Sunday, 10 April 2022

100-

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*101వ నామ మంత్రము* 5.4.2022

*ఓం మణిపూరాంతరుదితాయై నమః*

బ్రహ్మగ్రంథి భేదన మనంతరము, మూలాధారస్వాధిష్ఠానములకు ప్రతీకయై దశదళములుగలిగి జలతత్త్వాత్మకముతో నాభిస్థానము నందుండు మణిపూరక చక్రమునందు వివిధ రకముల మణులతో సమయాచారులచే పూజలందుకొనుచూ తేజరిల్లుచున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మణిపూరాంత రుదితా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మణిపూరాంతరుదితాయై నమః*  అని ఉచ్చరించుచూ అత్యంత భక్తప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సర్వాభీష్టసిద్ధిని పొంది ధన్యుడగును.

మూలాధారమునందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని సాధకుడు తన యోగదీక్షతో జాగృతమొనర్చగా, సుషుమ్నా మార్గములో ఊర్ధ్వముఖముగా పయనించుచూ స్వాధిష్ఠానము దాటి బ్రహ్మగ్రంథిని భేదించి మణిపూరక చక్రమునందు కుండలినీ శక్తిని ప్రవేశింపజేయును.

మూలాధార చక్రము నాలుగు దళముల పద్మము. స్వాధిష్ఠాన చక్రము  ఆరుదళముల పద్మము. మణిపూరకచక్రము మూలాధారస్వాధిష్ఠాన చక్రములకు ప్రతీకగా పదిదళములుండును. మణిపూరక చక్రం నాభిస్థానము నందుండును. నాభిస్థానము అంటే తల్లీ బిడ్డల భౌతిక బంధమునకు ప్రతీక. అందుచేత పిండోత్పత్తి, గర్భస్థ శిశువు అభివృద్ధిచెందు గర్భాశయముకూడా ఇచ్చటనే ఉండును. గర్భస్థ శిశువు తొమ్మిదినెలల ఎదుగుదల మణిపూరక చక్రము వల్లనే జరుగుతుంది.  ఇచ్చట కుండలినీ శక్తిరూపిణియైన శ్రీమాత సమయాచారులనుండి వివిధ రకముల మణులచే పూజలందు కొనును. మణిపూరక చక్రము పంచభూతాత్మక తత్త్వములలో అగ్నితత్త్వమా లేక జలతత్త్వమా అన్నది రెండు విభన్న వాదనలు ఉన్నమాట వాస్తవమే. కాని ఇక్కడ ఆది శంకరుల ఈ క్రింది సౌందర్యలహరిలో 9వశ్లోకం తీసుకుంటే జలతత్త్వముగానే  భావించవలెను. కాని మణిపూరక చక్రము పదిదళములతో మూలాధార(4)+ స్వాధిష్ఠానముల (6) సంకేతముగా ఉన్నది గనుక స్వాధిష్ఠానము యొక్క అగ్నితత్త్వం కూడా కొందరు జోడించి మణిపూరక చక్రమునకు అగ్ని మరియు జలతత్త్వములను చెపుతారు.

సౌందర్యలహరి 9వ శ్లోకము.

*మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం*

*స్థితం స్వధిష్టానే - హృది మరుత మాకాశ ముపరి |*

*మనో‌உపి భ్రూమధ్యే -  సకలమపి భిత్వా కులపథం*

*సహస్రారే పద్మే - స హరహసి పత్యా విహరసే ||*

అమ్మా..మూలాధార చక్రమందలి భూతత్వాన్ని దాటి , *మణిపూరక చక్రం లోని జలతత్వాన్ని దాటి*, *స్వాదిష్ఠాన చక్రంలోని అగ్నితత్వాన్ని* అధిగమించి,అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని దాటి,విశుద్ద చక్రంలోని ఆకాశతత్వాన్ని దాటి, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని దాటి, సుషుమ్నా మార్గమును ఛేదించి అలా పైకి ప్రయాణించి, సహస్రార పద్మంలో నీ భర్త అయిన పరమశివునితో కలసి సదా విహరించుచున్నావు.

(పంచభూతముల వరుస *పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్* అన్న ఆధారంతో ఆ తత్వముల వరుసతో ఇచట చక్రములను చూపుట జరిగినది. అసలు *మూలాధార,స్వాధిష్ఠాన,మణిపూరక,అనాహత,విశుద్ధ, ఆజ్ఞా* చక్రముల వరుసక్రమంలో  అమ్మ మన శరీరంలో గుద లింగ,మధ్యస్థానాల్లో మూడు చక్రాలు, హృదయ, కంఠ, భ్రూమధ్య స్థానాల్లో మూడు చక్రాలు మొత్తం ఆరు చక్రముల పైన, బ్రహ్మరంధ్ర ప్రదేశములో ఉన్న సహస్రారచక్రంలో అమ్మ శివునితో కలసి విహరించుచుండును.

మణిపూరక చక్రము సోమసూర్యాగ్నుల గుణం గలిగి ఉండడం చేత మణిలాగ ప్రకాశిస్తుంది గనకు మణిపూరక చక్రమని పేరు గలదని భావించవచ్చు.

పంచభూతాలలో మొదటిది పృథివీ తత్త్వము. ఇది మూలాధారము, పృథివీ తత్త్వాత్మకమైనది. రెండవది జలతత్త్వము, మణిపూరక చక్రము జలతత్త్వము గలది. అందుచే పంచభూతాల వరుసలో రెండవది మణిపూరక చక్రము అవుతుంది కాని షట్చక్రముల వరుసలో (సుషుమ్నా మార్గము వరుసలో)  మూడవది.

సమయాచారులు చతుర్విధైక్యసంధానము చేసినవారికి జగన్మాత చతుర్భుజగాను, షడ్విధైక్య సంధానము చేసినవారికి దశభుజగాను దర్శనమిస్తుంది.

చతుర్విధైక్యము, షడ్విధైక్యముల వివరణకు *సమయాచార తత్పరా*(98వ నామ మంత్రము చూడగలరు).

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలాధారైక నిలయాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*102వ నామ మంత్రము* 6.4.2022

*ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః*

సృష్ట్యాది రూప బ్రహ్మగ్రంథి భేదనము తరువాత మణిపూర చక్రమునందు సమయాచారులచే వివిధ రకములైన మణులచే పూజలనందుకొని, మణిపూరచక్రమునకు పైనగల జీవభావ విష్ణుగ్రంథిని భేదించి సాధకునికి స్థూలము వలె సూక్ష్మము కూడా అనిత్యమనే జ్ఞానమును కలిగించు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన జగన్నాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విష్ణుగ్రంథి విభేదినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లికరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను సంప్రాప్తము చేసికొని, భౌతిక పరమైన సుఖసంతోషములతోబాటు ఆధ్యాత్మికానందమును కూడా పొందును.

విష్ణుగ్రంథి మణిపూర అనాహత చక్రములకుపైన గలదు. ఇంతకు ముందు బ్రహ్మగ్రంథి భేదనమయినది. బ్రహ్మగ్రంథి పంచకోశములలో భౌతికత్వము కలిగి యున్న అన్నమయ కోశము మరియు స్థూల శరీరములకు సంబంధించినది. బ్రహ్మగ్రంథి భేదనముతో బుద్ధిని ఆవహించియున్న మాయ తొలగును. భౌతిక ప్రపంచమంతా మాయ అనియు, ఈ పాంచభౌతిక శరీరము అనిత్యమనియు, నిత్యమైన పరబ్రహ్మము వేరొకటి ఉందని తెలుస్తుంది. స్థూలశరీరంలోనే భౌతికత్వమున కన్నా మిన్నయైన సూక్ష్మశరీరం ఉన్నది. పంచకోశములలో ప్రాణమయ, మనోమయ, విజ్ఞానకోశములకు సంబంధించినదే విష్ణుగ్రంథి. 

బ్రహ్మగ్రంథి భేదనమునకు ముందు ఈ శరీరం నాది, ఈ స్థూల శరీరం నుండి పుట్టిన సంతానము, ఈ స్థూల శరీరంకోసం దగ్గర అయిన భార్య అందరూ తన వారని, వారికి ఏవేవో ఏర్పరచాలని, ఇంకేవోవో తెచ్చి ఇవ్వాలని అనిపిస్తుంది. తన వారిపై మమకారం కూడా నిశ్చలంగా ఉంటుంది. బ్రహ్మగ్రంథి భేదనముతో ఆ మాయ పొరలు వీడి సూక్ష్మశరీర జ్ఞానం ఏర్పడుతుంది. 

విష్ణుగ్రంథి భేదనముతో సూక్ష్మశరీరం కన్నా ఇంకేదో కారణ శరీరంగలదని తెలుస్తుంది. అంతవరకూ ఉన్న అరిషడ్వర్గములన్నియు వడగట్టబడి తనలో ఆత్మానందం కలుగుతుంది. అదే శాశ్వతమనియు, సత్యమనియు తెలిసి పరబ్రహ్మానంద భూతమయిన  కారణ శరీరం వేరొకటి గలదనే సత్యం తెలుస్తుంది. విష్ణుగ్రంథి భేదనతో తనవలననే ఈ జగత్తు నడుస్తోంది అనే భావన నశిస్తుంది. అహంకారం, అజ్ఞానం పోతాయి. విష్ణుగ్రంథి భేదనతో మాయ తొలగి జగన్మాత అనుగ్రహానికి చేయవలసిన విధుల అన్వేషణ ప్రారంభిస్తాడు.  జ్ఞానబోధ కొరకు సరైన గురునికోసం అన్వేషణలో నిమగ్నమౌతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*103వ నామ మంత్రము* 7.4.2022

*ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః*

భ్రూమధ్యము నుండి శరీర మందలి అన్ని భాగములకు ఆజ్ఞలు జారీ చేయునదియు, ఇడ-పింగళ-సుషుమ్నా నాడుల సంగమము మరియు శబ్దోత్పత్తి జరుగు స్థానమును, ఓఢ్యాణపీఠము మరియు ప్రయాగ క్షేత్రము అనబడినదియు, ద్విదళ కమలము అయిన ఆజ్ఞాచక్రము మధ్యలో ఉన్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆజ్ఞా చక్రాంతరాళస్థా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే ఆత్మానందానుభూతిని పొంది తరించును.

ఆజ్ఞాచక్రము భ్రూమధ్యమున అనగా కనుబొమల మధ్యగలదు. ఆజ్ఞాచక్రము ద్విదళ పద్మము. గురుస్థానము. శరీరములోని అన్నిభాగములకు వలసిన ఆజ్ఞలను  జారీచేయు గురువు ఉండే చోటు. మూలాధారాది చక్రములయందు దీక్షతో, మనసును నిమగ్నముచేసి సాధనచేసి కుండలినీ శక్తిని ఆజ్ఞాచక్రమునందు ప్రవేశపెడితే *ఆ* (కొంచము) *జ్ఞా* (జ్ఞానము) సంప్రాప్తమవుతుంది అనగా జ్ఞానస్పర్శను పొందును. ఆజ్ఞాచక్రము శబ్దోత్పత్తి స్థానము. సుషుమ్నా (కుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము చేరు మార్గము) మరియు ఇడ-పింగళ నాడుల సంగమస్థానము. ఇక్కడ సుషుమ్న మరియు ఇడ-పింగళ నాడుల సంగమ స్థానమును గంగ-యమున-సరస్వతీ నదుల సంగమస్థానముగా చెబుతూ  ప్రయాగ క్షేత్రమనికూడా అన్నారు. ఆజ్ఞాచక్రమునకు ఓఢ్యాణపీఠమని కూడా పేరు గలదు. ఇక్కడ జగన్మాత ఓఢ్యాణబంధంలో (ఎడమ మోకాలు ఎడమ చంకలో ఉంచి) కూర్చునే స్థితిలో ఉంటుంది గనుక ఆజ్ఞాచక్రమును *ఓఢ్యాణపీఠము* అని అన్నారు.  సులువుగా అర్థమయేలా చెప్పాలంటే ఇంచుమించుగా వేమన మహాకవి కూర్చున్న విధానమును ఓఢ్యాణబంధం అంటారు. *ఓఢ్యాణపీఠస్థానం* శ్రీచక్రంలోని కేంద్రస్థానంలో ఉంటుంది.

379వ నామ మంత్రము *ఓఢ్యాణపీఠనిలయా*  శ్రీచక్రంలోని కేంద్రస్దానంలో ఓఢ్యాణపీఠమందు శ్రీమాత ఉన్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*104వ నామ మంత్రము* 8.4.2022

*ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః*

హృదయంలోని అనాహతచక్రానికి చెందిన రుద్రగ్రంథులను భేదించి తద్ద్వారా సాధకునికి లయాదులు తొలగింపజేసి, సహస్రారంలో చిదానంద స్థితిని అనుగ్రహించు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రుద్రగ్రంథి విభేదినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరీ ఆరాధనలో నిమగ్నమైన భక్తునకు బుద్ధివికాసము, వివేకోదయంగలిగి ఆత్మానందానుభూతిని పొందును.

హృదయమునందు గల అనాహతచక్రమునకు సంబంధించిన రెండు గ్రంథులు గలవు. వీటికే రుద్రగ్రంథులు అనిపేరు. 

బ్రహ్మగ్రంథియందు బ్రహ్మ, విష్ణుగ్రంథి యందు విష్ణువు, ఈ రుద్రగ్రంథి యందు రుద్రుడు అధిష్టానులై ఉంటారు. రుద్రుడు లయకారకుడు. రుద్రగ్రంథి ఛేదనముతో సర్వమూ లయంచేసి కుండలినీ శక్తిస్వరూపిణి అయిన శ్రీమాత సాధకునికి అమృతత్త్వాన్ని ప్రసాదింపజేస్తుంది.

శ్రీవిద్యా మంత్రమయిన షోడశాక్షరిలో పదహారు బీజాక్షరములుండును. పంచదశీ మంత్రము పదిహేను అక్షరములయితే ఆ మంత్రానికి చివర *శ్రీం* బీజము చేర్చబడితే ఆ మంత్రం షోడశాక్షరీ మంత్రం అవుతుంది. 

పంచదశీ మంత్రములో

1) వాగ్భవకూటము, 2) కామరాజకూటము, 3) శక్తికూటము

పంచదశీ మంత్రానికి చివర *శ్రీం* బీజం చేర్చితే పదహారక్షరముల (షోడశాక్షరీ) మంత్రమవుతుంది.

*షోడశాక్షరీ మంత్రమునుకు చిన్నవివరణ*

మన్మథుడు ఉపాసించిన పంచదశీ మంత్రమునకు చివర *శ్రీం* చేర్చిన అది షోడశి అవుతుంది.

పంచదశి 

*క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం* 

*షోడశి*

షోడశి రెండ విధాలు. ఒకటి పంచదశికి చివరలో *శ్రీం* చేరిస్తే షోడశి అవుతుంది. 

*క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం* (పదహారు బీజాక్షరములు.)

రెండోరకం ఉంది అందులో ఇరువది ఎనిమిది బీజాక్షరాలుంటాయి. అందులోనూ పంచదశి ఒక భాగమే కాని మొత్తం పంచదశిని మూడు కూటాలుగా చేసి ఒక్కొక్క కూటమిని ఒక్కొక్క బీజాక్షర సమానంగా పరిగణిస్తారు.  ఇంకా పదిహేను బీజాక్షరాలు వెనుక ముందు ఉంటాయి. 

అది ఎలాగ అంటే: *శ్రీం హ్రీం క్లీం ఐం సౌః* అనునవి శక్తి ప్రణవాలు. వీటినే పంచప్రణవములు అంటారు.

1. *శ్రీం హ్రీం క్లీం ఐం సౌః* అను ఈ పంచప్రణవములకు *ఓం హ్రీం శ్రీం*  అను మూడు బీజాక్షరములను చేర్చగా ఎనిమిది బీజాక్షరములు ఔతాయి.

2. పిదప పంచదశిలోని మొదటి కూటమి ఐన *క ఏ ఈ ల హ్రీం* చేర్చవలెను. (ఈ ఐధు బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను)

3. తదుపరి పంచదశిలోని రెండవ కూటమి అయిన *హ స క హ ల హ్రీం* చేర్చవలెను (ఈ ఆరు బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను).

4. తరువాత పంచదశిలోని మూడవ కూటమి అయిన *స క ల హ్రీం* చేర్చవలెను (ఈ నాలుగ బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను).

5. పంచప్రణవములను *(శ్రీం హ్రీం క్లీం ఐం సౌః)* విలోమముగా అనగా (చివరినుండి మొదటికి) *సౌః ఐం క్లీం హ్రీం శ్రీం* చేర్చవలెను.

అలా చేర్చితే షోడశి ఈ విధంగా ఏర్పడుతుంది.

*శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం* (ఇవి ఎనిమిది బీజాక్షరములు)

*క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం|* (ఈ మూడు కూటములను *మూడు బీజాక్షరములు* గా భావించవలెను)

*సౌః ఐం క్లీం హ్రీం శ్రీం॥* (ఇవి ఐదు బీజాక్షరములు)

అలా అయితే ప్రారంభంలో ఎనిమిది (8), మధ్యలో పంచదశి మూడుకూటములు మూడు బీజాక్షరములు (3), చివరలో విలోమముగా చెప్పిన పంచ ప్రణవములు ఐదు (5)

అంటే షోడశీ మంత్రానికి రెండు విధములు ఒకే విధముగా   8 + 3 + 5 = 16 బీజాక్షరములు ఉండును. అలాకాకుండా విడిగా తిలకిస్తే ఇరువది ఎనిమిది (28) అక్షరములు  ఉండును.

*శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం|*

*క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం|* *సౌః ఐం క్లీం హ్రీం శ్రీం॥* 

*మహాషోడశి*

రెండవ పద్ధతిలో చెప్పిన ఇరువది ఎనిమిది (28) బీజాక్షరముల షోడశికి ముందు *ఓం* చివర *నమః* చేరిస్తే అది 30 బీజాల మహా షొడశి ఔతుంది.

*ఓం*

*శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం|*

*క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం|* *సౌః ఐం క్లీం హ్రీం శ్రీం*

*నమః* (ఇది మహా షోడశి)

ఈ ప్రక్రియను మొత్తం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ పరమేశ్వరి కరుణ నిశ్చయంగా సంప్రాప్తమౌతుంది అనడానికి సందేహంలేదు.

షోడశి మంత్రంలోని పదహారు బీజాక్షరములకు, ప్రతి బీజాక్షరములోను శివశక్తులు ఇమిడి  ఉంటాయి. అనగా పదహారు బీజాక్షరములు పదహారు జతలు చూడగా ముప్పది రెండు ఔతుంది. ఈ ముప్పది రెండు అమ్మవారి నోటిదంతములు. శుద్ధవిద్యాంకురములు. షోడశీమంత్రస్వరూపిణి అయిన అమ్మవారు మనకు గోచరిస్తుంది. 

*శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా* అను ఇరువది ఐదవ (25వ) నామ మంత్రము జ్ఞప్తికి వస్తుంది.

ఈ షోడశాక్షరీ మంత్రములో  నాలుగుకూటములు (ఖండములుగా) ఉన్నవి. అవి 1) ఆగ్నేయము (అగ్ని), 2) సౌరము(సూర్య), 3) సౌమ్య, 4) చంద్రకళ అని పేర్లు గలవు. వీటికే  1) వాగ్భవకూటము, 2) కామరాజకూటము, 3) శక్తికూటము, 4) తురీయాకూటము అని పేర్లు గలవు. ఈ నాలుగు కూటములలో మొదటి మూడింటికి హృల్లేఖలు ( *హ్రీం* - బీజము) గలవు. ఈ మూడు హృల్లేఖలే మూడు గ్రంథులు. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ మూడింటిని కుండలినీ శక్తి రూపంలో జగన్మాత భేదించుతోంది అంటే ఆ ముడిని (గ్రంథిని) ఛేదిస్తూ అందులోకి ప్రవేశిస్తుంది. 

దత్తాత్రేయ సంహితలో చతుర్థప్రకరణములో షట్చక్రములకు కులమనియు, మరియు వీనిలో మూడు దేవీ చక్రములు గలవు. ఆ మూడింటినే బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులని అందురు. బ్రహ్మగ్రంథికి గల రెండు చక్రములు ఒకటి పృథివీ రూపము, రెండవది జలరూపము, ఆ పైన గల విష్ణుగ్రంథికి గలదు. ఆ విష్ణుగ్రంథికి గల రెండుచక్రములకు ఒకటి వహ్నిమయ చక్రము,  సూర్యమయ చక్రము, తేజోమయ చక్రములు గలవు ఇవి సకల సిద్ధులను కలిగించును.  తరువాత రుద్రగ్రంథి గలదు. ఈ రుద్రగ్రంథికి ఆకాశరూప, వాయురూపచక్రములు గలవు. బ్రహ్మగ్రంథిని భేదించితే సృష్టిజన్మాదులను, విష్ణుగ్రంథిచే జీవద్దశ, రుద్రగ్రంథిచే లయాదులు నశించి, సహస్రారము చేరినంతనే చిదానంద స్థితిని కలుగ జేయును. ఇది యోగసాధకులకు మాత్రమే సాధ్యము. అందుకే గ్రంథిభేదనము చేసిన యోగులను  దర్శించితే పుణ్యం కలుగుతుంది. వారిని స్పర్శిస్తే పాపప్రక్షాళనమౌతుంది.

