Friday, 1 April 2022

*2.4.2022 ప్రాతఃకాల సందేశము*

*తృతీయస్కంధము - నాలుగవ అధ్యాయము*

*విదురుడు ఉద్ధవుని వీడ్కొని మైత్రేయమహర్షి కడకు వెళ్ళుట*

*4.1 (ప్రథమ శ్లోకము)*

*అథ తే తదనుజ్ఞాతా భుక్త్వా పీత్వా చ వారుణీమ్|*

*తయా విభ్రంశితజ్ఞానా దురుక్తైర్మర్మ పస్పృశుః॥1306॥*

*ఉద్ధవుడు వచించెను* స్నానదానాదుల అనంతరము యాదవులు బ్రాహ్మణుల అనుజ్ఞను గైకొని, సుష్ఠుగా భుజించిరి. పిదప మదరాపానము చేసిరి. దాని ప్రభావమున వారు మత్తులో మునిగి యుక్తాయుక్త విచక్షణను కోల్పోయిరి. హృదయ విదారకముగా పరస్పరము దుర్భాషలాడుకొనిరి.

*4.2 (రెండవ శ్లోకము)*

*తేషాం మైరేయదోషేణ విషమీకృతచేతసామ్|*

*నిమ్లోచతి రవావాసీద్వేణూనామివ మర్దనమ్॥1307॥*

మద్యపాన ప్రభావముచే వారి బుద్ధులు భ్రష్టములాయెను. వెదురు కర్రలు పరస్పరము ఒరసికొనగా అగ్ని పుట్టినట్లుగా సూర్యాస్తమయమగునప్పటికి వేడెక్కి వారు ముష్టియుద్ధమునకు దిగిరి.

*4.3 (మూడవ శ్లోకము)*

*భగవాన్ స్వాత్మమాయాయా గతిం తామవలోక్య సః|*

*సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్॥1308॥*

అంతట కృష్ణభగవానుడు తన మాయయొక్క విచిత్రమైన పరాకాష్ఠగతిని జూచి, సరస్వతీనదీ జలములతో ఆచమించి, ఒక వృక్షచ్ఛాయలో (రావిచెట్టు నీడలో) ఆసీనుడయ్యెను.

*4.4 (నాలుగవ శ్లోకము)*

*అహం చోక్తో భగవతా ప్రపన్నార్తిహరేణ హ|*

*బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణా॥1309॥*

విదురా! శరణాగతుల ఆర్తులను తొలగించునట్టి శ్రీకృష్ణపరమాత్మ తనకు యాదవవంశమును నశింపజేయు సంకల్పము కలిగినంతనే నాతో (ఉద్దవునితో) బదరికాశ్రమమునకు వెళ్ళుము అని చెప్పియుండెను.

*4.5 (ఐదవ శ్లోకము)*

*అథాపి తదభిప్రేతం జానన్నహమరిందమ|*

*పృష్ణతోఽస్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః॥1310॥*

అంతశ్శత్రువులను జయించిన విదురా! శ్రీకృష్ణుని అభిప్రాయమును నేను ఎరిగియున్నప్పటికిని, ఆ స్వామి వియోగమునకు తట్టుకొనలేక, ఆయనవెంట ప్రభాసతీర్థమునకు వెళ్ళితిని.

*4.6 (ఆరవ శ్లోకము)*

*అద్రాక్షమేకమాసీనం విచిన్వన్ దయితం పతిమ్|*

*శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనమ్॥1311॥*

విదురా! నేను నాకు ఇష్టదైవమైన శ్రీనివాసుని మనస్సునందే ధ్యానించుచు ఆ స్వామి సరస్వతీ నదీ తీరమునందు ఒంటరిగా కూర్చొనియుండగా చూచితిని.  సకలప్రాణులకును ఆశ్రయమైన (నివాసస్థానమైన)  ఆ ప్రభువు అప్పుడు ప్రత్యేకమైన నివాసస్థానము లేకుండా అచట తాను ఒక్కడే యుండెను.

*4.7 (ఏడవ శ్లోకము)*

*శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనమ్|*

*దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశాంబరేణ చ॥1312॥*

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంఘ్రిసరోరుహమ్|*

*అపాశ్రితార్భకాశ్వత్థమకృశం త్యక్తపిప్పలమ్॥1313॥*

ఆ స్వామి స్వచ్ఛమైన శ్యామవర్ణముతో విరాజిల్లుచుండెను. రజోగుణస్పర్శ లేక గుణాతీతుడై ప్రశాంతముగా నుండెను. ఆ ప్రభువు నేత్రములు పద్మవర్ణమును కలిగియుండెను. ఆ పీతాంబరధారి చతుర్భుజుడై విలసిల్లుచుండుటను బట్టి దూరముననుండియే ఆయనను శ్రీకృష్ణపరమాత్మునిగా గుర్తించితిని. ఆ పురుషోత్తముడు తన ఎడమతొడపై దక్షిణపాదపద్మమును నిలిపి ఒక లేతనైన రావిమొక్కకడ తన వీపును ఆనించి కూర్చొనియుండెను. ఆ పరమపురుషుడు అన్నపానాదులను విడిచి పెట్టియున్ననూ పుష్టిగా ఆనందపూర్ణుడై యుండెను.

*4.9 (తొమ్మిదవ శోకము)*

*తస్మిన్ మహాభాగవతో ద్వైపాయనసుహృత్సఖా|*

*లోకాననుచరన్ సిద్ధ ఆససాద యదృచ్ఛయా॥1314॥*

ఆ సమయమున భాగవతశిరోమణియు, వ్యాసునకు అత్యంత ఆత్మీయుడు, స్నేహితుడు ఐన మైత్రేయ మహర్షి లోకసంచారమొనర్చుచు, తీర్థక్షేత్రములను సేవించుచు అప్రయత్నముగా అచటికి విచ్చేసెను.

*4.10 (పదియవ శ్లోకము)*

*తస్యానురక్తస్య మునేర్ముకుందః ఫ్రమోదభావానతకంధరస్య|*

*ఆశృణ్వతో మామనురాగహాససమీక్షయా విశ్రమయన్నువాచ॥1315॥*

మైత్రేయమహర్షి శ్రీకృష్ణునకు పరమభక్తుడు. అప్రయత్నముగా తనకు భగవద్దర్శనము ప్రాప్తించినందులకు సంతోషముతో ఎంతయు పొంగిపోయెను. భక్త్యావేశముతో అతడు వినమ్రగాత్రుడై యుండెను. ఆ మహాముని వినుచుండగా (ఆయన సమక్షమున) శ్రీకృష్ణుడు ప్రేమానురాగయుక్తమైన దరహాసపూర్వకమైన చూపులతో నన్ను ఆనందింప జేయుచు ఇట్లు పలికెను. ఆ స్వామి చూపిన ప్రేమానురాగములకు నా బడలికలు అన్నియు తొలగిపోయెను.

*శ్రీభగవానువాచ*

*4.11 (పదకొండవ శ్లోకము)*

*వేదాహమంతర్మనసీప్సితం త  దదామి యత్తద్దురవాపమన్యైః|*

*సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః॥1315॥*

*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! నీవు పూర్వజన్మయందు అష్టవసువులలో ఒకడవు. పూర్వము విశ్వమును సృజించు సమయమున ప్రజాపతుల - వసువుల యజ్ఞమునందు నన్ను పొందగోరి నీవు నా ఆరాధన సలిపితివి. నీ మనస్సులోని అభిలాషను నేను ఎఱుగుదును. కనుక, ఇతరులకు పొందశక్యముకాని ఆ కోరికను తీర్చెదను. అందుకు తగిన తత్త్వజ్ఞానమును అనుగ్రహించెదను. అది నా యెడ పరాఙ్ముఖులైన వారికి (నా చరణములను ఆరాధింపనివారికి) దుర్లభము.

*4.12 (పండ్రెండవ శ్లోకము)*

*స ఏష సాధో చరమో భవానామాసాదితస్తే మదనుగ్రహో యత్|*

*యన్మాం నృలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదృశ్వాన్ విశదానువృత్త్యా॥1316॥*

సాధుపురుషుడవైన ఉద్ధవా! నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవు ఐనందున ఇది నీకు చివరిజన్మ (నీకు ఇంక పునర్జన్మలేదు). నేను మర్త్యలోకమును వీడి పరంధామమునకు వెళ్ళుచున్నాను.  నీ అనన్యభక్తి కారణముననే దుర్లభమైన నా చతుర్భుజరూప దర్శనభాగ్యము అధృష్టవశమున నీకు అబ్బినది.

*4.13 (పదమూడవ శ్లోకము)*

*పురా మయా ప్రోక్తమజాయ నాభ్యే పద్మే నిషణ్ణాయ మమాదిసర్గే|*

*జ్ఞానం పరం మన్మహిమావభాసం యత్సూరయో భాగవతం వదంతి॥1317॥*

పూర్వము పద్మకల్పమునందు సృష్టిప్రారంభ సమయమున నా నాభికమలమునందు ఉపవిష్టుడైన బ్రహ్మకు నా మహిమలను ప్రకాశింపజేయు జ్ఞానమును ఉపదేశించితిని. దానిని వివేకవంతులు *భాగవతము* అని పేర్కొనిరి. దానినే ఇపుడు నీకు తెలుపుచున్నాను.

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహభాజనోఽహమ్|*

*స్నేహోత్థరోమా స్ఖలితాక్షరస్తం ముంచంఛుచః ప్రాంజలిరాబభాషే॥1318॥*

*ఉద్ధవుడు విదురునితో ఇట్లు పలికెను* విదురా! ఆ పరమపురుషుని కృప నాపై అనుక్షణమూ ప్రసరించుచునే యుండును. ఆ స్వామి సాదరముగా అట్లు పలుకగా భక్తిపారవశ్యమున నా తనువు పులకించెను. కంఠము రుద్ధమాయెను. నేత్రములనుండి అశ్రువులు స్రవింపసాగెను. అప్పుడు నేను ప్రాంజలినై ఇట్లు నుడివితిని-

*4.15 (పదిహేనవ శ్లోకము)*

*కో న్వీశ తే పాదసరోజభాజాం సుదుర్లభోఽర్థేషు చతుర్ష్వపీహ|*

*తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంభోజనిషేవణోత్సుకః॥1319॥*

ప్రభూ! నీ చరణకమలములను సేవించుచుండునట్టి పురుషులకు ఈ ప్రపంచమునందు చతుర్విధ పురుషార్థములలో దుర్లభమైనది ఏదియును లేదు (పురుషార్థములు అన్నియును సిద్ధించును). ఐనను నేను వాటిలో దేనినీ కోరుకొనుటలేదు. కేవలము నాకు నీ  పాదారవిందములను సేవించుటయందు నిరతియుండుట చాలును.

*శ్లో. నాఽఽస్థా ధర్మే, న వసునిచయే, నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపమ్|*

*ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతా జన్మ జన్మాంతరేఽపి త్వత్పాదాంభోజయుగళగతా నిశ్చలా భక్తిరస్తు॥* (ముకుందమాల)

*4.16 (పదునారవ శ్లోకము)*

*కర్మాణ్యనీహస్య భవోఽభవస్యతే దుర్గాశ్రయోఽథారిభయాత్పలాయనమ్|*

*కాలాత్మనో యత్ప్రమదాయుతాశ్రయః॥1320॥*

స్వామీ! నీకు ఎట్టి ఆసక్తి లేదు. నీవు అకర్తవు. కాని, నీవు కర్మలను ఆచరింతువు. జన్మరహితుడవైనను జన్మలను (అవతారములను) ఎత్తుచుందువు. కాలరూపుడవైనను జలదుర్గమును (ద్వారకను) ఆశ్రయించితివి. కాలయవనుడు మొదలగు శత్రువులకు భయపడి పలాయనము చిత్తగించితివి. స్వాత్మారాముడవైనను పదునారువేలమంది స్త్రీలతో గృహస్థాశ్రమమును నెరపితివి. ఈ నీ విచిత్రలీలలను జూచి విద్వాంసుల బుద్ధులు సైతము మోహపరవశమగుచున్నవి.

*4.17 (పదునేడవ శ్లోకము)*

*మంత్రేషు మాం వా ఉపహూయ యత్త్వమ్ అకుంఠితాఖండసదాత్మబోధః|*

*పృచ్ఛేః ప్రభో ముగ్ధ ఇవాప్రమత్తః తన్నో మనో మోహయతీవ దేవ॥1321॥*

దేవా! నీ స్వరూపజ్ఞానము మనోవాక్కులకు అతీతమైనది (దేశకాలాతీతమైనది). ప్రభూ! నీవు సర్వదా సావధానుడవై యుండువాడవు. ఐనను, అప్పుడప్పుడు నన్ను పిలిచి, ఏమీ తెలియని సామాన్యునివలె నాతో మంత్రాలోచన చేయుచుంటివి (సలహాలను తీసికొనుచుంటివి). ఈ నీ లీలలు నన్ను మోహములో ముంచి, భ్రమ పెట్టుచున్నవి.

*4.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*జ్ఞానం పరం స్వాత్మరహః ప్రకాశమ్ ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రమ్|*

*అపి క్షమం నో గ్రహణాయ భర్తః వదాంజసా యద్వృజినం తరేమ॥1322॥*

సర్వలోక పూజ్యుడవైన స్వామీ! నీ నిజస్వరూపమును ప్రకటించునట్టి శ్రేష్ఠమైన, సమగ్రమైన జ్ఞానమును పూర్వము నీవు బ్రహ్మదేవునకు ఉపదేశించితివి. నేను దానిని గ్రహించుటకు అర్హుడనైనచో, దయతో నాకు తెలుపుము. అట్టి జ్ఞానప్రభావమున నేను దుఃఖమయమైన ఈ సంసారసాగరమును సులభముగా దాటగలను.

*4.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఇత్యావేదితహార్దాయ మహ్యం  స భగవాన్ పరః|*

*ఆది దేశారవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిమ్॥1323॥*

విదురా! నేను నా మనస్సులోని అభిప్రాయమును ఈ విధముగా నివేదింపగనే, పరమపురుషుడు, అరవిందాక్షుడు ఐన శ్రీకృష్ణుడు తన పరిస్థితిని ప్రకటించెడి భాగవతమును నాకు ఉపదేశించెను.

*4.20 (ఇరువదవ శ్లోకము)*

*స ఏవమారాధితపాదతీర్థాత్ అధీతత్త్వాత్మవిబోధమార్గః|*

*ప్రణమ్య పాదౌ పరివృత్య దేవమ్ ఇహగతోఽహం విరహాతురాత్మా॥1324॥*

ఈ విధముగా పూజ్యపాదుడు, జగద్గురువు ఐన శ్రీకృష్ణప్రభువునుండి ఆత్మతత్త్వబోధకమైన భాగవతధర్మములను వింటిని. పిమ్మట ఆ స్వామి పాదపద్మములకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కారములను ఆచరించి, ఇక్కడికి వచ్చితిని. ఇప్పుడు నేను ఆ పురుషోత్తముని ఎడబాటును భరింపలేక వ్యాకులచిత్తుడనైతిని.

*4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*సోఽహం తద్దర్శనాహ్లాదవియోగార్తియుతః ప్రభో|*

*గమిష్యే దయితం తస్య బదర్యాశ్రమమండలమ్॥1325॥*

*4.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*యత్ర నారాయణో దేవో నరశ్చ భగవాన్ ఋషిః|*

*మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే లోకభావనౌ॥1326॥*

విదురా! నాకు ఆ సర్వేశ్వరునియొక్క దర్శనభాగ్యము కలిగినప్పుడు నేను ఎంతయు పొంగిపోయితిని. కాని, నేను ప్రస్తుతము ఆ యెడబాటునకు తట్టుకొనలేకయున్నాను. ఆ స్వామి ఆదేశానుసారము ఇప్పుడు నేను ఆ ప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన బదరికాశ్రమమునకు వెళ్ళెదను. ఆ పవిత్రప్రదేశమునందు  సర్వజ్ఞుడైన శ్రీహరి నరనారాయణుల రూపములలో లోకకల్యాణార్థమై దీర్ఘకాలికమగు కఠినమైన తపస్సును ఆచరించుచున్నాడు.

*శ్రీశుక ఉవాచ*^

*4.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుఃసహం వధమ్|*

*జ్ఞానేనాశమయత్క్షత్తా శోకముత్పతితం బుధః॥1327॥*

*శ్రీశుకుడు వచించెను* విదురుడు ఉద్ధవునినుండి దుస్సహమైన బంధుమిత్రుల మరణవార్తను విని, మిగుల శోకించెను. కానీ, అతడు తత్త్వజ్ఞానమువలన ఆ దుఃఖమునుండి బయటపడెను.

*4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*స తం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభః|*

*విశ్రంభాదభ్యధత్తేదం ముఖ్యం కృష్ణపరిగ్రహే॥1328॥*

శ్రీకృష్ణుని పరివారములో ముఖ్యుడు, భాగవతోత్తముడు అగు, ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుటకై సిద్ధపడుచుండగా కురుశ్రేష్డుడైన విదురుడు శ్రద్ధాపూర్వకముగా ఆయనతో ఇట్లనెను.

*విదుర ఉవాచ*

*4.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే|*

*వక్తుం భవాన్నోఽర్హతి యద్ధి విష్ణోః భృత్యాః స్వభృత్యార్థకృతశ్చరంతి॥1329॥*

*విదురుడు ఇట్లు పలికెను* ఉద్ధవా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు నీకు ఉపదేశించిన ఊత్క్రష్టమగు తన స్వరూపరహస్యజ్ఞానమును నాకు అనుగ్రహింపుము. ఏలయన, విష్ణుభక్తులు (భాగవతోత్తములు) ఎల్లప్పుడును తమ భక్తులకు హితమును చేకూర్చుటకై సంచరించు చుందురు గదా!

*ఉద్ధవ ఉవాచ*

*4.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నను తే తత్త్వసంరాధ్య ఋషిః కౌషారవోఽంతి మే|*

*సాక్షాద్భగవతాదిష్టో మర్త్యలోకం జిహాసతా॥1330॥*

*ఉద్దవుడు పలికెను*- విదురా! ఆ తత్త్వజ్ఞానము కొరకు నీవు మైత్రేయమహర్షిని సేవింపుము. ఈ మానవలోకమును వీడు సమయమున శ్రీకృష్ణభగవానుడు స్వయముగా నిన్ను గుర్తు చేసెను. తదుపరి నా సమక్షముననే మైత్రేయునితో స్వయముగా నీకు తత్త్వజ్ఞానమును బోధించుమని, అతనిని ఆదేశించెను.

*శ్రీశుక ఉవాచ*

*4.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఇతి సహ విదురేణ విశ్వమూర్తేః గుణకథయా సుధయా ప్లావితోరుతాపః|*

*క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోఽగాత్॥1331॥*

*శ్రీశుకుడు వచించెను*-ఉద్ధవుడు విదురునితో విశ్వమూర్తియగు శ్రీకృష్ణభగవానుని దివ్యగుణరూప కథనమనెడి అమృతపానము చేయుటచే శ్రీకృష్ణుని వియోగమువలన కలిగిన మనస్తాపమునుండి విముక్తుడయ్యెను. అంతట ప్రశాంతచిత్తుడైన ఉద్ధవునకు యమునానదీ తీరమునందు ఆ రాత్రి అంతయును క్షణకాలమువలె గడచిపోయెను. ప్రాతఃకాలమున అతడు అచటినుండి బయలుదేరివెళ్ళెను.

*రాజోవాచ* 

*4.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*నిధనముపగతేషు వృష్ణిభోజేష్వధిరథయూథపయూథపేషు ముఖ్యః|*

*స తు కథమవశిష్ట ఉద్ధవో యద్ హరిరపి తత్యజ ఆకృతిం త్ర్యధీశః॥1332॥*

*పరీక్షిన్మహారాజు అడిగెను*- శుకమహర్షీ! వృష్ణి, భోజ వంశములకు చెందిన అతిరథులు, సేనాపతులు అందరును మరణించిరి. అంతేగాక సర్వలోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు (శ్రీహరి) గూడ తన అవతారమును చాలించెను. కాని వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు ఎట్లు మిగిలిపోయెను. 

*శ్రీశుక ఉవాచ*

*4.29 (ఇరువది తొమ్మిదవ  శ్లోకము)*

*బ్రహ్మశాపాపదేశేన కాలేనామోఘవాంఛితః|*

*సంహృత్య స్వకులం సూనం త్యక్ష్యన్  దేహమచింతయత్॥1333॥*

*శ్రీశుకుడు పలికెను*- మహారాజా! సత్యసంకల్పుడు, కాలపురుషుడు ఐన శ్రీకృష్ణుడు బ్రాహ్మణశాపమిషతోతన ఇచ్ఛానుసారము యదువంశమును పూర్తగా నశింపజేసెను. పరంధామమునకు చేరుటకై తన లీలన ఉపసంహరింపజేయు సమయమున ఆ ప్రభువు ఇట్లు  ఆలోచించెను.

*4.30 (ముప్పదియవ శ్లోకము)*

*అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయమ్|*

*అర్హత్యుద్ధవ ఏవాద్ధా సంప్రత్యాత్మవతాం వరః॥1334॥*

నేను ఈ లోకమును విడిచి, పరంధామమునకు చేరిన పిమ్మట (నన్ను బోధించెడు) భాగవత జ్ఞానవిషయమును ఇతరులకు అందించుటకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడగు ఉద్ధవుడే నిశ్చయముగా అర్హుడు.

*4.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*నోద్ధవోఽణ్వపి మన్న్యూనో యద్గుణైర్నార్దితః ప్రభుః|*

*అతో మద్వయునం లోకం గ్రాహయన్నిహ తిష్ఠతు॥1335॥*

ఈ విషయమున ఉద్ధవుడు నాకంటె అణుమాత్రమూ (ఏమాత్రమూ) తీసిపోడు. ఏలయన, అతడు జితేంద్రియుడు. విషయాకర్షణలకు ఏమాత్రమూ తొణకడు. కనుక, మద్విషయజ్ఞానమును ఈ మర్త్యలోకమునకు బోధించుచు  కొంతకాలము వరకు ఇచటనే ఉండుగాక.

*4.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ఏవం త్రిలోకగురుణా సందిష్టః శబ్దయోనినా|*

*బదర్యాశ్రమమాసాద్య హరిమీజే సమాధినా॥1336॥*

వేదములకు మూలకారణము, జగద్గురుడు ఐన శ్రీకృష్ణపరమాత్మ ఇట్లు ఆదేశించిన పిమ్మట ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరి, సమాధియోగము ద్వారా శ్రీహరిని ఆరాధింపసాగెను.

*4.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*విదురోఽప్యుద్ధవాచ్ఛ్రుత్వా కృష్ణస్య పరమాత్మనః|*

*క్రీడయోపాత్తదేహస్య కర్మాణి శ్లాఘితాని చ॥1337॥*

కురుశ్రేష్ఠుడవైన పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణపరమాత్మ తన లీలలను ఈ లోకమున ప్రదర్శించుటకై అవతరించి, ప్రశంసనీయమైన కర్మలను నెరపెనని విదురుడు ఉద్ధవుని ద్వారా వినెను.

*4.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనమ్|*

*అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనామ్॥1338॥*

అట్లే పరమశివుడు ఈ లోకమునుండి అద్భుతముగా అంతర్ధానమయ్యెను. అట్లు ఆ స్వామి అంతర్హితుడగుటకు జ్ఞానులకు ధైర్యావహమయ్యెను. పశుతుల్యులైన అజ్ఞానులకు అట్లు దేహత్యాగమొనర్చుట మిగుల దుష్కరము.

*4.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ఆత్మానం చ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితమ్|*

*ధ్యాయన్ గతే భాగవతే రురోద ప్రేమవిహ్వలః॥1339॥*

భాగవతోత్తముడైన ఉద్ధవుడు వెళ్ళిపోయిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు పరంధామమును చేరుటకు ముందుగా తనను స్మరించెనని అతని ద్వారా తెలిసికొనిన విదురుడు తనపై శ్రీకృష్ణునకు గల వాత్సల్యమునకు పరమానందభరితుడై ఆ భగవంతుని ధ్యానించుచూ, ఆయన అవ్యాజమైన ప్రేమను తలంచుకొనుచు, అత్యంత ప్రేమవిహ్వలుడై వెక్కివెక్కి ఏడ్చెను.

*4.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*కాలింద్యాః కతిభిః సిద్ధ అహోభిర్భరతర్షభః|*

*ప్రాపద్యత స్వస్సరితం యత్ర మిత్రాసుతో మునిః॥1340॥*

అనంతరము భాగవత శిరోమణియైన విదురుడు యమునాతీర ప్రదేశమునుండి కొన్ని దినములకు గంగాతీరమునందు మైత్రేయమహర్షి ఉన్న చోటునకు చేరుకొనెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  చతుర్థోఽధ్యాయః*

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు *విదురుడు ఉద్ధవుని వీడ్కొని మైత్రేయమహర్షి కడకు వెళ్ళుట* యను నాలుగవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

 1.4.2022 సాయంకాల సందేశము

తృతీయస్కంధం - మూడవ అధ్యాయము

 శ్రీకృష్ణభగవానుని ఇతర లీలల వర్ణనము 

ఉద్ధవ ఉవాచ

3.1 (ప్రథమ శ్లోకము)

తతః స ఆగత్య పురం స్వపిత్రోశ్చికీర్షయా శం బలదేవసంయుతః|

నిపాత్య తుంగాద్రిపుయూథనాథం హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్వ్యామ్॥1278॥

ఉద్ధవుడు వచించెను అనంతరము బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు సుఖానందములను గూర్చుటకొరకు బలరామసమేతుడై మథురకు విచ్చేసెను. అచట శత్రువీరులకు నాయకుడైన కంసుని, సమున్నతమైన ఆసనమునుండి నేలమీదికి పడద్రోసెను. క్షణములోనే అసువులను కోల్పోయిన ఆ దుష్టుని కళేబరమును వేగముగా ఈడ్చివైచెను.

3.2 (రెండవ శ్లోకము)

సాందీపనేః సకృత్ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరమ్|

తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్॥1279॥

తన గురువైన సాందీపనిమహర్షి ఒకసారి చెప్పినంతనే శ్రీకృష్ణుడు వేదములను సాంగోపాంగముగా (షడంగాది ససితముగా) పుక్కిటబట్టెను. పిమ్మట ఆ స్వామి మృతుడైన గురుపుత్రుని పంచజనుడను రాక్షసుని ఉధరమునుండి (యమసదనము నుండి) సజీవునిగా తీసికొనివచ్చి, ఆ మహర్షికి గురుదక్షిణగా సమర్పించెను.

3.3 (మూడవ శ్లోకము)

సమాహుతా భీష్మకకన్యయా యే శ్రియః సవర్ణేన బుభూషయైషామ్|

గాంధర్వవృత్త్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని దధత్సుపర్ణః॥1280॥

భీష్మకమహారాజు కూతురైన రుక్మిణీదేవి లక్ష్మీదేవివలె అతిలోక సౌందర్యవతి (ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవియే). ఆమె వివాహనిమిత్తముగా రుక్మిచే ఆహ్వానింపబడిన శిశుపాలాదులు కుండిన నగరమునకు విచ్చేసిరి. రుక్మిణీదేవి సందేశమును అందుకొని కుండిన నగరమునకు శ్రీకృష్ణుడు ఏతెంచెను. కృష్ణభగవానుడు ఆ సందర్భమున తనను ఎదిరించిన శిశుపాలాదులయొక్క శిరస్సులపై తన పాదమును మోపి (వారిని ఓడించి), ఆమెను గాంధర్వ వివాహ విధానమున చేపట్టి గరుత్మంతుడు అమృతమును వలె ఆమెను తన రథముపై తీసికొనిపోయెను.

3.4 (నాలుగవ శ్లోకము)

కకుద్మతోఽవిద్ధనసో దమిత్వా స్వయంవరే నాగ్నజితీమువాహ|

తద్భగ్నమానానపి గృధ్యతోఽజ్ఞాన్ జఘ్నేఽక్షతః శస్త్రభృతః స్వశస్త్రైః॥1281॥

ముక్కుతాడు వేయనట్టి మిడిసిపడుచున్న ఏడు వృషభములను వశపరచుకొని, శ్రీకృష్ణుడు నగ్నజిత్తుయొక్క కుమార్తెయైన నాగ్నజితిని - అనగా సత్యాదేవిని పరిణయమాడెను. ఆ పొగరుబోతు వృషభములను అదుపు చేయుటలో భంగపడిన రాజులు ఆ విషయమున శ్రీకృష్ణుని విజయమును జూచి, అది తమకు అవమానకరముగా భావించిరి. నాగ్నజితిపై మనసు పెట్టుకొనిన ఆ మూర్ఖులు శస్త్రములను చేబూని ఆ స్వామిపై దాడికి దిగిరి. అంతట ఆ కృష్ణప్రభువు తాను వారిచేతిలో ఏమాత్రమూ గాయపడకుండా తన ఆయుధములతో వారిని హతమార్చెను.

3.5 (ఐదవ శ్లోకము)

ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయా విధిత్సురార్చ్ఛద్ ద్యుతరుం యదర్థే|

వజ్ర్యాద్రవత్తం సగణో రుషాంధః క్రీడామృగో నూనమయం వధూనామ్॥1282॥

నరకాసురుడు దేవమాతయైన అదితి యొక్క కుండలములు హరించియుండెను. శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి, ఆ కుండలములను చేజిక్కుంచుకొనెను. ఆ స్వామి వాటిని అదితిమాతకు సమర్పించుటకై స్వర్గమునకు వెళ్ళెను. ఆ ప్రభువు విషయలోలునివలె లీలలను నెఱపుచు సత్యభామ ప్రీతికొరకై స్వర్గముననున్న పారిజాతవృక్షమును పెకలించి తెచ్చెను. అందులకు శచీదేవి ప్రేరణవలన ఇంద్రుడు కోపావేశములో కనులు మూసికొనిపోయినవాడై తన సైన్యములతో ఆ జగత్ప్రభువు మీదికే యుద్ధమునకు పరుగిడెను. భగవానుడు తనకు చేసిన మేలు మరచిపోయి అతని స్త్రీ ప్రేరణతో అంతరమెరుగక కృష్ణభగవానునిపై యుద్ధమునకు సిద్ధపడిన ఇంద్రుడు నిజముగా స్త్రీలచేతిలో కీలుబొమ్మయే.

3.6 (ఆరవ శ్లోకము)

సుతం మృధే ఖం వపుషా గ్రసంతం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా|

ఆమంత్రితస్తత్తనయాయ శేషం దత్త్వా తదంతఃపురమావివేశ॥1283॥

తన శరీరబలముచేత ఆకాశమును గూడ మ్రింగివేయగల బలశాలియగు నరకాసురునియొక్క ఆగడములను సహింపక, శ్రీకృష్ణుడు తన చక్రాయుధముచే అతనిని వధించెను. పిమ్మట ఆ ప్రభువు నరకాసురుని తల్లియగు భూదేవి ప్రార్థనపై అతని (నరకాసురుని) యొక్క కుమారుడగు భగవదత్తునకు మిగిలిన రాజ్యమును అప్పగించి, అతని అంతఃపురమున ప్రవేశించెను.

3.7 (ఏడవ శ్లోకము)

తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుమ్|

ఉత్థాయ సద్యో జగృహుః ప్రహర్షవ్రీడానురాగప్రహితావలోకైః॥1284॥

నరకాసురుడు అపహరించి తీసికొనివచ్చిన రాజకన్యలు అతని అంతఃపురమున ఉండిరి. వారు దీనజనబాంధవుడైన శ్రీకృష్ణుని జూచినంతనే లేచి నిలబడిరి. ఆ పురుషోత్తముని వీక్షించినంతనే వారు హర్షముతో పొంగిపోయిరి. సిగ్గుదొంతరలలో మునిగిపోయిరి. అంతట ప్రేమానురాగములతో నిండిన చూపులతో ఆ ప్రభువును వరించిరి.

ఈ సందర్భమున భగవంతుడు ఎంతటి దయామయుడో, కృపాళుడో మనకు స్పష్టముగా బోధపడును - నరకాసురుడు పదునారువేలమంది రాజకన్యలను అపహరించి తన అంతఃపురమునందు బందీలను చేసెను. వారందరు రాజవంశములకు చెందినవారు. వారిని విడిపించుటకై శ్రీకృష్ణుడు నరకుని సంహరించిన పిమ్మట, వారిని విడిపించుటకై అంతఃపురమునకు చేరుకొనెను. అప్పుడు దీనజనబాంధవుడైన ఆ పురుషోత్తముని దివ్యమంగళవిగ్రహమును దర్శించిన ఆ రాజకన్యలందరు ఎంతో పరమానందభరితులైనారు. వెంటనే వారందరునూ "దిక్కులేని వారికి దేవుడే దిక్కు" అన్నట్లుగా ఆ ప్రభువు పాదపద్మములచెంత తమనుతాము సమర్పించుకొనిరి. ఏలయన, పరాయివాడు అపహరించినవారిని లోకములో వెరెవ్వరూ చేపట్టుటకు ముందుకురారు. సరికదా! వారిని వేలెత్తి చూపుదురు. పరిహసింతురు. అవహేళన చేయుదురు. తద్ద్వారా అమాయికలైన ఆ రాజకన్యల మనుగడ దుర్భరమైపోవును. కనుక అనాథులకు నాథుడు, ఆర్తజనపరాయణుడు, దీనజనశరణ్యుడు ఐన ఆ ప్రభువు వారి దైన్యస్థితిని గమనించి, వారినందరిని స్వయంగా తన జీవితములోనికే వారిని ఆహ్వానించి, అక్కున జేర్చుకొనెను. ఆహా! ఆ రాజకన్యలకు లభించిన భాగ్యమే భాగ్యము. వారి అదృష్టమును ఎంతని, ఏమని కొనియాడగలము. కావున, నిర్హేతుక కృపాళుడైన ఆ పరమాత్మ "నేను నీవాడనే ప్రభూ!" అని కోరిన ప్రతివ్యక్తిని అక్కునజేర్చుకొని తనవానిగా చేసుకొనును అనుటలో రవంతయు సందేహములేదు. ఇంత గొప్ప ఆత్మీయుడు, దీనజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు అగు పరమాత్మను జనులు ఏలభజించకుందురోగదా!

3.8 (ఎనిమిదవ శ్లోకము)

ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్|

సవిధం జగృహే పాణీననురూపః స్వమాయయా॥1285॥

శ్రీకృష్ణుడు ఆ విధముగా తనను వరించిన ఆ రాజకన్యలను వేర్వేఱు గృహములలో తన మాయాప్రభావమున వారి వారికి అనుగుణరూపములను ధరించి, ఒకే ముహూర్తమున విధ్యుక్తముగా పరిణయమాడెను.

3.9 (తొమ్మిదవ శ్లోకము)

తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని సర్వతః|

ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా॥1286॥

అట్లు చేపట్టిన రాజకన్యలలో ఒక్కొక్కరియందు తన లీలావిస్తారముకొరకు పదేసిమంది కుమారులను పొందెను. వారు అందరును అన్ని విధములుగా ఆ స్వామిని పోలియుండిరి.

3.10 (పదియవ శ్లోకము)

కాలమాగధశాల్వాదీననీకై రుంధతః పురమ్|

అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్॥1287॥

కాలయవనుడు, జరాసంధుడు, సాల్వుడు మొదలగువారు తమ సేనలతో మథురను, ద్వారకను ముట్టడించిరి. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు ముచుకుంద, భీమార్జునులకు తన దివ్యశక్తులను ఇచ్చి, వారిద్వారా ఆ కాలయవనాదులను మట్టుబెట్టెను.

3.11 (పదకొండవ శ్లోకము)

శంబరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ|

అన్యాంశ్చ దంతవక్త్రాదీనవధీత్కాంశ్చ ఘాతయత్॥1288॥

శంబరుడు, ద్వివిదుడు, బాణాసురుడు, మురాసురుడు, బల్వలుడు, దంతవక్త్రుడు మొదలగువారిని శ్రీకృష్ణుడు మృత్యుముఖమునకు చేర్చెను. వారిలో శంబరాదులను ప్రద్యుమ్నుడు, బలరాముడు మున్నగువారిద్వారా సంహరింపజేసెను. దంతవక్త్రాదులను తానే స్వయముగా తుదముట్టించెను.

3.12 (పండ్రెండవ శ్లోకము)

అథ తే భ్రాతృపుత్రాణాం పక్షయోః పతితాన్నృపాన్|

చచాల భూః కురుక్షేత్రం యేషామాపతతాం బలైః॥1289॥

విదురా! అనంతరము నీ సోదరులైన ధృతరాష్ట్రపాండరాజుల  యొక్క పుత్రులగు కౌరవుల, పాండవుల పక్షమున నిలిచి, యుద్ధమొనర్చిన రాజులను అందరిని శ్రీకృష్ణుడు వధింపజేసెను. ఆ రాజుల సేనల ధాటికి కురుక్షేత్రరణభూమి యంతయును దద్దరిల్లెను.

3.13 (పదమూడవ శ్లోకము)

సకర్ణదుఃశాసనసౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషమ్ |

సుయోధనం సానుచరం శయానం భగ్నోరుముర్వ్యాం న ననంద పశ్యన్॥1290॥

కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మున్నగువారి యొక్క కపటసూచనల కారణముగా దుర్యోధనుడు తన రాజ్యసంపదను, ఆయువును కోల్పోయెను. భీమసేనుడు తన గదాప్రహారముచే అతనియొక్క తొడలను భగ్నమొనర్చెను. ఆ దుర్యోధనుడు తన అనుచరులతో గూడి రణరంగమున పడియుండుటను జూచియు (భూభారము పూర్తిగా తొలగిపోనందులకు) శ్రీకృష్ణుడు తృప్తిచెందలేదు.

3.14 (పదునాలుగవ శ్లోకము)

కియాన్భువోఽయం క్షపితోరుభార యద్ద్రోణభీష్మార్జునభీమమూలైః|

అష్టాదశాక్షౌహిణికో మదంశైరాస్తే బలం దుర్విషహం యదూనామ్॥1291॥

ఆ ప్రభువు (శ్రీకృష్ణుడు) ఇట్లు ఆలోచింపసాగెను - భీష్మద్రోణ భీమార్జునులద్వారా పదునెనిమిది అక్షౌహిణుల సైన్యము నశించినను, తగ్గిపోయిన భూభారము మాత్రము  స్వల్పమే. మదంశసంభూతులైన ప్రద్యుమ్నాదుల వలన వృద్ధిపొందినది. దుస్సహమైనదియగు యాదవుల బలము మాత్రము ఇంకను మిగిలియేయున్నది.

3.15 (పదిహేనవ శ్లోకము)

మిథో యదైషాం భవితా వివాద  మధ్వామదాతామ్రవిలోచనానామ్| .

నైషాం వధోపాయ ఇయానతోఽన్యో మయ్యుద్యతేఽన్తర్దధతే స్వయం స్మ॥1292॥

మద్యపానముచే మత్తిల్లి, ఎర్రబారిన కనులుగలవారై యాదవులు తమలోతాము కలహించుకొనినప్పుడే వారు నశింతురు. యాదవుల వినాశనమునకు ఇంతకంటె మరియొక ఉపాయములేదు. వాస్తవముగా నేను సంకల్పించినచో తమంతటతాము వీరు నశించిపోవుదురు'.

3.16 (పదహారవ శ్లోకము)

ఏవం సంచింత్య భగవాన్స్వరాజ్యే స్థాప్య ధర్మజమ్|

నందయామాస సుహృదః సాధూనాం వర్త్మ దర్శయన్॥1293॥

ఈ విధముగా నిశ్చయించుకొని, శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజును అతని రాజ్యసింహాసనమున పట్టాభిషిక్తుని గావించెను. అనంతరము ఆ ప్రభువు సత్పురుషుల మార్గమును (వర్ణాశ్రమ ధర్మమర్యాదను) స్వానుష్ఠాన పూర్వకముగా లోకమున నిలిపి,బంధుమిత్రులను ఆనందింపజేసెను.

3.17 (పదిహేడవ శ్లోకము)

ఉత్తరాయాం ధృతః పూరోర్వంశః సాధ్వభిమన్యునా|

స వై ద్రౌణ్యస్త్రసంచ్ఛిన్నః పునర్భగవతా ధృతః॥1294॥

ఉత్తరయొక్క గర్భమునందు అభిమన్యునివలన ఏర్పడిన పూరువంశాంకురము వృద్ధిచెందుచుండెను. అది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో దెబ్బతీసెను. కృష్ణపరమాత్మ దానిని (ఉత్తర గర్భస్థ పిండమును) సురక్షితము గావించెను.

3.18 (పదునెనిమిదవ శ్లోకము)

అయాజయద్ధర్మసుతమశ్వమేధైస్త్రిభిర్విభుః|

సోఽపి క్ష్మామనుజై రక్షన్ రేమే కృష్ణమనువ్రతః॥1295॥

శ్రీకృష్ణుడు ధర్మరాజుచేత మూడు పర్యాయములు అశ్వమేధయాగమును చేయించెను. ధర్మరాజుగూడ కృష్ణప్రభువును సేవించుచు, ఆయన చూపిన ధర్మమార్గమును అనుసరించుచు తన సోదరుల అండదండలతో రాజ్యమును పాలించుచు హాయిగా ఉండెను.

3.19 (పందొమ్మిదవ శ్లోకము)

భగవానపి విశ్వాత్మా లోకవేదపథానుగః|

కామాన్ సిషేవే ద్వార్వత్యామసక్తః సాంఖ్యమాస్థితః॥1296॥

విశ్వమునందలి సకలప్రాణులలో అంతరాత్మగా విరాజిల్లుచుండెడి భగవానుడు (శ్రీకృష్ణుడు) ద్వారకయందు వసియించుచు లోక, వేదమర్యాదలను పాటించుచు (శ్రౌత-స్మార్త ధర్మములను అనుసరించుచు) ఉండెను. ముముక్షువులను (మోక్షార్థులకు) ఉపాస్యమైన సాంఖ్యయోగమును (ప్రకృతి పురుషులను గూర్చిన జ్ఞానమును) అనుసరించుచు శబ్దాది విషయములయందు అనాసక్తుడై తన కల్యాణగుణ సంపదతో వర్ధిల్లెను.

3.20 (ఇరువదియవ శ్లోకము)

స్నిగ్ద్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా|

చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా॥1297॥

3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఇమం లోకమముం చైవ రమయన్ సుతరాం యదూన్|

రేమే క్షణదయా దత్తక్షణస్త్రీక్షణసౌహృదః॥1298॥

కృష్ణభగవానుడు నిరంతరము మధురదరహాసములతో  విరాజిల్లు చుండును. ఆ స్వామి పలుకులు అమృత ప్రాయములు. చరితము అనవద్యము (నిర్మలము). ఆ ప్రభువు సకల శోభలకును, అందచందములకును, లక్ష్మీదేవికిని నివాసమైన తన శరీరముతో ఇహపర లోకములను, విశేషముగా యాదవులను ఆనందింపజేసెను. రాత్రులయందు ఆ స్వామి క్షణకాలము తన భార్యయందు ప్రేమానురాగములను ప్రదర్శించుచు వారినిగూడ సంతోషపెట్టెను.

3.22 (ఇరువది రెండవ శ్లోకము)

తస్యైవం రమమాణస్య సంవత్సరగణాన్ బహూన్|

గృహమేధేషు యోగేషు విరాగః సమజాయత॥1299॥

ఈ విధముగా పెక్కు సంవత్సరములు అనాసక్తితో విహరించుచు గడిపిన పిమ్మట శ్రీకృష్ణప్రభువునకు గృహస్థాశ్రమ ధర్మములయెడ వైరాగ్యము ఏర్పడెను.

3.23 (ఇరువది మూడవ శ్లోకము)

దైవాధీనేషు కామేషు దైవాధీనః స్వయం పుమాన్|

కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రతః॥1300॥

సకలయోగములకు భగవంతుడే ఫలప్రదాత. సమస్తభోగములను ఆయన అధీనములోనే యుండును. అట్టి కృష్ణభగవానుడే సాంసారిక విషయములయందు ఉదాసీనుడై యున్నప్పుడు, ఆ స్వామిని భక్తియోగముద్వారా సేవించుచుండునట్టి భక్తుడు ఆ సాంసారిక విషయములను ఎట్లు విశ్వసించును?

3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

పుర్యాం కదాచిత్క్రీడద్భిర్యదుభోజకుమారకైః|

కోపితా మునయః శేపుర్భగవన్మతకోవిదాః॥1301॥

ఒకానొకప్పుడు ద్వారకానగరమునందు యదువంశమునకును, భోజవంశమునకును చెందిన బాలకుల ఆటపాటలలో మునిగియుండిరి. అప్పుడు వారు కొంతమంది ఋషులకు కోపమును కలిగించిరి. భగవత్సంకల్పమును బాగుగా ఎరిగిన మునులు వారిని శపించిరి.

3.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తతః కతిపయైర్మాసైర్వృష్ణిభోజాంధకాదయః|

యయుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవవిమోహితాః॥1302॥

కొద్ది మాసముల పిమ్మట వృష్ణి-భోజ-అంధక మొదలగు వంశములకు చెందినవారు దైవమాయ వలన మదోన్మత్తులై రథములనెక్కి ప్రభాసతీర్థమునకు వెళ్ళిరి.

3.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తత్ర స్నాత్వా పితౄన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభసా|

తర్పయిత్వాథ విప్రేభ్యో గావో బహుగుణా దదుః॥1303॥

వారు అచట తీర్థస్నానములను ఆచరించి, పితృదేవతలకును, దేవతలకును, ఋషులకును ఆ పవిత్రజలములతో విధ్యుక్తముగా తర్పణములను విడిచిరి. ఇంకను వారు బ్రాహ్మణోత్తములకు శ్రేష్ఠమైన గోవులను దానము చేసిరి.

3.27 (ఇరువది ఏడవ శ్లోకము)

హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకంబలాన్|

యానం రథానిభాన్కన్యా ధరాం వృత్తికరీమపి॥1304॥

3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

అన్నం చోరురసం తేభ్యో దత్త్వా భగవదర్పణమ్|

గోవిప్రార్థాసవః శూరాః ప్రణేముర్భువి మూర్ధభిః॥1305॥

మరియు వారు వెండి, బంగారములను, శయ్యలను, వస్త్రములను, మృగచర్మములను, కంబళములను, యానములను (పల్లకీలు మున్నగువాటిని), రథములను, ఏనుగులను, కన్యలను, జీవనమునకు ఉపయుక్తములగు భూములను, మృష్టాన్నములను భగవదర్పణముగా భూసురోత్తములకు దానములను ఒసంగిరి. గోవుల కొరకును, విప్రులకొరకును ప్రాణములను అర్పించిరి. ఆ శూరులు వారికి సాష్టాంగ నమస్కారములను గావించిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధేవిదురోద్ధవసంవాదే తృతీయోఽధ్యాయః (3)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందలి శ్రీకృష్ణభగవానుని ఇతర లీలల వర్ణనము అను మూడవ అధ్యాయము (3).

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.3.2022 సాయంకాల సందేశము

తృతీయ స్కంధము - ప్రథమాధ్యాయము

ఉద్ధవునితో విదురుని సమాగమము

శ్రీశుక ఉవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల|

క్షత్త్రా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్॥1199॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! విదురుడు పరమభాగవతోత్తముడు. కౌరవ ప్రధానసలహాదారుడు. అతడు సుసంపన్నమైన తన గృహమును త్యజించి, బంధుమిత్రులను వీడి వైరాగ్యముతో వనములకు చేరెను. అచ్చట భగవత్స్వరూపుడైన మైత్రేయ మహామునితో సమాగమము జరిగెను. విదురుడు  ఆధ్యాత్మిక విషయములను గూర్చి ఆ మహర్షిని ప్రశ్నించెను.

1.2 (రెండవ శ్లోకము)

యద్వా అయం మంత్రకృద్వో భగవానఖిలేశ్వరః|

పౌరవేంద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతమ్॥1200॥

విదురుడు అనన్యభక్తుడు, భగవత్కృపకు పాత్రుడైనవాడు. శ్రీకృష్ణభగవానుడు పాండవులదూతగా హస్తినాపురమునకు వెళ్ళినప్పుడు ఆ స్వామి దుర్యోధనుని ఆతిథ్యమును స్వీకరింపక నేరుగా విదురుని గృహమునకు వెళ్ళెను.

శ్రీకృష్ణభగవానుని విదురుని ఆతిథ్యమును స్వీకరించుటకై ఆయన గృహమునకు వెళ్ళెను. దైవభక్తి తత్పరురాలైన విదురుని భార్య భక్తిపారవశ్యమున అరటిపండ్లను పడవేయుచు, తొక్కలనే ఆ స్వామికి నివేదన గావించెను. శ్రీకృష్ణుడు ఆప్యాయతతో వాటినే ఆరగించెను. ఈ కథ సుప్రసిద్ధము. భావగ్రాహీజనార్దనః అను వచనము లోకవిదితమేగదా!

రాజోవాచ

1.3 (మూడవ శ్లోకము)

కుత్ర క్షత్తుర్భగవతా మైత్రేయేణాస సంగమః|

కదా వా సహ సంవాద ఏతద్వర్ణయ నః ప్రభో॥1201॥

1.4 (నాలుగవ శ్లోకము)

న హ్యల్పార్థోదయస్తస్య విదురస్యామలాత్మనః|

తస్మిన్ వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః॥1202॥

పరీక్షిన్మహారాజు వచించెను శుకమహర్షీ! పరమభాగవతోత్తముడైన మైత్రేయ మహామునితో విదురుని సంభాషణము ఎచ్చట? ఎప్పుడు జరిగినది? దయతో వివరింపుము. విదురుని హృదయము మిక్కిలి నిర్మలమైనది. మైత్రేయునితో అతడు సాధారణ విషయములను గూర్చి ప్రశ్నించియుండడు. వాస్తవముగా ఆ ఇరువురి మధ్య భగవత్సంబంధమైన విషయములను గూర్చి మంగళకరమైన మాటలతో కూడిన చర్చయే జరిగియుండవచ్చును. అంతేగాక, మహిమాన్వితమైన విదురుని ప్రశ్నను వర్ధిల్లజేయుచూ మైత్రేయుడు బాగు, బాగు అని ప్రశంసించెను. కావున దయచేసి వారిద్దరిమధ్య జరిగిన సంభాషణమునుగూర్చి సాధు వచనములతో వివరింపుము.

సూత ఉవాచ

1.5  (ఐదవ శ్లోకము)

స ఏవమృషివర్యోఽయం పృష్టో రాజ్ఞా పరీక్షితా|

ప్రత్యాహ తం సుబహువిత్ప్రీతాత్మా శ్రూయతామితి॥1203॥

సూతుడు నుడివెను పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నింపగా సర్వజ్ఞుడైన శుకయోగి మిక్కిలి ప్రసన్నుడై సరే వినుము అని పలికెను.

శ్రీశుక ఉవాచ

1.6 (ఆరవ శ్లోకము)

యదా తు రాజా స్వసుతానసాధూన్ పుష్ణన్నధర్మేణ వినష్టదృష్టిః|

భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లాక్షాభవనే దదాహ॥1204॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధనుడు మున్నగువారు మిగుల దుష్టస్వభావముగలవారు. ఐనను, అతడు అధర్మవర్తనుడై తన తనయులచే సమర్థించుచుండెను. ఏలయన అతనికి బాహ్యదృష్టితో పాటు అంతర్దృష్టియు (విచక్షణాజ్ఞానముగూడ) లోపించియుండెను. దుర్యోధనుని సూచనలను పాటించి, అతడు పాండవులను లక్కయింటిలో ప్రవేశపెట్టి వారిని అగ్నికి ఆహుతి చేయుటకై యత్నించెను.

1.7 (ఏడవ శ్లోకము)

యదా సభాయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మ గర్హ్యమ్|

న వారయామాస నృపః స్నుషాయాః స్వాస్రైర్హరంత్యాః కుచకుంకుమాని॥1205॥

దుర్యోధనుని ఆదేశమును అనుసరించి, దుశ్శాసనుడు పాండవపత్నియైన ద్రౌపదీదేవియొక్క కేశములను పట్టుకొని లాగుకొనివచ్చి, నిండుసభలో అవమానించెను. అప్పుడు ఆ పాండవ పట్టమహిషి ఆ అవమానమును భరింపలేక తన దుఃఖాశ్రువులతో వక్షస్థలమునందలి  కుంకుమలు కడిగివేయబడునట్లుగా కన్నీరుమున్నీరుగా విలపించెను. అప్పుడు ధృతరాష్ట్రుడు తన సమక్షమునందే తన కోడలైన ద్రౌపదీదేవికీ జరిగిన నిందింపదగిన కార్యమును గమనించుచున్నను, అతడు తన కుమారుల దుశ్చర్యలను నివారింపలేదు.

1.8 (మూడవ శ్లోకము)

ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలంబస్య వనాగతస్య|

న యాచతోఽదాత్సమయేన దాయం తమో జుషాణో యదజాతశత్రోః॥1206॥

అనంతరము దుర్యోధనాదులు కపటద్యూతమున అన్యాయముగా ఓడించి, సాధుస్వభావుడైన ధర్మరాజు రాజ్యమును అపహరించిరి. ధర్మమునకు కట్టుబడి వనవాసమును ముగించుకొనివచ్చిన పాండవులు న్యాయోచితముగా తమకు చెందవలసిన రాజ్యభాగమును తమకు ఇమ్మని కోరిరి. అప్పుడుగూడ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహ కారణముగా ధర్మము తప్పినవాడై, ఆ అజాతశత్రువగు ధర్మరాజుయొక్క రాజ్యభాగమును అతనికి ఇయ్యలేదు.

1.9 (తొమ్మిదవ శ్లోకము)

యదా చ పార్థప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణః|

న తాని పుంసామమృతాయనాని రాజోరు మేనే క్షతపుణ్యలేశః॥1207॥

జగద్గురువైన శ్రీకృష్ణుడు పాండవుల ప్రేరణపై రాయబారిగా వెళ్ళి, కౌరవసభలో ధర్మవచనములను పలికెను. ఆ మాటలు భీష్మద్రోణాదులకు అమృతప్రాయముగా తోచెను. కాని,  తనకు మిగిలిన కొద్దిపాటి పుణ్యముకూడా నశించిపోయిన ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుని న్యాయవచనములను ఎంతమాత్రము ఆదరింపలేదు.

1.10 (పదియవ శ్లోకము)

యదోపహూతో భవనం ప్రవిష్టో మంత్రాయ పృష్టః కిల పూర్వజేన|

అథాహ తన్మంత్రదృశాం వరీయాన్ యన్మంత్రిణో వైదురికం వదంతి॥1208॥

ధృతరాష్ట్రుడు సమయోచితమైన ఆలోచనకొరకు విదురుని తన సభాభవనమునకు ఆహ్వానించి, తగిన సలహా ఇమ్మని కోరెను. నీతిశాస్త్ర కోవిదుడైన విదురుడు తన అన్నకు సముచితమైన సూచనలను ఇచ్చెను. రాజనీతిశాస్త్రమునందు  ఆరితేరినవారు ఆ పలుకులను విదురనీతి గా వచింతురు.

1.11 (పదకొండవ శ్లోకము)

అజాతశత్రోః ప్రతియచ్ఛ దాయం తితిక్షతో దుర్విషహం తవాగః|

సహానుజో యత్ర వృకోదరాహిః శ్వసన్ రుషా యత్త్వమలం బిభేషి॥1209॥

విదురుడు పలికెను "అన్నా! ధృతరాష్ట్రా! అజాతశత్రువైన ధర్మరాజునెడ నీవు ఒనర్చిన అపరాధములు దుస్సహములు (సహింపరానివి). అతడు శాంతమూర్తియై వాటిని అన్నింటిని ఓర్చుకొనెను. కనుక, అతని రాజ్యభాగమును అతనికి ఇచ్చుట ఎంతయు న్యాయము. భీముడు తన తమ్ములతోగూడి నీపై పగదీర్చుకొనుటకు కోపముతో బుసలుగొట్టుచున్నాడు. అతనికి నీవుగూడ భయపడుదువుగదా!

1.12 (పండ్రెండవ శ్లోకము)

పార్థాంస్తు దేవో భగవాన్ముకుందోగృహీతవాన్ సక్షితిదేవదేవః|

ఆస్తే స్వపుర్యాం యదుదేవదేవో వినిర్జితాశేషనృదేవదేవః॥1210॥

సమగ్రజ్ఞాననిధియైన మోక్షప్రదాతయగు శ్రీకృష్ణుడు యదువీరులైన సాత్యకి, ప్రద్యుమ్న - అనిరుద్ధాదులకు ఆరాధ్యుడు (యాదవవీరులు అందఱును అతని  అదుపులోగలరు). ఆ ప్రభువు భూమండలమునగల రాజులందఱిని అవలీలగా జయించినవాడు. పైగా ఆ స్వామి భూసురులకును, ఇంద్రాది దేవతలకును పూజ్యుడు. అట్టి శ్రీకృష్ణభగవానుడు పాండవులను తన ఆత్మీయులుగా తలంచుచున్నాడు. ఆ పురుషోత్తముడు తన రాజధానియైన ద్వారకానగరమునందు ఉన్నను సర్వదా పాండవులకు అండదండగా నిలిచియున్నాడు.

1.13 (పదమూడవ శ్లోకము)

స ఏష దోషః పురుషద్విడాస్తేగృహాన్ ప్రవిష్టో యమపత్యమత్యా|

పుష్ణాసి కృష్ణాద్విముఖో గతశ్రీః త్యజాశ్వశైవం కులకౌశలాయ॥1211॥

అన్నా! ధృతరాష్ట్రా! నీ కుమారుడైన దుర్యోధనుడు పాపాలపుట్ట. అతడు పురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని యెడ వైరభావముతో ఉన్నాడు. పుత్రరూపమున నీ యింట అడుగినవాడు. అట్టి వానియెడల పుత్రమమకారముతో అతడు చెప్పిన వాటికి అన్నింటికిని నీవు తలయూపుచున్నావు. కృష్ణపరమాత్మయెడ విముఖుడైనవాడు రాజ్యమును, సంపదలను కోల్పోవుట తథ్యము. కావున, నీవు వంశక్షేమమునకై వెంటనే అతని నొక్కడినే పరిత్యజింపుము (అతని మాటలను పాటింపకుము".

1.14 (పదునాలుగవ శ్లోకము)

ఇత్యూచివాంస్తత్ర సుయోధనేన ప్రవృద్ధకోపస్ఫురితాధరేణ|

అసత్కృతః సత్స్పృహణీయశీలః క్షత్తా సకర్ణానుజసౌబలేన॥1212॥

1.15 (పదిహేనవ శ్లోకము)

క ఏనమత్రోపజుహావ జిహ్మం దాస్యాః సుతం యద్బలినైవ పుష్టః|

తస్మిన్ ప్రతీపః పరకృత్య ఆస్తే నిర్వాస్యతామాశు పురాచ్ఛ్వసానః॥1213॥

విదురుడు ఇట్లు పలికినంతనే దుర్యోధనుడు పట్టరాని కోపముతో ఊగిపోయెను. ఆ క్రోధావేశములో అతని పెదవులు వణకసాగెను. కర్ణుడు, దుశ్శాశనుడు, శకుని మొదలగువారి అండ జూచుకొని అతడు కన్నుమిన్నుగానక యుండెను. సాధుస్వభావుడు, సత్పురుషులకు ఆదరణీయుడు ఐన ఆ విదురుని తిరస్కరించుచు (తూలనాడుచు) ఆ దుష్టుడు ఇట్లు పలికెను - "కుటిలుడైన ఈ దాసీపుత్రుని ఇచటికి ఎవరు ఆహ్వానించిరి? మా ఉప్పు తిని బలిసియున్న ఇతడు మాకు వ్యతిరేకముగా శత్రువుల పక్షమున మాట్లాడుచున్నాడు. కనుక, ఇతనిని ఎంతగా శిక్షించినను తప్పులేదు. కాని, ఇతనిని ప్రాణములతో పురమునుండి వెళ్ళగొట్టుడు.

1.16 (పదహారవ శ్లోకము)

స ఇత్థమత్యుల్బణకర్ణబాణైః భ్రాతుః పురో మర్మసు తాడితోఽపి|

స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయాం గతవ్యథోఽయాదురుమానయానః॥1214॥

పరీక్షిన్మహారాజా! తన అన్న ఎదుటనే దుర్యోధనుడు పలికిన కఠోరమైన పలుకులు శూలములవలె విదురుని యొక్క చెవులకు గ్రుచ్చుకొనెను. అవి ఆయన ఆయువుపట్టులను (మనస్సును) మిగుల నొప్పించినను  అతడు వాటియెడ ఉపేక్షాభావమును వహించెను. పిమ్మట అతడు దుర్యోధనునిపై ఎట్టి దోషారోపణయు చేయక (దుర్యోధనుని ఏమాత్రమూ దూషింపక) 'ఇది అంతయును భగవంతుని మాయాప్రభావమే' అని తలపోసెను. పిమ్మట అతడు తన ధనుర్బాణములను ద్వారముకడనే ఉంచి, హస్తినాపురమునుండి వెళ్ళిపోయెను.

విదురుడు కౌరవులకు మంత్రియేగాక, విలువిద్యయందు ఆరితేరినవాడుగూడ. ఈ దుస్సంఘటన కారణముగా కినుకవహించి అతడు శత్రువుల (పాండవుల) పక్షమున జేరి యుద్ధమొనర్చునేమోయని సందేహము ఎవరికి కలుగకుండుటకై తన ధనుర్బాణములను ద్వారముకడనే యుంచి వెళ్ళిపోయెను. విదురుని దూరదృష్టి అట్టిది. అనంతరము మహాభారత యుద్ధమునందు అతడు ఎవరి పక్షమును వహింపక, అందరికీ దూరముగా నుండెను. ఇదియే సాధుస్వభావము గలిగిన నీతికోవిదుడగు విదురుని గొప్పతనము.

1.17 (పదిహేడవ శ్లోకము)

స నిర్గతః కౌరవపుణ్యలబ్ధో గజాహ్వయాత్తీర్థపదః పదాని|

అన్వాక్రమత్పుణ్యచికీర్షయోర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తిః॥1215॥

విదురుడు గొప్ప నీతి కుశలుడు. అట్టి మహాత్ముడు కౌరవులకు మంత్రిగా లభించుట వారు చేసుకొనిన పూర్వపుణ్యఫలము. ఆ  ధర్మాత్ముడు భగవత్సేవలలో తన జీవితమును సార్థకమొనర్చుటకై భూమండలమునగల సకల పవిత్రక్షేత్రములను దర్శించుటకై హస్తినాపురమునుండి బయలుదేరెను. ఆయా తీర్థక్షేత్రములలో అధిష్ఠించియున్న శ్రీమన్నారాయణుని దర్శించి పరమానందభరితుడయ్యెను.

1.18 (పదునెనిమిదవ శ్లోకము)

పురేషు పుణ్యోపవనాద్రికుంజేష్వపంకతోయేషు సరిత్సరఃసు|

అనంతలింగైః సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః॥1216॥

విదురుడు భగవంతుని మూర్తులతో విరాజిల్లుచున్నట్టి సమస్త తీర్థక్షేత్రములను, నగరములను, పవిత్రవనములను, విఖ్యాతములైన పర్వతములను, దర్శనీయములైన నికుంజములను, అట్లే నిర్మల జలములతో విలసిల్లుచున్న నదులను, సరస్సులను దర్శించుచు అనన్యభక్తినిరతుడై దైవసేవలొనర్చెను.

1.19 (పందొమ్మిదవ శ్లోకము)

గాం పర్యటన్మేధ్యవివిక్తవృత్తిః సదాఽఽప్లుతోఽధఃశయనోఽవధూతః |

అలక్షితః స్వైరవధూతవే వ్రతాని చేరే హరితోషణాని॥1217॥

విదురుడు తన యాత్రాసందర్భమున అవధూతగా (అభ్యంగనాది సంస్కరాములు లేకుండా) ఆత్మీయులు ఎవ్వరును గుర్తుపట్టలేని విధముగా వల్కలాజినధారియై మసలుకొనెను. పవిత్రమైన సాత్త్విక ఆహారపదార్థములనే స్వీకరించెను. ప్రతిక్షేత్రమునందును పుణ్యస్నానములను ఆచరించెను. నేలపై శయనించెను. ఈ విధముగా విదురుడు భూమండలమునందు అంతటను సంచరించుచు శ్రీహరికి ప్రీతికరములైన వివిధ వ్రతములను ఆచరించెను.

1.20  (ఇరువదియవ శ్లోకము)

ఇత్థం వ్రజన్భారతమేవ వర్షం కాలేన యావద్గతవాన్ప్రభాసమ్|

తావచ్ఛశాస క్షితిమేకచక్రామేకాతపత్రామజితేన పార్థః॥1218॥

ఈ ప్రకారముగా భారతదేశమున సంచరించుచు అతడు ప్రభాస తీర్థమునకు చేరెను. ఆ సమయమున ధర్మరాజు శ్రీకృష్ణుని సహాయముతో (కృష్ణానుగ్రహముతో) ఏకచ్ఛత్రాధిపతియై రాజ్యమును చక్కగా పరిపాలించు చుండెను.

1.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

తత్రాథ శుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవహ్నిసంశ్రయమ్|

సంస్పర్ధయా దగ్ద్ధమథానుశోచన్ సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీమ్॥1219॥

విదురుడు ప్రభాస తీర్థమున ఉన్నప్ఫుడే వెదురుపొదలనుండి వెలువడిన అగ్నిజ్వాలకు అచటి వనములన్నియును ఆహుతియైనట్లు కౌరవులలో ఆత్మీయులైన బంధుమిత్రుల పరస్పర కలహముతో నశించినట్లు వినెను. అందులకు అతడు ఎంతయు శోకించుచు పూర్వవాహినియగు సరస్వతీనదీ తీరమునకు చేరెను.

1.22 (ఇరువది రెండవ శ్లోకము)

తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ పృథోరథాగ్నేరసితస్య వాయోః|

తీర్థం సుదాసస్య గవాం గుహస్య యచ్ఛ్రాద్ధదేవస్య స ఆసిషేవే॥1220॥

విదురుడు సరస్వతీ తీరమునందుగల త్రిత, ఉశన, మను, పృథు, అగ్ని, అసిత, వాయు, సుదాస, గో, గుహ, శ్రాద్ధదేవ అను పేర్లతో ప్రసిద్ధిచెందిన తీర్థములను సేవించి, మృతులకు జలాంజలి సమర్పించెను.

1.23  (ఇరువది మూడవ శ్లోకము)

అన్యాని చేహ ద్విజదేవదేవైః కృతాని నానాఽఽయతనాని విష్ణోః|

ప్రత్యంగముఖ్యాంకితమందిరాణి యద్దర్శనాత్కృష్ణమనుస్మరంతి॥1221॥

అంతేగాక, అతడు పృథ్వియందు భూసురులచేతను, దేవతలచేతను, ఋషులచేతను స్థాపింపబడిన శ్రీమహావిష్ణుమందిరములను దర్శించి సేవించెను. ఆ మందిరములయొక్క శిఖరములపై శ్రీహరి ప్రధానాయుధమైన చక్రముయొక్క చిహ్నములు గలవు. భక్తులు వాటిని దర్శించినంత మాత్రముననే వారి హృదయములలో శ్రీకృష్ణభగవానుని    స్మరణ కలుగును.

1.24  (ఇరువది నాలుగవ శ్లోకము)

తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్ కురుజాంగలాంశ్చ|

కాలేన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ॥1222॥

అనంతరము అతడు అచటినుండి బయలుదేరి ధనధాన్యములతో తులతూగుచుండెడి సౌరాష్ట్ర, సౌవీర, మత్స్య, కురుజాంగలాది దేశములయందు సంచరించుచు, కొంతకాలమునకు యమునానదీ తీరమునకు చేరెను. అచట ఆ విదురుడు పరమ భాగవతోత్తముడైన ఉద్ధవుని దర్శించెను.

1.25 (ఇరువది ఐదవ శ్లోకము)

స వాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతేః ప్రాక్తనయం ప్రతీతమ్|

ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛద్భగవత్ప్రజానామ్॥1223॥

ఉద్ధవుడు శ్రీకృష్ణభక్తులలో ప్రముఖుడు. మిగుల శమదమాది సంపన్నుడు. అతడు సర్వదా భగవంతుని లీలాగుణగణములను స్మరించుచు ఆనందమగ్నుడై యుండెడివాడు. బృహస్పతి యొద్దనీతిశాస్త్రమును అభ్యసించి ఖ్యాతికెక్కినవాడు. విదురుడు ఆ మహాత్ముని దర్శించినంతనే ప్రేమతో ఆయనను గాఢాలింగనము నొనర్చుకొని, శ్రీకృష్ణుని గూర్చియు, శ్రీకృష్ణభక్తులైన ప్రజల క్షేమసమాచారములను గురించియు అడిగెను.

1.26 (ఇరువది ఆరవ శ్లోకము)

కచ్చిత్పురాణౌ పురుషౌ స్వనాభ్యపాద్మానువృత్త్యేహ కిలావతీర్ణౌ|

ఆసాత ఉర్వ్యాః కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేహే॥1224॥

శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలమునుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని ప్రార్థనపై పురాణపురుషులైన శ్రీకృష్ణబలరాములు ఈ భూతలమున అవతరించిరిగదా! వారు భూభారమును తొలగించి, జనులను అందరిని ఆనందింపజేయుచు, వసుదేవుని యింట కుశలముగా ఉన్నారా?

1.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కచ్చిత్కురూణాం పరమః సుహృన్నో భామః స ఆస్తే సుఖమంగ శౌరిః|

యో వై స్వసౄణాం పితృవద్దదాతి వరాన్ వదాన్యో వరతర్పణేన॥1225॥

ప్రియమైన ఉద్ధవా! వసుదేవుడు మా కురువంశజులకు మిగుల ఆత్మీయుడు. అతడు తన చెల్లెండ్రైన కుంతీదేవి మున్నగువారికి వారు కోరుకొనిన వస్తువులను అన్నింటిని తండ్రివలె ఉదారముగా ఇచ్చుచుండును. అట్టి వసుదేవుడు హాయిగా ఉన్నాడా?

1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

కచ్చిద్వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగ వీరః|

యం రుక్మిణీ భగవతోఽభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాదిసర్గే॥1226॥

వీరుడైన ప్రద్యుమ్నుడు యాదవుల సేనలకు అధిపతి. అతడు పూర్వజన్మలో మన్మథుడు. రుక్మిణీదేవి విప్రులను ఆరాధించి, శ్రీకృష్ణభగవానుని వలన అతనిని తన పుత్రునిగా పొందెను.  ఆ ప్రద్యుమ్నుడు కుశలమేనా?

1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

కచ్చిత్సుఖం సాత్వతవృష్ణిభోజదాశార్హకాణామధిపః స ఆస్తే|

యమభ్యషించచ్ఛతపత్రనేత్రో నృపాసనాశాం పరిహృత్య దూరాత్॥1227॥

ఉగ్రసేనుడు సాత్త్వత, వృష్ణి, భోజ, దాశార్హవంశజులైన యాదవులకు అధిపతి. అతడు కొంతకాలము రాజ్యాభిలాషను పరిత్యజించి, దూరముగా ఉండెను. శ్రీకృష్ణుడు కంసుని సంహరించి, ఆయనను మఱల రాజ్యాభిషిక్తుని గావించెను. ఆ ఉగ్రసేన మహారాజు క్షేమమేనా?

1.30 (ముప్పదియవ శ్లోకము)

కచ్చిద్ధరేః సౌమ్య సుతః సదృక్ష ఆస్తేఽగ్రణీ రథినాం సాధు సాంబః|

అసూత యం జాంబవతీ వ్రతాఢ్యా దేవం గుహం యోంఽబికయా ధృతోఽగ్రే॥1228॥

సాంబుడు శ్రీకృష్ణుని కుమారుడు. బలపరాక్రమములలో ఇతడు తండ్రియంతటి వాడు. రథికులలో శ్రేష్ఠుడు. పూర్వజన్మలో ఇతడు పార్వతీదేవి తనయుడైన కుమారస్వామి. జాంబవతి పెక్కు నోములు నోచి, కృష్ణానుగ్రహమున ఇతనిని తన సుతునిగ పొందెను. ఈ సాంబుడు కుశలమేనా?

1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

క్షేమం స కచ్చిద్యుయుధాన ఆస్తే యః ఫాల్గునాల్లబ్ధధనూ రహస్యః|

లేఖేఽంజసాఽధోక్షజసేవయైన గతిం తదీయాం యతిభిర్దురాపామ్॥1229॥

యుయుధానుడు అను మరియొక పేరు గల సాత్యకి అర్జునుని నుండి ధనుర్విద్యా రహస్యములను నేర్చెను. అతడు శ్రీకృష్ణుని సేవించి, ఆ స్వామి అనుగ్రహముతో ఋషులకును దుర్లభమైన ఉన్నతిని సునాయాసముగా పొందెను. అట్టి సాత్యకి క్షేమమేనా?

1.32 (ముప్పది రెండవ శ్లోకము)

కచ్చిద్బుధః స్వస్త్యనమీవ ఆస్తే  శ్వఫల్కపుత్రో భగవత్ప్రసన్నః|

యః కృష్ణపాదాంకిత మార్గపాంసుష్వచేష్టత ప్రేమవిభిన్నధైర్యః॥1230॥

అక్రూరుడు మిక్కిలి పుణ్యాత్ముడు శ్వఫల్కుని కుమారుడు. అతడు జ్ఞాని, శ్రీకృష్ణునకు శరణాగతుడు. కంసుని ప్రేరణపై అతడు శ్రీకృష్ణుని తోడ్కొని వచ్చుటకై వ్రజభూమికి వెళ్ళెను. మార్గమధ్యమున శ్రీకృష్ణుని పాదచిహ్నములతో ఒప్పెడి ధూళులను గాంచి, భక్తిపారవశ్యముతో ఆ రేణువులపైబడి పొరలాడెను. ఆ అక్రూరుడు కుశలమేనా?

1.33 (ముప్పది మూడవ శ్లోకము)

కచ్చిచ్ఛివం దేవకభోజపుత్ర్యాః  విష్ణుప్రజాయా ఇవ దేవమాతుః|

యా వై స్వగర్వేణ దధార దేవమ్ త్రయీ యథా యజ్ఞవితాసమర్థమ్॥1231॥

భోజవంశమునకు చెందిన దేవకునియొక్క కూతురు దేవకి. దేవమాతయైన అదితి వామనుని తన గర్భమున ధరించినట్ల, యజ్ఞముయొక్క విస్తారమైన మంత్రములను తనలో ఇముడ్చుకొనిన వేదత్రయమువలె, తన గర్భమునందు భగవానుని ధరించిన దేవకీదేవి కుశలమేకదా?

1.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అపిస్విదాస్తే భగవాన్ సుఖం వో యః సాత్వతాం కామదుఘోఽనిరుద్ధః॥1232॥

ఉద్దవా! అనిరుద్ధుడు సత్త్వగుణ సంపన్నులైన భక్తులయొక్క మనోరథములను ఈడేర్చునట్టి భగవానుడు. అట్లే యాదవవంశజులైన మీ అందరికిని సుఖప్రదాత. అతడు వేదశాస్త్రములకు ఆదికారణుడు. అంతేగాక, అంతఃకరణ చతుష్టయములో నాల్గవ అంశయైన మనస్సునకు అధిష్ఠాత. చిత్తము, అహంకారము, బుద్ధి, మనస్సు అనునవి అంతఃకరణముయొక్క అంశములు.ఈ అంతఃకరణ చతుష్టయములైన వీటికి క్రమముగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్మ, అనిరుద్ధులు అధిష్ఠాతలు ఆ మహాత్ముడు కుశలమేనా?

1.35 (ముప్పది ఐదవ శ్లోకము)

అపిస్విదన్యే చ నిజాత్మదైవమ్ అనన్యవృత్త్యా సమనువ్రతా యే|

హృదీకసత్యాత్మజచారుదేష్ణగదాదయః స్వస్తి చరంతి సౌమ్య॥1233॥

సౌమ్యుడైన ఉద్ధవా! హృదీకుడు, సత్యభామా తనయుడైన చారుదేష్ణుడు, గదుడు మున్నగు శ్రీకృష్ణుని కుమారులును, ఇతర యాదవులును అనన్యభావముతో కృష్ణభగవానుని సేవించుచుందురు. వారు అందరును క్షేమమేనా?

1.36 (ముప్పది ఆరవ శ్లోకము)

అపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మః పరిపాతి సేతుమ్|

దుర్యోధనోఽతప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా ॥1234॥

ఉద్ధవా! మయుడు ధర్మరాజునకు ఒక సభాభవనమును నిర్మించి ఇచ్చెను. ఆ సభాభవనము అపూర్వమైనది. అందు ప్రతిఫలించుచున్న ధర్మరాజుయొక్క రాజ్యలక్ష్మీ వైభవములను జూచి దుర్యోధనుడు మిగుల అసూయకు లోనయ్యెను. ఆ ధర్మరాజు కృష్ణార్జునుల సహాయసహకారములతో ధర్మయుక్తముగా రాజ్యమును పరిపాలించుచున్నారుగదా!

1.37 (ముప్పది ఏడవ శ్లోకము)

కిం వా కృతాఘేష్వఘమత్యమర్షీ భీమోఽహివద్దీర్ఘతమం వ్యముంచత్ |

యస్యాంఘ్రిపాతం రణభూర్న సేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రమ్॥1235॥

భీముడు సమరభూమియందు గదాధారియై సంహారమునకు చిత్రవిచిత్ర గతులతో అటునిటు సంచరించునప్పుడు రణభూమి ఆ మహాబలశాలియొక్క పాదఘట్టనమునకు తట్టుకొనలేక దద్దరిల్లినది. శత్రువులు ఒనర్చిన అపరాధములకు వారియెడ క్రుద్ధుడైన భీముడు పెద్దకాలము కోపావేశములతో బుసలుకొట్టు చుండెను. ఇప్పుడు ఆ మహాయోధుడు తన కోపాతిరేకమునుండి బయటపడినాడా?

1.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

కచ్చిద్యశోధా రథయూథపానాం గాండీవధన్వోపరతారిరాస్తే|

అలక్షితో యచ్ఛరకూటగూఢో మాయాకిరాతో గిరిశస్తుతోష॥1236॥

అర్జునుడు తన యుద్ధకౌశల కారణముగా రథికులలో, సమరయోధులలో మిగుల ఖ్యాతి వహించినవాడు. అతడు తన గాండీవధనుస్సును సంధించి, ప్రయోగించిన బాణపరంపరధాటికి శత్రువులు అందరును నేలగూలిరి. కిరాతవేషధారియై శంకరుడు అర్జునునితో యుద్ధము చేయునప్పుడు అతని బాణములు చుట్టుముట్టగా ఆ గిరీశుడు కొంతవడి అలక్షితుడయ్యెను. అతని   ధనుర్విద్యానైపుణ్యమునకు ముగ్ధుడై పరమశివుడు ఆయనకు పాశుపతాస్త్రమును అనుగ్రహించెను. అట్టి అర్జునుడు కుశలమేగదా?

1.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

యమావుతస్విత్తనయౌ పృథాయాః పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ|

రేమాత ఉద్దాయ మృధే స్వరిక్థం పరాత్సుపర్ణావివ వజ్రివక్త్రాత్॥1237॥

నకుల సహదేవులు కుంతీదేవియొక్క లాలనపాలనలతో పెరిగి పెద్దయైరి. కంటి ఱెప్పలచే కనులవలె వారు యుధిష్ఠిర భీమార్జునులచే రక్షితులైరి. ఇంకను ఆ కవలలు శత్రువులతో పోరాడి, వారి అధీనములోనున్న తమ రాజ్యమును, ఇంద్రుని వశములోనున్న అమృతమును గరుడునివలె చేజిక్కించుకొనిరి. ఆ నకులసహదేవులు కుశలమేనా?

1.40 (నలుబదియవ శ్లోకము)

అహో పృథాపి ధ్రియతేఽర్భకార్థే రాజర్షివర్యేణ వినాపి తేన|

యస్త్వేకవీరోఽధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయః కకుభశ్చతస్రః॥1238॥

అసహాయశూరుడు, అతిరథుడు ఐన ఆ పాండుమహారాజు తానొక్కడే, తన ధనుస్సును మాత్రమే తోడుగా చేసికొని, నాలుగు దిక్కులను జయించెను. రాజర్షులలో శ్రేష్ఠుడగు పాండుమహారాజు లేకున్ననూ పిల్లలకొరకై కుంతీదేవి తన ప్రాణములను నిలుపుకొనియుండుట ఎంతయో ప్రశంసింపదగినది.

1.41 (నలుబది ఒకటవ శ్లోకము)

సౌమ్యానుశోచే తమధఃపతంతం భ్రాత్రే పరేతాయ విదుద్రుహే యః|

నిర్యాపితో యేన సుహృత్స్వపుర్యా అహం స్వపుత్రాన్సమనువ్రతేన॥1239॥

సౌమ్యుడవైన ఉద్ధవా! దినదినము దిగజారిపోవుచు నరకగామి యగుచున్న ధృతరాష్ట్రుని గురుంచియే నాలో మాటి-మాటికి దుఃఖము కలుగుచున్నది. ఏలయన, పాండవులను అష్టకష్టములకు గురిచేయుటవలన అతడు పరలోకగతుడైన తన సోదరుడగు పాండుమహారాజునకే తీరని ద్రోహమొనర్చెను. అంతేగాక, తన పుత్రులైన దుర్యోధనాదుల మాటలకు తలయొగ్గి, ఎల్లప్పుడు తన హితమునే కోరునట్టి నన్ను ?కూడా హస్తినాపురమునకు దూరముజేసెను.

1.42 (నలుబది రెండవ శ్లోకము)

సోఽహం హరేర్మర్త్యవిడంబనేన దృశో నృణాం చాలయతో విధాతుః|

నాన్యోపలక్ష్యః పదవీం ప్రసాదాచ్చరామి పశ్యన్ గతవిస్మయోఽత్ర॥1240॥

కానీ! సోదరా! ధృతరాష్ట్రుడు నన్ను నగరమునుండి వెళ్ళగొట్టినప్పటికిని అందులకు నేను ఏమాత్రమూ విచారించుటలేదు. ఆశ్చర్యపడుటలేదు. ఏలయన సర్వనియంతయైన శ్రీకృష్ణభగవానుడే లీలామానుష విగ్రహుడై మానవుల చిత్తవృత్తులను భ్రమింపజేయు చుండును. నేను మాత్రము ఆ స్వామియొక్క అనుగ్రహమున ఇతరుల కంటబడకుండా హాయిగా తిరుగుచున్నాను.

1.43 (నలుబది మూడవ శ్లోకము)

నూనం నృపాణాం త్రిమదోత్పథానాం మహీం ముహుశ్చాలయతాం చమూభిః|

వధాత్ప్రపన్నార్తిజిహీర్షయేశోఽప్యుపైక్షతాఘం భగవాన్కురూణామ్॥1241॥

నాడు విద్య, ధనము, అభిజాత్యము అను మూడింటికారణముగా మదోన్మత్తులైన రాజులు తమ సైన్యములతో భూతలమున విశృంఖలముగా సంచరించుచు అల్లకల్లోలములను సృష్టించుచుండిరి. కౌరవులు రాజ్యమదమున ధర్మాత్ములైన పాండవులయెడ పెక్కురీతుల అపరాధమొనర్చుచుండిరి. దుష్టసంహారమునకు కటిబద్ధుడైన శ్రీకృష్ణుడు వీరిని అందరినీ శిక్షింపగలిగియుండియు సమయము వచ్చినప్పుడు కౌరవాది దుష్టులను శిక్షించి, ధర్మాత్ములైన పాండవులను ఇతర ఆర్తిజనులను రక్షింఫదలచి తాత్కాలికముగా వారియెడ ఉపేక్షవహించెను. తరువాత ఘటిల్లిన కురుక్షేత్రయుద్ధమున దుష్టసంహారమొనర్చి ఆ స్వామి భూభారమును తొలగించెను.

1.44 (నలుబది నాలుగవ శ్లోకము)

అజస్య జన్మోత్పథనాశనాయ కర్మాణ్యకర్తుర్గ్రహణాయ పుంసామ్|

నన్వన్యథా కోఽర్హతి దేహయోగం పరో గుణానాముత కర్మతంత్రమ్॥1242॥

భగవంతుడు జన్మరహితుడే అయినను దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపనము గావించుటకై లీలగా అవతరించెను. ఆ స్వామి వాస్తవముగా అకర్తయేయైనను మానవులు (చరాచరప్రాణులు) కర్తవ్యకర్మలను ఆచరించుటకై మార్గదర్శిగా తాను కర్మలను ఆచరించెను. లేనిచో, గుణాతీతుడైన ఆ సర్వేశ్వరుడు దేహధారి యగుటకును, కర్మపరతంత్రుడగుటకును మరియొక కారణమేలేదు.

1.45 (నలుబది ఐదవ శ్లోకము)

తస్య ప్రపన్నాఖిలలోకపానామవస్థితానామనుశాసనే స్వే|

అర్థాయ జాతస్య యదుష్వజస్య వార్తాం సఖే కీర్తయ తీర్థకీర్తేః॥1243॥

మిత్రమా! ఉద్ధవా! శ్రీకృష్ణభగవానుడు సకలలోకములలోనివారికిని శరణ్యుడు. తనను ఆశ్రయించిన భక్తులపై అపారమైన కృపగలవాడు. జన్మరహితుడైనను లోకకల్యాణార్దమై యదువంశమున జన్మించి లీలలను నెఱపెను. ఆ స్వామి సర్వలోక రక్షకుడుగా ఖ్యాతివహించినవాడు. అట్టి పవిత్రకీర్తిగల కృష్ణుని లీలాగుణ వైభవములను కీర్తింపుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే విదురోద్ధవసంవాదే ప్రథమోఽధ్యాయః (1)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ఉద్ధవునితో విదురుని సమాగమము అను  ప్రథమ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

1.4.2022 ప్రాతఃకాల సందేశము


తృతీయ స్కంధము - రెండవ అధ్యాయము

ఉద్ధవుడు శ్రీకృష్ణభగవానుని బాల్యలీలలను వర్ణించుట

శ్రీశుక ఉవాచ

2.1 (ప్రథమ శ్లోకము)

ఇతి భాగవతః పృష్టః క్షత్త్రా వార్తాం ప్రియాశ్రయామ్|

ప్రతివక్తుం న చోత్సేహ ఔత్కంఠ్యాత్స్మారితేశ్వరః॥1244॥

శ్రీశుకయోగి నుడివెను పరీక్షిన్మహారాజా! ఇంతవరకు విదురుడు పరమభాగవతోత్తముడైన ఉద్ధవునితో ప్రియతముడగు శ్రీకృష్ణునకు సంబంధించిన కుశల సమాచారమును గూర్చి ప్రశ్నించెను. ఉద్ధవుడు నిరంతరము కృష్ణప్రేమలో లీనమైయుండువాడు. అట్టి కృష్ణుని గూర్చియే అడిగినందున, అతని హృదయము  భగవంతుని ప్రేమభావముతో మిక్కుటమై పొంగిపొరలుటచే గద్గదుడై మాటలాడలేకపోయెను.

2.2 (రెండవ శ్లోకము)

యః పంచహాయనో మాత్రా ప్రాతరాశాయ యాచితః|

తన్నైచ్ఛద్రచయన్యస్య సపర్యాం బాలలీలయా॥1245॥

ఉద్ధవుడు ఏడేళ్ళప్రాయములో ఉన్నప్పుడు అతని తల్లి ప్రాతఃకాలమునందు ఉపాహారము చేయుటకు రమ్మని పిలిచెడిది. ఆ సమయమున అతడు బాలకృష్ణుని పూజించుచు అతని బాల్యలీలలో మునిగియుండెడివాడు. అందుచే అతడు తన తల్లి పిలుపు వినియు, పూజను వదలిపెట్టి, ఉపాహారమును తినుట అతనికి నచ్చకుండెడిది.

2.3 (మూడవ శ్లోకము)

స కథం సేవయా తస్య కాలేన జరసం గతః|

పృష్టో వార్తాం ప్రతిబ్రూయాద్భర్తుః పాదావనుస్మరన్॥1246॥

నిరంతరము శ్రీకృష్ణుని పాదారవిందముల సేవలో అనురక్తుడై యుండెడు ఉద్ధవుని జీవితకాలము క్రమముగా వృద్ధాప్యదశకు చేరుకొనెను. విదురుడు శ్రీకృష్ణునిగూర్చి అడుగగా ఉద్ధవుడు తన జీవితసర్వస్వమును శ్రీకృష్ణభగవానుని చరణకమలములను స్మరించుటలో నిమగ్నుడయ్యెను. అట్టిస్థితిలో అతడు సమాధానమును ఎట్లుచెప్పగలుగును?

2.4 (నాలుగవ శ్లోకము)

స ముహూర్తమభూత్తూష్ణీం కృష్ణాంఘ్రిసుధయా భృశమ్|

తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః॥1247॥

అట్టి ఉద్ధవుడు శ్రీకృష్ణుని పాదారవింద మకరంద సుధాజలనిధిలో మునిగి, మహానందభరితుడై యుండెను. ఆ స్థితిలో తీవ్రమైన భక్తిపారవశ్యముచే పరవశుడై ముహూర్తకాలమునందు మారుమాట పలుకకుండెను.

2.5 (ఐదవ శ్లోకము)

పులకోద్భిన్నసర్వాంగో ముంచన్మీలద్దృశా శుచః|

పూర్ణార్థో లక్షితస్తేన స్నేహప్రసరసంప్లుతః॥1248॥

అప్పుడు ఉద్ధవుడు పులకితగాత్రుడయ్యెను. భక్తిప్రభావమున కనులు మూతపడెను. ఆనందాశ్రువులు జలజల స్రవించెను. విదురుడు ఉద్ధవుని యొక్క భక్త్యావేశమును గాంచి 'ఈ భాగవతోత్తముడు  ఎంతయు ధన్యాత్ముడు' అని తలంచెను.

2.6 (ఆరవ శ్లోకము)

శనకైర్భగవల్లోకాన్నృలోకం పునరాగతః|

విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహోద్ధవ ఉత్స్మయన్॥1249॥

ఉద్ధవుడు తిన్నతిన్నగా ఆ భక్తిసామ్రాజ్యనిరతినుండి ఈ లోకమునకు వచ్చెను (దేహస్మృతి గలిగెను). విదురుని ప్రస్తావనతో తనకు భక్తిపారవశ్యానందములు ప్రాప్తించినందులకు ఉద్ధవుడు మిగుల సంభ్రమాశ్చర్యములను పొందెను. పిమ్మట అతడు కనులు తుడుచుకొని విదురునితో ఇట్లనెను.

ఉద్ధవ ఉవాచ

కృష్ణద్యుమణినిమ్లోచే గీర్ణేష్వజగరేణ హ|

కిం ను నః కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహమ్॥1250॥

ఉద్ధవుడు పలికెను విదురా! శ్రీకృష్ణడనెడి సూర్యుడు అస్తమించినంతనే కాలమనెడి సర్పము మా గృహములను అన్నింటిని కబళించివేసెను. అందువలన మా ఇండ్లన్నియును వెలవెలబోవుచున్నవి. ఇట్టి స్థితిలో  నీవడిగిన బంధుమిత్రులయొక్క క్షేమసమాచారములను గూర్చి ఏమని చెప్పగలను?

2.8 (ఎనిమిదవ శ్లోకము)

దుర్భగో బత లోకోఽయం యదవో నితరామపి|

యే సంవసంతో న విదుర్హరిం మీనా ఇవోడుపమ్॥1251॥

ఈ మానవులు ఎల్లరును దురదృష్టవంతులు. యాదవులు ఇంకను భాగ్యహీనులు. ఏలయన, శ్రీకృష్ణునితో పాటు వారు కలిసిమెలిసి జీవించుచున్నను, సముద్రములలోగల చేపలు తమతో కలిసియున్న అమృతమయుడగు చంద్రుని గుర్తింపనట్లు వారు శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తింపలేకపోయిరి. అనగా ఆ స్వామియు, తమవంటి మానవమాత్రుడేయని వారు తలపోసిరి.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

ఇంగితజ్ఞాః పురుప్రౌఢా ఏకారామాశ్చ సాత్త్వతాః|

సాత్త్వతామృషభం సర్వే భూతావాసమమంసత॥1252॥

యాదవులు పరేంగితజ్ఞులు. అంతేగాదు, మిగుల బుద్ధిమంతులు, అందునా శ్రీకృష్ణునితో గూడి మసలుకొనిన వారు. ఐనను, వారు సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండెడివాడు, విశ్వమునకు ఆధారమైనవాడు అగు శ్రీకృష్ణుని పరమాత్మునిగా గుర్తింపలేక కేవలము ఒక యాదవ ప్రముఖునిగా మాత్రమే భావించిరి.

2.10 (పదియవ శ్లోకము)

దేవస్య మాయయా స్పృష్టా యే చాన్యదసదాశ్రితాః|

భ్రామ్యతే ధీర్న తద్వాక్యైరాత్మన్యుప్తాత్మనో హరౌ॥1253॥

విదురా! అసత్తును ఆశ్రయించినవారు భగవంతుని మాయలో చిక్కుకొందురు. కానీ, భగవంతునియందే తమ చిత్తములను సమర్పించిన వారి యొక్క బుద్ధిమాత్రము ప్రాపంచిక విషయములను గూర్చిన వాక్యములయందు చిక్కుపడదు.

2.11 (పదకొండవ శ్లోకము)

ప్రదర్శ్యాతప్తతపసామవితృప్తదృశాం నృణామ్|

ఆదాయాంతరధాద్యస్తు స్వబింబం లోకలోచనమ్॥1254॥

ఎన్నడును తపస్సు చేయనివారికి గూడ (యాదవులు మున్నగువారికి గూడ) ఇన్ని దినములవరకును (బహుకాలము) తన దర్శనమొసంగి, వారి దర్శనాభిలాష తీరకముందే శ్రీకృష్ణభగవానుడు భువనమోహనమైన తన మూర్తిని మరుగుపరచి అంతర్ధానమయ్యెను. ఈ విధముగా ఆ స్వామి అందరిని తనవైపు ఆకర్షించి, వారి నేత్రములను లాగుకొనిపోయెను.

2.12 (పండ్రెండవ శ్లోకము)

యన్మర్త్యలీలౌపయికం స్వయోగమాయాబలం దర్శయతా గృహీతమ్|

విస్మాపనం స్వస్య చ సౌభగర్ద్ధేః పరం పదం భూషణభూషణాంగమ్॥1255॥

శ్రీకృష్ణభగవానుడు తన యోగమాయా ప్రభావమును ప్రదర్శించుటకై మనుష్యలీలలకు అనుగుణముగా దివ్యరూపమును ప్రకటించెను. దాని (ఆ దివ్యరూప) సౌందర్యము జగత్తునకే గాక ఆ స్వామికిని విస్మయమును గూర్చునట్టిది. ఆ రూపము, సౌభాగ్యవైభవమునకు పరాకాష్ట. ఆ ప్రభువుయొక్క అంగసౌష్టవ శోభలు ఆయన ధరించిన కౌస్తుభాది భూషణములకే వన్నెదెచ్చునట్టివి.

2.13 (పదమూడవ శ్లోకము)

యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః|

కార్త్స్న్యేన చాద్యేహ గతం విధాతురర్వాక్సృతౌ కౌశలమిత్యమన్యత॥1256॥

ధర్మరాజుయొక్క రాజసూయయాగమునందు శ్రీకృష్ణుడు ప్రకటించిన నయనమనోహరమగు రూపమును జూచి, త్రిలోకవాసులు ఎల్లరును 'ఆహా! మానవసృష్టిని రచించుటలో బ్రహ్మదేవుడు ఇంతవరకు చూసిన తన సృష్టినైపుణ్యము నంతయును ఈ ఒక్కమూర్తిలోనే ఇమిడించినట్లున్నదిగదా! అని భావించిరి.

2.14 (పదునాలుగవ శ్లోకము)

యస్యానురాగప్లుతహాసరాసలీలావలోకప్రతిలబ్ధమానాః|

వ్రజస్త్రియో దృగ్భిరనుప్రవృత్తధియోఽవతస్థుః కిల కృత్యశేషాః॥1256॥

శ్రీకృష్ణపరమాత్మయొక్క దరహాసములు, వినోదాత్మకములైన  లీలావలోకనములు ప్రేమానురాగములతో పరిపూర్ణములై యుండెను. అంతేగాదు, అతని చూపులు వ్రజగోపికల ప్రేమభావమును ఆదరించెడివి. అందువలన అవి వ్రజస్త్రీలయొక్క చూపులను, మనస్సులను ఎంతగానో ఆకర్షించెను. ఫలితముగా ప్రేమపరవశలైన ఆ వ్రజాంగనలు తాము చేయుచున్న గృహకృత్యములను అన్నింటిని పూర్తిచేయకయే ఎక్కడివాటిని అక్కడ విడిచిపెట్టి, నిశ్చేష్టులై యుండిపోయిరి (కొయ్యబొమ్మలవలె నిలిచిపోయిరి). ఆ పరమాత్మ యొక్క దర్శనభాగ్యముచే వారి కర్మవాసనలు అన్నియును పూర్తిగా నశించి, ఆ స్వామిలో వారు ఐక్యమైరి.

2.15 (పదిహేనవ శ్లోకము)

స్వశాంతరూపేష్వితరైః స్వరూపైరభ్యర్ద్యమానేష్వనుకంపితాత్మా|

పరావరేశో మహదంశయుక్తో హ్యజోఽపి జాతో భగవాన్ యథాగ్నిః॥1258॥

భగవంతుడు చరాచరస్వరూపులైన మహాత్ములును, అశాంత (ఘోర) రూపులైన అసురులును ఆ స్వామి రూపములే. దుష్టులైన అసురులు, శాంతస్వభావులైన మహాత్ములను పీడించుటను చూచి ఆ ప్రభువు హృదయము కనికరముతో కరిగిపోయెను. అంతట దయాళువైన ఆ సర్వేశ్వరుడు జన్మరహితుడైనను తనయొక్క అంశయైన బలరామునితో సహా కట్టెయందలి అగ్నివలె ప్రకటితుడాయెను.

2.16 (పదహారవ శ్లోకము)

మాం ఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవగేహే|

వ్రజే చ వాసోఽరిభయాదివ స్వయం పురాద్వ్యవాత్సీద్యదనంతవీర్యః॥1259॥

ఆ పరమేశ్వరుడు జన్మరహితుడేయైనను కారాగారమున వసుదేవుని కుమారుడై జన్మించెను. సకల ప్రాణులకును అభయప్రదాతయైనను, కంసునకు భయపడి వ్రేపల్లెకు చేరి నివసించెను. అనంతశక్తిశాలియైన ఆ ప్రభువు కాలయవనుని చూచినంతనే భీతిల్లినవానివలె మథురా పురమునుండి పరుగెత్తెను. భగవంతుని ఈ లీలలను అన్నింటిని తలచుకొని నప్పుడు నా మనస్సు ఎంతయు కలవరపడుచున్నది. అతడు మహాపరాక్రమవంతుడైనప్పటికిని (సర్వసమర్థుడు ఐనప్పటికిని) మానవమాత్రుని వలె పెక్కులీలలను ప్రదర్శించెను.

2.17 (పదిహేడవ శ్లోకము)

దునోతి చేతః స్మరతో మమైతద్యదాహ పాదావభివంద్య పిత్రోః|

తాతాంబ కంసాదురుశంకితానాం ప్రసీదతం నోఽకృతనిష్కృతీనామ్॥1260॥

విదురా! శ్రీకృష్ణుడు కంసుని వధించిన పిమ్మట దేవకీవసుదేవులకు పాదాభివందనమొనర్చి ఇట్లు పలికెను - 'అమ్మా! నాన్నా! కంసుని భయకారణముగా మీ కడ ఉండి మీకు సేవలు చేయలేకపోయితిమి. ఆ ఈ అపరాధమును క్షమింపుడు అని శ్రీకృష్ణుడు పలికిన ఈ మాటలు  నా మనస్సున మెదిలినంతనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనగుచుంటిని.

2.18 (పదునెనిమిదవ శ్లోకము)

కో వా అముష్యాంఘ్రిసరోజరేణుం విస్మర్తుమీశీత పుమాన్విజిఘ్రన్|

యో విస్ఫురద్భ్రూవిటపేన భూమేర్భారం కృతాంతేన తిరశ్చకార॥1261॥

కాలస్వరూపుడైన శ్రీహరి (శ్రీకృష్ణుడు) తన భృకుటి విలాసమాత్రముననే భూభారమును రూపుమాపెను. అట్టి పరమాత్మునియొక్క పాధపద్మరేణువులను సేవించినవాడు ఎవ్వడును ఆయనను మరువజాలడు.

2.19 (పందొమ్మిదవ శ్లోకము)

దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోఽపి సిద్ధిః|

యాం యోగినః సంస్పృహయంతి సమ్యగ్యోగేన కస్తద్విరహం సహేత॥1262॥.

విదురా! ద్వేషబుద్ధితోనైనను శ్రీకృష్ణుని (శ్రీహరిని) స్మరించుచుండునట్టి శిశుపాలునకును ముక్తి ప్రాప్తించుటను నాడు రాజసూయయాగ సమయమున నీవును చూచియుంటివిగదా! అట్టి స్థితిని పొందుటకొరకు తమ యోగసాధనద్వారా నిరంతరము యోగులు కోరుకొనుచుందురు కదా! తనను ద్వేషించువారికిగూడ నిరతిశయ పురుషార్థరూపమైన ముక్తిని ప్రసాదించునట్టి వాత్సల్యనిధి ఆ పరమపురుషుడు. అట్టి శ్రీకృష్ణుని (శ్రీహరి) విరహమును ఎవరు సహింపగలరు?

2.20 (ఇరువదియవ శ్లోకము)

తథైవ చాన్యే నరలోకవీరా య ఆహవే కృష్ణముఖారవిందమ్|

నేత్రైః పిబంతో నయనాభిరామం పార్థాస్త్రపూతాః పదమాపురస్య॥1263॥

కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణసఖుడైన అర్జునునియొక్క బాణపరంపరస్పర్శకు పునీతులైన వీరులు ఆ సమయమున నయనమనోహరమైన శ్రీకృష్ణభగవానుని ముఖారవిందమును తమ నేత్రములద్వారా పాపము చేయుచూ అసువులువీడి పరమపదమను పొందిరి.

2.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స్వయం త్వసామ్యాతిశయస్త్ర్యధీశః స్వారాజ్యలక్ష్మ్యాఽఽప్తసమస్తకామః| .

బలిం హరద్భిశ్చిరలోకపాలైః కిరీటకోట్యేడితపాదపీఠః॥1264॥

శ్రీకృష్ణభగవానుడు షడ్గుణైశ్వర్యసంపన్నుడు. అందువలన ఆ దేవదేవునకు సాటియైనవారుగాని, అధికులుగాని, ముల్లోకములలో ఎవ్వరును ఉండరు. ఆ స్వామి ముల్లోకములకు అధిపతి. ఆయన తన స్వతస్సిద్ధమైన ఐశ్వర్యముచే సర్వదా పూర్ణకాముడు. నిరంతరము లోకములను పాలించుచుండునట్టి ఇంద్రాదిదేవతలు ఆ ప్రభువునకు కానుకలను సమర్పించుచు, తమ కిరీటములయొక్క అగ్రభాగములుఆ భగవానునని పాదపీఠమును స్పృశించునట్లు ప్రణమిల్లుదురు.

2.22 (ఇరువది రెండవ శ్లోకము)

తత్తస్య కైంకర్యమలం భృతాన్నో విగ్లాపయత్యంగ యదుగ్రసేనమ్|

తిష్ఠన్నిషణ్ణం పరమేష్ఠిధిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి॥1265॥

విదురా! శ్రీకృష్ణుడు రాజసింహాసనముపై ఆసీనుడైయున్న ఉగ్రసేనుని యెదుట నిలిచి 'ప్రభూ! మా ప్రార్థనను వినుడు' మేము మీ సేవకులము. మమ్ము ఆజ్ఞాపింపుము అని సవినయముగా విజ్ఞాపనము చేసెను. భగవానుని యొక్క ఈ అద్భుత సేవాభావమును స్మరించినంతనే నా ఒళ్ళు గగుర్ఫొడుచున్నది.

2.23 (ఇరువది మూడవ శ్లోకము)

అహో బకీ యం స్తనకాలకూటం జిఘాంసయాపాయయదప్యసాధ్వీ|

లేభే గతిం ధాత్ర్యుచితాం తతోఽన్యం కం వా దయాలుం శరణం వ్రజేమ॥1266॥

ఏమాశ్చర్యము! దుష్టులైన పూతన శ్రీకృష్ణుని ప్రాణములను హరింప కోరికతో తన స్తనములలో కాలకూట విషమును నింపుకొని ఆ శిశువునకు స్తన్యమిచ్చెను. అయిననూ ఆమెకు కృష్ణప్రభువు తల్లికి ఈయదగిన గతిని ఆమెకు ప్రసాదించెను. ఆయనయంతటి దయాళువు, సర్వశరణ్యుడు మరొకరు ఉండరు. అట్టి కృష్ణుని విడిచి మేము మరియెవరి శరణుగోరెదము?

2.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

మన్యేఽసురాన్భాగవతాంస్త్ర్యధీశే సంరంభమార్గాభినివిష్టచిత్తాన్|

యే సంయుగేఽచక్షత తార్క్ష్యపుత్రమ్ అంశే సునాభాయుధమాపతంతమ్॥1267॥

అసురులు వైరభావముతో క్రోధావేశమున శ్రీకృష్ణునిపై తమ మనస్సులను లగ్నమొనర్చుచుందురు. అందువలన నేను వారిని సైతము భగవద్భక్తులనుగానే తలంతును. ఏలయన యుద్ధరంగమున తమమీదికి వచ్చుచున్న చక్రధారియైన గరుడారూఢుడగు శ్రీహరియొక్క దర్శనభాగ్యమునకు వారు నోచుకొనిరి.

2.25 (ఇరువది ఐదవ శ్లోకము)

వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్రబంధనే|

చికీర్షుర్భగవానస్యాః శమజేనాభియాచితః॥1268॥

భూభారమును తొలగించుటకై బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును ప్రార్థించెను. ఆయన విన్నపమును ఆలకించి, శ్రీహరి భూదేవికి సుఖమును చేకూర్చుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట ఆ స్వామి కంసునివలన కారాగారమున బంధితులైయున్న దేవకీవసుదేవులకు పుత్రుడుగా అవతరించెను.

2.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తతో నందవ్రజమితః పిత్రా కంసాద్విబిభ్యతా|

ఏకాదశసమాస్తత్ర గూఢార్చిః సబలోఽవసత్॥1269॥

కంసుని భయముచేత తండ్రియైన వసుదేవుడు వెంటనే ఆ ప్రభువును నందగోకులమునకు చేర్చెను. అచ్చట ఆ స్వామి తన ప్రభావము వ్రజవాసులకు దప్ప ఇతరులకు తెలియకుండా తన అన్నయగు బలరామునితోగూడి పదకొండు సంవత్సరములపాటు నివసించెను.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

పరీతో వత్సపైర్వత్సాంశ్చారయన్వ్యహరద్విభుః|

యమునోపవనే కూజద్ద్విజసంకులితాంఘ్రిపే॥1270॥

యమునానదీ సమీపమునగల వనమునందలి వృక్షముల శోభలు అపూర్వములు. ఆ వృక్షములపై జేరిన పక్షులు నిరంతరము మనోహరముగా కలకలారవములను గావించుచుండును. కృష్ణప్రభువు ఆ ఉపవనమున ఆవుదూడలను మేపుచు గోపబాలురతోగూడి విహరించెను.

2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసామ్|

రుదన్నివ హసన్ముగ్ద్ధబాలసింహావలోకనః॥1271॥

ఆయన తన బాల్యలీలలతో గోకులములోని జనుల మనస్సులను దోచివేసెను. ఆయన ఒక్కొక్కసారి నవ్వుచున్నట్లును, మఱియొకసారి ఏడ్చుచున్నట్లును, నటించుచుండెడివాడు. అప్పుడు ఆ స్వామి సింహకిశోరమువలె తన ముగ్ధదృష్టిని వారిపై ప్రసరింపజేయుచుండెడివాడు.

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సితగోవృషమ్|

చారయన్ననుగాన్గోపాన్ రణద్వేణురరీరమత్॥1272॥

శ్రీకృష్ణుడు కొంత పెద్దవాడైన పిమ్మట వివిధములైన వన్నెలుగలిగి దర్శనీయముగా ఉన్న గోవులను, తెల్లని వృషభములను మేపుచు, అనుచరులగు గోపబాలురకు తన మురళీగానముతో వినోదమును గూర్చెను.

2.30 (ముప్పదియవ శ్లోకము)

ప్రయుక్తాన్ భోజరాజేన మాయినః కామరూపిణః|

లీలయా వ్యనుదత్తాంస్తాన్ బాలః క్రీడనకానివ॥1273॥

విదురా! కంసుడు శ్రీకృష్ణుని చంపుటకై మాయావులు, కామరూపులు ఐన శకటాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టాసురుడు మొదలగు రాక్షసులను పంపెను. దైత్యాంతకుడైన శ్రీకృష్ణుడు వారిని అందరిని బాలుడు ఆటబొమ్మలనువలె అవలీలగా హతమార్చెను.

2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

విపన్నాన్విషపానేన నిగృహ్య భుజగాధిపమ్|

ఉత్థాప్యాపాయయద్గావస్తత్తోయం ప్రకృతిస్థితమ్॥1274॥

కాళీయసర్పకారణముగా విషపూరితములైన జలములను ద్రావి గోపాలురు, గోవులు మృత్యువాతబడెను. శ్రీకృష్ణుడు దుష్టుడైన కాళియుని గర్వమణచి, ఆ గోవులను, గోపాలురను పునర్జీవితులను గావించెను. కలుషితములైన యమునాజలములను యథావిధముగా పానయోగ్యములు  గావించెను.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

అయాజయద్గోసవేన గోపరాజం ద్విజోత్తమైః|

విత్తస్య చోరుభారస్య చికీర్షన్ సద్వ్యయం విభుః॥1275॥

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

వర్షతీంద్రే వ్రజః కోపాద్భగ్నమానేఽతివిహ్వలః|

గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణతా॥1276॥

ఇంద్రయాగము చేయుటకై సంకల్పించిన వ్రజవాసులయొక్క సమృద్ధమైన సంపదను సద్వినియోగ పఱచుటకై కృష్ణప్రభువు బ్రాహ్మణోత్తములద్వారా నందగోపునిచే గోవర్ధన పూజారూపమైన గోయజ్ఞమును చేయించెను. విదురా! గోపాలురు ఇంద్రయాగమును మానివేయగా ఇంద్రుడు వారు తనను అవమానించినట్లుగా భావించెను. అందులకు కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు వ్రజభూమిని రూపుమాపుటకై కుంభవృష్టిని కురిపించెను. అప్పుడు కరుణాళువైన గోవిందుడు గోవర్ధనగిరిని అవలీలగా ఛత్రమువలె చేబూని వారిని రక్షించెను. ఆ విధమగా భయముచే వణికిపోయిన వ్రజవాసులు, తమ గోసంపదతో శ్రీకృష్ణానుగ్రహముతో ప్రాణప్రమాదము నుండి బయటపడిరి.

2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

శరచ్ఛశికరైర్మృష్టం మానయన్ రజనీముఖమ్|

గాయన్ కలపదం రేమే స్త్రీణాం మండలమండనః॥1277॥

సంధ్యాసమయమున బృందావనమంతయును శరత్కాలచంద్రకాంతులతో ఆహ్లాదకరముగా నుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు చంద్రుని గౌరవించుచు (వెన్నెల శోభలను ఇనుమడింపజేయుచు), వలయాకారముననున్న గోపికలకు సంతోషకరముగా, అవ్యక్తమధురమైన తన వేణుగానముతో గోపికాసమేతుడై రాసలీలలను నెరపెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే విదురోద్ధవసంవాదే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందలి ఉద్దవుడు శ్రీకృష్ణభగవానుని బాల్యలీలలను వర్ణించుట అను రెండవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

2.4.2022 సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


తృతీయ స్కంధము-ఐదవ అధ్యాయము


విదురుడు మైత్రేయుని ప్రశ్నించుట - మైత్రేయుడు ఆయనకు సృష్టిక్రమమును వివరించి చెప్పుట


ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️

తృతీయస్కంధము - 5వ అధ్యాయము


శ్రీశుక ఉవాచ


5.1 (ప్రథమ శ్లోకము)


ద్వారి ద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయమాసీనమగాధ బోధమ్|


క్షత్తోపసృత్యాచ్యుతభావశుద్ధః పప్రచ్చ సౌశీల్యగుణాభితృప్తః॥1241॥


శ్రీశుకుడు నుడివెను- పరీక్షిన్మహారాజా! కురుశ్రేష్ఠుడైన విదురుడు హరిద్వారక్షేత్రమున గంగాతీరమున ఆసీనుడైయున్న మైత్రేయుని గాంచెను. మైత్రేయమహర్షి విజ్ఞానఖని. సత్యము, ఆర్జవము, దయ, దానము, అహింస మొదలగు గుణములకు నెలవైనవాడు. భగవద్భక్తి భావముచే పరిశుద్ధ మనస్కుడైన విదురుడు ఆ మహాత్ముని ఉదాత్తగుణములకు ముగ్ధుడై సమిత్పాణియై వినమ్రతతో ఆయనను సమీపించి ఇట్లు ప్రశ్నించెను.


విదుర ఉవాచ


5.2 (రెండవ శ్లోకము)


సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైస్సుఖం వాన్యదుపారమం వా|


విందేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః॥1342॥


విదురుడు పలికెను- పూజ్యుడవైన మహర్షీ! జనులు ఈ లోకమున సుఖములను అర్థించుచు తమ కర్మలను ఆచరించుచుందురు. కానీ, వారికి సుఖములు లభింపవు సరిగదా! దుఃఖములును దూరముగావు. అవి (ఆ దుఃఖములు) ఇంకను వృద్ధిచెందుచుండును. దుంఖములను దూరమొనర్చుకొని, నిరతిశయ సుఖములను పొందుటకు చేయవలసిన కర్తవ్యమును తెలుపుము.


5.3 (మూడవ శ్లోకము)


జనస్య కృష్ణాద్విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య|


అనుగ్రహాయేహ చరంతి నూనమ్ భూతాని భవ్యాని జనార్దనస్య॥1343॥


మహాత్మా! జనులు తమ పూర్వజన్మకర్మల ఫలితముగా శ్రీకృష్ణభక్తినుండి విముఖులగుదురు. ఫలితముగా వారు అధర్మశీలురై మిక్కిలి దుఃఖముల పాలగుచుందురు. అట్టి వారిని అనుగ్రహించి, వారికి యోగక్షేమములను కూర్చుటకొరకే మీవంటి భాగవతోత్తములు ఈ లోకమున సంచరించుచుందురు. సాధుజనులసంచారము లోక కల్యాణము కొరకేగదా!


5.4 (నాలుగవ శ్లోకము)


తత్సాదువర్యాదిశ వర్త్మ శం నః సంరాధితో భగవాన్ యేన పుంసామ్|


హృది స్థితో యచ్ఛతి భక్తిపూతే జ్ఞానం సతత్త్వాధిగమం పురాణమ్॥1344॥


సాధుశిరోమణీ! జనులకు మంగళకరమగు మార్గమును తెలుపుము. భక్తి భావముతో ఆ మార్గమును అనుసరించుచు భగవంతుని ఆరాధించువారి యొక్క హృదయములు పవిత్రములగును. భగవదనుగ్రహమున అట్టివారి హృదయములయందు నిలిచియుండే భగవంతుడు వారికి ఆత్మస్వరూపముయొక్క అపరోక్షానుభూతిని కలిగించే సనాతన జ్ఞానమును అనుగ్రహించును.


5.5 (ఐదవ శ్లోకము)


కరోతి కర్మాణి కృతావతారో యాన్యాత్మతంత్రో భగవాంస్త్ర్యధీశః|


యథా ససర్జాగ్ర ఇదం నిరీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే॥1345॥


త్రిలోకములకు నియంత, పరమస్వతంత్రుడు ఐన శ్రీహరి లోక కల్యాణము కొరకై పెక్కు అవతారములను ఎత్తి ఎట్టి లీలలను నెరపుచుండును? ఆ పరమేశ్వరుడు అకర్తయై, ప్రతిఫలాపేక్ష లేకున్నను కల్పారంభమున ఈ జగత్తును సృష్టించిన విధమెట్టిది? దానిని సురక్షితమొనర్చుటకు ప్రాణుల జీవికకు తగిన ఆధారమును ఏర్పరుచు విధానమెట్టిది?


5.6 (ఆరవ శ్లోకము)


యథా పునః స్వే ఖ ఇదం నివేశ్య శేతే గుహాయాం స నివృత్తవృత్తిః|


యోగేశ్వరాధీశ్వర ఏక ఏతత్ అనుప్రవిష్టో బహుధా యథాఽఽసీత్॥1346॥


ఆ స్వామి ఈ జగత్తును మరల తన హృదయాకాశమున లీనమొనర్చును. పిమ్మట తాను ఎట్టి జగద్వ్యాపారమూ లేనివాడై, యోగమాయను ఆశ్రయించి, అందు శయనించు విధము యెట్టిది? యోగేశ్వరేశ్వరుడైన ఆ ప్రభువు తాను ఒక్కడేయైనను ఈ బ్రహ్మాండమున సకలప్రాణులలో అంతర్యామియై అనేక రూపములలో ఎట్లు ప్రకటమగుచుండును? ఈ విషయములకు సంబంధించిన రహస్యములను అన్నింటిని నీవు నాకు దయతో తెలుపుము.


5.7 (ఏడవ శ్లోకము)


క్రీడన్ విధత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతారభేదైః|


మనో న తృప్యత్యపి శృణత్వాం నః సుశ్లోకమౌళేశ్చరితామృతాని॥1347॥


గో,బ్రాహ్మణ, దేవతల హితము కొరకు భగవంతుడు పెక్కు అవతారములను దాల్చును. దుష్టసంహారము, శిష్టరక్షణము, ధర్మసంస్థాపనము మొదలగు దివ్యకర్మలను ఆచరించును. పవిత్రకీర్తిమంతులైన వారిలో ప్రముఖుడగు శ్రీహరియొక్క చరితామృతమును ఎంతగా గ్రోలినను మా మనస్సులు తృప్తి చెందుటలేదు.


5.8 (ఎనిమిదవ శ్లోకము)


యైస్తత్త్వభేదైరధిలోకనాథో లోకానలోకాన్ సహ లోకపాలాన్|


అచీక్లుపద్యత్ర హి సర్వసత్త్వనికాయభేదోఽధికృతః ప్రతీతః॥1348॥


లోకాధిపతియగు శ్రీహరి ఆయాకర్మలకు అనుగుణముగా ప్రతీతిమగుచుండెడి వివిధప్రాణుల సమూహములతో ఒప్పుచుండెడి లోకములను, లోకపాలురను,లోకాలోకములకు వెలుపలనున్న భాగములను ఏయే మహదాదితత్త్వములద్వారా కల్పించెనో, వర్ణింపుము.


5.9 (తొమ్మిదవ శ్లోకము)


యేన ప్రజానాముత ఆత్మకర్మరూపాభిధానాంచ భిదాం వ్యధత్త|


నారాయణో విశ్వసృదాత్మయోనిః  ఏతచ్చ నో వర్ణయ విప్రవర్య॥1349॥


విప్రోత్తమా!మైత్రేయా! ప్రజలు వేర్వేరు స్వభావ, కర్మ, రూప, నామములతో ఒప్పు చుండునట్లు ఆదికారణుడు,విశ్వస్రష్టయు ఐన శ్రీమన్నారాయణుడు ఏవిధముగా రచించెనో, మాకు తెలుపుము.


5.10 (పదియవ శ్లోకము)


పరావరేషాం భగవన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణమ్|


అతృప్నుమ క్షుల్లసుఖావహానామ్ తేషామృతే కృష్ణకధామృతౌఘాత్॥1350॥


మైత్రేయమహర్షీ, నేను వేదవ్యాస ముఖారవిందము నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులయొక్కయు,స్త్రీ, శూద్రులయొక్కయు ధర్మములను గూర్చి పెక్కుమారులు వినియుంటిని. కానీ, శ్రీకృష్ణకథామృతప్రవాహము తప్ప అల్పసుఖావహములైన ఆ ధర్మములు ఎన్నియును నాకు తృప్తిని గూర్చుటలేదు.


5.11 (పదునొకండవ శ్లోకము)


కస్తృప్నుయాత్తీర్థపదోఽభిధానాత్|


యః కర్ణనాడీం పురుషస్య యాతో భవప్రదాం గేహరహితం ఛినత్తి॥1351॥


మహాత్మా! నారదాది మహర్షులు శ్రీకృష్ణపరమాత్మ యొక్క దివ్యగాథలను మీవంటి సాధువుల సమాజముల యందు ఎంతగానో ప్రస్తుతించిరి. ఆ మధుర కథామృతమును ఎంతగా గ్రోలినను ఎవ్వరికిని తనివితీరదు కదా! ఆ పవిత్రగాథలు శ్రోతలు కర్ణరంధ్రములద్వారా వారి హృదయములలో ప్రవేశించి, జననమరణ చక్రమునకు కారణభూతమైన దేహ-కళత్ర-సంతానాదుల యందలి ఆసక్తిని త్రెంచివేయును.


5.12 (పండ్రెండవ శ్లోకము)


మునిర్వివక్షుర్భగవద్గుణానాం సభాపి తే భారతమాహ కృష్ణః|


యస్మిన్నృణాం గ్రామ్యసుఖానువాదైః మతిర్గృహీతా ను హరేః కథాయామ్॥1352॥


మైత్రేయా! నీ మిత్రుడైస వేదవ్యాసమహర్షి గూడ భగవంతుని కల్యాణగుణములను వర్ణించు ఇచ్ఛతోడనే మహాభారతమును రచించెను.  ఆ భారతమునందును విషయసుఖములను గూర్చి ఉల్లేఖించుచు మానవుల బుద్ధులను భగవంతుని కథలవైపే మరలించుటకు ప్రయత్నించెను. అందునను విషయసుఖ లోలులైనవారి బుద్ధులను భగవద్వృత్తాంతము వైపే మరలించుటకు యత్నించెను.


5.13 (పదమూడవ శ్లోకము)


సా శ్రద్దధానస్య వివర్ధమానా విరక్తిమన్యత్ర కరోతి పుంసః|


హరేః పదానుస్మృతినిర్వృతస్య సమస్తదుఃఖాత్యయమాశు ధత్తే॥1353॥


ఋషిసత్తమా! నిరంతరము హరికథాశ్రవణము చేయుటవలన మనుజులకు ఆ కథలను వినుటయందు శ్రద్ధ యేర్పడి, ఇతర విషయములయందు విరక్తి కలుగును. భగవంతుని చరణారవిందములచే నిరంతరము ధ్యానించుచుండుటవలన ఆ పురుషుడు ఆనందమగ్నుడగును. అతని దుఃఖములన్నియును వెంటనే తొలగిపోవును.


5.14 (పదునాలుగవ శ్లోకము)


తాన్ శోచ్యశోచ్యానవిదోఽనుశోచే హరేః కథాయాం విముఖానఘేన|


క్షిణోతి దేవోఽనిమిషస్తు యేషామ్ ఆయుర్వృథావాదగతిస్మృతీనామ్॥1354॥


మహామునీ! ఈ ప్రపంచమున అజ్ఞానులు శ్రీహరికథలయెడ విముఖతచూపుచుందురు. అది మిగుల మహాపాపము. ఆ పాపాత్ములు వాదవివాదములయందును, వ్యర్థమైన లౌకిక వ్యాపారములయందును, ఆలోచనల యందును అమూల్యమైన తమ జీవితమును వృథాచేసికొనుచుందురు. కాలపురుషుడు అట్టివారి ఆయువును క్షీణింపజేయుచుండును. అట్టి అజ్ఞానులను చూచినప్పుడు నాకు మిక్కిలి జాలి కలుగుచుండును. 


5.15 (పదునైదవ శ్లోకము)


తదస్య కౌషారవ శర్మదాతుః హరేః కథామేవ కథాసు సారమ్|


ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తేః॥1355॥


మైత్రేయమహర్షీ! నీవు సాంసారిక తాపత్రయములను అన్నింటిని తొలగించి, సుఖమును చేకూర్చువాడవు. శ్రీహరి సకలలోకవాసులను రక్షించుచు, వారిని ఆనందింపజేయుచు జగత్ప్రసిద్ధినందిన వాడు. తుమ్మెద వివిధములగు పువ్వులలోని మకరందమును గ్రహించి, తేనె సమకూర్చినట్లు, శ్రీకృష్ణభగవానుని పుణ్యకథలయందలి సారమును గ్రహించి, మా (మానవాళి) క్షేమము కొరకు కథారూపములో వివరింపుము.


5.16 (పదునారవ శ్లోకము)


స విశ్వజన్మస్థితిసంయమార్థే కృతావతారః ప్రగృహీతశక్తిః|  


చకార కర్మాణ్యతిపూరుషాణి యానీశ్వరః కీర్తయ తాని మహ్యమ్॥1356॥


సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు తన మాయాశక్తిని స్వీకరించి విశ్వముయొక్క సృష్టి, స్థితి లయములను నిర్వహించును. ఆ ప్రభువు ఈ లోకమునందు రామకృష్ణాది అవతారముల ద్వారా పెక్కు అలౌకికలీలలను నెరపెను. వాటిని అన్నింటిని నాకు సమగ్రముగా వివరింపుము.


శ్రీ శుక ఉవాచ


5.17 (పదునేడవ శ్లోకము)


స ఏవం భగవాన్ పృష్టఃక్షత్త్రా కౌషారవిర్మునిః|


పుంసాంనిశ్శ్రేయసార్థేన తమాహ బహు మానయన్॥1357॥


శ్రీశుకుడు నుడివెను- విదురుడు సమస్త ప్రాణుల శ్రేయస్సు (మోక్షప్రాప్తి) కొరకు ఇట్లు ప్రశ్నింపగా పూజ్యుడైన మైత్రేయమహాముని ఆయనను  మిగుల అభినందించుచు, ఇట్లనెను-


మైత్రేయ ఉవాచ


5.18 (పదునెనిమిదవ శ్లోకము)


సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహ్ణతా|


కీర్తిం వితన్వతా లోకే ఆత్మనోఽధోక్షజాత్మనః॥1358॥


మైత్రేయుడు వచించెను-సాధుపురుషుడైవైన విదురా! నీవు సకలజీవులయొక్క క్షేమలాభములను గోరుచు చక్కగా ప్రశ్నించితిని. నీ చిత్తము నిరంతరము భగవానునియందే లగ్నమైయుండును. అందువలన లోకమున నీ కీర్తి  విస్తరించును. 


5.19 (పందొమ్మిదవ శ్లోకము)


నైతచ్చిత్రం త్వయి క్షత్తర్బారాయణవీర్యజే|


గృహీతోఽనన్యభావేన యత్త్వయా హరిదీశ్వరః॥1359॥


విదురా! నీవు వేదవ్యాసుని అనుగ్రహమున జన్మించినవాడవు. అంతేగాదు, శ్రీహరియందు అనన్యభక్తి సంపన్నుడవు. అట్టి నీవు లోకానుగ్రహకాంక్షతో అట్లు ప్రశ్నించుట ఏమాత్రమూ ఆశ్చర్యకరముగాదు.


5.20 (ఇరువదవ శ్లోకము)


మాండవ్యశాపాద్భగవాన్ ప్రజాసంయమనో యమః|


భ్రాతుఃక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీసుతాత్॥1360॥


భగవద్భక్తిలేని పాపాత్ములను శిక్షించునట్టి పూజ్యుడు యమధర్మరాజు. నీవు పూర్వజన్మలో ఆ యముడవే. మాండవ్యమహర్షి శాపకారణముగా నీవు విచిత్రవీర్యునిచేత భార్యగా ఆదరింపబడిన భోగపత్నియగు దాసియందు వ్యాసభగవానుని వలన జన్మించినవాడవు


5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


భగవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్య చ|


యస్య జ్ఞానోపదేశాయ మాఽఽదిశద్భగవాన్ వ్రజన్॥1361


విదురా! నీవు శ్రీకృష్ణభగవానునకును, ఆ స్వామియొక్క పరమభక్తులకు నిత్యము మిక్కిలి ఇష్టుడవు. కనుక ఆ ప్రభువు భూలోకమును వీడి, పరంధామమునకు చేరు సమయమున నిన్ను స్మరించెను. మరియు నీకు జ్ఞానోపదేశము చేయమని నన్ను ఆజ్ఞాపించెను.


5.22 (ఇరువది రెండవ శ్లోకము)


అథ తే భగవల్లీలా యోగమాయాపబృంహితాః|


విశ్వస్థిత్యుద్భవాంతార్థాః వర్ణయామ్యనుపూర్వశః॥1362॥


అందువలన జగదుత్పత్తిస్థితి సంహారములకై భగవంతుడు తన యోగమాయద్వారా విస్తరింపజేసిస బహువిధములగు లీలలను క్రమముగా వర్ణించెదను.


5.23 (ఇరువది మూడవ శ్లోకము)


భగవానేక ఆసేదమగ్ర ఆత్మాఽఽత్మనం విభుః|


ఆత్మచ్ఛానుగతావాత్మా నానామత్యుపలక్షణః॥1363॥


సృష్టికి పూర్వము సకలజీవులకును ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడేయుండెను. ఆ సమయమున ద్రష్ట,దృశ్యము ఏవియును లేవు. అప్పుడు నేను అనేక రూపములలో విలసిల్లుదును అని భగవానుడు సంకల్పించెను. ఆ ప్రభువుయొక్క ఇచ్ఛానుసారము ఒకే ఆత్మ మాయాశక్తి ద్వారా అనేకరూపములలో వేర్వేరు జీవులుగా పరిణమించెను. వాస్తవముగా ఇదియంతయు (దృశ్యప్రపంచమంతయును) మాయావిలాసమే. మాయయొక్క ఆవరణము తొలగినంతనే సర్వత్ర పరమాత్మయే దర్శనమిచ్చును. 


5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)


స వా ఏష తదా ద్రష్టా నాపశ్యద్దృశ్యమేకరాట్|


మేనేఽసంతమివాత్మానం సుప్తశక్తిరసుప్తదృక్॥1364॥


ఆ సమయమున పరమాత్మ ఒక్కడే ద్రష్టగా విలసిల్లుచుండెను. దృశ్యము అను పేరుతో ఏ వస్తువూ లేకుండెను. ఏలయన, అతనిశక్తులు అన్నియును సుప్తావస్థలో ఉండెను. అట్టిస్థితిలో ఆ ప్రభువు తానుగూడ లేనట్లు భావించుకొనెను. కాని, వాస్తవమునకు జ్ఞానస్వరూపుడగు ఆ పరమేశ్వరుని జ్ఞానము ఎప్పుడునూ సుప్తదశలో ఉండదు. ఎల్లప్పుడు జాగ్రత్ దశలో యుండును. కనక ఆ  స్వామి తన ఇచ్ఛాశక్తిద్వారానే విశ్వమును సృజించెను.


5.25 (ఇరువది ఐదవ శ్లోకము)


సా వా ఏతస్య సంద్రష్టుః శక్తిః సదసదాత్మికా|


మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః॥1365॥


విదురా! సదసద్రూపమునగల కార్యకారణాత్మక శక్తియే మాయ. ఇది ద్రష్టయొక్క శక్తివలననే చైతన్యవంతమగును. ద్రష్టయొక్క రూపములో కేవలము పరమాత్మయే యుండును. ఈ విధముగా భగవంతుడే తన సంకల్పము ద్వారా విశ్వమును సృష్టించెను.


5.26 (ఇరువది ఆరవ శ్లోకము)


కాలవృత్త్యా తు మాయాయాం గుణమయ్యామధోక్షజః|


పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్॥1366॥ 


ఆ సమయమున భగవంతనియొక్క కాలశక్తి త్రిగుణాత్మకమైన మాయయందు సంక్షోభమును కలుగజేసెను. దాని వలన ఇంద్రియాతీతుడైన పరమాత్మ తనయంశయైన పురుషరూపముద్వారా ఆ మాయయందు తన చిత్ శక్తిరూపమైన తేజమును (వీర్యమును) ఉంచెను.


5.27 (ఇరువది ఏడవ శ్లోకము)


తతోఽభవన్మహత్తత్త్వమ్ అవ్యక్తాత్కాలచోదితాత్|


విజ్ఞానాత్మాఽఽ త్మ దేహస్థం విశ్వం వ్యంజంస్తమోనుదః॥1367॥


అంతట కాలముయొక్క ప్రేరణచేత అవ్యక్తప్రకృతినుండి మహత్తత్త్వము ప్రకటితమయ్యెను. అది విజ్ఞానస్వరూపము. అజ్ఞానమును రూపుమాపునట్టిది. సూక్ష్మరూపములోనున్న ప్రపంచమును అభివ్యక్తీకరించునట్టిది. సమగ్రమైన విశ్వమును ప్రకటించుశక్తి కలదియగుటవలన అది సమిష్టిబుద్ధి యొక్క విలాసము,విజ్ఞానాత్మకము.


5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)


సోఽప్యంశగుణకాలాత్మా భగవద్ దృష్టిగోచరః|


ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాస్య సిసృక్షయా॥1368॥


ఆ మహత్తత్త్వము చైతన్యాంశతో యుక్తమై త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క కాలస్వరూపమగుటవలన విశ్వమును ప్రకటించునది అయ్యెను. దానిని విశ్వనిర్మాణమునందు సహాయకారిగా భగవంతుడు చూచెను. వెంటనే ఆ మహత్తత్త్వము రూపాంతరము  చెందెను.


5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)


మహత్తత్త్వాద్వికుర్వాణాదహంతత్త్వం వ్యజాయత|


కార్యకారణకర్త్రాత్మా భూతేంద్రియమనోమయః॥1369॥


పరిణామము చెందిన మహత్తత్త్వమునుండి అహంకార తత్త్వము ఉత్పన్నమయ్యెను. అది కార్య (అధిభూతము), కారణ (అధ్యాత్మము), కర్త (అధిదైవము)  ల రూపమగుట వలన క్రమముగా పంచమహాభూతములకును, ఇంద్రియములకును, మనస్సునకును కారణమయ్యెను.


5.30 (ముప్పదియవ శ్లోకము)


వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిథా|


అహంతత్త్వాద్వికుర్వాణాన్మనో వైకారికాదభూత్|


వైకారికాశ్చ యే దేవా అర్థాభివ్యంజనం యతః॥1370॥


అహంకారము మూడువిధములు. వైకారికము (సాత్త్వికము), తైజసము (రాజసము), తామసము. ఈ అహంకార తత్త్వము పరిణామము పొందినప్పుడు వైకారికమునుండి మనస్సు ఏర్పడును. దానివలన విషయముల పరిజ్ఞానము ఏర్పడును. ఇంద్రియములకు అధిష్టానదేవతలు ఉత్పన్నమగుదురు. 


5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)


తైజసానీంద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ|


తామసో భూతసూక్ష్మాదిర్యతః ఖం లింగమాత్మనః॥1371॥


తైజసాహంకారమునుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఉత్పన్నములయ్యెను. తామసాహంకారము నుండి సూక్ష్మభూతములకు కారణమైన శబ్దతన్మాత్ర ఏర్పడెను. ఈశబ్దతన్మాత్రద్వారా ఆకాశము ఏర్పడెను.  ఈ ఆకాశము సర్వవ్యాపకమైనది. కావున ఆత్మయొక్క సర్వవ్యాపకత్వమునకు ఈ ఆకాశము దృష్టాంతముగా పేర్కొనబడును.


5.32 (ముప్పది రెండవ శ్లోకము)


కాలమాయాంశయోగేన గవద్వీక్షితం నభః|


నభసోఽనసృతం స్పర్శం వికుర్వన్నిర్మమేఽనిలమ్॥1372॥


భగవంతుని దృష్టి ఆకాశముపై పడినప్పుడు ఆ ఆకాశమునందు కాలము, మాయ, చిచ్ఛక్తుల యోగమువలన స్పర్శతన్మాత్ర ఏర్పడును. దాని పరిణామమే వాయువు.


5.33 (ముప్పది మూడవ శ్లోకము)


అనిలోఽపి వికుర్వాణో నభసోరుబలాన్వితః|


ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనమ్॥1373॥


వాయువు మిగుల బలీయమైనది. అది ఆకాశమతో సంయోగము చెందినప్పుడు తత్పరిణామమున రూపతన్మాత్ర ఏర్పడును. దానివలన తేజస్సు ఏర్పడెను. అది (తేజస్సు) లోకమునకు వెలుగును ఇచ్చును.


5.34 (ముప్పది నాలుగవ శ్లోకము)


అనిలేనాన్వితం జ్యోతిర్వికుర్వత్పరవీక్షతమ్|


అధత్తాంభో రసమయం కాలమాయాంశయోగతః॥1374॥


పరమాత్మ దృష్టి ప్రభావమున వాయుయుక్తమైన తేజస్సుతో కాలము, మాయ, చిదంశల సంయోగము వలన రసతన్మాత్ర ఏర్పడును. రసతన్మాత్ర నుండి జలము రూపొందును.


5.35 (ముప్పది ఐదవ శ్లోకము)


జ్యోతిషాంభోఽనుసంసృష్టం వికుర్వద్బ్రహ్మవీక్షితమ్|


మహీం గంధగుణామాధాత్కాలమాయాంశయోగతః॥1375॥


అనంతరము తేజస్సుతో గూడిన జలము భగవద్వీక్షణప్రభావమున కాలము, మాయ, చిదంశల సంయోగము పొంది, గంధగుణాత్మకమైన పృథ్విని ఉత్పన్నమొనర్చెను.


5.36 (ముప్పది ఆరవ శ్లోకము)


భూతానాం నభ ఆదీనం యద్యద్భవ్యావరావరమ్|


తేషాం పరానుసంసర్గాద్యథాసంఖ్యం గుణాన్ విదుః॥1376॥


విదురా! ఆకాశము మొదలుకొని ఏయే భూతములు ఏర్పడినచో వాటియందు క్రమముగా మునుపటి పంచభూతముల గుణములు (పంచతన్మాత్రలు)  గూడ ఉండునని ఎరుంగవలయును. అధ్యాత్మము అనగా జ్ఞానేంద్రియములు(5), కర్మేంద్రియములు(5), మనస్సు  మొత్తం 11, అధిభూతము అనగా ఇంద్రియాదుల విషయములు, అనగా పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస,గంధములు), అధిదైవము అనగా ఇంద్రియాధిష్టానదేవతలు, పది ప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు-అను పంచప్రాణములు, నాగ,కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు అను ఐదు ఉపప్రాణములు).


5.37 (ముప్పది ఏడవ శ్లోకము)


ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలింగినః|


నానాత్వాత్ స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుమ్॥1377॥


మహత్తత్త్వము మున్నగు వాటి అభిమాన దేవతలు శ్రీమహావిష్ణువుయొక్క అంశలే. ప్రకృతిలో కాలముయొక్క ప్రభావమువలన వికారము ఏర్పడును. అట్లే మాయయొక్క ప్రభావముచే విక్షేపము కలుగును మరియు చిదాభాసముయొక్క ప్రభావము వలన చేతనమేర్పడును. వీటితో పాటుగా మహత్తత్త్వాది అభిమాన దేవతలు కలిగిరి. వీరు వేరు వేరుగా ఉండుటవలన, సృష్టిరచనయందు అసమర్థులైరి. అప్పుడు వీరందరు కలిసి ప్రాంజలులై భగవంతుని ఇట్లు స్తుతించిరి.


దేవా ఊచుః


5.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)


నమామ తే దేవ పదారవిందం ప్రపన్నతాపోపపశమాతపత్రమ్|


యన్మూలకేతా యతయోఽంజసోరుసంసారదుఃఖం బహిరుత్ క్షిపంతి॥1378॥


దేవతలు ఇట్లు పలికిరి- సర్వేశ్వరా! నీ పాదారవిందములకు నమస్కరించుచున్నాము. అవినిన్ను శరణుజొచ్చిన జీవులను సకలతాపములనుండి ఛత్రములవలె రక్షించును. యత్నశీలురగు యతీశ్వరులు నీ పాదకమలములను ఆశ్రయించి అంతులేని సంసార దుఃఖములను సులభముగా దూరమునుండియే పారద్రోలుచున్నారు.


5.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)


ధాతర్యదస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేణోపహతా న శర్మ|


ఆత్మన్ లభంతే భగవంస్తవాంఘ్రిచ్ఛాయాం సవిద్యామత ఆశ్రయేమ॥1379॥


సర్వేశ్వరా! ఈ సంసారమునందు ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికమలనెడు తాపత్రయములచే పీడితులైన జీవులకు ఎంతమాత్రము శాంతి లభించుటలేదు. కనుక పరమేశ్వరా! మేము జ్ఞానమయములైన నీ చరణకమలముల యొక్క నీడను ఆశ్రయించుచున్నాము.


5.40 (నలుబదియవ శ్లోకము)


మార్గంతి యత్తే ముఖపద్మనీడైః ఛందస్సుపర్ణైరృషయో వివిక్తే| 


యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదంపదం తీర్థపదః ప్రపన్నాః॥1380॥


పరమపురుషా! నీ ముఖపద్మము వేదములకు నెలవైనది. గూటినుండి వెలువడిన పక్షులు తిరిగితిరిగి తమ గూటికే చేరినట్లు, నిస్సంగులైన ఋషులు ఆ వేదములద్వారా నీకై అన్వేషించి, చివరకు నిన్నే చేరుదురు. సకలపాపములను రూపుమాపునట్టి పవిత్రజలములుగల నదులలో శ్రేష్ఠమైనది గంగానది. అట్టి గంగానదికి పుట్టుకస్థానమైన నీ పాదమున మేము ఆశ్రయించుచున్నాము.


5.41 (నలుబది ఒకటవ శ్లోకము)


యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సంమృజ్యమానే హృదయేఽవధాయ|


జ్ఞానేద వైరాగ్యబలేన ధీరాః వ్రజేషు తత్తేఽంఘ్రిసరోజపీఠమ్॥1381॥


నీ చరణకమలములను వహించు నీ పాదపీఠమును శరణుజొచ్చి, నీ భక్తులు శ్రవణభక్తిద్వారా నీ దివ్యగుణవైభవములను శ్రద్ధాదరములతో కీర్తించుచుందురు. దానివలన వారియొక్క అంతఃకరణములు పూర్తిగా నిర్మలములగును. అంతట తమ జ్ఞానవైరాగ్య పటిమచే వారు జితేంద్రియులగుదురు. జితేంద్రియులైన జ్ఞానులకును ఆశ్రయభూతమైన నీ పాదపీఠమును మేము శరణు జొచ్చెదము.


5.42 (నలుబది రెండవ శ్లోకము)


విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే|


వ్రజేషు సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్॥1382॥


సర్వేశ్వరా! నీవు ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములకొరకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములను దాల్చుచుందువు. నీ పాధపద్మములను స్మరించిన పరమభక్తులకు నీవు అభయమొసంగి, వారి సాంసారిక దుఃఖములను రూపుమాపుచుందువు. కనుక, అట్టి మహత్త్వపూర్ణుడవైన నీ యొక్క చరణకమలములను మేము శరణు జొచ్చెదము.


5.43 (నలుబది మూడవ శ్లోకము)


యత్సానుబంధేఽసతి దేహగేహేమమాహమిత్యూఢదురాగ్రహాణామ్|


పుంసాం సుదూరం వసతోఽపి పుర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జమ్॥1383॥


దేహగేహములయందు, తత్సంబంధించిన వ్యక్తిపదార్థములయందు నేను-నాది యను అసత్తులతో అజ్ఞానులు తమ సంబంధమును బలముగ జోడించు కొందురు. అట్టివారి హృదయములయందు అంతర్యామిగా నీవు ఉన్నప్పటికీ వారు నీకు దూరముగా ఉందురు. అనగా అంతర్యామిగా తమకు చేరువలోనేయున్న నిన్ను తెలిసికొనజాలరు. కాని నీ భక్తులు నిన్ను దర్శించుకొందురు. అట్టి నీ చరణకమలములను మేము శరణు జొచ్చెదము.


5.44 (నలుబది నాలుగవ శ్లోకము)


తాన్వై హ్యసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాంతర్మనసః పరేశ|


అథో న పశ్యంత్యురుగాయ నూనం యే థే పదన్యాసవిలాసలక్ష్మ్యాః॥1384॥


సర్వేశ్వరా! విషయసుఖలోలురయొక్క మనస్సులు ఎల్లప్పుడును బాహ్యవస్తువుల పైననే తిరుగాడుచుండును. అట్టి పామరులు నీ పవిత్రపాదసేవలకు దూరముగా ఉందురు. అంతేగాదు, వారు వైభవోపేతములైన నీ పాదపద్మముల శోభలను ఎరిగిన భక్తజనులను దర్శించుటకును విముఖులుగా ఉందురు. 


5.45 (నలుబది ఐదవ శ్లోకము)


పానేన తే దేవ కథాసుధాయాః  ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే|


వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాంజసాన్వీయురకుంఠధిష్ట్యమ్ఋ॥1385॥


దేవా! నీ పుణ్యకథామృతమును గ్రోలుటవలన జనులలో నీపై భక్తిశ్రద్ధలు ఇనుమడించును. అందువలన వారియొక్క అంతఃకరణములు నిర్మలమగును. అట్టివారు జడవస్తువులయందు వైరాగ్యమును పొంది ఆత్మజ్ఞానులగుదురు. వారు అనాయాసముగనే నీ పరమపదమునకు చేరుదురు.


5.46 (నలుబది ఆరవ శ్లోకము)


తథాపరే చాత్మసమాధియోగబలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠామ్|


త్వామేవ ధీరాః పురుషం విశంతి తేషాం శ్రమః స్యాన్న తు  సేవయా తే॥1386॥


పరమేశ్వరా! కొందరు ధీరులు చిత్తవృత్తి నిరోధరూపమైన అష్టాంగయోగమార్గమును అవలంబించి, బలీయమైన మాయను జయింతురు. వారు సమాధిస్థితులై నీలో లీనమగుదురు. కానీ! వారి సాధనమార్గము క్లిష్టమైనది. అనగా శ్రమతో గూడినది. నీ భక్తులు మాత్రము నీ యెడగల భక్తిప్రభావముచే కథాశ్రవణాది సేవలద్వారా సులభముగనే సంసారసాగరముసు తరించి, నిన్ను చేరుదురు. ఏలయన భక్తులను నీవే స్వయముగా ఉద్ధరింతువు.


5.47 (నలుబది ఏడవ శ్లోకము)


తత్తే నయం లోకసిసృక్షయాఽఽద్య త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ|


సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే॥1387॥


ఆదిదేవా!సృష్టిరజస్తమోగుణములతో  సృజించితివి. కనుక, విభిన్న స్వభావముగల మేము ఐకమత్యము కొరవడి నీకు క్రీడాపరికరమైన బ్రహ్మాండమును రచించి, నీకు సమర్పణ చేయుటకు అశక్తులమైతిమి.


5.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)


యావద్బలిం తేఽజ హరామ కాలే యథా నయం చాన్నమదామ యత్ర|


యథోభయేషాం త ఇమే హి లోకాః బలిం హరంతోఽన్నమదంత్యనూహాః॥1388॥

జన్మరహితుడవైన పరమేశ్వరా! మేమునూ జగత్పోషణయందు భాగస్వాములపై అన్నివిధములుగా సకాలములో నీకు భోగ్యసామాగ్రిని సమర్పణ చేయుటకు మాకు తగిన శక్తిని ఇమ్ము. దానివలన మేము గూడ మా యోగ్యతను అనుసరించి, భోగ్యపదార్థములను (హవ్యములను) గ్రహింపగలము. అప్పుడు ఈ జీవులు అందరును ఎట్టి విఘ్నములకును, బాధలకును గురికాక , మాకును, నీకును భోగ్యవస్తువులను (హవ్యములను) సమర్పింపగలరు. వారుకూడ అన్నపానములకు లోటులేకుండా హాయిగా జీవింపగలరు.

5.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

త్వం నః సురాణామసి సాన్వయానాం కూటస్థ ఆద్యః పురుషః పురాణః|

త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనౌ రేతస్త్వజాయాం కవిమాదధేఽజః॥1389॥

దేవా! నీవు నిర్వికారుడవు. పురాణపురుషుడవు అగు నీవే సకల కార్యవర్గముతో కూడియున్న మా దేవతలకందరకు అధికారణుడవు. దేవా! పుట్టుకలేని నీవు సత్త్వాదిగుణములకు, సృష్టిరచనవంటి కర్మలకు కారణమగు మాయాశక్తియందు నీ జ్ఞానమయశక్తిని నిలిపితివి.

5.50 (ఏబదియవ శ్లోకము)

తతో వయం సత్ప్రముఖా యదర్థే బభూవిమాత్మన్ కరవామ కిం తే |

త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా దేవ క్రియార్థే యదసుగ్రహాణామ్॥1390॥

పరమాత్మా! మహత్తత్త్వము మొదలుకొని దేవతలమగు మేము ఏయే కార్యములను నిర్వహించుటకు సృష్టింపబడితిమో, అట్టి విషయమున చేయదగిన మా కర్తవ్యమేమి? మాపై అనుగ్రహము ఉంచి, మాకు జ్ఞాన, క్రియా శక్తులను ప్రసాదింపుము. వాటిద్వారా మేము నీకు సేవ చేయగలమ. మేమ నీ కృపకు పాత్రులము. నిన్ను శరణు వేడుచున్నాము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  పంచమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ఐదవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

[07:08, 03/04/2022] +91 95058 13235: 3.4.2022  ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-ఆరవ అధ్యాయము

విరాట్ పురుషుని ఆవిర్భావము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️

తృతీయస్కంధం - 6వ అధ్యాయం

ఋషిరువాచ

6.1 (ప్రథమ శ్లోకము)

ఇతి తాసాం స్వశక్తీనాం సతీనామసమేత్య సః|

ప్రసుప్తలోకతంత్రాణాం నిశామ్య గతిమీశ్వరః॥1391॥

6.2 (రెండవ శ్లోకము)

కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్ఛక్తిమురుక్రమః|

త్రయోవింశతితత్త్వానాం గణం  యుగపదావిశత్॥1392॥ 

మైత్రేయఋషి పలికెను-సర్వసమర్థుడైన భగవంతుడు మహత్తత్త్వాదిశక్తులు సంఘటితముగా లేనందువలన విశ్వరచనాకార్యమును చేయజాలకపోయినవని గ్రహించెను. అంతట ఆ ప్రభువు  కాలశక్తిని స్వీకరించి, మహత్తత్త్వము, అహంకారము, పంచభూతములు, పంచతన్మాత్రలు, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అను ఇరువదిమూడు తత్త్వముల సముదాయమునందు ఒకేసారి ప్రవేశించెను.

6.3 (మూడవ శ్లోకము)

సోఽనుప్రవిష్టో భగవాంశ్చేష్టారూపేణ తం గతమ్|

భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్॥1394॥

ఈ విధముగా భగవంతుడు ఇరువది మూడు తత్త్వములలో ప్రవేశించి, తన క్రియాశక్తిద్వారా వాటిని అన్నింటిని సమ్మిళితమొనర్చును. పిమ్మట  జీవుల అదృష్టమును జాగృతమొనర్చెను. అనగా నిద్రాణావస్థలో నున్న జీవుల కర్మలను మేల్కొలిపెను. 

6.4 (నాలుగవ శ్లోకము)

ప్రబుద్ధకర్మా దైవేన త్రయోవింశతికో గణః| 

ప్రేరితోఽజనయత్ స్వాభిర్మాత్రిభిరధిపూరుషమ్॥1395॥

భగవంతుడు ఈ విధముగా అదృష్టమును (జీవుల కర్మలను) కార్యోన్ముఖమొనర్చినప్పుడు ఆ ఇరువదిమూడు తత్త్వముల భగవంతుని ప్రేరణచే తమ అంశలద్వారా అధిపురుషుని అనగా విరాట్ పురుషుని (బ్రహ్మను) ఆవిర్భవింపజేసెను.

6.5 (ఐదవ శ్లోకము)

పరేణ విశతా స్వస్మిన్మాత్రయా  విశ్వసృగ్గణః|

చుక్షోభాన్యోఽన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః॥1396॥

భగవంతుడు తన అంశలతో ఆ విరాట్ శరీరమునందు ప్రవేశించెను. అప్పుడు విశ్వరచన చేయునట్టి మహత్తత్త్వాదుల సముదాయము ఒకదానితో మరియొకటి కలసిపోయి, క్షోభకు గురియై పరిణామము నొందెను.ఈ తత్త్వముల పరిణామరూపమే విరాట్ పురుషుడు. ఇందులో చరాచర జగత్తు విరాజిల్లును. 

6.6 (ఆరవ శ్లోకము)

హిరణ్మయః స పురుషః సహస్రపరివత్సరాన్|

ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్త్వోపబృంహితః॥1397॥

ఆ హిరణ్మయి పురుషుడు

సకలజీవులతోసహా వేయిసంవత్సరములు జలములలో అండాకారములోనున్న ఆశ్రయమునందు నివసించెను.

6.7 (ఏడవ శ్లోకము)

స వై విశ్వసృజాం గర్భో దైవకర్మాత్మశక్తిమాన్|

విబభాజాత్మనాత్మానమేకధా దశధా త్రిధా॥1398॥

ఆ విరాడ్రూపము విశ్వసృష్టి చేయు తత్త్వముల గర్భము (కార్యము). అది జ్ఞాన, క్రియా, ఆత్మశక్తులచే సంపన్నమైనది. ఈశక్తులద్వారా ఆ విరాడ్రూపము స్వయముగా తనను క్రమేణ ఒకటి (హృదయము), పది (పంచప్రాణములు, పంచ-ఉపప్రాణములు), మూడు (ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక) రూపములుగా విభజించు కొనెను. 

6.8 (ఎనిమిదవ శ్లోకము)

ఏష హ్యశేషసత్త్వానామాత్మాంశః పరమాత్మనః|

ఆద్యోఽవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే॥1399॥

ఈ విరాట్ పురుషుడే మొదటి జీవుడు అగుటవలన సమస్త జీవులకు ఆత్మ - జీవరూపుడగుటవలన పరమాత్మ యొక్క అంశ. మొదట అభివ్యక్తుడగుటవలన భగవంతుని యొక్కమొదటి అవతారము. భూతసముదాయయము అంతయును ఈ విరాట్ పురుషునియందే విరాజిల్లుచున్నది. 

6.9 (తొమ్మిదవ శ్లోకము)

సాధ్యాత్మః సాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా|

విరాట్ ప్రాణో దశవిధ ఏకధా హృదయేన చ॥1400॥

ఈ విరాడ్రూపము అధ్యాత్మము అధిభూతము, అధిదైవము - అను మూడు విధములగు రూపములతోను పదివిధములైన ప్రాణములతోను,ఒక హృదయముతోను విలసిల్లుచున్నది. 

6.10 (పదవ శ్లోకము)

స్మరన్ విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః|

విరాజమతపత్ స్వేన తేజసైషాం వివృత్తయే॥1401॥

విశ్వరచన చేయునట్టి మహత్తత్త్వాదులకు అధిపతియైన భగవానుడు వాటి ప్రార్థనలను స్మరించుకొనుచు, వాటి వృత్తులను జాగృతమొనర్చుటకై, చేతనారూపమైన తన తేజస్సుద్వారా ఆ విరాట్ పురుషుని మేల్కొలిపెను.

6.11 (పదునొకండవ శ్లోకము)

అథ తస్యాభితప్తస్య కతిచాయతనాని హ|

నిరభిద్యంత దేవానిం తాని మే గదతః శృణు॥1402॥

ఆ విరాట్ పురుషుడు జాగృతము కాగానే దేవతల కొరకు ఏర్పరచిన స్థానములను  గూర్చి తెలిపెదను వినుము.

6.12 (పండ్రెండవ శ్లోకము)

తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలోఽవిశత్పదమ్|

వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే॥1403॥

మొట్టమొదట విరాట్ పురుషుని ముఖము (నోరు) ప్రకటమయ్యెను. అందు లోకపాలుడైన అగ్ని తన యంశయైన వాగింద్రియముతో సహా ప్రవేశించెను. దానిద్వారా జీవుడు సంభాషించెను.

6.13 (పదమూడవ శ్లోకము)

నిర్భిన్నం తాలు వరుణో లోకపాలోఽవిశద్దరేః|

జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే॥1404॥

పిదప ఆ విరాట్ పురుషుని యొక్క తాలువు (దౌడలు) ఉత్పన్నమాయెను. దానాయందు లోకపాలుడగు వరుణుడు తనయంశయైన రసనేంద్రియము (నాలుక) తో సహా ప్రవేశించెను. దాని వలన జీవుడు రసమును (రుచిని) గ్రహించును.

6.14 (పదునాలుగవ శ్లోకము)

నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదమ్|

ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్॥1405॥

అనంతరము ఆ విరాట్ పురుషుని యొక్క నాసిక రెండు నాసాపుటములతో (ముక్కురంధ్రములతో) ప్రకటము అయ్యెను. అందు అశ్వినీ దేవతలుతమ యంశయైన ఘ్రాణేంద్రియముతో సహా ప్రవేశించిరి. దానివలన జీవుడు వాసనలను గ్రహించును.

6.15 (పదునైదవ శ్లోకము)

నిర్భిన్నే అక్షిణీ త్వష్టా లోకపాలోఽవిశద్విభో|

చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్॥1406॥

తదుపరి ఆ విరాట్ పురుషునియొక్క దేహమందు కన్నులు ప్రకటములు అయ్యెను. వాటియందు లోకపాలుడైన సూర్యుడు తనయంశలైన నేత్రేంద్రియములతో ప్రవేశించెనీ. ఆ నేత్రేంద్రియముల ద్వారా జీవునకు రూపములు బోధపడును.

6.16 (పదునారవ శ్లోకము)

నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకఫాలోఽనిలోఽవిశత్|

ప్రాణేనాంశేన సంస్పర్శం యేనాసౌ ప్రతిపద్యతే॥1407॥

అంతట ఆ విరాట్ పురుషుని చర్మము ఉత్పన్నమాయెను. దానియందు వాయువు తన అంశయైన త్వగింద్రియముతో ప్రవేశించెను. ఆ త్వగింద్రియముద్వారా జీవుడు స్పర్శను అనుభవించును.

6.17 (పదునేడవ శ్లోకము)

కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం వివిశుర్దిశః|

శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే॥1408॥

అనంతరము ఆ విరాట్ పురుషుని కర్ణరంధ్రములు ప్రకటములయ్యెను. వాటియందు దిక్కులు తమ అంశలైన శ్రవణేంద్రియ సహితములై ప్రవేశించెను. వాటిద్వారా జీవునకు శబ్దజ్ఞానము కలుగును.

6.18 (పదునెనిమిదవ శ్లోకము)

త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యమోషధీః|

అంశేన రోమభిః కందూం యైరసా ప్రతిపద్యతే॥1409॥

పిదప ఆ విరాట్ పురుషుని శరీరమునందు త్వక్కు (పై చర్మము) ఉత్పన్నమయ్యెను. దానియందు ఓషధులు తమ అంశలైన రోమములతోసహా ప్రవేశించెను. ఈ రోమములవలన జీవుడు దురద మొదలగువానిని అనుభవించును.

6.19 (పందొమ్మిదవ శ్లోకము)

మేడ్రం తస్య వినిర్భిన్నం స్వదిష్ణ్యం క ఉపావిశత్|

రేతసాంశేన యేనాసావానందం ప్రతిపద్యతే॥1410॥

పిమ్మట ఆ విరాట్ పురుషని శరీరమునందు లింగము ఉత్పన్నమయ్యెను. దానిని ఆశ్రయించి, ప్రజాపతి తన యంశయైన వీర్యముతో సహా ప్రవేశించెను. దానివలన జీవుడు ఆనందమును అనుభవించును.

6.20 (ఇరువదవ శ్లోకము)

గుదం పుంసో వినిర్భిన్నం మిత్ర్ లోకేశ ఆవిశత్|

పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే॥1411॥

తదుపరి ఆ విరాట్ పురుషునియొక్క శరీరమునందు గుదము ఉత్పన్నమయ్యెను. దానియందు లోకపాలుడైన మిత్రుడు తన అంశయైన పాయువు అను ఇంద్రియముతో సహా ప్రవేశించెను. దానివలన జీవుడు మలత్యాగము చేయును.

6.21 (ఇరువది ఒకటవ శ్లోకము) 

హస్తావస్య వినిర్భిన్నావింద్రః స్వఃపతిరావిశత్|

వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే॥1412॥

అంతట ఆ విరాట్ పురుషునకు హస్తములు (చేతులు) ఏర్పడెను. వాటియందు ఇంద్రుడు తన యంశయైన గ్రహణత్యాగ రూపమైన శక్తి సహితముగా ప్రవేశించెను. ఆ శక్తివలన జీవుడు తన జీవికను (వృత్తిని) నడుపుకొనును.

6.22 (ఇరువది రెండవ శ్లోకము)

పాదావస్య వినిర్భిన్నౌ లొకేశో విష్ణురావిశత్|

గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే॥1413॥

పిదప ఆ విరాట్ పురుషునకు పాదములు ఏర్పడెను. వాటియందు లోకేశుడైన విష్ణువు తన గమనశక్తి సమేతముగా ప్రవేశించెను. ఆ శక్తిద్వారా జీవుడు తన గమ్యస్థానమునకు చేరుకొనును.

6.23 (ఇరువది మూడవ శ్లోకము)

బుద్ధిం చాస్య వినిర్భిన్నాం వాగీశోధిష్ణ్యమావిశత్|

బోధేనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్॥1414॥

తదుపరి ఆ విరాట్ పురుషునకు బుద్ధి ఏర్పడెను. అంతట వాక్పతియైన బ్రహ్మదేవుడు తన అంశయైన బుద్ధిశక్తితో గూడి అందు ప్రవేశించెను. ఈ బుద్ధి శక్తిద్వారా జీవుడు తెలిసికొనవలసిన విషయములను గ్రహించును.

6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమా ధిష్ణ్యమావిశత్|

మనసాంశేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే॥1415॥

అనంతరము ఆ విరాట్ పురుషునియందు హృదయము ప్రకటమయ్యెను. చంద్రుడు తన అంశయైన మనస్సుతో సహా అందు ప్రవేశించెను. ఈ మనశ్శక్తిద్వారా జీవుడు సంకల్పవికల్ప రూపములైన వికారములను పొందును. 

6.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఆత్మానం చాస్య నిర్భిన్నమభిమానోఽవిశత్పదమ్|

కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే॥1416॥

ఆత్మానం చాస్య నిర్భిన్నమభిమానోఽవిశత్పదమ్|

కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే॥1416॥

పిమ్మట ఆ విరాట్ పురుషునిలో అహంకారము ఉత్పన్నమాయెను. తదభిమానదేవతయైన రుద్రుడు క్రియాశక్తిద్వారా జీవుడు తన కర్తవ్యమును స్వీకరించును. 

6.26 (ఇరువది ఆరవ శ్లోకము)

సత్త్వం చాస్య వినిర్భిన్నం మహాన్ ధిష్ణ్యముపావిశత్|

చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే॥1417॥

తరువాత ఆ విరాట్ పురుషునియందు చిత్తము ప్రకటమయ్యెను అందు చిత్తశక్తితోగూడి మహత్తత్త్వము (బ్రహ్మ) నెలకొనెను. ఈ చిత్తశక్తిద్వారా జీవుడు విజ్ఞానమును (చైతన్యమును) పొందును.

6.27 (ఇరువది ఏడవ శ్లోకము)

శీర్ష్ణోఽస్య ద్యౌర్ధరా పద్భ్యాం ఖం నాభేరుదపద్యత|

గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయః॥1418॥

ఆ విరాట్ పురుషుని శిరస్సునుండి స్వర్గలోకము, పాదములనుండి పృథివి, నాభినుండి అంతరిక్షము ఏర్పడెను. అందు క్రమముగా సత్త్వ,రజ,స్తమో గుణముల పరిణామ రూపములైన దేవతలు, మనుష్యులు, భూతప్రేతాదులు కన్పట్టుచున్నారు.

6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఆత్యంతికేన సత్త్వేన దివం దేవాః ప్రపేదిరే|

ధరాం రజస్స్వభావేన పణయో యే చ తానను॥1419॥

6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితాః|

ఉభయోరంతరం వ్యోమ యే రుద్రపార్షదాం గణాః॥1420॥

వీరిలో దేవతలు సత్త్వగుణముయొక్క ఆధిక్యమువలన స్వర్గలోకమునందును,మనుష్యులు మరియు వారియొక్క ఉపయోగపడునట్టి గోవులు, మొదలగు జీవులు రజోగుణాతిశయముచే రాజసకర్మల భోగానుభవములకు అనుగుణమైన భూతలమునందు నివసింతురు. తమోగుణము అధికముగాగల భూతప్రేతాదులు రుద్రునకు పార్షదులుగా మసలుకొనుచు, భగవంతనకు నాభిస్థానమైన (భూమ్యాకాశములకు మధ్యగల) అంతరిక్షమునందు వసింతురు.

6.30 (ముప్పదియవ శ్లోకము)

ముఖతోఽవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వహ|

యస్తున్ముఖత్వాద్వర్ణానాం ముఖ్యోఽభూద్బ్రాహ్మణో గురుః॥1421॥

విదురా! విరాట్ పురుషుని ముఖమునుండి వేదములు, బ్రాహ్మణులు వెలువడిరి. ముఖమునుండి ఆవిర్భవించుటవలన చతుర్వర్ణములవారిలో భూసురులు శ్రేష్ఠులు. వారిది గురుస్థానము.

6.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

బాహభ్యోఽవర్తత క్షత్రం క్షత్రియస్తదనువ్రతః|

యో జాతస్త్రాయతే వర్ణాన్ పౌరుషః కంటకక్షతాత్॥1422॥

విరాట్ పురుషుని బాహువులనుండి క్షత్రియులు ఉద్భవించిరి. వారు క్షత్రధర్మమును (పరిపాలనరూపధర్మమును) వహించిరి. భగవంతుని అంశ అగుటవలన వారు బాహపరాక్రమోపేతులై చోరులు మొదలగువారి ఉపద్రవములనుండి ఇతర వర్ణములవారికి రక్షణ కల్పింతురు.

6.32 (ముప్పది రెండవ శ్లోకము)

విశోఽవర్తంత తస్యోర్వోర్లోకవృత్తికరీర్విభోః|

వైశ్యస్తదుద్భవో వార్తాం నృణాం యఃసమవర్తయత్॥1423॥

భగవంతుని ఊరువులనుండి ఉద్భవించినవారు వైశ్యులు. వారు కృషి, వాణిజ్య, గోరక్షణవృత్తులను అవలంబించి, జనుల జీవన నిర్వహణములకు తోడ్పడుదురు. 

6.33 (ముప్పది మూడవ శ్లోకము)

పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే|

తస్యాం జాతః పురా శూద్రో యద్వృత్త్వా తుష్యతే హరిః॥1424॥

భగవంతుని పాదములనుండి శూద్రులు ఉత్పన్నులైరి. అన్ని వర్ణములవారి ధర్మములు సిద్ధించుటకై వారు సేవావృత్తిని అవలంబించిరి. వారి వృత్తులవలన శ్రీహరి మిగుల శీఘ్రముగా ప్రసన్నుడగును. అన్ని ధర్మములును సిద్ధించుటకు సేవయే మూలము. సేవలేనిదే ఏ ధర్మముగూడ నేరవేరదు. కనుక సకల ధర్మములకును మూలమైన సేవాధర్మమును నిర్వహించు శూద్రులు అన్ని వర్ణములవారిలో గొప్పవారు. బ్రాహ్మణులధర్మము మోక్షసిద్ధి కొరకు, క్షత్రియుల ధర్మము జనులకు సుఖభోగములను కల్పించట కొరకు, వైశ్యధర్మము ఎల్లరకును ఆర్ధికలాభములను సమకూర్చుట కొరకు, శూద్రుల ధర్మము మాత్రము తమ ధర్మమును సిద్ధింపజేయుటకే. ఈ విధముగా మొదటి మూడువర్ణములవారి ధర్మములు అన్యపురుషార్ధముల కొరకే గానీ, శూద్రుల ధర్మము స్వపురుషార్ధము కొరకే. అందువలన వీరి సేవావృత్తివలన భగవంతుడు శీఘ్రమగా ప్రసన్నుడగును

6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఏతే వర్ణాః స్వధర్మేణ యజంతి  స్వగురుం హరిమ్|

శ్రద్ధయాత్మవిశుద్ధ్యర్ధం యజ్ఞతాః సహ వృత్తిభిః॥1425॥

అన్ని వర్ణముల వారికిని ఆయా వృత్తిధర్మములు సహజముగనే నిర్దేశింపబడినవి. వారు తమ చిత్తశుద్ధికొరకై సకలలోకములకును గురువైన పరమేశ్వరుని వారి వారి సహజధర్మములద్వారా భక్తిశ్రద్ధలతో పూజింపవలెను. "యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్| స్వకర్మణి తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥"-(గీత 18/46) సకల ప్రాణుల ఉత్పత్తి పరమేశ్వరునినుండియే ఏర్పడినది. సమస్త జగత్తూ ఆ సర్వేశ్వరునిచేతనే వ్యాప్తమైయున్నది. కనుక అన్ని వర్ణములవారును తమతమ స్వాభావిక కర్మలద్వారా ఆ పరమేశ్వరుని ఆరాధించి, పరమసిద్ధిని పొందుదురు.

6.35 (ముప్పది ఐదవ శ్లోకము)

శ్రద్ధయాత్మవిశుద్ధ్యర్థం యజ్ఞతాః సహ వృత్తిభిః|

కః శ్రద్దధ్యాదుపాకర్తుం యోగమాయాబలోదయమ్॥1426॥

విదురా! భగవంతుడు కాల, కర్మ, స్వభావశక్తి యుక్తుడు. ఆ ప్రభువుయొక్క యోగమాయా స్వభావమును ఈ విరాట్ పురుషుని రూపము ప్రకటించుచున్నది. ఈ స్వరూపమును సౌకల్యముగా వర్ణించుటకు ఎవ్వరును సాహసింపరు.

6.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశృతమ్|

కీర్తిం హరేః స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతీమ్॥1427॥

విదురా! భగవంతుని మహిమను వర్ణించుట అసాధ్యమే యైనప్పటికిని, గురువుల వలన విన్నంతవరకు, అందులోను నా బుద్ధికి అందినంతవరకు శ్రీహరియొక్క యశోవైభవములను వర్ణింతును. శ్రీహరికి సంబంధించని ఇతరమైన చర్చలతో కలుషితమైన నా వాక్కును పునీతమొనర్చుకొనుటకై అట్లు చేయుదును.

6.37 (ముప్పది ఏడవ శ్లోకము)

ఏకాంతలాభం వచసో ను పుంసాం సుశ్లోకమౌలేర్గుణవాదమాహుః|

శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాముపసంప్రయోగమ్॥1428॥

'మహాయశోమూర్తియైన శ్రీహరియొక్క గుణములను తనివిదీర కీర్తింపవలయును' . ఆ సర్వేశ్వరుని దివ్యగాథలను చెవులార వినవలెను. అట్లు కీర్తించుటవలన జిహ్వయు, శ్రవణము చేయుటవలన చెవులును సార్ధకములగును'  అని శ్రుతి, స్మృతి-ఇతి హాస, పురాణజ్ఞులైన విద్వాంసులు పలికెదరు. 

6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఆత్మనోఽవసితో వత్స మహిమా కవినాఽఽదినా|

సంవత్సర సహస్రాంతే ధియా యోగవిపక్వయా॥1429॥

నాయనా! విదురా! మనమే గాదు, ఆదికవియైన బ్రహ్మదేవుడు యోగముచే పరిపక్వమైన తన బుద్ధిబలముమేరకు వేయి సంవత్సరముల పాటు ఈ విషయమును గూర్చి ఆలోచించెను.ఐనను భగవంతుని యొక్క అపారమహిమను అతడు తెలిసికొనలేక పోయెను.

6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

అతో భగవతో మాయా మాయినామపి మోహినీ|

యత్స్వయం చాత్మవర్త్మాత్మా న వేద కిముతాపరే॥1430॥

భగవంతుని మాయన గూర్చి ఎరుగుట అసాధ్యము. మహామాయావులను సైతము అది మోహములో పడవేయును. ఇంతయేల? స్వయముగా భగవంతుడు గూడ అనంతమైన తన స్వరూపరహస్యమును, లోతుపాతులను తెలుపజాలదు. ఇక ఇతరుల విషయము చెప్పనేల?

6.40 (నలుబదియవ శ్లోకము)

యతోఽప్రాప్య న్యవర్తంత వాచశ్చ మనసా సహ|

అహం చాస్య ఇమే దేవాస్తస్మై భగవతే నమః॥1431॥

మహాత్మా! విదురా! భగవంతుడు అవాఙ్మానసగోచరుడు. ఆ ప్రభువుయొక్క మహత్త్వమును వేదవచనములు గాని, యోగపరిశుద్ధములైన మనస్సులుగల ఋషులుగాని ఎరుగజాలరు. అంతేగాదు, బ్రహ్మరుద్రాది దేవతలుగూడ ఆయనను సమగ్రముగా తెలిసికొనజాలరు. పరిపూర్ణుడైన అట్టి భగవంతునకు నేను పదేపదే ప్రణమిల్లుదును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  షష్ఠోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ఆరవ అధ్యాయము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

3.4.2022  సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-ఏడవ అధ్యాయము

విదురుడు తన సంశయనివారణకై మైత్రేయుని అడిగిన ప్రశ్నలు

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️

 తృతీయ స్కంధము-ఏడవ అధ్యాయము

శ్రీశుక ఉవాచ

7.1 (ప్రథమ శ్లోకము)

ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయనసుతో బుధః|

ప్రీణయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషత1432॥

శ్రీశుకుడు నుడివెను- పరీక్షిన్మహారాజా! మైత్రేయమహర్షి యొక్క వచనములను వినిన పిదప, వ్యాసనందనుడు, తత్త్వదర్శియైన విదురుడు తన మాటలతో ఆ మహర్షిని సంతోషపరచుచు సవినయముగా ఇట్లు ప్రశ్నించెను.

విదుర ఉవాచ

7.2 (రెండవ శ్లోకము)

బ్రహ్మన్ కథం భగవతశ్చిన్మాత్రస్యావికారిణః|

లీలయా చాపి యుజ్యేరన్నిర్గుణస్య గుణాః క్రియాః॥1433॥

విదురుడు పలికెను- మహాత్మా! భగవంతుడు శుద్ధజ్ఞానస్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడు అట్లైనచో సగుణునివలె అతడు తన లీలలద్వారా సృష్టి, స్థితి, లయకార్యములను ఎట్లు నెరపెను?

7.3 (మూడవ శ్లోకము)

క్రీడయాముద్యమోఽర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః|

స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః॥1434॥

బాలుడు సాధారణముగా తోడిబాలురతో ఆడుకొనుట అభిలాష కలిగియుండును. కానీ, భగవంతుడు స్వయముగా నిత్యతృప్తుడు, పూర్ణకాముడు, అసంగుడు. కనుక, అతడు లీలలు సలుపుటకుకూడ ఏల సంకల్పించెను?

7.4 (నాలుగవ శ్లోకము)

అస్రాక్షీద్భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయా|

తయా సంస్థాపయత్యేతద్భూయః ప్రత్యపిధాస్యతి॥1435॥

భగవంతుడు గుణమయమైన (త్రిగుణాత్మకమైన) తన మాయద్వారా జగత్తును సృష్టించును, పాలించును, ఉపసంహరించును.

7.5 (ఐదవ శ్లోకము)

దేశతః కాలతో యోఽసావనస్థాతః స్వతోఽన్యతః|

అవిలుప్తావబోధాత్మా స యుజ్యేతాజయా కథమ్॥1463॥

భగవానుని జ్ఞానము దేశ, కాల అవస్థలతో అపరిచ్ఛిన్నమైనది. అది తనకు తానైగాని, ఇతర నిమిత్తముల కారణమునగాని ఎన్నడును లుప్తము గాదు. అట్టి భగవానునకు మాయతో (అవిద్యతో) సంయోగము ఎట్లు పొసగును?

7.6 (ఆరవ శ్లోకము)

భగవానేక ఏవైష సర్వక్షేత్రేష్వవస్థితః|

అముష్య దుర్మగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః॥1437॥

ఏకైక పరమాత్మ సకలప్రాణుల యందును సాక్షిరూపమున ఉన్నాడు. అట్టిస్థితిలో ఆ స్వామి దురదృష్టమునకు లోనగుటగాని (ఆనందాదులకు దూరమగుట గాని) లేక కర్మలవలన సంభవించెడి క్లేశమలను అనుభవించవలసి వచ్చుటగాని ఎట్లుసంభవము?

7.7 (ఏడవ శ్లోకము)

ఏతస్మిన్మే మనో విద్వన్ భిద్యతేఽజ్ఞానసంకటే|

తన్నః పరాణుద విభో కశ్మలం మానసం మహత్॥1438॥

మహాత్మా! మైత్రేయా! నా అజ్ఞానమువలన సంభవించిన ఈ సంకటము నా మనస్సును మిగుల ఖేదపరచుచున్నది. అందువలన నా మనస్సునందలి తీవ్రమైన మోహమును నానుండి దయతో తొలగింపుము.

శ్రీశుక ఉవాచ

7.8 (ఎనిమిదవ శ్లోకము)

స ఇత్థం చోదితః క్షత్త్రా తత్త్వ జిజ్ఞాసునా మునిః|

ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్నివ గతస్మయః॥1439

శ్రీశుకుడు వచించెను- తత్త్వమును యథార్థముగా ఎరుగుటకై విదురుడు ఇట్లు ప్రశ్నింపగా అహంకారరహితుడైన మైత్రేయుడు భగవంతుని స్మరించుచు చిరునవ్వుతో ఇట్లు నుడివెను.

మైత్రేయ ఉవాచ

7.9 (తొమ్మిదవ శ్లోకము)

సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే|

ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనమ్॥1440॥

మైత్రేయుడు ఇట్లు పలికెను- విదురా! ఆ సర్వేశ్వరుడు ఆనందస్వరూపుడు, ఎట్టి బంధములను లేనివాడు. ఐనను ఆ స్వామి బంధమోహములలో చిక్కుపడినవాడని పలుకుట యుక్తి విరుద్ధముగా తోచును. కాని, వాస్తవముగా ఇది అంతయును ఆ పరమాత్మయొక్క మాయయే.

7.10 (పదియవ శ్లోకము)

యదర్థేన వినాముష్య పుంస ఆత్మవిపర్యయః|

ప్రతీయత ఉపద్రష్టుః స్వశిరశ్ఛేదనాడికః॥1441॥

జీవుడు కలలో తన శిరస్సు ఖండింపబడినట్లు చూచినంతనే అజ్ఞానవశమున అది అతనికి సత్యముగనే తోచును. కాని, అది యదార్థము కాదు. అట్లే జీవాత్మకు ఎట్టి బంధములు లేకున్నను అజ్ఞానవశమున ఆ బంధములు తనకు ఉన్నట్లే అనుకొనును.

7.11 (పదునొకండవ శ్లోకము)

యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః|

దృశ్యతేఽసన్నపి ద్రష్టురాత్మనోఽనాత్మనో గుణః॥1442॥

ఆకాశమునందలి చంద్రునియొక్క బింబము జలములలో ప్రతిఫలించుచున్నప్పుడు, ఆ జలములు కదలినచో వాటిని ఆశ్రయించుకొనియున్న చంద్రబింబము గూడ చలించును. యదార్థముగా చంద్రుడు చలింపడు. అట్లే దేహాభిమానియైన జీవుడు గూడ దేహధర్మములు (సుఖదుఃఖములు మొదలగునవి)  ఆత్మయందు ఉన్నట్లు భ్రమపడును. కానీ ద్రష్టయైన ఆత్మకు దేహముసకు సంబంధించిన సుఖదుఃఖాదులు ఏమాత్రమూ అంటవు.

7.12 (పండ్రెండవ శ్లోకము)

స వై నివృత్తిధర్మేణ వాసుదేవానుకంపయా|

భగవద్భక్తియోగేన తిరోధత్తే శనైరిహ॥1443॥

మానవుడు నిష్కామభావముతో ధర్మములను ఆచరించినప్పుడు అతనిపై భగవత్కృప ప్రసరించును.  భక్తియోగముద్వారా అతని భ్రమలు అన్నియును మెల్లమెల్లగా తొలగిపోగా, అతనికి సర్వత్ర బ్రహ్మానుభవమే కలుగును.

7.13 (పదమూడవ శ్లోకము)

యదేంద్రియోపరామోఽథ ద్రష్ట్రాత్మని పరే హరౌ|

విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః॥1444॥

ఆత్మ అన్నింటికంటే శ్రేష్ఠమైనది, పరమైనది. అదియే ద్రష్ట, శ్రీహరిరూపమున ఉన్నదికూడా ఆత్మయే. గాఢనిద్రలో మునిగియున్నవారికి ఇంద్రియములు అన్నియును విషయములనుండి వైదొలగి, పరమాత్మయందు సుస్థిరమైనచో, అన్నివిధములగు క్లేశములును తమంతటతామే దూరమగును.

7.14 (పదునాలుగవ శ్లోకము)

అశేషసంక్లేశశమం విధత్తే గుణానువాదశ్రవణం మురారేః|

కుతః పునస్తచ్చరణారవిందపరాగసేవారతిరాత్మలబ్ధా॥1446॥

శ్రీకృష్ణునియొక్క దివ్యగుణముల వర్ణనమును, శ్రవణమును చేసినంత మాత్రముననే సకలదుఃఖములు సమసిపోవును. ఒకవేళ మన హృదయములో ఆ స్వామియొక్క పాదపద్మముల పరాగమును (ధూళులను) సేవించుటయందు ప్రీతి కలిగినచో, ఇక చెప్పుటకేమున్నది?

విదుర ఉవాచ

7.15 (పదునైదవ శ్లోకము)

సంఛిన్నఃసంశయో మహ్యం తవ సూక్తాసినా విభో|

ఉభయత్రాపి భగవన్ మనో మే సంప్రధావతి॥1447॥

విదురుడు పలికెను-మహాత్మా! మైత్రేయా! సహేతుకమైన నీ సూక్తులనెడి ఖడ్గముచే నా సంశయములు అన్నియును విచ్ఛిన్నములైనవి. 'భగవంతుడు స్వతంత్రుడు. జీవుడు పరతంత్రుడు; అవిద్యాకారణముగ బంధములు ఏర్పడుచున్నవి. ఈ అజ్ఞానము నివృత్తము అగుటయే మోక్షము అని నీవు తెలిపితివి. 

 7.16 (పదునారవ శ్లోకము)

సాధ్వేతద్వ్యాహృతం విద్వన్నాత్మమాయాయనం హరేః|

ఆభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్బహిః॥1448॥

మహానుభావా! 'జీవునకు క్లేశములు కలుగుటకు మాయయే కారణము. మాయయనగా మిథ్య మరియు నిర్మూలనము. ఇదియే (ప్రకృతియే) విశ్వమునకు మూలకారణము. ఇందుకు అజ్ఞానమే తప్ప వేరొక కారణము లేదు. వాస్తవమునకు ఈ మాయకు ఎట్టి మహత్త్వమునూ లేదు.

7.17 (పదునేడవ శ్లోకము)

యశ్చ మూఢతమో లోకేయశ్చ బుద్ధేః పరం గతః|

తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః॥1449॥

ఈ ప్రపంచమున రెండు రకములవారు సుఖముగా ఉందురు. మూఢులు ఏమియు తెలియనివారు గావున వారు సుఖముగా ఉందురు. జ్ఞానులు (పరమహంసలు) బుద్ధికి అతీతమైన పరమాత్మను పొంది వారును సుఖముగా ఉందురు. వీరిద్దరికీ మధ్యన సంశయముతో వ్రేలాడే మానవులు మాత్రము దుఃఖముల పాలగుచుందురు.

7.18 (పదునెనిమిదవ శ్లోకము)

అర్థాభావం వినశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః|

తాం చాపి యుష్మచ్ఛరణసేవయాహం పరాణుదే॥1450॥

మహర్షీ! అనాత్మవస్తువు ఏదియును లేదని, కేవలము అది ప్రతీతమగుచున్నదని నీ కృపవలన నాకు నిశ్చయముగా  తెలిసినది.నేను నీ చరణకమల సేవల ప్రభావమున ప్రతీతమగుచున్న ఆ అనాత్మ భావమును (దేహాత్మభావమును) గూడ దాటుదును.

7.19 (పందొమ్మిదవ శ్లోకము)

యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః|

రతిరాసో భవేత్తీవ్రః పాదయోర్వ్యసనార్థఃనః॥1451॥

స్వామీ! షడ్గుణైశ్వర్య సంపన్నుడైన పరమాత్మ నిర్వికారుడు. నీ వంటి సత్పురుషులను సేవించుటవలన ఆ పురుషోత్తముని పాదపద్మములయందు తీవ్రమైన భక్తి ఏర్పడును. అట్టి పరమభక్తి తాపత్రయములను నివారించును.

7.20 (ఇరువదవ శ్లోకము)

దురాపా హ్యల్పతపసః సేవా వైకుంఠవర్త్మసు|

యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్ధనః॥1452॥

మహాత్మా! మహాత్ముల సన్నిధిలో భగవంతుని గుణగణములను గూర్చి నిరంతరము కీర్తింపబడుచుండును. కావున, అట్టి వారి ద్వారా భగవత్ప్రాప్తికి తగు మార్గము సులువుగా లభించును. అల్పపుణ్యము గలిగిన వారికి మహాత్ముల సేవలు లభించుట అత్యంత కఠినము.

7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్|

తేభ్యో విరాజముద్ధృత్య తమను ప్రావిశద్విభుః॥1453॥

మహానుభావా! 'సృష్టి ప్రారంభమున భగవంతుడు మహదాది తత్త్వములను, వాటి వికారములను క్రమముగా ఏర్పరచెను. వాటి అంశలతో విరాట్ పురుషుని రూపొందించెను. అనంతరము ఆ ప్రభువే ఆ విరాట్ పురుషునియందు ప్రవేశించెను.

7.22 (ఇరువది రెండవ శ్లోకము)

యమాహురాద్యాం పురుషం సహస్రాంఘ్ర్యానుబాహుకమ్|

యత్ర విశ్వ ఇమే లోకాః సవికాశం సమాసతే॥1454॥

'ఆ విరాట్ పురుషుడు అసంఖ్యాకములైన పాదములు, ఊరువులు, బాహువులు గలవాడు. ఇతడే ఆదిపురుషుడు' అని వేదములు తెలుపుచున్నవి. ఆ విరాట్ పురుషుని యందే లోకములన్నియును, అందలి ప్రాణులునూఎట్టి సంకోచము లేకుండా నివసించియున్నవి. విశాలమైన ఈ బ్రహ్మాండము నందు నివాసస్థానమునకు కొదువలేదు.

7.23 (ఇరువది మూడవ శ్లోకము)

యస్మిన్ దశవిధః ప్రాణః సేంద్రియార్థేంద్రియస్త్రివృత్|*

త్వయేరితో యతో వర్ణాస్తద్విభూతీర్వదస్వ నః॥1455॥

7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః సహ గోత్రజైః|

ప్రజా విచత్రాకృతయ ఆసన్ యాభిరదం తతమ్॥1456॥

మహర్షీ! ' ఆ విరాట్ పురుషునియందు పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, శబ్దాదివిషయములు, ఇంద్రియాధిష్ఠాన దేవతలతో సహా ప్రాణాపాది పంచప్రాణములు, నాగ, కూర్మాది ఉపప్రాణములు ఉన్నవి. అవి ఇంద్రియబలమును, మనోబలమును, శారీరక బలమును వృద్ధిచేయును. ఆ విరాట్ పురుషుని నుండియే బ్రాహ్మణాది చతుర్వర్ణములు ఉద్భవించెను' అని నీవు తెలిపితివి. ఇప్పుడు ఆ బ్రహ్మాది విభూతులైన పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులతో, వారివలన వృద్ధిచెందిన వివిధాకారములుగల ప్రజలతో ఈ బ్రహ్మాండము నిండియున్న విషయమును వివరింపుము.

7.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ప్రజాపతీనాం స పతిశ్చక్లుపే కాన్ ప్రజాపతీన్|

సర్గాంశ్చైవానుసర్గాంశ్చ మనూన్మన్వంతరాధిపాన్|

ఏతేషామపి వంశాంశ్చ వంశానుచరితాని చ॥1457॥

7.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ఉపర్యధశ్చ యే లోకా భూమేర్మిత్రాత్మజాసతే|

తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ॥1458॥

7.27  (ఇరువది ఏడవ శ్లోకము)

తిర్మఙ్మానుష దేవానాం సరీసృప పతత్త్రిణామ్|

వద నః సర్గసంవ్యూహం గార్భ స్వేదద్విజోద్భిదామ్॥1459॥

మహాత్మా! మైత్రేయా! ఆ విరాట్ పురుషుడు మరీచ్యాది ప్రజాపతులకును ప్రభువు. ఆయన ఏయే ఇతర ప్రజాపతులను సృష్టించెను? నవవిధ ప్రాకృత సర్గములకు, మన్వంతరములకు అధిపతులైన స్వాయంభువాది చతుర్దశమనువులను ఏయే క్రమములో సృజించెను? మహర్షీ! ఈ మనువులయొక్క వంశములను, ఆ వంశములలో పుట్టిన రాజుల చరిత్రములను, అట్లే భూలోకమనకు ఊర్ధ్వభాగమున ఉన్న లోకములను, అధోభాగమన ఉన్న లోకములన, మరియు వాటి విస్తారములను, పరిమాణములను, ఇంకను భూలోక విస్తార పరిమాణములను గూర్చియు వర్ణింపుము. మైత్రేయ మహామునీ! పశువులు మొదలగు తిర్యక్కులు, మనుష్యులు, దేవతలు, సర్పములు మున్నగు ప్రాకుడు జంతువులు, పక్షులు, అట్లే గర్భసంజాత ప్రాణులు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు (వృక్షలతాదులు) అను నాలుగు విధములగు ప్రాణులును ఏవిధముగా సృష్టింపబడినవి?

7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయమ్|

సృజతః శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదారవిక్రమమ్॥1460॥

శ్రీమహావిష్ణువు సృష్టిచేయు సమయమున జగత్తుయొక్క సృష్టి, స్థితి, సంహారములకై తన గుణావతారములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములద్వారా ఒనర్చిన శుభలీలలను వర్ణింపుము.

7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

వర్ణాశ్రమవిభాగాంశ్చ రూపశీలస్వభావతః|

ఋషీణాం జన్నకర్మాది వేదస్య చ వికర్షణమ్॥1461॥

7.30 (ముప్పదియవ శ్లోకము)

యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో|

నైష్కర్మస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగత్స్మృతమ్॥1462॥

7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

పాషండపథవైషమ్యాం ప్రతిలోకమనివేశనమ్|

జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః॥1463॥

మైత్రేయమహర్షీ! వేషములను, ఆచరణములను, స్వభావములను అనుసరించి, చేయబడిన వర్ణాశ్రమ విభాగములను గూర్చి తెలుపుము. యజ్ఞముల విస్తారములను, కర్మయోగమార్గములను, ప్రవృత్తిధర్మ త్యాగములను, జ్ఞానయోగమును, దాని సాధనమైన సాంఖ్యమార్గమును, భగవంతుడు తెలిపిన నారదపాంచరాత్రాది తంత్రశాస్త్రములను గూర్చి వివరింపుము. వేదవైదిక బహిష్కృతులైన పాషండులయొక్క మార్గములను, ప్రవృత్తులను, వారి ప్రచారములవలన కలుగు వైషమ్యములను, నిమ్నవర్ణములకు చెందిన పురుషులవలన ఉచ్చవర్ణ ములకు చెందిన స్త్రీలయందు కలుగు సంతానముల విధానములను, అట్లే వేర్వేరు గుణకర్మల కారణముగా జీవునకు ప్రాప్తించు గతులను విశదపరుచుము.

7.32 (ముప్పది రెండవ శ్లోకము)

ధర్మార్థ కామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః|

వార్తాయా దండనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్॥1464॥

7.33 (ముప్పది మూడవ శ్లోకము)

శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితౄణం సర్గమేవ చ|

గ్రహనక్షత్రతారాణాం కాలావయవసంస్థితమ్॥1465॥

మహాత్మా! ధర్మార్థకామమోక్షముల సాధనములను, వాటియందు పరస్పర వైరుధ్యములు లేని ఉపాయములను గురుంచి తెలుపుము. కృషి, వాణిజ్యాదులనుగూర్చియు, దండనీతిని (నేరములు చేసినవారికి విధించు శిక్షలను) గురుంచియు, శాస్త్రశ్రవణవిధులను, సంధ్యోపాసనాది పద్ధతులను తెలుపుము.శ్రాద్ధవిధులను, అర్ఘ్యమాది పితృదేవతల సృష్టిని గురుంచియు, గ్రహముల నక్షత్రముల తదితర స్థితుల నిరూపణమును, వాటి కాలపరిమాణస్థితులను గూర్చియు వివరింపుము. 

7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలమ్|

ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది॥1466॥

దానములను చేయుట, తపస్సులను ఆచరించుట,యజ్ఞాది సంస్కారములను నెరపుట,పూర్తములను (వాపీ, కూప, తటాక, దేవాలయాది నిర్మాణములను) కావించుట మొదలగువాని ఫలములను గురుంచి విశదపరచుము. ఇతర దేశములకు వెళ్ళినవారు ఆచరింపవలసిన ధర్మములు, ఆపత్కాలములయందు పాటింపవలసిన ధర్మములు మొదలగువానిని వివరింపుము.

7.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యేన వా భగవాంస్తుష్యేద్ధర్మయోనిర్జనార్ధనః|

సంప్రసీదతి వా యేషామేతదాఖ్యాహి చానఘ॥1467॥

పుణ్యాత్మా! ధర్మప్రవర్తకుడు, షడ్గుణైశ్వర్యసంపన్నుడు ఐన శ్రీహరికి తృప్తిని కలిగించు మార్గములెవ్వి? ఆ ప్రభువు తన అనుగ్రహమును ఎట్టివారిపై ప్రసరింపజేయుచుండును?

7.36 (ముప్పది ఆరవ శ్లోకము) 

అనువ్రతానాం శిష్యాణాం పుత్రాణాం చ ద్విజోత్తమ|

అనాపృష్టమపి బ్రూయుర్గురవో దీనవత్సలాః॥1468॥

భూసురోత్తమా! గురువులకు దీనులయెడగల వాత్సల్యము అపారము. అట్టి మహాత్ములు భక్తిశ్రద్ధలతో తమను సేవించుచుండునట్టి శిష్యులును, పుత్రులును అడుగకున్నను, వారికి శుభములను కలిగించునట్టి హితములనుగూర్చి ఉపదేశింతురు (గురువర్యులైన మీరు శిష్యుడవైన నాకు శుభప్రదములైన, హితకరములైన విషయములను గూర్చి నేను  అడుగకున్నను దయతో వివరింపగలరు). అపృష్టోఽపి శుభం బ్రూయాత్ - అపృష్టోపి హితం వదేత్- అడుగకుండగనే శుభములను, హితముల కలిగించు విషయములను బోధింపవలెను.

7.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తత్త్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసంక్రమః|

తత్రేమం క ఉపాసీరన్ క ఉ స్విదనుశేరత్॥1469॥

పూజ్యమహర్షీ! ప్రళయకాలమున ఆ మహదాది తత్త్వములు పరస్పరము ఏవిధమగా లీనమగుచుండును? భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఏయే తత్త్వములు రాజులను చామరగ్రాహిణులవలె ఆయనను సేవించుచుండును? ఏయే తత్త్వములు ఆ ప్రభువులో లీనమగుచుండును?

7.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ|

జ్ఞానం చ నైగమం యత్తద్గురుశిష్యప్రయోజనమ్॥1470॥

జీవతత్త్వమెట్టిది? పరాత్పరుని యొక్క స్వరూపమెట్టిది? గురుశిష్యులకు ప్రయోజనకరమైన వేదముల, ఉపనిషత్తుల జ్ఞానమెట్టిది?

7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘ సూరిభిః|

స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ వా॥1471॥

పుణ్యపురుషా! తత్త్వజ్ఞానప్రాప్తికొరకై విద్వాంసులు ఏయే ఉపాయములను తెలిపిరి. ఏలయన మనుష్యులకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు తమంతటతాముగా కలుగవుగదా!

7.40 (నలుబదియవ శ్లోకము)

ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరేః కర్మవివిత్సయా|

బ్రూహి మేఽజ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః॥1472॥

మహాత్మా! మాయామోహకారణముగా నా వివేకము నశించినది. నేను అజ్ఞానిని. నీవు నాకు సహృదుడవు. హితైషివి. శ్రీహరి  లీలలను గూర్చి నేను తెలియగోరు చున్నాను. కనుక, నేను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానములను ఒసంగుము.

7.41 (నలుబది ఒకటవ శ్లోకము)

సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ|

జీవాభయప్రదానస్య న కుర్వీరన్ కలామపి॥1473॥

మైత్రేయమహామునీ! భగవత్తత్త్వముయొక్క ఉపదేశముద్వారా జీవునకు జననమరణ చక్రము నుండి విముక్తిని కలిగించెడి పుణ్యము  ప్రాప్తించును. వేదముల అధ్యయన - అధ్యాపనముల వలనను, యజ్ఞ, దాన, తపస్సులను ఆచరించుటవలనను, ప్రాప్తించు పుణ్యము ఈ పుణ్యములో పదునారవవంతు పుణ్యమునకును సమానముగాదు.

7.42 (నలుబది రెండవ శ్లోకము)

శ్రీ శుక ఉవాచ

స ఇత్థమాపృష్టపురాణకల్పః కురుప్రధానేన ముమిప్రధానః|

ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ॥1474॥

శ్రీశుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! కురుశ్రేష్ఠుడైన విదురుడు మునిప్రవరుడైన మైత్రేయునితో ఈ విధముగా పురాణవిషయములకు సంబంధించిన పెక్కు ప్రశ్నలను అడిగెను. భగవద్విషయములకు సంబంధించిన ఈ ప్రశ్నలను అడిగెను. భగవద్విషయములకు సంబంధించిన ఈ ప్రశ్నలద్వారాా తగు వివరణతో కూడిన సమాధానమును చెప్పుటకు ప్రేరేపించిన కారణముగా ఆయన హృదయము మిగుల ఆనందముతో నిండిపోయెను. అందువలన ఆ ముని మిగుల సంతోషించి చిరునవ్వుతో పలుకసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే  సప్తమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ఏడవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


4.4.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-ఎనిమిదవ అధ్యాయము

బ్రహ్మదేవుని ఆవిర్భావము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

తృతీయ స్కంధము-ఎనిమిదవ అధ్యాయము

బ్రహ్మదేవుని ఆవిర్భావము

మైత్రేయ ఉవాచ

8.1 (ప్రథమ శ్లోకము)

సత్సేవనీయో బత పూరువంశో యల్లోకపాలోభగవత్ప్రధానః|

బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్ష్ణమ్॥1475॥

మైత్రేయుడు పలికెను-విదురా! ఈ పురువంశము నీవంటి సత్పురుషులచే సేవింపదగినది. అందువలన దీని గౌరవము ఇనుమడించినది. నీవు భగవద్భక్తులలో ప్రముఖుడవు. 'స్వయముగా నీవును లోకపాలుడవే. పరమపురుషుడైన శ్రీహరియొక్క కీర్తివైభవమును అనుక్షణము వినూత్నముగా ప్రస్తుతించుచుందువు. అందువలన నీవు ఎంతయు ధన్యాత్ముడవు.  

8.2 (రెండవ శ్లోకము)

సోఽహం నృణాం క్షుల్లనుఖాయ దుఃఖం మహద్గంతానాం విరమాయ తస్య|

ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాద్భగవానృషభ్యః॥1476॥

మానవులు క్షణికసుఖములకొరకు అర్రులు చాచుచు విషయభోగములలో మునిగి తీవ్రమైన దుఃఖముల పాలగుచున్నారు. వారిని వాటినుండి విముక్తులను గావించుటకై భగవత్కథాశ్రవణము ఏకైైక దివ్యౌషధము. ఈ భాగవతపురాణమును అనంతుడైన సంకర్షణభగవానుడు సనకాది మహర్షులకు స్వయముగా వినిపించెను. దానినే నీకు నేను తెలుపుచున్నాను. సావధానులై  వినుము.

8.3 (మూడవ శ్లోకము)

ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠసత్త్వమ్|

వివిత్సవస్తత్త్వమతః పరస్య కుమారముఖ్యా మునయోఽన్వపృచ్ఛన్॥1477॥

ఆదిదేవుడైన సంకర్షణ భగవానుడు అఖండజ్ఞాననిధి. ఆయన శుద్ధసత్త్వస్వరూపుడు. ఆయన జ్ఞానసామర్థ్యము అపారము. ఒక పర్యాయము సనకసనందనాది మహామునులు పరమాత్మయొక్క తత్త్వమును ఎరుగు కాంక్షతో ఆ స్వామి కడకు ఏగిరి. పిదప వారు తనలోకమున సుఖాసీనులైయున్న ఆ ప్రభువును ఇట్లు ప్రశ్నించిరి.

8.4 (నాలుగవ శ్లోకము)

స్వమేవ ధిష్ణ్యం బహు మానయంతం యం వాసుదేవాభిధమామనంతి|

ప్రత్యగ్ధృతాక్షాంబుజకో శమీషత్ ఉన్మీలయంతం విబుధోదయాయ॥1478॥

ఆ మహామునులు అచటికి చేరిన సమయమున సంకర్షణ భగవానుడు మానసిక పూజయందు నిమగ్నుడైయుండెను. ఆ స్వామి తన ఇంద్రియములను అన్నింటిని అంతర్ముఖముగావించి, విశ్వవ్యాప్తుడు, సకలప్రాణులకు ఆధారభూతుడు ఐన వాసుదేవుని ధ్యానించుచుండెను. మునులు అతనిని సమీపింపగనే ఆ సంకర్షణ భగవానుడు వారిని అనుగ్రహింపదలచి, అర్థనిమీలితనేత్రుడై తన దయార్ధ్రదృష్టిని వారిపై ప్రసరింపజేసెను. ఆ మహానుభావుని అనుగ్రహదృష్టికి వారు మిగుల సంతసించిరి.

8.5 (ఐదవ శ్లోకము)

స్వర్ధున్యుదార్ద్రైః స్వజటకలాపైః ఉపస్పృశంతశ్చరణోపధానమ్|

పద్మం యదర్బంత్యహిరాజకన్యాః సప్రేమనానాబలిభిర్వరార్థాః॥1479॥

సనత్కుమారాది మహర్షులుఘ్ భాగవతకథా శ్రవణమనకై సత్యలోకమునుండి పాతాళతలమునకు దిగివచ్చిరి. పవిత్ర గంగాజలములలో స్నానము చేయుట వలన వారి జటాకలాపములు తడిసియుండెను.వారు ఆర్ధ్రములైయున్న తమ జటాకలాపములను ఆ సంకర్షణుని పాదపీఠమగు పద్మమునకు తాకునట్లుగా శిరసా ప్రణమిల్లిరి. నాగరాజ కన్యలు తమకు ఉత్తమ వరుడు లభింపవలెనను కోరికతో పెక్కు ఉపాయములను సమర్పించుచు, ఆయన పాదపద్మములను అర్చించుచుండిరి.

8.6 (ఆరవ శ్లోకము)

ముహుర్గృణంతో వచసానురాగస్ఖలత్పదేనాస్య కృతాని తత్  జ్ఞాః|

కిరీటసాహస్రమణిప్రవేకప్రద్యోతితోద్దామఫణాసహస్రమ్॥1480॥

సనకసనందనాది మహాఋషులు భగవంతుని లీలారహస్యములను ఎరిగినవారు. వారు భక్తిప్రపత్తులతో పదేపదే సంకర్షణభగవానుని యొక్క దివ్యగుణలీలలను కీర్తించుచుండిరి. ఆ సమయమున భక్తిపారవశ్యముతో వారి కంఠములు గద్గదమగుచుండెను. మాటలు తడబడుచుండెను. అప్పుడు ఆ ఆదిశేషుని వేలకొలది పడగల పైకి లేచుచుండెను. కిరీటములయందలి మణులు మిరుమిట్లు గొలుపుచున్న తమ కాంతులతో నలుదిక్కులను ప్రకాశింపజేయుచుండెను.

8.7 (ఏడవ శ్లోకము)

ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్పిధర్మాభిరతాయ తేన|

సనత్కుమారాయ స చాహ పృష్టః సాంఖ్యాయనాయాంగ ధృతవ్రతాయ॥1481॥

విదురా! సనత్కుమారాదుల స్తుతులకు భాగవతోత్తముడైన సంకర్షణభగవానుడు మిగుల ప్రసన్నుడయ్యెను. అతడు మోక్షధర్మములయందు ఆసక్తులైయున్న సనత్కుమారాదులకు భాగవతమును వినిపించెను. పిమ్మట సనత్కుమారముని పరమవ్రతశీలుడైన సాంఖ్యాయనుని అభ్యర్ధనపై ఆయనకు భాగవతమును వినిపించెను.

8.8 (ఎనిమిదవ శ్లోకము)

సాంఖ్యాయనః పారమహంస్యముఖ్యో వివక్షమాణో భగవద్విభూతీః|

జగాద సోఽస్మద్గురవేఽన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ॥1482॥

పరమహంసలలో ప్రముఖుడైన సాంఖ్యాయనుడు భగవద్విభూతులను వర్ణించు ఇచ్ఛతో తమ శిష్యులగు పరాశరమహర్షికిని, బృహస్పతికిని భాగవతమును గూర్చి తెలిపెను. ఆ పరాశర మహర్షియే మా గురువు.

8.9 (తొమ్మిదవ శ్లోకము)

ప్రోవాచ మహ్యం స దయాలురుక్తో మునిః పులస్త్యేన పురాణమాద్యమ్|

సోఽహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాళవే నిత్యమనువ్రతాయ॥1483॥

అనంతరము పరమదయాళువైన పరాశరుడు పులస్త్యుని ప్రేరణపై ఆదిపురాణమైన ఈ భాగవతమును నాకు (మైత్రేయునకు) ఉపదేశించెను. నాయనా! విదురా! నీవు ఇచటికి చేరితివి. కనుక, జ్ఞానముగల నీకు భాగవత శ్రవణమునందు శ్రద్ధయున్నందున నీకు దానిని వినిఫింతును.

8.10 (పదవ శ్లోకము)

ఉదాప్లుతం విశ్వమిదం  తదాఽఽసీత్ యన్నిద్రయామీలితదృజ్ న్యమీలయత్|

అహీంద్రతల్పేఽధిశయాన ఏకః కృతక్షణః స్వాత్మరతౌ నిరీహః॥1484॥

విదురా! సృష్టికి పూర్వము ఈ విశ్వము అంతయును జలమగ్నమైయుండెను. ఆ సమయమున శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆదిశేషతల్పముపై శయనించి యుండెను. ఆ స్వామియొక్క జ్ఞానశక్తి పూర్తిగా జాగృతమైయుండెను. యోగనిద్రను ఆశ్రయించి ఆ ప్రభువు నిమీలిత నేత్రుడైయుండెను. సృష్టికార్యమునుండి విశ్రాంతి గైకొని నిష్క్రియుడై (ఎట్టి కార్యముసు చేపట్టక ఆత్మానందముతో మునిగియుండెను.

8.11 (పదునొకండవ శ్లోకము)

సోఽంతశ్శరీరేఽర్పితభూతసూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః|

ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే  యథానలో దారుణి రుద్ధవీర్యః॥1485॥

ప్రళయకాలమున ప్రాణులన్నియును తమ సూక్ష్మశరీరములతో శ్రీమన్నారాయణుని శరీరమున లీనమైయుండెను. ఆస్వామియొక్క కాలాత్మికశక్తి మాత్రము జాగృతితో నుండెను. ఆ ప్రభువు తన నివాసస్థానమున జలమునందు ఉండియే అగ్ని తన దాహకశక్తిని కాష్ఠమందు దాచి, అందు వ్యాప్తమైయున్నట్లు, తన శక్తులను అన్నింటిని తనలో లీనమొనర్చుకొని యుండెను.

8.12 (పండ్రెండవ శ్లోకము)

చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా|

కాలాఖ్యయాఽఽసాదితకర్మతంత్రో లోకానపీతాన్ దదృశే స్వదేహే॥1486॥

విదురా! భగవంతుడు ఈ విధముగా తన స్వరూపమేయైస చిచ్ఛక్తితోపాటు వేయి చతుర్యుగముల (అనంతమైన కాలము) పర్యంతము జలములలో యోగనిద్రలో నుండెను. పిమ్మట ఆ ప్రభువు చేతనే నియుక్తమైన ఆయన కాలశక్తి జీవులకర్మప్రవృత్తిని ప్రేరేపించెను. అంతట భగవంతుడు తనలో లీనమైయున్న అసంఖ్యాక లోకములను జూచెను.

8.13 (పదమూడవ శ్లోకము)

తస్యార్థసూక్ష్మాభినివిష్టదృష్టేః అంతర్గతోఽర్థో రజసా తనీయాన్|

గుణేన కాలానుగుణేన విద్ధః సూష్యంస్తదాభిద్యత నాభిదేశాత్॥1487॥

భగవంతుని దృష్టి తనలోనే లీనమైయున్న లింగశరీరములు మొదలగు సూక్ష్మతత్త్వములయంధు  పడెను. అంతట భగవంతునిలో ఉన్న సూక్ష్మరూప తత్త్వములు అన్నియును కాలప్రభావముచే రజోగుణముద్వారా క్షోభకు గురియయ్యెను. అప్పుడు వాటిని మరల సృష్టించుట కొరకై ఆయన నాభిప్రదేశమునుండి కమలము ఉద్భవించెను.

8.14 (పదునాలుగవ శ్లోకము)

స పద్మకోశః సహసోదతిష్ఠత్ కాలేన కర్మప్రతిబోధనేన|

స్వరోచిషా తత్సలిలం విశాలమ్ విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః॥1488॥

ఆ పద్మకోశము ఒక్కసారిగా అపారజలరాశినుండి పైకి వచ్చెను. అది కర్మశక్తిని జాగృతమొనర్చు కాలము ద్వారానే ప్రకటమైయుండెను. అది (భగవంతునిచే సృజింపబడిన పద్మకోశము) తన తేజస్సుతో అపారమైన జలరాశిని సూర్యునివలె ప్రకాశింపజేసెను.

8.15 (పదిహేనవ శ్లోకము)

తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణుః ప్రావీవిశత్సర్వగుణావభాసమ్॥1489॥

మహాత్మా! సకలగుణములను ప్రకాశింపజేయునట్టిదియు, సర్వలోక మయము ఐన ఆ కమలమునందు శ్రీమహావిష్ణువు అంతర్యామిరూపములో ప్రవేశించెను. ఆ విధముగా భగవంతుడు ప్రవేశించినంతనే సకలవేదములను ఎరిగిన వేదమయుడు, స్వయంభువు ఐన బ్రహ్మదేవుడు కనిపించెను.

8.16 (పదునారవ శ్లోకము)

తస్యాం స చాంభురుహకర్ణికాయామ్ అవస్థితో లోకమపశ్రమానః|

పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్రః చత్వారి లేఖేఽనుదిశం ముఖాని॥1490॥

పద్మముయొక్క దుద్దుపై కూర్చొనియున్న బ్రహ్మదేవునకు ఏలోకమూ కనబడలేదు. అంతట అతడు కనులు పెద్దవిగా జేసి మెడను నాలుగు వైపులకు త్రిప్పుచు పరికించి చూచెను. ఫలితముగా ఆ బ్రహ్మకు నలువైపులయందును  నాలుగు ముఖములు ఏర్పడెను.

8.17 (పదునేడవ శ్లోకము)

తస్మాద్యుగాంత శ్వసనావఘూర్ణజలోర్మిచక్రాత్సలిలాద్విరూఢమ్|

ఉపాశ్రితః కంజము లోకతత్త్వమ్ నాత్మానమద్ధాఽవిదదాదిదేవః॥1491॥

ప్రళయకాల వాయువు యొక్క తాకిడికి పైకి ఎగిసిపడుచున్న తరంగముల కారణముగా ఆ అపారజలరాశినుండి పైకి వచ్చిన కమలముమీద బ్రహ్మదేవుడు విరాజిల్లుచుండెను. అంతట ఆదిదేవునకు (బ్రహ్మకు) తనను గూర్చిగాని, లోకతత్త్వరూపమైన కమలమును గురుంచిగాని, అవగతము కాలేదు

8.18 (పదునెనిమిదవ శ్లోకము)

క ఏష యోఽసావహమబ్జపృష్ఠే ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు|

అస్తి హ్యధస్తాదిహ కించ నైతత్ అధిష్ఠితం యత్ర సతా ను భాష్యమ్॥1492॥

అంతట బ్రహ్మదేవుడు ఇట్లు తలపోసెను- ఈ కమలముపై కూర్చొనియున్న నేను ఎవడను? ఈ కమలముగూడ ఎట్టి ఆధారమూ లేకుండా ఎట్లు ఉద్భవించినది? తప్పనిసరిగా ఈ పద్మమునకు ఆధారముగా దాని క్రింద ఏదేని ఒక వస్తువు ఉండియుండవలెను

8.19 (పందొమ్మిదవ శ్లోకము)

స ఇత్దముద్వీక్ష్య తదబ్జనాళనాదీభిరంతర్జలమానివేశ|

నార్వాగ్గతస్తత్ ఖరనాలనాలనాభిం విచిన్వంస్తదవిందతాజః॥1493॥

బ్రహ్మదేవుడు తనలో ఇట్లు తర్కించుకొని, ఆ కమలనాళముల యొక్క సూక్ష్మరంధ్రముల ద్వారా జలములలో ప్రవేశించెను. కఠోరమైన ఆ నాళముయొక్క ఆధారమును తెలిసికొనుటకై వెదకుచు దాని నాభివరకు వెళ్ళెను కానీ, బ్రహ్మదేవునకు దాని మూలము మాత్రము దొరకలేదు.

8.20 (ఇరువదవ శ్లోకము)

తమస్యపారే విదురాత్మసర్గం విచిన్వతోఽ భూత్సుమహాంస్త్రిణేమిః|

యో దేహభాజాం భయమీరయాణః పరిక్షిణోత్యాయురజస్య హేతిః॥1494॥

విదురా! బ్రహ్మదేవుడు అపారమైన ఆ అంధకారమునందు తన పుట్టుకకు మూలమైన స్థానమును వెదుకసాగెను. ఇట్లు అన్వేషించుటలో అనేక సంవత్సరములు గడచినను ఆయనను దాని అంతుచిక్కలేదు. ఈ కాలము భగవంతుని శస్త్రము. ఈ కాలరూప శస్త్రము దేహధారులను అందరిని భయమునకు గురిచేయుచు వారి ఆయువులను ప్రతిక్షణము కబళించుచుండెను.

 8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తతో నివృత్తోఽప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యమాసాద్య పునః స దేవః|

శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదదారూఢసమాధియోగః॥1495॥

చివరకు అతడు తన ప్రయత్నము సఫలము కాకపోవుటతో మరలివచ్చి, తనకు ఆధారమైన కమలముపై కూర్చొనెను. మెల్లమెల్లగా ప్రాణవాయువును జయించి అతడు తన చిత్తమును సంకల్పరహితమొనర్చి, సమాధియందు ఉండెను.

8.22 (ఇరువది రెండవ శ్లోకము)

కాలేన సోఽజః పురుషాయుషాభిప్రవృత్తయోగేన విరూఢబోధః|

స్వయం తదంతర్హృదయేఽవభాతమపశ్యతాపశ్యత యన్న పూర్వమ్॥1496॥

ఈ విధముగా బ్రహ్మదేవుడు వంద దివ్య సంవత్సరముల కాలము సమాధిస్థితిలో ఉండెను. ఇట్లు ఏకాగ్రతతో సమాధిస్థితుడై యున్న అతనికి జ్ఞానోదయమయ్యెను. అప్పుడు అతని హృదయాకాశమునందు శ్రీహరి స్వయముగా దర్శనమిచ్చెను. ఆ పురాణపురుషుని రూపమును అతడు ఇంతకుముందు ఎన్నడును చూచియుండలేదు. భగవద్దర్శనము  ఐనంతనే అతడు తనను కృతకృత్యునిగా తలంచుకొనెను.

8.23 (ఇరువది మూడవ శ్లోకము)

మృణాలగౌరాయతశేషభోగపర్యంక ఏకం పురుషం శయానమ్|

ఫణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతోయే॥1497॥

బ్రహ్మదేవునకు హృదయాకాశమున దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు  ఒంటరిగా శేషతల్పముపై శయనించియుండెను. ఆ ఆదిశేషుని శరీరము కమలనాళమువలె తెల్లనిదై విశాలముగా ఉండెను. ఆ ఆదిశేషుని వేయి పడగలు ఆ శ్రీహరికి ఛత్రములవలె అమరియుండెను. ఆ పడగలమీది కిరీటములయందలి మణులకాంతులు ప్రళయకాల జలమునందు అలముకొన్న చీకట్లను పారద్రోలుచుండెను.

8.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః సంధ్యాభ్రనీవేరురురుక్మమూర్ధ్నః|

రత్నోదధారౌషధిసౌమనస్యవనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః॥1698॥

ఆ పరమపురుషునియొక్క శ్యామసుందర శరీరకాంతులు మరకతమణి పర్వతశోభలను తిరస్కరించుచుండెను. ఆ ప్రభువు యొక్క నడుమునకుగల పీతాంబరముయొక్క ధగధగలు గిరిప్రాంతమున వ్యాపించియున్న సాయంకాలపు పచ్చని మేఘముల ద్యుతులను మించిపోవుచుండెను. ఆ స్వామి శిరమున విరాజిల్లుచున్న సువర్ణమయ కిరీటశోభలు ఆ పర్వతముయొక్క బంగారు శిఖరముల కాంతులను తలదన్నుచుండెను. ఆ పురుషోత్తముడు ధరించిన వనమాల ద్యుతులు పర్వతమునందలి, రత్నముల, జలప్రవాహముల, ఓషధుల, పుష్పముల వైభవములను పరాస్తమొనర్చుచుండెను. ఆ పరమాత్మ భుజదండములు పర్వతమునందలి వెదుళ్ళను, చరణములు వృక్షములను త్రోసిపుచ్చుచుండెను.

8.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఆయామతో విస్తరతః స్వమానదేహేన లోకత్రయసంగ్రహేణ|

విచిత్రదివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాశ్రితవేషదేహమ్॥1499॥

ఆ పురుషోత్తముని దేహము ఆ స్వామియొక్క ఔన్నత్యమును ప్రకటించుచుండెను (ఆయన ఔన్నత్యమునకు అనువుగా ఉండెను). అది అతి దీర్ఘమైనది. మిగుల విశాలమైనది. దేదీప్యమానముగానున్న ఆ దేహము ముల్లోకముల ప్రమాణములను మీరుచుండెను. ఆ స్వామి ధరించుటవలన దివ్యములైన ఆభరణములు, పీతాంబరములు ద్విగుణిత శోభలను సంతరించుకొను చుండెను.

8.26 (ఇరువది ఆరవ శ్లోకము)

పుంసాం స్వకామాయ వివిక్తమార్గైః అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మమ్|

ప్రదర్శయంతం కృపయా నఖేందుమయూఖభిన్నాంగుళిచారుపత్రమ్॥1500॥

భక్తులు తమ అభిలాషలను దీర్చుకొనుటకై వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, వేర్వేరు మార్గాలలో ఆ స్వామి పాదములను అర్చింతురు. ఆ ప్రభువు యొక్క చరణారవిందములు, వాటిని సేవించువారి పాలిట కామధేనువులు. ఆ దివ్యపాదముల నఖకాంతులు చంద్రకిరణముల శోభలను మించి తళతళలాడు చుండెను.

8.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుండలమండితేన|

శోణాయితేనాధరబింబభాసా ప్రత్యర్హయంతం సునసేన సుబ్ర్వా॥1501॥

ఆ పరమపురుషుని ముఖశోభలు అపూర్వములు. అందములను చిందుచున్న ఆయన దరహాసములు ఆర్తులను పారద్రోలుచుండెను. చెవులకు అలంకృతములైన మణికుండలముల కాంతులు ఆ స్వామి చిరునవ్వుల శోభలతో పోటీపడుచు తళుకులీనుచుండెను.అధరబింబముల అరుణశోభలు ఎంతయు మనోజ్ఞముగా నుండెను. ఆ స్వామియొక్క సుందరమైన నాసిక, తీర్చిదిద్దబడిన కనుబొమలుగల ముఖము చక్కని అందచందములను వెలార్చుచు తనను పూజించెడు భక్తులను కృపాదృష్టిని సారించుచు సమ్మానించుచుండెను.వేయేల, ఆ పురుషోత్తముని ముఖద్యుతులు పరమాద్భుతములు. భక్తానుగ్రహ సంపన్నములు.

8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

కదంబకింజల్క పిశంగవాససా స్వలంకృతం మేఖలయా నితంభే|

హారేణ చానంతధనేన వత్స శ్రీవత్సవక్షఃస్థలవల్లభేన॥1502॥

నాయనా! విదురా! ఆ దేవదేవుని కటిప్రదేశము కడిమిపువ్వులోని కేసరములవలె పసుపుపచ్చని వర్ణముగల వస్త్రముతోను, సువర్ణమయమైన మేఖలతోను సుశోభితమై ఉండెను. అట్లే వక్షస్థలము శ్రీవత్స చిహ్నముతోడను, అమూల్యమైన ఆభరణములతోడను విరాజిల్లుచుండెను.

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

పరార్ఘ్యకేయూరమణిప్రవేకపర్యన్తదోర్దండసహస్రశాఖమ్|

అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్రమహీంద్రభోగైరధివీతవల్శమ్॥1503॥

జగత్కారణుడగు శ్రీమన్నారాయణుడు అవ్యక్తమూలమగు చందనవృక్షమువలెనున్నాడు. అలంకృతములైన భుజకీర్తులు మణులచే పొదగబడి, అలంకృతములైన విశాలములగు భుజదండములే ఆ వృక్షముయొక్క వేలాదిశాఖలుగా అలరారుచున్నవి. జగత్తు అనెడి మహావృక్షమునకు అతడే ఆధారము. ఆదిశేషుని పడగలు ఆ స్వామి బాహువులకు చుట్టుకొని వింతకాంతులను ప్రసరింపజేయుచుండెను. మణికేయూరములు వృక్షశాఖలకు గల పష్పఫలములవలె తేజరిల్లుచుండెను. అవ్యక్తమైన ఆ పరమాత్మ, వ్యక్తమైన జగత్తునకు మూలము. ఆ ప్రభువు అవయవములకు చుట్టుకొనియున్న ఆదిశేషుని పడగలే వృక్షకాండముల వల్కలములు (కాండములకు గల పట్టలు). చందన వృక్షమునకు సర్పములు చుట్టుకొనియుండును. ఆ విధముగా ఆయన పాములకు నిలయమగు చందనవృక్షమును పోలియున్నాడు.

8.30 (ముప్పదియవ శ్లోకము)

చరాచరౌకో భగవన్మహీద్రమహీంద్రబంధుం సలిలోపగూఢమ్

కిరీటసాహస్రహిరణ్యశృంగమ్ ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భమ్॥1504॥

శ్రీమన్నారాయణుడు ఈ సంసారవృక్షమునకు ఆశ్రయమైనవాడు. ఆదిశేషునకు బంధువైన ఆ భగవానుడు అగాధజలములచే ఆవరింపబడియున్న పర్వతరాజమువలె ఉన్నాడు. అప్పుడు ఆయన నలువైపులనుండి చుట్టబడియున్న జలరాశిని తాను ఆలింగనము చేసికొననట్లుగా గోచరించుచుండెను. ఆయన ధరించిన వేలాది కిరీటములు సువర్ణమయ శిఖరములవలె ఒప్పారుచుండెను. పర్వతసన్నిభుడైన ఆ పురుషోత్తముని నుండియే కౌస్తుభరత్నము ప్రకటమైనట్లుగా ప్రకాశించుచుండెను. ఇట్టి పర్వతరాజమువంటి భగవానుని, బ్రహ్మదేవుడు దర్శించెను.

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

నివీతమామ్నాయమధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిమ్|

సూర్యేందువాయ్వగ్న్యగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదమ్॥1505॥

ఆ స్వామి  ధరించిన వనమాలయందలి సుగంధములచే ఆకర్షితములైన భ్రమరములు ఝంకారములు సలిపినట్లు వేదములనెడి భ్రమరములు ఆ పరమాత్మ యశోవిలాసములను గానము చేయుచున్నవి. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని మొదలగు దేవతలు ఎవరునూ ఆపరంధాముని చేరజాలరు. ముల్లోకములలో, మూడుకాలములలో అమోఘములగు తమ తేజస్సునే దుర్నిరీక్ష్యములైన సుదర్శనాది ఆయుధములు ఆయన చుట్టూరా తిరుగుచుండుటచే, ఆ స్వామిని సమీపించుటకు సైతము శక్యముగాకున్నది.  అట్టి శ్రీమన్నారాయణుని దివ్యస్వరూపమును బ్రహ్మదేవుడు దర్శించెను. 

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

తర్హ్యేవ తన్నాభిసరః సరోజమ్  ఆత్మానమంభః శ్వసనం వియచ్చ|

దదర్శ దేవో జగతో విధాతా నాతః పరం లోకవిసర్గదృష్టిః॥1506॥

విదురా! విశ్వనిర్మాణదృష్టి గలిగిన బ్రహ్మదేవుడు అంతట క్రమముగా శ్రీమన్నారాయణుని  నాభినుండి ఉద్భవించిన కమలమును, అందు కూర్చొనియున్న తనను, ప్రళయకాలజలములను, ప్రళయవాయువును, ఆకాశముసు చూచెను, ఈ ఐదు దప్ప ఆయనకు మరి యేవియును కనబడలేదు.

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

స కర్మబీజం రజసోపరక్తః ప్రజాః సిసృక్షన్నియదేవ దృష్ట్యా|

అస్తౌద్విసర్గాభిముఖస్తమీద్యమ్ అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా॥1507॥

పిమ్మట బ్రహ్మదేవుడు రజోగుణయుక్తుడై ప్రజలను (ప్రాణులను) సృష్టించుటకై అభిలాషపడెను. కానీ సృష్టికారణరూపమైన పైన పేర్కొనబడిన నాభిసరోజమునుండి ప్రకటితములైన ఈ ఐదింటిని మాత్రమే అతడు చూచెను. సృష్టి నిర్మాణమును చేయగోరిన బ్రహ్మదేవుడు భగవంతుని యందు మనస్సును నిల్పెను. కాని, ఆ పరమాత్మమార్గము అవ్యక్తమైయుండెను. అతనివద్ద సృష్టిరచనా సామాగ్రికూడా తగినంతగా లేకుండెను. అప్పుడు ఆయన కొనియాడదగిన ఆ ప్రభువును స్తుతింపసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  అష్టమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

4.4.2022 సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-తొమ్మిదవ అధ్యాయము

బ్రహ్మదేవుడు భగవంతుని స్తుతించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
 తృతీయ స్కంధము-తొమ్మిదవ అధ్యాయము

బ్రహ్మోవాచ

9.1 (ప్రథమ శ్లోకము)

జ్లాతోఽసిమేఽద్య సుచిరాన్నను దేహభాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యమ్|

నాన్యత్త్వదస్తి భగవన్నపి తన్న  శుద్ధమ్ మాయాగుణవ్యతికరాద్యదుర్విభాసి॥1508॥

బ్రహ్మదేవుడు వచించెను- పరమాత్మా! బహుకాలము ఉపాసించిన పిమ్మటనేడు నేను నిన్ను తెలిసికొనగలిగితిని. దేహధారులందరు ఎంతటి దౌర్భాగ్యవంతులు. వారు నీ స్వరూపమును తెలియజాలకున్నారు. అది వారిదోషము. దేవా!ఈలోకమున నీవుదప్ప మరియొకటి ఏదియును లేదు. ఒకవేళ ఉన్నట్లుగా భాసించినను అది సత్యము గాదు.అయితే నీ మాయయొక్క త్రిగుణములయందు కలిగిన పరిణామమువలన నీవే వివిధరూపములలో భాసించుచున్నావు. 

9.2 (రెండవ శ్లోకము)

రూపం యదేతదవబోధరసోదయేన శశ్వన్నివృత్తతమనః సదనుగ్రహాయ|

ఆదౌ గృహీతమవతారశతైకబీజం యన్నాభిపద్మభవనాదహమావిరాసమ్॥1509॥

దేవా! నీ యథార్థస్వరూపము పరమ జ్ఞానమయము. ఆనందప్రదము. అజ్ఞానము నిన్ను తాకజాలదు. అది నీకు దూరమున ఉండును. నీ నాభికమలమునుండి నేను ఆవిర్భవించితిని. ఈ నీ రూపము వందలకొలది అవతారములకు మూలమైనది. సత్పురుషులను  అనుగ్రహించుటకై నీవు ఈ రూపముసు ప్రదర్శించితివి.

9.3 (మూడవ శ్లోకము)

నాతః పరం పరమ యద్భవతః స్వరూపమ్ ఆనందమాత్రమవికల్పమవిద్ధవర్చః|

పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకమదస్త ఉపాశ్రితోఽస్మి॥1510॥

పరమాత్మా! నీ స్వరూపము ఆనందమయము, అఖండము, తేజోమయము ఐనది. ఈ రూపము దప్ప నీదగు వేరొకరూపము లేనేలేదు. విశ్వాత్మా! అద్వితీయమగు నీ రూపము జగత్తును సృష్టించిననూ,దీనికి నీవు అతీతముగ నున్నావు. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణ చతుష్టయము అనువాటి కన్నింటికీ అధిష్ఠానరూపమున నీవే ఉన్నావు. అట్టి నిన్ను నేను శరణ జొచ్చుచున్నాను.

9.4 (నాలుగవ శ్లోకము)

తద్వా ఇదం భువనమంగళమంగళాయ ధ్యానే స్మ నో దర్శితం త ఉపాసకానామ్|

తస్మై నమో  భగవతేఽనవిధేయ తుభ్యమ్ యోఽనాదృతో నరకభాగ్భిరసత్ప్రసంగైః॥1511॥

లోకకల్యాణ కారకుడవైన పరమాత్మా! నిన్ను ధ్యానించుచున్న నా యొక్క హృదయమునందే నీ రూపమును దర్శింపజేసితివి. అట్టి నీ రూపమునకు నేను పదే పదే నమస్కరించుచు శరణుగోరుచున్నాను. పట్టుదలతో కుతర్కవాదముల నొనర్చు పాపాత్ములు ఈ నీ రూపమును అనాదరించి నరకముల పాలగుదురు.

9.5 (ఐదవ శ్లోకము)

యే తు త్వదీయచరణాంబుజకోశగంధమ్ జిఘ్రంతి కర్ణవివరైః శ్రుతివాతనీతమ్|

భక్త్యా గృహీత చరణః పరయా చ తేషామ్ నాపైషి నాథ హృదయాంబురుహాత్స్వపుంసామ్॥1512॥

ప్రభూ!వేదరూపమైన వాయువుద్వారా తీసికొని రాబడిన నీ చరణకమలకోశ పరిమళములను భక్తులు తమ  కర్ణకుహరములద్వారా ఆఘ్రాణింతురు. భక్తులు తమ ఉత్కృష్టమగు భక్తిచే నీ పాదములను గట్టిగా పట్టుకొనేదరు. అట్టివారి హృదయకమలములనుండి నీవు ఎప్పుడూ దూరము కావు. భ్రమరము వలె నీవు భక్తుల హృదయపద్మమునందు శాశ్వతముగ నిలిచియుందువు.

9.6 (ఆరవ శ్లోకము)

తావద్భయం ద్రవిణ గేహసుహృన్నిమిత్తం శోకః స్పృహా పరిభవో విపులశ్చ లోభః|

తావన్మమేత్యసదవగ్రహ ఆర్తిమూలమ్ యావన్న తేఽంఘ్రిమభయం ప్రవృణీత లోకః॥1513॥

దేవా! అభయప్రదములైన చరణారవిందములను ఆశ్రయించినంతవరకు జనులకు ధనము, గృహములవలనను, బంధుజనుల కారణముగను కలుగు భయము, శోకము, దైన్యము, కోరికలు, మిక్కుటమైన లోభము మొదలగునవి బాధించుచుండును. నేను నాది అను అహంకార మమకారములు కలుగుచుండును. అవియే సకల దుఃఖములకు మూలములు. కనుక, ముక్తిప్రదములైన నీ పాదములను ఆశ్రయించిన వారికి ఈ భయాదులు ఏవియును ఉండవు.

9.7 (ఏడవ శ్లోకము)

దైవేన తే హతధియో భవతః ప్రసంగాత్ సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియా యే|

కుర్వంతి కామసుఖలేశలవాయ దీనా లోభాభిభూతమనసోఽకుశలాని శశ్వత్॥1514॥

సర్వేశ్వరా! నీపైగల భక్తిప్రభావమున అశుభములు అన్నియును తొలగిపోవును. కానీ, నీయెడ భక్తిప్రపత్తులు లేనివారు నీ దివ్యగుణములను  శ్రవణము చేయరు, కీర్తింపరు. వారు దైవోపహతులై తెలివిమాలినవారు అగుదురు. క్షణికములైన ఇంద్రియసుఖముల కొరకు ఆరాట పడుచు దుష్కర్మలయందే నిరతులగుదురు. దీనావస్థలతో  కుమిలిపోవుచుందురు. అట్టి వారికి శాంతి ఎట్లుండును?

9.8 (ఎనిమిదవ శ్లోకము)

క్షుత్తృట్ త్రిధాతుభిరిమా ముహురర్ద్యమానాః శీతోష్ణవాతవర్షైరితరేతరాచ్చ|

కామాగ్నినాచ్యుత రుషా చ సుదుర్భరేణ సంపశ్యతో మన ఉరుక్రమ సీదతే మే॥1515॥

అచ్యుతా! ఉరుక్రమా! అట్టివారు ఆకలిదప్పులతోను, వాత, పిత్త, కఫరోగములతోను తీవ్రములైన శీతోష్ణములతోను, సుడిగాలులతోడను, జడివానలు మున్నగువాటితోను పరంపరగా బాధపడుచుందురు. వారు అంతులేని అసూయాద్వేషములకును, దుర్భరములైన కామక్రోధములకును లోనై దురపిల్లుచుందురు. అట్టివారిని జూచినప్పుడు అయ్యో! వారి మనస్సులలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నను, స్వస్వరూపమును మరచిపోవుటచేతనే మాయలో  చిక్కుకొని అంతులేని దుఃఖములను అనుభవించుచున్నారుగదా అని నా మనస్సు పరిపరివిధముల ఖేదపడుచుండును.

9.9 (తొమ్మిదవ శ్లోకము)

యావత్పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థమాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్|

తాపన్న సంసృతిరసౌ ప్రతిసంక్రమేత వ్యర్థాపి దుఃఖనివహం వహతీ క్రియార్థా॥1514॥

పరమేశ్వరా! నీ మాయాప్రభావమున మానవులు ఇంద్రియార్థములకు ఆకర్షితులై విషయలోలురు అగుదురు. వారు దేహాత్మభావముతో తమను నీకంటెను వేరుగా తలంతురు. అట్టివారు ఎన్నడును జనన మరణరూప సంసారచక్రమునుండి బయటపడజాలరు. వారి కర్మాచరణములు, నిరర్థకములై దుఃఖములను తెచ్చిపెట్టుచుండును. చేసినవి పుణ్యకర్మలేయైనను, అవి అహంకారయుక్తములైనచో, సత్ఫలితములను ఇయ్యజాలవు సరిగదా! మోక్షప్రాప్తికి ప్రతిబంధకములగును.

9.10 (పదియవ శ్లోకము)

అహ్న్యాపృతార్తకరణా నిశి నిశ్శయానా నానా మనో రథధియా క్షణభగ్ననిద్రాః|

దైవహతార్థరచనా ఋషయోఽపి దేవ యుష్మత్ప్రసంగవిముఖా ఇహ సంసరంతి॥1517॥

దేవదేవా! ఋషులుగూడ నీ కథాప్రసంగములకు దూరమైనచో వారిలోని భక్తిప్రపత్తులు ఆగిపోవును. అట్టివారు సంసారతాపత్రయములందు చిక్కుపడుదురు. వారి చిత్తములు పగటియందు పలువిధములగు లౌకిక కార్యకలాపములలో మునిగి పోవును. రాత్రివేళలలో గూడ వారికి నిద్రాభంగము కలుగుచుండును. విధివశమున అప్పుడప్పుడు వారి ధనార్జనాది లాభముల ప్రయత్నములకు అవరోధములు ఏర్పడుచుండుటవలన వారు దుఃఖముల పాలగుచుందురు. ఈ విధముగా అట్టి వారును జననమరణచక్రములో తిరుగాడుచుందురు.

9.11 (పదునొకండవ శ్లోకము)

త్వం భావయోగపరిభావితహృత్సరోజ ఆస్సే శ్రుతేక్షితపథో నను నాథ పుంసామ్|

యద్యద్ధియా త ఉరుగాయ విభావయంతి తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ॥1518॥

దయామయా! పరమాత్మా! నిన్ను భజించువారి హృదయ కమలములు నీ కథాప్రసంగములను వినుటద్వారా నిర్మలములగును. ఆ విధముగా వారు తమ హృదయముల యందు నిన్నే నిలుపుకొందురు. అట్లే నీవును వారి హృదయములలో శాశ్వతముగా నిలిచియుందువు. శ్రవణభక్తిద్వారా నీ స్వరూపజ్ఞానము వారికి కలుగును. వారు ఏ రూపమున నిన్ను తలంతురో, నీవు వారిని అనుగ్రహించుటకై ఆ రూపములలోనే వారికి దర్శనమిత్తువు.   

9.12 (పండ్రెండవ శ్లోకము)

నాతిప్రసీదతి తథోపచితోపచారైః ఆరాధితః సురగణైర్హృది బద్ధకామైః|

యత్సర్వభూతదయయా సదలభ్యయైకో నానాజనేష్వవహితః సుహృదంతరాత్మా॥1519॥

సర్వేశ్వరా! దేవతలుగూడ పూజాసామాగ్రిని సమకూర్చుకొని సకామభక్తితో నిన్ను ఆరాధించినను నీవు అంతగా ప్రసన్నుడవుగావు. కానీ! సకలప్రాణులయెడ దయాభావముగలిగి వారికి సేవలొనర్చుటవలన నీవు మిగుల తృప్తిచెందెదవు. ఏలయన, సకలప్రాణులకును నీవే అంతర్యామివి, సహృదుడవు. ప్రాణులను తమ ఆత్మస్వరూపులుగా భావించి, సేవించుటయే సర్వోత్కృష్టమైన భక్తియనబడును.

9.13 (పదమూడవ శ్లోకము)

పుంసామతో వివిధకర్మభిరధ్వరాద్యైః దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ|

ఆరాధనం భగవతస్తవసత్క్రియార్థో ధర్మోఽర్చితః కర్హిచిత్ ధ్రియతే న యత్ర॥1520॥

కావున, పరమేశ్వరా! మానవులు యజ్ఞయాగాది వివిధకర్మలను, దానధర్మములను కఠోరములగు తపశ్చర్యలను, వ్రతములను చేసి నిన్ను ఆరాధించి, ప్రసన్నుని చేసికొనుటయే, ఆ సత్కర్మలకు లభించెడు మహాఫలము. ఇంకనూ, నీయందు సమర్పణబుద్ధితో చేయబడిన ధర్మకర్మలెవ్వియును, ఎన్నడునూ నశింపవు. పైగా అవి అక్షయఫలప్రదములగును.

9.14 (పదునాలుగవ శ్లోకము)

శశ్వత్స్వరూపమహసైవ నిపీతభేదమోహాయ బోధధిషణాయ నమః పరస్మై|

విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలారాసాయ తే నమ ఇదం చకృమేశ్వరాయ॥1521॥

పరమాత్మా! నీవు సర్వదా నీ స్వరూపప్రకాశము చేతనే ప్రాణులయొక్క భేదభావములు, భ్రమలు మొదలగు చీకట్లను పటాపంచలొనర్తువు. నీవు జ్ఞానమునకు అధిష్టాతవు.  పరమపురుషుడవు, జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయముల నిమిత్తముగా నీవు ఒనర్చెడి మాయాలీలలు అన్నియును నీ క్రీడలే. నీకు పదే పదే నమస్కరించుచున్నాను.

9.15 (పదునైదవ శ్లోకము)

యస్యావతారగుణకర్మవిదంబనాని నామాని యేఽసువిగమే వివశా గృణంతి|

తేఽనేకజన్మశమలం సహసైవ హిత్వా సంయంత్యపావృతమృతం తమజం ప్రపద్యే॥1522॥

దేవదేవా!ప్రాణోత్క్రమలు సమయమునందు మానవులు పారవశ్యముతో నైనను నీ అవతారములను, గుణములను, కర్మలను సూచించునట్టి దేవకీనందనా! జనార్ధనా! సర్వజ్ఞా! రావణాంతకా! భక్తవత్సలా! గోవర్ధనోద్ధారా! కంసారీ! మొదలగు నామములను, ఉచ్చరించినచో వారియొక్కజన్మజన్మల పాపములను రూపుమాయును, వారు మాయాది ఆవరణరహితమైన బ్రహ్మపదమును పొందుదురు. నీవు జన్మరహితుడవు, నిత్యుడవు. నిన్ను శరణు వేడుచున్నాను.

9.16 (పదునారవ శ్లోకము)

యో వా అహం చ గిరిశశ్చ విభుస్స్వయం చ స్థిత్యుద్భవప్రళయ హేతవ ఆత్మమూలమ్|

భిత్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహః తస్మై నమో భగవతే భువనద్రుమాయ॥1523॥

పరమపురుషా! నీవు విశ్వవృక్షరూపమున విరాజిల్లుచుందువు. నీవే మూలప్రకృతిని అంగీకరించి, జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములలో మూడు ప్రధానశాఖలుగా రూపొందితివి. ప్రజాపతులు, మనువులు మొదలగు రూపములతో ఆ వృక్షమునకు శాఖోపశాఖలరూపమున విస్తరించితివి.అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను.

9.17 (పదునేడవ శ్లోకము)

లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే|

యస్తావదస్య బలవానిహ జీవితాశామ్ సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోఽస్తు తస్మై॥1524॥

దేవదేవా! జనులు తమకు శుభములు చేకూరుటకై నిన్ను ఆరాధించుటయే స్వధర్మముగా వారికి నిర్దేశించితివి. కానీ, వారు తమకు శుభప్రదములైన విధ్యుక్తధర్మములయెడ ఉదాసీనులై సర్వదా నిషిద్ధకర్మలను ఆచరించుచుందురు. అట్టి ప్రమాదస్థితిలోపడిన జీవులకు జీవితాశను త్రుంచివేయుచుందువు. అట్టి శక్తిమంతుడవైన కాలపురుషుడవగు నీకు నమస్కారము.

9.18 (పదునెనిమిదవ శ్లోకము)

యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్థ ధిష్ణ్యమ్ అధ్యాసితః సకలలోకనమస్కృతం యత్|

తేపే తపో బహుసవోఽవరురుత్సమానః తస్మై నమోభగవతేఽధిమఖాయ తుభ్యమ్॥1525॥

నేను సత్యలోకమునకు రెండు పరార్థములవరకు అధిష్ఠాతను. సకలజనలకును పూజ్యుడను. ఐనను, నీ కాలస్వరూపమునకు భయపడెదను. ఆ భయమునుండి రక్షణపొంది నిన్ను జేరుటకై పెక్క సంవత్సరములు తపస్సొనర్చితిని. అధియజ్ఞపురుషుడవైన నీవే దానికి సాక్షివి. అట్టి అధియజ్ఞపురుషుడవైన నీకు పదే పదే నమస్కరింతును.

9.19 (పందొమ్మిదవ శ్లోకము)

తిర్యఙ్మనుష్యవిబుధాదిషు జీవయోనిష్వాత్మేచ్ఛయాఽఽత్మకృతసేతుపరీప్సయా యః|

రేమే నిరస్త రతిరప్యవరుద్ధ దేహః తస్మై నమో భగవతే పురుషోత్తమాయ॥1526॥

పురుషోత్తమా! నీవు పూర్ణకాముడవు. నీకు ఎట్టి విషయసుఖములయందును కోరిక లేదు. ఐనను, నీవు సంకల్పించిన ధర్మమర్యాదలను రక్షించుటకై పశుపక్ష్యాదులు, మనుష్యులు, దేవతలు మొదలగు జీవయోనులయందు నీ ఇచ్ఛను అనుసరించి, శరీరములను ధరించి పెక్కు లీలలను నెరపితివి. అట్టి పురుషోత్తమ భగవానుడవగు నీకు నమస్కారము.

9.20 (ఇరువదవ శ్లోకము)

యోఽవిద్యయానుపహతోఽపి దశిర్థవృత్త్యా నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః|

అంతర్జలేఽహి కశిపుస్పర్శానుకూలాం భీమోర్మిమాలిని జనస్య సుఖం విషృణ్వన్॥1527॥

ప్రభూ! అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అను ఐదు క్లేశముల రూపమైన తమోగుణాత్మక వృత్తులలో ఏదియును నిన్ను బాధింపదు. ఇప్పుడు సకలలోకములను నీ యుదరమునందు లీనమొనర్చుకొని, భయంకర తరంగములచే కల్లోలితమగుచుండెడి ప్రళయకాల జలములయందు మెత్తని ఆదిశేషతల్పముపై శయనించు చున్నావు. ఆ విధముగా నీ యుదరమునందు లీనమైయున్న ప్రాణులను అన్నింటికి పూర్వకల్పమునందలి కర్మపరంపరలచే అలసియున్న జీవులకు విశ్రాంతిని ఇచ్చుచున్నావు. ఈ లీలలద్వారా జీవులపై నీకుగల అపారమైన కరుణను ప్రదర్శించుచున్నావు.

9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

యన్నాభిపద్మభవనాదహమాసమీద్య లోకత్రయోపకరణో  యదనుగ్రహేణ|

తస్మై సమస్త ఉదరస్థభవాయ యోగనిద్రావసానవికసన్నలినేక్షణాయ॥1528॥

దేవా! నీ నాభికమలమనెడి భవనమునందు నేను జన్మించితిని. ఈ సంపూర్ణ విశ్వము నీ యుదరమునందే నిలిచియున్నది. నీయనుగ్రహముచేతనే నేను ముల్లోకముల సృష్టికై ప్రవృత్తుడనగుచున్నాను. ఇప్పుడు నీ యోగనిద్ర పరిసమాప్తము అగుచుండుటవలన కలువలవంటి నీ కన్నులు వికసించుచున్నవి. అట్టి నీకు నమస్కారము.

9.22 (ఇరువది రెండవ శ్లోకము)

సోఽయం సమస్తజగతాం సుహృదేక ఆత్మా సత్త్వేన యన్మృడయతే భగవాన్ భగేన|

తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోఽసౌ॥1529॥

పరమాత్మా! నీవు సకలజగత్తునకును సహృదుడవు,ఆత్మవు, శరణాగతవత్సలుడవు. నీ జ్ఞాన ఐశ్వర్యసంపదలు విశ్వమును ఆనందింపజేయును. నీ జ్ఞానమును నా బుద్ధిలో  ప్రవేశపెట్టుము. దాని ప్రభావమున నేను పూర్వకల్పముతో సమానముగా ఇప్పుడును జగత్సృష్టిని నెరపగలను.

9.23 (ఇరువది మూడవ శ్లోకము) 

ఏష ప్రసన్నవరదో రమయాఽఽత్మశక్త్యా యద్యత్కరిష్యతి గృహీతగుణావతారః|

తస్మిన్ స్వవిక్రమమిదం సృజతోఽపి చేతో యంజీత కర్మశమలం చ యథా విజహ్యామ్॥1530॥

పరాత్పరా! నీవు భక్తుల వాంఛలను ఈడేర్చునట్టి కల్పతరువువు. నీ శక్తియైన లక్ష్మీదేవితో గూడి నీవు అనేక గుణావతారములను ఎత్తి అద్భుతకార్యములు చేయుచుందువు. నా ద్వారా ఈ జగత్సృష్టి కార్యముసు సంకల్పించుటగూడ ఆ అద్భుతకార్యములలోని భాగమే. కనుక, ఈ సృష్టి సమయముస నీవు నా చిత్తమునకు ప్రేరణగూర్చి నాకు తగినశక్తిని ప్రసాదింపుము. దానివలన సృష్టిరచనకు సంబంధించిన అభిమానదోషము నన్ను అంటకుండుగాక! (వాస్తవముగా ఈ సృష్టి రచనాసంకల్పము నీదే! నేను కేవలము నిమిత్తమాత్రుడనే).

9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

నాభిహ్రదాదిహ సతోఽమ్భసి యస్య పుంసో విజ్ఞానశక్తిరహమాసమనంతశక్తేః|

రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే మా రీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః॥1531॥

దేవా! ఈ ప్రళయకాల జలములయందు శయనించుచున్న పరమపురుషుడవు నీవు. అనంత శక్తిశాలివైన నీ నాభికమలమునుండి నేను జన్మించితిని. నేనును నీ విజ్ఞాన  శక్తిలో అంతర్భూతుడనే. కనుక, విచిత్రరూపమైన ఈజగత్తును విస్తరింపజేయు సమయమున నీ కృపవలన వేదరూపవాణిని ఉచ్ఛరించుట యందు నాలో ఎట్టిలోపమూ రాకుండునుగాక!

9.25 (ఇరువది ఐదవ శ్లోకము)

సోఽసావదభ్రకరుణో భగవాన్ వివృద్ధప్రేమస్మితేన నయనాంబురహం విజృంభన్|

ఉత్థాయ విశ్వవిజయాయ చ నో విషాదం మాధ్వా గిరాపనయతాత్పురుషః పురాణః॥1532॥

పరమేశ్వరా!  నీవు అపారకరుణామయుడవు, పురాణపురుషుడవు. వాత్సల్యపూరితమైన చిరునవ్వుతో నీ నేత్రకమలములను వికసింపజేయుము. శేషతల్పమునుండి లేచి, విశ్వములను ఉద్ధరించుటకై సుమధురమైన నీ వాణితో నా విషాదమును దూరమొనర్చుము.

మైత్రేయ ఉవాచ

9.26 (ఇరువది ఆరవ శ్లోకము)

స్వసంభవం నిశామ్యైవం తపోవిద్యాసమాధిభిః|

యావన్మనోవచః స్తుత్వా విరరామ స భిన్నవత్॥1533॥

మైత్రేయుడు నుడివెను- విదురా! బ్రహ్మదేవుడు ఈ విధముగా తపస్సు, విద్య, సమాధులద్వారా తన పుట్టుకస్థానమైన శ్రీహరిని చూచెను.పిమ్మట తన వాఙ్మనశ్శక్తుల ననుసరించి ఆ ప్రభువును స్తుతించి, అతడు విచారగ్రస్తుడై మౌనము వహించెను.

9.27(ఇరువది ఏడవ శ్లోకము)

అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః|

విషణ్ణచేతసం తేన కల్పవ్యతికరాంభసా॥1534॥

9.28 (ఇరవది ఎనిమిదవ శ్లోకము)

లోకసంస్థానవిజ్ఞాన ఆత్మనః ఫరిఖిద్యతః|

తమాహాగాధయ వాచా కశ్మలం శమయన్నివ॥1535॥

బ్రహ్మదేవుడు ఆ ప్రళయకాలజలములను జూచి, మిక్కిలి భయగ్రస్తుడై యుండుటను శ్రీహరి గమనించెను. లోకములన సృష్టించు విషయమున ఎట్టి నిశ్చితాభిప్రాయమూ లేకుండుటవలన బ్రహ్మదేవుని చిత్తము మిక్కిలి విచారమునకు లోనయ్యెను. శ్రీమహావిష్ణువు అతని మానసికపరిస్థితిని గమనించి, ఆ బ్రహ్మయొక్క ఖేదమును తొలగించుటకై గంభీరవచనములతో ఇట్లనెను.

శ్రీభగవానువాచ 

9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

మా వేదగర్భ గాస్తంద్రీం సర్గ ఉద్యమమావహ|

తన్మయాపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్॥1536॥

శ్రీభగవానుడు పలికెను - బ్రహ్మదేవా! నీవు విషాదగ్రస్తుడవై ఎట్టి ఆలస్యమూ చేయవలదు. సృష్టి రచనా ప్రయత్నమునకు ఉద్యుక్తుడవు కమ్ము. నీవు నా నుండి ఆశించిన సృష్టిరచనా పరిజ్ఞానము నేను నీకు ఇదివరకే ప్రసాదించియుంటిని. ఈ సృష్టికార్యమందు నీవు కేవలము నిమిత్తమాత్రుడవు కమ్ము.

9.30 (ముప్పదియవ శ్లోకము)

భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాం చైవ మదాశ్రయామ్|

తాభ్యామంతర్హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యస్యపావృతాన్॥1537॥

నీవు మరల ఒకసారి తపమునకు పూనుకొనుము. నన్ను ఉపాసింపుము. దాని ప్రభావమున నీలో జ్ఞాననిష్ఠ కుదురుకొనుటచే నీవు సకలలోకములను నీ హృదయము నందు స్పష్టముగా చూడగలవు.

9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తత ఆత్మని లోకేఅచ భక్తియుక్తః సమాహితః|

ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాన్ త్వమాత్మనః॥1538॥

లోకదర్శనానంతరము నీవు మద్భక్తియుక్తుడవై, నీ సమాహితచిత్తమునందు లోకము లన్నియును నాలోనే ఉన్నట్లుగను, సమస్తలోకములలోను నేనే వ్యాపించి యున్నట్లుగను నీవు చూడగలవు.

9.32 (ముప్పది రెండవ శ్లోకము)

యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితమ్|

ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్   తర్హ్యేవ కశ్మలమ్॥1539॥

కట్టెలయందు అగ్నివలె సకల ప్రాణులయందును నేను అంతర్యామిగా ఉన్నట్లు, జీవుడు గ్రహించినంతనే, అతనిలోని అజ్ఞానరూపమైన కశ్మలము (మోహము) తొలగిపోవును.

9.33 (ముప్పది మూడవ శ్లోకము)

యదా రహితమాత్మానం భూతేంద్రియగుణాశయైః|

స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వారాజ్యమృచ్ఛతి॥1540॥

ఆత్మ పంచభూతములకును, దశేంద్రియములకును, త్రిగుణములకును భిన్నమైన దనియు, వాస్తవముగా ఆత్మకును నాకును భేదము తెలిసికొనినంతనే జీవుడు మోక్షమును పొందును.

9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

నానాకర్మవితానేన ప్రజా బహ్వీః  సిసృక్షతః|

నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహః॥1541॥

బ్రహ్మదేవా! వివిధములగు కర్మసంస్కారములను బట్టి పెక్కుప్రాణులను సృష్టించు అభిలాష నీలో ఉన్నను, నా అనుగ్రమువలన నీ చిత్తము కర్తృత్వమోహమునకు లోనుగాదు.

9.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాంస్త్వాం రజోగుణః|

యన్మనో మయి నిర్బద్ధం ప్రజాః సంసృజతోఽపి తే॥1542॥

ఈ సృష్టిలో మొదటివాడవు నీవే. నా స్వరూపమును, గుణములను, విభూతులను ప్రతిపాదించు వేదములకును నీవే ద్రష్టవు. సకల ప్రాణుల సృష్టియు నీ ద్వారానే జరుగుచున్నది. ఈ కారణములవలన నిన్ను అహంకారము ఆవరించినచో, నీ మనస్సును నాయందు నిబద్ధము చేయుటవలన రజోగుణాత్మకమైన అహంకారము నీ దరిచేరదు. 

9.36 (ముప్పది ఆరవ శ్లోకము)

జ్ఞాతోఽహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోఽపి దేహినామ్|

యన్మాం త్వం మన్యసేఽయుక్తం భూతేంద్రియ గుణాత్మభిః॥1543॥

నేను, పంచభూతములు, దశేంద్రియములు, సత్త్వరజస్తమోగుణములు మనోబుద్ధ్యహంకార చిత్తములు మున్నగువాటికి అతీతుడను. ఈ విషయజ్ఞానమును దేహధారులు ఎరుగుట అశక్యము, కానీ, నా అనుగ్రహప్రభావమున నా నిజస్వరూపజ్ఞానము నీకు కలిగినది.

9.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితోఽబహిః|

నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః॥1544॥

నాకు ఆశ్రయమైనవాడు ఎవరు? అను విచికిత్సతో కమలనాళముద్వారా నీటియందు దానియొక్కమూలమును అన్వేషించితిని. అప్పుడు నేనే నీకు ఆశ్రయుడను. అని నా స్వరూపమున నీ అంతఃకరణమునందు ప్రత్యక్షమొనర్చితిని.

9.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

యచ్ఛకర్థాంగ మత్ స్తోత్రం మత్కథాభ్యుదయాంకితమ్|

యద్వా తవసి తే నిష్ఠా స ఏష  మదనుగ్రహః॥1545॥

ప్రియమైన బ్రహ్మదేవా! నా అనుగ్రహఫలముగా నీవు నా కథావైభవముతో గూడిన స్తుతిని చేయగలిగితివి. అంతేగాదు, నిష్ఠతో తపస్సునుగూడ ఆచరింపగలిగితివి. 

9.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ప్రీతోఽహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా|

యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్॥1546॥

లోకములను జయించు అభిలాషతో నీవు నా సుగుణనిర్గుణ రూపములను గూడ వర్ణించుచు స్తుతించగలిగితివి. అందులకు నేను ఎంతయు ప్రీతుడనైతిని. నీకు మేలగుగాక!

9.40 (నలుబదియవ శ్లోకము)

య ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్|

తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః॥1547॥

ప్రతిదినము ఈ స్తోత్రముద్వారా నన్ను స్తుతించుచు భజించిన వారియెడల నేను వెంటనే ప్రసన్నుడనయ్యెదను. ఏలయన, నన్ను సేవించిన సత్పురుషుల సకలమనోరథములను పూర్తిగా  ఈడేర్చెదను.

9.41 (నలుబది ఒకటవ శ్లోకము)

పుర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగసమాధినా|

రాద్ధం నిశ్శ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్త్వవిన్మతమ్॥1548॥

పూర్తములు (బావులు, చెరువులు మొదలగువాటి నిర్మాణము), తపస్సు, యజ్ఞములు, దానములు, యోగసమాధులు మున్నగు సాధనములద్వారా నన్ను ప్రసన్నుని జేసికొనినవారికి నేను పరమశుభప్రదములైన ఫలములను ప్రసాదించుదునని తత్త్వవేత్తల అభిప్రాయము.

9.42 (నలుబది రెండవ శ్లోకము)

అహమాత్మాఽఽత్మనాం ధాతః ప్రేష్ఠస్సన్ ప్రేయసామపి|

అతో మయి రతిం కుర్యాద్దేహాదిర్యత్కృతే ప్రియః॥1549॥

బ్రహ్మదేవా! నేను ఆత్మలన్నింటికిని ఆత్మను. స్త్రీపుత్రాది ఆత్మీయుల కంటెను నేను పరమ ఆప్తుడను. నా కారణముగనే దేహాదులు గూడ ప్రియవస్తువులు అగుచున్నవి. కనుక, నాయందే భక్తిప్రపత్తులు కలిగియుండవలెను.

9.43 (నలుబది మూడవ శ్లోకము)

సర్వవేదమయేనేదమాత్మనాఽఽత్మాఽఽత్మయోనినా|

ప్రజిస్సృజయథాపూర్వం యాశ్చ మయ్యనుశేరతే॥1551॥

బ్రహ్మదేవా! సర్వదేవమయుడవైన నీ బుద్ధిని అనుసరించి, పూర్వకల్పము నందువలె ప్రజలను (ప్రాణులను) సృష్టింపుము. ఇప్పుడు ముల్లోకములను, వాటియందలి ప్రాణులను నాలోనే లీనమై శయనించుచున్నారు?

మైత్రేయ ఉవాచ

9.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తస్మా ఏవం జగత్స్రష్ట్రే ప్రధానపురుషేశ్వరః|

వ్యజ్యేదం స్వేన రూపేణ కంజనాభస్తిరోదధే॥1551॥

మైత్రేయుడు నుడివెను - ప్రకృతిపురుషులకు నియంతయైన కమలనాథుడు (శ్రీహరి) సృష్టికర్తయైన బ్రహ్మకు ఈవిధముగా జగన్నిర్మాణమును గుర్తుచేసి, తన యథారూపమున అంతర్ధానమయ్యెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  నవమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము.
 
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
5.4.2022   ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పదియవ అధ్యాయము

పదివిధములైన సృష్టివర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
 తృతీయ స్కంధము-పదియవ అధ్యాయము

విదుర ఉవాచ

10.1 (ప్రథమ శ్లోకము)

అన్తర్హితే భగవతి బ్రహ్మా లోకపితామహః|

ప్రజా ససర్జ కతిధా దైహికీర్మానసీర్విభుః॥1552॥

విదురుడు పలికెను-మహర్షీ! మైత్రేయా! శ్రీమన్నారాయణుడు ఈ విధముగా అంతర్ధానమైన పిదప లోకపితామహుడైన బ్రహ్మదేవుడు తనదేహమునుండియు, తన మనస్సునుండియు ఎన్నివిధములైన ప్రాణులను సృష్టించెను.

10.2 (రెండవ శ్లోకము)

యే చ మే భగవన్ పృష్టాస్త్వయ్యర్థా బహువిత్తమ|

తాన్ వదస్వానుపూర్వ్యేణ ఛింధి నః సర్వసంశయాన్॥1553॥

మహాత్మా! మైత్రేయా! నీవు పెక్కు విషయములను ఎరిగినవాడవు. నేను అడిగిన విషయములను అన్నింటిని క్రమముగా వివరింపుము. నా సంశయములను అన్నింటిని తొలగింపుము.

సూత ఉవాచ

10.3 (మూడవ శ్లోకము)

ఏవం సంచోదితస్తేన క్షత్రా కౌషారవో మునిః|

ప్రీతః ప్రత్యాహ తాన్ ప్రశ్నాన్ హృదిస్థానద భార్గవ॥1554॥

సూతుడు వచించెను-శౌనకమహర్షీ! విదురుడు ఇట్లు ప్రశ్నించగా, మైత్రేయమహర్షి ఎంతయు సంతోషించెను. విదురుడు అడిగిన ప్రశ్నలను అన్నింటిని మననము చేసికొని, వాటికి తగినవిధముగా ఇట్లు సమాధానమిచ్చెను.

మైత్రేయ ఉవాచ

10.4 (నాలుగవ శ్లోకము)

విరించోఽపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః|

ఆత్మాన్యాత్మానమావేశ్య యదాహ భగవానజః॥1555॥

మైత్రేయుడు నుడివెను- విదురా! జన్మరహితుడైన శ్రీమహావిష్ణువు ఆదేశించిరీతిగా బ్రహ్మదేవుడు ఆ పురుషోత్తముని తన మనస్సును నిలుపుకొని నూరు దివ్య సంవత్సరముల కాలము తపస్సు చేసెను.

10.5 (ఐదవ శ్లోకము)

తద్విలోక్యాబ్జసంభూతో వాయునా యదధిష్ఠితః|

పద్మమంభశ్చ తత్కాలకృతవీర్యేణ కంపితమ్॥1556॥

10.6 (ఆరవ శ్లోకము)

తపసా హ్యేధమానేన విద్యయా చాత్మసంస్థయా|

వివృద్ధవిజ్ఞానబలో న్యపాద్వయం సహంభసా॥1557॥

ప్రళయకాల వాయువుల ధాటికి జలములో తాను కూర్చొనియున్న పద్మము కదలుచుండుట చూచెను. అంతట బ్రహ్మదేవుడు ఒనర్చిన   తీవ్రమైన తపస్సువలనను,ఆయన హృదయము నందలి ఆత్మజ్ఞానమువలనను ఆ బ్రహ్మయొక్క విజ్ఞానము పెంపొందెను. తత్ప్రభావమున అతడు ఆ జలములతో సహితముగా వాయువులను త్రాగివేసెను.

10.7 (ఏడవ శ్లోకము)

తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితమ్|

అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్యచింతయత్॥1558॥

బ్రహ్మదేవుడు అధిష్టించియున్న కమలము అంతరిక్షమువరకును వ్యాపించియుండెను. దానిని జూచి, పూర్వకల్పాంతమునందు భగవంతునిలో లీనమైయున్న లోకములను అన్నింటిని ఈ పద్మసహాయమున మరల సృష్టింతును అని బ్రహ్మదేవుడు తలపోసెను.

10.8 (ఎనిమిదవ శ్లోకము)

పద్మకోశం తదావిశ్య భగవత్కర్మచోదితః|

ఏకం వ్యభాంక్షీరురుధా త్రిధా భాష్యం ద్విసప్తధా॥1559॥

శ్రీహరి చేత సృష్టికార్యమునందు నియుక్తుడైన బ్రహ్మదేవుడు ఆ కమలకోశమునందు ప్రవేశించెను. ఆ ఒక్కపద్మకోశమునే అతడు మూడుభాగములుగా (భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను మూడులోకములుగా) విభజించెను. కాని, ఆ పద్మకోశము పదునాలుగు భువనములుగా గానీ, అంతకంటె అధికముగాగానీ, విభజించుటకు వీలుగా అది విస్తరించియుండెను. అయిననూ, దానిని బ్రహ్మదేవుడు మూడు భాగములగనే విభజించెను.

10.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేదః సమాహృతః|

ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః  పరమేష్ఠ్యసౌ॥1560॥

ఈ మూడు లోకములు (భూలోక, భువర్లోక, సువర్లోకములు) జీవులయొక్క కర్మఫలముల భోగస్థానములని  శాస్త్రములయందు వర్ణింపబడినవి. కానీ, నిష్కామ కర్మలొనర్చిన వారికి తపోలోకము, జనోలోకము, సత్య (బ్రహ్మ) లోకము ప్రాప్తించును. అట్టివారికి కల్పాంతము నందు ముక్తి లభించును. 

విదుర ఉవాచ 

10.10 (పదవ శ్లోకము)

యదాత్థ బహురూపస్య హరేరద్భుతకర్మణః|

కాలాఖ్యాం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయ నః ప్రభో॥1561॥

విదురుడు నుడివెను-మహాత్మా! మైత్రేయా! శ్రీహరి విరాడ్రూపుడు, అద్భుతకర్మలను ఒనర్చువాడు. ఆ ప్రభువుయొక్క కాలశక్తిని గూర్చి, నీవు ఇదివరలో ప్రస్తావించి యుంటివి. దయచేసి దానిని విపులముగా వర్ణింపుము.

మైత్రేయ ఉవాచ

10.11 (పదునొకండవ శ్లోకము)

గుణవ్యతికరాకారో నిర్విశేషోఽప్రతిష్ఠితః|

పురుషస్తదుపాదానమాత్మానం లీలయాసృజత్॥1562॥

మైత్రేయుడు వచించెను-విదురా! గుణములు రూపాంతరము చెందుటయే కాలము. అది స్వయముగా నిర్విశేషము (ఆద్యంతరహితము), అనాది, అనంతము, దానిని నిమిత్తముగా చేసికొని భగవంతుడు ప్రతి క్రీడయందును తనను తానే సృష్టించుకొనును.

10.12 (పండ్రెండవ శ్లోకము)

విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా|

ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేనవ్యక్తమూర్తినా॥1563॥

మొట్టమొదట ఈ విశ్వమంతయును భగవంతుని మాయచేత ఆయనయందే లీనమై, బ్రహ్మరూపమున నిలిచియుండును. దానినే అవ్యక్తమూర్తియైన కాలముద్వారా భగవంతుడు మరల వేర్వేరు రూపములలో వ్యక్తమొనర్చెను. 

10.13 (పదమూడవ శ్లోకము)

యథేదానీం తదాగ్రే చ పశ్చాదప్యేతదీదృశమ్|

సర్గో నవవిధస్తస్య ప్రాకృతో  వైకృతస్తు యః॥1564॥

10.14 (పదునాలుగవ శ్లోకము)

కాలద్రవ్యగుణైరస్య త్రివిధః ప్రతిసంక్రమణః|

ఆద్యస్తు మహతస్సర్గో గుణవైషమ్యమాత్మనః॥1565॥

ఈ జగత్తు ఇప్పుడున్నట్లే ఇంతకుముందుగూడ ఉండెను. ప్రాకృతవైకృత భేదముతో పదియవ సృష్టి ఇంకను కలదు. దీని ప్రళయము కాలము, ద్రవ్యము, గుణముల ద్వారా ఇది మూడు విధములు (ఇప్పుడు మొదట పది విధములైన సృష్టిక్రమము వర్ణింపబడును. మహత్తత్త్వముయొక్క సృష్టి మొదటిది. భగవంతుని ప్రేరణచే సత్త్వాదిగుణములలో వైషమ్యము చెందుటయే ఈ మహత్తత్త్వము యొక్క స్వరూపము.

10.15 (పదునైదవ శ్లోకము)

ద్వితీయ స్త్వహమో యత్ర ద్రవ్యజ్ఞానక్రియోదయః|

భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్॥1566॥

విదురా! అహంకారముయొక్క సృష్టి రెండవది. దానినుండి పృథివ్యాది పంచభూతములు,జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఉత్పన్నములైనవి. మూడవదియగు పంచభూతముల సృష్టిలో పంచతన్మాత్రలు అనగా సూక్ష్మ మహాభూతములసృష్టి చేరును. ఈ శబ్దాది పంచతన్మాత్రలు స్థూలమహాభూతములను ప్రకటించును.

10.16 (పదునారవ శ్లోకము)

చతుర్థ ఐంద్రియస్సర్గో యస్తు జ్ఞానక్రియాత్మకః|

వైకారికో దేవసర్గః పంచమో యన్మయం మనః॥1567॥

ఇంద్రియముల సృష్టి నాల్గవది. ఇది జ్ఞానక్రియాశక్తులతో కూడినది. సాత్త్వికాహంకారమునుండి ఉత్పన్నమగు ఇంద్రియాధిష్ఠాతలైన దేవతల సృష్టి ఐదవది. మనస్సుయొక్క సృష్టిగూడ ఇందులోని భాగమే.

10.17 (పదునేడవ శ్లోకము)

షష్ఠస్తు తమసస్సర్గో యస్త్వబుద్ధికృతః ప్రభో|

షడిమే ప్రాకృతస్సర్గా వైకృతానపి మే శృణు॥1568॥

అవిద్యయొక్క సృష్టి ఆరవది. ఇందు తామిస్రము, అంధతామిస్రము, తమము, మోహము, మోహామోహము అను ఐదుబంధములు ఉండును. ఇది జీవుని యొక్క బుద్ధిని ఆవరణవిక్షేపము చేయును. ఈ ఆరును ప్రాకృతసృష్టులు. అవి: 1. మహత్తత్త్వము, 2. అహంకారము, 3. పంచతన్మాత్రలు, 4.ఇంద్రియములు, 5.ఇంద్రియాధిష్ఠానదేవతలు, 6.అవిద్య - ఇంక వైకృత సృష్టినిగూర్చి వివరింతును వినుము.

10.18 (పదునెనిమిదవ శ్లోకము)

రజోభాజో భగవతో లీలేయం హరిమేధసః|

సప్తమో ముఖ్యసర్గస్తు షద్వీధస్తస్థుషాం చ యః॥1569॥

భగవంతుడు తనను ధ్యానించువారి దుఃఖములను అన్నింటిని తొలగించును. ఇదియంతయును శ్రీహరి యొక్క లీలయే. ఆ ప్రభువే బ్రహ్మరూపములో రజోగుణమును స్వీకరించి జగత్తును సృష్టించును. ఈవిధమైన ఆరు ప్రాకృతసృష్టుల తరువాత ఆరువిధములైన స్థావరములైన వృక్షముల సృష్టి జరిగినది. ఇక ఏడవది ప్రధానమైనది వైకృతసృష్టి.

10.19 (పందొమ్మిదవ శ్లోకము)

వనస్పత్యోషధిలతాత్వక్సారా విరుధో ద్రుమాః|

ఉత్స్రోతసస్తమఃప్రాయా అంతస్స్పర్శా విశేషిణః॥1570॥

వనస్పతులు, ఓషధులు, లతలు, త్వక్సారములు, వీరుధములు, ద్రుమములు, అనునవి ఏడవ ప్రధాన వైకృతసృష్టిలోని భాగములు. వీటి సంచారము క్రింది భాగము అనగా మూలమునుండి ఊర్ధ్వభాగమునకు ఉండును. వీటియందు బహుశా జ్ఞానశక్తి ప్రకటితముగాదు. లోలోననే కేవలము స్పర్శను అనుభవించును. వీటియందు ప్రతిదానికిని ఒక విశేషగుణము ఉండును.

1. వనస్పతులు: పూవులు లేకుండగనే ఫలములను ఇచ్చునవి ఉదా:- రావి, మేడి, పనస,మర్రి మొదలగునవి.

2. ఓషధులు: పుష్పించి, ఫలించగనే నష్టమగును. ఉదా: వరి, గోధుమలు, శనగు మొదలగు ధాన్యములు.

3. లతలు: వృక్షాదులను ఆశ్రయించుకొని పెరుగుచుండునని (అల్లుకొనుచు పెరుగుచుండినవి) ఉదా: మాలతి, మల్లె, దొండ మొదలగునవి.

4. త్వక్సారములు పై భాగము (చర్మము) కఠినముగా ఉండునవి. వెదురు మొదలగునవి.

5. వీరుధములు: ఇవియును ఒకవిధముగా లతలే. కాని నేల మీద ప్రాకును. బరువైన ఫలములను ఇచ్చునవి.  ఉదా: కర్బుజ, తర్బూజ, గుమ్మడి మొదలగునవి.

6. ద్రువములు: పుష్పించి, పుష్పముల స్థానములలోనే ఫలములను ఇచ్చునవి. ఉదా: మామిడి, నేరేడు మొదలగునవి.

10.20 (ఇరువదవ శ్లోకము)

తిరశ్చామష్టమస్సర్గః సోఽష్టావింశద్విధో మతః|

అవిదో భూరితమసో ఘ్రాణజ్ఞా హృద్యవేదినః॥1571॥

ఎనిమిది సృష్టి-తిర్యక్కులు (పశుపక్ష్యాదులు) ప్రధానముగా ఇవి ఇరువది యెనిమిది (28) విధములని భావింపబడినవి. తమోగుణము అధికముగా ఉండుటచే ఇవి ఆహారనిద్రాభయమైథునములు గలవి. ఇవి వాసనలను బట్టి  వస్తుజ్ఞానము కలిగియుండును. వీటి హృదయములయందు ఆలోచనాశక్తిగాని, దూరదర్శిత్వము గాని, కాలజ్ఞానము గాని ఉండవు.

10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

గౌరజో మహిషః కృష్ణః సూకరో గవయో రురుః|

ద్విశఫాః పశవశ్చేమే అవిరుష్ట్రశ్చ సత్తమ॥1572॥

సాధుపురుషా! విదురా! గోవులు, మేకలు, దున్నలు, నల్లజింకలు, పందులు, గురుపోతులు, నల్లచారల దుప్పులు, గొర్రెలు, ఒంటెలు మొదలగునవి (వీటి గిట్టలు చీలి రెండుగా యుండును).

10.22 (ఇరువది రెండవ శ్లోకము)

ఖరోఽశ్వోఽ శ్వతరో గౌరః శరభశ్చమరీ తథా|

ఏతే చైకశఫాః క్షత్తః శృణు పంచనఖాన్ పశూన్॥1573॥

గాడిదలు, గుర్రములు, కంచరగాడిదలు, గౌరమృగములు, శరభమృగములు, చమరీమృగములు ఇవి అన్నియును చీలని గిట్టలు గలవి. ఇంక ఐదుగోళ్ళుగల పశువులను గూర్చి తెలిపెదసు వినుము.

10.23 (ఇరువది మూడవ శ్లోకము)

శ్వా శృగాలో వృకో వ్యాఘ్రో మార్జారః శశశల్లకౌ|

సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః॥1574॥

కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, పెద్దపులులు, పిల్లులు, కుందేళ్ళు, ముళ్ళపందులు, సింహములు, వానరములు, ఏనుగులు, తాబేళ్ళు, ఉడుములు, మొసళ్ళు మొదలగునవి. వీటికి ప్రతిపాదమునకు ఐదేసి గోళ్ళు ఉండును. 

10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

కంకగృధ్రవటశ్యేనభాసభల్లూకబర్హిణః|

హంససారసచక్రాహ్వ కాకోలూకాదయః ఖగాః॥1575॥

రాబందులు, గ్రద్దలు, కొంగలు, డేగలు, భాసపక్షులు, భాసభల్లుకములు, నెమళ్ళు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు, కాకులు, గ్రుడ్లగూబలు మొదలగునవి.
ఆకాశమునందును ఎగురు జీవులు పక్షులు.

10.25 (ఇరువది ఐదవ శ్లోకము)

అర్వాక్ స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణామ్|

రజోఽధికాః కర్మపరా దుఃఖే చ సుఖమానినః॥1576॥

విదురా, మనుష్యులు తొమ్మిదవ సృష్టి, వీరి ఆహారసంచారము నోటినుండి క్రిందికి నడచును. వీరు రజోగుణప్రధానులు. కర్మాపరాయణులు. దుఃఖరూప విషయములనే సుఖములుగా భావింతురు.

10.26 (ఇరువది ఆరవ శ్లోకము)

వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమ|

వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తూభయాత్మకః॥1577॥

మహాత్మా! విదురా! స్థావరములు, పశుపక్ష్యాదులు, మనుష్యులు అను మూడువిధముల సృష్టులు, ఇంకను ముందు చెప్పబడు దేవసర్గములు వైకృతసృష్టి, మహత్తత్త్వాదిరూపములైన వైకారిక  దేవసర్గములయొక్కగణన మొదట ప్రాకృతసృష్టియందు చేర్చబడినవి, వీరుగాక కౌమారసర్గములైన సనత్కుమారాది ఋషులు ప్రాకృత-వైకృత సృష్టులలో చేరుదురు.

10.27 (ఇరువది ఏడవ శ్లోకము)

దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోఽసురాః|

గంధర్వాప్సరసస్సిద్ధా యక్షరక్షాంసి చారణాః॥1578॥

10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

భూతప్రేతపిశాచాశ్చ విద్యధ్రాః కిన్నరాదయః|

దశైతే విదురాఖ్యాతాః సర్గాస్తే విశ్వసృక్కృతాః॥1579॥

విదురా! దేవతలు, అప్సరసలు, యక్షరాక్షసులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, భూత,ప్రేత,పిశాచములు, కిన్నరులు, కింపురుషలు (కిన్నరులు,కింపురుషులు-అశ్వముఖులు) మొదలగు భేదములతో దేవసృష్టి ఎనిమిది విధములు. ఈ విధముగా సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు రచించిన పదివిధములగు సృష్టిని గూర్చి నీకు తెలిపితిని. 

10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

అతఃపరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ|

ఏవం రజః ప్లుతః స్రష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః|

సృజత్యమోఘసంకల్పః ఆత్మైవాత్మానమాత్మనా॥1580॥

ఇంక వంశములు, మన్వంతరాదులు వర్ణించెదను. ఈవిధముగా జగత్స్రష్టయు, సత్యసంకల్పుడు ఐన శ్రీహరి బ్రహ్మదేవుని రూపములో ప్రతికల్ప ప్రారంభమునందును రజోగుణమును స్వీకరించి, స్వయముగా ఈ విశ్వమును సృష్టించును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం  తృతీయస్కంధే  దశమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు పదవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

5.4.2022   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పదకొండవ అధ్యాయము

మన్వంతరాది కాలవిభాగముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
మైత్రేయ ఉవాచ

11.1 (ప్రథమ శ్లోకము)

చరమః సద్విషేషాణామనేకోఽసంయుతస్సదా

పరమాణుస్సవిజ్ఞేయో నృణామైక్యభ్రమో యతః॥1581॥

మైత్రేయుడు పలికెను-విదురా! (కాలపరిమాణమునుగూర్చి తెలిపెదను వినుము.) విశేషము అనగా - పృథ్వీతత్త్వము యొక్క సర్వదృశ్య పదార్థములలో సూక్ష్మమైన అంతిమ అంశమును పరమాణువు అందురు. ఇంక దానిని విభాగము చేయుటకు వీలుపడదు. అట్టి అనేక పరమాణువుల సముదాయమే  పరస్పరము కలియుటవలన మనుష్యులకు భ్రమవశమున ఒక నిర్దిష్టమైన అవయవ రూపమున ప్రతీకమగును.

11.2 (రెండవ శ్లోకము)

సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్|

కైవల్యం పరమమహానవిశేషో నిరంతరః॥1582॥

(కాలముయొక్క అతి సూక్ష్మమైన అంశమును తెలిపినట్లే మహాకాలమునుగూడ వర్ణింతుము.) ఈ దృశ్యమానజగత్తు మిగుల గొప్ప పదార్థము. అన్నియును అందులోనే నిలిచియున్నవి. కానీ, ఈ మహాకాలములో కాలభేదము ఏమియు ఉండదు. ఎట్టి వస్తువుల కలయికయు ఉండదు. ఈ కాలస్వరూపము అన్నింటికంటెను పెద్దది, ఇది కైవల్యస్వరూపము. దీనినే పరము అనియు, మహత్తు అనియు పేర్కొందురు. ప్రళయకాలమునందుగూడ ఇది జాగృతమైయుండును. ఇది అవిశేషము, పరమాత్మయొక్క ముఖ్యశక్తి. ఇది ఏవిధమైన పరివర్తనము ఉండదు. ఇది మహాకాలము అను పేరుతో ప్రసిద్ధి గాంచెను.

11.3 (మూడవ శ్లోకము)

ఏవం కాలోఽప్యనుమితః సౌక్ష్మే స్థౌల్యే చ సత్తమ|

సంస్థానభుక్త్యా భగవానవ్యక్తో వ్యక్తభుగ్విభుః॥1583॥

మహాత్మా! విదురా! ఈ విధముగా కాలముయొక్క చరమ అంశమగు సూక్ష్మరూపమున మరియు మహాకాలము అను పేరుతో స్థూలరూపము నిరూపించ బడినది. ఈ మహాకాలమే సృష్టియొక్క మధ్యలోకూడా ప్రకృతిద్వారా నిర్మింపబడిన సకలపదార్థములను క్షీణింపజేయుచుండును. ఈ విధముగా వ్యక్తమగుచున్న దృశ్యవర్గము నంతటినీ సర్వసమర్థమగు మహాకాలము భక్షించును.

11.4 (నాలుగవ శ్లోకము)

స కాలః పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతామ్|

సతోఽవిశేషభుగ్యస్తు స కాలః పరమో మహాన్॥1584॥

కాలము ప్రపంచముయొక్క అత్యంత సూక్ష్మావస్థయందును  వ్యాప్తమైయుండునట్టి కాలము చరమము అనగా చిట్టచివరిది, అతి సూక్ష్మమైనది. మహాకాలము సృష్టి మొదలుకొని ప్రళయపర్యంతము అన్ని అవస్థలలోను వ్యాపించియుండును. దీనినే పరమమహాన్ అనియందురు.

11.5 (ఐదవ శ్లోకము)

అణుర్ద్వౌ పరమాణూ స్యాత్ త్రసరేణుస్త్రయః స్మృతః|

జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్॥1585॥

రెండు పరమాణువులు ఒక అణువు అగును. మూడు అణువులు గలసినచో, అది ఒక త్రసరేణువు అగును. గవాక్షము (కిటికీ) ద్వారా వచ్చు సూర్యకిరణ ప్రకాశములో ఎగురుచున్నట్లు కనబడునదియే త్రసరేణువు.

11.6 (ఆరవ శ్లోకము)

త్రసరేణు త్రికం భుంక్తే యః కాలః స తృటిః స్మృతః|

శతభాగస్తు వేధస్స్యాత్ తైస్త్రిభిస్తు లవః స్మృతః॥1586॥

11.7 (ఏడవ శ్లోకము)

నిమేషస్త్రిలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయః క్షణః|

క్షణాన్ పంచ విదుః కాష్ఠాం లఘు తా దశ పంచ చ॥1587॥

ఇట్టి మూడు త్రసరేణువులను సూర్యుడు దాటు కాలము తృటి అని యందురు. దీనికి (తృటికి వందరెట్లు కాలమును వేధము అని యందురు. మూడు వేధములకాలము ఒక లవము. మూడు లవముల కాలము ఒక నిమేషము. మూడు నిమేషములు ఒక క్షణము. ఐదు క్షణములకాలము ఒక కాష్థ, పదిహేను కాష్ఠలకాలము ఒక లఘువు.

11.8 (ఎనిమిదవ శ్లోకము)

లఘూని వై సమామ్నాతా దశ పంచ చ నాడికా|

తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామః సప్త వా నృణామ్॥1588॥

పదిహేను లఘువులకాలము ఒక నాడిక (దండము). రెండు నాడికలకాలము ఒక ముహూర్తము. దినము యొక్క హెచ్చు తగ్గులను అనుసరించి, (ఉభయ సంధ్యలయొక్క రెండు ముహూర్తములను మినహాయించి) ఆరు, ఏడు నాడికల (దండముల) కాలమును ప్రహరము అనియు అందురు. ఇది మానవుల యొక్క పగలు లేక రాత్రి యొక్క కాలములో నాల్గవభాగము.

11.9 (తొమ్మిదవ శ్లోకము)

ద్వాదశార్ధవలోన్మానం చతుర్భిశ్చతురంగుళైః|

స్వర్ణమాషైః కృతచ్ఛిద్రం యావత్ ప్రస్థజలప్లుతమ్॥1589॥

ఆరుఫలముల రాగితో ఒక ప్రస్థము నీరు పట్టెడి పాత్రను సిద్ధపరుచవలెను. నాలుగు మాసముల బంగారముతో నాలుగు అంగుళముల శలాకమును నిర్మించి దానితో ఆ పాత్రయొక్క అడుగుభాగము రంధ్రము గావింపవలెను. పిమ్మట ఆ పాత్రను నీటిలో ఉంచవలెను. రంధ్రముద్వారా ఆ పాత్ర పూర్తిగా నీటితో నిండి ఆ నీటిలో మునిగిపోవుటకు పట్టు సమయమును నాడిక యందురు. 

11.10 (పదియవ శ్లోకము)

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానమహనీ ఉభే|

పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చ మానద॥1590॥

మానవులయొక్క నాలుగు యామములు (జాములు) కాలము పగలు. అట్లే నాలుగు జాములకాలము ఒక రాత్రి. పదిహేను దినములు (పదిహేను పగటి పూటలు, పదిహేను రాత్రులు) ఒక పక్షము. పక్షములు రెండు విధములు 1. శుక్ల పక్షము, 2. కృష్ణ పక్షము.

11.11 (పదకొండవ శ్లోకము)

తయోస్సముచ్ఛయో మాసః పితౄణం తదహర్నిశమ్

ద్వౌ తావృతుః షడయనం దక్షిణం చోత్తరం దివి॥1591॥

విదురా! రెండు పక్షములకాలమును కలిపినచో, ఒక మాసము అగును. అది పితృదేవతలకు ఒక రేయిపగలు దినప్రమాణము. రెండు మాసమలకాలము ఒక ఋతువు. ఆరు మాసముల కాలము ఒక ఆయనము. దక్షిణాయనము, ఉత్తరాయణము అని ఆయనములు రెండు విధములు.

11.12 (పండ్రెండవ శ్లోకము)

అయనే చాహనీ ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృతః|

సంవత్సర శతం నౄణం పరమాయుర్నిరూపితమ్॥1592॥

ఈ రెండు అయనములకాలము దేవతలకు ఒక రాత్రి పగలు గల దినము. మానవులకు ఒక సంవత్సరము అనగా పన్నెండు మాసములు ఒక సంవత్సరము. సాధారణముగా మనుష్యుల పూర్ణాయువు వంద సంవత్సరములుగా పెద్దలు పేర్కొనిరి.

11.13 (పదమూడవ శ్లోకము)

గ్రహర్ క్షతారాచక్రస్థః పరమాణ్వాదినా జగత్|

సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభుః॥1593॥

చంద్రుడు మొదలగు గ్రహములు, అశ్వినీ మొదలగు నక్షత్రములు, ఇంకను తారకలన్నింటికి అధిష్థాత కాలస్వరూపుడైన సూర్యభగవానుడు. ఈ ప్రభువు పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతము వరకుగల కాలమునందు పన్నెండు (ద్వాదశ) రూపములుగా ద్వాదశరాసులలో) భూమండలమునందు నిరంతరము సంచరించు చుండును.

11.14 (పదునాలుగవ శ్లోకము)

సంవత్సరః పరివత్సర ఇదావత్సర ఏవ చ|

అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే॥1594॥

విదురా! సూర్యుడు, బృహస్పతి, సవన, చంద్రుడు, ఇంకను నక్షత్రములకు సంబంధించిన మానభేదములతో ఈ వర్షమే సంవత్సరము, పరివత్సరము, ఇదా వత్సరము, అను వత్సరము, వత్సరము అని పిలువబడును.

11.15 (పదిహేనవ శ్లోకము)

యః సృజ్యశక్తిమురుధోచ్ఛ్వసయన్ స్వశక్త్యా పుంసోఽభ్రమాయ దివి ధావతి భూతభేదః|

కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వత్సరపంచకాయ॥1595॥

విదురా! ఈ సూర్యభగవానుడే తన కాలశక్తితో బీజములు మొదలగు పదార్థములను అంకురింపజేయును. అట్లే సకలప్రాణులను కార్యోన్ముఖులను గావించును. ఈ సూర్యభగవానునకు ఉపహారములను సమర్పించి, పూజింపవలెను. సూర్యభగవానుడే తన శక్తితో పెక్కువిధములగు పదార్థములకు పుష్టి నొసంగును. పంచభూతములయందు సూర్యుడే తేజస్స్వరూపుడు, మానవులకు మోహమును, భ్రమలను తొలగించును. కనుక  సూర్యుడే కాలము అను పేరుతో గుణరూప (వివిధగుణములుగల) పదార్థములను ఉత్పన్నము చేయును. మానవుల ఆయువును హరించుచు, ఆకాశముస సంచరించుచుండును. సకామపురుషులు ఆచరించెడు యజ్ఞాదికర్మలవలన ప్రాప్తించు స్వర్గాది శుభఫలములను వారికి పంచి యిచ్చును. ఐదువిధములు సంవత్సరముల రూపములో ఆయనయే ఉన్నాడు. ఈ సూర్యభగవానునకు ఉపాహారములను సమర్పించి, పూజించవలెను.

విదుర ఉవాచ

11.16 (పదహారవ శ్లోకము)

పితృదేవమనుష్యాణామాయుః పరమిదం స్మృతమ్|

పరేషాం గతిమాచక్ష్వయే స్యుః కల్పాద్బహిర్విదః॥1596॥

11.17 (పదిహేడవ శ్లోకము)

భగవాన్ వేద కాలస్య గతిం భగవతో నను|

విశ్వం విచక్షణే ధీరా యోగరాద్ధేన చక్షుషా॥1597॥

విదురుడు పలికెను-మైత్రేయమహామునీ! నీవు దేవతల, పితరుల, మనుష్యుల పుర్ణాయువు కాలముసు గూర్చితెలిపితివి. జ్ఞానులైన సనకాదిమునులు ముల్లోకములకు వెలుపల, కల్పముకంటె అధికకాలము జీవింతురుగదా! వారి ఆయువులను గూర్చియు తెలుపుము, భగవంతుడైన కాలపురుషునియొక్క గతిని నీవు బాగుగా ఎరుగుదువు. ఏలయన, జ్ఞానులు తమ యోగసిద్ధివలన లభించు దివ్యదృష్టితో సమస్త విశ్వమును చూచుచుందురు.

మైత్రేయ ఉవాచ

11.18 (పదునెనిమిదవ శ్లోకము)

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్|

దివ్యైర్ద్వాదశభిర్వర్షైః సావధానం విరూపితమ్॥1598॥

మైత్రేయుడు నుడివెను- విదురా! కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని యుగములు నాలుగు. ఈ నాలుగు యుగముల కాలప్రమాణము, తమ సంధ్యలు, సంధ్యాంశములతో కలుపుకొని దేవతలయొక్క పన్నెండు వేల సంవత్సరములుగా నిరూపింపబడినది.

11.19 (పందొమ్మిదవ శ్లోకము) 

చత్వారి త్రీణి ద్వే చైకం కృతాదిషు యథాక్రమమ్॥

సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ॥1599॥

11.20 (ఇరువదియవ శ్లోకము)

సంధ్యాంశయోరంతరేణ యః కాలః శతసంఖ్యయోః|

తమేవహుర్యుగం తజ్జ్ఞా యత్ర ధర్మో విధీయతే॥1600॥

కృత (సత్య) యుగము మొదలుకొని, నాలుగు యుగములకాలము క్రమముగా నాలుగువేలు, మూడువేలు, రెండువేలు, ఒకవేయి దివ్యవర్షముల కాలము ఉండును. ఇంతేగాక, ప్రతియుగమునందునుగలసహస్రసంఖ్యలకు రెండు రెట్ల వందల సంఖ్యలలో సంధ్య-సంధ్యాంశములు ఉండును. అనగా 800, 600, 400, 200 దివ్యవర్షములు సంధ్య, సంధ్యాంశముల దివ్యవర్షముల  కాలము. యుగమునకు ముందుగల కాలమును సంధ్య అనియు, యుగమునకు చివరికాలమును సంధ్యాంశము అనియు వ్యవహరింతురు. వీటి (సంధ్య మరియు సంధ్యాంశముల) గణన వందల సంఖ్యలలో ఉండును. ఈ రెండింటికిని మధ్యగల కాలము ఆ యుగముగా కాలవేత్తలు పేర్కొందురు. ప్రతియుగము నందును ప్రత్యేకమైన విశేషధర్మములు, వాటి విధానములు ఏర్పరచబడినవి. 

కృతయుగమునందు 4,000 దివ్య సం॥ + 800ల సంధ్య + సంధ్యాంశముల దివ్య సం॥ మొత్తము = 4,800ల దివ్యసంవత్సరములుండును. ఇదేవిధముగా త్రేతాయుగము 3,000+600=3600 దివ్య సం॥లు, ద్వాపరయుగము 2,000+400=2400 దివ్య సం॥లు, కలియుగము 1,000+200=1200 దివ్య సం॥లుగా నుండును. నాలుగు యుగముల మొత్తము 12,000 దివ్య సం॥లు. మానవులయొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినముతో సమానము. కనుక మానవుల 360 సంవత్సరముల కాలము దేవతలకు ఒక సంవత్సరముతో సమానము. ఈ లెక్కప్రకారము కలియుగ కాలప్రమాణము 4,32,000 సంవత్సరములు (1200 x 360), ద్వాపరయుగము దీనికి రెండు రెట్లు = 8,64,000 సంవత్సరములు (2400 x 360), అట్లే త్రేతాయుగము కలియుగ కాలప్రమాణమునకు  మూడు రెట్లు = 12,96,000 సంవత్సరములు (3600 x 360), అట్లే కృతయుగము కలియుగ కాలప్రమాణమునకు నాలుగు రెట్లు = 17,28,000 సంవత్సరములు (4800 x 360). 

11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ధర్మశ్చతుష్పాన్మనుజాన్ కృతే సమనువర్తతే|

స ఏవాన్యేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధతా॥1601॥

కృతయుగమున మానవులలో ధర్మము నాలుగు పాదములతో వర్ధిల్లుచుండును. త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతోను, ద్వాపరయుగమున ధర్మము రెండు పాదములతోను, కలియుగమున ధర్మము ఒక పాదముతోను నడచుచుండును.

11.22 (ఇరువది రెండవ శ్లోకము)

త్రిలోక్యా యుగసాహస్రం బహిరాబ్రహ్మణో దినమ్|

తావత్యేన నిశా తాత యన్నిమీలతి విశ్వసృక్॥1602॥

నాయనా! విదురా! ముల్లోకములకును వెలుపల మహర్లోకము మొదలుకొని బ్రహ్మలోకపర్యంతము ఇచ్చటి (ఈ ముల్లోకముల) వేయి చతుర్యుగములు అచటి పగలుతో సమానము. అంతేకాలము అచటి రాత్రికాలముతో సమానము. ఈ రాత్రికాలమునందు సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు శయనించియుండును.

11.23 (ఇరువది మూడవ శ్లోకము)

నిశావసాన ఆరబ్ధో లోకకల్పోఽనువర్తతే|

యావద్దినం భగవతో మనూన్ భుంజంశ్చతుర్దశ॥1603॥

11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిమ్|

మన్వంతరేషు మనవస్తద్వంశ్యా ఋషయః సురాః|

భవంతి చైవ యుగపత్సురేశాశ్చాను యే చ తాన్॥1604॥

ఈ రాత్రి ముగియగనే ఈ లోకమున కల్పారంభమగును. బ్రహ్మకు ఒకరోజు (పగలు+రాత్రి) గడచువరకు కల్పము కొనసాగుచుండును.ప్రతి కల్పమునందును పదునాలుగుమంది మనువులు ఉందురు. ప్రతిమనువు డెబ్బదియొక్క చతుర్యుగములకంటే కొంచము అధికకాలము వరకు (71+6/14 చతుర్యుగముల కాలమువరకు) అధికారము కలిగియుండును. ప్రతి మన్వంతరమునందును వేర్వేరు మనువంశములకు చెందిన రాజులు, సప్తఋషులు, సురలు (వసురుద్రాదులు), ఇంద్రాదిదేవతలు, వారి అనుయాయులైన గంధర్వాదులు తమ అధికారములను నడుపుచుందురు.

11.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఏవ దైనందినస్సర్గో బ్రాహ్మస్త్రైలోక్యవర్తనః|

తిర్యఙ్నృపితృదేవానాం సంభవో యత్ర కర్మభిః॥1605॥

ఇది బ్రహ్మదేవునియొక్క ప్రతిదినసృష్టి. అందు ముల్లోకముల సృష్టి జరుగుచుండును. జీవులు తమ తమ కర్మలకు అనుగుణముగా దీనిలో పశువుల-పక్షుల-మనుష్యుల-పితరుల-దేవతల ఉత్పత్తి జరుగుచుండును.

11.26 (ఇరువది ఆరవ శ్లోకము)

మన్వంతరేషు భగవాన్ బిభ్రత్సత్త్వం స్వమూర్తిభిః|

మన్వాదిభిరిదం విశ్వమవత్యుదితపౌరుషః॥1606॥

ఈ మన్వంతరముల యందు శ్రీమహావిష్ణువు సత్త్వగుణమును ఆశ్రయించి, తన మన్వాదిమూర్తులద్వారా పౌరుషమును ప్రకటించుచు విశ్వమును పాలించుచుండును.

11.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తమోమాత్రాముపాదయ ప్రతిసంరుద్ధవిక్రమః|

కాలేనానుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే॥1607॥

కాలక్రమమున బ్రహ్మదేవునియొక్క ఒకదినము గడచినంతనే ఆ శ్రీహరి తమోగుణమును స్వీకరించి, తన సృష్టిరచనా రూపపౌరుషమును ఆపి, నిశ్చేష్టభావముతో నిలిచియుండును.

11.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తమేవాన్వపిధీయంతే లోకా భూరాదయస్త్రయః|

నిశాయామనువృత్తాయాం నిర్ముక్తశశిభాస్కరమ్॥1608॥

ఆ సమయముస విశ్వము అంతయును ఆ ప్రభువులో లీనమగును. సూర్యచంద్రాది రహితముగా ప్రళయరాత్రి వచ్చును. అప్పుడు భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను ముల్లోకములను తిరోహితములగును.

11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము) 

త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా|

యంత్యూష్మణా మహర్లోకాజ్జనం భృగ్వాదయోఽర్థితాః॥1609॥

ఆ సమయముస ఆది శేషుని ముఖమునుండి వెలువడిన అగ్నిరూపభగవచ్ఛక్తినే ముల్లోకములను తాపమునకు గురియగుచుండును. ఆ తాపమున బాధితులైన భృగువు మొదలగు మునీశ్వరులు మహర్లోకమును వీడి జనోలోకమునకు వెళ్ళుదురు.

11.30 (ముప్పదియవ శ్లోకము)

తావత్త్రిభువనం సద్యః కల్పాన్తైధితసింధవః|

ప్లాపయంత్యుత్కటాటోపచండవాతేరితోర్మయః॥1610॥

ఇంతలో ప్రళయప్రచండ వాయువుల కారణముగా సప్తసముద్రములు ఉప్పొంగి ఉధృతతరంగములతో ముల్లోకములను ముంచివేయును.

11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అంతస్స తస్మిన్ సలిలే ఆస్తేఽనంతాసనో హరిః

యోగనిద్రానిమీలాక్షః స్తూయమానో జనాలయైః॥1611॥

ఆ సమయమున ఆ జలములందు శ్రీహరి శేషతల్పశాయియై నిమీలిత నేత్రుడై యోగనిద్రలో ఉండును. అప్పుడు జనలోకవాసులు ఆ ప్రభువును స్తుతించుచుందురు.

11.32 (ముప్పది రెండవ శ్లోకము)

ఏవం విధైరహోరాత్రైః కాలగత్యోపలక్షితైః|

అపక్షితమివాస్యాపి పరమాయుర్వయశ్శతమ్॥1612॥

ఈ విధముగా కాలగమనములో రాత్రింబవళ్ళు దొర్లిపోవుచుండగా వేల చతుర్యుగములు గడచిపోవుచున్నట్లు అనిపించును. బ్రహ్మలోకమునందలి కాలప్రమాణమును అనుసరించి ఆయన (బ్రహ్మ) యొక్క వందసంవత్సరముల పరమాయువు గూడ ముగియుచున్నట్లు అనిపించును.

11.33 (ముప్పది మూడవ శ్లోకము)

యదర్థమాయుషస్తస్య పరార్థమభిధీయతే|

పూర్వఃపరార్థోఽపక్రాంతో హ్యపరోఽద్య ప్రవర్తతే॥1613॥

బ్రహ్మదేవుని వందసంవత్సరముల పూర్ణాయువులో సగభాగమును పరార్ధము అని యందురు. ఇప్పటి వరకు (ఆయన వయస్సులో) ఏబది సంవత్సరములు గడిచినవి. (పూర్వపరార్ధము ముగిసినది) ప్రస్తుతము ద్వితీయపరార్ధము నడచుచున్నది.
👉అందుకే మనం సంకల్పం చెప్పునపుడు ద్వితీయ పరార్ధే అని చెప్తున్నాము👈

11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మోనామ మహానభూత్|

కల్పో యత్రాభవద్బ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదుః॥॥1614॥

11.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తస్యైవ చాంతే కల్పోఽభూద్యం పాద్మమభిచక్షతే|

యద్ధరేర్నాభిసరస ఆసీల్లోకసరోరుహమ్॥1615॥

పూర్వపరార్ధప్రారంభమున మొదలైన కల్పమును బ్రహ్మకల్ఫము అనియందురు. అప్పుడే బ్రహ్మదేవుడు ఉత్ఫన్నమాయెను. పండితులు అతనిని శబ్దబ్రహ్మ అనియందురు.

11.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఆయం తు కథితం కల్పో ద్వితీయస్యాపి భారత|

వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్ సూకరో హరిః॥1616॥

విదురా ప్రస్తుతము నడచుచున్న కల్పము ద్వితీయపరార్ధమునందు ఆరంభమైనది. ఈ కల్పమున శ్రీమహావిష్ణువు వరాహరూపమున (యజ్ఞవరాహముగా) అవతరించెను. అందువలన ఈ కల్పము వరాహకల్పము గా ఖ్యాతి గాంచినది.

11.37 (ముప్పది ఏడవ శ్లోకము)

కాలోఽయం ద్విపరార్ధాఖ్యో నిమేష ఉపచర్యతే|

అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్జగదాత్మనః॥1617॥

విదురా! ప్రస్తుతము నడచుచున్న కల్పము ద్వితీయపరార్ధమునందు ఆరంభమైనది. ఈ కల్పమున శ్రీమహావిష్ణువు వరాహరూపమున (యజ్ఞవరాహముగా) అవతరించెను. అందువలన ఈ కల్పము వరాహకల్పము గా విఖ్యాతి గాంచినది.

11.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

కాలోఽయం పరమాణ్వాదిర్ద్విపరార్ధాంత ఈశ్వరః|

నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామమానినామ్॥1618॥

పరమాణువు మొదలుకొని, ద్విపరార్ధముయొక్క చివరివరకు వ్యాపించిన ఈ కాలము సర్వసమర్థమైనదే యైనప్పటికిని సర్వాత్ముడైన శ్రీహరిపై దాని శాసనము ఏ మాత్రమూ చెల్లదు. ఆ కాలము కేవలము దేహాదులపై అభిమానముగల జీవులను శాసించుటయందే సమర్థమైనది.

11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

వికారైః సహితో యుక్తైర్విశేషాదిభిరావృతః|

ఆండకోశో బహిరయం పంచాశత్కోటి విస్తృతః॥1619॥

11.40 (నలుబదియవ శ్లోకము)

దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్టః పరమాణువత్|

లక్ష్యతేఽన్తర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయః॥1620॥

11.41 (నలుబది ఒకటవ శ్లోకము)

తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణమ్|

విష్ణోర్ధామ పరం సాక్షాత్పురుషస్య మహాత్మనః॥1621॥

విదురా! ప్రకృతి, మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) అను ఎనిమిది ప్రకృతులతో సహా దశేంద్రియములు, మనస్సు, పంచభూతములు అను పదహారు వికారములతో కలిసి ఈ బ్రహ్మాండకోశము ఏర్పడినది. దీనిలోపలగల వైశాల్యము ఏబదికోట్ల యోజనములు. దీని వెలుపల నాలుగువైపుల ఏడు ఆవరణములు గలవు. ఆ ఆవరణప్రమాణములు (చుట్టుకొలతలు) ఒకదానికంటె మఱియొకటి పదిరెట్లు అధికముగా ఉండును. వీటి అన్నింటితోకూడిన బ్రహ్మాండము విశ్వమునందు ఒక పరమాణువువలె కనబడును. ఇట్టి బ్రహ్మాండములు కోట్లకొలది గలవు. వీటన్నింటికి అధికారి, కారణకారణుడు ఐన పురాణపురుషుడు అక్షరబ్రహ్మ అనబడును. అదియే పరమాత్మయైన శ్రీమహావిష్ణువుయొక్క శ్రేష్ఠమైన ధామము (స్వరూపము).

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)

శ్రీమధ్భాగవతము నందలి "మన్వంతరాది కాలవిభాగముల వర్ణనము" అను మూడవ స్కంధములోని పదకొండవ అధ్యాయము సమాప్తము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏
[5:11 am, 06/04/2022] +91 95058 13235: 6.4.2022   ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పండ్రెండవ అధ్యాయము

సృష్టియొక్క విస్తృతి

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
 మైత్రేయ ఉవాచ

12.1 (ప్రథమ శ్లోకము)

ఇతి తే వర్ణితః క్షత్తః కాలాఖ్యః పరమోత్మనః|

మహిమా వేదగర్భోఽథ యథాస్రాక్షీన్నిబోధ మే॥1622॥

మైత్రేయుడు వచించెను - విదురా! భగవంతుని యొక్క కాలరూపమహిమను ఇంతవఱకును నీకు వివరించితిని. ఇప్పుడు వేదనిధియగు బ్రహ్మదేవుడు ఈ  జగత్తును సృష్టించిన విధానమును తెలిపెదను వినుము.

12.2 (రెండవ శ్లోకము)

ససార్జాగ్రేఽంధతామిస్రమథ తామిస్రమాదికృత్|

మహామోహం చ మోహం చ తమశ్చాజ్ఞానవృత్తయః॥1623॥

మొట్టమొదట బ్రహ్మదేవుడు అజ్ఞానము యొక్క ఐదు వృత్తులైన తమము (అవిద్య), మోహము (అస్మిత), మహామోహము (రాగము), తామిస్రము (ద్వేషము), అంధతామిస్రము (అభినివేశము) అనువానిని సృజించెను పాతంజలేఽప్యేత ఏవ ఉక్తాః అవిద్యాఽస్మిత రాగద్వేషాఽభినివేశాః పంచక్లేశాః ఇతి పతంజలి యోగశాస్త్రః

12.3 (మూడవ శ్లోకము)

దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత|

భగవద్ధ్యాన పూతేన మనసాన్యాంస్తతోఽసృజత్॥1624॥

కాని అతడు (బ్రహ్మ) అత్యంత పాపభూయిష్ఠమైన ఈ సృష్ఠిని జూచి, అసంతృప్తికి లోనయ్యెను. పిమ్మట అతడు భగవద్ధ్యానముద్వారా తన మనస్సును పునీతమొనర్చుకొని, ఇతరములను సృజించెను.

12.4 (నాలుగవ శ్లోకము)

సనకంచ సనందనం చ సనాతనమథాత్మభూః|

సనత్కుమారం చ మునీన్ నిష్క్రియానూర్ధ్వతసః॥1625॥

పిదప బ్రహ్మదేవుడు సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృజించెను. వారు నివృత్తిపరాయణులు, ఊర్ద్వరేతస్కులు.

12.5 (ఐదవ శ్లోకము)

తాన్ బభాషే స్వభూః పుత్రాన్ ప్రజాః సృజత పుత్రకాః|

తన్నైచ్ఛన్మోక్షధర్మాణో వాసుదేవపరాయణాః॥1626॥

అనంతరము అతడు తన ఈ నలుగురు పుత్రులతో ఇట్లనెను- కుమారులారా! మీరు ప్రజలను సృష్టింపుడు. కానీ, వారు పుట్టుకతోనే మోక్షమార్గమును అనుసరించువారు, భగవధ్యానపరాయణులు అగుటచే వారు ప్రజోత్పత్తి  కార్యమును నిర్వహించుటకు ఇష్టపడలేదు.

12.6 (ఆరవ శ్లోకము)

సోఽవధ్యాతస్సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనైః|

క్రోధం దుర్విషహం జాతం నియంతుముపచక్రమే॥1627॥

12.7 (ఏడవ శ్లోకము)

ధియా నిగృహ్యమాణోఽపి భ్రువర్మధ్యాత్ ప్రజాపతేః|

సద్యోఽజాయత తన్మన్యుః కుమారో నీలలోహితః॥1628॥

వారు (తన కుమారులు) తన ఆజ్ఞను తిరస్కరించుట వలన బ్రహ్మదేవునకు పట్టరానికోపము వచ్చెను. కాని అతడు ఆ కోపమును తన బుద్ధిబలముచేత నిగ్రహించు కొనుటకు ప్రయత్నించుచున్నను అతనియొక్క కనుబొమల మధ్య మాత్రము ఆ కోపము ప్రకటమగుచుండెను. వెంటనే భ్రూమధ్యము నుండి ఒక బాలుడు ఉద్భవించెను. ఆ బాలుడు నీలలోహితవర్ణము గలవాడు (నీలము, ఎఱుపు కలిసిన రంగు).

12.8 (ఎనిమిదవ శ్లోకము)

స వై రురోద దేవానాం పూర్వజో భగవాన్ భవః|

నామాని కురు మే ధాతః స్థానాని చ జగద్గురో॥1629॥

అతడు (ఆ బాలుడు) దేవతలకు పూర్వజుడైన రుద్రుడు. అతడు ఏడ్చుచు ఇట్లు పలికెను- "జగత్పితా! విధాతా! నా పేర్లను, నేను ఉండదగిన స్థానములను తెలుపుము".

12.9 (తొమ్మిదవ శ్లోకము)

ఇతి తస్య వచః పాద్మో భగవాన్పరిపాలయన్|

అభ్యధాద్భద్రయా వాచా రోదీస్తత్కరోమి తే॥1630॥

12.10 (పదియవ శ్లోకము)

యదోరోదీః సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః|

తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః॥1631॥

12.11 (పదునొకండవ శ్లోకము)

హృదింద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ|

సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని మే॥1632॥

అతడు పద్మజుడైన బ్రహ్మదేవుదు ఆ బాలుని ప్రార్థనను మన్నించుటకై మృదుమధురముగా ఇట్లు నుడివెను-బాలకా! నీవు రోదింపకుము. ఇప్పుడే నీ అభిలాషను తీర్తును. సురశ్రేష్ఠా! నీవు జన్మింపగనే బాలునివలె వెక్కివెక్కి ఏడువసాగితివి. కనుక లోకము నిన్ను *రుద్రుడు అను పేరుతో పిలుచును. నీవు ఉండదగిన స్థానములు హృదయము, ఇంద్రియములు, ప్రాణములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, పృథ్వి, సూర్యుఢు, చంద్రుడు, తపస్సు వీటిని (స్థానములను) ఏర్పరచితిని.

12.12 (పండ్రెండవ శ్లోకము)

మహాత్మా! మన్యువు, మనువు, మహినసుడు, మహాన్, శివుడు, ఋతధ్వజుడు, ఉగ్రరేతుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు - అనునవియును నీ నామములే.

12.13 (పదమూడవ శ్లోకము)

ధీర్వృత్తి రుశనోమా చ నియుత్సర్పిరిలాంబికా|

ఇరావతీ సుధా దీక్షా రుద్రాణ్యో రుద్ర తే స్త్రియం॥1634॥

రుద్రుడా! ధీః, వృత్తి, ఉశన, ఉమ, నియుత్తు, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అను ఈ పదకొండుగురును నీ భార్యలు.

12.14 (పదునాలుగవ శ్లోకము)

గృహణైతాని నామాని స్థానాని చ సయోషణః|

ఏభిస్సృజ ప్రజా బహ్వీః ప్రజానామసి యత్పతిః॥1635॥

వామదేవా! నేను తెలిఫిన ఈ పేర్లను, స్థానములను, స్త్రీలను స్వీకరింపుము. వీరిద్వారా పెక్కుమంది ప్రజలను సృజింపుము. ఆ విధముగా నీవు ప్రజాపతివి అగుదువు.

12.15 (పదిహేనవ శ్లోకము)

ఇత్యాదిష్టః సగురుణా భగవాన్నీలలోహితః|

సత్త్వాకృతిస్వభావేన ససర్జాత్మసమాః ప్రజాః॥1636॥

జగత్పతియైన బ్రహ్మదేవుడు ఇట్లు ఆదేశింపగా ఆదిదేవుడైన నీలలోహితుడు (శివుడు) బలమునందును, ఆకారముచేతను,స్వభావములోను తనను బోలిన ప్రజలను సృజించెను.

12.16 (పదునారవ శ్లోకము)

రుద్రాణాం రుద్రసృష్టానాం సమన్తాద్గ్రసతాం జగత్|

నిశామ్యాసంఖ్యశో యూథాన్ ప్రజాపతిరశంకత॥1637॥

శివునిచే సృష్టింపబడిన అసంఖ్యాకులైన రుద్రులయొక్క సమూహములు జగత్తును భక్షింపసాగెను. ఆ దృశ్యమును  చూచిన పిమ్మట బ్రహ్మదేవునకు శంక గలిగెను.

12.17 (పదునేడవ శ్లోకము)

అలం ప్రజాభిస్సృష్టాభిరీదృశీభిః సురోత్తమ|

మయా సహ దహంతీభిర్దిశశ్చక్షుర్భిరుల్బణైః॥1638॥

అంతట బ్రహ్మదేవుడు శివునితో ఇట్లు పలికెను- *సురోత్తమా! నీవు సృష్టించిన ఈ ప్రజలు తీవ్రములైన తమ చూపులతో నన్ను, సకలదిశలను దహించివేయుచున్నారు. కనుక , ఇక నీవు సృష్టించినంతవరకు చాలును.

12.18 (పదునెనిమిదవ శ్లోకము)

తప ఆతిష్ఠ భద్రం తే సర్పభూతసుఖావహమ్|

తపసైవ యథాపూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్॥1639॥

నీకు శుభమగు గాక! ఇప్పుడు నీవు సకల ప్రాణులకును సుఖావహమైన తపమును ఆచరింపుము. పూజ్యుడవైన నీవుా నీ తపఃప్రభావమున ఈ విశ్వముసు మునుపటివలె సృష్టింపుము. 

12.19 (పందొమ్మిదవ శ్లోకము)

తపసైవ పరంజ్యోతిర్భగవంతమధోక్షజమ్|

సర్వభూతగుహావాసమంజసా  విందతే పుమాన్॥1640॥

శ్రీమహావిష్ణువు ఇంద్రియములకు అగోచరుడు. సకలప్రాణులలోను అంతర్యామియై విలసిల్లుచుండువాడు. మానవులు అట్టి పరంజ్యోతి రూపుని తమ తపస్సులద్వారానే సులభముగా పొందగలరు.

మైత్రేయ ఉవాచ 

12.20 (ఇరువదియవ శ్లోకము)

ఏవమాత్మభువాఽఽదిష్టః పరిక్రమ్య గిరాంపతిమ్|

బాధమిత్యముమామంత్ర్య వివేశ తపసే వనమ్॥1641॥

మైత్రేయుడు నుడివెను- విదురా! బ్రహ్మదేవుడు ఇట్లు ఆజ్ఞాపింపగా పరమశివుడు ఆ ఆజ్ఞను శిరసావహించెను. పిదప అతడు బ్రహ్మదేవునకు ప్రదక్షిణమొనర్చి, ఆయన అనుమతితో తపస్సు చేయుటకై వనమందు ప్రవేశించెను.

12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అథాభిద్ధ్యాయతస్సర్గం దశపుత్రాః ప్రజజ్ఞిరే| 

భగవచ్ఛక్తియుక్తస్య లోకసంతానహేతవః॥1642॥

శ్రీమన్నారాయణుని వలన సృష్టి రచనా సామర్థ్యమును పొందిన బ్రహ్మదేవుడు శివుని ఇట్లు ఆజ్ఞాపించిన పిదప సృష్టికార్యమునకు సంకల్పించెను. ఆయనకు పదిమంది పుత్రులు జన్మించిరి. వారు లోకమునందు ప్రజల అభివృద్ధికి కారకులైరి (వారి వలన ప్రజల సంఖ్య అభివృద్ధి చెందెను.

12.22 (ఇరువది రెండవ శ్లోకము)

మరీచిరత్ర్యంగిరసౌ పులస్త్య పులహః క్రతుః|

భృగుర్వశిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారదః॥1643॥

12.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఉత్సంగాన్నారదో జజ్ఞే దక్షోఽంగుష్ఠాత్స్వయంభువః|

ప్రాణాద్వశిష్ఠః సంజాతో భృగుస్త్వచి కరాత్క్రతుః॥1644॥

12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

పులహో నాభితో జజ్ఞే పులస్త్యః కర్ణయోరృషిః|

అంగిరా ముఖతోఽక్ష్ణోఽత్రిర్మరీచిర్మనసోఽభవత్॥1645॥

అట్లు జన్మించిన పదిమంది పేర్లు - మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు, నారదుడు - ఆ బ్రహ్మదేవుని యొడి నుండి  నారదుడు, బొటనవ్రేలినుండి దక్షుడు, ప్రాణములనుండి వసిష్ఠుడు, చర్మమునుండి భృగువు, చేతినుండి క్రతువు, నాభినుండి పులహుడు, కర్ణములనుండి పులస్త్యఋషి, ముఖమునుండి అంగిరసుడు, కనులనుండి అత్రి, మనస్సునుండి మరీచి ఉద్భవించిరి. 

12.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ధర్మః స్తనాద్దక్షిణతో యత్ర నారాయణః స్వయమ్|

అధర్మః పృష్ఠతో యస్మాన్మృత్యుర్లోకభయంకరః॥1646॥

అనంతరము బ్రహ్మదేవుడు మరల సృష్టికి పూనుకొనగా అతని దక్షిణ స్తనమునుండి ధర్మము ఉద్భవించెను. ఆ ధర్మముయొక్క పత్నియగు మూర్తిద్వారా నరనారాయణులు అవతరించిరి. పృష్ఠమునుండి అధర్మము జన్మించెను. అధర్మమునందు లోకభయంకరమైన మృత్యుదేవత ఉత్పన్నమయ్యెను.

12.26 (ఇరువది ఆరవ శ్లోకము)

హృది కామో భృవః క్రోధో లోభశ్చాధరదచ్ఛదాత్|

ఆస్యాద్వాక్సింధవో మేధ్రాన్నిరృతిః పాయోరఘాశ్రయః॥1647॥

అదేవిధముగా బ్రహ్మదేవుని హృదయమునుండి కామము, కనుబొమలనుండి క్రోధము, క్రింది పెదవినుండి లోభము, ముఖమునుండి వాక్కునకు అధిష్ఠాతయైన సరస్వతీదేవి, లింగమునుండి సముద్రములు, గుదమునుండి పాపమునకు నివాస స్థానము (రాక్షసులకు అధిపతి) ఐన నిరృతియు జన్మించిరి. 

12.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఛాయాయాః కర్దమో జజ్ఞే దేవహూత్యాః పతిః ప్రభుః|

మనసో దేహతశ్చేదం జజ్ఞే విశ్వకృతో జగత్॥1648॥

ఛాయనుండి కర్దముడు జన్మించెను. అతడు దేవహూతికి పతి. సర్వసమర్థుడు. ఈ విధముగా సృష్టికర్తయైన బ్రహ్మదేవునియొక్క మనస్సు నుండి మరియు దేహాంగములనుండి సమస్త జగత్తు ఉద్భవించెను. 

12.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

వాచం దుహితరం తన్వీం స్వయంభూర్హరతీం మనః|

అకామాం చకమే క్షత్తః సకామ ఇతి నః శ్రుతమ్॥1649॥

12.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తమధర్మే కృతమతిం విలోక్య పితరం సతాః|

మరీచిముఖ్యా మునయో విస్రంభాత్ప్రత్యబోధయన్॥1650॥

విదురా! బ్రహ్మదేవుడు సృష్టించిన కన్య సరస్వతీదేవి మిగుల సుకుమారి, సర్వాంగసందరి. ఒకసారి బ్రహ్మదేవుడు ఆమెను జూచి కామమోహితుడయ్యెను. ఆమె స్వయముగా కామవాసనలు లేనిదని మేము వినియున్నాము. బ్రహ్మదేవునియొక్క అధర్మయుక్తమైన సంకల్పమును జూచి, అతని పుత్రులగు మరీచి మొదలగు మునులు తండ్రిపైగల చనువుకొలది ఇట్లు అతనితో హితోక్తులు పలికిరి.

12.30 (ముప్పదియవ శ్లోకము)

నైతత్పూర్వైః కృతం త్వద్య న కరిష్యంతి చాపరే|

యత్త్వం దుహితరం గచ్ఛేరనిగృహ్యాంగజం ప్రభుః ॥1651॥

తండ్రీ నీవు ధర్మమును పాటింపగలవాడవే (ధర్మాధర్మములు ఎఱిగినవాడవే). ఐనను నీ మనస్సులో కామావేశమును ఆపుకొనలేక నీ పుత్రికపై ఇట్టి పాపకృత్యమునకు సిద్ధపడితివి. నీ కంటే పూర్వులెవ్వరును ఇట్లు ప్రవర్తింపలేదు. ఇక ముందు తరాలవారును ఇట్లు చేయబోరు.

12.31 (ముప్పది ఒకటవ శ్లోకము|

తేజీయసామపి హ్యేతన్న సుశ్లోక్యం జగద్గురో|

యద్వృత్తమనుతిష్ఠన్యై లోకః క్షేమాయ కల్పతే॥1652॥

పితామహా! (జగద్యాపారపాలకా!) మీవంటి ధర్మాత్ములకు (పెద్దలకు) ఇది కీర్తికరముగాదు (తగినపనిగాదు). మీ వంటి శ్రేష్థుల ప్రవర్తనను అనుసరించుటవలననే లోకమునకు క్షేమమ గలుగును. (మీవంటి వారి ప్రవర్తన లోకమునకు ఆదర్శముగా ఉండవలెను).

12.32 (ముప్పది రెండవ శ్లోకము)

తస్మై నమో భగవతే య ఇదం  స్వేన రోచిషా|

ఆత్మస్థం వ్యంజయామాస స ధర్మం పాతు మర్హతి॥1653॥

భగవంతుడు (శ్రీమహావిష్ణువు) తన స్వరూపమున స్థితుడై ఈ సమస్తజగత్తును తన కాంతిపుంజముతో ప్రకటించెను. ఇట్టి స్థితియందు ఆ దేవుడే ధర్మమును కాపాడగలడు. ఆ ప్రభువునకు నమస్కారము.

12.33 (ముప్పది మూడవ శ్లోకము)

స ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్|

ప్రజాపతిపతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా॥1654॥

అప్పుడు తన పుత్రులైన మరీచి మొదలగు ప్రజాపతులు  తన యెదుటనే ఈ విధముగా పలుకగా బ్రహ్మదేవుడు ఎంతయు సిగ్గుపడెను ( కామమోహితమైన ఈ శరీరముతో ఇంక నాకేమి పని? అని భావించి) వెంటనే ఆయన తన శరీరమును పరిత్యజించెను. అంతట ఘోరమైన ఆ శరీరమును దిక్కులు (దిక్కుల అధిదేవతలు) తీసికొనిపోయెను. అచట చీకట్లతో నిండిన మంచు వ్యాపించెను.

12.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

కదాచిద్ధ్యాయతస్స్రష్టుర్వేదా ఆసంశ్చతుర్ముఖాత్|

కథం స్రక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథా పురా॥1655॥

ఒకసారి బ్రహ్మదేవుడు నేను మునుపటివలె సువ్యవస్థితమైన చిత్తముతో లోకములను ఎట్లు సృష్టి చేయగలను? అని ఆలోచింపసాగెను. ఆ సమయమున ఆయన నాలుగు ముఖములనుండి వేదములు ప్రకటములయ్యెను.

12.35 (ముప్పది ఐదవ శ్లోకము)

చాతుర్హోత్రం కర్మతంత్రముపవేదనయైస్సహ|

ధర్మస్య పాదాశ్చత్వారస్తథైవాశ్రమవృత్తయః॥1656॥

ఇంతేగాక, ఉపవేదములు, న్యాయశాస్త్రము, హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అను నలుగురు ఋత్విజులయొక్క కర్మలు, యజ్ఞములయొక్క విస్తృతి, ధర్మముయొక్క నాలుగుపాదములు, చతురాశ్రమములు, వాటి వృత్తులు ఇవి అన్నియును ఆ బ్రహ్మదేవుని ముఖమునుండి ఉత్పన్నములాయెను.

విదుర ఉవాచ

12.36 (ముప్పది ఆరవ శ్లోకము)

స వై విశ్వసృజామీశో వేదాదీన్ ముఖతోఽసృజత్|

యద్యద్యేనాసృజద్దేవస్తన్మే బ్రూహి తపోధనః॥1657॥

విదురుడు వచించెను-మైత్రేయమహామునీ! విశ్వస్రష్టయైన బ్రహ్మదేవుడు తన ముఖమునుండి వేదములు మొదలగువాటిని రచించినప్పుడు అతడు ఏ ముఖమునుండి వేటిని ఉత్పన్నము చేసెను? దయతో తెలుపుము.

మైత్రేయ ఉవాచ

12.37 (ముప్పది ఏడవ శ్లోకము)

ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః|

శస్త్రమిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యథాత్క్రమాత్॥1658॥

మైత్రేయుడు పలికెను-విదురా! బ్రహ్మదేవుడు తూర్పుదిశగల ముఖమునుండి ఋగ్వేదమును, దక్షిణమువైపునగల ముఖమునుండి యజుర్వేదమును, పడమరదిక్కునగల ముఖమునుండి సామవేదమును, ఉత్తరదిశయందుగల ముఖమునుండి అథర్వవేదమును రచించెను. ఇదే క్రమములో అతడు శస్త్రము అనగా అప్రగీత మంత్రస్తోత్రము (ఇది హోతయొక్క కర్మ), ఇజ్యము (ఇది అధ్వర్యువు యొక్క కార్యము), స్తుతిస్తోమము అనగా సంగీతరూపస్తోత్రము, దాని అర్థసముదాయము (ఇది ఉద్గాతయొక్క కృత్యము). ప్రాయశ్చిత్తము (ఇది బ్రహ్మ యొక్క కార్యము)  అనునాల్గింటిని రచించెను.

12.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మనః|

స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిదిభిర్ముఖైః॥1659॥

అట్లే బ్రహ్మదేవుడు తన పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తర ముఖములనుండి క్రమముగా ఆయుర్వేదమును (చికిత్సా శాస్త్రమును), ధనుర్వేదమును (శస్త్రవిద్యలను), గాంధర్వవేదమును (సంగీత శాస్త్రమును) స్థాపత్యమును (శిల్పవిద్యను) ఉత్పన్నమొనర్చెను.

12.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఇతిహాసపురాణాని పంచమం వేదమీశ్వరః|

సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః ససృజే సర్వదర్శనః॥1660॥

12.40 (నలుబదియవ శ్లోకము)

షోడశ్యుక్థౌ పూర్వవక్త్రాత్పురీష్యగ్నిష్టుతావథ|

ఆప్తోర్యామాతిరాత్రౌ చ వాజపేయం సగోసవమ్॥1661॥

సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖములనుండి పంచమవేదములైన ఇతిహాస పురాణములను రచించెను. ఇదే క్రమంలో షోడశి, ఉక్థములు, చయన, అగ్నిష్టోమములు, ఆప్తోర్యామ - అతిరాత్రములు, వాజపేయ-గోసవములు అను రెండ్రెండుయాగములను పూర్వాదిముఖములద్వారా ఉత్పన్నమొనర్చెను.

12.41 (నలుబది ఒకటవ శ్లోకము)

విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ|

ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః॥1662॥

ధర్మము యొక్క నాలుగు పాదములైన విద్య, దానము, తపస్సు, సత్యములను వృత్తులతో సహా చతురాశ్రమములను సృజించెను.

12.42 (నలుబది రెండవ శ్లోకము)

సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాథ బృహత్తథా|

వార్తా సంచయశాలీనశిలోంఛ ఇతి వై గృహే॥1663॥

 12.43 (నలుబది మూడవ శ్లోకము)

వైఖానసా వాలఖిల్యౌదుంబరాః ఫేనసా వనే|

న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదో హంసనిష్క్రియౌ॥1664॥

1. సావిత్రము, 2. ప్రాజాపత్యము, 3. బ్రాహ్మము, 4. బృహత్తు అనునవి బ్రహ్మచారి వృత్తులు. 5. వార్త, 6. సంచయము, 7. శాలీనము, 8. శిలోంఛము అను నాలుగును గృహస్థాశ్రమవృత్తులు. అదే విధముగా 9. వైఖానసము, 10. వాలఖిల్యము, 11. ఔదుంబరము, 12. ఫేనసము - అను నాలుగును వానప్రస్థ వృత్తులు, 13. కుటీచము, 14. బహ్వోదకము, 15. హంసము, 16. నిష్క్రియము (పరమహంసము) అను నాలుగును సన్న్యాసాశ్రమ వృత్తులు - ప్రకటములయ్యెను.

1. సావిత్రము - ఉపనయన సంస్కారమును పొందిన పిమ్మట గాయత్రిని ఉపాసన చేయుటకు ఆచరించు మూడుదినముల బ్రహ్మచర్యవ్రతము.

2. ప్రాజాపత్యము - ఒక సంవత్సరమువరకు జరుపు బ్రహ్మచర్య వ్రతము

3. బ్రాహ్మము - వేదాధ్యయనము పూర్తియగునంతవరకు ఆచరింపబడు బ్రహ్మచర్య వ్రతము

4. బృహత్తు - జీవితాంతము ఆచరింపబడు బ్రహ్మచర్య వ్రతము.

5. వార్త - వ్యవసాయము మొదలగు శాస్త్రవిహిత వృత్తులు

6. సంచయము - యజ్ఞయాగాదులు ఆచరణము.

7. శాలీనము - అయాచితవృత్తి

8. శిలోంచము - పంటకు వచ్చిన పైర్లను కోసిన పిమ్మట కంకులనుండి రాలిన గింజలను, ధాన్యపు దుకాణములలో క్రిందపడిన ధాన్యమును ఏరుకొని వాటిద్వారా జీవించుట


9. వైఖానసము - దున్నకుండా, నాటకుండా భూమినుండి ఉత్పన్నములైన పదార్ధములతో జీవించుట

10. వాలఖిల్యము - క్రొత్తగా ఆహార పదార్థములు లభించినప్పుడు అంతకుముందన్న, సేకరింపబడియున్న ఆహారపదార్థములను దానము చేయుట

11. ఔదుంబరము - ప్రాతఃకాలమున నిద్రనుండి లేవగనే ముఖము ఏ దిశగానుండునో, ఆ దిశనుండి ఫలాదులను సేకరించి వాటితో జీవించుట.

12. ఫేనపము - తమంత తాముగా రాలిన ఫలములను భుజించి జీవించుట

13. కుటీచకము - ఒక ప్రదేశమున కుటీరమున నివసించుచు ఆశ్రమధర్మములను పాటించుట.

14. బహ్వోదకము - కర్మల విషయములయందు గౌణదృష్టితో ఉండి, జ్ఞాన దృష్టికి ప్రాధాన్యము నిచ్చుట

15. హంసము - జ్ఞానసాధనము

16. నిష్క్రియము (పరమహంసము) - జ్ఞానియై జీవన్ముక్తుడుగా జీవించుట

27.11.2019   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పండ్రెండవ అధ్యాయము

సృష్టియొక్క విస్తృతి

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

12.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్తథైవ చ|

ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః॥1665॥

ఇదే క్రమములో 1.అన్వీక్షికి, 2. త్రయి, 3. వార్త, 4. దండనీతి అను నాలుగు విద్యలును, అట్లే 5. నాలుగు వ్యాహృతులును బ్రహ్మయొక్క నాలుగు ముఖముల నుండి ఉత్పన్నములయ్యెను. హదయాకాశము నుండి ఓంకారము ప్రకటమయ్యెను.

అన్వీక్షికి = మోక్షప్రాప్తిని కలుగ జేయు ఆత్మవిద్య, 2. త్రయి = స్వర్గాదిఫలములనొసంగు కర్మవిద్య, 3. వార్త = వ్యవసాయము, వ్యాపారము మొదలగు వాటికి సంబంధించిన విద్య, 4. దండనీతి = రాజనీతి, 5. వ్యాహృతులు = భూః, భువః, సువః, అను మూడింటికి నాలుగవదగు మహః అను దానితో కలిపి నాలుగు వ్యాహృతులను గూర్చి అశ్వలాయన గృహ్యసూత్రములయందు పేర్కొనబడినవి.

12.45 (నలుబది ఐదవ శ్లోకము)

తస్యోష్ణిగాసీల్లోషుభ్యో గాయత్రీ చ త్వచో విభోః|

త్రిష్టుమ్మాంసాత్స్నుతోఽనుష్టుబ్జగత్యస్థ్నః ప్రజాపతేః॥1666॥

12.46 (నలుబది ఆరవ శ్లోకము)

మజ్జాయాః పంక్తిరుత్పన్నా బృహతీ ప్రాణతోఽభవత్|

స్పర్శస్తస్యాభవజ్జీవః స్వరో దేహ ఉదాహృతః॥1667॥

బ్రహ్మయొక్క రోమములనుండి ఉష్ణిక్కు, చర్మమునుండి గాయత్రి, మాంసమునుండి త్రిష్టుప్, స్నాయువులనుండి అనుష్టుప్, ఎముకలనుండి జగతి, మజ్జ (క్రొవ్వు) నుండి పంక్తి, ప్రాణములనుండి బృహతి - అను ఛందస్సులు ఉత్పన్నములయ్యెను. బ్రహ్మయొక్క జీవమును స్పర్శవర్ణములు (కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గములు-కాదయో మావసానాః స్పర్శాః) దేహము స్వరవర్ణములు (అచ్చులు) అని పిలువబడినవి.

12.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఊష్మాణమింద్రియాణ్యాహురంతఃస్థా బలమాత్మనః|

స్వరాస్సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః॥1668॥

బ్రహ్మదేవుని యొక్క ఇంద్రియములు (శ, ష, స, హ-శషసహ ఊష్మాణః) అనియు, బలమును అంతస్థములు (య, ర, ల, వ - యరలవ అంతస్థాః) అని వ్యవహరింతురు. ఆ ప్రజాపతియొక్క విహారమువలన షడ్జమము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అను (స, రి, గ, మ, ప, ద, ని) సప్తస్వరములు ఏర్పడినవి.

12.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

శబ్దబ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః పరః|

బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః॥1669॥

నాయనా! విదురా! బ్రహ్మదేవుడు శబ్దబ్రహ్మ స్వరూపుడు. వైఖరీరూపముతో వ్యక్తమగును.  ఓంకార రూపమున అవ్యక్తముగను విలసిల్లుచున్నాడు. అతని కంటెను శ్రేష్ఠుడై, సర్వత్ర పరిపూర్ణుడైన పరబ్రహ్మ అనేకవిధములగు శక్తులతో ఒప్పుచు ఇంద్రాదిరూపములలో భాసిల్లుచున్నాడు.

12.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

తతోఽపరాముపాదాయ స సర్గాయ మనో దధే|

ఋషీణాం భూరివీర్యాణామపిసర్గమవిస్తృతమ్॥1670॥

12.50 (ఏబదియవ శ్లోకము)

జ్ఞాత్వా తద్ధృదయే భూయాశ్చింతయామాన కౌరవ|

అహో అద్భుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా॥1671॥

12.51 (ఏబది ఒకటవ శ్లోకము)

న హ్యేధన్తే ప్రజా నూనం దైవమత్ర విఘాతకమ్|

ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా॥1672॥

12.52 (ఏబది రెండవ శ్లోకము)

కన్య రూపమభూద్ద్వేధా యత్కాయమభిచక్షతే|

తాభ్యాం రూపవిభాగాభ్యాం మిథునం సమపద్యత॥1673॥

పిమ్మట బ్రహ్మదేవుడు తన మొదటి (కామాసక్తమైన శరీరమువలన పొగమంచు ఏర్పడియుండెను) శరీరమును త్యజించెను, వేరొక శరీరముసు ధరించి, విశ్వమును విస్తరింపజేయుటకు సంకల్పించెను. మరీచి మొదలగు గొప్ప శక్తిశాలులైన మహర్షులద్వారాగూడ సృష్టివిస్తారము జరుగలేదని అతడు గ్రహించెను. అంతట అతడు తన మనస్సులో ఇట్లు ఆలోచింపసాగెను. ఇది మిగుల ఆశ్చర్యకరము. నేను అనుక్షణము ఎంతగా ప్రయత్నించినను ప్రజలసంఖ్య వృద్ధియగుటలేదు. దీని విఘాతమునకు (వృద్ధికాకుండుటకు) దైవమే కారణమని తోచుచున్నది. ఇప్పుడు నేను ఏమి చేయుట ఉచితము? అని ఆలోచించి అతడు (బ్రహ్మదేవుడు) దైవమును స్మరించెను. అంతట అకస్మాత్తుగా ఆయన యొక్క శరీరము రెండు భాగములయ్యెను. క అనగా బ్రహ్మదేవుడని అర్థము. అతడే రెండు విభాగములుగా అగుటవలన ఆ శరీరమునకు కాయము అని పేరు. ఆ రెండు భాగములనుండి ఒక స్త్రీ,ఒక పురుషుడు ఉద్భవించిరి.

12.53 (ఏబది మూడవ శ్లోకము)

యస్తు తత్ర పుమాన్ సోఽభూన్మనుః స్వాయంభువస్స్వరాట్|

స్త్రీ యాఽఽసీచ్ఛతరూపాభ్యా మహిష్యస్య మహాత్మనః॥1674॥

వారిలో పురుషుడు సార్వభౌముడైన స్వాయంభువ మనువుగా అయ్యెను. స్త్రీ - అతని భార్యయైన శతరూపగా నైనది. ఆమె ఆ సార్వభౌమునియొక్క పట్టమహిషి (మహారాణి) యైనది.

12.54 (ఏబది నాలుగవ శ్లోకము)

తదా మిథునధర్మేణ ప్రజా హ్యేధాంబభూవిరే|

స చాపి శతరూపాయాం పంచాపత్యాన్యజీజనత్॥1675॥

ఆ ఉభయులయొక్క దాంపత్యధర్మము (స్త్రీ పురుష సంయోగము) వలన ప్రజాభివృద్ధి జరిగెను. ఆ స్వాయంభువమనువువలన శతరూపయందు ఐదుగురు శిశువులు కలిగిరి.

12.55 (ఏబది ఐదవ శ్లోకము)

ప్రియవ్రతోత్తానపాదౌ తిస్రః కన్యాశ్చ భారత|

ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమ॥1676॥

సాధుశిరోమణీ! విదురా! వారిలో ఇద్దరు మగశిశువులు 1. ప్రియవ్రతుడు, 2. ఉత్తానపాదుడు. ముగ్గురు ఆడశిశువులు - 1. ఆకూతి, 2. దేవహూతి, 3. ప్రసూతి.

12.56 (ఏబది ఆరవ శ్లోకము)

ఆకూతిం ఋచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్|

దక్షయాదాత్ప్రసూతిం చ యత ఆపూరితం జగత్॥1677॥

మనువు ఆకూతి అను కన్యను రుచి అను ప్రజాపతికి ఇచ్చిపెండ్లి చేసెను. రెండవ కూతురైన దేవహూతిని కర్దమప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించెను. మూడవ కూతురైన ప్రసూతి వివాహము దక్షప్రజాపతితో జరిగెను. ఈ మూడు జంటలవలన కలిగిన సంతానముతో ఈ జగత్తు నిండెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  ద్వాదశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు సృష్టియొక్క విస్తృతి యను పండ్రెండవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[3:00 pm, 06/04/2022] +91 95058 13235: శ్రీమాత్రే నమః

శ్రీలలితా పరమేశ్వరి మాతృకావర్ణరూపిణి మాతృకావర్ణముల నుండి అసంఖ్యాకమైన నామ మంత్రములను కూర్చవచ్చును. అట్టి అసంఖ్యాకమైన నామ మంత్రములను తన భక్తులు పారాయణ చేయుట యనిన ఆ పరమేశ్వరికి అత్యంత ప్రీతికరము. అందుచే  ఆ తల్లి నామపారాయణప్రీతా యని అనబడినది.  అందుకు వివరణ:-
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సకల భాషలకు మాతృక సంస్కృతభాష. అటువంటి 
సంస్కృత భాషకు అక్షరములు ఏబదిఒకటి (51).

అచ్చులు - పదహారు (16)

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అః.

హల్లులు - 35

క, ఖ, గ, ఘ, ఙ
చ, ఛ, జ, ఝ, ఞ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష
= మొత్తం ఏబది ఒకటి.

వీటినే మాతృకావర్ణములు అని యన్నారు.

ఈ ఏబది ఒక్క అక్షరములలో ల, ళ అను అక్షరముల గురుంచి కొందరి వివరణ ఇలా ఉంది:

దీన్ని తత్సమ తద్భవ అంటారు.

సంస్కృత పదాలకు తత్సమ అంటారు, అదే పద…
[3:22 pm, 06/04/2022] +91 98484 36202: అద్భుతంగా వివరించారు గురువు గారు 🙏

మీ రైటింగ్ స్కిల్స్ అద్భుతం గురువు గారు.

ఇంత విస్తారంగా రాయాలంటే చాలా ఓపిక, జ్ఞానం కావాలి, 
అంతా అమ్మ వారి దయ.

శ్రీ మాత్రే నమః🙏


6.4.2022  సాయంకాల  సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పదమూడవ అధ్యాయము

వరాహావతార వత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
 శ్రీశుక ఉవాచ

13.1 (ప్రథమ శ్లోకము)

నిశమ్య వాచం వదతో మునేః పుణ్యతమాం నృప|

భూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవకథాదృతః॥1678॥

శ్రీశుకుడు నుడివెను-పరీక్షిన్మహారాజా! మైత్రేయమహర్షివలన ఈ పరమపవిత్రగాథను విన్న పిదప భగవత్కథలయందు మిక్కిలి ఆసక్తిగల విదురుడు ఆ మునిని మరల ఇట్లనెను.

విదుర ఉవాచ

13.2 (రెండవ శ్లోకము)

స వై స్వాయంభువస్సమ్రాట్ ప్రియః పుత్రః స్వయంభువః|

ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే॥1679॥

విదురుడు అడిగెను-మహామునీ! స్వయంభువుడైన బ్రహ్మదేవునకు ప్రియమిత్రుడు, సార్వభౌముడు ఐన స్వాయంభువమనువు శతరూపను పత్నిగా పొందిన పిమ్మట ఏమి చేసెను? 

13.3 (మూడవ శ్లోకము)

చరితం తస్య రాజర్షేరాదిరాజస్య సత్తమ|

బ్రూహి మే శ్రద్దధానాయ విష్వక్సేనాశ్రయో హ్యసౌ॥1680॥

సాధుసత్తమా! మైత్రేయమహామునీ! రాజర్షియు, సార్వభౌముడు ఐన స్వాయంభువ మనువు శ్రీహరిని ఆశ్రయించిన మహాభక్తుడు. ఆయనయొక్క చరిత్రను వినుటకు మిగుల కుతూహలముతో ఉన్నాను. దయతో తెలుపుము.

13.4 (నాలుగవ శ్లోకము)

శ్రుతస్య పుంసాం సుచిరశ్రమస్య నన్వంజసా సూరిభిరీడితోఽర్థః|

యత్తద్గుణానుశ్రవణం ముకుందపాదారవిందం హృదయేషు యేషామ్॥1681॥

ఏలయన, శ్రీహరియొక్క పాదారవిందములను తమ హృదయములయందు నిలుపుకొనిన భాగవతోత్తములయొక్క గుణములను, వారి పవిత్రవృత్తాంతములను గూర్చి శ్రవణము చేయుటవలననే, పెక్కుశ్రమలకోర్చి సాధించిన వేదాదిశాస్త్రముల అధ్యయనమునకు పరమప్రయోజనము చేకూరును. అన్యథా ఆ శాస్త్రాధ్యయనము వ్యర్థమైనదేయని విజ్ఞులు పేర్కొనుచుందురు.

శ్రీశుక ఉవాచ

13.5 (ఐదవ శ్లోకము)

ఇతి బ్రువాణం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపధానమ్|

ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట॥1682॥

శ్రీశుకుడు పలికెను-పరీక్షిన్మహారాజా! విదురుడు సహస్రశీర్షుడైన శ్రీహరియొక్క చరణములనే నమ్ముకొనిన పరమభక్తుడు. అతడు సవినయముగా భగవత్కథలయందు తన ఆసక్తిని ప్రకటించుచు ప్రార్థింపగా మైత్రేయమహాముని  శరీరము పులకించెను. అంతట  ఆ మహర్షి ఇట్లు పలికెను.

మైత్రేయ ఉవాచ

13.6 (ఆరవ శ్లోకము)

యదా స్వభార్యయా సాకం జాతః స్వాయంభువో మనుః|

ప్రాంజలిః ప్రణతశ్చేదం వేదగర్భమభాషత॥1683॥

మైత్రేయుడు ఇట్లు వచించెను- బ్రహ్మదేవుని తనువు నుండి తన భార్యయైన శతరూపతో సహా జన్మించిన స్వాయంభువమనువు వినమ్రతతో ప్రాంజలియై ఆ బ్రహ్మదేవునితో ఇట్లు వచించెను.

13.7 (ఏడవ శ్లోకము)

త్వమేకస్సర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పితా|

తథాపి నః ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్॥1684॥

తండ్రీ! నీవే సమస్త జీవులకును  జన్మప్రదాతవు. వారికీ జీవికను ప్రసాదించిన తండ్రివి గూడ నీవే. ఐనప్పటికిని నీ సంతానమైన మేము నీకు ఎట్టి సేవలొనర్పవలయునో తెలుపుము.

13.8 (ఎనిమిదవ శ్లోకము)

తద్విధేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు|

యత్కృత్వేహ యశో విష్వగముత్ర చ భవేద్గతిః1685॥

సర్వలోకపూజ్యుడా! నీకు నమస్కారము. ఇహలోకమునందు కీర్తియు, పరలోకమునందు సద్గతియు ప్రాప్తించుటకు మేము మా శక్తికి దగినట్లు ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుము.

బ్రహ్మోవాచ

13.9 (తొమ్మిదవ శ్లోకము)

ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్యాద్యాం క్షితిశ్వర|

యన్నిర్వ్యలీకేన హృదా శాధి మేత్యాత్మనార్పితమ్॥1686॥

బ్రహ్మదేవుడు వచించెను- నాయనా! స్వాయంభువా! మీ ఇద్దఱికిని శుభమగుగాక! నీవు ఆత్మనివేదన పూర్వకముగా నిష్కపటభావముతో నన్ను ఆజ్ఞాపింపుము అని ప్రార్థించితిని. అందులకు నేను మీయెడ ఎంతయు ప్రసన్నుడనైతిని.

13.10 (పదియవ శ్లోకము)

ఏతావత్యాత్మజైర్వీర కార్యా హ్యపచితిర్గురౌ|

శక్త్యాప్రమత్తైర్గృహేత సాదరం గతమత్సరైః॥1687॥

వీరా! పుత్రులు తమ తండ్రియెడ అనుసరించవలసిన పద్ధతియే ఇది. వారు ఎవ్వరియెడలను మాత్సర్యము వహింపక తండ్రి ఆజ్ఞను సాదరముగా అప్రమత్తులై పాటింపవలెను.

13.11 (పదకొండవ శ్లోకము)

స త్వమస్యామపత్యాని సదృశాన్యాత్మన్ గుణైః|

ఉత్పాద్య శాస ధర్మేణ గాం యజ్ఞైః పురుషం యజ॥1688॥

నాయనా! నీవు నీధర్మపత్నియగు శతరూపయందు నీవలె సద్గుణవంతులైన సంతానమును (కుమారులను, కూతుళ్ళను) పొందుము. రాజ్యమును ధర్మబద్ధముగా పరిపాలింపుము. యజ్ఞములద్వారా శ్రీహరిని ఆరాధింపుము.

13.12 (పండ్రెండవ శ్లోకము)

పరం శుశ్రూషణం మహ్యం స్యాత్ప్రజారక్షయా నృప|

భగవాంస్తే ప్రజాభర్తుర్హృషీకేశోఽనుతుష్యతి॥1689॥


13.13 (పదమూడవ శ్లోకము)

యేషాం న తుష్టో భగవాన్ యజ్ఞలింగో జనార్ధనః|

తేషాం శ్రమో హ్యపార్థాయ యదాత్మా నాదృతః స్వయమ్॥1690॥

రాజా! ప్రజలను రక్షించుటయే నీవు నాకు చేయవలసిన సేవ. నీవు చక్కగా ప్రజలను పరిపాలించినచో, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీమహావిష్ణువు గూడ నీయెడ ప్రసన్నుడగును. సర్వేశ్వరుడు, యజ్ఞస్వరూపుడు ఐన జనార్ధనుని అనుగ్రహమునకు పాత్రులు కానివారి (భగవంతుడు సంతోషపడునట్లుగా ప్రజాపాలన చేయనివారి) కృషియంతయును వ్యర్థమే. వారు తమలో అంతర్యామిగానున్న పరమేశ్వరుని ఆదరింపనివారే యగుదురు.

మునురువాచ

13.14 (పదునాలుగవ శ్లోకము)

ఆదేశేఽహం భగవతో వర్తేయామీవసూదన|

స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమ చ ప్రభో॥1691॥

స్వాయంభువ మనువు వచించెను- తండ్రీ! పాపనాశనా! పూజ్యుడవైన నీ యొక్క ఆజ్ఞను తప్పక పాటింతును. నేనును, నా భావి ప్రజలు నివసించుటకు తగిన ప్రదేశమును సూచింపుము.

13.15 (పదిహేనవ శ్లోకము)

యదోకః సర్వసత్త్వానాం మహీ మగ్నా మహాంభసి|

అస్యా ఉద్ధరణే యత్నో దేవ దేవ్యా విధీయతామ్॥1692॥

దేవా! సమస్తప్రాణులకును నివాసస్థానమైన భూమండలము ప్రస్తుతము ప్రళయజలములలో మునిగియున్నది. ఇప్పుడు ఈ భూమిని ఉద్ధరించుటకు ప్రయత్నింపుము.

 మైత్రేయ ఉవాచ

13.16 (పదునారవ శ్లోకము)

పరమేష్ఠీ త్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్య గామ్|

కథమేనాం సమున్నేష్యే ఇతి దధ్యౌ ధియా చిరమ్॥1693॥

13.17 (పదునేడవ శ్లోకము)

అథాత్ర కిమనుష్ఠేయమస్మాభిః సర్గయోజితైః|

యస్యాహం హృదయాదాసం న ఈశో విదధాతు మే॥1694॥

మైత్రేయుడు నుడివెను - విదురా! భూమి అగాధమైన జలములలో మునిగియుండుట చూచి బ్రహ్మదేవుడు ఈ భూమిని ఉద్ధరించుట యెట్లు? అని చాలకాలము మనస్సులో ఆలోచింపసాగెను. నేను జగత్సృష్టిరచనకు పూనుకొనిన సమయమున పృథ్వియంతయును జలములలో మునిగి, రసాతలమునకు చేరినది. సృష్టికార్యమునకు నియుక్తులమైన మేము భూమిని ఉద్ధరించుటకై ఏమి చేయవలెను? నేను ఆ భగవంతుని సంకల్పమువలననే జన్మించితిని. సర్వశక్తిమంతుడైన శ్రీహరియే నా ఈ పనిని (భూమిని ఉద్ధరించు కార్యమును) పూర్తి చేయవలెను.

13.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఇత్యభిధ్యాయతో నాసావివరాత్సహసానఘ|

వరాహతోకో నిరగాదంగుష్ఠపరిమాణకః॥1695॥

పుణ్యపురుషా! విదురా! బ్రహ్మదేవుడు ఇట్లు ఆలోచించుచుండగనే ఆయనయొక్క నాసారంధ్రమునుండి అకస్మాత్తుగా అంగుష్ఠప్రమాణ దేహమగల ఒక వరాహశిశువు వెలువడెను.

13.19 (పందొమ్మిదవ శ్లోకము)

తస్యాభిపశ్యతః ఖస్థః క్షణేన కిల భారత|

గజమాత్రః ప్రవవృధే తదద్భుతమభూన్మహత్॥1696॥

విదురా! బ్రహ్మదేవుడు చూచుచుండగనే ఆ వరాహశిశువు ఆకాశమున నిలిచి, క్షణకాలముతో గజరాజుప్రమాణ దేహముగలవాడు అయ్యెను. ఈ దృశ్యము మహాద్భుతమైనది. 

13.20 (ఇరువదియవ శ్లోకము)

మరీచిప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ|

దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాన చిత్రధా॥1697॥

ఆ మహా వరాహరూపమును జూచి, మరీచి మొదలగు మునులు, సనకసనత్కుమారాది మునులు, స్వాయంభువ మనువు మొదలగువారితో గూడి బ్రహ్మదేవుడు పరిపరి విధముల ఆలోచింపసాగెను.

13.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

కిమేతత్సౌకరవ్యాజం సత్త్వం దివ్యమవస్థితమ్|

అహో బతాశ్చర్యమదం నాసాయా మే వినిస్సృతమ్॥1698॥

అహో! వరాహరూపంలో ప్రకటమైన ఈ దివ్యప్రాణి ఏమైయుండును? ఒక్క క్షణకాలము క్రిందటనే ఇది నా ముక్కురంధ్రములనుండి వెలువడినదిగదా!

13.22 (ఇరువది రెండవ శ్లోకము)  

దృష్టోఽంగుష్ఠశిరోమాత్రః క్షణాద్గండశిలాసమః|

అపిస్విద్భగవానేష యజ్ఞో మే ఖేదయన్మనః॥1699॥

మొట్టమొదట ఈ రూపము అంగుష్ఠపర్వప్రమాణములో ఉండెను. క్షణకాలములోనే ఒక గండశిలా ప్రమాణమున వృద్ధిచెందెను. యజ్ఞమూర్తియైన శ్రీహరియే ఈ రూపమున మన మనస్సులను విస్మయపరచుచున్నట్లున్నది.

13.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణస్సహ సూనుభిః|

భగవాన్ యజ్ఞపురుషో జగర్జాగేంద్రసన్నిభః॥1700॥

ఇది బ్రహ్మదేవుడు, మనువు మొదలగు తన కుమారులతో గూడి ఇట్లు తర్కించుచుండగనే  భగవంతుడైన యజ్ఞపురుషుడు పర్వతప్రమాణ దేహుడై బిగ్గరగా గర్జింపసాగెను.

13.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్|

స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః॥1701॥

సర్వశక్తిమంతుడైన శ్రీహరి దిక్కులన్నియును ప్రతిధ్వనించునట్లుగా గర్జించి, బ్రహ్మదేవుని, ఇతర మునులను హర్షములో ముంచివేసెను.

13.25 (ఇరువది ఐదవ శ్లోకము)

నిశమ్య తే ఘర్ఘరితం స్వఖేదక్షయిష్ణుమాయామయసూకరస్య|

జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయోఽగృణన్  స్మ॥1702॥

శ్రీహరి మాయామయ (యజ్ఞ) వరాహరూపమున చేసిన మహాగర్జనమును వినగానే బ్రహ్మ మొదలగు వారి దుఃఖము దూరమయ్యెను. అప్పుడు జనలోక, తపలోక, సత్యలోక నివాసులగు మునులందరు పవిత్రములైన ఋగ్యజుస్సామ వేద మంత్రములతో ఆ స్వామిని స్తుతించిరి.

13.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తేషాం సతాం వేదవితానమూర్తిః బ్రహ్మావధార్యాత్మగుణానువాదమ్|

వినద్య భూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమావివేశ॥1703॥

శ్రీమహావిష్ణువుయొక్క రూపము వేదములలో విస్తృతముగా వర్ణింపబడినది. తన కల్యాణగుణములకు అనుగుణముగా ఆ మహామునులు కావించిన వేదమంత్ర ప్రస్తుతులను విని శ్రీహరి మిక్కిలి ప్రసన్నుడాయెను. పిమ్మట సర్వేశ్వరుడు మరియొకమారు గర్జించి, దేవతల అభ్యుదయముకొరకు గజేంద్రునివలె లీలలను నెరపుచు జలములలో ప్రవేశించెను.

13.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఉత్ క్షిప్తవాలః ఖచరః కఠోరః సటా విధున్వన్ ఖరరోమశత్వన్|

ఖురాహతాభ్రః సితదంష్ట్ర ఈక్షాజ్యోతిర్బభాసే భగవాన్ మహీధ్రః॥1704॥

దృఢమైన దేహముగల ఆ యజ్ఞవరాహమూర్తి తన వాలమును పైకెత్తి వేగముగా ఆకాశమునకు ఎగిరెను. మెడపైగల రోమములను విదల్చెను. శరీరము పైగల రోమములు అన్నియు నిక్కపొడుచుకొని యుండెను. గిట్టలతాకిడికీ మేఘములు చెల్లాచెదరాయెను. తెల్లని కోరలు స్వచ్ఛములై యుండెను. చూపులనుండి తేజఃపుంజము వెలువడుచుండెను. ఆ సమయముస యజ్ఞవరాహమూర్తి భూదేవిని ఉద్ధరించుటకై అవతరించియుండెను.

13.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఘ్రాణేన పృథ్వ్యాం పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశః స్వయమధ్వరాంగః|

కరాళదంష్ట్రోఽప్యకరాళదృగ్భ్యామ్ ఉద్వీక్ష్య విప్రాన్ గృణతోఽవిశత్కమ్॥1705॥

శ్రీహరి స్వయముగా యజ్ఞపురుషుడు. ఐనను, వరాహరూపమును ధరించి యుండుటవలన ముక్కుతో వాసనచూచుచు పృథ్వియొక్క  స్థానమును తెలిసికొనుటకు ప్రయత్నించుచుండెను. కఠోరములైన కోరలు గలిగి దుష్టులకు భయంకరుడుగా నుండెను. తనను స్తుతించుచున్న మరీచి మొదలగు మునులపై, ఇతర భక్తులపై తన ప్రసన్నదృష్టులద్వారా కృపను వర్షించుచు జలములలో ప్రవేశించెను.

13.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స వజ్రకూటాంగనిపాత వేగవిశీర్ణకుక్షిః స్తనయన్నుదన్వాన్|

ఉత్సుృష్టదీర్ఘోర్మిభుజైరివార్తః చుక్రోశ యజ్ఞేశ్వర పాహి మేతి॥1706॥

వజ్రమువలె కఠోరమై, పర్వతమయమైన ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క దేహము జలములోపడినప్పుడు ఆ వేగముయొక్క ధాటికి సముద్రగర్భము చీలిపోయినట్లు అయ్యెను. అందుండి మేఘగర్జనవలె భయంకరశబ్దమ ఉత్పన్నమాయెను. సముద్రుడు ఎగిసిపడుచున్న తన తరంగములనెడి భుజములను పైకెత్తి ఆర్తనాదముతో యజ్ఞేశ్వరా! నన్ను రక్షింపుము అని పలుకుచు గగ్గోలు పెట్టుచున్నట్లుండెను.

13.30 (ముప్పదియవ శ్లోకము)

ఖురైః క్షురప్రైర్దరయంస్తదాఽఽ ప ఉత్పారపారం త్రిపరూ రసాయామ్|

దదర్శ గాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యధత్త॥1707॥

విదురా! యజ్ఞవరాహమూర్తి శ్రీహరి కత్తులవలె వాడియైన తన గిట్టలతో జలములను చీల్చుకొనుచు అపారజలరాశియొక్క అడుగుభాగమునకు చేరెను. అచట రసాతలమున ఆ స్వామి సకలజీవులకు ఆశ్రయమైన భూమిని గాంచెను. లోగడ కల్పాంతమున శయనించుటకు సిద్ధపడుచున్న  శ్రీహరి ఆ భూమిని స్వయముగా తన ఉదరమునందు లీనమొనర్చుకొనియుండెను.

13.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నామ్ స ఉత్థితః సంరురుచే రసాయాః|

తత్రాపి దైత్యం గదయాఽఽ పతంతమ్ సునాభసందీపితతీవ్రమన్యుః॥1708

13.32 (ముప్పది రెండవ శ్లోకము)

జఘాన రుంధానమసహ్యవిక్రమమ్ స లీలయేభం మృగరాడివాంభసి|

తద్రక్తపంకాంకితగండతుండో యధా గజేంద్రో జగతీం విభిందన్॥1709॥

అట్లు జలములయందు మునిగియున్న ఆ భూమిని తన కోరలతో ఉద్ధరించి, రసాతలమునుండి పైకి తీసికొనివచ్చుచున్న ఆ యజ్ఞవరాహ భగవానుడు అద్భుతమైన శోభలతో దీపించెను. జలములనుండి వెలుపలికి వచ్చుచున్న సమయమున మార్గమధ్యమున విఘ్నములను కలిగించుటకై హిరణ్యాక్షుడను దైత్యుడు గదను చేబూని జలములలో నుండగనే ఆ ప్రభువును అడ్డగించెను. అందువలన ఆ స్వామియొక్క క్రోధము చక్రధారవలె తీక్ష్ణమాయెను. అంతట ఆ యజ్ఞవరాహమూర్తి ఏనుగుపై సింహమువలె విజృంభించి అవలీలగా ఆ దైత్యుని దెబ్బతీసెను. ఆ సమయమున కొండచరియను ఢీకొనినప్పుడు గైరికాది ధాతువులతో తడిసిన ఏనుగు తుండమువలె ఆ యజ్ఞవరాహస్వామి ముఖము ఒప్పుచుండెను.

13.33 (ముప్పది మూడవ శ్లోకము)

తమాలనీలం సితదంతకోట్యా  క్ష్మాముత్ క్షిపంతం గజలీలయాంగ|

ప్రజ్ఞాయ బద్ధాంజలయోఽనువాకైః విరించి ముఖ్యా ఉపతస్థురీశమ్॥1710॥

విదురా! కానుగచెట్టువలె నీలవర్ణశోభితుడైయున్న యజ్ఞవరాహమూర్తి తన తెల్లనికోరలపైన భూమిని మీదికి ఎత్తియున్నప్పుడు దంతములపై స్వచ్ఛమైన కమలమును ధరించియున్న గజేంద్రమువలె ఆ స్వామి విరాజిల్లుచుండెను. అట్టి ఆ ప్రభువు జలములనుండి బయటికి వచ్చియుండగా ఆయనను శ్రీమహావిష్ణువుగా గుర్తించి, బ్రహ్మ, మరీచి మొదలగువారు ఆయనను సమీపించి అంజలి ఘటించి వేదసూక్తములతో స్తుతించిరి.

ఋషయ ఊచుః

13.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

జితం జితం తే జిత యజ్ఞభావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః|

యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మైః నమః కారణసూకరాయ తే॥1711॥

ఋషులు స్తుతించిరి-దేవా!  అజితా! జయము, జయము. యజ్ఞపతీ! మూడువేదముల రూపమైన నీ మూర్తిరూపముమ విదల్చుచుంటివి. నీకు నమస్కారము. నీ రోమకూపముల యందు సమస్త యజ్ఞములును లీనమైయున్నవి. నీవు భూమిని ఉద్ధరించుటకై యజ్ఞవరాహరూపమున అవతరించిన పరమపురుషుడవు నీకు పరశ్శతనమస్కారములు.

13.35 (ముప్పది ఐదవ శ్లోకము)

రూపం తవైతన్నను దుష్కృతాత్మనామ్ దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకమ్||

ఛందాంసి యస్య త్వచి బర్హిరోమస్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్॥1712॥

యజ్ఞరూపుడవైన నీ తనువును దుష్కృతాత్ములు దర్శింపజాలరు. నీ శరీరముయొక్క చర్మమునందు గాయత్రి మొదలగు ఛందస్సులు, రోమములయందు దర్భలు, నేత్రములయందు ఆజ్యము, పాదములయందు హోత, అధ్వర్యువు,ఉద్గాత, బ్రహ్మ అను ఋత్విజులకర్మలు విరాజిల్లుచున్నవి.

13.36 (ముప్పది ఆరవ శ్లోకము)

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయోః ఇదోదరే చమసాః కర్ణరంధ్రే|

ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రమ్॥1713॥

సర్వేశ్వరా! నీ ముఖాగ్రమునందు స్రుక్కును (ఆహుతులను అగ్నిదేవునకు సమర్పించు సాధనము) నాసికారంధ్రములయందు స్రువమును (ఇతరదర్విని) ఉదరమునందు హవిర్భక్షణపాత్రను, కర్ణరంధ్రములయందు చమనపాత్రలను, ముఖమునందు బ్రహ్మభాగపాత్రను, కంఠరంధ్రములయందు సోమపాత్రను కలిగియుందువు. దేవా! నీ భక్షణమే అగ్నిహోత్రము.

13.37 (ముప్పది ఏడవ శ్లోకము)

దీక్షానుజన్మోపసదః శిరోధరమ్ త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః|

జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసథ్యం చితయోఽసవో హి తే॥1714॥

దేవదేవా! పదే పదే అవతారములను ఎత్తుచుండుట యజ్ఞస్వరూపుడవైన నీ దీక్షణీయ ఇష్టి, నీ మెడ మూడు  ఇష్టులు. నీ రెండు కోఱలు ప్రాయణీయము (దీక్షానంతరఇష్టి), ఉదయనీయము (యజ్ఞసమాప్తేష్టి), నీ జిహ్వ ప్రవర్గ్యము (ప్రతి ఉపసదమునకును ముందు చేయబడు మహావీరము అను కర్మ), నీ శీర్షము క్రతువుయొక్క సభ్యము మరియు (హోమరహితాగ్ని), ఆవసథ్యము (ఔపాసనాగ్ని), ప్రాణములు చితులు (ఇష్టకావయవములు అనగా యజ్ఞములో వాడే ఇటుక).

13.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

సోమస్తు రేతస్సవనాన్యవస్థితిః సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః|

సత్రాణి సర్వాణి శరీరసంధయః త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః॥1715॥

పరమేశ్వరా! నీ వీర్యము సోమరసము. ప్రాతస్సవనము, మధ్యాహ్న సవనము, సాయంసవనము అసు మూడును - నీ అవస్థానములు అనగా కూర్చుండుట. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్ధ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము,ఆప్తోర్యామము అను సంస్థాభేదములు నీయొక్క త్వజ్మాసాది సప్తధాతువులు, పన్నెండు దినముల దీక్షతో యజమాని ఆచరించెడి బహుయజ్ఞకర్మలే నీ శరీరసంధులు, సోమరహిత యాగములు, సోమసహిత క్రతువులు నీరూపము. యజ్ఞానుష్ఠానరూపములైన ఇష్టులు (ఇష్టి+లు) నీ అంగములను కలిపి ఉండెడి కండరములు.

13.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

నమో నమస్తేఽఖిలమంత్ర దేవతాద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనా|

వైరాగ్య భక్త్యాత్మజయానుభావితజ్ఞానాయ విద్యాగురవే నమో నమః॥1716॥

పరమపురుషా! సమస్తమంత్రములు, దేవతలు, ద్రవ్యములు, యజ్ఞములు, కర్మములు నీ స్వరూపములే. వైరాగ్యము, భక్తి, చిత్తస్థైర్యములచే కలిగెడి ఆత్మజ్ఞానము నీ స్వరూపము. సకల విద్యలకును నీవే గురుడవు. అట్టి నీకు మా నమస్కారములు.

13.40 (నలుబదియవ శ్లోకము)

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా విరాజతే  భూధర భూః సభూధరా|

యథా వనాన్నిస్సరతో దతా ధృతా మతంగజేంద్రస్య సపత్రపద్మినీ॥1717॥

భూమిని ధరించియున్న యజ్ఞవరాహ స్వామీ! నీ కోఱలచే పర్వతములతో గూడిన భూమిని ధరించియున్న నీవు జలములనుండి బయటికివచ్చుచు, పత్రములతో విలసిల్లుచున్న పద్మమును తన దంతములతో ధరించియున్న గజేంద్రమువలె విరాజిల్లుచున్నావు.

13.41 (నలుబది ఒకటవ శ్లోకము)

త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేనాథ దతా ధృతేన తే|

చకాస్తి శృంగోఢఘనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమః॥1718॥

దేవా! దంతములపై భూమండలమును ధరించియున్న నీయొక్క వేదమయమైన యజ్ఞవరాహరూపము తన శిఖరములపై విశాలమైన మేఘమండలమును ధరించియున్న కులపర్వతమువలె శోభిల్లుచున్నది.

13.42 (నలుబది రెండవ శ్లోకము)

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా|

విధేమ చాస్యై నమసా సహ త్వయా యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః॥1719॥

జగన్నాథా! చరాచరప్రాణులన్నియు సుఖముగా నివసించుటకై నీ పత్నియు, జగన్మాతయు ఐన భూదేవిని జలములపై నిలుపుము. నీవు సమస్తజగత్తునకును తండ్రివి. అరణిలో అగ్నిని స్థాపించిన విధముగా నీవు ఈ పృథ్వియందు ధారణశక్తిరూపమైన నీ తేజస్సును స్థాపించితివి. మేము నీకును, ఈ పృథ్వికిని నమస్కరించుచున్నాము.

13.43 (నలుబది మూడవ శ్లోకము)

కః శ్రద్దధీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయా భువ ఉద్విబర్హణమ్|

న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససృజేఽతివిస్మయమ్॥1720॥

ప్రభూ! రసాతలమునకు చేరియున్న ఈ భూమండలమును ఉద్ధరించుటకు నీవు తప్ప మరియొకరు ఎవ్వడును సమర్థుడు  కాడు. నీవు ఆశ్చర్యలీలలకు ఆశ్రయమైనవాడవు. కానీ, నీకు ఇది  ఏమాత్రమూ ఆశ్చర్యమును గొలిపెడి విషయముగాదు. నీవే అత్యాశ్చర్యకరమైన ఈ విశ్వమును నీ మాయద్వారా సృజించితివి.

13.44 (నలుబది నాలుగవ శ్లోకము)

విధున్వతా వేదమయం నిజం వపుః జనస్తపఃసత్యనివాసినో వయమ్|

సటాశిఖోద్ధూతశివాంబుబిందుభిః విమృజ్యమానా భృశమీశ పావితాః॥1721॥

సర్వేశ్వరా! నీవు వేదమయమైన ఈ మేనును విదలించినప్పుడు నీ మెడయందలి జూలునుండి వెలువడిన పవిత్రజలబిందువులు మమ్ము తడిపివేయుచున్నవి. ఈశ్వరా! జన, తప, సత్యలోకవాసులమైన మేము ఆ బిందువులను తడిసి మిగుల పునీతులమగుచున్నాము.

13.45 (నలుబది ఐదవ శ్లోకము)

స వై బత భ్రష్టమతిస్తవైష త యః కర్మణాం పారమపారకర్మణః|

యద్యోగమాయాగుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్॥1722॥

దేవదేవా! నీ దివ్యకర్మల అంతమును తెలియగోరువారు నిశ్చయముగా బుద్ధిభ్రష్టుడే యగును. ఏలయన, నీ లీలలు అనంతములు (అపారములు). నీ యోగమాయయొక్క సత్త్వాదిగుణములచే ఈ విశ్వము అంతయును మోహితమైయున్నది. అట్టి ఈ విశ్వమునకు శుభములను ప్రసాదింపుము.

మైత్రేయ ఉవాచ

13.46 (నలుబది ఆరవ శ్లోకము)

ఇత్యుపస్థీయమానస్తైః మునిభిర్బ్రహ్మవాదిభిః|

సలిలే స్వఖురాక్రాంత ఉపాధత్తావితావనిమ్॥1723॥

మైత్రేయుడు నుడివెను విదురా!  వేదవేత్తలైన మునులు ఇట్లు స్తుతింపగా, జగద్రక్షకుడైన యజ్ఞవరాహస్వామి తన గిట్టలచే ఆక్రమింపబడిన జలములయందు తన శక్తిని నిలిపి భూమిని స్థాపించెను.

13.47 (నలుబది ఏడవ శ్లోకము)

స ఇత్థం భగవానుర్వీం విష్వక్సేనః ప్రజాపతిః|

రసాయా లీలయోన్నీతామప్సు న్యస్య యయౌ హరిః॥1724॥

విష్వక్సేనుడును, ప్రజాపతియు ఐన  ఆ శ్రీహరి ఇట్లు రసాతలమునుండి అవలీలగా తీసికొని భూమండలమును జలములపై ఉంచి అంతర్ధానమాయెను.

13.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

య ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయినః|

శృణ్వీత భక్త్యా శ్రవయేత వోశతీం జనార్దనోఽస్యాశు హృది ప్రసీదతి॥1725॥

భగవంతుని యొక్క లీలలను వర్ణించునట్టి ఈ చరిత్రము మిగుల కీర్తింపదగినది. శుభప్రదమైన ఇట్టి కథయందు మనసు నిలిపినవారియొక్క పాపతాపములు అన్నియును తొలగిపోవును. పుణ్యప్రదమైన ఈ వృత్తాంతమును భక్తిశ్రద్ధలతో విన్నవారియెడలను, వినిపించినవారి మీదను భగవంతుడు వెంటనే తన అనుగ్రహమును ప్రసరింపజేయును.

13.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః|

అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విధత్తే స్వగతిం పరః పరామ్॥1726॥

సకలపురుషార్థములను అనుగ్రహించునట్టి శ్రీహరి ప్రసన్నుడైనచో, లోకమున దుర్లభమైన వస్తువు ఏదియును ఉండదు. అనన్యభావముతో ఆ శ్రీహరిని సేవించువారికి తుచ్ఛమైన భౌతికలాలస ఉండనే ఉండదు. అంతర్యామియైన ఆ పరమాత్మ అట్టివారికి తన పరమపదమును స్వయముగా ప్రసాదించును.

13.50 (ఏబదియవ శ్లోకము)

కో నామ లోకే పురుషార్థసారవిత్ పురా కథానాం భగవత్కథాసుధామ్|

ఆపీయ కర్ణాంజలిభిర్భవాపహామహో విరజ్యేత వినా నరేతరమ్॥1727॥

భగవంతునియొక్క భాగవతోత్తముల యొక్క పుణ్యకథలు మనుజులను జననమరణచక్రమునుండి రక్షించును. పురుషార్థముల సారమును (పరమార్థమును) ఎరిగినవాడు భగవంతునియొక్క కథామృతమును ఒక్కసారి చెవులార గ్రోలినచో, అతడు తన మనస్సును ఇతర విషయములమీదికి పోనీయడు. భగవత్కథలయందు మనస్సును నిలుపనివాడు పశుతుల్యుడు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే వరాహప్రాదుర్భావానువర్ణనే త్రయోదశోఽధ్యాయః (13)

శ్రీమధ్భాగవతము నందలి వరాహావతార వృత్తాంతము అను మూడవ స్కంధములోని పదమూడవ అధ్యాయము సమాప్తము
  
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

7.4.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పదునాల్గవ అధ్యాయము

దితి గర్భవతి అగుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
శ్రీ శుక ఉవాచ

14.1 (ప్రథమ శ్లోకము)

నిశమ్య కౌషారవిణోపవర్ణితాం హరేః కథాం కారణ సూకరాత్మనః|

పునః స పప్రచ్ఛ తముద్యతాంజలిః న చాతితృప్తో విదురో ధృతవ్రతః॥1728॥

శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! భూమండలమును ఉద్ధరించుటకై యజ్ఞవరాహమూర్తిగా అవతరించిన శ్రీహరి యొక్క పుణ్యకథను మైత్రేయునివలన వినినను అనన్యభక్తుడైన విదురునకు తనివితీరకుండెను. అందువలన అతడు అంజలి ఘటించి, మరల ఇట్లు ప్రశ్నించెను.

విదుర ఉవాచ

14.2 (రెండవ శ్లోకము)

తేనైవ తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా|

ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రుమ॥1729॥

విదురుడు ఇట్లనెను- మునివరా! వరహావతారమెత్తిన శ్రీహరి ఆదిదైత్యుడైన హిరణ్యాక్షుని సంహరించెనని నీవు ఇదివరలో తెలిపియుంటివి.

14.3 (మూడవ శ్లోకము)

తస్య చోద్ధరతః క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా|

దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతోరభూన్మృధః॥1730॥

బ్రాహ్భణోత్తమా! యజ్ఞవరాహమూర్తి శ్రీహరి తన కోరలపై పృథ్విని ఉద్ధరంచు సమయమున ఆయనకు దైత్యరాజైన హిరణ్యాక్షునితో యుద్ధము సంభవించుటకు కారణమేమి? ఆ యుద్ధము ఎట్లు జరిగెను?

మైత్రేయ ఉవాచ

14.4 (నాలుగవ శ్లోకము)

సాధు వీర త్వయా పృష్టమవతారకథాం హరేః|

యత్త్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశవిశాతనీమ్॥1731॥

మైత్రేయుడు నుడివెను- మహావీరా! విదురా! శ్రీహరియొక్క అవతారగాథను గూర్చి నీవు అడిగిన ప్రశ్న చాల సముచితమైనది. అది మానవుల మృత్యుపాశమును త్రెంచివేయును.

14.5 (ఐదవ శ్లోకము)

యయోత్తానపదః పుత్రో మునినా గీతయార్భకః|

మృత్యోః కృత్వైవ మూర్ధ్న్యంఘ్రిమారురోహ హరేః పదమ్॥1732॥

ఉత్తానపాదునికుమారుడైన ధ్రువుడు బాల్యమునందే నారదునివలన శ్రీహరియొక్క పవిత్రగాథను వినెను. దాని ప్రభావమున అతడు మృత్యువును జయించి పరమపదమునకు చేరెను.

14.6 (ఆరవ శ్లోకము)

అథాత్రాపీతిహాసోఽయం శ్రుతో  మే వర్ణితః పురా|

బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతామ్॥1733॥

విదురా! పూర్వము ఒకానొకప్పుడు దేవతలు యజ్ఞవరాహమూర్తికిని, హిరణ్యాక్షునకును మధ్య జరిగిన యుద్ధమును గూర్చి బ్రహ్మదేవుని అడిగిరి. అప్పుడు ఆ దేవదేవుడు ఈ పవిత్రగాథను వారికి తెలిపెను. ఆ ఇతిహాసమును నేను గూడ పరంపరగా వింటిని.

14.7 (ఏడవ శ్లోకము)

దితిర్దాక్షాయణీ క్షత్తర్మారీచం కశ్యపం పతిమ్|

అపత్యకామా చకమే సంధ్యాయాం హృచ్ఛయార్దితా॥1734॥

విదురా! ఒక పర్యాయము దక్షుని కుమార్తెయైన దితి సంతానప్రాప్తికై కామాతుర అయ్యెను. అంతట ఆమె సాయంసంద్యాసమయమున తన పతియు, మరీచిమహర్షి యొక్క పుత్రుడు ఐన కశ్యపమునిని జేరి, పుత్రునికై ప్రార్థించెను.

14.8 (ఎనిమిదవ శ్లోకము)

ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిమ్|

నిమ్లోఛత్యర్క ఆసీనమగ్న్యగారే సమాహితమ్॥1735॥

ఆ సమయమున కశ్యపమహర్షి  యజ్ఞశాల యందు అగ్నిజిహ్వుడు, యజ్ఞపతియు ఐన శ్రీహరికి పాయసమును ఆహూతులుగా సమర్పించి, ఆరాధించియుండెను. ఆ సాయంకాలము యజ్ఞశాలయందు అతడు ధ్యానమగ్నుడై కూర్చొనియుండెను. అప్పుడు దితి ఆయనతో ఇట్లు పలికెను.

దితిరువాచ

14.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏష మాం త్వత్కృతే విద్వన్ కామ ఆత్తశరాసనః|

దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః॥1736॥

దితి పలికెను - సకలశాస్త్రపారంగతా! మహర్షీ! ధనుర్ధారియైన మన్మథుడు అబలనైన నాపై విజృంభించి తన బాణములను వర్షించుచు మదపుటేనుగు అరటిచెట్టునువలె నీ సమాగమమును పొందుటకై నన్ను పీడించుచున్నాడు.

14.10 (పదియవ శ్లోకము)

తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః|

ప్రజాపతీనాం భద్రం తే మయ్యాయుంక్తామనుగ్రహమ్॥1737॥

పతిదేవా! నా సవతులు అందరును నీ ద్వారా సర్వసుఖములను అనుభవించి, పుత్రవతులై ఆనందించుచున్నారు. వారిని చూచినప్పుడు నన్ను ఈర్ష్యాగ్ని దహించివేయుచున్నది. కనుక, నన్ను అనుగ్రహింపుము. నీకు మేలు కలుగును.

14.11 (పదకొండవ శ్లోకము)

భర్తర్యాప్తోరుమానానాం లోకానావిశతే యశః||

పతిర్భవద్విధో యసాం ప్రజయా నను జాయతే॥1738॥

నీవంటి పతిని పుత్రరూపమున పొందిన స్త్రీలు తమ పతుల ఆదరాభిమానములకు నోచుకొనినట్లు భావింపబడుదురు. వారి (ఆ స్త్రీల) యశస్సు సకలలోకములయందు వ్యాపించును.

14.12 (పండ్రెండవ శ్లోకము)

పురా పితా నో భగవాన్ దక్షో దుహితృవత్సలః|

కం వృణీత వరం వత్సా ఇత్యపృచ్ఛత నః పృథక్॥1739॥

పూజ్యులైన మా తండ్రియగు దక్షప్రజాపతికి తన పుత్రికలపైగల వాత్సల్యము అపారము. ఆయన పూర్వము ఒకసారి మమ్ములను (మా అక్క చెల్లెండ్రను) విడివిడిగా పిలిచి నీవు ఎవరిని పతిగా కోరుకొనుచున్నావు? అని అడిగెను.

14.13 (పదమూడవ శ్లోకము)

స విదిత్వాఽఽత్మజానాం నో భావం సంతానభావనః|

త్రయోదశాదదాత్తాసాం యాస్తే  శీలమనువ్రతాః॥1740॥

అతడు (దక్షుడు) తన పుత్రికల సౌఖ్యమును గూర్చియే సర్వదా ఆలోచించు చుండెడివాడు. అతడు నీయెడ ప్రేమానురాగములుగల మాయొక్క భావములను గ్రహించెను. అందువలన నీ గుణస్వభావములకు అనురూపవతులైన (అన్నివిధములుగా ఈడుజోడైన)మమ్ము పదమూడుమందిని నీకు ఇచ్చి వివాహమొనర్చెను.

14.14 (పదునాలుగవ శ్లోకము)

అథ మే కురు కల్యాణ కామం కంజవిలోచన|

ఆర్తోపసర్పణం భూమన్నమోఘం హి మహీయసి॥1741॥

మంగళరూపా! కమలనయనా! నా కోరికను తీర్చుము. ఏలయన, మహాత్మా! నీవంటి మహాపురుషుల యొద్దకు ఆర్తులరాక వృథా కాదుగదా!

14.15 (పదునైదవ శ్లోకము)

ఇతి తాం వీర మరీచః కృపణాం బహభాషిణీమ్|

ప్రత్యాహానునయన్ వాచా ప్రవృద్ధానంగకశ్మలామ్॥1742॥

వీరా! విదురా! దితి కామాతిరేకమున మోహితయై అశాంతికి గురియై యుండెను. అందువలన ఆమె యుక్తాయుక్త విచక్షణను మరచి దైన్యముతో అనేకవిధములుగా పలికెను. అంతట కశ్యపుడు మధురవచనములతో ఆమెను ఓదార్చుచు ఇట్లనెను--

14.16 (పదునారవ శ్లోకము)

ఏష తేఽహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి|

తస్యాః కామం న కః కుర్యాత్సిద్ధిస్త్రైవర్గికీ యతః॥1743॥

భీరూ! భయపడవలదు. ఈ నీ కోర్కెను ఇప్పుడే తప్పక తీర్చెదను. ధర్మార్థకామములు సిద్ధించుటకు భార్యయే మూలము. అట్టి భార్యయొక్క అభిలాషను ఎవరు తీర్చరు?

14.17 (పదునేడవ శ్లోకము)

సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కళత్రవాన్|

వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యథార్ణవమ్॥1744॥

మనుష్యుడు ఒక ఓడను ఆశ్రయించి, సులభముగా సముద్రమును దాటును. అదేవిధముగా గృహస్థాశ్రమములో ఉండువాడు. తన భార్యయొక్క సాయముతో ఇతరాశ్రమములవారిని ఆదుకొనుచునే తన ఆశ్రమ (గృహస్థాశ్రమ)  ధర్మములను ఆశ్రయించుచు దుంఖసముద్రమును దాటగలదు.

14.18 (పదునెనిమిదవ శ్లోకము)

యామాహురాత్మనోహ్యర్థం శ్రేయస్కామస్య మానిని|

యస్యాం స్వధురమధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః॥1745॥

మానినీ! ధర్మార్థకామపురుషార్థముల సిద్ధిని కోరుకొనువానికి భార్య అతని శరీరములో సగభాగమని పెద్దలు చెప్పుదురు. కావున, పురుషుడు గృహస్థాశ్రమ కర్మలభారమును ఆమెపై ఉంచి నిశ్చింతగా నుందును.

14.19 (పందొమ్మిదవ శ్లోకము)

యమాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయానితరాశ్రమైః|

వయం జయేమ హేలాభిర్దస్యూన్ దురోగపతిర్యథా॥1746॥

బ్రహ్మచర్య - వానప్రస్థ - సన్న్యాసాశ్రమమలవారు కామక్రోధాది ఇంద్రియరూపశత్రువులను జయించుట కష్టము. కాని విధ్యుక్తముగా ధర్మపత్నిని చేపట్టి గృహస్థాశ్రమమునందు ఉన్నవారు ఆమె సహకారముతో ఇంద్రియరూప శత్రువులను, దుర్గాధిపతి దోపిడి దొంగలనువలె సులభముగా జయింపగలరు.

14.20 (ఇరువదవ శ్లోకము)

న వయం ప్రభవస్తాం త్వామనుకర్తుం గృహేశ్వరి| 

అప్యాయుషా వా కార్ త్స్న్యేన యే చాన్యే గుణగృధ్నవః॥1747॥

గృహేశ్వరీ! నీవంటి భార్య అందించెడి ఉపకారమునకు పూర్తిగా ప్రత్యుపకార మొనర్చుట నాకుగాని, మరియు గుణగ్రాహులైన ఏ ఇతర గృహస్థులకు గాని ఈ జన్మయందే గాదు, జన్మాంతరములలో గూడ అసాధ్యము.

14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అథాపి కామమేతం తే ప్రజాత్యై కరవాణ్యలమ్|

యథా మాం నాతినోచంతి ముహూర్తం ప్రతిపాలయ॥1748॥

14.22 (ఇరువది రెండవ శ్లోకము)

ఏషా ఘోరతమా వేళా ఘోరాణాం ఘోరదర్శనా|

చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణి హ॥1749॥

ధర్మపత్నీ! ఐనప్పటికినీ పుత్రోత్పత్తికై నీకుగల అభిలాషను తప్పక తీర్తును. కానీ, నీవు ఒక ముహూర్తకాలము ఆగుము. అప్పుడు లోకులును నన్ను నిందింపరు. ఇది అత్యంత ఘోరసమయము. ఈ సమయమున రాక్షసులు మొదలగు భయంకరమైన జీవులు సంచరించుచుందురు. ఇట్టి వేళలలో భూతపతియైన శంకరుని భూతప్రేతాదిగణములు సంచరించు చుండును.

14. 23 (ఇరువది మూడవ శ్లోకము)

ఏకస్యాం సాధ్వి సంధ్యాయాం భగవన్ భూతభావనః|

పరితో భూతపర్షద్భిర్వృ షేణాటతి భూతరాట్॥1750॥

సాధ్వీ! ఈ సంధ్యాసమయమున భూతభావనుడు, భూతపతియు ఐన శంకరభగవానుడు వృషభవాహనుడై ప్రమధగణములతోగూడి అంతటను సంచరించుచుండును.

14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

శ్మశానచక్రానిలధూళిధూమ్రవికీర్ణవిద్యోతజటాకలాపః|

భస్మావకుంఠామలరుక్మదేహో దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే॥1751॥

ఆ పరమశివుని జటాజూటము శ్మశానభూమియందు సుడిగాలులకు చెలరేగిన ధూళులచే కప్పబడి దేదీప్యమానముగా వెలుగొందుచుండును. సువర్ణకాంతు లీనెడి ఆ పరమేశ్వరుని దివ్యదేహము భస్మముతో నిండియుండును. నీ (దితి) మరిదియైన (సతీదేవికి శంకరుడు భర్త. సతియు, దితియు దక్షుని కుమార్తెలు,అందువలన శంకరుడు దితికి మరది) ఆ మహాదేవుడు సూర్య-చంద్ర-అగ్ని రూపములైన మూడు నేత్రములతో అందరిని చూచుచుండును. కనుక ఆయన దృష్టికి రాని ప్రదేశమే (విషయమే) ఉండదు. అందుకే ఆయన ఈశ్వరుడు. అందరినీ శాసించువాడు. అనగా, ప్రతి వ్యక్థినీ, ప్రతి అంశమును ఆయన శాసించి తీరును.

14.25 (ఇరువది ఐదవ శ్లోకము)

న యస్య లోకే స్వజనః పరో వా నాత్యాదృతో నోత కశ్చిద్విగర్హ్యః|

వయం వ్రతైర్యచ్చరణాపవిద్ధామ్ ఆశాస్మహేఽజాం బత భుక్తభోగామ్॥1752॥

పరమశివునకు ఈ లోకమున తనవాడు, పెరవాడు అను భేదమేలేదు. ఆయనకు అందరును సమానులే. ఆయన దృష్టిలో మిగుల ఆదరణీయుడుగాని, నింద్యుడుగాని ఉండడు. మేము అనేక వ్రతములను ఆచరించి, ఆయనద్వారా అనేక భోగములను కోరుకొనుచుందుము. కాని ఆపరమేశ్వరుడు భోగములను త్యజించినవాడు. నిస్పృహుడు.

14.26 (ఇరువది ఆరవ శ్లోకము)

యస్యానవద్యాచరితం మనీషిణో గృణంత్యవిద్యాపటలం బిభిత్సవః|

నిరస్తసామ్యాతిశయోఽపి యత్స్వయమ్ పిశాచచర్యామచరద్గతిః సతామ్॥1753॥

వివేకవంతులు అవిద్యయను ఆవరణమును ఛేదింపగోరి ఆ శంకరభగవానుని దివ్యచరిత్రమును గానము చేయుదురు. ఏలయన, ఆయనను మించినవారుగాని, ఆయనతో సమానులుగాని ఎవ్వరును లేరు. సత్పురుషులు మాత్రమే ఆయనను చేరగలరు. అంతటి వైభవోపేతుడైనను ఆయన పిశాచచర్యలను నడపుచుండును.

14.27 (ఇరువది ఏడవ శ్లోకము)

హసంతి యస్యాచరితం హి దుర్భగాః స్వాత్మాన్ రతస్యావిదుషః సమీహితమ్|

యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః శ్వభోజనం స్వాత్మతయోపలాలితమ్॥1754॥

ఈ మానవశరీరము కుక్కలకు భోజనము. వివేకహీనులు దీనినే (దేహమునే) ఆత్మగా భావించి, వస్త్రములు, ఆభరణములు, మాలలు, చందనములు మొదలగువానితో అలంకరించుచుందురు. అట్టి మూఢులు ఆత్మారాముడైన శంకరునియొక్క ఆచరణను జూచి పరిహాసపూర్వకముగా నవ్వుకొనుచుందురు.

14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

బ్రహ్మాదయో యత్కృతసేతుపాలాః యత్కారణం విశ్వమిదం చ మాయా|

ఆజ్ఞికరీ యస్య పిశాచచర్యా అహో విభూమ్నశ్చరితం విడంబనమ్॥1755॥

మనమేగాదు, బ్రహ్మాదిలోకపాలురుగూడ ఆయన నియమించిన ధర్మమర్యాదలను పాలించుచుందురు. ఆ స్వామి ఈ విశ్వమునకు అధిష్టాత. ఈ మాయయు ఆయనయొక్క ఆజ్ఞనే శిరసావహించుచుందురు. ఇట్లున్నను ఆ స్వామి పిశాచములవలె ప్రవర్తించుచుండును. జగద్వ్యాపకుడైన ఆ ప్రభువుయొక్క అట్టి అద్భుతలీలలు ఎవ్వరికిని అర్థముగావు.

మైత్రేయ ఉవాచ

14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సైవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేంద్రియా|

జగ్రాహ వాసో బ్రహ్మర్వేర్వృషలీవ గతత్రపా॥1756॥

మైత్రేయుడు ఇట్లనెను- ఈ విధముగా భర్త ధర్మబద్ధములైన ఇన్ని విషయములను తెలిసినను కామాతురయైయున్న దితి వేశ్యవలె లజ్జాహీనురాలై బ్రహ్మర్షియైన కశ్యపుని వస్త్రమును పట్టుకొనెను.

14.30 (ముప్పదియవ శ్లోకము)

స విదిత్వాథ భార్యాయాస్తం నిర్బంధం వికర్మణి|

నత్వా దిష్టాయ రహసి తయాథోపవివేశ హ॥1757॥

అప్పుడు కశ్యపమహర్షి నిషిద్ధకర్మలయందు తన భార్యయొక్క పట్టుదలను చూచి, లోలోన భగవంతునకు నమస్కరించుచు ఏకాంతప్రదేశమున ఆమెతో సంగమించెను.

14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అథోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్య వాగ్యతః|

ధ్యాయన్ జజాపవిరజం బ్రహ్మ జ్యోతిస్సనాతనమ్॥1758॥

అనంతరము ఆ మహర్షి జలములయందు స్నానము చేసి, మౌనముగా ప్రాణాయామమ ఆచరించెను. పిదప సనాతనుడు, జ్యోతిస్వరూపుడు ఐన బ్రహ్మను ధ్యానించుచు అతడు గాయత్రీమంత్రమును, ప్రణవమును జపించెను.

14.32 (ముప్పది రెండవ శ్లోకము)

దితిస్తు వ్రీడితా తేన కర్మావద్యేన భారత|

ఉపసంగమ్య విప్రర్షిమధోముఖ్యభ్యభాషత॥1759॥

విదురా! దితియు ఆ నింద్యమైన కార్యమునకు మిగుల సిగ్గుపడెను. అతడు, ఆమె తన పతియగు కశ్యపమహర్షిని జేరి తలవంచుకొని ఇట్లు పలికెను. 

దితిరువాచ

14.33 (ముప్పది మూడవ శ్లోకము)

మా మే గర్భమిమం బ్రహ్మన్ భూతానామృషభోఽవధీత్|

రుద్రః పతిర్హిభూతానాం యస్యాకరవమంహసమ్॥1760॥

దితి పలికెను- మహాత్మా! భూతనాథుడైన శంకరభగవానునియెడ నేను అపరాధమొనర్చితిని. కానీ, ఆ పశుపతి నా గర్భమును నష్టము చేయకుండుగాక! 

14.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీధుషే|

శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే॥1761॥

మహాదేవుడైన శంకరుడు రుద్రస్వరూపుడైనను సకాములై సేవలొనర్చినవారికి వారి మనోరథములను ఈడేర్చును. నిష్కామభావముతో సేవించినవారికి శ్రేయస్సును (మోక్షమును) ప్రసాదించును. దుష్టులయెడ ఆగ్రహముతో దండపాణియై శిక్షించును. అట్టి పరమేశ్వరునకు నేను నమస్కరింతును.

14.35 (ముప్పది ఐదవ శ్లోకము)

స నః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహః|

వ్యాధస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవః సతీపతిః॥1762॥

స్త్రీలయెడ కిరాతులుగూడ కనికరము చూపుదురు. ఇంక ఆ సతీపతి నా తోబుట్టువునకు  (సోదరికి) భర్త, పరమదయాళువు ఐన ఆ మహాదేవుడు మనయెడ ప్రసన్నుడగుగాక.

మైత్రేయ ఉవాచ

14.36 (ముప్పది ఆరవ శ్లోకము)

స్వసర్గస్యాశిషం లోక్యామాశాసానాం ప్రవేపతిమ్|

నివృత్తసంధ్యానియమో భార్యామాహ ప్రజాపతిః॥1763॥

మైత్రేయుడు వచించెను- విదురా! కశ్యపప్రజాపతి తన సాయంకాల సంధ్యావందనాది కార్యములను ముగించుకొని తిరిగి వచ్చెను. అప్పుడు దితి తానొనర్చిన అపరాధమునకు వణికిపోవుచుండెను. తన సంతానమునకు లౌకిక పారలౌకిక శుభములకొరకై ప్రార్థించుచున్న ఆమెతో ఆయన ఇట్లు పలికెను.

14.37 (ముప్పది ఏడవ శ్లోకము)

అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్మౌహూర్తికాదుత|

మన్నిదే శాతిచారేణ దేవానాం చాతిహేలనాత్॥1764॥

14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

భవిష్యతస్తనాభద్రావభద్రే జాఠరాధమౌ|

లోకాన్ సపాలాంస్త్రీంశ్చండి ముహురాక్రందయిష్యతః॥1765॥

కశ్యపుడు ఇట్లు నుడివెను-దితీ! అప్పుడు నీ చిత్తము కామోద్రేకముచే కలుషితమైయుండెను. నీ కోర్కెను మన్నించుటకును అది సరియైన సమయము గాదు. ఆ విషయమును నేను ఎంతగా చెప్పినను నా మాటలను పెడచెవిని బెట్టితివి. అంతేగాక, రుద్రుడు మొదలగు దేవతలయెడ గూడ చులకనభావము వహించితివి. పాపాత్ములారా! నీ దుష్కర్మఫలితముగా నీయందు ఇద్దరు దుష్టులు జన్మింతురు. వారు లోకకంటకులగుదురు. వారు ముల్లోకములను, లోకపాలురను పదేపదే వేదింతురు.

14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతగసామ్|

స్త్రీణాం నిగృహ్యమాణానాం కోపితేషు మహాత్మసు॥1766॥

14.40 (నలుబదియవ శ్లోకము)

తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాన్  లోకభావనః|

హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్ శతపర్వధృక్॥1767॥

వారు పెక్కుమంది నిరపరాధులను, దీనులను హింసింతురు. స్త్రీలయెడ అత్యాచారమునకు పాల్పడుదురు. మహాత్ములయెడ అపరాధమొనర్చి, వారి కోపమునకు గురియగుదురు. అప్పుడు లోకరక్షకుడైన విష్ణుభగవానుడు అవతారమదాల్చి, ఇంద్రుడు వజ్రాయుధముచే పర్వతములను కూల్చివేయునట్లు వారినిద్దరినీ సంహరింపగలరు.

దితి రువాచ

14.41 (నలుబది ఒకటవ శ్లోకము)

వధం భగవతా  సాక్షాత్సునాభోదారబాహునా|

ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్బ్రాహ్మణాద్విభో॥1768॥

14.42 (నలుబది రెండవ శ్లోకము)

న బ్రహ్మదండదగ్ధస్య న భూతభయదస్య చ|

నారకాశ్చానూగృహ్ణంతి యాం  యాం యోనిమసౌ గతః॥1769॥

దితి పలికెను- ప్రభూ! నా పుత్రులు ఒకవేళ సంహరింపబడే పక్షములో, సాక్షాత్తుగా చక్రధారియగు శ్రీమహావిష్ణువు చేతిలో వారు సంహరింపబడుదురు గాక! అంతేగాని, బ్రాహ్మణుల క్రోధాగ్నికి బలి కాకూడదని నా ప్రార్థన. ఏలయన బ్రాహ్మణుల శాపములకు గుఱియై నశించినవారిని, లేదా ప్రాణులను భీతిల్లజేయువారిని, ఏ యోనిలో జన్మించినను నరకవాసులు గూడ దయజూపరుగదా!

కశ్యప ఉవాచ

14.43 (నలుబది మూడవ శ్లోకము) 

కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్|

భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్|

14.44 (నలుబది నాలుగవ శ్లోకము)

పుత్రస్యైవ తు పుత్రాణాం భవితైకః సతాం మతః|

గాస్యంతి యద్యశః శుద్ధం భగవద్యశసా సమమ్॥1771॥

కశ్యపుడు నుడివెను- దేవీ! నీవు చేసిన అపచారమునకు దుఃఖమునకు లోనై పశ్చిత్తాపపడితిని. వెంటనే నీలో యుక్తాయుక్త విచక్షణయు  కలిగినది. నీకు విష్ణుభగవానుని యెడలను, పరమశివుని యందును, నా పైనను ఆదరభావముగూడ ఏర్పడినది. కనుక, నీకు కలిగెడి ఇరువురు పుత్రులలో ఒకరికి నలుగురు కుమారులు ఉదయించెదరు. ఆ నలుగురిలో ఒకరు మహాభక్తునిగా వాసికెక్కును. భగవంతుని దివ్యగుణగణములతో సమానముగా అతని పవిత్ర యశస్సునుగూడ మహాపురుషులు గానము చేయుదురు. 

14.45 (నలుబది ఐదవ శ్లోకము)

యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధనః|

నిర్వైరాదిభిరాత్మానం యచ్ఛీలమనువర్తితమ్॥1772॥

ద్రావకములతో కలిపి, పదేపదే పుటముపెట్టి, మాలిన్యమును తొలగించి, స్వర్ణకారులు బంగారమును శుద్ధిచేయుదురు. అట్లే సజ్జనులు నీ పౌత్రుని శీలమును అనుకరించుటకై నిర్వైరాది గుణములను అలవరచుకొని, తమ అంతఃకరణమును పరిశుద్ధమొనర్చుకొందురు.

14.46 (నలుబది ఆరవ శ్లోకము)

యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకమ్|

స స్వదృగభగవాన్ యస్య తోష్యతేఽనన్యయా దృశా॥1773॥

ఈ విశ్వమంతయును భగవత్స్వరూపమే. ఆయన అనుగ్రహమువలననే లోకము సుఖసంతోషములతో వర్ధిల్లుచుండును. ఆ పరమాత్ముడు అమేయమైన తన దయాదృష్టిచే పరమభక్తుడైన నీ పౌత్రుని అనుగ్రహించును.

14.47 (నలుబది ఏడవ శ్లోకము)

స వై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ఠః|

ప్రవృద్ధభక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి॥1774॥
ఆ బాలకుడు గొప్ప భాగవతోత్తముఢు అగును. అతడు నిరుపమాన ప్రభావశాలియై మహాత్ములకును పూజ్యుడగును. అనన్యభక్తి కారణముగా అతడు తన పవిత్రాంతఃకరణమునందు పరమాత్మను నెలకొల్పుకొని దేహాభిమానమును త్యజించును.

14.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

అలంపటః శీలధరో గుణాకరో హృష్టః పరర్ ద్ధ్యా వ్యథితో దుఃఖితేషు|

అభూతశత్రుర్జగతః శోకహర్తా నైదాఘికం తాపమివోదురాజః॥1775॥

అతడు లౌకిక విషయములయందు అనాసక్తుడగును. సచ్ఛీలుడు, సద్గుణనిధియై ఇతరులయొక్క అభివృద్ధిని జూచి సంతోషించును. ఇతరుల దుఃఖమును తన దుఃఖముగా భావించును.అతనికి శత్రువలనువారే యుండరు. చంద్రుడు గ్రీష్మతాపమును హరించివేయునట్లుగా, అతడు జనులశోకమును శాతింపజేయును.

14.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

అంతర్భహిశ్చామలమబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీతరూపమ్|

పౌత్రస్తవ శ్రీలలనాలలామం ద్రష్టా స్ఫురత్కుండలమండితాననమ్॥1776॥

శ్రీహరి జగత్తునకు లోపలవెలుపల వ్యాపించియుండును. కమలాక్షుడైన ఆ పరమపురుషడు తన భక్తుల కోరికపై వేర్వేరు రూపములలో అవతరించుచుండును. లక్ష్మీదేవి లావణ్యములకు శోభలను చేకూర్చువాడగు స్వామియొక్క చెక్కిళ్ళపై మణికుండలముల మిలమిలలు ప్రతిఫలించుచుండును. అట్టి శ్రీమన్నారాయణుడు నీ పౌత్రునకు ప్రత్యక్ష దర్శనమొసంగును.

మైత్రేయ ఉవాచ

14.50 (ఏబదియవ శ్లోకము)

శ్రుత్వా భాగవతం పౌత్రమమోదత దితిర్భృశమ్|

పుత్రయోశ్చ వధం కృష్ణాద్విదిత్వాసీన్మహామనాః॥1777॥

మైత్రేయుడు నుడివెను-దితి తన పౌత్రుడు భాగవతశిరోమణి అగునని విని ఎంతయు సంతోషించెను. పుత్రులవధయు శ్రీహరి వలననే సంభవించునని తెలిసికొని, ప్రశాంతమనస్కురాలయ్యెను.

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే చతుర్దశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు పదునాలుగవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

7.4.2022  సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
తృతీయ స్కంధము-పదునైదవ అధ్యాయము

జయవిజయులను సనకాది మునులు శపించుట

మైత్రేయ ఉవాచ

15.1 (ప్రథమ శ్లోకము)

ప్రాజాపత్యం తు తత్తేజః పరతేజోహనం దితిః|

దధార వర్షాణి శతం శంకమానా సురార్దనాత్॥1778॥

మైత్రేయుడు వచించెను విదురా! కశ్యపప్రజాపతి యొక్క తేజము (కలుగబోవు సంతానము) శత్రువులయొక్క పరాక్రమమును తీయునట్టిది. ఐనను తన పుత్రులద్వారా దేవతలకు హాని సంభవింపవచ్చునని దితి శంకించెను. అందువలన ఆమె ఆ తేజస్సును వందసంవత్సరముల కాలము తన గర్భమునందే నిలుపుకొనియుండెను.

15.2 (రెండవ శ్లోకము)

లోకే తేన హతాలోకే లోకపాలా హతౌజసః|

న్యవేదయన్ విశ్వసృజే ధ్వాంతవ్యతికరం దిశామ్॥1779॥

దితిగర్భమునందున్న తేజస్సు ప్రభావమున లోకములు అన్నియును కాంతిహీనములు అయ్యెను. లోకపాలురుగూడ తేజోవిహీనులైరి. అప్పుడు దేవతలు అందరును బ్రహ్మదేవుని సమీపమునకు వచ్చి, 'దేవా! సకలదిశలును అంధకారమయములు అగుచున్నవి. దానివలన లోకమున అవ్యవస్థ ఏర్పడుచున్నది' అని మొరపెట్టుకొనుచు ఇట్లనిరి.

దేవా ఊచుః

15.3 (మూడవ శ్లోకము)

తమ ఏతద్విభో వేత్థ సంవిగ్నా యద్వయం భృశమ్|

న హ్యవ్యక్తం భగవతః కాలేనాస్పృష్టవర్త్మనః॥1780॥

దేవతలు ఇట్లు పలికిరి "బ్రహ్మదేవా! లోకములు అన్నియును చీకట్లతో నిండిపోవుచున్నవి. కారణము మాకు బోధపడుటలేదు. మేము మిగుల భీతిల్లుచున్నాము. కాలము నీ జ్ఞాపకశక్తిని ఏమాత్రమూ కుంటుపరచదు. నీవు సర్వజ్ఞుడవు. దీనికి తగిన ఉపాయమును ఆలోచింపుము.

15.4 (నాలుగవ శ్లోకము)

దేవదేవ జగద్ధాతర్లోకనాథశిఖామణే|

పరేషామపరేషాం త్వం భూతానామసి భావవిత్॥1781॥

దేవదేవా! నీవు జగద్విధాతవు. సకలదేవతలలో నీవు శ్రేష్డుడవు. ప్రాచీన - అర్వాచీన జీవులయొక్క అభిప్రాయములను ఎరిగినవాడవు. సకలప్రాణుల అభిప్రాయములను తెలియువాడవు.

15.5 (ఐదవ శ్లోకము)

నమో విజ్ఞానవీర్యాయ మాయయేదముపేయుషే|

గృహీతగుణభేదాయ నమస్తేఽవ్యక్తయోనయే॥1782॥

దేవా! నీవు విజ్ఞానబలసంపన్నుడవు. నీవు మాయనుండియే ఈ చతుర్ముఖరూపమును, రజోగుణమును స్వీకరించితివి. నీ పుట్టుకకుగల కారణమును ఎవ్వరును ఎరుగరు. నీకు అనేక నమస్కారములు.

15.6 (ఆరవ శ్లోకము)

యే త్వానన్యేన భావేన భావయంత్యాత్మభావనమ్|

ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకమ్॥1784॥

15.7 (ఏడవ శ్లోకము)

తేషాం సుపక్వయోగానాం జితశ్వాసేంద్రియాత్మనామ్|

లబ్ధయుష్మత్ప్రసాదానాం న కుతశ్చిత్పరాభవః॥1784॥

స్వామీ! నీవు స్వయంభువువు. సకల భువనములను నీవే నిర్మించితివి. కార్యకారణరూపమైన ఈ జగత్తంతయు నీ శరీరము. కానీ, నీవు దానికి అతీతుడవు. నీ యెడ అనన్యభక్తి భావముగల యోగులు తమ ప్రాణములను, ఇంద్రియములను, అంతఃకరణమును వశపరచుకొని, నీ కృపకు పాత్రులయ్యెదరు. అట్టివారికి పరాభవము అనునదియే యుండదు.

15.8 (ఎనిమిదవ శ్లోకము)

యస్య వాచా ప్రజాః సర్వా గావస్తంత్యేవ యంత్రితాః|

హరంతి బలిమాయత్తాస్తస్మై ముఖ్యాయ తే నమః॥1785॥

త్రాడుతో బంధింపబడిన వృషభములవలె (పశువులవలె) ప్రజలు ఎల్లరును నీ వేదవాణిచే బంధింపబడినారు. నీ యధీనములో నున్న వారు అందరును నియమ పూర్వకముగా కర్మలను అనుష్ఠించుచు నీకు పూజాద్రవ్యములను సమర్పించుచుందురు. నీవు సకలజీవులను నియంత్రించువాడవు. వారికి ముఖ్యప్రాణస్వరూపుడవు. అట్టి నీకు నమస్కారము.

15.9 (తొమ్మిదవ శ్లోకము)

స త్వం విధత్స్వ శం భూమంస్తమసా లుప్తకర్మణామ్|

అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుమ్॥1786॥

భూమన్! లోకములలో వ్యాపించిన ఈ అంధకారము వలన రాత్రింబవళ్ళ భేదము తెలియుటలేదు. దానివలన సకలలోకవాసుల కర్మలు అన్నియును లుప్తమగుచున్నవి. వారు దుఃఖితులగుచున్నారు. అవి వారికి సుఖములను చేకూర్చవు. శరణాగతులమైన మాపై నీ అపారకృపాదృష్టిని ప్రసరింపజేయుము.

15.10 (పదియవ శ్లోకము)

ఏష దేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితమ్|

దిశస్తిమిరయన్ సర్వా వర్ధతేఽగ్నిరివైధసి॥1787॥

దేవదేవా! ఇంధనములపై (కట్టెలపై) బడినప్పుడు అగ్ని వృద్ధి చెందినట్లు కశ్యపమహర్షి దితియొక్క గర్భమునందు నిక్షిప్తమొనర్చిన తేజస్సు వలన దిశలన్నియును అంధకారమయములగు చున్నవి. అవి క్రమముగా వృద్ధి చెందుచున్నవి.

మైత్రేయ ఉవాచ

15.11 (పదకొండవ శ్లోకము)

స ప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచరః

ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా॥1788॥

మైత్రేయుడు నుడివెను- మహానుభావా! విదురా! వేదవేద్యుడు, స్వయంభువుడు ఐన బ్రహ్మదేవుడు దేవతల ప్రార్థనవిని, నవ్వుచు, తన మధురవచనములతో వారిని తృప్తిపరచుచు ఇట్లనెను.

బ్రహ్మోవాచ

15.12 (పండ్రెండవ శ్లోకము)

మానసా మే సుతా యుష్మత్పూర్వజాః సనకాదయః|

చేరుర్విహాయసా లోకాంల్లోకేషు విగతస్సృహాః॥1789॥

బ్రహ్మ ఇట్లు పలికెను- దేవతలారా! మీకంటె ముందు జన్మించినవారు, నా మానసపుత్రులు ఐన సనకాది మహామునులు గలరు. వారు లౌకికములైన కోరికలు లేనివారై ఆకాశమార్గమున వేర్వేఱు లోకములయందు సంచరించుచుండిరి. 

15.13 (పదమూడవ శ్లోకము)

త ఏకదా భగవతో వైకుంఠస్యామలాత్మనః|

యయుర్వైకుంఠనిలయం సర్వలోకనమస్కృతమ్॥1790॥

ఒకానొకప్పుడ వారు శుద్ధసత్త్వస్వరూపుడు, సర్వేశ్వరుడు ఐన శ్రీహరి యొక్క వైకుంఠమునకు చేరిరి. ఆ వైకుంఠము సకలలోకములకును ఆరాధ్యము.

15.14 (పదునాలుగవ శ్లోకము)

వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః|

యేఽనిమిత్తనిమిత్తేన ధర్మేణారాధయన్ హరిమ్॥1791॥

అచటివారు ఎల్లరును విష్ణుస్వరూపులే. వారు నిష్కామభావముతో అనన్య శరణాగతిని కోరువారై ధర్మబద్ధముగా  శ్రీహరిని ఆరాధించినవారే. అట్టివారే ఆ లోకమున నివసింతురు. 

15.15 (పదునైదవ శ్లోకము)

యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః|

సత్త్వం విష్టభ్య విరజం స్వానాం నో మృదయన్ వృషః॥1792॥

ఆ శ్రీహరి వేదాది శాస్త్రప్రమాణములకు గోచరుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, ఆదికారణుడు. ఆ ప్రభువు శుద్ధసత్త్వమయ రూపమును దాల్చి, అచట తన  భక్తులగు మనలకు సుఖమును  కలిగించుచు ఆ వైకుంఠమునందు విరాజిల్లుచున్నాడు.

15.16 (పదునారవ శ్లోకము)

యత్ర వైశ్శ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమైః|

సర్వర్తుశ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్॥1793॥

ఆ వైకుంఠలోకమున నిశ్శ్రేయసము అను  ఒక వనము గలదు. అచటి వృక్షములు అన్నియును అన్ని ఋతువుల యందును ఫలపుష్పభరితములై కళకళలాడుచు భక్తులయొక్క సకల మనోరథములను ఈడేర్చునట్టి కల్పతరువులే. ఆ వనము రూపు దాల్చిన కైవల్యము. 

15.17 (పదునేడవ శ్లోకము)

వైమానికాః సలలనాశ్చరితాని యత్ర గాయంతి లోక శమలక్షపణాని భర్తుః|

అంతర్జలేఽనువికసన్మధుమాధవీనాం గంధేన ఖండితధియోఽప్యనిలం క్షిపంతః॥1794॥

వైమానికులగు గంధర్వాదులు తమ స్త్రీలతో పాటుగా సకలలోకపాపరాశిని రూపుమాపెడి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యచరిత్రములను గానము చేయుచుందురు. అచటి సరోవరములలో వసంతఋతువునందు బాగుగా వికసించియున్న మాధవీలతా పుష్పముల మకరందమల మీదుగా వీచుచున్న గాలుల పరిమళములు గూడ వారి చిత్తములను చలింపజూచుచుండును. కాని, వారు అటువైపు తమ చిత్తములను పోనీయకుండా, సువాసనలను వెంట తెచ్చెడు వాయువునే నిందించుచుందురు.

15.18 (పదునెనిమిదవ శ్లోకము)

పారావతాన్యభృతసారసచక్రవాకదాత్యూహహంసశుక తిత్తరిబర్హిణాం యః|

కోలాహలో విరమతే చిరమాత్రముచ్ఛైః భృంగాధిపే హరికథామివ గాయమానే॥1795॥

అచటి గండు తుమ్మెదలు శ్రీహరియొక్క అద్భుతలీలగాథలను తమ ఝంకారముల ద్వారా పారవశ్యముతో గానము చేయుచుండును. వాటి గాన మాధుర్యములకు మైమఱచుచు పావురములు, కోయిలలు, బెగ్గురుపక్షులు, చక్రవాకములు, చాతకపక్షులు, హంసలు, చిలుకలు, తిత్తిరిపక్షులు (తీతువు పిట్టలు), నెమళ్ళు తమ కోలాహలములను క్షణకాలము విరమించి, ఆ మధురిమలను ఆస్వాదించుచుండును. 

15.19 (పందొమ్మిదవ శ్లోకము)

మందారకుందకురవోత్పలచంపకార్ణపున్నాగనాగవకుళాంబుజపారిజాతాః|

గంధేఽర్చితే తులసికిభరణేన తస్యాః యస్మిం స్తపస్సుమనసో బహ మానయంతి॥1796॥

శ్రీమహావిష్ణువు తులసీమాలను ప్రీతిగా ధరించుచుండును. తులసీ దళపూజ ఆ స్వామికి ఎంతయు ముదావహము. ఆ వనమునందలి మందారములు, మొల్లలు, ఎర్రగోరింటలు, నల్లకలువలు, సంపెంగలు, అర్ణపుష్పములు, పున్నాగములు, నాగ కేసరములు, పొగడలు, పద్మములు,పారిజాతములు మొదలగు పుష్పములు మిగుల సుగంధభరితములే ఐనప్పటికిని, అవి శ్రీహరి అర్చనలకు నోచుకొనుచున్న తులసీదళముల అదృష్టములను జూచి వాటిని మిక్కిలి మిక్కిలిగా కొనియాడుచుండును. ఇంకను అవి తులసీదళముల భాగ్యమే భాగ్యము. ఈ తులసి పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసినదో యేమో?పరిమళభరితములైన మనలను కాదని, ఆ ప్రభువు తులసీపూజలకే ఎంతయుసంతృప్తుడగుచుండును అని మెచ్చుకొనుచుండును.

15.20 (ఇరువదవ శ్లోకము)

యత్సంకులం హరిపదానతిమాత్రదృష్టైః వైదూర్యమారకతహేమమయైర్విమానైః

యేషాం బృహత్కటితటాః స్మితశోభిముఖ్యః కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాద్యైః॥1797॥

ఈ వైకుంఠధామము శ్రీహరి చరణములను ఉపాసించుటవలననే ప్రాప్తించును. అది వైడూర్య, మరకతమణులచే పొదుగబడిన బంగారు విమానములచే నిండియుండును. ఆ విమానములలో ఉన్న శ్రీహరి భక్తులుగూడ విష్ణురూపములతోడనే విరాజజిల్లుచుండును. చక్కని కటితలములుగలవారు, అందమైన ముఖములు గలవారు ఐన వారి లలనామణులు తమ చిరునవ్వులతోను, సరససల్లాపములతోడను గూడ ఆ విష్ణుభక్తుల చిత్తములలో ఎంతమాత్రమూ రజోగుణభూయిష్టమగు కామవికారములను కలిగింపజాలరు. 

15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

శ్రీరూపిణీ క్వణయితీ చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషా|

సంలక్ష్యతే స్ఫటికకుడ్య ఉపేతహేమ్ని సమ్మార్జతీవ యదనుగ్రహణేఽన్యయత్నః॥1798॥

పరమసౌందర్య నిధియైన లక్ష్మీదేవి యొక్క కృపను పొందుటకై దేవతలతోపాటు ఇతరులుగూడ నిరంతరము తహతహ పడుచుందురు. అట్టి లక్ష్మీదేవి తన చంచలత్వ మనెడి దోషమును త్యజించి, విష్ణుసదనము (వైకుంఠము) నందు స్థిరముగా నివసించుచు  శ్రీమహావిష్ణువు యొక్క చరణములను సేవించుటయందే నిమగ్నమై యుండును. ఆమె తన పాదమూపురములను ధ్వనింపజేయుచు తన లీలాకమలమును విలాసముగా త్రిప్పుచుండును. అప్పుడు గోడలపై ఆమె రూపము ప్రతిఫలించుచుండును. చేతితో విలాసముగా కమలమును త్రిప్పుచున్న ఆమెయొక్క ప్రతిబింబము ఆ గోడలను శుభ్రపరచుచున్నదా! అనునట్లు అనిపించుచుండును.

15.22 (ఇరువది రెండవ శ్లోకము)

వాపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశమ్|

అభ్యర్చతీ స్వలకమున్నసమీక్ష్య వక్త్రమ్ ఉచ్ఛేషితం భగవతేత్యమతాంగ యచ్ఛ్రీః॥1799॥

దేవతలారా! లక్ష్మీదేవి తన పరిచారికలతో గూడి క్రీడావనమునందు తులసీదళములచే శ్రీహరిని పూజించుచుండును. ఆ సమయమున లక్ష్మీదేవి పవడములతో చెక్కబడిన దరులతోను, నిర్మలజలముల తోడను, ఒప్పుచున్న అచటి సరోవరములయందు అందములను చిందుచున్న ముంగురులతో, సుందరమైన నాసికతో విరాజిల్లుచున్న తన ముఖప్రతిబింబమును చూచుకొనును. అప్పుడు జలములయందు ప్రతిబింబించుచున్న తన వదనమును జూచుకొని శ్రీహరి తనపట్ల చూపిన ఆదరాభిమానములను స్మరించుకొనుచు, ఆహా! నేనెంతటి అదృష్టవంతురాలినోగదా! అని భావించుకొనుచుండును.

15.23 (ఇరువది మూడవ శ్లోకము)

యన్న వ్రజంత్యఘభిదో రచనానువాదాత్ శ్రుణ్వంతి యేఽన్యవిషయాః కుకథా మతిఘ్నీః|

యాస్తు శ్రుతా హతభగైర్నృభిరాత్తసారాః తాంస్తాన్ క్షిపంత్యశరణేషు తమస్సు హంత॥1800॥

భగవంతుని దివ్యలీలలను వర్ణించు కథలను వినుటవలన సకలపాపములును దూరమగును. అట్లుగాక, అర్థకామ సంబంధములగు ఇతర కథలను విన్నచో, అవి వారి బుద్ధులను కలుషితమొనర్చును. అట్టి నిస్సారమైన వృత్తాంతములను వినునట్టి దురదృష్టవంతులు వైకుంఠముయొక్క సమీపమునకే చేరజాలరు. అయ్యో! వారు తమ పూర్వ పుణ్యములను కోల్పోవుటయేగాక, దిక్కులేని నరకముల పాలగుదురు. 

15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

యేఽభ్యర్ధితామపి చ నో నృగతిం ప్రపన్నాః జ్ఞానం చ తత్త్వవిషయం సహధర్మ యత్ర|

నారాధనం భగవతో వితరంత్యముష్య సంమోహితా వితతయా బత మాయయా తే॥1801॥

దేవతలారా! ఈ మానవజన్మ మహిమాన్వితమైనది. ఈ జన్మయందే తత్త్వజ్ఞానప్రాప్తికి, ధర్మాచరణమునకు అవకాశముగలదు. దేవతలమైన మనము మానవజన్మప్రాప్తికై అభిలాషపడినను అది మనకు దుర్లభము. అయ్యో! అట్టి మానవజన్మ లభించినప్పటికినీ భగవంతుని సేవింపనిచో, వారు భగవన్మాయచే సమ్మోహితులై సంసారమనెడి ఊబిలో కూరుకొని పోవుదురు.

15.25 (ఇరువది ఐదవ శ్లోకము)

యచ్చ వ్రజంత్యనిమిషామృషభానువృత్త్యా దూరేయమా హ్యుపరి నః హణీయశీలాః|

భర్తుర్మిథస్సుయశసః కథనానురాగవైక్లబ్యబాష్పకలయా పులకీకృతాంగాః॥1802॥

దేవాదిదేవుడైన శ్రీహరిని నిరంతరము ధ్యానించుచుండుటవలన యమధర్మరాజు వారి సమీపమునకును చేరజాలడు. వారు పరస్పరము ఆ ప్రభువుయొక్క నిర్మల యశస్సును చర్చించుకొనుచు భక్తిపరవశులగుచుందురు. తత్ఫలితముగా వారి నేత్రములనుండి అనురాగజనితములైన అశ్రువులు జాలువారుచుండును. వారి శరీరములు పులకాంకితములగును. వారి శీలస్వభావములు మనకును శ్లాఘనీయములు. అట్టి పరమ భాగవతోత్తములు స్వర్గాదిలోకములకంటెను ఉన్నతమైన వైకుంఠధామమునకు చేరుదురు. 

15.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం దివ్యం విచిత్రవిబుధాగ్ర్యవిమానశోచిః|

ఆపుః పరాం ముదమపూర్వముపేత్య యోగమాయాబలేన ముసయస్తదథో వికుంఠమ్॥1803॥

వైకుంఠధామము సమస్త విశ్వమునకు గురుడైన శ్రీహరియొక్క నివాసస్థానము. సకలలోకములకు అది వందనీయము. దివ్యమైన ఆ పరంధామము దేవతలయొక్క చిత్రవిచిత్రములైన విమానకాంతులతో విరాజిల్లుచుండును. సనకాదిమహా మునులు తమ యోగ ప్రభావముచే అట్టి అద్భుతమైన వైకుంఠధామమును సమీపించి లోకోత్తరమైన దాని వైభవమునకు మిక్కిలి సంతోషించిరి.

15.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తస్మిన్నతీత్య మునయః షడసజ్జమానాః కక్ష్యాః సమానవయసావథ సప్తమాయామ్|

దేవావచక్షత గృహీత గదౌ పరార్ఘ్యకేయూరకుండలకిరీటవిటంకవేషౌ॥1804॥

ఆ మహామునులు భగవద్దర్శనము నందలి ఉత్కంఠతో ఇతర దర్శనీయవస్తువులయందు ఆసక్తి చూపక ముందునకు సాగిరి. వారు క్రమముగా వైకుంఠధామము యొక్క ఆరు కక్ష్యలను దాటి ఏడవ కక్ష్యను జేరిరి.అచట వారికి సమాన వయస్సులు గలవారు, గదాధారులు ఐన ఇద్దరు దేవశ్రేష్ఠులు కనిపించిరి. ఆ ఇరువురును భుజకీర్తులు, కుండలములు, కిరీటములు మున్నగు అమూల్యాభరణములతో విరాజిల్లుచుండిరి.

15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

మత్తద్విరేఫవనమాలికయా నివీతౌ విన్యస్తయాసితచతుష్టయబాహుమధ్యే|

వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుటనిర్గమాభ్యాం రక్తేక్షణేన చ మనాగ్రభసం దధానౌ॥1805॥

వారు శ్యామవర్ణముతో విరాజిల్లుచున్న చతుర్భుజములను కలిగియుండిరి. వారి వక్షస్థలములయందు వనమాలికలు శోభిల్లుచుండెను. గండుతుమ్మెదలు చక్కని సువాసనలను వెదజల్లుతున్న ఆ వనమాలపైజేరి, ఝంకారములను గావించుచుండెను. వారి వదనములు ముడివడియున్న కనుబొమలతోడను, దీర్ఘములైన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసలతో ఒప్పుచున్న నాసారంధ్రములతోను, ఎర్రబారిన చూపులతోడను విలసిల్లుచు కించిత్తు కోపముసు ప్రకటించుచుండెను.

15.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ద్వార్యేతయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా పూర్వా యథా పురటవజ్రకవాటికా యాః|

సర్వత్ర తేఽవిషమయా మునయస్స్వదృష్ట్యా యే సంచరంత్యవిహతా విగతాభి శంకాః॥1806॥

ఆ సనకాదిమునులు ఇంతవరకును వజ్రఖచితములైన బంగారు వాకిళ్ళుగల ఆరు కక్ష్యలను నిరాటంకముగా  దాటియుండిరి. అట్లే ఏడవ కక్ష్యయందు ఉన్న ద్వారపాలకుల చూచుచుండగనే వారిని ఏమియు అడుగక (వారి అనుమతికై ఎదురుచూడక) ఆ ఏడవ కక్ష్యను దాటి లోపలికి ప్రవేశింపబోవుచుండిరి. వారు సర్వత్ర సమానదృష్టి గలవారు. వారు అంతటా ఎట్టి ఆటంకములును లేకుండా సంచరించుచుందురు.

15.30 (ముప్పదియవ శ్లోకము)

తాన్ వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్ వృద్ధాన్ దశార్ధవయసో విదితాత్మతత్త్వాన్|

వేత్రేణ చాస్ఖలయతామతదర్హణాంస్తౌ తేజో విహస్య భగవత్ప్రతికూలశీలౌ॥1807॥

సనక, సనందన, సనాతన, సనత్కుమారులు - సనత్సుజాతులు అను ఆ నలుగురును బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మదేవుని కుమారులలో జ్యేష్ఠులే యైనప్పటికిని, వారు చూచుటకు ఐదు సంవత్సరముల ప్రాయముగలవారుగా కనబడుచుందురు. వారు దిగంబరులు. నిస్సంకోచముగా వారు లోపలికి ప్రవేశించుటను చూచి, భగవంతునికి ప్రతికూలమైన స్వభావము గలిగియున్న ఆ ఇరువురు ద్వారపాలకులు, ఆ మునుల తేజస్సునకు నవ్వుకొనుచు వారిని తమ బెత్తములతో నివారించిరి. వారు ఇట్టి అగౌరవమునకు ఎంతమాత్రము అర్హులు కారు. 

15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తాభ్యాం మిషత్స్వనిమిషేషు నిషిధ్యమానాః స్వర్హత్తమా హ్యపి హరేః ప్రతిహారపాభ్యామ్|

ఊచుః సుహృత్తమదిదృక్షితభంగ ఈషత్ కామానుజేన సహసా త ఉపప్లుతాక్షాః॥1808॥

కాని వైకుంఠవాసులైన సమస్తదేవతలు చూచుచుండగనే, ఆ సనకాదులను ద్వారపాలకులు అడ్డగించిరి. తమకు అత్యంత ఆరాధ్యదైవమైన శ్రీహరిని దర్శించుటకు ఆటంకము ఏర్పడినందులకు వారు ఇంచుక కోపముతో కన్నులెర్రజేసి ఇట్లనిరి.

మునయ ఊచుః

15.32 (ముప్పది రెండవ శ్లోకము)

కో వామిహైత్య భగవత్పరిచర్యయోచ్చైః  తద్ధర్మిణాం నివసతాం విషమః స్వభావః|

తస్మిన్ ప్రశాంతపురుషే గతవిగ్రహే వాం కోవాఽఽత్మవత్కుహకయోః పరిశంకనీయః॥1809॥

మునులిట్లు పలికిరి "ద్వారపాలకులారా! భగవంతుని సేవాభాగ్యము ప్రాప్తించుట దుర్లభము. భగవత్సేవలొనర్చుటకే మీరు ఇద్దరు ఇచట నియమింపబడియున్నారు. ఈ వైకుంఠవాసులందరును సమదర్శనముగలవారు. కానీ, మీ స్వభావములయందు ఇట్టి వైషమ్యము ఎట్లు ఏర్పడినది? భగవంతుడు మిక్కిలి శాంతస్వభావుడు. ఆ స్వామికి ఎవ్వరియందు విరోధభావము ఉండదు. మీరు సహజముగా కపటస్వభావులు. అందువలననే కాబోలు భగవద్దర్శనార్థమై ఇచటికి వచ్చిన మమ్ము సందేహించుచున్నారు.

15.33 (ముప్పది మూడవ శ్లోకము)

న హ్యంతరం భగవతీహ సమస్తకుక్షౌ ఆత్మానమాత్మని నభో నభసేవ ధీరాః|

పశ్యంతి యత్ర యువయోః సురలింగినోః కిం వ్యుత్పాదితం హ్యుదరభేది భయం యతోఽస్య॥1810॥

ద్వారపాలకులారా! భగవంతుని యుదరమునందే ఈ బ్రహ్మాండము అంతయు ఉన్నది. సకలప్రాణులలో ఆయన ఆత్మరూపముగా ఉన్నాడు. కావున, జ్ఞానులు సర్వత్రా అఖండమైన ఆత్మసత్తానే దర్శించుచుందురు. అనగా తమను ఆత్మసత్తా కంటే వేరుగా భావింపరు. మహాకాశమునందు ఘటాకాశము యొక్క ఆవరణము వేరుగా కనిపించిననూ అఖండమైన ఆకాశమునందు ఎట్టి భేదమూ ఉండదుకదా! అట్లే అఖండమైన ఆత్మసత్తాయందే వారు తమనుతాము దర్శించెదరు. మీరు దేవతారూపమును ధరించియున్నారు. కనుక, మీకు ఎవరివలన భయము కలిగి, మమ్ములను అడ్డగించుచున్నారు? మీకీ భయమెందులకు?

15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

తద్వామముష్య పరమస్య వికుంఠభర్తుః కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మండధీబ్యామ్|

లోకానితో వ్రజతమంతరభావదృష్ట్యా పాపీయసస్త్రయ ఇమే రిపవోఽస్య యత్ర॥1811॥

మీరు భగవంతుడైన వైకుంఠపతియొక్క పార్షదులు. కానీ, మీరు మందబుద్ధులు. కనుక, మిమ్ములను పరిశద్ధమొనర్చుటకై ఈ భేదబుద్ధి యను దోషకారణముగా మీరు ఈ వైకుంఠమును వదలివెళ్ళుదురుగాక! ప్రాణులకు ప్రబలశత్రువులైన కామక్రోధలోభములకు నివాస స్థానములగు పాపయోనుల యందు జన్మింతురుగాక!

15.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తేషామితీరితముభావవధార్య  ఘోరం తం బ్రహ్మదండమనివారణమస్త్రపూగైః|

సద్యో హరేరనుచరావురు బిభ్యతస్తత్ పాదగ్రహావపతతామతికాతరేణ॥1812॥

సనకాదులయొక్క కఠోరమైన వచనములను విన్న పిమ్మట, శ్రీహరియొక్క పార్షదులు ఇరువురును బ్రాహ్మణులయొక్క శాపము ఎట్టి శస్త్రములచేతను నివారింప సాధ్యముకాదని తెలిసికొనిరి. అంతట వారు అత్యంత దైన్యభావముతో మిగుల భీతిల్లుచు వారి పాదములకు దండప్రణామముల నాచరించి, వారిని ఇట్లు వేడుకొనిరి-

15.36 (ముప్పది ఆరవ శ్లోకము)

భూయాదఘోని భగవద్భిరకారి దండో యో నౌ హరేత సురహేలనమస్యశేషమ్|

మా వోఽనుతాపకలయా భగవత్స్మృతిఘ్నో మోహో భవేదిహ తు నౌ వ్రజతో రధోఽధః॥1813॥

మహాత్ములారా! మేము వాస్తవముగా అపరాధులమే. మీరు మాకు విధించిన శిక్ష అన్ని విధములుగా తగినదే. ఆ శిక్షను అనుభవించుటవలన భాగవతోత్తములయెడ మేమొనర్చిన అపరాధపాపము ప్రక్షాళితమగును. ఇట్టి దుర్దశకు  గురియైన మాయెడ జాలిచూపి, శిక్షాకాఠిన్యమును కొంత తగ్గింపుడు. మేము ఎట్టి అధమాధమ యోనులలో జన్మించినను మోహములోబడి భగవంతుని మరువకుండునట్లు కనికరింపుడు.

15.37 (ముప్పది ఏడవ శ్లోకము) 

ఏవం తదైవ భగవానరవిందనాభః స్వానాం విబుధ్య సదతిక్రమమార్యహృద్యః|

తస్మిన్ యయౌపరమహంస మహామునీనామ్ అన్వేషణీయచరణౌచలయన్ సహశ్రీః॥1814॥

ఇంతలో సత్పురుషులకు ఆనందదాయకుడైన శ్రీహరికి తన ద్వారపాలకుల సనకాదిమహర్షులను అవమానపరచిన విషయము తెలిసెను. అప్పుడు ఆ ప్రభువు లక్ష్మీదేవితోగూడి, పాదచారియై స్వయముగా అచటికి ఏతెంచెను. ఆ పురుషోత్తముని పాదపద్మములను పరమహంసలైన మహామునులు సైతము అన్వేషించుచుందురు.

15.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తం త్వాగతం  ప్రతిహృతౌపయికం స్వపుంభిః తేఽచక్షతాక్షవిషయం స్వసమాధిభాగ్యమ్|

హంసశ్రియోర్వ్యజనయోః శివవాయులోలత్ శుభ్రాతపత్రశశికేసరశికరాంబుమ్॥1815॥

సనకాదిమునులు తమకు సమాధిస్థితియందు దర్శనభాగ్యము నొసంగెడి శ్రీవైకుంఠ నాథుడు స్వయముగా తమ కనులముందు సాక్షాత్కరించి యుండుట గమనించిరి. ఆ ప్రభువుతోపాటు ఆ స్వామి పార్షదగణములుగూడ ఛత్రచామరాదులను గైకొని నడచుచుండిరి. పార్షదులు ఆయనకు ఇరువైపుల రాజహంసల రెక్కలవలె స్వచ్ఛములైన చామరమలను వీచుచు సేవించుచుండిరి. వాటి శీతలవాయువులకు తెల్లని ఛత్రములయందు వ్రేలాడుచున్న ముత్యాలసరములు అటునిటు కదలుచుండెను. ఆ ముత్యాల సరములు చంద్రుని కిరణములనుండి అమృతబిందువులు స్రవించుచున్నట్లు శోభిల్లుచుండెను.

15.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

కృత్స్న ప్రసాదసుముఖం స్పృహణీయధామ స్నేహావలోకకలయా హృది సంస్పృశంతమ్|

శ్యామే పృథాపురసి శోభితయా శ్రియా స్వః చూడామణిం సుభగయంతమివాత్మధిష్ట్యమ్|

ఆ పరమపురుషుడు సకలసద్గుణములకు ఆశ్రయుడు. ఆ స్వామియొక్క ప్రసన్నమైన ముఖమండలము సకలజనులపై అనవరతము కృపారసమును వర్షించుచుండును. వాత్సల్యపూర్ణములైన ఆ ప్రభువు కటాక్షవీక్షణములు భక్తుల హృదయములయందు ఆనందమును నింపుచుండును. శ్యామవర్ణముతో శోభిల్లుచుండెడి ఆ పురుషోత్తముని విశాలమైన వక్షస్థలముపై నిత్యానపాయినియైన లక్ష్మీదేవి  స్వయముగా విరాజమానమై యుండును. ఆ దేవి తన అద్భుతకాంతులచే సమస్త దివ్యలోకములకును శిరోభూషణమైన వైకుంఠధామమునకు ఇంకను వన్నెచిన్నెలను దిద్దుచుండును.

15.40 (నలుబదియవ శ్లోకము)

పీతాంశుకే పృథునితంబిని విస్ఫురంత్యా కాంచ్యాలిభిర్విరుతయా వనమాలయా చ|

వల్గుప్రకోష్ఠవలయం వినతాసుతాంసే విన్యస్త హస్తమితరేణ ధునానమబ్జమ్॥1817॥

శ్రీహరి ధరించిన పీతాంబరము ధగధగ మెరయుచుండెను. దానిపై నడుమునకు ధరించిన కటిసూత్రకాంతులు మనోజ్ఞముగా నుండెను. కంఠమున అలంకృతమైయున్న వనమాల పరిమళములకు ఆకర్షితములైయున్న తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా నుండెను. ముంజేతులకుగల స్వర్ణకంకణములు కాంతులీనుచుండెను. ఆ స్వామి తన వామహస్తమును గరుత్మంతుని బుజముపై మోపియుండెను. దక్షిణహస్తముతో లీలాకమలమును విలాసముగా త్రిప్పుచుండెను.

15.41 (నలుబది ఒకటవ శ్లోకము)

విద్యుత్ క్షిపన్మకరకుండలమండనార్హగండస్థలోన్నసముఖం మణిమత్కిరీటమ్|

దోర్దండషండవివరే హరతా పరార్ఘ్య హారేణ కధరగతేన చ కౌస్తుభేన॥1818॥

ఆ ప్రభువుయొక్క మకరకుండలముల ప్రభలు చెక్కిళ్ళపై ప్రతిఫలించుచు విద్యుత్కాంతులను త్రోసిపుచ్చుచుండెను. ముఖముస అమరియున్న నాసికయొక్క అందచందములు, మణికిరీట ద్యుతులు అత్యంత మనోహరములు. వక్షస్థలమునందు ఒప్పిదమై అలరారుచున్న అమూల్యహారముల శోభలు, కంఠమునగల కౌస్తుభమణితో వక్షస్థలము అపూర్వముగ ప్రకాశించుచుండెను.

15.42 (నలుబది రెండవ శ్లోకము)

అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయాః స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యమ్|

మహ్యం భవస్య భవతాం చ భజంతమంగం నేముర్నిరీక్ష్య న  వితృప్తదృశో ముదా కైః॥1819॥

శ్రీహరియొక్క తను సౌందర్య వైభవములను గాంచి, భక్తులు ముగ్ధులగుచుండిరి. వారు ఈ స్వామి అందచందములందు లక్ష్మీదేవియొక్క సౌందర్యాతిశయము ఏమూలకును చాలదు అని భావించుచుండిరి. బ్రహ్మదేవుడు,పరమశివుడు, సకలదేవతలు నిరంతరము సేవించునట్టి శ్రీమహావిష్ణువుయొక్క రూపమును దర్శించి, సనకాది మహామునులు ఆయనకు శిరసా ప్రణమిల్లిరి. ఆ ప్రభువుయొక్క దివ్యమంగళ విగ్రహముసు ఎంతగా దర్శించినను వారి నేత్రములకు తనివితీరకుండెను.

15.43 (నలుబది మూడవ శ్లోకము)

తస్యారవిందనయనస్య పదారవిందకింజల్కమిశ్రతులసీమకరందవాయుః|

అంతర్గతఃస్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః॥1820॥

విదురా! సనకాది మునీశ్వరులు జ్ఞాననిధులు. వారు తమకు సాక్షాత్కరించిన భగవంతుని అమృతరూపమును గాంచి, భక్తిపారవశ్యమున మునిగిరి. కమలనయనుడైన ఆ సర్వేశ్వరుని చరణారవిందములపై సమర్పింపబడిన తులసీదళముల సుగంధములు వారి నాసారంధ్రముల ద్వారా అంతఃకరణములయందు ప్రవేశింపగా వారు పరమానందవిహ్వలులైరి. తన్మయత్వమున వారి హృదయములు పొంగిపోయెను.

5.12.2019   ప్రాతంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పదునైదవ అధ్యాయము

జయవిజయులను సనకాది మునులు శపించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

15.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తే వా అముష్య వదనాసితపద్మకోశమ్ ఉద్వీక్ష్య  సుందరతరాధరకుందహాసమ్||

లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రిద్వంద్వం నఖారుణమణిశ్రయణ నిదధ్యుః॥1821॥

సనకాది మహర్షులు నల్లకలువమొగ్గవలె మనోహరముగా విరాజిల్లుచున్న ఆ పరమపురుషుని ముఖమును మిగుల సుందరమైన అధరములపై తొణికిసలాడుచున్న మల్లెమొగ్గలవంటి మందహాసముల కాంతులను జూచి తమ మనోరథములు సఫలములైనట్లు సంతసించిరి. పిదప, వారు ఆ పురుషోత్తముని పాదద్వంద్వమును, వాటిపై అందములు చిందుచున్న పద్మరాగమాణిక్యములవంటి గోళ్ళను గాంచినంతనే ఇంకను హర్షమున పొంగిపోవుచు ధ్యానమగ్నులైరి.

15.45 (నలుబది ఐదవ శ్లోకము)

పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామమ్|

పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్దైః ఔత్పత్తికైః సమగృణన్ యుతమష్టభోగైః॥1822॥

భక్తులు యోగమార్గములద్వారా (జ్ఞాన,  కర్మ, భక్తియోగములద్వారా) పరంధామమును చేరుటకై ఆ పరమపురుషుని రూపమును ధ్యానించుచుందురు. ఆ దివ్యరూపము భక్తులకు ఆదరణీయమైనది, నయనమనోహరమైనది. అట్టి పరమపురుషరూపము అణిమాద్యష్టసిద్ధులకు నిలయమైనది. ఇతర సాధనముల ద్వారా దర్శింపవీలుగాని, అలౌకికమైనది. అట్టి భవ్యరూపము తమ యెదుట సాక్షాత్కరించినంతటనే సనకాది మహామునులు బ్రహ్మానందమగ్నులైరి. ఆ ప్రభువును ఇట్లు స్తుతింపసాగిరి.

కుమారా ఊచుః

15.46 (నలుబది ఆరవ శ్లోకము)

యోఽంతర్హితో హృది గతోఽపి దురాత్మనాం త్వమ్ సోఽద్వ నో నయనమూలమనంతరాద్ధః|

యర్హ్వేవ కర్ణవివరేణ గుహాంగతో నః పిత్రానువర్ణితరహా భవదుద్భవేన॥1823॥

సనకాదిమునులు పలికిరి- అనంతా! నీవు దుష్టుల హృదయములలోగూడ అంతర్యామివై విలసిల్లుచుందువు. అట్టి నీవు నేడు కనులయెదుట ప్రత్యక్షమైతివి. నీనుండి ఉద్భవించినా మా తండ్రియైన బ్రహ్మదేవుడు నీ తత్త్వరహస్యములను చర్చించినపుడు కర్ణరంధ్రముల ద్వారా నీ దివ్యరూపము మా అంతఃకరణములయందు ప్రవేశించినది. కానీ, ఈనాడు ప్రత్యక్షముగా నిన్ను దర్శించు భాగ్యము మాకు అబ్బినది. మేము కృతార్థులమైతిమి.

15.47 (నలుబది ఏడవ శ్లోకము)

తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్త్వం సత్త్వేన సంప్రతి రతిం రచయంతమేషామ్|

యత్తేఽనుతాపవిదితైర్దృఢభక్తియోగైః ఉద్గ్రంథయో హృది విదుర్మునయో విరాగాః॥1824॥

పరమపురుషా! మేము కేవలము నీ పరమాత్మతత్త్వమునే ఎరుగుదుము. ఇప్పుడు నీ విశుద్ధసత్త్వమయరూపముతో నీభక్తులమైన మమ్ము ఆనందింపజేయుచున్నావు. నీ ఈ సగుణసాకారమూర్తిని అహంకారరహితులు, విరాగులు ఐన మునులు మాత్రమే సదృఢమైన భక్తియోగముద్వారా, నీ కృపావృష్టి విశేషముచే తమ హృదయములయందు నిలుపుకొనగలుగుదురు.

15.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కిం త్వన్యదర్పితభయం భ్రువ ఉన్నయై స్తే|

యేఽంగ త్వదంఘ్రిశరణా భవతః కథాయాః కీర్తన్యతీర్థయశసః కుశలా రసజ్ఞాః॥1825॥

నీ పాధపద్మములను శరణుజొచ్చిన భాగ్యశాలులు, నీ కథామృతమును గ్రోలుచు, పవిత్రమైన నీ కీర్తిగల గాథలను కొనియాడుచు, తాము కృతార్థులమని భావించీకొందురు. అట్టివారలు అత్యంతిక మోక్షపదమును సైతము లెక్కింపకుందురు. ఏలయన, నీ అనుగ్రహమువలన మిక్కిలి భయము గొల్పెడి జనన-మరణములే దూరమగుచుండగా, నీవు ఏ కొంచెము బొమముడి వైచిననూ భయముతో గడగడలాడెడు ఇంద్రాదుల పదవులను వారు లెక్కచేయరని వేరుగా చెప్పవలయునా?

15.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

కామం భవః స్వవృజినైర్నిరయేషు నః స్తాత్ చేతోఽలివద్యది ను తే పదయో రమేత|

వాచశ్చ నస్తులసివద్యది తేఽంఘ్రి శోభాః పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః॥1826॥

సర్వేశ్వరా! మా చిత్తములు తుమ్మెదలవలె నీ పాదారవిందములనే ఆశ్రయించుకొని ఆనందించుచున్నచో, నీ పాదపద్మముల సంబంధమువలన తులసీదళములవలె మా వాక్కులు శోభిల్లుచున్నచో, అట్లే మా కర్ణరంధ్రములు నీ గుణకీర్తన శ్రవణములచే నిండినచో, మేము చేసికొనిన పాపముల ఫలితముగా మాకు నరకప్రాయమైన నీచయోనలయందు జన్మ లభించినను మాకు చింతలేదు.

15.50 (ఏబదియవ శ్లోకము)

ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం తేనేశ నిర్వృతిమవాపురలం దృశో నః|

తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ యోఽనాత్మనం ధురుదయో భగవాన్ ప్రతీతః॥1827॥

వేదవేద్యుడవైన ప్రభూ! నీవు అత్యంత మనోహరమైన ని దివ్యమంగళరూపము మాకు ప్రత్యక్షమొనర్చితివి. తత్ఫలితముగా మా నేత్రములు సార్థకములైనవి. విషయాసక్తులకు, జితేంద్రియులు కానివారికి నీ ఈ దివ్యరూపమును దర్శించుభాగ్యము అబ్బుట అసాధ్యము. ఇట్లు స్పష్టముగా నీ దివ్యవిగ్రహమును దర్శింపజేసిన నీకు మా శతకోటి ప్రణామములు.

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  పంచదశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు జయవిజయులను సనకాది మునులు శపించుట యను పదునైదవ అధ్యాయము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

8.4.2022 ప్రాతఃకాల సందేశము

 
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
తృతీయ స్కంధము-పదునారవ అధ్యాయము

మునీశ్వరుల శాపఫలితముగా జయవిజయులు భూలోకమున జన్మించుట

బ్రహ్మోవాచ

16.1 (ప్రథమ శ్లోకము)

ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణామ్|

ప్రతినంద్య జగాదేదం వికుంఠనిలయో విభుః॥1828॥

బ్రహ్మదేవుడు వచించెను- దేవతలారా! యోగనిష్ఠాగరిష్టులైన ఆ సనకాదిమునులు ఇట్లు స్తుతింపగా వైకుంఠవాసుడైన శ్రీహరి వారిని అభినందించి ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

16.2 (రెండవ శ్లోకము)

ఏతౌ హి పార్షదౌ మహ్యం జయో విజయ ఏవ చ|

కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతామతిక్రమమ్॥1829॥

16.3 (మూడవ శ్లోకము)

యస్త్వేతయోర్ధృతో  దండో భవద్భిర్మామనువ్రతైః|

స ఏవానుమతోఽస్మాభిర్మునయో దేవహేలనాత్॥1830॥

శ్రీభగవానుడు ఇట్లు పలికెను- మహామునులారా! ఈ జయవిజయులు నా పార్షదులు. వీరు మీయెడల అపరాధమొనర్చుట నన్ను అవమానపఱచినట్లే. కనుక, నాయందు అత్యంత భక్తితత్పరులైన మీరు వీరిని ఈ విధముగా శిక్షించుట యుక్తమే. దైవభక్తులను హేళన చేసినందులకు వీరు ఇట్టి శిక్షకు అర్హులే.

16.4 (నాలుగవ శ్లోకము)

తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరం హి మే|

తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభిరసత్కృతాః॥1831॥

బ్రాహ్మణులు నాకు పరమపూజ్యులు. నా అనుచరులు మీకు ఒనర్చిన అపరాధమును నేను ఒనర్చినట్లే భావింతును. అందువలన, మీరు నాయెడ ప్రసన్నులగుటకు నేను మిమ్ము అర్థించుచున్నాను.  

16.5 (ఐదవ శ్లోకము)

యన్నామాని చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి| 

సోఽసాధువాదస్తత్కీర్తిం హంతి త్వచమివామయః॥1832॥

సేవకులు అపరాధము ఒనర్చినచో, లోకము వారి యజమానినే నిందించును. ఏలయన, సేవకులు మంచి చేసినను, చెడు చేసినను వారి ప్రవర్తనా ప్రభావము యజమానిపై పడును. భృత్యులవలన వచ్చిన అపకీర్తి చర్మరోగముచే శరీరము పాడైనయట్లు యజమానిని దెబ్బతీయును.

16.6 (ఆరవ శ్లోకము)

యస్యామృతామలయశః శ్రవణావగాహః సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠః|

సోఁహం భవద్భ్య ఉపలబ్ధసుతీర్థకీర్తిః ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిమ్॥1833॥

నిర్మలమైన నా యశస్సును చాటునట్టి అమృతగాథను శ్రవణము చేయుటవలన చండాలుడు మొదలుకొని జగత్తు అంతయును వెంటనే పవిత్రమగును. అందువలననే నాకు వికుంఠుడు అను నామప్రసిద్ధి ఏర్పడినది. నాకు ఈ పవిత్రకీర్తి మీవంటి మహాత్ములవలననే ఏర్పడినది.  మీయెడ ప్రతికూలముగా ప్రవర్తించినచో, వారినేగాదు, నా భుజములను సైతము నేను ఖండించుకొందును.

16.7 (ఏడవ శ్లోకము)

యత్సేవయా చరణపద్మజపవిత్రరేణుం సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలమ్|

న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాలవార్ధ ఇతరే నియమాన్ వహంతి॥1834॥

నా పాదపద్మముల రేణువులను తలదాల్చుటవలన సకలలోకములవారి పాపములను రూపుమాయును. వారికి సమస్త సౌశీల్యములును సిద్ధించును. నేను బ్రాహ్మణోత్తములను సేవించుటవలననే నా పాదారవిందముల రేణువులకు అంతటి ప్రభావము ఏర్పడినది. నేను ఉదాసీనుడనై యున్నను లక్ష్మీదేవి ఒక్కక్షణముగూడ నన్ను వీడకుండుటకు నేనొనర్చెడి బ్రాహ్మణసేవా ప్రభావమే ముఖ్యకారణము. లక్ష్మీదేవియొక్క కటాక్షములు తమపై ప్రసరించుటకొరకై  బ్రహ్మాదిదేవతలు సైతము వ్రతములను ఆచరించుచుందురు. నేను విప్రోత్తములను సేవించుటవలననే అట్టి దేవి నిత్యానపాయినియై నన్ను అనుసరించుచుండును.

16.8 (ఎనిమిదవ శ్లోకము)

నాహం తథాద్మి యజమానహవిర్వితానే శ్చ్యోతద్ ఘృతప్లుతమదన్ హుతభుఙ్ముఖేన|

యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోఽనుఘాసం తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకైః॥1835॥

భూసురులు వర్ణాశ్రమోచిత కర్మలఫలములను నిష్కామబుద్ధితో నాకు సమర్పించుచుందురు. అట్టి బ్రాహ్మణులు భుజించిన ఆహారమును వారి ముఖములద్వారా నేను స్వీకరించి తృప్తిచెందుదును. యజమాని యజ్ఞములలో అగ్నిముఖతః (అగ్నిద్వారా) నాకు సమర్పించు పురోదాశాది ఆహుతులను భుజించుటవలనను నాకు అంతటి తృప్తికలుగదు.

16.9 (తొమ్మిదవ శ్లోకము)

యేషాం బిభర్మ్యహమఖండవికుంఠయోగమాయావిభూతిరమాలాంఘ్రికరజః కిరీటైః|

విప్రాంస్తు కో న విషహేత యదర్హణాంభః సద్యః పునాతి సహచంద్రలలామలోకాన్॥1836॥

నేను అఖండమైన, అప్రతిహతమైన యోగమాయా వైభవమును గలవాడను. నా పాదములనుండి ఉద్భవించిన గంగాజలము చంద్రశేఖరునితో సహా సకలలోకములను పునీతమొనర్చును. అట్టి వైభవోపేతుడనైన నేనును బ్రాహ్మణశ్రేష్ఠులయొక్క పవిత్రమైన పాదధూళిని నా కిరీటములపై ధరింతును. అట్టి విప్రులను ఎవరు సహించకుందురు? అనగా - వీరిని మీరు శపించుట ఉచితమైనదే. 

16.10 (పదియవ శ్లోకము)

యే మే తనూరోద్విజవరాన్ దుహతీర్మదీయా భూతన్యలబ్ధశరణాని చ భేదబుద్ధ్యా|

ద్రక్ష్యంత్యఘక్షతదృశో హ్యహిమన్యవస్తాన్ గృధ్రా రుషా మమ కుషంత్యధిదండనేతుః॥1837॥

భూసురోత్తములు, గోవులు, రక్షణలేనట్టి అనాథప్రాణులు నా స్వరూపములే. కావున, వీరియెడల భగవద్బుద్ధిని కలిగియుండవలెను. పాపకృత్యముల ఫలితముగా వివేకమును కోల్పోయిన మూర్ఖులు ఆ బ్రాహ్మణాదులను, నన్నును వేరుగా భావింతురు. అట్టివారిని నాచే నియుక్తుడైన  యమునియొక్క భటులు గ్రద్దల రూపుమును గలిగి సర్పములవలె క్రోధము వహించి,తమ ముక్కుపుటములతో పొడిచి, పొడిచి చీల్చి చంపుదురు. 

16.11 (పదకొండవ శ్లోకము)

యే బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతోఽర్చయంతః తుష్యద్ధృదః స్మితసుధోక్షితపద్మవక్త్రాః|

వాణ్యానురాగకలయాత్మజవద్గ్రణంతః సంబోధయంత్యహమివాహముపాహృతస్తైః॥1838॥

బ్రాహ్మణులు క్రుద్ధులై పరుష వచనములను పలికినప్పటికిని , వారిని నన్నుగా భావించి, ప్రసన్నచిత్తములతో, అమృతతుల్యమైన చిఱునవ్వులతోడను, పద్మములవలె ఆహ్లాదకరమైన ముఖముతోడను ఒప్పుచున్నవారై ఆదరించినవారికీని (సమ్మానించిన వారికిని) కోపించిన తండ్రిని పుత్రునివలె నేను మిమ్ములను ప్రసన్నులను  చేసినట్లుగా అనురాగభాషణములతో స్తుతించుచు ప్రార్థించినవారికిని నేను వశుడను అగుదును. భృగుమహర్షి కుపితుడైనప్పటికిని, విష్ణుభగవానుడు ప్రసన్నవదనముతో, చిరునవ్వుతో, ఆయనను ఆదరించెను.

16.12 (పండ్రెండవ శ్లోకము)

తన్మే స్వభర్తురవసాయమలక్షమణౌ యష్మద్వ్యతిక్రమగతిం ప్రతిపద్య సద్యః

భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః॥1839॥

సనకాది మునులారా! ఈ నా భృత్యులు అగు జయవిజయులు నా అభిప్రాయమును ఎరుగని కారణముగా మిమ్ములను అవమానించిరి. మీరు వారికిచ్చిన శాపఫలితముగా, వారి అపరాధమునకు తగిన అధమగతిని అనుభవించి, త్వరగా నన్ను చేరునట్లు అనుగ్రహింపుము. ఇదియే నా ప్రార్థన.

బ్రహ్మోవాచ

16.13 (పదమూడవ శ్లోకము)

అథ తస్యోశతీం దేవీమృషికుల్యాం సరస్వతీమ్|

నాస్వాద్య మన్యుదష్టానాం తేషామాత్మాప్యతృప్యత॥1840॥

బ్రహ్మధేవుడు నుడివెను- దేవతలారా! భగవంతుని మృదుమధురములైన వాక్కులను ఆస్వాదించిన ఆ సనకాది మునులయొక్క క్రోధము చల్లారిపోయెను. కాని, ఆయన తీయని పలుకులు ఎంతవినిననూ వారికి తనివి తీరకుండెను. ఇంకనూ వినవలెనని ఉత్కంఠతో యుండిరి.

16.14 (పదునాలుగవ శ్లోకము)  

సతీం వ్యాదాయ శృణ్వంతో లఘ్వీం గుర్వర్థగహ్వరామ్|

విగాహ్యాగాధగంభీరాం న విదుస్తచ్చికీర్షితమ్॥1841॥

భగవంతుని పలుకులు మిగుల మనోహరములు, సంక్షిప్తములు.ఐనను అవి లోతైన అర్థముగలవి. సారభూతముగా ఉన్నవి. అవి సులభముగా బోధపడనివి. గంభీరములు. ఏకాగ్రచిత్తములతో ఆమహామునులు వాటిని గూర్చి బాగుగా ఆలోచించినప్పటికిని భగవంతుని వచనముల ఆంతర్యము వారికి బోధపడలేదు. తాము ద్వారపాలకులకు ఇచ్చిన శాపమును భగవంతుడు సమర్థించుచున్నాడా, లేక తప్పుగా భావించుచున్నాడా? అను విషయము ఆ శ్రీహరి వచనములద్వారా ఆ మునులకు బోధపడలేదు

16.15 (పదునైదవ శ్లోకము)

తే యోగమాయయారబ్ధపారమేష్థ్యమహోదయమ్|

ప్రోచః ప్రాంజలయో విప్రాః ప్రహృష్టాః క్షుభితత్వచః॥1842॥

శ్రీహరియొక్క ఉదారవచనములకు సనకాదులు ఎంతయు ముగ్ధులై పులకాంకితులైరి. యోగమాయాప్రభావముచే స్వామి ప్రకటించిన పరమైశ్వర్యయుక్తమగు ఆ దివ్యమంగళ రూపమునకు చేతులు జోడించి, ఆ మునులు ఇట్లు స్తుతించిరి.

16.16 (పదునారవ శ్లోకము)

ఋషయ ఊచుః

న వయం భగవన్ విద్మస్తవ దేవ చికీర్షితమ్|

కృతో మేఽనుగ్రహశ్చేతి యదధ్యక్షః ప్రభాషసే॥1843॥

సనకాది మునులు పలికిరి- దేవాదిదేవా! పరమపురుషా! నీవు సర్వేశ్వరుడవైనప్పటికిని మీరు మాపై అనుగ్రహము ఉంచితిరి అని నీవు మాతో పలికితివి. దీని అభిప్రాయమేమి? నీవు ఏమి చేయదలచుకొంటివో, మేము ఎరుగము.

16.17 (పదిహేడవ శ్లోకము)

బ్రహ్మణస్య పరం దైవం బ్రాహ్మణాః కిల తే ప్రభో|

విప్రాణాం దేవదేవానాం భగవానాత్మదైవతమ్॥1844॥

ప్రభూ! నీవు బ్రాహ్మణులకు హితమును చేకూర్చువాడవు. లోకక్షేమము కొరకై నీవు ఆ విప్రులను ఆరాధ్యదేవతలుగా భావింతువు. వాస్తవముగా బ్రహ్మాదిదేవతలకును, భూసురులకును నీవే ఆత్మవు, పరమపూజ్యుడవు.

16.18 (పదునెనిమిదవ శ్లోకము)

త్వత్తస్సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ|

ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః॥1845॥

పరమాత్మా! సనాతన ధర్మము నీనుండియే ఏర్పడినది. ఆయా సమయములయందు వివిధములగు అవతారములను దాల్చి ధర్మమును నీవు రక్షించుచుందువు. నీ అవతారముల పరమప్రయోజనము గూడ అదియే. నీవు నిర్వికారుడవు.  ధర్మమునకు పరమరహస్యమును నీవే అని శాస్త్రములు పేర్కొనుచున్నవి.

16.19 (పందొమ్మిదవ శ్లోకము)


తరంతి హ్యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్|

యోగినః భవాన్ కిం స్విదనుగృహ్యేత యత్పరైః॥1846॥

విరాగులైన యోగులు నీ అనుగ్రహమువలననే మృత్యురూప సంసారసాగరమును అవలీలగా తరించుచున్నారు. ఇంక, ఇతరులు నీపై అనుగ్రహము చూపుట ఎట్లు సంభవము?

16.20 (ఇరువదియవ శ్లోకము)

యం వై విభూతిరుపయాత్యనువేలమన్యైః అర్థార్థిభిః స్వశిరసా ధృతపాదరేణుః|

ధన్యార్పితాంఘ్రితులసీనవదామధామ్నో లోకం మధువ్రతపతేరివ కామయానా॥1847॥

చతుర్విధపురూషార్థ ఫలములను అభిలషించువారు లక్ష్మీదేవియొక్క పాదధూళిని తమ శిరస్సులపై నిత్యమూ ధరించుచు ఆమెను సేవించుచుందురు. అట్టి లక్ష్మీదేవి నీ పాదసేవలయందే నిరతురాలైయుండును. పరమభక్తులు నీ చరణములమీద అనుదినము తులసీమాలలను సమర్పించుచుందురు. ఆ తులసీ మాలలచే విరాజిల్లుతున్న నీ పాదపద్మములను లక్ష్మీదేవికూడ పరిమళమును ఆశించుచున్న తుమ్మెదవలె తన నివాసస్థానముగా చేసికొనగోరుచున్నది.

16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

యస్తాం వివిక్తచరితైరనువర్తమానాం నాత్యాద్రియత్పరమభాగవతప్రసంగః|

స త్వం ద్విజానుపథపుణ్యరజః పునీతః శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వమ్॥1848॥

లక్ష్మీదేవి నిర్మలచరితయై నిరంతరము నిన్ను సేవించుటయందే నిరతురాలైయుండును. ఐనను , నీ భక్తజనులను ఆదరించినంతగా ఆమెను ఆదరింపవు. నీ భక్తులు నీకు తులసీదళములను అర్చించుచు నిన్ను భజించెదరు. అట్టివారినే నీవు ఎక్కువగా ఆదరింతువు. నీవు సకలసద్గుణములకు పెన్నిధివి. ఐనను, బ్రాహ్మణులు సంచరించుచుండునట్టి మార్గములయందలి ధూళిచే నీవు పవిత్రుడవైనట్లుగా భావింతువు. ఆ ధూళులు నీ వక్షస్థలమున విలసిల్లెడి శ్రీవత్సచిహ్నముకంటెను పవిత్రమైనవా? ఇదంతయూ బ్రాహ్మణులయెడ మీకుగల  అదరభావమును లోకులకు ఉపదేశించుటకొరకే సుమా!

16.22 (ఇరువది రెండవ శ్లోకము)

ధర్మస్య తే భగవతస్త్రియుగ త్రిభిః స్త్వైః పద్భిశ్చరాచరమిదం  ద్విజదేవతార్థమ్|

నూనం భృతం తదభిఘాతిరజస్తమశ్చ సత్త్వేన నో వరదయా తనువా నిరస్య॥1849॥

పరాత్పరా! నీవు సాక్షాత్తు ధర్మస్వరూపుడవు. సత్యాది మూడు యుగములయందును ప్రత్యక్షముగా విరాజిల్లు చుందువు. బ్రాహ్మణులను రక్షించుటకై తపస్సు, శౌచము, దయ అను మూడు పాదములతో ఈ చరాచర జగత్తును పాలించుచుందువు. నీవు శుద్ధసత్థ్వమయమైన, వరదాయినియైన నీ తనువుచే ధర్మమునకు ప్రతిబంధకములైన మా రజస్తమోగుణములను రూపుమాపుము.

16.23 (ఇరువది మూడవ శ్లోకము)

న త్వం ద్విజోత్తమకులం యది హాత్మగోపం గోప్తా వృషః స్వర్హణేన ససూనృతేన|

తర్హేవ నంక్ష్యతి శివస్తవ దేవపంథా లోకోఽగ్రహీష్యదృషభస్య హి తత్ప్రమాణమ్॥1850॥

దేవా! ఈ బ్రాహ్మణవంశము నీకు అవశ్యము రక్షణీయము. సాక్షాత్తు ధర్మస్వరూపుడవైన నీవుగూడ మధురవచనములచే, పూజాదికములచే ఈ సద్వంశమును రక్షింపనిచో, నీవు ప్రతిపాదించిన శుభప్రదమైన ధర్మమార్గము నష్టమగును. ఏలయన,శ్రేష్ఠుడైన పురుషుడు తన ఆచరణముద్వారా స్థాపించిన ప్రమాణములనే లోకము ఆచరించుచుండునుగదా!  శ్లో॥ యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః| సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥-(భగవద్గీత)

16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తత్తేఽనభీష్టమివ సత్త్వనిధేర్విధిత్సోః క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః|

నైతావతా త్ర్యధిపతేర్బత విశ్వభర్తుః తేజః క్షతం త్వవనతస్య స తే వినోదః॥1851॥

ప్రభూ! నీవు శుద్ధసత్త్వగుణనిధివి. సకలజీవులకు శుభములను కలిగించుటకు ఉత్సుకుడవైయుందువు. అందులకై నీవు నీ శక్తిని ప్రకటించు క్షత్రియాది (రాజాది) అవతారములను దాల్చి ధర్మవిరోధులైన వారిని సంహరించెదవు. ఏలయన, వేదమార్గములు దెబ్బతినుట నీవు సహింపవు. నీవు త్రిలోకాధిపతివి, జగత్పరిపాలకుడవు ఐనప్పటికిని, బ్రాహ్మణోత్తములపట్ల వినమ్రుడవై యుందువు. దానివలన నీ తేజస్సునకు లోటురాదు. ఇది నీకు లీలావినోదము మాత్రమే.

16.25 (ఇరువది ఐదవ శ్లోకము) 

యం వానయోర్దమమధీశ భవాన్ విధత్తే వృత్తిం ను వా తదనుమన్మహి నిర్వ్యలీకమ్|

అస్మాసు వా య ఉచితో ధ్రియతాం న దండో యేఽనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేణ॥1852॥

(ఈ విధముగా భగవంతుని స్తోత్రము చేయుటవలన సనకాదుల హృదయములు ద్రవించి పోయెను. అప్పుడు వారలు ఇట్లు పలికిరి-) సర్వేశ్వరా! నీకు ఉచితమనిపించిన రీతిలో ఈ ద్వారపాలకులకు శిక్ష విధింపుము. లేదా, వారి వృత్తిలోనే పురస్కారపూర్వకముగా వారికి వేతనమును పెంచుము. నిరపరాధులైన నీ అనుచరులను మేము తొందరపడి శపించితిమి. కనుక, మాకు తగిన శిక్ష విధింపుము. అందులకు మేము సంతోషముగా అంగీకరించెదము ఈ విధముగా సనకాదిమునులుభగవంతునకు నివేదించిరి.

శ్రీ భగవాన్ ఉవాచ

16.26 (ఇరువదియారవ శ్లోకము)

ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్యః సంరంభసంభృతసమాధ్యనుబద్ధయోగౌ|

భూయః సకాశముపయాస్యత ఆశు యో వః శాపో మయైవ నిమితస్తదవైత విప్రాః॥1853॥

భగవంతుడు వచించెను- మునులారా! వాస్తవముగా వీరికి మీరు ఇచ్చిన శాపము నా ప్రేరణవలననే జరిగినది. వీరు శీఘ్రముగా దైత్యులుగా జన్మింతురు. ఆ జన్మలలో వీరు క్రోధావేశపరులై వైరభావముతోనైనను నాయందే ఏకాగ్రచిత్తులైయుందురు. పిమ్మట, అనతి కాలములో నన్ను జేరుదురు.

16.27 (ఇరువది ఏడవ శ్లోకము)

అథ తే మునయో దృష్ట్వా నయనానందభాజనమ్|

వైకుంఠం తదధిష్ఠానం వికుంఠం చ స్వయంప్రభమ్॥1854॥

16.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ|

ప్రథిజగ్ముః ప్రముదితాః శంసంతో వైష్ణవీం శ్రియమ్॥1855॥

బ్రహ్మ నుడివెను - దేవతలారా! అనంతరము ఆ సనకాదిమునులు నయనానందకరమైన వైకుంఠమును, దానికి అధిష్ఠాతయు, స్వయంప్రకాశమానుడును ఐన  శ్రీమహావిష్ణువును తనివిదీర దర్శించి ఆనందించిరి. పిదప వారు శ్రీహరికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించిరి. ఆ పరమపురుషుని అనుజ్ఞను  పొందిన పిమ్మట, వారు ఆ దేవదేవుని షడ్గుణైశ్వర్యసంపదను కొనియాడుచు, అచటి నుండి బయలుదేరిరి.

16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము) 

భగవాననుగావాహాయాతం మాభైష్టమస్తు శమ్|

బ్రహ్మతేజః సమర్థోఽపి హంతుం నేచ్ఛే మతం తు మే॥1856॥

పిమ్మట భగవంతుడు తన అనుచరులతో (ద్వారపాలకులతో) ఇట్లనెను. - భృత్యులారా! వెళ్ళుడు. మీకు ఏవిధమైన భయమూ అక్కరలేదు. మీకు శుభమే కలుగును. నేను సర్వసమర్థుడనైనను బ్రాహ్మణ శాపవచనములను తొలగించుటకు ఇష్టపడను. ఇది నా నిశ్చితాభిప్రాయము.

16.30 (ముప్పదియవ శ్లోకము) 

ఏతత్పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా|

పురాపవారితా ద్వారి విశంతీ మయ్యుపారతే॥1857॥

16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

మయి సంరంభయోగేన నిస్తీర్య బ్రహ్మహేళనమ్|

ప్రత్యేష్యతం నికాశం మే కాలేనాల్పీయసా పునః॥1858॥

ఒక పర్యాయము నేను యోగనిద్రలో ఉండగా, లక్ష్మీదేవి నా మందిరమున ప్రవేశించినపుడు ద్వారముకడ ఆమెను నిలిపితిరి. అప్పుడు ఆమెయు క్రోధము వహించి మిమ్ము శపించియుండెను. ఇప్పుడు మీరు దైత్యులుగా జన్మించి, నాయెడ క్రోధము వహించి, వైరభావముతోనైనను ఏకాగ్రచిత్తులై యుందురు. ఫలితముగా బ్రాహ్మణులను తిరస్కరించిన దోషము తొలగిపోవును. మరల కొలది కాలములో నా యొద్దకు చేరుకొందురు.

16.32 (ముప్పది రెండవ శ్లోకము)

ద్వాఃస్థావాదిశ్య భగవాన్ విమానశ్రేణిభూషణమ్|

సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్॥1859॥

ద్వారపాలకులను ఇట్లు ఆజ్ఞాపించిన పిదప శ్రీహరి బంగారుగోపురములతో అలంకృతమై సాటిలేని వైభవములతో అలరారుచున్న వైకుంఠమందిరమున ప్రవేశించెను.

16.33 (ముప్పది మూడవ శ్లోకము)

తౌ తు గీర్వాణవృషభౌ దుస్తరాద్ధరిలోకతః|

హతశ్రియౌ బ్రహ్మశాపాదభూతాం విగతస్మయౌ॥1860॥

దేవతలలో శ్రేష్ఠులైన జయవిజయులు అలంఘ్యమైన బ్రాహ్మణోత్తముల శాపకారణముగా వైకుంఠలోకమును వీడవలసి వచ్చినందులకు మిగుల చింతాగ్రస్తులైరి. వారి ముఖములు వెలవెలబోయెను. వారి గర్వము అంతయు అణగిపోయెను.

16.34 (ముప్పదినాలుగవ శ్లోకము)

తదా వికుంఠధిషణాత్తయోర్నిపతమానయోః|

హాహాకారో మహానాసీద్విమానాగ్ర్యేషు పుత్రకాః॥1861॥

దేవతలారా! ఆ జయవిజయులు వైకుంఠమునుండి పతనమగుచుండుట చూచి, వైకుంఠవాసులు శ్రేష్ఠమైన గోపురముల పైభాగములనుండి హాహాకారము లొనర్చిరి.

16.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షదప్రవరౌ హరేః|

దితేర్జఠరనిర్విష్టం కాశ్యపం తేజ ఉల్బణమ్॥1862॥

వెంటనే శ్రీహరియొక్క పార్షదప్రముఖులైన జయవిజయులు కశ్యపుని ఉగ్రతేజోరూపమున దితిగర్భమున ప్రవేశించిరి.

16.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తయోరుసురయోరద్య తేజసా యమయోర్హి వః|

అక్షిప్తం తేజ ఏతర్హి భగవాంస్తద్విధిత్సతి॥1863॥

దేవతలారా! ఆ ఇరువురు అసురుల తేజఃప్రభావమున మీ అందరి తేజస్సులు మసకబారినవి. ఇదియంతయును భగవత్సంకల్పమే.

16.37 (ముప్పది ఏడవ శ్లోకము)

విశ్వస్య యః స్ధితలయోద్భవహేతురాద్యో యోగేశ్వరైరపి దురత్యయయోగమాయః|

క్షేమం విధాస్యతి స నో భగవాంస్త్ర్యధీశః తత్రాస్మదీయవిమృశేన కియానిహార్థః॥1864॥

ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువే ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు కారకుడు. ఆ స్వామి యోగమాయను యోగేశ్వరులుగూడ అధిగమింపజాలరు. సత్త్వాది త్రిగుణములకు అధీశుడైన (నియంతయైన) ఆ శ్రీహరియే శుభములను చేకూర్చును. ఇప్పుడు ఈ విషయమున ఎక్కువగా విచారించుటవలన ఎట్టి ప్రయోజనమూ లేదు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  షోడశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు మునీశ్వరుల శాపఫలితముగా జయవిజయులు భూలోకమున జన్మించుట యను పదునారవ అధ్యాయము.
 
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


8.4.2022 సాయంకాల సందేశము

తృతీయ స్కంధము-పదునేడవ అధ్యాయము

హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల జననము - హిరణ్యాక్షుని దిగ్విజయయాత్ర

మైత్రేయ ఉవాచ

17.1 (ప్రథమ శ్లోకము)

నిశమ్యాత్మభువా గీతం కారణం శంకయోజితాః|

తతః సర్వే న్యవర్తంత త్రిదివాయ దివౌకసః॥1865॥

మైత్రేయుడు వచించెను- విదురా! బ్రహ్మదేవుని వచనములను వినిన పిమ్మట దేవతల దుఃఖకారణములు తొలగిపోయెను. వారి సంశయములు అన్నియును తీరెను. పిదప వారు అందరును స్వర్గలోకమునకు మరలిరి.

17.2 (రెండవ శ్లోకము)

దితిస్తు భర్తురాదేశాదపత్యపరిశంకినీ|

పూర్ణే ర్షశతే సాద్వీ పుత్రౌ ప్రసుషువే యమౌ॥1866॥

అంతట దితి తన పతి దేవుడగు కశ్యపుని కథనమును అనుసరించి, తనకు కలుగబోవు పుత్రులు భయంకరులు అనియు, వారి వలన ఉపద్రవములు సంభవించుననియు శంకించుచుండెను. పూర్తిగా నూరు సంవత్సరములు గడచిన పిదప ఆ సాధ్వికి ఇద్దరు కవలలు (పుత్రులు) జన్మించిరి.

17.3 (మూడవ శ్లోకము)

ఉత్పాతా బహవస్తత్ర నిపేతుర్జాయమానయోః|

దివి భువ్యంతరిక్షే చ లోకస్యోరుభయావహాః॥1867॥

ఆ శిశువులు జన్మించు సమయమున స్వర్గలోకము నందును, భూలోకమునందును, అంతరిక్షమునందును పెక్కు ఉత్పాతములు చెలరేగెను. వాటినిజూచి ఎల్లరును భయమునకు లోనైరి.

17.4 (నాలుగవ శ్లోకము)

సహాచలా భువశ్చేలుర్దిశః సర్వాః ప్రజజ్వలుః|

సోల్కాశ్చాశనయః పేతుః కేతవశ్చార్తిహేతవః॥1868॥

అప్పుడు పర్వతములతో సహా భూమండలము అంతయును చలించెను. అన్ని దిశల యందును అగ్నులు ప్రజ్వరిల్లెను. ఉల్కలు రాలెను. పిడుగులు పడెను. అరిష్టసూచకములైన తోక చుక్కలు పొడసూపెను. 

17.5 (ఐదవ శ్లోకము)

వవౌ వాయుః సుదుఃస్పర్శః ఫూత్కారానీరయన్ముహుః॥1869॥

ఆ సమయమున భయంకరవాయువులు వీచెను. వాటి తాకిడి తట్టుకోలేనంతగా ఉండెను. వెంటవెంట వినవచ్చెడి వాటి పూత్కారములు (గాలులు వీచునప్పుడు కలిగెడి ధ్వనులు) దుర్భరములుగా ఉండెను. వాటి వేగమునకు మహావృక్షములు సైతము కూలిపోసాగెను. ఆ గాలుల ఉధృతికి రేగిన దుమ్ము ధ్వజాకారములను దాల్చుచుండెను.

17.6 (ఆరవ శ్లోకము)

ఉద్ధసత్తటిదంభోదఘటయా నష్టభాగణే|

వ్యోమ్ని ప్రవిష్టతమసా న స్మ వ్యాదృశ్యతే పదమ్॥1870॥

మెరుపులు అధికముగా మెరయుచు నవ్వుచున్నట్లు తోచెను. మేఘములు గుంపులు గట్టుచు, దట్టముగా అలముకొనుటవలన ఆకాశమునందు అంతటను చీకట్లు క్రమ్ముకొనెను. సూర్య, చంద్రులు మొదలగు గ్రహములు కాంతులు మసకబారెను. అప్పుడు ఏ వస్తువుగూడ కనబడకుండ అయ్యెను.

17.7 (ఏడవ శ్లోకము)

చుక్రోశ విమనా వార్ధిరుదూర్మిః క్షుభితోదరః|

సోదపానాశ్చ సరితశ్చుక్షుభుః శుష్కపంకజాః॥1871॥

సముద్రము మనఃస్తాపమునకు గుఱియైనట్లుగా అల్లకల్లోలమాయెను. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడసాగెను. అందు నివసించు మొసళ్ళు మొదలగు జలజంతువులు క్షోభకు గురియయ్యెను. వాపీ, కూప, తటాకములు, నదులు కల్లోలితములయ్యెను. సరస్సులయందలి కమలములు వాడిపోవుచుండెను.

17.8 (ఎనిమిదవ శ్లోకము)

ముహుః పరిధయోఽభూవన్ సరాహ్వోః శశిసూర్యయోః|

నిర్ఘాతా రథనిర్హ్రాదా వివరేభ్యః ప్రజజ్ఞిరే॥1872॥

పదేపదే సూర్యచంద్రులచుట్టును అమంగళ సూచకముగా పరివేషములు ఏర్పడెను. రాహుగ్రస్తము లైనట్లుగా సూర్యచంద్రగ్రహణములు ఏర్పడెను. మేఘము లేకుండగనే గర్జనలు వినవచ్చెను. గుహలనుండి రథచక్రధ్వనులవంటి శబ్దములు ఉత్పన్నములయ్యెను.

17.9 (తొమ్మిదవ శ్లోకము)

అంర్గ్రామేషు ముఖతో వమంత్యో వహ్నిముల్బణమ్|

సృగాలోలూకటంకారైః ప్రణేదురశివం శివాః॥1873॥

17.10 (పదవ శ్లోకము)

సంగీతవద్రో దసవదున్నమయ్య శిరోధరామ్|

వ్యముంచన్ వివిధా వాచో గ్రామసింహాస్తతస్తతః॥1874॥

గ్రామములలో తోడేళ్ళు, గ్రుడ్లగూబలు భయంకరముగా అరవసాగెను. నక్కలు ముఖములనుండి మిగుల నిప్పులు గ్రక్కుచు అశుభసూచకముగా కూయదొడంగెను. అక్కడక్కడ కుక్కలు మెడలు పైకెత్తి, ఒక్కొక్కసారి గానమువలె మూల్గుచు,ఏడ్చుచు పలువిధములుగా మొఱగసాగెను.

17.11 (పదునొకండవ శ్లోకము)

ఖరాశ్చ కర్కశైః క్షత్తః ఖురైః ఘ్నంతో ధరాతలమ్|

ఖార్కారరభసా మత్తాః పర్యధావన్ వరూథశః॥1875॥

విదురా! క్రొవ్వెక్కిన గాడిదలు తీక్ష్ణమైన రీతిలో గిట్టలతో భూమిని త్రవ్వుచు భయంకరముగా ఓండ్రపెట్టుచు, గుంపులుగుంపులుగా అటునిటు పరుగెత్తసాగెను.

17.12 (పండ్రెండవ శ్లోకము)

రుదంతో రాసభత్రస్తా నీడాదుదపతన్ ఖగాః|

ఘోషేఽరణ్యే చ పశవః శకృన్మూత్రమకుర్వత॥1876॥

ఓండ్రపెట్టుచున్న గాడిదల అఱపులకు భీతిల్లి పక్షులు తమ గూళ్ళనుండి ఎగిరిపోదొడగెను. కొట్టములలో కట్టివేయబడియున్న, అరణ్యములలో మేతమేయుచున్న పశువులు భయపడి మలమూత్రములను విడచుచుండెను.

17.13 (పదమూడవ శ్లోకము)

గావోఽత్ర సన్నసృగ్దోహాస్తోయదాః పూయవర్షిణః|

వ్యరుదన్ దేవలింగాని ద్రుమాః   పేతుర్వినాఽనిలమ్॥1877॥

ఆ కఠోరధ్వనులకు భీతిల్లిన గోవుల పొదుగుల నుండి పాలకుమారుగా రక్తము స్రవించుచుండెను. మేఘములు చీమును వర్షించుచుండెను. దేవతా విగ్రహముల నేత్రములనుండి కన్నీరు కారుచుండెను. ఎట్టి గాలులను లేకుండగనే పెద్దపెద్ద చెట్లు నేలగూలుచుండెను.

17.14 (పదునాలుగవ శ్లోకము)

గ్రహాన్ పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః|

అతిచేరుర్వక్రగత్యా యుయుధశ్చ పరస్పరమ్॥1878॥

అంగారకాది క్రూర (పాప) గ్రహములు విజృంభించి, గురుశుక్రాది శుభగ్రహములను, నక్షత్రములను అతిక్రమించును, వక్రగతిలో పరస్పర యుద్ధములకు తలపడుచుండెను. 

17.15 (పదునైదవ శ్లోకము)

దృష్ట్వాంన్యాంశ్చ మహోత్పాతానతత్తత్త్వవిదః ప్రజాః|

బ్రహ్మపుత్రానృతే భీతా మేనిరే విశ్వసంప్లవమ్॥1879॥

సనకాదిమహర్షులు దప్ప మిగిలిన ప్రజలు ఇంకను ఇట్టి మహోత్పాతములను గాంచి, మిగుల భీతిల్లిరి. వారు ఈ ఉత్పాతములకుగల కారణములు తెలియక లోకమునకు ప్రళయము సంభవింపబోవుచున్నదని భావించిరి.

17.16 (పదునారవ శ్లోకము)

తావాదిదైత్యౌ సహసా వ్యజ్యమానాత్మపౌరుషౌ|

వవృధాతేఽశ్మసారేణ కాయేనాద్రిపతీ ఇవ॥1880॥

దితియొక్క ప్రథమసంతానమైన ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇనుమువలె కఠినమైన శరీరములతో వృద్ధిచెందుచు మహాపర్వతతుల్యులైరి. వారు అతి శీఘ్రముగా తమ పౌరుషములను ప్రకటింపసాగిరి.

17.17 (పదునేడవ శ్లోకము) 

దిశిస్పృశౌ హేమకిరీటకోటిభిః నిరుద్ధకాష్టౌ స్ఫురదంగదాభుజౌ|

గాం కంపయంతౌ చరణైః పదేపదే కట్యా సుకాంచ్యార్కమతీత్య తస్థతుః॥1881॥

మహోన్నతకాయులైన ఆ హిరణ్యాక్షహిరణ్యకశిపుల యొక్క బంగారు కిరీటములయొక్క అగ్రభాగములు స్వర్గమును స్పృశించుచుండెను. వారి విశాలదేహములు దిగంతముల వరకు వ్యాపించియుండెను. వారి భుజకీర్తుల కాంతులు ధగధగ మెరయుచుండెను. వారు పదేపదే ఒక్కొక్క అడుగు వేయుచున్నప్పుడు భూమి కంపించు చుండెను. వారి కటి ఆభరణముల కాంతులు సూర్యప్రభలను మించి ప్రకాశించుచుండెను. 

17.18 (పదునెనిమిదవ శ్లోకము)

ప్రజాపతిర్నామ తయోరకార్షీత్ యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత|

తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజాః యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః॥1882॥

దితికి జన్మించిన కవలలకు కశ్యపప్రజాపతి నామకరణమొనర్చెను. వారిలో మొదట పుట్టినవాడు హిరణ్యకశిపుడు, తరువాత జన్మించినవాడు హిరణ్యాక్షుడు అని ప్రజలు తెలిసికొనిరి.

17.19 (పందొమ్మిదవ శ్లోకము)

చక్రే హిరణ్యకశిపుర్దోర్భ్యాం బ్రహ్మవరేణ చ|

వశే సపాలాన్ లోకాంస్త్రీనకుతో మృత్యురుద్ధతః॥1883॥

విదురా! హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వరము పొందియున్న కారణముగా మృత్యుభయము లేకుండుచే గర్వోద్ధతుడయ్యెను. అతడు బాహుబలముచే లోకపాలురతో సహా ముల్లోకములను వశపరచుకొనెను.

17.20 (ఇరువదవ శ్లోకము)

హిరణ్యాక్షోఽనుజస్తస్య ప్రియః  ప్రీతికృదన్వహమ్|

గదాపాణిర్దివం యాశో యుయుత్సుర్మృగయన్ రణమ్॥1884॥

అతడు తన తమ్ముడైన హిరణ్యాక్షునిపై మిగుల ప్రేమ కలిగియుండెను. హిరణ్యాక్షుడుగూడ సర్వదా తన అన్నకు ప్రియమును గూర్చుచు మసలుకొనుచుండెను. అతడు  రణకండూతితో గదాపాణియై యుద్ధము చేయగోరి స్వర్గముపై దండెత్తెను.

17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తం వీక్ష్య దుస్సహజవం రణత్కాంచననూపురమ్|

వైజయంత్యా స్రజా జుష్టమంసన్యస్తమహాగదమ్ ॥1885॥

ఆ హిరణ్యాక్షుని వేగము (ఉద్ధృతి) సహింపరానిదై యుండెను. ఆ రాక్షసుని పాదములకుగల బంగారు నూపురముల ధ్వనులు భీకరముగా వినబడుచుండెను. అతడు తన కంఠమున విజయసూచకమైన హారమును, బలిష్ఠమైన భుజమున ఒక మహాగడను ధరించియుండెను.

17.22 (ఇరువది రెండవ శ్లోకము)

మనో వీర్యవరోత్సిక్థమసృణ్యమకుతోభయమ్|

భీతా నిలిల్యిరే దేవాస్తార్ క్ష్యత్రస్తా ఇవాహయః॥1886॥

తన శారీరక, మానసిక బలమువలనను, బ్రహ్మదేవుని వరప్రభావము చేతను గర్వితుడై యుండెను. అతడు నిరంకుశుడై, ఎవనివలనను భయములేనివాడై యుండెను. అతనిని జూచి దేవతలు గరుత్మంతుని గాంచిన సర్పములవలె భయగ్రస్తులై ఎక్కడి వారక్కడ దాగుకొనిరి.

17.23 (ఇరువది మూడవ శ్లోకము)

స వై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్|

సేంద్రాన్ దేవగణాన్ క్షీబానపశ్యన్ వ్యనదద్భృశమ్॥1887॥

అంతట దైత్యరాజైన ఆ హిరణ్యాక్షుడు గర్వితులైయున్న ఇంద్రాదిదేవతలు తన పరాక్రమముముందు నిలువజాలక దాగుకొనియున్నట్లు గమనించెను. పిమ్మట, అతడు వారు ఎవ్వరును అచట కనబడకయుండుటచే భీకరముగా గర్జించెను.

17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తతో నివృత్తః క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనమ్|

విజగాహే మహాసత్త్వో వార్ధిం మత్త ఇవ ద్విపః॥1888॥

మహాబలశాలియైన ఆ రాక్షసుడు అచటినుండి మరలెను. పిదప అతడు జలక్రీడలు సల్పుటకై, మదపుటేనుగువలె అగాధమైన  అలలహోరుతో ఘోషించుచున్న సముద్రముస మునిగెను. 

17.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః యాదోగణాః సన్నధియః ససాధ్వసా|

అహన్యమానా అపి తస్య వర్చసా ప్రధర్షితా దూరతరం ప్రదుద్రువుః॥1889॥

అతడు ఆ సముద్రమున ప్రవేశించినంతనే వరుణుని సైనికులైన జలజంతువులు అతనిని జూచి ధైర్యము సడలి, తొట్రుపాటునకు గురియయ్యెను. అతనివలన ఎట్టి హానియు కలుగకముందే ఆ రాక్షసుని తేజస్సునకు మిగుల భీతిల్లి దూరముగా పారిపోయెను.

17.26 (ఇరువది ఆరవ శ్లోకము)

స వర్షపూగానూదధౌ మహాబలః చరన్మహోర్మీన్ శ్వసనేరితాన్ముహుః|

మౌర్వ్యాభిడజఘ్నే గదయా విభావరీమ్ ఆసేదివాంస్తాత పురీం ప్రచేతసః॥1890॥

మహాబలవంతుడైన ఆ హిరణ్యాక్షుడు పెక్కు సంవత్సరములపాటు ఆ మహాసముద్రమునందే సంచరించెను. అచట తనను ఎదిరించువారు ఎవ్వరును కనబడకుండుటచే వాయువేగమునకు ఎగిసిపడుచున్న తరంగములపై తన ఇనుపగదను పదేపదే త్రిప్పుచు తిరుగసాగెను. క్రమముగా అతడు విభావరి అను పేరుగల వరుణుని నగరమునకు చేరెను.

17.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తత్రోపలభ్యాసురలోకపాలకమ్ యాదోగణనామృషభం ప్రచేతనమ్|

స్మయన్ ప్రలుబ్ధుం ప్రణిపత్య నీచవత్ జగాదమే దేహ్యాధిరాజ సంయుగమ్॥1891॥

అచట పాతాళలోకప్రభువు, జలచరములకు అధిపతియు ఐన వరుణుని అతడు చూచెను. పిమ్మట అతడు (హిరణ్యాక్షుడు) హేళనగా నవ్వుచు, ఒక నీచునివలె నమస్కరించి, వరుణరాజా! నాకు యుద్ధభిక్షను ప్రసాదింపుము (నాతో యుద్ధమొనర్చుము) అనెను.

17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

త్వం లోకపాలోఽధిపతిర్భృహచ్ఛవా వీర్యాపహో దుర్మదవీరమానినామ్|

విజిత్య లోకేఽఖిల దైత్యదానవాన్ యద్రాజసూయేన పురాయజత్ప్రభో॥1892॥

ఇంకను అతడు వరుణునితో ఇట్లనెను- ప్రభూ! నీవు దిక్పాలకుడవు. మిగుల ఖ్యాతివహించిన రాజువు. తమను వీరులుగా భావించుకొనునట్టి మదోన్మత్తులైన రాజులయొక్క మదమును అణచినవాడవు. నీవు పూర్వము లోకమునగల సమస్త దైత్యులను, దానవులను జయించి, రాజసూయయాగమును ఒనర్చినట్లు వినియుంటిని

17.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స ఏవ ముత్సిక్తమదేన విద్విషా దృఢం ప్రలబ్ధో భగవానపాంపతిః|

రోషం సముత్థం శమయన్ స్వయా ధియా న్యవోచదంగోపశమం గతా వయమ్॥1893॥

17.30 (ముప్పదియవ శ్లోకము)

పశ్యామి నాన్యం పురుషాత్పురాతనాత్ యస్సంయుగే త్వాం రణమార్గ కోవిదమ్|

ఆరాధయిష్యత్యసురర్షభేహి తం మనస్వినో యం గృణతే భవాదృశాః॥1894॥

17.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తం వీరమారాదభిపద్య విస్మయః శయిష్యసే వీరశయే శ్వభిర్వృతః|

యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా॥1895॥

మదోన్మత్తుడైన హిరణ్యాక్షుడు తనను గేలిసేయుచు ఇట్లు కవ్వింపగా వరుణదేవుడు తనలో పెల్లుబికిన రోషమును తన బుద్దిబలముచే అణచుకొనుచు అతనితో ఇట్లనెను - సోదరా! ఇప్పుడు నాలో యుద్ధము చేయవలయునను తలంపులేదు. దైత్యరాజా! రణవిద్యలలో ఆఱితేఱిన నిన్ను యుద్ధమున సంతృప్తిపరచుటకు పురాణపురుషుడైన ఆ శ్రీహరి దప్ప మరియొకడు నాకు కనబడుటలేదు. కావున నీవు ఆయనయొద్దకు వెళ్ళుము. అతడు నీ కోర్కెను తీర్చగలడు. నీవంటి వీరులు ఆయన గుణములచే కీర్తించుచుందురు. అతడు గొప్పవీరుడు. ఆయనను చేరినంతనే నీ గర్వమంతయును తొలగిపోవును. రణరంగమున నీవు నేలపాలగుదువు. నీ చుట్టును కుక్కలు చేరును. ఆ పురాణపురుషుడు (శ్రీహరి) నీవంటి దుష్టులను మట్టుబెట్టి సత్పురుషులను కాపాడుటకై పెక్కు అవతారములను దాల్చుచుండును

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే సప్తదశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము - హిరణ్యాక్షుని దిగ్విజయయాత్ర యను పదునేడవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

9.4.2022 ప్రాతఃకాల సందేశము

తృతీయ స్కంధము-పదునెనిమిదవ అధ్యాయము

హిరణ్యాక్షునకును, ఆదివరాహస్వామికిని మధ్య యుద్ధము జరుగుట

మైత్రేయ ఉవాచ

18.1 (ప్రథమ శ్లోకము)

తదేవమాకర్ణ్య జలేశభాషితం మహామనాస్తద్విగణయ్య దుర్మదః|

హరేర్విదిత్వా గతిమంగ నారదాత్ రసాతలం నిర్వివిశే త్వరాన్వితః॥1896॥

మైత్రేయుడు నుడివెను- నాయనా! విదురా! మదోన్మత్తుడైన హిరణ్యాక్షుడు వరుణదేవుని పలుకులను విన్న పిమ్మట తనకు ప్రతియోధుడు లభించుచున్నందులకు మిగుల పొంగిపోయెను. గర్వితుడైయున్న ఆ రాక్షసుడు నీవు అతని చేతిలో మడిసెదవు అను వరుణుని మాటలను సరకు గొనలేదు. పిదప నారదునివలన శ్రీహరియున్న ప్రదేశమును గూర్చి తెలిసికొని, త్వరత్వరగా రసాతలమున ప్రవేశించెను.

18.2  (రెండవ శ్లోకము)

దదర్శ తత్రాభిజితం ధరాధరం ప్రోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా| 

ముష్ణంతమక్ష్ణా స్వరుచోఽరుణశ్రియా జహాస చాహో వనగోచరో మృగః॥1897॥

అచ్చట విశ్వవిజేతయైన యజ్ఞవరాహమూర్తి తన కోరలపై పృథ్విని ధరించి తీసికొనిపోవుచుండగా అతడు చూచెను. ఆ యజ్ఞవరాహమూర్తి ఎరుపెక్కియున్న తన చూపులతో హిరణ్యాక్షుని తేజస్సును హరించివేసెను. అప్పుడు ఆ దైత్యుడు ఈ అడవి మృగము నీటియందు ఉన్నదేమి? అను భావముతో పరిహాసమును ప్రకటించెను.

18.3 (మూడవ శ్లోకము)

ఆ హైనమేహ్యజ్ఞ మహీం విముంచ నో రసౌకసాం విశ్వసృజేయమర్పితా|

న స్వస్తి యాస్యస్యనయా మమేక్షతః సురాధమాసాదితసూకరాకృతే॥1898॥

అంతట ఆ దైత్యుడిట్లనెను - మూర్ఖుడా! భూమిని వదలి ఇటు రమ్ము. విశ్వసృష్టికర్తయైన బ్రహ్మదేవుడు ఈ భూమిని రసాతలవాసులమైన మాకు అప్పగించెను. సూకరాకృతిని  దాల్చిన సురాధమా! నేను చూచుచుండగా ఈ భూమిని దీసికొని వెళ్ళజాలవు.

18.4 (నాలుగవ శ్లోకము)

త్వం నః సవత్నైరభవాయ కిం భృతో యో మాయయా హంత్యసురాన్ పరోక్షజిత్|

త్వాం యోగమాయాబలమల్పపౌరుషం సంస్థాప్య మూఢ ప్రమృజే సుహృచ్ఛుచః॥1899॥

మూఢుడా! నీవు మాయలు పన్ని కపటనాటకములతో దైత్యులను జయించి, వధించుచుందువు. మాకు శత్రువులైన దేవతలు మమ్ములను నశింపజేయుటకే నిన్ను పోషించుచున్నారు కాబోలు. నీకు యోగమాయా బలమే బలము. నీవు సహజముగా బలహీనుడవు. నేడు నేను నిన్ను తుదముట్టించి, నా బంధువుల దుఃఖాశ్రువులను తుడిచెదను.

18.5 (ఐదవ శ్లోకము)

త్వయి సంస్థితే గదయా శీర్ణశీర్షణ్యస్మద్భుజచ్యుతయా యే చ తుభ్యమ్|

బలిం హరంత్యృషయో యే చ దేవాః స్వయం సర్వే న భవిష్యంత్యమూలాః॥1900॥

ఓయీ! నా చేతి గదాప్రహారము ధాటికి నీ శిరస్సు వ్రక్కలైపోగా నీవు ప్రాణములను కోల్పెయదవు. అంతట నిన్ను ఆరాధించెడి దేవతలు, ఋషులు వ్రేళ్ళతో పెకలింపబడిన వృక్షములవలె నశింతురు

18.6 (ఆరవ శ్లోకము)

స తుద్యమానోఽరిదురుక్తతోమరైః దంష్ట్రాగ్రగాం గాముపలక్ష్య భీతామ్

తోదం మృషన్నిరగాదంబుమధ్యాత్ గ్రాహాహతః సకరేణుర్యథేభః॥1901॥

హిరణ్యాక్షుడు ఈ విధముగా తన దుర్భాషలనెడి చిల్లకోలపోట్లతో బాధించుచుండెను. కానీ, భగవంతుడు తన కోరలపైనున్న భూదేవి భీతిల్లుచుండుటనుజూచి, ఆ దైత్యుని దుర్భాషలను ఓర్చుకొనెను. పిమ్మట, ఒక మొసలిచే దెబ్బతినిన గజరాజు ఆడు ఏనుగుతో సహా బయటికి వచ్చినట్లుగా, ఆ ప్రభువు జలములనుండి బహిర్గతుడయ్యెను.

18.7 (ఏడవ శ్లోకము)

తం నిస్సరంతం సలిలాదనుద్రుతో హిరణ్యకేశో ద్విరదం యథా ఝషః|

కరాలదంష్ట్రోఽశనినిస్వనోఽబ్రవీత్ గతహ్రియాం కిం త్వసతాం   విగర్హితమ్॥1902॥

భగవంతుడు అతని దుర్భాషలకు ఎట్టి ప్రత్యుత్తరము ఈయకుండా జలములనుండి బయటికి వచ్చెను. ఇప్పుడు భయంకరమైన దంతములుగల  హిరణ్యాక్షుడు ఒక మొసలి, ఏనుగు వెంటపడినట్లు ఆ స్వామిని వెంబడించెను. పిమ్మట ఆ దైత్యుడు నీవు సిగ్గువిడిచి పారిపోవుచున్నావా? లజ్జావిహీనులు పారిపోవుటలో వింత ఏమున్నది? అని వజ్రతుల్యమైన కఠోరవచనములు పలికెను.

18.8 (ఎనిమిదవ శ్లోకము)

స గాముదస్తాత్సలిలస్య గోచరే విన్యస్య తస్యామదధాత్స్వమ్|

అభిష్టుతో విశ్వసృజా ప్రసూనైః ఆపూర్యమాణో విబుదైః పశ్యతోఽరేః॥1903॥

ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని (భూదేవిని) జలములపైన అనుకూలమగు స్థానమునందు  (అందరికిని కనబడు ప్రదేశమున) ఉంచెను. ఆ భూమియందు తన ఆధారశక్తిని నిలిపెను. (భగవానుడు తన ఆధారశక్తిని స్వయంగా భూమియందు నిక్షేపించెను. అందుకే ఆ భూమి నీటిపై నిలవగలిగినది. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా| పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః॥ పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకలభూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై - అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులకు అన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను- భగవద్గీత గీత. 15.13). అప్పుడు హిరణ్యాక్షుడు చూచుచుండగనే ఆ ప్రభువును  బ్రహ్మదేవుడు ప్రస్తుతించెను, దేవతలు ఆయనను పూలతో ముంచెత్తిరి🙏🙏🙏.

18.9 (తొమ్మిదవ శ్లోకము)

పరానుషక్తం తపనీయోపకల్పం మహాగదం కాంచనచిత్రదంశమ్|

మర్మాణ్యభీక్ష్ణం ప్రతుదంతం దురుక్తైః ప్రచండమన్యుః ప్రహసంస్తం బభాషే॥1904॥

అప్పుడు హిరణ్యాక్షుడు చిత్రవిచిత్రముగా నున్న ఒక బంగారు కవచమును ధరించియుండెను. అతడు స్వర్ణమయమైన ఒక గదను చేబూని ఆ స్వామిని వెంబడించుచుండెను. మరియు ఆ ప్రభువుయొక్క మర్మస్థానములలో గ్రుచ్చుకొనునట్లు పరుషోక్తులతో పదేపదే నొప్పించుచుండెను. అందులకు శ్రీహరి తనలో పెల్లుబుకుచున్న కోపమును బయల్పడనీయక నవ్వుచు ఆ దైత్యునితో ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

18.10 (పదియవ శ్లోకము)

సత్యం వయం భో వనగోచరా మృగా యుష్మద్విధాన్ మృగయే గ్రామసింహాన్|

న మృత్యుపాశైః ప్రతిముక్తస్య వీరాః వికత్థనం తవ గృహ్ణంత్యభద్ర॥1905॥

భగవానుడు ఇట్లు పలికెను- ఓరీ దుష్టరాక్షసుడా! వాస్తవముగా నీవు నుడివినట్లు  మేము వనములలో సంచరించెడి ప్రాణులమే. మీవంటి గ్రామసింహాలను (కుక్కలను) చంపుటకై వెదకుచుందుము. మృత్యువు దాపురించిన నీవంటివారియొక్క బీరములను వీరులు పట్టించుకొనరు.

18.11 (పదునొకండవ శ్లోకము)

ఏతే వయం న్యాసహరా రసౌకసాం గతహ్రియో గదయా ద్రావితాస్తే|

తిష్డామహేఽథాపి కథంచిదాజౌ స్థేయం క్వ యామో బలినోత్పాద్య వైరమ్॥1906॥

సరే! ఓరీ! నిజముగా మేము నీవంటి రసాతలవాసుల సొత్తును హరించువారమే. యదార్థముగా నీ గదధాటికి నిలువజాలక పారిపోవుచున్నామని అనుకొనుచుంటివా? నీవంటి సాటిలేని వీరునిముందు నిలిచి యుద్ధము చేయగల సామర్థ్యము మాకు ఎక్కడిది? నీ వంటి బలశాలితో వైరము పెంచుకొని మేము ఎక్కడికి వెళ్ళగలము. ఐనను, నిన్ను ఎదుర్కొని యుద్ధము చేయుటకు సన్నద్ధులమై యున్నాము.

18.12 (పండ్రెండవ శ్లోకము)

త్వం పద్రథానాం కిల యూథపాధిపో ఘటస్వ నోఽస్వస్తయ ఆశ్వనూహః|

సంస్థాప్య చాస్మాన్ ప్రమృజాశ్రు స్వకానాం యః స్వాం ప్రతిజ్ఞాం నాతిపిపర్త్యసభ్యః॥1907॥

నీవు పదాతి వీరులలో ప్రముఖుడవటగదా! కనుక, ఏమాత్రమూ సంకోచింపక శీఘ్రముగా మమ్ము దెబ్బతీయుటకు ప్రయత్నింపుము. మమ్ము హతమార్చి నీ ఆత్మీయుల కన్నీళ్ళను తుడువుము. లోకములో తన ప్రతిజ్ఞను చెల్లించుకొనలేనివాడు పనికిమాలినవాడేగదా!

మైత్రేయ ఉవాచ

18.13 (పదమూడవ శ్లోకము)

సోఽధిక్షిప్తో భగవతా ప్రలబ్దశ్చ రుషా భృశమ్|

ఆజహరోల్బణం క్రోధం క్రీడ్యమానోఽహిరాడివ॥1908

మైత్రేయుడు నుడివెను- భగవంతుడు ఈ విధముగా క్రోధముతో నర్మగర్భవచనములతో అధిక్షేపించుచు హిరణ్యాక్షుని గేలిచేసెను. అంతట ఆ దైత్యుడు వినోదార్థమై ఆడింపబడుచున్న మహాసర్పమువలె మిగుల క్రోధోద్రిక్తుడయ్యెను.

18.14 (పదునాలుగవ శ్లోకము)

సృజన్నమర్షితః శ్వాసాన్మన్యుప్రచలితేంద్రియః|

ఆసాద్య తరసా దైత్యో గదయాభ్యహనద్ధరిమ్॥1909॥

అప్పుడు ఆ దైత్యుడు క్రోధాతిరేకముతో బుసలుకొట్టసాగెను. కన్నులు ఎర్రవారెను. మనస్సు మండిపోవుచుండెను. శరీరము  అంతయు వణకిపోవుచుండెను. ఆ ఆవేశములో అతడు భగవంతుని సమీపించి,తన  గదతో తీవ్రముగా కొట్టెను. 

18.15 (పదునైదవ శ్లోకము)

భగవాంస్తు గదావేగం విసృష్టం  రిపురోణసి|

అవంచయత్తిరశ్చీనో యోగారూఢ ఇవాంతకమ్॥1910॥

అంతట ఆ యజ్ఞవరాహమూర్తి శత్రువుచే బలముగా విసరబడిన గదాప్రహారమును, యోగసిద్ధి పురుషుడు మృత్యువునువలె, ప్రక్కకు తిరిగి తప్పించుకొనెను.

18.16 (పదునారవ శ్లోకము)

పునర్గదాం స్వామాదాయ భ్రామయంతమభీక్ష్ణశః|

అభ్యధావద్ధరిః క్రుద్ధః సంరంభాద్దష్టదచ్ఛదమ్॥1911॥

అప్పుడు ఆ దైత్యుడు క్రుద్ధుడై పటపట పండ్లు గొరకుచు గదను మరల మరల త్రిప్పసాగెను. అంతట శ్రీహరి కుపితుడై వానిమీదకు విజృంభించెను. 

18.17 (పదునేడవ శ్లోకము)

తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః|

అజఘ్నే స తు తాం సౌమ్య గదయా కోవిదోఽహనత్॥1912॥

సాధుపురుషుడవైన విదురా! అనంతరము ఆ యజ్ఞవరాహమూర్తి తన గదచే శత్రువుయొక్క కుడి కనుబొమమీద దెబ్బతీసెను. కానీ, గదాయుద్ధమున కుశలుడైన హిరణ్యాక్షుడు తన గదతో (శ్రీహరి గదాఘాతము తనపై పడకముందే) ఆయన గదపై కొట్టెను.

18.18 (పదునెనిమిదవ శ్లోకము) 

ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ|

జిగీషయా సుసంరబ్ధావన్యోన్యమభిజఘ్నతుః॥1913॥

ఇట్లు శ్రీహరియు, హిరణ్యాక్షుడును క్రోధావేశపరులై జయేచ్ఛతో పరస్పరము బలమైన గదలతో మోదుకొనసాగిరి. 

18.19 (పందొమ్మిదవ శ్లోకము)

తయోః స్పృధోస్తిగ్మగదాహతాంగయోః క్షతాస్రవఘ్రాణవివృద్ధమన్వ్యోః|

విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయా వ్యభాదిలాయామివ శుష్మిణోర్మృధః॥1914॥

ఆ ఉభయులును భూమికొరకై ఒకరిని మఱియొకరు జయింపగోరుచు, వివిధ గతులలో తిరుగుచు మిగుల పట్టుదల వహించి, బలమైన గదలతో కొట్టుకొనుచుండిరి. వారి గదాప్రహారములకు ఇద్దరి అవయవములును మిక్కిలి గాయపడుచుండెను. ఆ గాయములనుండి స్రవించుచున్న రక్తపువాసనలకు వారిలో కోపము ఇనుమడించుచుండెను. ఈ విధముగా వారు ఆవు కొరకై పోట్లాడుకొను ఆబోతులవలె గెలుపుకొరకై యుద్ధమొనర్చిరి. వారి ద్వంద్వయుద్దము ఎంతో గొప్పగా ప్రకాశించుచుండెను.

18.20 (ఇరువదియవ శ్లోకము)

దైత్యస్య యజ్ఞావయవస్య మాయాగృహీతవారాహతనోర్మహాత్మనః|

కౌరవ్య మహ్యాం ద్విషతోర్విమర్దనం దిధృక్షురాగాదృషిభిర్వృతః స్వరాట్॥1915॥

విదురా! తన మాయద్వారా వరాహరూపమును ధరించిన యజ్ఞస్వరూపుడైన శ్రీహరికిని అద్భుతమగు హిరణ్యాక్షునకును భూతలము కొరకై బద్ధవైరముతో యుద్ధము  కొనసాగుచుండెను. భయంకరమైన వారి గదా యుద్ధమును దర్శించుటకై బ్రహ్మదేవుడు ఋషులతోగూడి అచటికి ఏతెంచెను.

18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఆసన్న శౌండీరమ  పేతసాధ్వసం కృతప్రతీకారమహార్యవిక్రమమ్|

విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీః జగాద నారాయణమాదిసూకరమ్॥1916॥

 ఆ హిరణ్యాక్షుడు గొప్ప శూరుడు, వీరుడు. అతనిలో భయము  ఇసుమంతయును లేదు. ఎంతటి బలశాలితోనైనను పోటీపడుటలో అతను సమర్థుడు. అతని పరాక్రమమును రూపుమాపుట మిక్కిలి కష్టము. వేలకొలది మహర్షులతో పరివృతుడైయున్న బ్రహ్మదేవుడు ఆ దైత్యుని జూచిన పిమ్మట ఆదివరాహమూర్తియైన శ్రీహరితో ఇట్లు పలికెను-.

బ్రహ్మోవాచ

18.22 (ఇరువది రెండవ శ్లోకము)

ఏష తే దేవ  దేవానామంఘ్రిమూలము పేయుషామ్

విప్రాణాం సౌరభేయీణాం భూతనామప్యనాగసామ్॥1917॥

18.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఆగస్కృద్భయకృద్దు ష్కృదస్మద్రాద్ధవరోఽసురః|

అన్వేషన్నప్రతిరథో లోకానటతి కంటకః॥1918॥

బ్రహ్మదేవుడు నుడివెను- దేవదేవా! ఈ దుష్టుడు నా వలన వరమును పొందిన బలశాలి. వరగర్వితుడు. నీ పాదములను శరణుజొచ్చిన దేవతలను, భూసురోత్తములను, గోవులను, నిరాపరాధులైన తదితరులను హింసించుచున్నాడు. వారిని భీతిల్లజేయుచున్నాడు. ఇతనికి సాటియైన వీరుడు మరియొకడు ఎవడును లేడు. ఇతడు లోకకంటకుడై, తనను ఎదుర్కొనగల ప్రతియోధునికొఱకై అన్వేషించుచు సకలలోకములలోను సంచరించుచు తిరుగుచున్నాడు.

18.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

మైనం మాయావినం దృప్తం నిరంకుశమసత్తమమ్|

ఆక్రీడ బాలవద్దేవ యథాఽఽ శీవిషముత్థితమ్॥1919॥

సర్వేశ్వరా! ఈ దుష్టుడు గొప్ప మాయావి. గర్వోన్మత్తుడు. అదుపులేని మదపుటేనుగు వంటివాడు, పడగవిప్పిన పాముతో బాలుడు ఆడినట్లుగా నీవు ఈ దైత్యునితో ఆడుకొనవలదు.


18.25 (ఇరువది ఐదవ శ్లోకము)

న యావదేష వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణం|

స్వాం దేవ మాయామాస్థాయ తావజ్జహ్యఘనుచ్యుత॥1920॥

దేవా! అచ్యుతా! ఇతడు భయంకర రాక్షసుడు. సంధ్యాసమయము అయినచో రాక్షసులబలము హెచ్చగును. కనుక, సంధ్యావేళ కాకముందే నీవు నీ యోగమాయను స్వీకరించి, ఈ పాపాత్ముని చంపివేయుము.

18.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ఏషా ఘోరతమా సంధ్యా లోచ్ఛంబట్కరీ ప్రభో|

ఉపసర్పతి సర్వాత్మన్ సురాణాం జయమానసా॥1921॥

ప్రభూ! సంధ్యాసమయము. మిగుల భయంకరమైనది. లోకవినాశకారి. ఆవేళ సమీపించుచున్నది. పరమాత్మా! ఈ లోపలనే అతనిని తుదముట్టించి దేవతలకు జయమును చేకూర్చుము.

18.27 (ఇరువది ఏడవశ్లోకము)

అధునైషోఽభిజిన్నామ యోగో మౌహూర్తికో హ్యగాత్|

శివాయ నస్త్వం సుహృదామాశు నిస్తర దుస్తరమ్॥1922॥

పరమపురుషా! ఇది అభిజన్ముహూర్త సమయము. మిగుల శుభప్రదమైనది. నిన్ను శరణు జొచ్చియున్న మా అందరికిని క్షేమము కలుగుటకై వెంటనే దుర్జయుడైన ఈ హిరణ్యాక్షుని హతమార్చుము.

18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయమాసాదితః స్వయమ్|

విక్రమ్యైనం మృధే హత్వా లోకానాధేహి శర్మణ్॥1923॥

స్వామీ! ఈ రాక్షసుని పాలిట మృత్యుదేవతవు నీవే. ఆ భాగ్యవశమున (విధివశమున) అతడే స్వయముగా కాలస్వరూపుడైన నిన్ను వెదకికొసుచు నీ కడకు వచ్చినాడు. యుద్ధమున నీవు పరాక్రమించి, ఇతనిని అంతమొందింపుము. ఆ విధముగా లోకములకు శాంతిని ప్రసాదింపుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  అష్టాదశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు హిరణ్యాక్షునకును, ఆదివరాహస్వామికిని మధ్య యుద్ధము జరుగుట యను పదునెనిమిదవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

[8:33 pm, 09/04/2022] +91 95058 13235: 9.4.2022 సాయంకాల సందేశము

తృతీయ స్కంధము-పందొమ్మిదవ అధ్యాయము

హిరణ్యాక్షుని వధ

మైత్రేయ ఉవాచ

19.1 (ప్రథమశ్లోకము)

అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః|

ప్రహస్య ప్రేమగర్భేణ తదపాంగేన సోఽగ్రహీత్॥1924॥

మైత్రేయుడు వచించెను- విదురా! నిర్మలమైన అమృతతుల్యములగు బ్రహ్మదేవుని వచనములను ఆలకించి, యజ్ఞవరాహమూర్తి ఆయనయొక్క అమాయకత్వమునకు నవ్వి, తన వాత్సల్యపూరితములైన కటాక్షములతో ఆయన ప్రార్థనను అంగీకరించెను.

19.2 (రెండవ శ్లోకము)

తతస్సపత్నం ముఖతశ్చరంత మకుతోభయమ్|

జఘనోత్పత్య గదయా హనావసురమక్షణః॥1925॥

19.3 (మూడవ శ్లోకము)

సా హతా తేన గదయా విహతా భగవత్కరాత్|

విఘూర్జితాపతద్రేజే  తదద్భుతమివాభవత్॥1926॥

అనంతరము శ్రీమహావిష్ణువు విజృంభించి, తన యెదుట నిర్భయముగా తిరుగుచున్న శత్రువుయొక్క దవుడపై శ్రీహరి తన గదతో కొట్టెను. పిదప ఆ ఇరువురి గదలు పరస్పరము కొట్టుకొనుచుండగా మహాధ్వని ఉప్పతిల్లెను. అప్పుడు శ్రీహరి చేతిలోని గద గిరగిర తిరుగుచు జారిపడి ప్రకాశించెను. ఈ విధముగ ఆ ప్రభువు గద క్రిందపడుట అక్కడ ఉన్నవారందరికి ఆశ్చర్యమును కలిగించెను.

19.4 (నాలుగవ శ్లోకము)

స తదా లబ్ధతీర్థోఽపి న బబాధే నిరాయుధమ్|

మానయన్ స మృధే ధర్మం విష్వక్సేనం ప్రకోపయన్॥1927॥

గద జారిపోవుటతో నిరాయుధుడైయున్న శ్రీహరిపై దెబ్బతీయుటకు అవకాశము చిక్కినను హిరణ్యాక్షుడు యుద్ధ ధర్మమును అనుసరించి, ఆ స్వామిపై దాడికి దిగలేదు. ఆ ప్రభువు కోపముతో రెచ్చిపోవుటకై ఆ దైత్యుఢు అట్లొనర్చెను.

19.5 (ఐదవ శ్లోకము)

గదాయామపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే|

మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరద్విభుః॥1928॥

యజ్ఞవరాహమూర్తి చేతినుండి గద జారిపోగా అంతట హాహాకారములు చెలరేగెను. అప్పుడు ఆ పురుషోత్తముడు దైత్యుని ధర్మబుద్ధిని మెచ్చుకొనుచు తన సుదర్శన చక్రమును స్మరించెను.

19.6 (ఆరవ శ్లోకము)

తం వ్యగచక్రం దితిపుత్రాధమేన స్వపార్షదముఖ్యేన విషజ్జమానమ్|

చిత్రా వాచోఽతద్విదాం ఖేచరాణాం తత్రాస్మాసన్  స్వస్తి   తేఽముం జహీత్॥1929॥

విదురా! వెంటనే భీకరమైన సుదర్శనచక్రము భగవంతుని చేతికి చేరి తిరుగసాగెను. కానీ, ఆ పరమాత్మ తన ముఖ్యపార్షదుడు (పూర్వజన్మలో జయవిజయులలో ఒకడు. అప్పుడు పార్షదుడుగా ఉండి శ్రీమహావిష్ణువును సేవించినవాడు) ఇప్పుడు దైత్యాధముడు ఐన హిరణ్యిక్షునితో ఇంకను లీలగా కొంత సేపు యుద్ధము చేయసాగెను. అప్పుడు ఆ స్వామి యొక్క మహత్త్వమును ఎరుగక అక్కడున్న దేవతలు అందరును ప్రభూ! నీకు జయమగుగాక! ఇంకను వీనితో  వినోదింపకుము. శీఘ్రముగా వీనిని హతమార్చుము అని చిత్రముగా పలుసాగిరి.

19.7 (ఏడవ శ్లోకము)

స తం నిశామ్యాత్తరథాంగమగ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనమ్|

విలోక్యచామర్షపరిప్లుతేంద్రియో రుషా స్వదంతచ్ఛదమాదశచ్ఛ్వసన్॥1930॥

అంతట కమలాక్షుడైన శ్రీహరి చతుర్భుజరూపముతో చక్రధారియై హిరణ్యాక్షునిముందు నిలిచెను. అప్పుడు ఆ స్వామిని చూచినంతనే ఆ దైత్యునియొక్క ఇంద్రియముల క్షోభకు గురియయ్యెను. అతడు మిగుల క్రుద్ధుడై దీర్ఘనిశ్వాసములను విడుచుచు పండ్లు పటపట కొరుకసాగెను.

19.8 (ఎనిమిదవ శ్లోకము)

కరాళదంష్ట్రశ్చక్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివ|

అభిప్లుత్య స్వగదయా హతోఽసీత్యాహనిద్ధరిమ్॥1931॥

పిదప భయంకరమైన కోరలుగల ఆ రాక్షసుడు తన చూపులతో దహించివేయుచున్నవానివలె చూచుచు ఆ స్వామిపై విజృభించి, ఓయీ! ఇప్పుడు నా చేతిలో నీకు మరణము తప్పదు అని పలుకుచు తన గదతో శ్రీహరిని కొట్టెను.

19.9 (తొమ్మిదవ శ్లోకము)

పదా సవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞసూకరః|

లీలయా మిషతః శత్రోః ప్రాహరద్వాతరంహసమ్॥1932॥

19.10 (పదవ శ్లోకము)

ఆహ చాయుధమాధత్స్వ ఘటస్వ త్వం జిగీషసి|

ఇత్యుక్తః స తదా భూయస్తాదయన్ వ్యనదద్భృశమ్॥

సాధుస్వభావముగల విదురా! యజ్ఞవరాహమూర్తియైన ఆ శ్రీహరి తనయెడ వైరభావముతో నున్న హిరణ్యాక్షుడు చూచుచుండగనే వాయువేగముతో వచ్చుచున్న అతని గదను తన యెడమ పాదముతో అవలీలగా తన్నెను. పిమ్మట ఆ స్వామి- ఓరీ! నీవు నన్ను జయింపదలచినచో, ఆయుధమును చేబూని, ఎదుర్కొనుము అని పలికెను. అంతట ఆ దైత్యుడు తన గదను ఆ ప్రభువుపై విసిరి,  భీకరముగా గర్జింపసాగెను.

19.11 (పదునొకండవ శ్లోకము)

తాం స ఆపతతీం వీక్ష్య భగవాన్ సమవస్థితః|

జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగీమ్॥1934॥

అప్పుడు భగవంతుడు తనవైపు దూసికొనివచ్చుచున్న ఆ గదను చూచి, ఏమాత్రము చలింపక, గరుత్మంతుడు ఆడుపామునివలె దానిని అవలీలగా పట్టుకొనెను.

19.12 (పండ్రెండవ శ్లోకము)

స్వ పౌరుషే ప్రతిహతే హతమావో మహాసురః|

నైచ్ఛద్గదాం దీయమానాం హరిణా విగతప్రభః॥1935॥

తన కార్యము పూర్తిగా విఫలమగుటవలన ఆ మహాదైత్యుని గర్వము అణగిపోయెను. అతని ముఖము వెలవెలబోయెను. అప్పుడు శ్రీహరి ఆ దైత్యునకు గదను తిరిగి యిచ్చినను, అతడు దానిని తీసికొనుటకు ఇష్టపడలేదు.

19.13 (పదమూడవ శ్లోకము)

జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్జ్వలనలోలుపమ్|

యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్ యథా॥1936॥

మూర్ఖుడు బ్రహ్మవేత్తయైన విప్రోత్తమునిపై నిష్ఫలమారణయోగమును ప్రయోగించినట్ల, ఆ హిరణ్యాక్షుడు ఆ యజ్ఞపురుషునిపై ఒక త్రిశూలమును ప్రయోగించెను. అది ఎదుటివానిని మ్రింగుటకై నాల్కలు సాచియున్న అగ్నిప్రభలతో విరాజిల్లుచుండెను.

19.14 (పదునాలుగవ శ్లోకము)

తదోజసా దైత్యమహాభటార్పితం చకాస దంతః ఖ ఉదీర్ణదీధితి|

చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథా తార్ క్ష్యపతత్త్రముజ్ ఝితమ్॥1937॥

దైత్యప్రముఖుడైన హిరణ్యాక్షునిచే బలముకొలది ప్రయోగింపబడిన ఆ త్రిశూలముయొక్క కాంతులు ఆకాశమున మిఱుమిట్లు గొల్పసాగెను. దానిని శ్రీహరి పదునైన అంచులుగల చక్రముతో ఛేదించెను. అది పూర్వము గరుత్మంతునిచే విడువబడిన ఈకను ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఖండించినట్లుగా ఉండెను. ( పూర్వము ఒకానొకప్ఫుడు గరుత్మంతుడు తన తల్లికి దాస్యవిముక్తి కలిగించుటకై దేవతలనుండి అమృత కలశమును దీసికొని పోవుచుండెను.అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును ఆయనపై ప్రయోగించెను. ఆ వజ్రాయుధము యొక్క గౌరవమును నిలుపుటకై వైనతేయుడు తన ఱెక్కలోని ఒక ఈకను విడిచి పెట్టెను. వజ్రాయుధము ఆ ఈకను ఖండించెను)

19.15 (పదునైదవ శ్లోకము)

వృక్ణే స్వశూలే బహుధారిణా హరేః ప్రత్యేత్య విస్తీర్ణములో విభూతిమత్|

ప్రవృద్ధరోషః స కఠోరముష్టినా నదన్ ప్రహృత్యాంతరధీయతాసురః॥1938॥

తన త్రిశూలము శ్రీమహావిష్ణువు యొక్క చక్రధాటికి  ముక్కలైపోవుటను చూచి, హిరణ్యాక్షుడు మిగుల క్రుద్ధుడాయెను. పిమ్మట, అతడు శ్రీహరిని సమీపించి శ్రీవత్సచిహ్నముచే శోభిల్లుచున్న ఆయన విశాల వక్షస్థలముపై బలమైన పిడికిలితో కొట్టెను. పిదప, బిగ్గరగా గద్దించుచు అతడు అంతర్ధానమాయెను.

19.16 (పదునారవ శ్లోకము)

తేనేత్థమాహతః క్షత్తర్భగవానాదిసూకరః|

నాకంపత మనాక్ క్వాపి న్రజా హత ఇవ ద్విపః॥1939॥

విదురా! అప్పుడు యజ్ఞవరాహమూర్తి ఆ దైత్యుని పిడికిలి పోటునకు, పూలమాల దెబ్బకు మదపుటేనుగువలె ఏమాత్రము చలింపలేదు.

19.17 (పదునేడవ శ్లోకము)

అథోరుధాసృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ|

యాం విలోక్య ప్రజాస్త్రస్తా మేనిరేఽస్యోపసంయమమ్॥1940॥

మహామాయావియైన ఆ దైత్యుడు యోగమాయా పతియైన శ్రీహరిపై పెక్కుమాయలను ప్రయోగింపసాగెను. వాటిని జూచిన ప్రజలు మహాప్రళయము రాబోవుచున్నది అని తలంచి మిగుల భీతిల్లిరి.

19.18 (పదునెనిమిదవ శ్లోకము)

ప్రవపుర్వాయవశ్చండాస్తమః పాంసవమైరయన్|

దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహితా ఇవ॥1941॥

అప్పుడు ప్రచండవాయువులు వీచెను. ఆ సుడిగాలుల ప్రభావమున పైకెగసిన దుమ్ముచే అన్ని దిక్కులయందును అంధకారము వ్యాపించెను. క్షిపణులచే ప్రయోగింపబడినట్లు వడగండ్ల వర్షము కురిసెను.

19.19 (పందొమ్మిదవ శ్లోకము)

ద్యౌర్నష్టభగణాభ్రౌఘైః స విద్యుత్ స్తనయిత్నుభిః|

వర్షద్భిః పూయకేశాసృగ్విణ్మూత్రాస్థీని చాసకృత్॥1942॥

మెఱపులతో, ఉఱుములతో గూడిన మేఘములు నిరంతరము చీము, రక్తము, కేశములు, మలమూత్రములు, ఎముకలు మొదలగునవి అపవిత్ర వస్తువులను వర్షింపసాగెను. మేఘాచ్ఛాదితమైన ఆకాశమునందు సూర్యచంద్రాది గ్రహములు, నక్షత్రములు కనబడకుండపోయెను.

19.20 (ఇరువదవ శ్లోకము)

గిరయః ప్రత్యదృశ్యంత నానాయుధముచోఽనఘ|

దిగ్వాససో యాతుధాన్యః శూలిన్యో ముక్తమూర్ధజాః॥1943॥

పుణ్యమూర్తివైన విదురా! పర్వతములు వివిధములగు అస్త్రశస్త్రములను ప్రయోగించుచున్నట్లు కనబడెను. రాక్షసస్త్రీలు దిగంబరులై కన్పట్టిరి. వారు కేశములను విరబోసికొని, శూలములను చేబూనియుండిరి. 

19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

బహుభిర్యక్షవక్షోభిః పత్త్యశ్వరథకుంజరైః|

ఆతతాయిభిరుత్సృష్టా హింస్రా వాచోఽతివైశసాః॥1944॥

క్రూరాత్ములైన పెక్కుమంది యక్షులు, రాక్షసులు,  పదాతిదళములవారు, అశ్వములను, రథములను, గజములను అధిరోహించియున్న సైనికులు చంపుడు నరకుడు అను అత్యుగ్రములైన పలుకులతో ఒప్పుచున్న కోలాహలము వినబడసాగెను.

19.22 (ఇరువది రెండవ శ్లోకము)

ప్రాదుష్కృతానాం మాయానామాసురీణాం వినాశయత్|

సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుఙ్త్క దయితం త్రిపాత్॥1945॥

ఆవిధముగా ప్రకటితములైన ఆసురీమాయలను నాశనమొనర్చుటకై యజ్ఞవరాహమూర్తియైన శ్రీహరి తనకు అత్యంత ప్రియమైన సుదర్శన చక్రమును ప్రయోగించెను.

19.23 (ఇరువది మూడవ శ్లోకము)

తదా దితేః సమభవత్సహసా హృది వేపథుః|

స్మరంత్యా భర్తురాదేశం స్తనాచ్చాసృక్ప్రసుస్రువే॥1946॥

ఆ సమయమున దితికి తన పతి చెప్పిన విషయము స్మృతికి రాగా గుండె దడదడ కొట్టుకొనెను. స్తనములనుండి రక్తము స్రవించెను. 

19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవమ్|

రుషోపగూహమానోఽముం దదృశేఽవస్థితం బహిః॥1947॥

తన మాయలన్నియును వ్యర్థముకాగా ఆ హిరణ్యాక్షుడు మరల పురుషోత్తముని సమీపించెను. పిమ్మట అతడు రోషావేశముతో ఆ ప్రభువును తన బాహువుల మధ్య చేర్చుకొని నలిపివేయ ప్రయత్నించెను. కానీ! అంతట పరికించి చూడగా ఆ స్వామి అతని బాహువులమధ్యలేక బయటనే ఉండెను.

19.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారైరధోక్షజః|

కరేణ కర్ణమూలేఽహన్ యథా త్వాష్ట్రం మరుత్పతిః॥1948॥

అనంతరము ఆ దైత్యుడు శ్రీహరిని పిడిగుద్దులతో బాధింపసాగెను. అప్పుడు ఇంద్రుడు వృత్రాసురునివలె శ్రీహరి హిరణ్యాక్షునియొక్క కణతపై (చెవియొక్క ఆయువుపట్టుపై) చేతితో కొట్టెను.

19.26 (ఇరువది ఆరవ శ్లోకము)

స ఆహతో విశ్వజితా హ్యవజ్ఞయా పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచనః|

విశీర్ణబాహ్వంఘ్రిశిరోరుహాఽపతత్ యథా నగేంద్రో లులితో నభస్వతా॥1949॥

విశ్వవిజేతయైన శ్రీమహావిష్ణువు, హేళనపూర్వకముగా ఆ రాక్షసుని కొట్టినంతనే అతడు గిరగిర తిరుగుచు (దిమ్మతిరిగి) నేలపై పడిపోయెను. గ్రుడ్లు తేలవేసెను. అతని కాలుసేతులు, కేశములు చిన్నాభిన్నములయ్యెను. అంతట అతడు మహావాయువులధాటికి పెనువృక్షమువలె నేలపాలయ్యెను.

19.27 (ఇరువది ఏడవ శ్లోకము)

క్షితౌ శయానం తమకుంఠవర్చసం కరాళదంష్ట్రం పరిదష్టదచ్ఛదమ్|

అజాదయో వీక్ష్య శశంసురాగతాః అహో ఇమాం కో ను లభేత సంస్థితమ్॥1950॥

అచటికి చేరియున్న బ్రహ్మాదిదేవతలు నేలపై పడియున్న ఆ రాక్షసుని కళేబరమును జూచిరి. అతడు తన భయంకరములైన కోరలతో క్రింది పెదవిని అదిమిపట్టుకొని యుండెను. అసువులను కోల్పోయియున్నను అతని వర్చస్సు ఏమాత్రమూ సన్నగిల్లలేదు. అప్పుడు వారు శ్రీమన్నారాయణుని చేతిలో మృతుడగుట నిజముగా ఇతని అదృష్టము. ఇట్టి మరణము ఎవరికి లభించును? అని ప్రశంసింపదొడగిరి.

19.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

యం యోగినో యోగసమాధినా రహో ధ్యాయంతి లింగాదసతో ముముక్షయా|

తస్యైష దైత్యఋషభః పదాహతో ముఖం ప్రపశ్యంస్తనుముత్ససర్జ హ॥1951॥

19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ఏతౌ తౌ పార్షదావస్య శాపాద్యాతావసద్గతిమ్|

పునః కతిపయైః స్థానం ప్రపత్స్యేతే హ జన్మభిః॥1952॥

యోగిపుంగవులు జననమరణ రూప సంసారచక్రము నుండి విముక్తులు అగుటకై యోగసమాధిద్వారా ఏకాంతమున భగవంతుని దివ్యరూపమును ధ్యానించుచుందురు. అట్టి పరమాత్ముని పాదాహతికి (పాదస్పర్శకు) నోచుకోని, ఈ దైత్యుడు ఆనందముతో తనువును త్యజించెను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు భగవంతునియొక్క పార్షదులు శాపవశమున వీరికి అధోగతి ప్రాప్తించెను. కొన్ని జన్మల తరువాత వీరు మరల స్వస్థానమైన వైకుంఠమును చేరుకొందురు.

దేవా ఊచుః

19.30 (ముప్పదవ శ్లోకము)

నమో నమస్తేఽఖిలయజ్ఞతంతవే స్థితౌ గృహీతామలసత్త్వమూర్తయే|

దిష్ట్యా హతోఽయం జగతామరుంతుదః త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః॥1953॥

దేవతలు పలికిరి-దైత్యుడు నిహతుడగుటచూచి, దేవతలు  శ్రీహరిని ఇట్లు స్తుతించిరి- పరమపురుషా! నీకు శతాధిక నమస్కారములు. నీవు సకల యజ్ఞములకును ప్రవర్తకుడవు. జగద్రక్షణకై శుద్ధసత్త్వస్వరూపమును స్వీకరించినవాడవు. మా అదృష్టవశమున మర్మవేధకుడు, జగత్కంటకుడు ఐన ఈ దుష్టుడు నీచే నిహతుడయ్యెను. సర్వేశ్వరా! నీ పాదములయందుగల భక్తితో మేము సకలసుఖశాంతులను పొందితిమి.

మైత్రేయ ఉవాచ

19.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ఏవం హిరణ్యాక్షమసహ్యవిక్రమం స సాదయిత్వా హరిరాదిసూకరః|

జగామ లోకం స్వమఖండితోత్సవం సమీడితః  పుష్కరవిష్టరాదిభిః॥1954॥

మైత్రేయుడు నుడివెను- ఆదివరాహమూర్తియైన ఆ శ్రీహరి తిరుగులేని పరాక్రమముగల హిరణ్యాక్షుని ఇట్లు హతమార్చెను. అప్పుడు బ్రహ్మాదిదేవతలు స్తుతించుచుండగా శ్రీమన్నారాయణుడు అఖండానందమయమైన తన వైకుంఠలోకమునకు చేరెను.

19.32 (ముప్పది రెండవ శ్లోకము)

మయా యథానూక్తమవాది తే  హరేః కృతావతారస్య సుమిత్ర చేష్టితమ్|

యథా హిరణ్యాక్ష ఉదారవిక్రమో మహామృధే క్రీడనవన్నిరాకృతః॥1955॥

సహృదయ మిత్రమా! విదురా! మహాపరాక్రమశాలియైన శ్రీమన్నారాయణుడు పెక్కు అవతారములను దాల్చి అనేక లీలలను నెరపెను. భీషణసంగ్రామమున ఆ శ్రీహరి హిరణ్యాక్షుని విలాసముగా హతమార్చెను. నేను ఈ వృత్తాంతములను అన్నింటిని గురుముఖతః వినియుంటిని. వాటిని అదే క్రమములో నీకు వివరించితిని

సూత ఉవాచ

19.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఇతి కౌషారవాఖ్యాతామాశ్రుత్య భగవత్కథామ్|

క్షత్తాఽఽనందం పరం లేభే మహాభాగవతో ద్విజ॥1956॥

సూతుడు వచించెను - బ్రాహ్మణోత్తమా! శౌనకా! మైత్రేయమహర్షి హృదయంగమముగా వివరించిన భగవంతుని కథలను విని, భాగవతోత్తముడైన విదురుడు పరమానందమున ఓలలాడెను.

14.12.2019   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

తృతీయ స్కంధము-పందొమ్మిదవ అధ్యాయము

హిరణ్యాక్షుని వధ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

19.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అన్యేషాం పుణ్యశ్లోకానాముద్దామయశసాం సతామ్|

ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః॥1957॥

వాసిగాంచిన సత్పురుషులకు ఇతర పుణ్యాత్ములగాథలను విన్నంతనే మహానందము కలుగుచుండును. ఇక జగద్రక్షకుడైన శ్రీనివాసునియొక్క మహిమాన్విత కథలను వినుటవలన కలిగెడి పరమానందమును గూర్చి చెప్పనేల?

19.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యో గజేంద్రం ఝషగ్రస్తం ధ్యాయంతం చరణాంబుజమ్|

క్రోశంతీనాం కరేణూనాం కృచ్ఛ్రతోఽమోచయత్ ద్రుతమ్ ॥1958॥

19.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తం సుఖారాధ్యమృజుభిరనన్యశరణైర్నృభిః|

కృతజ్ఞ కో న సేవేత దురారాధ్యమసాధుభిః॥1959॥

ఒకానొకప్పుడు ఒక సరస్సునందు మొసలి ఒక మదపుటేనుగు పాదమును నోటితో గట్టిగా పట్టుకొనెను. అప్పుడు గజరాజు ఆ మొసలి పట్టునుండి విడుపించుకొనలేక బాధనుండి బయటపడుట కొరకై శరణాగతరక్షకుడైన శ్రీహరిని ధ్యానింపసాగెను. ఆ గజేంద్రుని భార్యలైన ఆడు ఏనుగులు తమ పతియొక్క దుస్థితిని జూచి విలవిలలాడుచు వారి మొరను ఆలకించి, వెంటనే మొసలి పట్టునుండి గజేంద్రుని రక్షించెను. దిక్కులేని దీనుల మొరలను ఆలకించి వారి ఆర్తులను రూపుమాపుటలో శ్రీహరి పరమదయాళువు. కృతజ్ఞులైన సద్వర్తనులకు అతడు సుఖారాధ్యుడు. అసాధువులైన కృతఘ్నులకు ఆ పరమపురుషుడు దురారాధ్యుడు. ఆ కరుణామయుని ఎవరు సేవింపకుందురు?

19.37 (ముప్పది ఏడవ శ్లోకము)


యో వై హిరణ్యాక్షవధం మహాద్భుతం విక్రీడితం కారణసూకరాత్మనః|

శ్రుణోతి గాయత్యనుమోదతేఽంజసా విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః॥1960॥

శౌనకాది మునులారా! పృథ్విని  ఉద్ధరించుటకై శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహరూపమును దాల్చి లోకకంటకుడైన హిరణ్యాక్షుని వధించి, లోకములను కాపాడెను. ఆ పురుషోత్తముని అద్భుతలీలలను వర్ణించినట్టి ఈ దివ్యగాథను వినువారు, కీర్తించువారు, ఆనందించువారు బ్రహ్మహత్యవంటి ఘోరపాపములనుండి సులభముగా విముక్తులగుదురు.

19.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఏతన్మహాపుణ్యమలం పవిత్రం  ధన్యం యశస్యం పదమాయురాశిషామ్|

ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నారాయణోఽంతే గతిరంగ శ్రుణ్వతామ్॥1961॥

విదురా! ఈ వృత్తాంతము మిగుల పుణ్యప్రదము, పరమపవిత్రము. ధనమును, యశస్సును ప్రాప్తింపజేయును.  ఆయుర్వృద్ధికరము. సకల మనోరథములను ఈడేర్చునట్టిది. యుద్ధములయందు ప్రాణములకును, ఇంద్రియములకును శక్తిని పెంపొందింప జేయును. దీనిని భక్తిశ్రద్ధలతో వినినవారు శ్రీమన్నారాయణుని సన్నిధిని చేరుకొందురు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే  ఏకోనవింశోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment