహజమే కదా!

ఇంక, పరాత్పరునికి ప్రయాణించక తప్పదు మరి!

ఇంక, రుక్మిణీసందేశములోని చివరి పద్యం ఎలావుందో చూద్దాము.



రుక్మిణీ సందేశము (చివరిభాగము)
( కృతజ్ఞతలు ... శ్రీ పిస్కా సత్యనారయణ గారికి. వారి అద్బుత వివరణకు కు మా అభినందనలు.)

ఎనిమిదవ పద్యము

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని
........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
........ తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
........ చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?!
రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది.

"శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి.

మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి.  చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు.

ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం!

ఈ సందర్భములో, ఈ పద్యానికి సంబంధించిన నా స్వానుభవం ఒకటి ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను!........ నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి. చాలారోజుల నుండి, ఈ పద్యమును విన్నప్పుడల్లా నాలో ఒక సందేహం కదలాడుతూ ఉండేది. ఇది సీసపద్యం. సీసపద్యానికి 4 పాదాలు, చివరలో ఎత్తుగీతి ఉంటాయని మనందరికీ తెలిసినదే! ఐతే, పోతనగారు మొదటిపాదములో చెవులనూ, రెండవపాదములో తనువునూ, మూడవపాదములో నేత్రాలనూ, నాల్గవపాదములో జిహ్వనూ ప్రస్తావించి, ఎత్తుగీతిలో నాసిక గురించి చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, 'ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవయవమును అభివర్ణించిన కవీశ్వరులు, 2వ పాదములో మాత్రము సర్వావయవ సమ్మిళితమైన శరీరాన్ని ఎందుకు చెప్పారు?!... ఎత్తుగీతిలో ప్రస్తావించిన నాసికను 2వ పాదములో చెప్పి, తనువును ఎత్తుగీతిలో చెప్పివుంటే ఇంకా బాగా ఉండేది కదా!' అనుకునేవాడిని. సంపూర్ణమైన ఛందోజ్ఞానం నాకు లేకపోవడంచేత, 'ఒకవేళ సీసపద్యము యొక్క ఛందస్సు అందుకు అనుమతించలేదేమో!' అని నాకు నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఐనా, సంతృప్తి కలగక ఎవరైనా విజ్ఞులైనవారితో నా సందేహనివృత్తి చేసుకోవాలని అనుకున్నాను...... ఐతే, ఆశ్చర్యకరంగా నేను ఈ వ్యాసమును తయారుచేసుకునేటప్పుడే తటాలున మెరుపు మెరిసినట్టుగా నా సందేహానికి సమాధానం దొరికింది!

అదేమిటో వివరిస్తాను.

ఈ మానవ శరీరం పాంచభౌతికమైనదని ఇంతకుముందే చెప్పుకున్నాము. అనగా, పంచభూతముల మేళవింపుతో తయారైనదన్నమాట! పంచభూతములు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము మరియు భూమి. వీటి ఆవిర్భావం ఏ వరుసలో జరిగినదో "భాగవతము" లో విశదంగా ఉంది. ప్రథమంగా అనంతమైన ఆకాశం ఉండేది. తర్వాత వాయువు, ఆపైన అగ్ని, ఆ పిమ్మట నీరు, అటుపైన భూమి ఏర్పడినాయని "భాగవతము" చెప్తున్నది. ఈ పంచభూతముల యొక్క ప్రధానగుణములు సైతం "భాగవతము"లో చెప్పబడ్డాయి. అవి ఎలాగంటే, వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే గుణములు. అనగా, మొదటిదైన ఆకాశమునకు శబ్దగుణము, రెండవదైన వాయువుకు స్పర్శగుణము, మూడవదైన అగ్నికి రూపము, నాల్గవదైన నీటికి రసగుణము, చివరిదైన పుడమికి గంధగుణము ప్రధానమైనవని చెప్పారు మన మహర్షులు.

మనం చెప్పుకుంటున్న సీసపద్యములో పోతనామాత్యులు ఈ క్రమాన్నే పాటిస్తూ, వరుసగా ఒక్కొక్క పాదములో ఒక్కొక్క గుణానికి సంబంధించిన శరీరావయవమును వర్ణించారు. శబ్దగుణముకు ఆలంబనం కర్ణములు కనుక వాటిని మొదటిపాదములో, రెండవదైన స్పర్శగుణానికి ప్రాతినిధ్యం వహించేది చర్మమే కాబట్టి 2వ పాదములో తనువును, మూడవదైన రూపగుణానికి ప్రతినిధులుగా 3వ పాదములో నయనాలను, నాల్గవదైన రసగుణానికి 4వ పాదములో రసనను అనగా నాలుకను, చివరిదైన గంధగుణానికి ఆలంబనమైన నాసికను ఎత్తుగీతిలో పేర్కొన్నారు.

పైవిధంగా పర్యాలోచించి చూసుకుంటే, నా సందేహం మబ్బుతెరలా విడిపోయింది.

ఈ పద్యములో పురుషోత్తముని వనమాలికను ప్రస్తావించారు పోతనగారు. దీని గురించి ఒకమాట! ' వనమాలిక ' అంటే 5 రకముల పుష్పములతో కూర్చబడి, దేవదేవుని గళం నుండి చరణయుగళం దాకా (కంఠం నుండి పాదముల వరకు) వ్రేలాడుతూ ఉండే పూలమాల. దీనికే "వైజయంతిమాల" అని పేరు....... పరమ భాగవతోత్తముడైన విప్రనారాయణుడు ఈ వైజయంతిమాల అంశతోనే జన్మించినాడని అంటారు. సారంగు తమ్మయ అనే కవీశ్వరుడు విప్రనారాయణుని కథను "వైజయంతీ విలాసము" అనే పేరిట కావ్యంగా వెలయించాడు.

మొత్తం మీద రుక్మిణీసందేశములోని ఈ చివరి పద్యము రుక్మిణి దాస్యభక్తితో పాటు, పోతన కవితాశక్తిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది.

*** *** *** ***

రుక్మిణీసందేశ రూపకంగా ఉన్న 8 పద్యాలను నా చేతనైనంతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. సాహితీమిత్రులు నా ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను.




 


No comments:

Post a Comment