ఇంతవరకూ *నిద్రావస్థ* లో నున్న కుండలినీ శక్తి *ప్రయాణావస్థ* లో రుద్రగ్రంథి ఛేదనముతో సహస్రారంలో శివునితో చేరి *సుఖావస్థ* కు చేరుతుంది 

అట్టి కుండలినీ స్వరూపిణికి నమస్కరించునపుడు *ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[09/04, 04:08] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*105వ నామ మంత్రము* 9.4.2022

*ఓం సహస్రారాంబుజారూఢాయై నమః*

బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులను ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారము అను వేయిరేకుల కమలమునధిష్ఠించియున్న కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సహస్రారాంబుజారూఢా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సహస్రారాంబుజారూఢాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత నిష్ఠాగరిష్ఠుడై ఉపాసించు సాధకుడు నిజంగా పునర్జన్మరహితుడౌతాడు. ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.

సాధకుడు తన గురువు నుండి సంప్రాప్తము చేసుకున్న అద్భుత యోగా శక్తితో, అత్యంత నిష్ఠతో  మూలాధారము నందు నిద్రావస్థయందున్న కుండలినీశక్తి స్వరూపిణి అయిన జగన్మాతను జాగృతము చేసి, సుషుమ్నా మార్గంలో ఇడ, పింగళ నాడులిరువైపుల ఉండి చైతన్యమును మరింత ఇనుమడింప జేస్తూంటే పంచభూతాత్మకమైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ చక్రములను దాటుకుంటూ, బ్రహ్మ,విష్ణు,రుద్రగ్రంధులను ఛేదించుకొని, ఆజ్ఞాచక్రమునకావల గల సహస్రారమునకు చేర్చును.

సహస్రారము అనునది చక్రము అంటారు కాని, సహస్రార పద్మము అనడమే సరైనది. ఎందుకంటే సహస్రారము అష్టదళ పద్మము. ఆ అష్టదళములకు ఒక్కొక్క దళమునందు మరల నూట ఇరువదిఐదు చొప్పున  రేకులు ఉంటాయి. ఆవిధంగా ఒక్కొక్క దళమునకు నూటఇరువది  ఐదు అయితే ఎనిమిది దళములకు వెయ్యి దళములు ఉంటాయి. అంటే సహస్రారము వేయిదళముల పద్మము. ఈ సహస్రదళ పద్మము బ్రహ్మరంధ్రమునకు కొంచము దిగువలో ఉంటుంది. ఈ సహస్రారము పౌర్ణమి చంద్రునివలె ప్రకాశిస్తూ చల్లని కాంతికిరణములు సూర్యకిరణములవలె ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ సహస్రారంలో కళంకరహితుడైన చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రమండలం మధ్య గల త్రికోణం ఒక మహాశూన్యమువలె ఉండగా ఆ శూన్యంలో పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుని వద్దకు కుండలినీశక్తి స్వరూపిణియైన శ్రీమాత చేరుతుంది. వేయిరేకుల సహస్రకమలమును సహస్రారము అంటాము. అటువంటి సహస్రారంలో దేవి, పరమేశ్వరునితో కలసి ఉంటుంది గనుక *సహస్రారాంబుజారూఢా* అనగా వేయిదళములు గలిగిన సహస్రదళ కమలమునందు శ్రీమాత ఉంటున్నది అని అర్థము. ఈ  సహస్రారము ఒక పద్మము అనిఅన్నాంగదా!  ఇది ఒక విజ్ఞానప్రకాశ ప్రసారకేంద్రము. ఎప్పుడైతే శ్రీమాత కుండలినీ శక్తిరూపంలొ ప్రవేశించినదో అంతటితో సాధకుడు ఒక మహాయోగి అయితీరుతాడు. బ్రహ్మజ్ఞానముచే ప్రకాశిస్తాడు. బ్రహ్మానందమును పొందుతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సహస్రారాంబుజారూఢాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

106వ నామ మంత్రము 10.4.2022

ఓం సుధాసారాభివర్షిణ్యై నమః

యోగసాధనా ప్రక్రియలో షట్చక్రములను ప్రచోదనము చేస్తూ, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను ఛేదిస్తూ బ్రహ్మరంధ్రమునకు దిగువభాగంలో గల సహస్రారకమలంలో, చంద్రమండలమందు ప్రవేశించినతోడనే ఆహ్లాదకరమైన అమృత (సుధా) ధారలను కురిపించి షట్చక్రములను, గ్రంథిత్రయమును, సమస్తనాడీ మండలమును  ఆ అమృతధారలలో తడిపి సాధకుని పరిపూర్ణమైన ఆత్మానందమును అనుభవింపజేయు కుండలినీ శక్తి రూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుధాసారాభివర్షిణీ అను ఎనిమిదక్షరముల నామ మంత్రమును ఓం సుధాసారాభివర్షిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆత్మానందానుభూతిని పొంది అమృతత్త్వ స్థితికి చేరుకుని జన్మరాహిత్యం పొందగలడను సంతృప్తి కలిగి ఉంటాడు.

సాధకుడు తన యోగసాధనా ప్రక్రియలో మూలాధారమందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను జాగృతముచేసి సుషుమ్నా మార్గంలో షట్చక్రములను సందర్శింపజేస్తూ, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ సహస్రారకమలమును చేర్చుతాడు. సహస్రారకమల కర్ణిక అంతయు చంద్రమండలము. అంతయు హిమవన్నగమంతటి శీతలస్థితిలో ఉంటుంది. చంద్రుడు సుధాకరుడు గదా. అక్కడ ఉన్న సుధాసాగరమంతయు ఘనీభవించిన స్థితిలో ఉంటుంది. సాధకుడు ప్రవేశపెట్టిన కుండలినీ శక్తి అగ్నితత్త్వము అయిన కారణముచే అక్కడ ఘనస్థితిలోనున్న సుధాసాగరము  ద్రవిస్తుంది. అమృత ధారలు ఎడతెగకుండా జాలువారుతూ ఉంటాయి.  ఈ సుధా (అమృత) ధారలు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత అడుగు పెట్టుటతోడనే సుధాధారలు వృష్టిగా  కురిసిన కారణంచేత జగన్మాత సుధాసారాభివర్షిణీ అని అన్నాము. సాధకుడు మూలాధారం నుండి సహస్రారం చేరు వరకూ కఠోరమైన సాధన చేసి అలసి ఉంటాడు. ఈ సుధాధారలు షట్చక్రములపైనా, బ్రహ్మగ్రంథుల పైనా, సమస్తనాడీ మండలము పైనా పడుటతో అంతులేని ఆనందానుభూతిని చెందుతాడు. పరమానందమునందుతాడు. తాదాత్మ్యతనంది, అమృతత్త్వ స్థితికి చేరుకుంటాడు. జన్మరాహిత్యం లభిస్తుంది.

ఇదే విషయం ఆదిశంకరులవారు సౌందర్యలహరియందు పది మరియు పదునాలుగు శ్లోకాలలో ఇలా చెప్పారు.

సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|

అవాప్య స్వాం భూమిం -  భుజగనిభ మధ్యుష్ట వలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 |

అమ్మా...జగస్మాతా ( బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు అమ్మ.) నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని,పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగానున్నదానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.

క్షితౌ షట్పంచాశ -   ద్ద్విసమధిక పంచాశ దుదకే

హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |

దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే

మయూఖాస్తేషామప్యుపరి తవ -  పాదాంబుజయుగమ్ || 14 ||

అమ్మా జగజ్జననీ! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి, సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబది ఆరు కిరణాలను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబదిరెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబదినాలుగు  కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బది రెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన   బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.

 ఓ శ్రీమాతా! అన్ని చక్రాలకు ఊపిరిగా సహస్రారచక్ర మధ్యంలో సహస్రదళ పద్మంగా నీవు విరాజిల్లుతావు. నీనుండి వెలువడిన శక్తిసంజనితమైన తేజః కిరణాలు యాభై ఆరు, మూలాధారా కేంద్రంలో పృథ్వీగా పరివర్తనం చెందుతాయి, మణిపురలో ఏభైరెండు జలతత్త్వంగా, స్వాధిస్టానంలో అరవైరెండు అగ్నితత్త్వంగా, అనాహతలో ఏభైనాలుగు వాయుతత్త్వంగా, విశుద్ద చక్రంలో డేబ్భై రెండు ఆకాశ తత్త్వంగా , ఆజ్ఞాచక్రంలో అరవైనాలుగు మనస్సుగా పరిణమిస్తాయి.

అమ్మా! ఏ కిరణములు (మయూఖములు) సాధకుని దేహమునందు షడ్చక్రములలో పంచభూతములుగా ఈ ప్రకారము మూడువందల అరువది నాలుగు (364) కిరణములు ప్రసిద్ధములు అయియున్నవో ఆ మయూఖములకు కూడ పై భాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవస్థానమును సుధాసింధువునందు నీ యొక్క అడుగులు అనే తామరల జంట నర్తించుచున్నది.

శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున అగ్నిస్థానము అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. సూర్యస్థానము అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడవ ఖండము చంద్రస్థానము అదియే (బ్రహ్మగ్రంథి)

ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. 

రెండోవఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండోవఖండమును వ్యాపింపజేయును.

మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును.

పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.

అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి.

ఆజ్ఞాచక్రము పై భాగమున చంద్రస్థానమని చెప్పుట చంద్రకళాస్థానమని భావమేగాని చంద్రుని స్థానమని కాదు. శుక్లపక్ష కృష్ణపక్షములందలి 15 తిథుల స్వరూపములగుటచేత క్రమముగా వృద్ధి క్షయములు కలవి అగుచున్నవి. అయితే సహస్రదళ కమలమునందున్న చంద్రునికి వృద్ధి క్షయములు లేవు. వృద్ధి  క్షయములు 15 తిథుల వరుకే. 16వ కళ సాదాఖ్యయై, సహస్రారస్థితమై యున్నది. అది నిత్యము

కుండలినీ శక్తిస్వరూపిణిని సుధాసాగరమునకు చేర్చుటతో సాధకుడు పరమేశ్వరీ తాధాత్మ్యం చెంది అమృతత్త్వ స్థితికి చేరుకుంటాడు. జన్నరాహిత్యం తొలగుతుంది.

శ్రీ లలితా సహస్రనామస్తోత్ర ఫలశ్రుతిలో ఇలా చెప్పబడింది:-

 చరమే జన్మని శ్రీవిద్యోపాసకో భవేత్

చివరి జన్మలో శ్రీవిద్యోపాసకుడవుతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సుధాసారాభివర్షిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

107వ నామ మంత్రము 11.4.2022

ఓం తటిల్లతా సమరుచ్యై నమః

మెఱుపు వలె వేగముగా మిఱుమిట్లుగొలుపు కాంతిపుంజముతో, అజ్ఞానము అను చీకట్లను పారద్రోలు దివ్యమేఘజ్యోతి స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి తటిల్లతా సమరుచిః అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం తటిల్లతా సమరుచ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తుడు జ్ఞానవంతుడై, పదిమందికి అజ్ఞానచీకట్లను తొలగించు జ్యోతిస్వరూపుడై, సుఖసంతోషములతో అన్నిటికీ మించిన పరమేశ్వరీ పాదసంసేవా తత్త్వముతో జన్మ చరితార్థమునొందిన ఆత్మానందానుభూతిని పొందును.

రెండు మేఘములమధ్య ఉత్పన్నమయే విద్యుదుత్పత్తిలో వెలువడే మెఱుపుతీగతో అమ్మవారు పోల్చబడినది. మెఱుపు కేవలం క్షణికమే. కాని ఆ మెఱుపు వేగంతో మిఱుమిట్లుగొలుపుతూ ఒక కాంతిపుంజమువలె ఉంటుంది. అటువంటి కాంతిపుంజమువలె జగన్మాత అజ్ఞానము అను మాయను, చీకటిని పారద్రోలు దివ్యమేఘజ్యోతి స్వరూపిణి. దీనినే మంత్రపుష్పంలో  నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లే ఖేవ భాస్వరా అని యనబడింది. అనగా కంటికి మెఱుపుతీగ ఎంతటి కాంతపుంజాన్ని ఇస్తుందో, అంతటి జ్ఞానప్రకాశాన్ని సాధకునకు  జగన్మాత సంప్రాప్తింపజేస్తుంది.

ఆది శంకరులు సౌందర్యలహరిలో  21వ శ్లోకంలో ఈ విషయం ఇలాచెప్పార:-
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
తటిల్లేఖాతన్వీం - తపన శశి వైశ్వానర మయీం

నిషణ్ణాంషణ్ణామ - ప్యుపరి కమలానాం తవ కలామ్ |

మహాపద్మాటవ్యాం -  మృదిత మలమాయేన మనసా

మహాంతః పశ్యంతో - దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||

ఈ సహస్రారపద్మకర్ణికాంతర్గత చంద్రమండలంలో ఉండే సదాఖ్య అనబడే అమ్మయొక్క దివ్యమైన కళ ఎలాటిదంటే, అది  తటిల్లేఖా తన్వీం అని చెప్పారు శ్రీశంకరులు.   తటిత్ అంటె మెఱుపు.   తట్టిల్లేఖ  అంటే మెఱుపు తీగె. అటువంటి తనువు అనగా ఆకారం కలదని.  ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి, మొదటిది మెఱుపుతీగలాగా అత్యంత దీర్ఘంగా సన్నగా ఉంటుందనేది. కాగా, రెండవది, మెఱుపు తీగ లాగా కేవలం క్షణకాలం మాత్రమే దర్శనభాగ్యం అనుగ్రహించేది అని.
 
జ్ఞానజ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం తటిల్లతా సమరుచ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*108వ నామ మంత్రము* 12.4.2022

*ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః*

మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలను దాటి, సహస్రార చక్రాన్ని చేరి అందు పరిపూర్ణంగా వ్యక్తమగు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *షట్చక్రోపరి సంస్థితా* యను ఎనిమదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకుడు అత్యంతాత్మానందానుభూతిని పొంది తరించితిని అను భావము కలిగియుండును.

ఉపాసకుడు తన సాధనలో మూలాధారమందు నిద్రాణమై ఉన్మ కుండలినీ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని జాగృతము చేయగా, ఆకుండలినీ శక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వముఖముగా  బయలుదేరుతుంది. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు అను షట్చక్రములను దాటి, బ్రహ్మరంధ్రమునకు కొంచము క్రిందుగా నున్న సహస్రార పద్మమునకు చేరుతుంది. సహస్రారంలో గల  సుధాసాగరమధ్యమున, శ్రీమన్నగరమునందున్న మణిద్వీపమునందు తన చింతామణి గృహమున పంచబ్రహ్మాసనస్థితయై విశ్రమిస్తూ ఉంటుంది.  సహస్రారము అను చంద్రమండలము (సుధాసాగరము),అందున్న చింతామణి గృహము, ఆ చింతామణిగృహంలోని పంచబ్రహ్మాసనమునందు శ్రీమాత ఉంటుంది. దీనిని బట్టి అమ్మవారి నివాసము షట్చక్రములకు పైన యగుటచే, ఆ అమ్మ *షట్చక్రోపరి సంస్థితా* యని అనబడినది.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి యందలి తొంబది రెండవ (92వ) శ్లోకంలో ఇలా చెప్పారు:

చింతామణి గృహమునందు గల పంచబ్రహ్మాసనంలో ఉండే ఆ పరమేశ్వరిని శంకరభగవత్పాదుల వారు ఇలా కీర్తిస్తున్నారు.

*గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః*

*శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|*

*త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా*

*‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||*
 
అమ్మా! పరమేశ్వరీ - బ్రహ్మ,విష్ణు, రుద్ర,ఈశ్వర ఈ నలుగురూ నీ సేవకులే.ఆ నలుగురూ నీ సింహాసనమునకు నాలుగు కోళ్ళు గా ఉండి నిను సేవించుకొను చున్నారు. మరి తెల్లని వర్ణంతో ఉండే ఆ సదాశివ తత్వం ( సదాశివుడు) ఆ నాలుగుకోళ్ల మధ్యన పరవబడిన పీఠం ఉండే వస్త్రంలా ఉంటుంది (ఉంటాడు). నీ వంటినుండి వెలువడే అరుణ (ఎర్రని) కాంతులు,శ్వేతవర్ణం (తెల్లని రంగు) లో విరాజిల్లుతూ నీవు కూర్చునే పీఠంపై దుప్పటిలా పరవబడిన ఆ సదాశివతత్వాన్ని ( సదాశివుని) కూడా ఎర్రగా మార్చివేసి, మీరిద్దరూ ఏకమైపోయి మీ దర్శనం మూర్తీభవించిన శృంగార రసంలా కనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*109వ నామ మంత్రము* 13.4.2022

*ఓం మహాసక్త్యై నమః*

సహస్రారమునందు శివశక్తిల సంయోగ రూపోత్సవమునందు ఆసక్తి గలిగి యుండు శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము. 

అగ్నితేజస్సునందు ఆసక్తిని చూపించు శ్రీమాతకు నమస్కారము.

బ్రహ్మమునకు అభేదమై తేజరిల్లు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాసక్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాసక్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు పరమేశ్వరీ తత్త్వమును పరిపూర్ణముగా అర్థంచేసుకొని, దీక్షలో నిమగ్నుడై బ్రహ్మజ్ఞానసంపన్నుడుగా యలరారును.

మహా అంటే బ్రహ్మము. ఆసక్తిః అంటే ఆసక్తి కలిగి యున్నది. *అంటే పరమేశ్వరి బ్రహ్మమునందు ఆసక్తి కలిగియున్నది*.

పరబ్రహ్మము అంటేనే బ్రహ్మము. పరాశక్తి పరబ్రహ్మస్వరూపిణి. అందుచే తాను ఆసక్తి కనబరిచే బ్రహ్మము అంటే ఆపరమేశ్వరియే. *అంటే బ్రహ్మముతో జగన్మాత అభేదమైనది*

ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు గంగా, యమునా, సరస్వతులు. సుషుమ్నా నాడి అగ్నితత్త్వముగలది. కుండలినీ శక్తి స్వరూపిణీ అయిన అమ్మవారు కూడా అగ్నితత్త్వమే. ఎందుకంటే సుధాసాగరంలో ఘనీభవించిన సుధలు, అమ్మవారు (అగ్నితత్త్వ స్వరూపిణి) సహస్రారంలో అడుగిడగానే, ఘనీభవన స్థితిలో ఉన్న సుధలు కరిగి అమృతధారలు జాలువారాయి అని చెప్ఫుకున్నాంకదా. *మహా* అంటే బ్రహ్మ, బ్రహ్మయొక్కరాణి సరస్వతి *మహాశక్తి* సుషుమ్నా (అగ్మితత్త్త్వం) నాడి సరస్వతీ స్వరూపిణి *మహాశక్తి* అని అంటే అగ్నితత్త్వమున్న అమ్మవారుకూడా *మహాశక్తి* అవుతుంది.అనగా *మహాసక్తిః* అనగా *మహాశక్తి*  *అనగా సరస్వతీ మరియు శ్రీమాతలకు అవినాభావ సంబంధమున్నదని* గ్రహించదగును

*ఎవ్వరి చేజనించు, జగమెవ్వరి లోపలనుండు లీనమై, ఎవ్వరి యందు డిందు పరమేశ్వరి ఎవ్వరు, మూలకారణం బెవ్వరు* (ఎవ్వనిచేజనించు అని పోతనా మాత్యులవారన్నారు. సందర్భోచితముగా ఎవ్వరిచేజనించు...అని మార్చుకొని యున్నాను) అని ప్రశ్నిస్తే సృష్తిస్థితిలయకారకు లెవ్వరు అనగా ఆ పరబ్రహ్మమే.
అటువంటి బ్రహ్మమునందు ఆసక్తిగలది  పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు. ఆ  పరబ్రహ్మమే అమ్మవారు అనికూడా అనవలసి వస్తుంది. *అందరికన్నా మహత్తు గలవారెవ్వరు అంటే అమ్మవారే*

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాసక్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*110వ నామ మంత్రము* 14.4.2022

*ఓం కుండలిన్యై నమః*

మూలాధార చక్రమునందు తామరతూడులోని దారము *(బిసతంతు తనీయసి)* వలె సూక్ష్మమై, సర్పమువలె మూడున్నర చుట్లు చుట్టుకొని తోకతో ముఖమును కప్పుకొనినదై, అగ్నితేజస్సుగలిగినదై సమస్తశక్తులకు-జ్ఞానమునకు మూలకారిణియై సాధకుడు తనయోగ సాధనలో జాగృతము చేయువరకూ నిద్రావస్థయందుండు కుండలినీ శక్తి రూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కుండలినీ* అను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం కుండలిన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు సమస్త జ్ఞానాన్ని, ఆపదలను నివారించుకోగల సమస్తశక్తులనూ ఆ తల్లి కరుణతో సంప్రాప్తింపజేసుకొని జగజ్జననీ పాదార్చనలో జన్మను చరితార్థము చేసుకోగలుగును.

మూలాధారము నందు జీవశక్తి సర్పమువలె   మూడున్నర చుట్లు చుట్టుకుని తోకతో ముఖమును కప్పుకొని నిద్రావస్థలో ఉండును. తామరతూడులోని సన్నని దారమువలె అతి సూక్ష్మముగా ఉంటుంది. అందుకే శ్రీమాతకు *బిసతంతు తనీయసీ* అని కూడా (111వ) నామ మంత్రము కలదు. కుండలినీ శక్తి అగ్నితత్త్వం గలిగినది. సర్పమువలె ఉంటుంది గనుక కుమారస్వామి అధి దేవత గలిగినది కుండలినీ శక్తి. సర్వశక్తులకు, సమస్త జ్ఞానములకు మూలమైనది. సాధారణంగా మనలో ఈ కుండలినీ  శక్తి నిద్రావస్థలో ఉంటుంది. అంటే భౌతిక ప్రపంచములో ఉంటూ, నేను, నా శరీరము, నా ఇల్లు, నా ఆస్తులు, నాభార్య, నా పిల్లలు అనే భౌతికభావనలమధ్య ఉంటాము.  జగన్మాత నామము ఉచ్చరించేక్రమంలో జ్ఞానం ఏర్పడుతుంది. ఆ తల్లి స్తోత్రపారాయణలో నిమగ్నమై ఉంటాము. ఇంకా కొంచం మన పూర్వజన్మవాసన కొలదీ పరబ్రహ్మమును తెలుసుకోవాలనే తపన పొడసూపితే యోగసాధన అను ప్రక్రియకు నాంది పలికితే, గురుముఖత షట్చక్రభేదనము నభ్యసిస్తే యోగసాధన మూలాధారమునుండి ప్రారంభమవుతుంది. అట్టి స్థితిలో ప్రప్రధమంగా మూలాధారంలోని కుండలినీ శక్తిని జాగృతంచేస్తాము. జాగృతమైన కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో ఊర్థ్వగతిని పయనింపజేయగా, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రములను దాటించి బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంథులను ఛేదిస్తూ సహస్రారకమలాన్ని చేర్చి, అచ్చట సుధాసాగరంలో కుండలినీ శక్తి వర్షింపజేసిన అమృతధారలలో ఓలలాడిన 'సాధకుడు పరబ్రహ్మమంటే ఏమిటో తెలిసి జీవన్ముక్తిని పొందుతాడు. అదే జన్మ ఎత్తినందుకు సార్థకత అవుతుంది.

తంత్రరాజమందు ఇలా చెప్పబడినదని భాస్కరరాయలువారు చెప్పారు: *మూలాధారమందు ఆత్మ తేజస్సు వహ్నిరూపమై ఉండును.  ఆ తేజోమధ్యమందు కుండలమను జీవశక్తి గలదు. అది తేజోమయము, ప్రాణాధారము అయినది. మూడున్నర చుట్టలు చుట్టుకొని పరుండిన పామువలె ఉండి, మిక్కిలి కాంతిగలదై యుండును. దానికి మాయయే శిరస్సు. అది ఎల్లప్పుడు ధ్వనించుచుండునని చెప్పుచుందురు. కుండలినీ శక్తి సుషుమ్నా నాడీ మధ్యప్రదేశమందు  ఉండును. ఎవడు చెవులు మూసికొనినపుడు కుండలినీధ్వని వినిపించుకొనలేడో, వినిపించదో వానికి మరణము సంభవించును*.

మనం చెప్పుకున్న ఈ కుండలిని వ్యక్తిలోనిది కావడం చేత *వ్యష్టికుండలిని* అంటారు. ఈ వ్యష్టికుండలినికి అధిదేవత జగన్మాత బిడ్డడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుండలిని సర్పాకారముగదా! అదికూడా ఒక కారణముగా మనం భావిస్తాము. అంతేకాదు కుండలినీ శక్తి మూలాధారంలో ఉంటుందికదా. మూలాధారం పృథ్వీతత్వముగలది. అధిదేవత గణపతి. అమ్మ, అమ్మబిడ్డలు గణపతి, కుమారస్వాములు ఉండడం, తల్లి, బిడ్డలు ఒకచోట ఉంటారనే భావన వస్తుందికదా. అయ్యవారు సహస్రారంలో ఉన్నాడు. అమ్మ (కుండలినీ శక్తి) అక్కడకు వెళుతుంది. అయ్యవారితో ఉంటుంది, తన అగ్నితత్వంతో అక్కడ చల్లదనానికి ఘనీభవించిన సుధా ధారలను కరిగించి సాధకునిపై కురిపించి, సాధకుని జన్మచరితార్థము చేయుచున్నది. అంతటితో ఆ సాధకుడు తనకు కావలసింది తనకు లభించిందని అన్ని ఆనందములకూ పరాకాష్ఠ అయిన బ్రహ్మానందాన్ని పొందుతాడు.

బ్రహ్మాండానికి ఉండే కుండలినీ శక్తిని *సమిష్టికుండలిని* అంటారు. దీనికి అధిదేవత ఆదిశేషువు లేదా అనంతుడు అని విజ్ఞులు చెప్పగా నేను *(పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం)* తెలుసుకున్నాను.

కుండలినీ శక్తి అగ్నితత్త్వం గలది అని అన్నాము. సుషుమ్నా నాడి ద్వారా పయనించునపుడు, సుషుమ్నా మార్గమున కిరువైపుల ఇడా నాడి, పింగళనాడి గలవు. ఇడానాడి చంద్రతత్త్వం గలది, పింగళానాడి సూర్యతత్త్వం గలది. సుషుమ్నా నాడికూడా, కుండలినీ శక్తివలె అగ్నితత్త్వంగలది.  మరియొక విశేషం ఏమిటి అంటే ఇడ, పింగళ, సుషుమ్నా నాడులను గంగా, యమున, సరస్వతులుగా సమన్వయిస్తూ, ఈ మూడునాడులు కలిసే (ఆజ్ఞాచక్రం వద్ద) చోటును *ప్రయాగ* అని కూడా విజ్ఞులు అభివర్ణించారు. ప్రయాగక్షేత్రం త్రివేణిసంగమంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇక్కడ సుషుమ్నా నాడి సరస్వతీ నదితో సమన్వయించాముగదా. సుషుమ్నానాడి వాగ్ధేవత అయిన సరస్వతీ స్వరూపురాలు. కుండలినీ శక్తి కూడా అగ్నితత్త్వంగలది. జగన్మాత కుండలినీ స్వరూపిణి కావడంచేత, సరస్వతీ స్వరూపిణి మరియు వాగ్భవబీజ స్వరూపిణి అయిన సుషుమ్నా మరియు  కుండలినీ స్వరూపిణి అయిన జగన్మాత కూడా వాగ్భవ బీజస్వరూపిణిలు.  *ఐం* అనేది వాగ్భవ బీజము. ఈ వాగ్భవబీజం *ఐం* ను విడదీసి చదివితే *అ +   ఎ + మ్.* ఆపైన  *ఎ* అను అచ్చును విడదీస్తే *అ + ఇ*  ఉన్నాయి. కనుక *ఐం* అను అక్షరంలో *అ, ఇ, అ, మ్* అక్షరములు గలవు.  ఇందులో మూడక్షరములు కుండలనీ శక్తియొక్క. మూడు పూర్తి చుట్లును, *మ్*  సగమే ఉంది గనుక సగం చుట్టను మొత్తం *ఐం* బీజం లో గల మూడున్నర అక్షరములు, సర్పాకార కుండలినీ శక్తి మూడున్నర చుట్లుగా ఉండడం చాలా చక్కని సమన్వయం కదా! ఎంత చక్కని మంత్రశాస్త్ర పరమైన సమన్వయం. ఇది ఇంకో విజ్ఞులైనవారు తెలియజేశారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కుండలిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*111వ నామ మంత్రము* 15.4.2022

*ఓం బిసతంతు తనీయస్యై నమః*

తామరతూడులోని సన్నని దారము వలె సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరముతో భాసిల్లు కుండలినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బిసతంతు తనీయసీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బిసతంతు తనీయస్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ కుండలినీ శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు సహస్రారమందలి అమృతధారలలో ఓలలాడిన బ్రహ్మానందానుభూతిని పొందుటయేగాక,  సుఖసంతోషములతో భౌతిక జీవనమును కూడా కొనసాగించును.

తామర తూడులోని దారము వలెను, సూర్యకిరణమువలెను, నివ్వరి ధాన్యపు అంకురము వలెను   సూక్ష్మాతి సూక్ష్మముగాను, చుట్టుకొని, నోటితో తోకను పట్టుకొనిన సర్పమువలె మూలాధారమందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తి స్వరూపము ఈ నామమంత్రములో తెలియజేయబడినది.  

తామరతూడు విరిచి చూడగా అతిసన్నని దారపుపోగులు చూస్తాము. అంతటి సూక్ష్మశరీరముతో, నోటితో తోకను కరచి పట్టుకున్న సర్పమువలె మూలాధారచక్రంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇక్కడ తామర తూడులోని దారము అన్నది ఒక ఉపమానం మాత్రమే. 

భాస్కరరాయలు వారు ఇంకొక శ్రుతి వాక్యం ఉటంకించారు *నీవారసూకవత్తన్వి పీతా భాస్వ త్యణూపమా* అనగా నివ్వరిధాన్యపు ముల్లువలె మిక్కిలి కృశించినది, స్వచ్ఛమైనది, అణువుతో సమానమయినది, ప్రకాశించునది. ఈ కుండలినీ శక్తి తామరతూడులోని దారము తామరదుంపను కరచిపట్టినట్లే, మూలాధారమును తన పడగకొసతో కరచిపట్టి ఉండును. అదే నోటితో తోకనుకూడ కరచిపట్టి ఉండును. నిద్రావస్థలో యుండును.

సాధకుడు స్వస్థుడై పద్మాసనస్థుడై గుదమును కొంచము వంచి వాయువు ఊర్ధ్వముగా పంపుచు కుంభకమును జేయవలెను. అప్పుడా వాయువుయొక్క తాకిడికి స్వాధిష్ఠానమునందు అగ్ని జనించును. అంతట ఈ వాయువు తాకిడికి, అగ్నితాకిడికి నిద్రాణములోనున్న కుండలినీశక్తి రూపమునందున్న సర్పము మేల్కాంచి సుషుమ్నా మార్గంలో బయలుదేరి, వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి లను భేదించుతూ, షట్చక్రములను దాటుతూ సహస్రారకమలమందున్న  శివుని పొంది ఆనందించును. ఇటువంటి స్థితి సాధకునకు అత్యంత ఉత్కృష్టమయినది. అరుణోపనిషత్తులో ఇలా చెప్పబడినది "ఓ శ్రీవిద్యోపాసకులారా! ఊపాసనాక్రమమునందు ఉండండి. సోమరులై కాలాన్ని వృధాచేయకండి. స్వాధిష్ఠానచక్రము నందలి అగ్నితేజోమయమై విరాజిల్లు కుండలినీ శక్తిని, కోరిక అను దండముతో కొట్టి లేపండి. అనాహత, విశుద్ధిచక్రముల మధ్యనున్న సూర్యునితో స్వాధిష్ఠానాన్ని కలపండి. దానిచే సహస్రారమందలి చంద్రమండలాంతర్గతుడగు రాజరాజేశ్వరుని కరిగించండి లేదా రాజరాజేశ్వరితో గూడిన రాజరాజేశ్వరుని వద్దకు చేర్చండి. అక్కడ ఆరాజరాజేశ్వరుని కలయికతో అమృతము స్రవించును. దానిచే మీరు తృప్తిని పొందుడు" అని గలదు. ఫలితముగా స్వాధిష్ఠానమందలి అగ్నికుండలినిని లేపి, సూర్యకుండలినితో కలిపి, చంద్రమండలమందు సామరస్యమును పొందియున్న శివశక్తి స్వరూపమును ద్రవింపజేసి దాని నుండి బయలుదేరిన అమృతధారలచే డెబ్బది రెండువేల నాడుల మార్గములను నిండించి, తృప్తిని పొందుడని భావము. 

మూలాధారమునందున్న కుండలినీ శక్తిని జాగృతము చేయవలెను. ఇది సాధకుడు చేయవలసిన పని. జాగృతమైన కుండలినీ శక్తి కదలును. ఈ చర్యనే *ఉత్పత్తి అవస్థ* యని అందురు. సాధకుడు జాగృతము చేయువరకూ నిద్రాణములో ఉండి, జాగృతమైన పిదప బయలుదేరుటచే *ఉత్పత్తి* యని చెప్పబడినది. ఈ ఉత్పత్తి అవస్థను *కౌమారావస్థ* యని కూడా భాస్కరరాయలువారు చెప్పారు. మూలాధారమునందున్న కుండలిని భూతత్త్వము. ఇక్కడ కుండలిని మంద్రస్వరంతో శబ్దము చేయును. అంటే సాధకుడు కుండలినిని జాగృతము చేయుటలో కృతకృత్యుడయాడు అని అర్థము. పిదప విశుద్ధఅనాహతముల మధ్యనున్న సూర్యునితో కలియుటచే కుండలిని యౌవనవంతురాలు అవుతుంది. దీనినే *తారుణ్యావస్థ* యని అన్నారు. సహస్రారముచేరిన పిదప కామేశ్వరునితో కలియుచున్నది. పతినిచేరిన కుండలినీశక్తి *పతివ్రత* యని అనబడినది. ఇక్కడ *వ్రత* అను శబ్దమునకు అనుభవించుట యని భాస్కరరాయలువారు చెప్పారు.  కుండలినీశక్తి కౌమారావస్థచేతగాని, తారుణ్యావస్థచేతగాని పతివ్రతయగుటచేతగాని (పతిని అనుభవించుటచేతగాని) అమృతవృష్టి యను శుభకార్యమును ఒనర్చుచున్నది. ఇదియంతయును స్వాధిష్ఠానగతుడైన అగ్నివలననే సంభవించినది. తత్ఫలితముగా సహస్రారమునందలి చంద్రమండలము నందలి ఘనీభవనస్థితిలోనున్న సుధాధారలు ద్రవీభవించి సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలమును తడియును. సాధకుడు అంతటితో మహదానందభరితుడగుచున్నాడు.  చంద్రమండలము స్వాధిష్ఠానగతుడైన అగ్నిచే ద్రవించును. అనగా స్వాధిష్ఠానాగ్ని చంద్రమండలమును ద్రవింపజేయగా అమృతము స్రవించునని భావము. దీనినినే ఇంకోవిధంగా కూడా చెప్పవచ్చును. సాధకుడు ఉచ్ఛ్వాసనిశ్వాస ములను బంధించగా, స్వాధిష్ఠానమునందు అగ్ని జ్వలిస్తుంది. ఇలా జ్వలించిన అగ్నినే *స్వాధిష్ఠానాగ్ని* యని అన్నారు. చంద్రమండలము నందు అమృతము ఘనీభవించి యుండగా, స్వాధిష్ఠానగతుడైన అగ్నిచే ఘనీభవనస్థితిలోనున్న అమృతము ద్రవించును. సహస్రారమును చేరిన కుండలిని తన పంటితో సహస్రదళపద్మమును కొరుకగా, ఆ పంటిగాట్లకు సహస్రదళపద్మమునకు గంట్లుపడతాయి. అందువలన ద్రవించిన అమృతము ధారలై సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలమును తడపడం జరుగుతుంది. అంతటితో సాధకుడు అంతులేని సుఖము పొందినవాడై బ్రహ్మానందము జెందుతాడు.

సనత్కుమార సంహితలో పృశ్నులు అను మునులు ఈ విధంగా చర్చించుకున్నారు:-

*ఓ శ్రీవిద్యోపాసకులారా! కుండలినీ శక్తిని జాగృతము చేయుడు. అలస్యము చేయవలదు. స్వాధీష్ఠానగతాగ్నిని తట్టి లేపండి. పిదప సూర్యునితో కలుపండి. కుండలినీ శక్తిని ఉమాసహితుడైన కామేశ్వరునితో కలియజేసి ఆ అమృతముతో తృప్తిని పొందుడు. కుండలినీ శక్తి తన పతిని అనుభవించుటకు స్వాధిష్థానగతాగ్నియే సహాయముచేయునని తెలుసుకొనండి*

కుండలినీ శక్తి మూలాధారంలో నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు జాగృతము చేయగా బాలికగా పుట్టిన పసిపిల్లల వలూ ఏదుపుమాదిరిగా బుసకొడుతుంది. కుండలినీ శక్తి పామువలె ఉంటుంది గనుక బుసకొడుతుంది. మూలాధారంనుండి బయలుదేరి స్వాధిష్ఠానమునకు చేరి, అచ్చట ఉండే అగ్నికి బాలికగా ఉన్న కుండలిని యౌవనవతి యవుతుంది. పిదప సహస్రారము చేరి యౌవనవతియైన కుండలినీ శక్తి పరమేశ్వరుని చేరి అనందంతో అమృతధారల వృష్టిని కురిపిస్తుంది.  ఆ ఫలితముగా సాధకుని శరీరంలోని డెబ్బది రెండువేల నాడిమండలము తడుస్తుంది. అంతటితో సాధకుడు పరమానందభరితుడై నటరాజు శివతాండవము చేసినట్లు గంతులు వేస్తాడు. ఈ విషయం వసిష్ఠాది తంత్రములందు, ఉపనిషత్తులందు వేదములందు నిరూపితమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బిసతంతు తనీయస్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*112వ నామ మంత్రము* 16.4.2022

*ఓం భవాన్యై నమః*

భవుని (శివుని) భార్యగా, మహాదేవుని జీవింపజేయునదిగా, సంసారమును (లోకాలను) జీవింపజేయునదిగా, మన్మథుని (భవుని) పాలిట సంజీవనౌషధిగా, జలరూపుడైన భవుని జీవింపజేసినదిగా *భవానీ* యను నామముతో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవానీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం భవాన్యై నమః* అని ఉచ్చరించుచూ, మహేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుని జగన్మాత   అత్యంత కరుణా హృదయంతో ఆయురారోగ్యములు, అన్నవస్త్రములు, సుఖసంతోషములు ప్రసాదించి ఆధ్యాత్మిక జ్ఞానసంపదతో తరింపజేయును.

మహేశ్వరుని భవుడు అని కూడా అంటారు. అందుచే జగన్మాత భవుని భార్య గనుక *భవానీ* అని చెప్పబడినది.

*రుద్రో భవోభవః కామోభవః సంసారసాగరః|*

*తత్ప్రాణనా దియం దేవీ భవానీ పరికీర్తితా॥* (సౌభాగ్య భాస్కరం, 317వ పుట)

అని దేవీపురాణంలో చెప్పబడినది. రుద్రుడు అంటే భవుడు. మన్మథుడుని కూడా భవుడు అంటారు. అలాగే సంసారసాగరమును కూడా భవము అంటాము. *రుద్రుని, మన్మథుని, సంసారసాగరమును జీవింపజేయునది* గనుక  జగన్మాత *భవానీ* అన్నాము.

వాయుపురాణంలో ఇలా ఉన్నది.

*యస్మాద్భవంతి భూతాని తాభ్య స్తా భావయంతి చ|*

*భవనాద్భావనాచ్చైవ భూతానాం స భవ స్మృతః॥* (సౌభాగ్యభాస్కరం, 318వ పుట)

ఎవని వలన భూతములు ఉద్భవించుచున్నవో, ఏ జలముల వలన భావనలు కలుగుచున్నవో అతడే భవుడు. అగుచున్నాడు. అట్టి భవుని జీవింపజేసినది. 

శివుని అష్టమూర్తులు:

1) భవుడు, 2) శర్వుడు, 3) ఈశానుడు, 4) పశుపతి, 5) రుద్రుడు, 6) ఉగ్రుడు, 7) భీముడు, 8) మహాదేవుడు

 అష్టమూర్తులలో భవుడుని జలమూర్తి అని కూడా అంటారు. అట్టి భవుని జీవింపజేసినది గనుక *భవానీ* అగుచున్నది. 

పద్మపురాణమునందు అష్టోత్తరశతదేవీతీర్థ మాలాధ్యాయమంధు "స్థానేశ్వరమందు *భవాని* అను పేరుగల దేవతయు, బిల్వపీఠమందు నామపుత్రికయను దేవియు గూడ *భవానీ*" అని చెప్పబడినది.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు 22వ శ్లోకంలో ఇలా చెప్పారు:-

*భవాని త్వం దాసే - మయి వితర దృష్టిం సకరుణాం*

*ఇతి స్తోతుం వాంఛన్ -  కథయతి భవాని త్వమితి యః |*

*తదైవ త్వం తస్మై - దిశసి నిజసాయుజ్య పదవీం*

*ముకుంద బ్రహ్మేంద్ర - స్ఫుట మకుట నీరాజితపదామ్ || 22 ||*

అమ్మా! ఓ భవానీ! నీ భక్తులపై నీ అపార కరుణ అనన్య సామాన్యమైనది, ఏందుచేతననగా...
నీ భక్తుడు నిన్ను కొలుస్తూ...అమ్మా భవానీ అని పిలచి ఇంకా వాని కోరిక చెప్పకమునుపే, వాని ప్రార్ధన పూర్తికాకుండానే భవాని అని పలికిన పుణ్యభాగ్యానికి ఎల్లవేలలా బ్రహ్మ, విష్ణు,దేవేంద్రుడు మొదలైన దేవతాప్రముఖులు శిరములు వంచి నీ పాదములు మొక్కువేళ, వారి కిరీట మణుల కాంతులతో నీరాజనములందుకొను  నీ దివ్య చరణ సాయుజ్య పదవిని, భవాని నామ స్మరణ మాత్ర పుణ్యానికి ఆ భక్తునకు ఒసంగుచున్నావు.

*అమ్నను కొలచిన తరువాతకాదు, అమ్మను కొలవాలన్న ఆలోచన రావడంతోనే అమ్మ తన అనుగ్రహం మనపై కురిపించుచున్నది. మనం అమ్మ నామము పలికితే చాలు, మనం కోరకుండానే అన్నీ అమ్మ మనకు సమకూర్చుచున్నది*.

భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.   భవతి భవతేవా సర్వమితి భవః అనగా అంతయూ తానైన వాడు.   అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు. భవము  అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము  అని కూడా అర్ధము.  ఇతని వలన సకలము పుట్టును గనుక భవము. మన్మథుని జీవింపజేయునది భవానీ. సంసార సాగరమును దాటింప జేయునది  భవాని. శుభములను ప్రాప్తింప జేయునది భవాని.  తరింప జేయునది భవాని. మరలా పుట్టుక లేకుండా జేయునది భవాని. ముముక్షత్వం ప్రసాదించేది భవాని. 
భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి, జీవయతీతి భవానీ. 
భవం జీవన రూపం జలమప్యానయతి జీవయతీతి భవానీ.

*రుద్రో భవో భవః కామో భవ స్సంసార సాగరః తత్ప్రాణనా దియం దేవీ భవానీ పరికీర్తితా* (దేవీ భాగవతం).

పరమేశ్వరుని అష్ట మూర్తులలో జల మూర్తికి భవుఁడు అని పేరు గలదు. శివుడు లోకములను బ్రతికింప జేయువాడగుటచే భవుఁడు అని పేరు.  దేని నుండి భూతములు పుట్టు చున్నవో, దేనిలో బ్రతుకు చున్నవో, అది జల రూపము.  అట్టి పుట్టుకను జీవింప జేయునది గాన అది భవుఁడన బడుచున్నది.  భవ మనగా జీవ రూపమైన నీరు. అట్టి జల రూపుడగు భవుఁని జీవింపజేయునది కనుక భవాని అని చెప్ప బడినది. ప్రాణ శక్తికి, జీవ శక్తికి  మూలం భవాని.   బ్రతికించేది భవాని. గనుకనే జగద్గురువులు అమ్మను భవానీ అని పిలిచినారు 

భవానిత్వం అంటే  ముముక్షత్వం. అద్వైత సిద్ధాంతము. రెండు లేవు తల్లి వున్నది ఒక్కటే. ఇద్దరమూ ఒక్కటే. తత్త్వమసి. అమ్మా నీవే నేను, నేనే నీవు అని చెప్పడం. భవానిత్వం...అని అనగానే, చెప్పగానే  జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి శివ సాయుజ్యం లభించినది. *నిజసాయుజ్యపదవీం* అన్నారు 

సాయుజ్యం అంటే ఉపాసకుడు అమ్మ వారిలో లీనం కావడం సాయుజ్యం. 

సాయుజ్యం అంటే ముక్తి . ముక్తి నాలుగు రకాలు అని పెద్దలు అంటారు.

1. *సాలోక్యము* :- పరమాత్మ లోకాన్ని చేరడం సాలోక్య ముక్తి.

2. *సామీప్యము:-* పరమాత్మ సన్నిధికి చేరడం సామీప్య ముక్తి.

3. *సారూప్యము*:- పరమాత్మ తో సమాన రూపం పొందడం సారూప్య ముక్తి.

4. *సాయుజ్య ముక్తి:-* పరమాత్మతో ఏకం కావడం సాయుజ్య ముక్తి. 

*భవానీ* యని నామ ప్రసిద్ధమైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవాన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌸💐
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*113వ నామ మంత్రము* 17.4.2022

*ఓం భావనాగమ్యాయై నమః*

న్యాస, జప, హోమ, అర్చన, అభిషేకములు ఉపాసనా పంచకముచే సాక్షాత్కరింప దగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భావనాగమ్యా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం భావనాగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరుడై ఉపాసించు సాధకుడు ఆ జగన్మాతను కనీసం తన భావనలయందైనా దర్శించుకొని తనదీక్షకు తగినట్టి వరములను సంప్రాప్తింప జేసికొనును.

భావనా అనగా భావించుట, తలచుట. ఇక్కడ ధ్యానించుటచేత, గమ్యా అనగా పొందదగినది అనగా సాక్షాత్కరింప దగినది. భావన+అగమ్యా అని కూడా తీసుకుంటే ధ్యానమాత్రమున పొందదగనిది అనగా సాక్షాత్కరింపదగనిది. 

ముందుగా పొందదగనిది, అనగా అనుగ్రము పొందదగనిది లేదా సాక్షాత్కరింప దగనిది. బ్రహ్మముఖము నుండి వచ్చినట్లుగనే అనునది 

1) *శాబ్దీభావన* గురువులు ఉచ్చరించిన విధముగా వారి ఇష్టము వచ్చినట్లు ఉచ్చరించుట ప్రవర్తించుట.  

*2) అర్థీభావన*  అనగా కేవలం వేదవిహిత కర్మానుష్ఠాన మాత్రముచే పొందదగనది. కార్యకారణ సంబంధమైనది.   

 కూర్మపురాణమునందు

*బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ తథై వాక్షరభావనా|*

*తిస్రస్తు భావనా రుద్రే వర్తన్తే సతతం ద్విజా॥* (సౌభాగ్య భాస్కరం 319వ పుట)

బాహ్మీ, మాహేశ్వరీ, అక్షర భావన అని బ్రాహ్మణులు మూడురకములుగా శివుని భావిస్తారు.

 *1) బ్రాహ్మీభావన* - దీనినే వ్యక్తస్వరూపభావన అనగా విగ్రహంలో భగవంతుని భావించేదే బ్రాహ్మీభావన.

2) *మాహేశ్వరీ భావన* అనగా అవ్యక స్వరూపభావన. అనగా అంతర్ముఖంగా పరమాత్మను భావిస్తూ చేసేది. ఇది సాత్విక భావన అనికూడా అనవచ్చు. 

3) *అక్షరభావన* - సగణు స్వరూప భావన అనికూడా అంటాము.  మంత్రంలోని అక్షరాలను అర్థతాత్పర్యములతో హృదయంలో భావిస్తూ చేసేది. లలితా సహస్రనామస్తోత్రం పారాయణచేస్తున్నాము. ఉదాహరణకు: 85వ నామ మంత్రమును లేదా 34వ శ్లోకం రెండవ పాదం ఇలా చదివాము *శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా* (16 అక్షరముల నామము మధ్యలో విరవకుండా) అని చదివాము. మన మనసులో ఆ  నామ మంత్రానికి అర్థం భావించుకోవాలి. ఏమని? *పంచదశీ విద్యలో మొదటి (క, ఏ, ఈ, ల, హ్రీం) అను ఐదు అక్షరములు -   'వాగ్భవకూటము'  అనుననది జగన్మాత ముఖకమలము*

ఈ భావనలచే ఆ తల్లి సాక్షాత్కారింప దగినది. 

ఈ విషయమునే కూర్మ పురాణములోనే భగవంతుడైన కూర్మావతారుడు ఇంద్రద్యుమ్న మహారాజుతో ఇలా అన్నాడు "ఓ బ్రాహ్మీ భావనగలవాడా! భావన మూడువిధములు 1) అవ్యక్త స్వరూప భావన, 2) వ్యక్తస్వరూప భావన, 3) సగుణ స్వరూప భావన. 

యోగినీ హృదయమునందు చెప్పబడిన మూడు భావములు 1) సకల, 2) సకల నిష్కల, 3) నిష్కల. 

*ఆజ్ఞాంతం సకలం ప్రోక్తం తతస్సకల నిష్కలం|*

*ఉన్మన్యన్తం పరేస్థానం నిష్కలం చ త్రిధా స్థితం॥* (సౌభాగ్య భాస్కరం. 320వ పుట).

 1) *మూలాధారచక్రం నుండి ఆజ్ఞాచక్రాంతమువరకు* చేయునది సకలభావన.

 2) *ఆజ్ఞాచక్రంనుండి ఉన్మన వరకు* సకల నిష్కల భావన.

3) *పరస్థానంలో భావన* అనగా ఉన్మనికి చివరనున్న పరస్థానమందు (మహా బిందువులో) చేయు భావన. నిష్కల.

ఇంకను ఉపాసనా పంచకముచే భావనచేయునది కూడా సాధారణముగా చెపుతూ ఉంటాము.

ఉపాసనా పంచకము 1) న్యాస, 2)జప, 3) హోమ, 4) అర్చన, 5) అభిషేకము.

ఈ విధంగా జగన్మాత *భావనాగమ్యా* అను నామ మంత్రము కలిగి ఉన్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భావనాగమ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*114వ నామ మంత్రము* 18.4.2022

*ఓం భవారణ్య కుఠారికాయై నమః*

జననమరణ చక్రములనెడు కొండ చిలువలతోను, మోహబంధములనెడు లతలతోను, అరిషడ్వర్గములనెడు కౄరమృగములతోను, అజ్ఞానమనెడు చీకట్లతోను నిండియున్న సంసారారణ్యములకు కుఠారిక (గొడ్డలి)  వంటి శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవారణ్య కుఠారికా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవారణ్య కుఠారికాయై నమః* అని ఉచ్చరించుచూ మిగుల భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే భౌతికసంబంధమైన సుఖసంతోషములు పొందుతాడు. అదే క్రమంలో పరమేశ్వరీ ఆరాధనలో ఆధ్యాత్మికానందమును కూడా పొంది తరించును.

పుట్టడం చావడం మరల పుట్టడం అనేది ప్రతీజీవికి ఒక సహజమైన లక్షణం.

*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరే శయనం|*

*ఇహ సంసారే బహుదుస్తారే*

*కృపయాపారే పాహి మురారే||*

పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం చావడం, తల్లి గర్భంలో మలమూత్రాదుల నడుమ శయనించడం వంటి ఈ జననమరణ చక్రంలో చిక్కుకున్నాను. ఈ సంసార బంధములనుండి నుండి బయట పడలేక పోవుచున్నాను. ఓ తల్లీ! నన్నీ సంసారము నుండి బయటపడవేయుము విష్ణుస్వరూపిణి అయిన జగన్మాతా!

ఈ సంసారమనే అరణ్యంలో అజ్ఞామనే చీకట్లు, అరిషడ్వర్గములనే కౄరమృగములను దాటి వెలుపలికి రాలేక తీగలు, లతల వంటి మాయా మోహ బంధములలో చిక్కుకుపోయి పుట్టుట, చచ్చుట, మరల తల్లి గర్భమందు తొమ్మిది నెలలు వాసము జేయుట జన్మలకు జన్మలు గడపడం జరుగుతున్నది.
సంసారంలో భౌతిక బంధముల కన్నను, మానసిక బంధమే అనేక ఇబ్బందులకు కారణమౌతుంది. జ్ఞానస్వరూపిణి అమ్మవారు. జ్ఞానమనేదే ఒక గొడ్డలి వంటిది. ఈ అపార దుఃఖమయమైన భవారణ్యమునకు జగన్మాత ధ్యానము ఒక్కటే సాధనము. ఆ తల్లియందు ఎనలేని భక్తిప్రపత్తులతో ఉపాసించినచో ఆ జగన్మాత ఈ భవారణ్యమును ఛేదించుటకు జ్ఞానమను ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించును.  ఆ జ్ఞానమను గండ్రగొడ్డలి అరిషడ్వర్గములను ఛేదిస్తుంది. తద్ద్వారా సాధకునిలో ఎనలేని సత్త్వగుణం, పరచింతన వృద్ధి అవుతుంది. నిరంతర సాధనతో జగన్మాతను సాక్షాత్కరింప జేసుకోవడం జరుగుతుంది. పునర్జన్మ నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుకనే ఈ సంసారమను అరణ్యమునకు జగన్మాత కుఠారిక (గండ్రగొడ్డలి) వంటిది. అందుచేతనే అమ్మవారు  *భవారణ్య కుఠారికా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం భవారణ్య కుఠారికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*115వ నామ మంత్రము* 19.4.2022

*ఓం భద్రప్రియాయై నమః*

పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, మంగళాభరణముల యందును, భక్తులకు శుభములు, మంగళకరమొనరించుట యందును ఆసక్తి కలిగినదియు, లోకములకే సర్వమంగళము చేకూర్చుటకు పరమశివునిచే గరళమును సేవింపజేసినదియు అయిన మంగళగౌరీ స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భద్రప్రియా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భద్రప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని పూజించు భక్తులకు భౌతిక జీవనము సర్వమంగళకరమై, శుభప్రదమై, ఆధ్యాత్మిక చింతనయందు మంగళప్రదమైన ఆ పరమేశ్వరీ పాదసేవాతత్తరతతో తరింతురు.

భద్ర అనగా మంగళకరము, శుభప్రదము అని అంటాము. జగన్మాత తానే మంగళగౌరీ స్వరూపిణి. జగన్మాతను బమ్మెర పోతనామాత్యులవారు *సర్వమంగళ* అని స్తుతించారు. ఎందుకంటే అమృతమథనసమయములో వెలువడిన హాలాహలమునకు దేవాసురులు భీతావహులై గడగడలాడారు. లోకములన్నియు ఆ హాలాహలాగ్నికి తల్లడిల్లిపోయినవి. ఆ ఆపద నుండి కాపాడాలంటే త్రిమూర్తులలో మహేశ్వరుడే సమర్థుడు అని తెలిసికొని, తమను కాపాడమని ఆ మహాశివుని ప్రార్థించారు. ఆయనచూస్తే సగంశరీరం జగదాంబకు సమర్పించుకున్నారు. హాలాహలం సేవించాలంటే జగదాంబ ఏమంటుందో అని ఆ తల్లివంక ఓరగా, చిరునవ్వుతో ఒకసారి చూశాడు 'ఏంచేద్దాం?' అన్నట్లు. అప్పుడు ఆతల్లి మంగళగౌరీ స్వరూపిణి. జగములకే శుభములు చేకూర్చుతల్లి. హాలాహలం వలన అమంగళకరమవుతుందంటే తట్టుకోగలదా. అలాగని పరమేశ్వరుడిని ప్రళయాగ్నికన్నా భయంకరమైన హాలాహలాన్ని మ్రింగమని చెప్పి ఆయనను ఇబ్బంది పెట్టగలదా. ఏది ఏమైనా మంగళగౌరీస్వరూపిణి అయిన జగదీశ్వరికి తన మంగళసూత్రం ఎంత గట్టిదో తెలుసు. అలాగే పరమేశ్వరుడు ఎంతటి శక్తిమంతుడోకూడాతెలుసు. ఇంకేముంది! శివశక్తులైక్య మయాయి. హాలాహలాన్ని శివుడు భక్షించాడు. అప్పుడు ఆ సన్నివేశంలోని బమ్మెర పోతనామాత్యుల వారి  పద్యములు చూద్దాం.
 
*బమ్మెర పోతనామాత్యులవారి పద్యములు*

*కంద పద్యము*

మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

*తాత్పర్యం*

ఆమె *సర్వమంగళ* కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

*ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు*

*మత్తేభ విక్రీడితము*

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

*తాత్పర్యము*

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.
 
ఆ పరమేశ్వరి సర్వమంగళకారిణి. మంగళగౌరీ స్వరూపిణి.

*భద్ర* అను పదమునకు చాలా అర్థములు ఉన్నవి. 

*భద్రుడు* - వసుదేవుని కొడుకు కాని ఇక్కడ శివుడు. జగన్మాతకు శివుడనిన ఇష్టము కదా. అందుకు ఆ తల్లి *భద్రప్రియా*

*శుభము, శ్రేష్ఠము* - ఇవి అంటే జగన్మాతకు ఇష్టము. అందుకే అమ్మవారు *భద్రప్రియా*. యని అనబడినది.

*సంపత్కరీ దేవి వద్ద ఉన్న ఏనుగులలో ఒకజాతి ఏనుగు* - అమ్మవారికి భద్రగజము అంటే చాలా ఇష్టము. అందుకే ఆ పరాశక్తి *భద్రప్రియా* యని అనబడినది.

*వీరభద్రుడు*- దక్షయజ్ఞ వినాశనానికి శివుని జటాజూటమునుండి వెడలిన మరో రుద్రస్వరూపుడు.

భద్ర యను శబ్దమునకు మంగళకరము. అమ్మవారూ మంగళకరమైన వస్తువులనిన ఆసక్తిగలిగినది. ముత్తైదువ అనగా ఐదవతనము గల స్త్రీ ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట.
ఆ అయిదు మంగళ కర వస్తువులు 1. మంగళసూత్రము ,2. పసుపు, 3. కుంకుమ, 3. గాజులు, 4. మట్టెలు, 5. పువ్వులు. కనుకనే మన హిందూ ముత్తైదువలు సర్వదా ఈ ఐదు అలంకారములను ధరించి ఉంటారు. ముత్యములు, పగడములు, నల్లపూసలు వంటి వస్తువులు కూడా మంగళకరమైనవే. మంగళకరమైన వస్తువులయందాసక్తి కలిగియున్న జగన్మాత *భద్రప్రియా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భద్రప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*116వ నామ మంత్రము* 20.4.2022

*ఓం భద్రమూర్త్యై నమః*

పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, మంగళాభరణములన్నియునూ తానై, సహస్రారమందు సుధాసాగరంలో భద్రపీఠమందు విరాజిల్లు భద్రమూర్తి (మంగళ) స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భద్రమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భద్రమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు తాను తలంచిన సత్కార్యములయందు శుభకరములు, మంగళకరములు సంప్రాప్తించి ఇష్టకామ్యార్థసిద్ధిని పొందును.

జగన్మాత మంగళ స్వరూపిణి. సర్వమంగళ. పరబ్రహ్మస్వరూపిణి. అట్టి పరబ్రహ్మస్వరూపిణిని విష్ణుపురాణంలో  *బ్రహ్మమే మంగళము* అని చెప్పబడినది. ఆ బ్రహ్మము మంగళములన్నింటికంటె మంగళము అని భారతంలో ప్రస్తావింపబడినది. ఈ బ్రహ్మరూప మంగళమును పొందినవారికి అమంగళములు కలుగవు.

సృష్టిమొత్తం పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నుండే సృష్టించబడినది. సహస్రారంలో, సుధాసాగరం మధ్యలో భద్రపీఠమందు *భద్రమూర్తి* గా విరాజిల్లుచున్నదని వేదాలలో చెప్పబడింది.

జగన్మాత ముత్యములయందు, శంఖములందు, శివలింగముల యందు భద్రమూర్తిగా ఉంటున్నది. స్త్రీల పాపిటియందు భద్రమూర్తిగా విలసిల్లుతున్నది కనుకనే ఆడవారు పాపిట సిందూరమును ధరిస్తారు. అది ముత్తైదువులకు ఐదవతన చిహ్నము. ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట. 

1) మంగళసూత్రము, 2) పసుపు, 3) కుంకుమ, 4) గాజులు, 5) మట్టెలు. 

ఈ  అయిదు మంగళ కర వస్తువులందు జగన్మాత మంగళగౌరీ స్వరూపిణిగా ఉంటుంది. అందుకే  మన హిందూ స్త్రీలు సర్వదా ఈ అలంకారములుగా ధరించుతూ ఉంటారు.

*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే*

*శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే*
 
 మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ జగన్మాతా, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ నీకు నమస్కరిస్తున్నాను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భద్రమూర్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*117వ నామ మంత్రము* 21.4.2022

*ఓం భక్త సౌభాగ్య దాయిన్యై నమః*

భక్తులకు తనతో ఐక్యము (సాయుజ్యము), ఇంద్రియ నిగ్రహము, సౌభాగ్య ద్రవ్యములు పొందు అదృష్టమును అనుగ్రహించు పరాశక్తికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తసౌభాగ్యదాయినీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భక్త సౌభాగ్య దాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సౌభాగ్యము, సిరిసంపదలు పొంది భౌతికజీవనము ఆనందమయముగాను, బ్రహ్మజ్ఞాన సంపదతో ఆత్మానందానుభూతిని పొంది తరించును.

*భక్తులు అనగా నాలుగు రకములవారు*

*ఆర్తులు*  బాధలను తొలగింపమని భక్తితో పరమాత్మను వేడుకొనేవారు

*జిజ్ఞాసులు* పరమాత్మను గూర్చి తెలియగోరి సేవించువారు

*అర్థార్ధి* ధర్మార్థకామమోక్షములను (కోరికలు) కోరి భక్తితో సేవించువారు.

*జ్ఞానులు* కేవలం జ్ఞానముతో (నిష్కాములై) పరమాత్మను సేవించువారు.

జగన్మాత సౌభాగ్యదేవతా స్వరూపిణి. తన భక్తులను తనలో ఐక్యముచేసుకొని సాయుజ్యప్రాప్తిని కలుగజేయును. 

 పద్మపురాణమునందు చెప్పిన సౌభాగ్యాష్టకము అను ఎనిమిది సౌభాగ్యద్రవ్యములు  లభింపజేయును. సౌభాగ్యద్రవ్యములనగా 1) ఇక్షువులు (చెఱకు), 2) తరురాజము (పారిజాతము), 3) నిష్పావములు, 4) జీలకర్ర, 5) ధాన్యములు (ధనియాలు, వడ్లు మొదలైనవి), 6) గోఘృతము గాని వెన్న గాని), 7) కౌసుంభపుష్పము, 8) లవణము - ఈ ఎనిమిది వస్తువులు ఉండుచోట సర్వసౌభాగ్యములు కలుగును. 

తన భక్తులకు ఇంద్రియ నిగ్రహము కలుగజేయును. ఇంద్రియ నిగ్రహము వలన అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) నియంత్రణయందుండి విశేషమైన గౌరవము, వాక్సుద్ధి లభించును. *సు,భ,గ* అను అక్షరములతో ఏర్పడు *సుభగ* అను విశేషణమునే *సౌభాగ్యం* అందురు. *సు* అనగా మంచితనము, *భ* అనగా వైభవము, *గ* అనగా గమనము లేదా ప్రవర్తన. ఈ మూడు లక్షణములు సౌభాగ్యలక్షణములు. 
పైన చెప్పిన నాలుగు రకముల భక్తులకూ కూడా జగన్మాత సౌభాగ్యముసు అనుగ్రహించును గనుక *సౌభాగ్యదాయినీ* అని నామముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*118వ నామ మంత్రము*

*ఓం భక్తిప్రియాయై నమః*

తన సన్నిధిలో అత్యంత తాదాత్మ్యస్థితిని పొంది ఉండు భక్తులనిన మరియు అట్టి భక్తి యనిన ప్రియము కలిగియుండు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తిప్రియా* అను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం భక్తిప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు   ఆ పరమేశ్వరి అనుగ్రహముతో ఆ తల్లి వాత్సల్యమునకు, ప్రేమకు పాత్రుడై సర్వాభీష్ట సిద్ధినందుటతో బాటు, ఆత్మానందానుభూతితో తరించును.

ఈ నామ మంత్రము *భక్తిప్రియా* అని కొందరు *భక్తప్రియా* అని కొందరూ చదువుచుందురు. *భక్తిప్రియా* అంటే తన భక్తులయొక్క భక్తి అనియు, *భక్తప్రియా* అంటే పరమాత్మ సన్నిధిలో భక్తులు తాదాత్మ్యస్థితికిజేరియుండు *భక్తులు* అనియు సమన్వయించుకొనవచ్చును. రెండిటిలోని పరబ్రహ్మతత్త్వం ఒకటిగానే భావించవచ్చును. 

భక్తులను నాలుగు రకములుగా తెలుసుకోవచ్చునని *భక్తసౌభాగ్యదాయినీ* అను 117వ నామ మంత్రము యొక్క వ్యాఖ్యానములో ప్రస్తావించడం జరిగియున్నది. అదే మరల ఇచ్చట చెప్పడం జరుగుతున్నది.

శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో భక్తులను  *1) ఆర్తులు, 2) జిజ్ఞాసులు, 3) అర్థార్థులు, 4) జ్ఞానులు* అని నాలుగు విధములుగా చెప్పడం జరిగినది.

1) *ఆర్తి* తో గజేంద్రుడు, ద్రౌపది వంటివారు భగవంతుని ప్రార్థించారు.

2) *జిజ్ఞాస* తో ఉద్ధవుడు భగవంతుని  ప్రార్థించాడు.

3) *అర్థార్తి* తో  ధ్రువుడు భగవంతుని ప్రార్థించాడు.

4) *జ్ఞానము* తో ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థించాడు.

ఆ పరమాత్మ అనుగ్రహం పొందడానికి *నవవిధభక్తిమార్గం* గలదని శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో బమ్మెర పోతనామాత్యులవారు ప్రహ్లాదుడు చెప్పాడని ఇలా చెప్పారు

*మత్తేభ విక్రీడితము*

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

*తాత్పర్యము*

రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి
1)  *సఖ్యం,* 2) *శ్రవణం*,  3) *దాస్యం*, 4) *వందనం*, 5) *అర్చనం*,  6) *సేవనం*, 7) *ఆత్మనివేదనం*, 8) *కీర్తనం*, 9)  *చింతనం* 

ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది.  

శివపురాణంలో  భక్తులు బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని చేసే సేవలకు అనుగ్రహం ప్రసాదిస్తానని పరమేశ్వరుడు అన్నాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తిప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

119వ నామ మంత్రము  22.4.2022

ఓం భక్తిగమ్యాయై నమః

నిష్కామమైన, నిష్కల్మషమైన భక్తికి గమ్యము తాను తప్ప అన్యమైనదేదీ కాదు అని అనిపించు   జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భక్తిగమ్యా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం భక్తిగమ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు తనలోని భక్తికి గమ్యము జగన్మాత పాదపద్మములు, ఆ పాదపద్మములవద్ద లభించు బ్రహ్మానందము దక్క అన్యమేదీ లేదని భావించి తరించును.

అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసిస్తే జగన్మాత ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మదేవుడు తాను సృష్టించిన ఇంద్రియములు జగత్తుసు చూడడానికే గాని పరమాత్మను చూడడానికి కాదు. కాని ఉపాసకుడు తన భక్తికి గమ్యం కేవలం జన్మరాహిత్యమైన మోక్షము అని గ్రహించి, తన ఇంద్రియములను జగత్తు నుండి మళ్ళించి,అంతర్ముఖుడై పరమాత్మను కనుగొనుచున్నాడు. స్మృతి కూడా యోగులు పరమాత్మను వారి యోగశక్తిచే పరమాత్మను చూచుచున్నారని చెప్పుచున్నది. బ్రహ్మసూత్రము కూడా అవ్యక్తమయిన బ్రహ్మము కూడా భక్తిచే ప్రత్యక్షము చేయగలగ వచ్చని చెప్పినది. ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తిమార్గములలో పరమాత్మను చేరడానికి ఏదైనా ఒకటే. కాని ఆ భక్తి నిష్కామమైనది, నిష్కపటమైనది ఐతే ఆ భక్తుడు చతుర్విధ భక్తులలో జ్ఞానుల కోవకు చెందుతాడు. భక్తులలో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు అను ఈ భక్తులు  నిష్కపటులు కావచ్చేమోగాని, నిష్కాములు మాత్రం గాదు. అప్పులు బాధలు తీరాలని, ఆస్తితగాదాలు కొలిక్కిరావాలని, ఎన్నికలలో గెలవాలని మ్రొక్కుకుని తిరుమల వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి, హుండిలో కానుకలు వేసేసి వచ్చేస్తారు. మళ్ళీ తరువాత ఇంకో అర్జీతో వెళతారు.  కాని అన్నమాచార్యులవారి భక్తి అలాంటి దికాదు. కేవలం పరమాత్మ  సాయుజ్యమే కోరుకున్నాడు. ఎన్నోవేల కీర్తనలు వ్రాశాడు. పరబ్రహ్మమును వివరించాడు. ఇక భక్తి అనేది వ్యాపారం కాదు. భక్తి అనే పెట్టుబడికి,  కోరికలు తీరడం అనేది ఆ పెట్టుబడికి లాభం కాకూడదు. భక్తికి గమ్యము పరమాత్మయే కావాలి. నిష్కపటంగా, నిష్కామంగా జగన్మాతను ప్రార్థిస్తే ఆ తల్లి  భక్తికి తానే గమ్య మనియు, గమ్యస్థానము కేవలం ముక్తి, పునర్జన్మ రాహిత్యమైన మోక్షము మాత్రమే అని తెలియజేస్తుంది. సాధకుడు మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతంచేసి, సుషుమ్నామార్గంలో పయనింపజేస్తూ, గ్రంథిత్రయమును ఛేదింపజేసి, షట్చక్రముల కావలగల సహస్రారంలో సుధాసాగరం చేర్చితే అక్కడ ఆ కుండలినీ శక్తి కురిపించిస  అమృతధారలలో సాధకుడు ఓలలాడి, శివకామేశ్వరిల ఐక్యాన్ని దర్శించి అంతటితో అదే చాలంటాడనేది భక్తిగమ్యా అను నామానికి అసలైన అర్థం.  అంతేగాని సహస్రారంలో సుధాసాగరంలో కాంచనరాశుల కోసంకాదు, రత్నఖచితమైన ఆభరణముల కోసంకాదు, ఆకాశమునంటే విలాసవంతమైన భవనములు, రంభా ఊర్వశిలను మించు రమణీలలామలతో రాసక్రీడలు కాదు. కేవలం బ్రహ్మజ్ఞాన సంపద, జన్మరాహిత్యమైన మోక్షమే   సాధకుని లక్ష్యమని సమయాచారం తెలిజేస్తోంది. మూలాధారం నుండి బయలుదేరిన సాధన సహస్రారంలో, సుధాసాగరం చేరిన తరువాత అమృతధారలతో తడిసిముద్దయి ఆ బ్రహ్మానందమును అనుభవించుటయే భక్తిగమ్యా అను నామ మంత్రములో ఉన్న భావమని గ్రహింపదగును.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భక్తిగమ్యాయై నమః అని అనవలెను.

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*120వ నామ మంత్రము* 23.4.2022

*ఓం భక్తివశ్యాయై నమః*

రాగద్వేషములకు అతీతముగా అన్ని ప్రాణులలోను భగవంతుని చూచుటయే పరాకాష్ఠకు చేరిన భక్తి అయితే, అటువంటి భక్తికి వశమగునట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్తివశ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తివశ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిపరవశముతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుని భక్తికి ప్రసన్నయైన ఆ కరుణామయి అయిన జగన్మాత ఆ సాధకుని భక్తికి వశమై అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదను అనుగ్రహించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్ధులు, జ్ఞానులు అను చతుర్విధభక్తులు నవవిధభక్తిమార్గములలో ఏమార్గమునందైనను అత్యంత భక్తిపారవశ్యముతో ఆరాధించుచూ, ఆ పరమేశ్వరిని సకల ప్రాణులలోను    చూడగలిగినచో  ఆ భక్తి పరాకాష్ఠకు చేరినదని అర్థము. అంత భక్తితత్పరుడైన ఆ సాధకుని భక్తికి పరవశించి ఆ సాధకునికి పునర్జన్మ రాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

కఠోర యోగ సాధనలో  సాధకుడు మూలాధారమందు నిద్రావస్థలో నున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేసి, బ్రహ్మవిష్ణురుద్రగ్రంథులను ఛేదింపజేస్తూ, షట్చక్రములను వివిధ స్థాయిలలో ఆరాధిస్తూ, కుండలినీ శక్తిని సహస్రారమునకు చేర్చగా, సహస్రారంలోని సుధాసాగరంలో అడుగిడిన కుండలినీ శక్తి తన  అగ్నితత్త్వముతో, సుధాసాగరంలోని చల్లదనమునకు ఘనస్థితిలోనున్న అమృతమును కరిగించగా, ఆ అమృతధారలు సాధకుని నాడీ మండలముపై వర్షించి  బ్రహ్మానందమును పొందిన సాధకుడు తనలోని అజ్ఞాన తిమిరములు విచ్ఛిన్నమవగా పరబ్రహ్మమంటే ఏమిటో తెలియడం జరుగుతుంది. ఇదే కదా జ్ఞానుల భక్తిపారవశ్యత. ఆ భక్తి పారవశ్యతకు పరబ్రహ్మ స్వరూపిణి పరవశయై అమృతధారలలో ఓలలాడించి, సుధాసాగరంలో శివశక్త్యైక్యమును సందర్శింపజేయడమనేదే పరమేశ్వరి యొక్క *భక్తివశ్యా* అను నామ మంత్రమునకు పరమార్థము! 

ఆర్తితో గజేంద్రుడు ప్రార్థించినపుడు గజేంద్రుని భక్తికి పరవశించి మొసలిబారినుండి భగవంతుడు రక్షించాడు.

ఎలా రక్షించాడు? వైకుంఠంనుంచి సుదర్శనాది ఆయుధములను గజేంద్రుని రక్షణకు పంపాడా? లేదు. గజేంద్రుని రక్షించిన విధం బమ్మెర పోతనామాత్యులు ఇలా చెప్పారు.

*శార్దూల విక్రీడితము*

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

*తాత్పర్యము*

"దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!"

అని గజేంద్రుడు ఎలుగెత్తి ఆర్తితో ప్రార్థింపగా, ఆ ప్రార్థన  వైకుంఠంలో లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుని చెవులకు వినబడింది. వెంటనే ఆ భగవంతుడు, గజేంద్రుని రక్షించడానికి ఎలా బయలుదేరాడో పోతనగారు ఆ ఘట్టాన్ని ఎలా వివరించారో చూద్దాం.

*మత్తేభ విక్రీడితము*

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

*తాత్పర్యం*

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

అలాశ్రీమన్నారాయణుడు బయలుదేరగా, ఆయనవెంట వైకుంఠమే కదిలి వెడలగా గజేంద్రుడు రక్షింపబడ్డాడు. గజేంద్రునిలోని అరిషడ్వర్గములు నశించి ముక్తిని పొందాడు. ఆ విధంగా పరమాత్మ భక్తుని భక్తికి వశమవడం జరుగుతుంది.

*ఉద్థవుడు* జిజ్ఞాసతో భగవంతుని లీలలను తెలుసుకోవాలను కున్నాడు. అదేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము.

శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని జిజ్ఞాసతో ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలను  అడిగాడు. అవి ఏమిటంటే, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆడకుండా ఆపవచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని అడుగగా అప్పుడు దానికి శ్రీకృష్ణుడు, ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు.

ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని జవాబు ఇచ్చాడు.

పరమాత్మ భక్తులకు ఎలా వశమగునో ఈ దృష్టాంతములు చాలుగదా! 

జగన్మాత సాక్షాత్తు నారాయణి. రాగద్వేషాలకు అతీతంగా తనను సేవించు భక్తుల పారవశ్యతకు వశమై *భక్తివశ్యా* అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తివశ్యాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

121వ నామ మంత్రము 24.4.2021

ఓం భయాపహాయై నమః

రోగములవలన, జంతువులవలన, అతివృష్టిఅనావృష్టిలవలన, సన్నిహితులవలన, జరామృత్యువులవలన కలుగు భయములు పోగొట్టి, కర్మఫలములనుభవించు నపుడు మనసు చిక్కుకోనీయక తన భక్తులను కాపాడు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భయాపహా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం భయాపహాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తునకు జరుగుచున్న వాటికి భయపడకుండా, కర్మఫలములనుభవించువేళ మనస్సు అదుపుతప్ప నీయకుండా అనుగ్రహించును మరియు ఆధ్యాత్మిక చింతనలపై మనసు నిలిపియుంచును.

జన్మించిన ప్రతీ జీవికి ప్రతీ నిమిషము ఏదో ఒక భయము వెంటాడుచునే యుండును. బ్రహ్మానందమును పొందినవాడు భయమును పొందడు. అట్టి బ్రహ్మానందము పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతను నిష్కపటమైనట్టి భక్తితో సేవించడం వలన కలుగుతుంది. భక్తివశ్యా అని స్తుతింపబడు శ్రీమాత భయమును పోగొట్టే బ్రహ్మానందమును ప్రసాదిస్తుంది గనుక అమ్మవారిని భయాపహా అని అన్నాము. ఆధివ్యాధులు (మానసిక మరియు శారీరక వ్యాధులు) సంభవించినపుడు, అరణ్యములో సర్పములు, క్రూరజంతువులు, కార్చిచ్చు మొదలైన వాటివలన కలిగేభయము, ప్రకృతి విలయముల వలన భయము, ఎడారి, నీరు, మెట్ట, వ్యాఘ్రము, కుంభీరము (మొసలి), దొంగలు మరియు సంసారములో తరచు ఏర్పడే కలతల వలన కలిగే భయములకు మనసు వశము తప్పనీయక కేవలము జగన్మాత నామస్మరణమే విశేషముగా పఠించినచో ఆ దేవియే అన్నిటికీ బాధ్యత వహించుతుంది. అందుచేతనే శ్రీమాతను భయాపహా అని అన్నాము. 

రాక్షసులవలన దేవతలు భీతి చెందారు. జగన్మాత రాక్షససంహారంచేసి వారిభయాన్ని పోగొట్టింది. 

సంపద ఉన్నవారికి చోరులభయము, రాజులకు శత్రుభయము, రోగులకు మరణభయము, గాడాంధకారములో పిశాచభయము, విద్యార్ధికి పరీక్షభయము, ప్రయాణము చేయువానికి వాహనభయము, రైతుకు అతివృష్టి-అనావృష్టి భయము, కొలువులో యజమానిభయము, సంసారంలో కలతల భయము, గర్భిణీకి ప్రసవభయము, కప్పకు పాము భయము ఇలా ఎన్నో అడుగడుగునా భయము వెంటబడుతూనే ఉంటుంది. ధైర్యము చిక్కబట్టుకోవాలన్నా, మనసు వశంతప్పక ఉండాలన్నా ఆ పరమేశ్వరీ ధ్యానంతో సమస్తభయములు పటాపంచలవుతాయి. అందుకే ఆ తల్లి భయాపహా అని స్తుతిస్తున్నాము.

కర్మఫలాలు ప్రతీజీవికి సహజం. అవి తప్పవు. కర్మఫలాన్ని కాదనే ధైర్యము పరమేశ్వరునికి కూడాలేదు. అలాంటి సమయాలలో మనసు వశంతప్పకుండా ఉండాలి, ధైర్యముకలగాలి అంటే జగన్మాత నామస్మరణమే శరణ్యం. కర్మఫలాలను అనుభవించుటలో కావలసిన ధైర్యాన్ని ఆ పరాత్పరి ఇస్తుంది. అందుకే ఆ పరమేశ్వరి భయాపహా అని నామ ప్రసిద్ధి చెందియున్నది.

కొన్ని సమయాలలో దుష్టసంకల్పంచేత, అరిషడ్వర్గములు ఆవహించడం చేత పాపకర్మలు చేస్తే ఫలితం భయానకంగా ఉంటుంది. ఆ శ్రీమాత  నామస్మరణ మనలో దుష్టసంకల్పములు దరిచేరనీయక, అరిషడ్వర్గములను అదుపులో ఉంచగల సత్సంకల్పములు అ సంకల్పితంగా మనలో ఏర్పడతాయి. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భయాపహాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

122వ నామ మంత్రము 25.4.2022

ఓం శాంభవ్యై నమః

శంభుని (శివుని) భార్యగా, శాంభవీ దిక్షాస్వరూపిణిగా, శాంభవీ ముద్రాస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శాంభవీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం శాంభవ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధి, శాంతి, సౌఖ్యములు లభించును.

శంభుడు అనగా శంకరుడు. ఆ శంభుని భార్యగా శాంభవీ యను నామము కలిగియున్నది. శాంభవీ అనగా ఎనిమిది సంవత్సరముల బాలిక. శారదానవరాత్రులలో ఆశ్వయుజ సప్తమి, అనగా శరన్నవరాత్రులలో ఏడవ రోజున ఎనిమిది సంవత్సరముల బాలికకు పూజచేయుదురు. ఈ పూజనే కుమారీ పూజ అనికూడా అంటారని దేవీభాగవతంలో చెప్పబడినది.   జగన్మాత కుమారీ స్వరూపిణిగా పూజింపబడుతూ శాంభవీ అని స్తుతింపబడుచున్నది.

యోగశాస్థ్రములో శాంభవీ అను యోగముద్ర గలదు.

అంతర్లక్ష్యం బహిర్దృష్టిః నిమేషోన్మేషవర్జితా|

ఏషా సా శాంభవీముద్రా సర్వతంత్రేషు గోపితా॥॥ అని కల్పసూత్రంలో గలదు.

కన్నులు బాహ్యప్రపంచమును చూచుచున్నట్లు కనబడిననూ, ఆ కన్నుల రెప్పలు ముడుచుట తెరచుట లేక, (అరమోడ్పు కన్నులు), ఆ దృష్టి సహస్రారంలోని బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండే ఈ యోగ స్థితిని శాంభవీ ముద్ర అంటారు. 

కల్పసూత్రములలో చెప్పిన ప్రకారము మూడు రకాల దీక్షలు. అవి 1) శాక్తి, 3) శాంభవి, 3) మాంత్రి. సద్గురువు యోగ్యుడని భావించు శిష్యునకు ఇచ్చు దీక్షలలో శాంభవీ దీక్ష ఒకటి. పరమ శివుడిని శం కరుడు. అని శం అను అక్షరాన్ని ప్రత్యేకంగా విశేషిస్తే, శం అనగా శాంతి, సుఖము అని అర్థం. మానసిక, శారీరక రుగ్మతలకు యోగా చేయమని అంటారు. అలా మనం యోగదీక్షలో ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో ఓం అనేది మాత్రమే ఉంటే మనకు కలిగే అనుభూతిని శం అవుతుంది. ఈ శం అనేదే మనకు కలిగే శాంతి, సౌఖ్యముల అనుభూతి. అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) మనపై ప్రభావం చూపుతున్నప్పుడు, ఈ ప్రభావాన్ని అదుపు చేయడానికి కావలసినది శమము అను పదము శం నుండి వచ్చినదే. శాంతి, సుఖములు శంభుని వద్ద లభిస్తాయి.  శంభుడు అంటే అయ్యవారు వ్యక్తంకానివన్నీ ఆయనే అయితే ఆయనవద్ద వ్యక్తమయే శం అను (శాంతి,సౌఖ్యముల)  రూపమే వ్యక్తమయే ప్రతీదీ అయిన అమ్మవారు. అందుకే ఆ జగన్మాత శాంభవీ అని అన్నాము. 

శాంతి,సౌఖ్యముల ప్రతిరూపమైన ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం శాంభవ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

123వ నామ మంత్రము 26.4.2022

ఓం శారదారాధ్యాయై నమః

సరస్వతీ దేవిచే ఆరాధింపబడునదిగా, శరదృతువునందు ఉపాసింపబడునదిగా, వశిన్యాది వాగ్దేవతలచే పూజింపబడునదిగా, వసంత నవరాత్రులలో సేవింపబడునదిగా విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శారదారాధ్యా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం శారదారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకునకు ఎనలేని బ్రహ్మజ్ఞానసంపదతో బాటు భౌతికపరమైన సుఖసంతోషములు కూడా సంప్రాప్తమగును.

సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా (శ్రీలలితా సహస్రనామ స్తోత్రం, 123వ శ్లోకం, 614వ నామ మంత్రము) జగన్మాత తనకు ఎడమకుడిప్రక్కల లక్ష్మీ, సరస్వతులచే సేవింపబడినది అనికలదు. అనగా శారదా (సరస్వతీ) దేవిచే ఆరాధింపబడినది కనుక శ్రీమాతను శారదారాధ్యా అని స్తుతించాము. శారదానవరాత్రులు అని దశరానవరాత్రులను అంటాము. శరదృతువులో తొలి పదిరోజులలో ఈ నవరాత్రులు వస్తాయి. శారత్ ఋతువులో ఆరాధింపబడునది గనుక శ్రీమాతను శారదారాధ్యా అని అన్నాము.  

కాళికా పురాణంలో

శరత్కాలే పురాయస్మాన్నవమ్యాం బోధితా సురైః|

శారదా సా సమాఖ్యాతా పీఠే లోకే చ నామతః॥  (సౌభాగ్యభాస్కరం, 331వ పుట)

అని చెప్పబడిసది.  అనగా పూర్వము దేవతలచే శరత్కాల నవమినాడు మేల్కొల్పబడినది అగుటచే శారదా పీఠమనియు, ఆ పీఠమందుగల శ్రీమాత శారద అని పిలవబడుచున్నది. శరత్ అంటే సంవత్సరమని అమరంలో గలదు. సంవత్సరమునకు ప్రారంభంలో అనగా చేసిన దేవీపూజ మహాపూజ అవుతుంది అని మార్కండేయ పురాణమందు చెప్పబడినది. అందుచే శ్రీదేవిని శారదారాధ్యా అను నామ మంత్రముతో ఆరాధిస్తున్నాము. వసంత ఋతువులోని నవరాత్రులలో దేవిని పూజించ వలెనని రుద్రయామళమందు చెప్పబడినది. శారద అను శబ్దమునకు శాలీనుడు, ప్రతిభగలవాడు అని మేదినీ నిఘంటువు ప్రకారం చెబుతారు. కొందరు పండితులు సభలకు వెళ్ళక  శాలలోనే ఉండి అన్తర్ముఖులై దేవిని ఆరాధింతురు. అట్టి శాలీనులచే ఆరాధింపబడు  శ్రీమాతను శారదారాధ్యా అని అన్నారు. వశిన్యాది దేవతలు సాక్షాత్ సరస్వతీ (శారదా) రూపులు. అటువంటి వశిన్యాదులచే శ్రీమాత  ఆరాధింపబడుచున్నది గనుక శారదారాధ్యా అని అన్నారు.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శారదారాధ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

124వ నామ మంత్రము 27.4.2022

ఓం శర్వాణ్యై నమః

పరమశివుని అష్టమూర్తులలో భూమిమూర్తి అయిన శర్వుని భార్యయై, శర్వాణి యను నామముతో విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శర్వాణీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ  మంత్రమును ఓం శర్వాణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు అన్నవస్త్రములు, ఆయురారోగ్యములు, సుఖసంతోషములు, కీర్తిప్రతిష్టలకు లోటులేక భౌతికపరముగానూ, ఆధ్యాత్మికపరముగాను జీవించి, అంతిమమున ఆనాయాసముగా జగన్మాత పాదపద్మములకు చేరి పునర్జన్మరహితులగుదురు.

శర్వుడు అనునది పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకటి. అట్టి శర్వుని భార్యగా జగన్మాత శర్వాణీ యను నామ ప్రసిద్ధమైనది.

శివుని అష్టమూర్తులు:

శివపురాణంలో స్తుతించబడిన రుద్ర స్తోత్రమందు శివుని అష్టమూర్తి నిరూపణము ఇలా జరిగినది. అదియే మనకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియగలము.

1. మొదటి మూర్తి శర్వుడు భూమిని అధిష్టించి ఉంటాడు. అనగా భూమిమూర్తిగా కలిగి ఉంటాడని అర్థం. 

2. జలాధిష్ఠాన మూర్తి భవుడు

3. అగ్నులకు మూర్తి రూపుడు రుద్రడు 

4.  లోపలా బయటా నిరంతరం చలించే వాయు రూపుడు ఉగ్రుడు

5.  ఐదోవాడు - పంచభూతాత్మకుడు - ఆకాశరూపుడు భీముడు.

6.  క్షేత్రజ్ఞుడై, జీవాత్మలో వసించే మూర్తి రూపుడు పశుపతి

7. సూర్యాంతర్వర్తియై ప్రకాశించే సప్తమూర్తి ఈశానుడు

8. సచ్చిదానంద మయుడైన యజమాన రూపుడై విరజిల్లువాడు శివుడు

లింగపురాణంలో ఇలా చెప్పబడినది:

చరా చరాణాం భూతానాం ధాత విశ్వంభరాత్మకః

శర్వ ఇత్యుచ్యతే దేవః సర్వశాస్త్రార్థపారగైః

విశ్వంభరాత్మన స్తస్య శర్వస్య పరమేష్ఠినః

సుకేశీ కథ్యతే పత్నీ తనుజోఽంగారక స్మృతః॥
(సౌభాగ్యభాస్కరం - 332వ పుట)

ఈ చరాచర జగత్తును భరించువాడు శర్వుడు. అట్టి శర్వుని భార్య అయిన జగన్మాత శర్వాణి యను నామముతో విరాజిల్లుతున్నది.

భూమిమూర్తి అయిన శర్వుని (శివుని) భార్య శర్వాణి కాగా ఈమెను సుకేశి అని అంటారు. సుకేశికి పుట్టినవాడు కుజుడు

శర్వస్వయా ద్వితీయా తు నామభూమి తనుస్మృతా (సౌభాగ్య భాస్కరం - 332వ పుట)

పైన చెప్పబడిన శర్వునికి రెండవ రూపము భూమి.

శర్వుని భార్యగా ఆరాధించు జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శర్వాణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*125వ నామ మంత్రము*  28.4.2021

*ఓం శర్మదాయిన్యై నమః*

జీవులకు తమతమ పూర్వజన్మ పుణ్యమునకు తగినట్లుగా పరబ్రహ్మాత్మికమైన శాశ్వత సుఖములను, జన్మరాహిత్యమైన ముక్తిని అనుగ్రహించు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శర్మదాయినీ* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం శర్మదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తునకు సత్యము, నిత్యమైన సఖములను ప్రసాదించును, పునర్జన్మరహితమైన  మోక్షమును ప్రసాదించును.

శర్మ అనగా సుఖము. శర్మదాయినీ అంటే సుఖమును ఇచ్చేది. పారలౌకికానందమును చేకూర్చే శాంతి అనగా చిత్తనిశ్చలతను సంప్రాప్తింపజేస్తుంది.

*సుఖం దధాతి భక్తేభ్యః తేనైషా శర్మదాయినీ*  (సౌభాగ్యభాస్కరం -  332వ పుట) 

భక్తులకు సుఖమునిచ్చేది జగన్మాత. అందుచేత ఆ తల్లి *శర్మదాయినీ* అని స్తుతింపబడుచున్నది.  

 తన కుటుంబం బాగుండాలి, తన భార్య, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు విద్యా బుద్ధులలో మేటిగా మెలగాలి, తన వృత్తి, వ్యాపారములలో అపారమైన ధనలాభములు పొందాలి. ఇల్లు, పొలము, ధనము, ఆభరణములు ఏర్పరచుకోవాలి, హంసతూలికా తల్పంపై పరుండాలి, దాసదాసీ జనములతో సేవలు పొందాలి, తన ఇల్లు బంధుమిత్రులతో కళకళ లాడాలి, అలా ఉంటే తను ఆనందంగా ఉండవచ్చు, సుఖసంతోషములు పొందవచ్చు. ఇవన్నీ భౌతిక పరమైన సుఖములు. ఇవన్నీ తనువులోని ఆత్మ ఉన్నంతవరకే. ఇవన్నీ క్షణికములు.  అలాగే తను అనుకున్న ఈ భౌతిక సుఖములు వీటిలో ఏవి లభించకపోయినా అశాంతి, నిద్రలేమి, అసౌఖ్యము ఏర్పడతాయి.  కొన్ని క్షణాలలో ప్రాణం పోతుంది అంటే తన సంపాదనలో తెచ్చుకున్న తన హంసతూలికా తల్పంకూడా తనది కాదు. ఆరుబయట గడ్డిమీద పడేస్తారు.గడ్డిమీద పడేసిన తరువాత, ప్రాణం ఉండి స్పృహ ఉంటే ఆస్తుల వివరాలు, రావలసిన బాకీల వివరాలు, వీలునామాల వివరాలు తనవారు అడుగుతారు. 

 సుఖములు అంటే తనువునుండి ఆత్మ వెడలిన తరువాత కావలసినవి.  జన్మరాహిత్యమైన ముక్తి, పారలౌకికానందం. ఇవన్నీ తన భక్తులకు తమతమ పూర్వజన్మ పుణ్యఫలాన్ననుసరించి శాశ్వతమైన సుఖాన్ని శ్రీమాత అనుగ్రహిస్తుంది గనుక ఆ తల్లి *శర్మదాయినీ* అని అనబడుతున్నది.

బ్రాహ్మణులకు పేరు చివర శర్మ అని ఉంటుంది. అంటే శాంతి లక్షణం ఉన్నవారని అర్థం. ఎంతమందికి శాంతి లక్షణం ఉంది? అసహనం చేత, అసంతృప్తి చేత తీవ్రమైన అశాంతికి లోనై ఉంటూంటారు. మరి వారి పేరు చివర శర్మ అనేది ఎంతవరకూ న్యాయము? అలా పేరు చివర శర్మ అని లేక పోయినా, వారు నిత్యం సంధ్యావందనం చేస్తున్నవారైతే (సంధ్యావందనం అంటేనే తెలియని వారు కోకొల్లలు), సంధ్యావందనంలో సంకల్పంలో తమ పేరుకు చివర శర్మ అనేది చేర్చి చెబుతారు. అంటే బ్రాహ్మణులకు శాంతి లక్షణం ఉండాలి కదా. జగన్మాత అటువంటి వారికి కూడా వారి దీక్షా సామర్థ్యాన్ననుసరించి శాంతిని అంటే *చిత్తనిశ్చలతను* ప్రసాదిస్తుంది గనుక ఆ తల్లి *శర్మదాయినీ* అని అనదగును. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే బ్రాహ్మణునికి బ్రాహ్మణత్వమును (శర్మ అని సంకల్పంలో చెబుతున్నారు గనుక) ప్రసాదిస్తుంది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శర్మదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 **శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*126వ నామ మంత్రము* 29.4.2022

*ఓం శాంకర్యై నమః*

శాంతి,సౌఖ్యములను చేకూర్చు శంకరుని ఇల్లాలై తన భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక సుఖశాంతులను ప్రసాదించు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సుఖశాంతులతో, ఆధ్యాత్మికానందముతో జీవనముగడుపుదురు.

మనం యోగాలో చేయు ఉచ్ఛ్వాసనశ్వాసల్లో *ఓం* కారం నినదింపజేస్తాము. . ఈ *ఓం* అనే  బీజాక్షరం చేత పరమేశ్వరుడు తెలియబడతాడు. అట్టి *ఓం* కారంలో కలిగే అనుభూతినే *శం* అని అంటారు. *శం* అనగా శాంతి,సౌఖ్యము.   *కరుడు* అనగా కలిగించేవాడు.  అందుకే పరమశివుని *శంకరుడు* అన్నారు. 

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అరిషడ్వర్గములను అదుపులో పెట్టుకోవాలంటే కావలసినది *శమము* అనే శక్తి. అరిషడ్వర్గములను అదుపులో పెట్టిననాడు శాంతి, సౌఖ్యము నిశ్చయంగా లభిస్తాయి. ఈ అరిషడ్వర్గములకు బానిస అయినవాడు శాంతిసౌఖ్యములు కరువై అశాంతి, అసౌఖ్యములతో జీవించుతాడు. హిరణ్యకశిపుడు వరగర్వంతో మదమెత్తి, క్రోధావేశముతో శ్రీహరినే దూషిస్తాడు. సాక్షాత్తు తన పుత్రుడైన ప్రహ్లాదుని హరిభక్తికి మాత్సర్యపూరితుడై తన పుత్రుని నానాహింసలు పెడతాడు. గరళమిచ్చి, సర్పములచేత కరిపించి, పర్వతముల నుండి పడద్రోసి హింసిస్తాడు. శ్రీహరిపై క్రోధము, వరగర్వముతో మదము, తన పుత్రుడు తన వైరిపక్షమైన శ్రీహరిని భక్తుడగుటచే మాత్సర్యము పూరితుడుకూడా అయాడు. కడకు శ్రీహరిచేతనే సంహరింపబడతాడు. పరస్త్రీలోలుడై, రావణబ్రహ్మ కూడా శ్రీహరి అవతారమైన కోదండరాముని చేతిలో హతమవుతాడు. అరిషడ్వర్గములు వశములో పెట్టగలిగే శక్తిని శమము అన్నారు.  శమమనే శక్తిని ప్రసాదించే వాడు శంకరుడు. ఆ *శంకరుడు* *ఓంకారము* ద్వారా ప్రసన్నుడై శమము అనే శక్తిని ప్రసాదిస్తాడు. అట్టి శమమును ప్రసాదించే శంకరుని భార్య అయిన జగన్మాత *శాంకరి* అని నామ ప్రసిద్ధమైనది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంకర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*127వ నామ మంత్రము* 30.4.2022

*ఓం శ్రీకర్యై నమః*

సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సిరిసంపదలు, ఆధ్యాత్మిక సంపదలు సంప్రాప్తమయి ఆనందముతో, ఆత్మానందానుభూతితో జీవింతురు.

జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి   అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి. 

*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును. అందుకే జగన్మాత *శ్రీకరీ* అని అనబడినది. నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణి అంటే జగన్మాత. విష్ణుసహస్రంలో 
 
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః* (విష్ణుసహస్ర నామస్తోత్రము, 65వ శ్లోకము, రెండవ పాదము)

పై శ్లోకంలో *శ్రీకరః* (శ్రీకరుడు) అని శ్రీమన్నారాయణుని స్తుతించాము. 

ఇక్కడ నారాయణి కూడా *శ్రీకరి* అని స్తుతింపబడుతూ, మువురమ్మల (మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి) అనడంచేత కూడా *శ్రీకరీ* అని నామ ప్రసిద్ధమైనది.

*అష్టలక్ష్ములు*

1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీకర్యై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

128వ నామ మంత్రము 1.5.2022

ఓం సాధ్వ్యై నమః

ఎన్ని జన్మలెత్తిననూ పరమేశ్వరునే తన భర్తగా పొంది, శివునిలో సగభాగమైనది. దక్షయజ్ఞ సమయంలో తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞకుండంలో తనను తాను ఆహుతి చేసుకున్నది. అటువంటి అనన్య సామాన్యమైన పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సాధ్వీ యను రెండక్షరముల (ద్వ్యయక్షరీ) నామ మంత్రమును ఓం సాధ్వ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతసు ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరీ కరుణాకటాక్షములచే సర్వాభీష్టసిద్ధి చేకూరును.

పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. వారు జన్మలెత్తునపుడు ఆయా జన్మలలో భిన్న శరీరములతో ఉన్న భర్తలు పొందుతుంటారు. కాని జగన్మాత మాత్రం ఒకే స్థూలశరీరం ఉన్మ పరమేశ్వరునే పొందుచున్నది.  అంతేకాదు పరమేశ్వరుని శరీరంలో సగభాగం తన సొంతం చేసుకున్నది.

ఇదేవిషయాన్ని ఆది శంకరులు సౌందర్యలహరిలో  96వ శ్లోకం లో ఇలా చెప్పారు.
 
కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః

శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|

మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే‌

కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||
 
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.
 
భావం

అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీవల్లభులనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవి ని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు.కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివుని లో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది.నీ ఉద్యానవనం లో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు.అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు ( ముందు లెక్కింపవలసినదానవు) నీవు.

ఇచట శ్రీ శంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మి ని ఉపాసించి లక్ష్మి‌ని మాత్రం పొందవచ్చు. కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు. ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు, లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం. ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము

జగన్మాతకు నమస్కరించునపుడు 
ఓం సాధ్వ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

129వ నామ మంత్రము 2.5.2022

ఓం శరచ్చంద్రనిభాననాయై నమః

శరత్కాల చంద్రునితో పోల్చదగిన ముఖబింబం గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి 
యందలి శరచ్చంద్రనిభాననా అను ఎనిమిది అక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శరచ్చంద్రనిభాననాయై నమః అని ఉచ్చరిస్తూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సర్వాభీష్టసిద్ధి పొందును.

సంవత్సరములోని ఆరు ఋతువులలో  శరదృతువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. శరదృతువునందే చంద్రుని కాంతి స్వచ్ఛముగా, కాంతివంతముగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందునా శరదృతువునందు పూర్ణ చంద్రునికాంతి  అత్యంత రమణియంగా ఉంటుంది, కన్నుల పండువుగా ఉంటుంది. అదే విధంగా జగన్మాత ముఖబింబం శరత్కాలమునందు పున్నమి చంద్రబింబమువలె అందముగా, స్వచ్ఛంగా ఉన్నది. 

శంకర భగవత్పాదులవారు సౌందర్య లహరిలో ఇలా చెప్పారు.

స్మితజ్యోత్స్నాజాలం - తవ వదనచంద్రస్య పిబతాం

చకోరాణామాసీ -దతిరసతయా చంచుజడిమా |

అతస్తే శీతాంశో -రమృతలహరీ మామ్లరుచయః

పిబంతీ స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజి కధియా || 63 ||

చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
 
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శరచ్చంద్రనిభాననాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

130వ నామ మంత్రము 

ఓం శాతోదర్యై నమః 3.5.2022

కృశించిన నడుము, ఉదరము గలిగిన సర్వజననికి నమస్కారము.

లెక్కలేనన్ని గుహలు గులవాడు శాతోదరుడు అనగా హిమవంతుని పుత్రిక అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  శాతోదరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శాతోదర్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తితో ఆ హైమావతి అయిన జగన్మాతను ఉపాసించు సాధకులు భౌతికంగా కుటుంబంలో సుఖసంతోషములను ధర్మార్థకామమోక్షముల కనుగుణంగా అనుభవించుచూ ఆ తల్లి కరుణచే సత్కార్యాచరణలో మేటిగా ఖ్యాతివహించి తమ ధర్మార్థకామమోక్షముల స్థాయిననుసరించి మోక్షము నందెదరు.

దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు. 

శాతోదరీ అనగా కృశించిన శరీరము గలిగినది. స్త్రీ సాముద్రిక లక్షణాలలో సన్నని నడుము ఒక అందమైన లక్షణము. 

హిమవంతునికి మరోపేరు శాతోదరుడు. అనగా లెక్కలేనన్ని గుహలు గలవాడు. అతని హమావతి. శాతోదరుని కుమార్తె శాతోదరి అనికూడా పేరు గలదు. తారకాసుర సంహారానికి హైమావతిగా పరమేశ్వరి జన్మించినది అనికూడా పురాణాలు చెబుతున్నాయి. తారకాసుర సంహారమునకు హిమంతుని ఇంట హైమావతిగా సతీదేవి జన్మించినది. 

లలితా సహస్రనామావళి (36వ నామ మంత్రము) లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమా కంటిచే చూడదగు సన్నని నూగారు తీగకు ఆధారంగా ఊహింపదగిన నడుము (సన్నని నడుము) గలిగినది జగన్మాత. ఈ సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు జగజ్జనని ఆధారభూతమై  జగన్మాత ఉన్నదని గూఢార్థము.

సన్నని నడుము సదాచార సంపన్నతకు గుర్తు. కులాంగనా (92వ నామ మంత్రము) పాతివ్రత్యాది గుణశీలతులు గలిగినది జగన్మాత. సాధ్వీ (128వ నామ మంత్రము) అనన్య సామాన్య పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాత)

పార్వతీ దేవిపై కొన్ని పురాణగాథలు

హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి యజ్ఞకుండాగ్నిలో దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒక కాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అంటారు. 
ఇది మాత్రమే కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆ గంగా నిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుల పుత్రులు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శాతోదర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

131వ నామ మంత్రము 4.5.2022

ఓం శాంతిమత్యై నమః

జ్ఞానాధిక్యమైన  ప్రజ్ఞానఘన స్థితిలో శాంతియుతమైన మనస్సు గలిగి విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శాంతిమతీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శాంతిమత్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు  నిశ్చయముగా జ్ఞానాధిక్యమైన దైవాంశతో వర్ధిల్లి అనాయాసమైన పునర్జన్మరాహిత్యమైన ముక్తిని పొందగలడు.

తురీయావస్థలో మనోవృత్తులు ముఖ్యప్రాణమునందు లయమైనవేళ, బుద్ధిమాత్రమే జాగరూకమైయుండి, నవరసములలో కేవలం శాంతరసము మాత్రమే యుండునది ప్రజ్ఞానఘనస్థితి. అట్టి ప్రజ్ఞానఘనస్థితిలో ఇచ్ఛా క్రియాంశలు దాదాపు పోయి జ్ఞానశక్తిమాత్రమే ఉంటుంది. జ్ఞానాధిక్యమే దైవాంశము. అట్టి శాంతరసస్వరూపురాలు ఆ పరమేశ్వరి.

జగన్మాత శాంతియుతమైన మనస్సుగలిగి యుంటుంది. ప్రజ్ఞానఘనరూపిణి అనగా అవిద్యాసంబంధములేని మహోన్నత జ్ఞానస్వరూపిణి.  శుద్ధపరబ్రహ్మము. భక్తుల నిమిత్తమై  సగుణాకార రూపము దాల్చిన శ్రీమాత. భక్తులయందు జగన్మాతకు తీక్షణమైన భావము ఉండదు. అంతరింద్రియ నిగ్రహము గలిగినది.   జగన్మాతకు గల అంతరింద్రియ నిగ్రహమువలన ఏర్పడే మానసికమైన సుఖావస్థయే శాంతము.  నవమావరణమందు జగన్మాత ఉన్నప్పుడు శాంతరసముతో విరాజిల్లుతుంది. తురీయావస్థలో మనోవృత్తులు మఖ్యప్రాణమందు లయమౌతాయి.  అట్టి స్థితిలో బుద్ధి జాగృతమై ఉంటుంది. ఇదే ప్రజ్ఞాన ఘనస్థితి.  ఈ ప్రజ్ఞానఘనస్థితిలో క్రింద వివరించిన నవరసములలో తొమ్మిదవది అయిన శాంతరసము మాత్రమే నెలకొనియుంటుంది. ఈ స్థితిలో ఇచ్ఛా మరియు క్రియాంశములు ఇంచుమించు లేకపోయి, కేవలం జ్ఞానశక్తి మాత్రమే   విలసిల్లుతూ ఉంటుంది. ఈ జ్ఞానాధిక్యత దైవాంశమునకు సంకేతము.

తొమ్మిది ప్రాథమిక రసాలను నవరసాలు అంటారు. అవి:

1) శృంగార, , 2) హాస్య, 3) కరుణ,
4) రౌద్ర, 5) వీర, 6) భయానక, 7) బీభత్స, 8) అద్భుత, 9) శాంత

1) శాంభవీ (122వ నామ మంత్రము) - శంభుని పత్ని లేదా ఎనిమిది వత్సరముల కన్య, 

2) శర్వాణీ (124వ నామ మంత్రము) శర్వుని (శివుని)  పత్ని,

 3) సాధ్వీ (128వ నామ మంత్రము) - అనన్యసామాన్యమైన పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాత,

 4) శరచ్ఛంద్రనిభాననా, (129వ నామ మంత్రము) - శరత్కాల పూర్ణచంద్రునితో  పోల్చదగిన ముఖబింబం గలిగిన పరమేశ్వరి,

5) శాతోదరీ(130వ నామ మంత్రము) - కృశించిన సన్నని నడుముగలిగిన లేదా అనేక గుహలు గలిగిన శాతోదరుని (హిమవంతుని) కుమార్తె,

 6) శాంతిమతి (131వ నామ మంత్రము) - శాంతిస్వరూపిణి అయిన పరమేశ్వరి

పై ఆరుగురూ భవానీదేవి యొక్క అంగదేవతలు.

112వ నామ మంత్రము నుండి 131వ నామ మంత్రము వరకూ శాంభవీ విద్యకు సంబంధించిన నామ మంత్రములు. 

1) శర్మదాయినీ (125వ నామ మంత్రము) - భక్తులకు సుఖశాంతులను ప్రసాదించునది,

2) శాంకరీ (126వ నామ మంత్రము) - సకల సుఖాలను కలుగ జేయు శంకరుని భార్య,

3) శ్రీకరీ (127వ నామ మంత్రము) - లక్ష్మీకరము, శుభకరములు ప్రసాదించు పరాశక్తి.

పై మూడు నామ మంత్రములు మూడునూ శాంభవీ విద్యోపాసనవలన ఫలశృతి.

ఇక శాంభవీదేవిని ఎప్పుడు ఉపాసించాలనునది 123వ నామ మంత్రములో చెప్పబడినది.

శారదారాధ్యా (123వ నామ మంత్రము) - వసంత ఋతువులోని నవరాత్రులలో పూజించవలెనని రుద్రయామళములో చెప్పబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శాంతిమత్యై నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

132వ నామ మంత్రము 5।5।2022

ఓం నిరాధారాయై నమః

సమస్తానికి తానే ఆధారమై ఉండి, తనకంటూ ఏ ఆధారమూలేని స్వయంప్రకాశ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము।

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరాధారా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరాధారాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునికి తానే ఆధారమై, సమస్త భౌతికపరమైన సుఖశాంతులను ప్రసాదించుచూ, సాధకుని అను నిత్యము తన పాదసేవలో లీనమొనర్చి తరింపజేయును।

సృష్టికి పూర్వమే జగన్మాత కలదు। త్రిమూర్తులకన్నా, సమస్త సృష్టికన్నా తానే ముందు (ఆదిపరాశక్తిగా) ఉన్నది। ఆ స్థితిలో తాను ఎవరిపైననూ ఆధారపడలేదు। సమస్త లోకములను తనలో లీనమొనర్చుకొని, ఆ లోకములకు తానాధారమైనది। తనకు ఆధారము అవసరం లేదు। అందు చేత నిరాధార యనుటకన్నా తానే సకలమునకు ఆధారమై నిలచియున్నది అనుట భావ్యము। ఎవరికైనా సాయంచేసేవారు లేకపోతే వారిని నిరాధారులు అంటాము। కాని జగన్మాత అలాంటి నిరాధార కాదు। ఆధారము అవసరములేని మరియు ఆధారమును ఇవ్వగలంతటి శక్తులు లేవు అందుకే ఆ తల్లి నిరాధారా

మనం చూచుచున్న ప్రతీ వస్తువుకూ కూడా ఆధారం ఉంది। 

పూలతీగకు పందిరి ఆధారం। ఆత్మకు దేహం ఆధారం, అగ్నిప్రజ్వలనానికి ఇంధనం ఆధారం। ఇలా చరాచర జగత్తుకు ఆధారమైనది శ్రీమాత।  ఆధారములన్నిటికీ తానే ఆధారం। ఆ అమ్మ సర్వస్వతంత్ర। 

సూత సంహితలో పూజచేయు విధానం రెండుగా చెప్పబడినది। 

పూజా శక్తేః పరాయా స్తు ద్వివిధా సంప్రకీర్తితా

1) జగన్మాతను వ్యక్తస్వరూపంగా (కనుపించే విగ్రహముగా)  పూజించడమనేది బాహ్యపూజ।దీనినే సగుణోపాసన।

2) రూపరహితంగా, కేవలం మానసికంగా, దహరాకాశంలో ఆ తల్లిని ఊహిస్తూ ధ్యానంచేయడమనేది అంతఃపూజ అనియు నిర్గుణోపాసన అనియు, ఇంకను అభ్యంతర పూజ అని కూడా అంటారు। అభ్యంతర పూజల్లో సాధార పూజలనీ, నిరాధార పూజలనీ రెండురకాల పూజలు గలవు।

ఇందులో సాధారపూజ అనగా నిత్యం ధూప, దీప, నైవేద్యములతో,  స్తోత్రములు పారాయణచేస్తూ విగ్రహంలో జగన్మాతను ఊహించడం। నిరాధార పూజలలో కేవలం జ్ఞాన, ధ్యానాదులు మాత్రమే। అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలు గనుక జగన్మాత నిరాధారా అని నామ ప్రసిద్ధమైనది। అంతర్ముఖ సమారాధ్యా జగన్మాత నిరాధార పూజలకు సులభంగా భక్తపరవశ అవుతుంది। అందుకే జగన్మాత నిరాధారా అని స్తుతింపబడుచున్నది।

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరాధారాయై నమః అని అనవలెను।
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

133వ నామ మంత్రము 6.5.2022

ఓం నిరంజనాయై నమః

పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం వంటి ఏవిధమైన అంజనములు లేక కేవలం సమ్యక్ దృష్టితో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరంజనా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరంజనాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ శ్రీమాతను నిత్యము నియమనిబంధనలతో అర్చించు భక్తునకు, ఆ తల్లి కరుణతో వారికి మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలు తొలగి, ఆధ్యాత్మికా చింతనతో, ధర్మార్థకామములను నిర్వహించుచూ జీవనము కొనసాగించి, నాలుగవ పురుషార్థమైన మోక్షము వారి దీక్షాబలముననుసరించి ముక్తిని ప్రసాదించును.

సాధారణంగా  అంజనము అంటే కాటుక అందురు. నిరంజనా అంటే జగన్మాత కాటుక రహితమైన నయనములు గలదని భావన రావచ్చు. ఆ భావన సరికాదు. జగన్మాత నయన సౌందర్యమును
శ్రీలలితా సహస్ర నామావళి యందు వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా యని 18వ నామ మంత్రములో స్తుతించాము. తన ముఖకాంతి అనే ప్రవాహంలో ఇటునటు కదలుతున్న మీనముల జంటతో సాటి అయిన కనులు గలిగినదని ఈ నామ మంత్రములోని భావము. 

అలాగే సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులవారు శ్రీమాత కనులను ఇలా వర్ణించారు.
 
అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా

త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |

తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః

సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్ ||
 
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది

 భావము:

అమ్మా...సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది.చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ  నుదుటి పై నున్న మూడవ నేత్రము వలన పగటికి, రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతసంధ్య, సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ!

స్త్రీమూర్తికి నయనములకు కాటకయే కదా అందము! మీనముల వంటి ఆ నయనములు ఆ నల్లని కాటుకతో తమ సౌందర్యాన్ని ఇనుమడింప జేసుకుంటాయిగదా!

శ్రీమాత నయనములు అంతటి సౌందర్యాన్ని సంతరించుకున్నప్పుడు నిరంజనా యనుట అసహజముగదా!

జగన్మాతకు పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం వంటి మాయా పూరితమైన పైపూతలు అనదగు అంజనములు లేనిది. 

నిరవద్యం నిరంజనం అను శృతివాక్యము ప్రకారము దోషరహితమైన తత్త్వం గలిగినది అని చెప్పబడినది.

అజ్ఞానులను మూడు విధములుగా తెలియవచ్ఛును.

1) విజ్ఞానకేవలులు ఇటువంటి వారు విజ్ఞానము గలిగినవారై ఉందురు. వీరిది శాస్త్రజ్ఞానమేగాని ఆత్మానుభూతి జ్ఞానము లేనివారు.

2. ప్రళయాకులులు కర్మతోకూడి, ఆత్మను తెలుసుకోలేక అనేక జన్మలకు కారణమైన కర్మలలో మునిగినవారు.

3. సకలులు ద్వైతబుద్ధి (జీవుడు వేరు, దేవుడు వేరు)  ని కలిగించు మలము గలిగినవారు. 

ఈ మూడింటిలో మొదటి తరగతి వారు హెచ్చుమంది ఉందురు. వీరిని వ్యాపకులని కూడా అందురు. రెండవ తరగతివారు కార్మణమలము గలవారు.  మొదటి తరగతివారి కంటె తక్కువగా యుందురు. మూడవ తరగతివారు మాయామలము గలవారు. రెండవ తరగతి కంటెను తక్కువగా యుందురు. ఏమైనా శ్రీమాత ఈ మూడు తరగతులలోగల ఏ మాలిన్యమూలేనిది.  ఈ మూడు విధాలయిన మాలిన్యము గల లోకాలలోని వారిని శ్రీమాత వారి అజ్ఞానమును తొలగించి అనుగ్రహిస్తుంది. జగన్మాత అవిద్య, అజ్ఞానము లేనిది. మాయకు అతీతమైనది. శుద్ధజ్ఞానస్వరూపిణి. సహస్రారంలో చంద్రమండలమునందు చిత్కళారూపంలో కేవలము ఆనంద రూపిణిగా విరాజిల్లుచున్నది గనుక జగన్మాత నిరంజనా యనుచు స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరంజనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

134వ నామ మంత్రము 7.5.2022

ఓం నిర్లేపాయై నమః

ఫలితంకోసం చేసే కర్మలవలన ఏర్పడు కర్మబంధములకు అతీతంగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్లేపా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్లేపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకులు బ్రహ్మజ్ఞానులై కర్మబంధముల బాధలకు అతీతులై విరాజిల్లుదురు.

జగన్మాత కర్మబంధముల తాకిడి లేనిది. అందుచే ఆ తల్లి నిర్లేపా యని స్తుతింపబడుచున్నది. లేపనము అనగా అంటుకొనుట లేదా పూయబడినది అను అర్థములు వచ్చును.  ఇక్కడ లేపనము అంటే ఆ తల్లికి కర్మబంధములు అంటుకొనుట, అనగా కర్మబంధముల తాకిడి సోకుట. కర్మలు చేయునప్పుడు వాటి ఫలితమునకై చూచునప్ఫుడు బంధము ఏర్పడుతుంది. దానినే కర్మబంధము అని అంటాము. 

ప్రతీజీవికీ సంతానము కర్మబంధమే. సంతానము కనడంతో ఆ బంధం విడివడదు. ఆ సంతానాన్ని పెంచాలి. వారు బాగా బ్రతకాలని చదివిస్తారు. మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు. వారికి వివాహము, మళ్ళీ వారికి సంతానము, ఆ సంతానానికి ముద్దుముచ్చట్లు ఇలా....ఈ కర్మబంధం సాగుతునే ఉంటుంది. ఈ కర్మబంధంలో తను కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాని అమ్మవారు వాళ్ళను పరిశీలిస్తుంది. అనుగ్రహిస్తుంది కూడా. అంతమాత్రమున తల్లిదండ్రులకు తమసంతానము కర్మబంధ ఫలితం కావచ్చేమోగాని, జగన్మాతకు భక్తులు కర్మబంధాలు కారు. వారి కర్మలఫలితాలు అమ్మవారికి అంటవు. అందుచేతనే జగన్మాత నిర్లేపా యని అనబడినది. జీవుని కర్మబంధములు దేవునికి (పరమేశ్వరికి) తాకవు. జీవుని చుట్టూ చేరిన మాయను తొలగించేలనే జగన్మాత ఉత్సుకత వలన గలిగిన కర్మబంధము ఆ తల్లికి అంటదు. అందుచేతనే జగన్మాత నిర్లేపా యని స్తుతింపబడినది.

బ్రహ్మజ్ఞాని కర్మలకు బంధీ కాజాలడు. ఆయన కర్మలు చేయడు. చేసినప్పటికినీ అవి లోకకల్యాణార్థమై చేస్తాడు. ఫలితం తనకోసంకాదు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణియైన పరమేశ్వరి తన భక్తులకు చేయునది లోకకల్యాణార్థ మగును. ఫలితము తన భక్తులకు చేరును గనుక జగన్మాతకు అది కర్మబంధము కాజాలదు. జగన్మాత కర్మలకు, మాయకు అతీతురాలు కనుక, ఆమెకు కర్మబంధములు తాకవు గాన, ఆ తల్లి నిర్లేపా యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్లేపాయైనమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

135వ నామ మంత్రము 8.5.2022

ఓం నిర్మలాయై నమః

మలము లేనటువంటిది. పరిశుద్ధమైనది, మయీక మరియు కార్మిక మలములు లేనిది, నిత్యముక్తి ప్రసాదిని, జీవుని వెంట ఉండే దోషాలు, మలనిక్షేపాల వంటి మాలిన్యములు తనకు అంటక పరిశుద్ధురాలై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్మలా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును  ఓం నిర్మలాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తిభరితమైన మనస్సుతో  ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి అత్యంత సులభముగా కరుణనుజూపును. ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపదను, ఆత్మానందమును ప్రసాదించును. భౌతిక పరమైన సుఖసంతోషములు  కూడా ప్రసాదించును.

జగన్మాత నిర్మలమైనది. అంటే ఏవిధమైన మాలిన్యము లేనిది. పరిశుద్ధమైనది. మయీక, కార్మిక మలములు లేనిది. తన భక్తులకు నిత్యము, సత్యమైన ముక్తిని ప్రసాదించునది. జీవుని వెంట ఉండే దోషాలు, మాలిన్యములు తనకంటకుండా, వారిలో సకల మాలిన్యములను పారద్రోలునది.  జీవుడు ఫలములనాచరించుచూ కర్మలు చేయును. ఆ కర్మఫలములను తా ననుభవించును.  జీవుని కర్మఫలములనుండి కాపాడునపుడు జగన్మాతకు కర్మలమాలిన్యములు అంటవు. జగన్మాత అంతటి పరిశుద్ధురాలు, నిర్మలమైనది. అవిద్యయున్నచోటనే మాలిన్యములుండును. కాని జగన్మాత జ్ఞానస్వరూపిణి, శ్రీవిద్యాస్వరూపిణి. అందుచే ఆ మాలిన్యములు తాకవు. జగన్మాత ఉద్యద్భాను సహస్రాభ, చిదగ్నికుండ సంభూత అంతటి ప్రకాశవంతమైన మరియు సహస్రకోటిసూర్యకాంతిప్రభావితమైన అటువంటి చోటికి ఏవిధమైన మాలిన్యములు రావు. వచ్చినా యజ్ఞకుండమునందు దూకు దీపం పురుగులవలె  నాశనమైపోవును. అందుకే జగన్మాత నిర్మలా యని స్తుతింపబడుచున్నది. అవిద్య, అజ్ఞానము మొదలయిన మలములు అన్నియు దృగ్ రూపకల్పితములు. అనగా కంటికి ఆవరించిన మాయాపొరలనుండి ఉద్భవించినవి. పరమేశ్వరి అటువంటి మాయలకు అతీతమైనది గనుకనే నిర్మలా యని స్తుతింపబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్మలాయై నమః అని అనవలెను.
****


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

137వ నామ మంత్రము 10.5.2022

ఓం నిరాకారాయై నమః

కోరిన వారికి కోరిన రూపంలో కనుపించునేగాని తనకంటూ ఒక ఆకారములేని పరబ్రహ్మస్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరాకారా యను  నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరాకారాయై నమః యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు జగన్మాత వారి ఇష్టకామ్యములను తీర్చుటలో అనుగ్రహము చూపును. 

ఇక్కడ నిరాకారా అని జగన్మాతను అన్నామంటే అసలు ఆకారము లేనిదని కాదు. కోరిన వారికి కోరిన రూపంలో కనుపిస్తుంది. అది ఆపదల సమయంలో ఆపదలనుండి ఆపద్బాంధవిగా, తలచిన పనులు శుభకరము, జయకరము చేయునప్పుడు ఎవరో ఒక మిత్రుని  రూపంలోనో, అధికారి రూపంలోనో.....మరేదో రూపంలో కనిపించును. అటువంటి సాకార రూపమే నిత్యము మనము పారాయణచేయు సహస్రనామస్తోత్ర పారాయణలో మనము స్తుతించు చతుర్భాహు సమన్వితా - నాలుగు బాహువులు కలిగియున్నది, కురువిందమణి శ్రేణీకనత్కోటీర మండితా - కురువిందమణులతో ప్రకాశించు కిరీటంతో భాసించు తల్లి, అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా - అష్టమీచంద్రుని వలె ప్రకాశించే లలాట ప్రదేశం గలిగిన మహాతల్లి.....ఇలా 51వ నామ మంత్రము వరకూ జగన్మాత సాకార రూపాన్ని స్తుతించాము గదా! మరి ఇప్పుడు ఈ నిరాకారా అని అనడమేమిటి అను సందేహం కలుగుతుంది ఎవరికైనా. జగన్మాత భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాల్చుతుంది భక్తుల సేవలు అందుకోవడానికి. వారి ఇష్టకామ్యములను సిద్ధింపజేయడానికి. పరబ్రహ్మ నిర్గుణ స్వరూపుడు. జగన్మాత అట్టి నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపిణి.

దేవీ భాగవతంలో ఇలా చెప్పబడినది: 

తారకాసుర సంహారంకోసం దేవతలు శ్రీమాతను ప్రార్థించారు. ఆ తల్లి చైత్రశుద్ధ నవమి నాడు జగన్మాత దేవతలకు దర్శన మిచ్చినది. ఆ జగన్మాత తేజస్సు రూపుదాల్చిన నాలుగువేదములచేత స్తుతింపబడినది. అప్పుడు ఆరూపం ఉద్యద్భానుసహస్రాభా (ఉదయించుచున్న వేయిసూర్యుల కాంతినిబోలిన కాంతి కలిగియున్నది), కోటిచంద్రుల చల్లదనంగలిగి యున్నది, తటిల్లతాసమరుచి మెఱుపుతీగతో సమానమైన కాంతితో తళుక్కుమన్నట్లు ఉన్నదట. ఇవన్నీ మనం స్తుతించు చున్నవే.  అంటే, అది మన ఇంద్రియములకు కనిపించే ఆకారము మాత్రమే. అమ్మగూర్చి మనం కొనియాడే స్వరూపము శరీరానికే. ఆత్మకు కాదు. ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మము అనేది నిర్గుణము, నిరాకారము. కనుక, జగన్మాతను నిరాకారా అన్నాము.  జగన్మాత సూక్ష్మతర రూపాన్ని ఈ క్రింది విధంగా స్తుతించాము మనము.

జగన్మాత మూలమంత్రాత్మిక (88వ నామ మంత్రము) - పంచదశాక్షరీ మంత్రమే శ్రీమాత ఆత్మస్వరూపము.

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా (85వ నామ మంత్రము) - పంచదశియందు గల మొదటి కూటమియైన వాగ్భవకూటమియే పరమేశ్వరి ముఖకమలము.

కంఠాధః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణీ (86వ నామ మంత్రము) పంచదశి యందలి మధ్యకూటము అయిన కామరాజకూటమియే శ్రీమాత కంఠము దిగువ నుండి   కటిసీమ వరకూ గల శరీరము.

శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ (87వ నామమంత్రము)  పంచదశి యందలి మూడవకూటము అయిన శక్తి కూటమియే శ్రీమాత కటి దిగువ నుండి  పాదపద్మముల వరకూ గల శరీరము.

శ్రీమాత మూలకూటత్రయ కళేబరా(89వ నామ మంత్రము) మొత్తముగా
85, 86, 87 నామ మంత్రములందు చెప్పిన వాగ్భవ, కామరాజ, శక్తికూటములే జగన్మాత సూక్ష్మతరశరీరము. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి గనుకనే ఆ తల్లిని మంత్రస్వరూపిణిగా, సూక్ష్మతర స్వరూపిణిగా మనము భావించాము. అంటే ఆ తల్లి భక్తులు ఏరూపంలో చూడాలనుకుంటే ఆ విధంగా గోచరిస్తుంది గనుక తనకంటూ, తను ఏర్పరచుకున్న ఆరాము ఏదీ లేని నిరాకార స్వరూపిణి.

ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం నిరాకారాయై నమః అని అనవలయును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

138వ నామ మంత్రము 11.5.2022

ఓం నిరాకులాయై నమః

కలత, కలవరపాటు, మనోచాంచల్యత వంటి అవిద్యా సంబంధితమైనవి ఏమియునూ లేని శ్రీవిద్యాస్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరాకులా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరాకులాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాత్పరిని అత్యంత భక్తితత్పరతతో ఆరాధించు భక్తులకు భౌతికపరమైన వ్యాకులత, చిత్తచాంచల్యత వంటి భావవికారముల నుండి విముక్తి కలిగి శాశ్వతమైన ఆత్మానందానుభూతి సంప్రాప్తించును.

మనసు అనేది కోతి వంటిది. అజ్ఞానం వలన ఏర్పడిన చంచల స్వభావంతో నిలకడ లేక పోవుట జరుగును. పుట్టుకతోనే తను, తనవారు, తనచుట్టూవారు అనే బాంధవ్యము ఆ బాంధవ్యము వలన ఏర్పడే సుఖదుఃఖములు, కలతలు ఇలాంటివి అన్నియు సహజము. దాగట్లో పడ్డ వెలగకాయవంటిది. అకులా అంటే అవిద్యా సంబంధిత  కలతలు. ఇవి కేవలం జీవునికి మాత్రమే. పరమాత్మకు ఇలాంటివి ఏమియును ఉండవు. ఇదే జీవునికి దేవునికి గల భేదము. పరమేశ్వరి బ్రహ్మస్వరూపిణి. పరమాత్మ. ఆ తల్లికి ఇలాంటి అవిద్యా సంబంధితమైన కలతలు లేనిది. అంతేకాదు ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తే, అవిద్యాపరమైన కలతలు తొలగించమని వేడుకుంటే జీవునిలో కూడా నిశ్చలత, కలతలను ఎదుర్కొనే మనో నిబ్బరత, అసంకల్పితంగా ఏర్పడిన ఆపదల నెదుర్కొనే ధైర్యము కలుగుతాయి. ఇంకా మరింత ముందుకు వెళ్ళి అంతర్ముఖ సమారాధన జరిపితే ఆ అమ్మ మరింత సులువుగా ప్రసన్నమై శాశ్వతమైన బ్రహ్మానందాన్ని సంప్రాప్తింపజేస్తుంది. 

శంకర భగవత్పాదులవారు ఇలా అన్నారు.

సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వమ్
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః|

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.
భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభిస్తుంది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.

ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.
ఇదే మనం ఆ పరమేశ్వరి నిరాకులా యను నాలుగక్షరముల నామ మంత్ర స్మరణ ఫలితము.

జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం నిరాకులాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

139వ నామ మంత్రము 12.5.2022

ఓం నిర్గుణాయై నమః

శరీరధర్మములు తప్ప చిద్ధర్మములు గాని గుణములుగాని - ఏవియు లేక సకలగుణాతీతయై, నిర్గుణ స్వరూపిణియై తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్గుణా యను మూడక్షరముల (త్ర్యైక్షరీ) నామ మంత్రమును ఓం నిర్గుణాయై నమః యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధన చేయు భక్తులకు ఆ పరమేశ్వరి ఎనలేని సద్గుణ సంపదనిచ్చి జీవనమంతయూ తన భక్థులను ఆ తల్లి తన ధ్యాననిమగ్నత యందుంచి తరింపజేయును.

సాక్షిచేతా కేవలోనిర్గుణశ్చ (సౌభాగ్య భాస్కరం - 343వ పుట) జగన్మాత నిర్గుణురాలు. సాక్షి చైతన్యము. కేవలము. నిర్గుణము. పరమేశ్వరిని లక్షించుటకు గుర్తించుటకు వీలుకానట్టిది. గుణములన్నియు కేవలము పాంచభౌతిక శరీరమునకు మాత్రమే. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత చైతన్యమనెడి అగ్నికుండమునుండి పుట్టినది. శుద్ధ చైతన్య స్వరూపిణి. అగ్నికుండమనెడి చైతన్యమునుండి పుట్టినది. అటువంటి జగన్మాత నిర్గుణ స్వరూపురాలు గనుకనే ఆ తల్లి నిర్గుణా యను నామాంకిత అయినది. దీనిచే తార్కికశాస్త్రము త్రోసిపుచ్చబడినది. తర్కశాస్త్రంలో ఆత్మకు గుణాలున్నాయని నిరూపించారు. ఈ నామంలో తర్కశాస్త్రం ఖండింపబడినది. వృద్ధి, క్షయములు, వికాసము, నాశనము మొదలైన వికారాలన్నీ శరీరధారులకే. కాని జగన్మాత పరమాత్మ. అందుకే శ్రీమాత నిర్గుణా యను నామముతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతింపబడుచున్నది. పదార్థాలననుసరించే లక్షణాలు ఉంటాయి. వేపకాయ చేదుగా ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది. అలాగే శరీరాలను బట్టి గుణాలు ఉంటాయి. అలాగే శరీరాలను బట్టి గుణాలు. ఇంద్రియాలు కూడా అంతే. బుద్ధి వశంలో ఉంటే ఇంద్రియాలు కుదురుగా ఉంటాయి. మనసు వికృతంగా ఆలోచిస్తే భావాలు కూడా వికృతంగా ఉంటాయి. వివక్షత లోపిస్తుంది. ఏది ఏమైనా అరిషడ్వర్గాలు అదుపులో ఉండవలసింది శరీరధారులకే.  పరబ్రహ్మస్వరూపిణికి ఇవన్నీ సంబంధించవు. అందుకే జగన్మాత నిర్గుణ స్వరూపిణి. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్గుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

140వ నామ మంత్రము 13.5.2022

ఓం నిష్కలాయై నమః

శరీరభాగములైన అవయము లేవియు లేక నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహన్ర నామావళి యందలి నిష్కలా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిష్కలాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సుఖసంతోషములతో, ఇష్టకామ్యార్థసిద్ధితో బాటు ఆత్మానందమును పొంది జన్మతరించినదను తృప్తినందును.

కలా అనగా అంశము, భాగము, అవయవము అని నిఘంటువులో అర్థములు గలవు. శరీరములోని భాగములు అని అనుకుంటే అవయవములు. నిష్కలా అని అంటే శరీరములోని భాగములు అనగా అవయవములు లేనిది. అవయవములు అనేవి శరీరధారులకే. జీవాత్మలకే శరీరములు ఉంటాయి. పరమాత్మ, శుద్ధచైతన్య స్వరూపురాలు, పరబ్రహ్మ అయిన పరమేశ్వరి దేహధారికాదు.  గాన జగన్మాత నిష్కలా యని అనబడినది.

శ్లో. ధ్యానం యా నిష్కలా చింతా నిరాధారా నిరాశ్రయా|

న తు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే॥ (సౌభాగ్య భాస్కరం ర, 344వ పుట)

ధ్యానమనునది నిష్కలచింత. అది నిరాధారము, నిరాశ్రయము అయి ఉన్నది. శరీరము, ముఖహస్తాదులు  అని వివిధ అవయవములు కల్పించి చేయునది ధ్యానము కాదు. ముఖ్యంగా తెలియవలసినది ఏమంటే పరబ్రహ్మనుండి ఉద్భవించిన జీవసముదాయానికి అవయవములు ఉన్నవి గాని ఆ పరమాత్మకు లేవు. అందుచే పరమాత్మ అయిన జగన్మాత నిష్కలా యని అనబడినది. నిష్కళా అనగా కళాతీతురాలు. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్కలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

141వ నామ మంత్రము 14.5.2022

ఓం శాంతాయై నమః

అనుకూల ప్రతికూలములు, ప్రమాదప్రమోదములు, సుఖదుఃఖములు వంటి ద్వంద్వముల వలన ఏవిధమైన భీతి, తొట్రుపాటును చెందని నిశ్చలతయే శాంతము. ఇట్టి శాంతస్థితితో తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శాంతా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం శాంతాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో  ఆరాధన చేయు సాధకులకు ఆ జగన్మాత దయతో అనుకూల-ప్రతికూల, సుఖ-దుఃఖములు, ప్రమాద-ప్రమోదముల వంటి ద్వంద్వములవలన భీతి, తొట్రుపాటు చెందని నిశ్చలతను జీవనకాలమంతయు ప్రసాదించి, అంత్యమున ఆనందానుభూతి కలుగజేసి తరింపజేయును.

శమము గలది గనుకనే శాంత.  అనగా కామక్రోదాధి అరిషడ్వర్గములనుమాట జగన్మాత దృష్టిలో శూన్యము. అందుకే జగన్మాత శాంతా యని అనబడుచున్నది. నిష్కలం, నిశ్చలం, శాంతం అని శ్రీమాత రూపాన్ని త్రిపురోపనిషత్తులో చెప్పబడినది. వీటికి అర్థము క్రమముగా దోషములేనిది, స్థిమితము, ప్రశాంతత కలిగిన రూపము శ్రీమాతది. మరి జగన్మాతకు శాంత యను నామము సరియైనదేగదా! సరియైనదే. అని మనంచెప్పలేదు. వశిన్యాది వాగ్దేవతలు, వ్యాసభగవానులు వంటి మహిమాన్వితులే చెప్పారు. శ అను వర్ణము అమృతబీజము. జగన్మాత అట్టి అమృతబీజమే ఆత్మగా గలది. శాంతా అంటే సమస్తాన్నీ, ముఖ్యంగా తన ఉపాసకులకు సమస్తాన్నీ సుఖాంతం చేస్తుందని భావము. శం అనగా శుభము, మంగళకరము అని ఇంతకు ముందు నామ మంత్రములలో అనుకోవడం జరిగింది. లలితా సహస్రనామస్తోత్రంలో  44వ శ్లోకంలో  "నిర్గుణా  నిష్కలాశాంతా నిష్కామా నిరుపప్లవా"   అను రెండవ పాదం పరిశీలిస్తే ఆశాంతా అనగా దిగంతములన్నియు వ్యాపించినదని కూడా యని భావించవచ్చు. అనగా జగన్మాత 
ఇందు గలదందు లేదని
సందేహమువలదుజనని సర్వముతానే అనగా జగన్మాత కొంత పరిధికి మాత్రమే పరిమితంకాదు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శాంతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

142వ నామ మంత్రము 15.5.2022

ఓం నిష్కామాయై నమః

తనకంటూ కోరికలు ఏమియును లేక, జీవుల కోరికలకు తానే అధిపతియై, జీవులకు సర్వకామార్థ సిద్ధిని చేకూర్చు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిష్కామా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిష్కామాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమాతను ఉపాసించు సాధకుడు భౌతిక పరమైన సుఖసంతోషముల కన్నా ఆ పరమేశ్వరీ పాదార్చనయే పరమావధిగా జీవించి తరించును.

జగన్మాత మన అమ్మ. మన అందరి కోర్కెలు తీర్చు తల్లి. ఆ తల్లి పరమేశ్వరుని పతిగా పొందుటతో అన్ని కోర్కెలు సిద్ధించినదై, ఇంక అంతకన్నా ఇంకేమియు కోర్కెలు లేనిదై, నిష్కామ గా మిగిలినది. మానవుని కోర్కెలు అనంతము. ఒకటి తీరితే ఇంకొకటి వెంటనే మరోకోరిక పుడుతుంది. మానవుడు   పుట్టడమే కోరికల పొ(పు)ట్టనుండి పుట్టాడు. మానవుడంటే జీవాత్మ. పుట్టగానే నాలుగు నీటిబిందువులు జల్లగానే గతస్మృతులు మరచిపోయి కేర్ మని ఏడవడం జరుగుతుంది. అక్కడ నుండి తన అనంతమైన కోర్కెల జాబితా వెలికి తీస్తాడు మానవుడు.  జగన్మాత పరమాత్మ.  భక్తుల కోరికలు తీర్చడమే పనిగా పెట్టుకున్న ఆ తల్లికి ఏముంటాయి కోరికలు. అందుకే ఆ తల్లిని నిష్కామా అను నామంతో భక్తిగా స్మరిస్తాము. 

అవాప్తాఖిలకామాయాః తృష్ణా కిం విషయా భవేత్?(సౌభాగ్యభాస్కరం 345వ పుట). 
సకల కోరికలు పొంది (పరమేశ్వరుని భర్తగా పొందుటయే ఆ తల్లి అసలైన కోరిక) ఉన్న శ్రీమాతకు ఏ కోరికా లేదు. తానే సకల జీవులకు ఏమికావాలో (ధర్మబద్ధమైనవి) వాటిని తానే సిద్ధింప జేస్తుంది. ఏ విధమైన కోరికలు లేనిదైన పరమేశ్వరి నిష్కామా. ఆ తల్లి కోరికలకు అతీతమైనది గనుకనే నిష్కామా  అని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్కామాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
----
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

143వ నామ మంత్రము 16.5.2022

ఓం నిరుపప్లవాయై నమః

శ్రీమాత ఆద్యంత రహితురాలు, ఆత్మస్వరూపిణి గాన నాశరహితురాలు. అటువంటి ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరుపప్లవా యను ఐదక్షరముల నామ మంత్రమును ఓం నిరుపప్లవాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునకు జీవాత్మపరమాత్మలు ఒకటేయను అద్వైతభావము ఇనుమడించి, సకలమూ ఆ పరమాత్మలోనే తిలకించుచూ ఆధ్యాత్మికానందమును నిత్యము అనుభవించుచునేయుండును. తన్మూలంగా పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతయందు అనన్యభక్తితత్పరతతో జన్మతరించినదియని సంతసించును.

ఆత్మ అనునది శరీరములో ఉండును. శరీరమునకు బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము అను స్థితులు కలిగియుండును. పాతవస్త్రమును  విడిచి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ ఒక శరీరమును వదలి వేరొక శరీరమును ఆశ్రయించును. అంటే శరీరము మాత్రము నాశనమగును గాని ఆత్మకు నాశనములేదు. శ్రీమాత ఆత్మస్వరూపిణి,  పరమాత్మస్వరూపిణి. అటువంటి తల్లికి నాశనము ఉండదు. సృష్టి, స్థితి, లయలకు అతీతంగా ఉంటుంది గనుక జగన్మాత నిరుపప్లవా అను నామాంకిత అయినది. 

ఉపప్లవము అను పదమునకు దగ్గరలో ఉన్న నీటిలో తేలియాడునది అనగా పడవ. సంసారమను నడిసముద్రంలో జగన్మాత ఒడ్డుకు చేర్చు పడవ వంటిది. సంసారసాగరము నుండి బయటపడు తరుణోపాయము జగన్మాతయే. 

ఇక్కడ నిరుపప్లవమను పదమును:-
 నిర్ అనగా సంపూర్తిగా,నిశ్శేషముగా, 

ఉప అనగా సమీపములో నున్నది 

ప్లవము అనగా అమృత ప్రవాహము

సాధకుడు తన తీవ్రసాధనలో కుండలినీ శక్తిని  మూలాధారములో జాగృతముజేసి, బ్రహ్మ, విష్ణ, రుద్రగ్రంథుల ఛేదనముతో, షట్చక్రములు దాటి సహస్రారమునందు చంద్రమండలములో అమృతధారలవృష్టిని కలుగజేయగా, ఆ అమృతస్రావముతో సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలాన్ని తడిసి బ్రహ్మజ్ఞాన సంపదతో తరించుతాడు. అందుచేత జగన్మాత నిరుపప్లవా అను నామాంకిత అయినది. 

జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకులకు ఏవిధమైన ఆపదలు కలుగవు. ఉపద్రవములేర్పడవు. భవసాగరమునుండి విముక్తుడై జీవన్ముక్తుడగును. గాన జగన్మాత నిరుపప్లవా యను నామాంకితగా భక్తులచే స్తుతింపబడుచున్నది.

ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం నిరుపప్లవాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

144వ నామ మంత్రము 17.5.2022

ఓం నిత్యముక్తాయై నమః

ఐహిక బంధములు-విషయవాంఛలకు కట్టుబడక, జరామృత్యుభయములు లేక, అరిషడ్వర్గములు దరిరానీక, వీటన్నిటియందు నిత్యముక్తయై, తన భక్తులకుగూడా నిత్యముక్తిని  ప్రసాదిస్తూ విరాజిల్లు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిత్యముక్తా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిత్యముక్తాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని సేవించు భక్తులకు ఆత్మానందానుభూతిని కలిగించి జన్మసార్థకత నిచ్చును.

జగన్మాత బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. ఆ తల్లి భూత, భవిష్యద్వర్తమానములందును, సృష్టిస్థితిలయములందును ఏవిధమైన మార్పును చెందదు. ఆ తల్లి నిర్వికార స్వరూపిణి. అలా అయినప్పుడు దేహము, ఇంద్రియములు మరియు వాటిపై ఆసక్తి ఉంటుందను మాటయే  ఉండదు. తన భక్తులను అరిషడ్వర్గముల బారినుండి విముక్తులను చేయును. ఎఫ్ఫుడైతే అరిషడ్వర్గములు దూరమౌతాయో, సాధకుడు ఐహిక బంధముల నుండి  కూడా విముక్తుడౌతాడు. సత్యమైనది, నిత్యమైనది, ఆనందస్వరూపమైన పరబ్రహ్మాన్వేషణలో కృతకృత్యత లభిస్తుంది. ఇంతటి స్థాయిని సాధకునకు చేకూర్చే జగన్మాత తామరాకుపై నీటిబొట్టువలె ఉండు జ్ఞానస్వరూపిణి. అందుకే శ్రీమాత కర్మల యొక్క ఫలమునకు గాని, ఐహికబంధాలకుగాని, విషయవాంఛలకు గాని కట్టుపడదు.  ఆ తల్లికి జరామృత్యుభయములు అనేవి మాటవరసకుకూడా సంబంధించవు. అమ్మవారు అటువంటి వాటి యందు విముక్తిపొందిన పరమాత్మగా విరాజిల్లుతుంది గనుక నిత్యముక్తా యను నామముతో సాధకునిచే స్తుతింపబడుచున్నది. ఆ విధంగా స్తుతించు సాధకులను నిత్యముక్తులను గావించుతుంది.

మట్టినుండి ఎన్నోపాత్రలు రూపుదిద్దబడతాయి. చేయిజారితే ముక్కలౌతాయి. ముక్కలయినవి ఆ పాత్రలుగాని, ఆపాత్రలరూపునకు కారణమైన మట్టికాదు. జగన్మాత సృష్టించు జీవులకు జరామరణములు, సుఖదుఃఖములు మొదలైన మనో వికారములుంటాయి గాని పరమేశ్వరికి కాదు. అనగా పరమాత్మ సృష్టించు జీవులకు మనోవికారములుగాని, పరమాత్మకు కాదు.  అంటే పరమాత్మ స్వరూపిణియైన జగన్మాత జీవునిలో  ఏర్పడుచుంఢు మనోవికారములకు దూరము. పరమాత్మను తెలిసికొని, ఆ తత్త్వంలో లీనమైతే, ఆ జగన్మాత నిత్యముక్తిని ప్రసాదించుతుంది. అందుకే పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం నిత్యముక్తాయై నమః యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

145వ నామ మంత్రము 18.5.2022

ఓం నిర్వికారాయై నమః

మహదహంకారములు, పంచతన్మాత్రలు, భూతపంచకము, ప్రాణపంచకము, ఇంద్రియపంచకము, మనస్సు వీటిద్వారా మార్పుచెందని నిర్వికార స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్వికారా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిర్వికారాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఉపాసించు సాధకుడు భౌతిక పరమైన సుఖములకు అతీతముగా   జీవనము కొనసాగించుచూ పరమేశ్వరీ ఆరాధనలో తరించును.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. భౌతిక శరీరధారికి ఉండు వికారములేవియు ఉండవు. అందుచే ఆ తల్లిని నిర్వికారా అను నామముతో స్తుతించుదుము.

సప్త తత్త్వాలు - మహత్తు, అహంకారం,  పంచతన్మాత్రలు (1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము) మరియు పంచభూతములు (పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము),  పంచప్రాణములు (1. ప్రాణము - హృదయమునందు ఉండునది, 2. అపానము -  గుదమున నుండునది, 3. సమానము -నాభి మండలమున నుండునది,  4. ఉదానము - కంఠమున నుండునది, 5. వ్యానము - శరీరమంతయు వ్యాపించియుండునది), ఇంద్రియ పంచకము (1. చక్షుస్సు, 2. శ్రోత్రము, 3. ఘ్రాణము, 4. జిహ్వ, 5. కాయము), మనస్సు వీటిచే  మార్పుచెందని నిర్వికార స్వరూపురాలు జగన్మాత. 
****


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

147వ నామ మంత్రము 20.5.2022

ఓం నిరాశ్రయాయై నమః

సృష్టికి పూర్వంగాని, లయము తరువాతగాని తానే యున్నది. సకల సృష్టికీ తానే ఆశ్రయమైయున్నా తనకంటూ ఏవిధమైన ఆశ్రయం అవసరం లేని  నిరాశ్రయగా తేజరిల్లు  ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరాశ్రయా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరాశ్రయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ ఆదిపరాశక్తిని ఉపాసించు సాధకుడు ఇష్టకామ్యార్థ సిద్ధిని సాధించుటయేగాక, ఆత్మానందానుభూతితో, నిత్యసంతుష్టుడై విలసిల్లును.

సృష్టిలోని సకల జీవకోటికి ఆశ్రయమై యున్నది జగన్మాత. తనపై సర్వజగత్తూ ఆధారపడియున్నది. జగన్మాత శివకామేశ్వరాంకస్థా కామేశ్వరుని వామాంకమే ఆ తల్లికి ఆశ్రయము.  ఆదిపరాశక్తిగా ఎన్ని రూపములలో ఉన్ననూ ఆ తల్లి సదాశివ-పతివ్రతా సదాశివుడు తప్ప అన్యమైన ఏ విధమైన ఆలంబనము అవసరములేకయున్నది. శివశక్తులిరువురు ఒకరికొకరు ఆలంబనమవుతారు గాని వారికి  ఏవిధమైన ఆశ్రయము అవసరంలేదు.  గాన జగన్మాత నిరాశ్రయా అను నామము కలిగియున్నది. సాధారణంగా నిరాశ్రయా ఆశ్రయము లేకయుండుట అనగా తలదాచుకొనుటకు ఏమియు లేకుండుట. కాని ఇక్కడ ఇలాంటి సమన్వయం సరిపడదు. ఎందుకంటే శ్రీమాత యందే విశ్వమంతయూ ప్రతిష్ఠితము. అందుచే ఆ తల్లికి ఉనికి ఎక్కడిది. తాను ఆశ్రయమిచ్చునది గాని ఆశ్రయమవసరములేనిది గనుక నిరాశ్రయా అని అనబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరాశ్రయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః