రోజూ చదవండి. చదవమని చెప్పండి
ప్రాంజలి ప్రభ *02.06.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - అరువది నాలుగవ అధ్యాయము*
*నృగమహారాజు వృత్తాంతము*
కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట ఆ ఇరువురును నా కడకు వచ్చి, తమ పంతములను నెగ్గించుకొనుటకై తమ వాదములను వినిపించిరి. ఒక బ్రాహ్మణుడు 'మహారాజా! ఇప్పుడే ఈ గోవును నీవు నాకు దానము చేసితివి. దీనిని నేను నా ఇంటికి తోలుకొనిపోవుచుంటిని' అనెను. అంతట రెండవ బ్రాహ్మణుడు 'రాజా! అట్లైనచో నీవు నా ఆవును దొంగిలించితివి' అని పలికెను. వారి మాటలను విన్నంతనే నేను దిగ్భ్రమకు లోనైతిని.
ధర్మసంకటములో పడిన నేను ఈ ఈ ఇరువురు విప్రులను అనునయించుచు వారితో ఇట్లంటిని. 'బ్రాహ్మాణోత్తములారా! ఈ గోవునకు బదులుగా మీకు ఒక్కొక్కరికి శ్రేష్ఠమైన లక్షగోవులను ఇచ్చెదను. తెలియక అపరాధము చేసిన ఈ సేవకుని అనుగ్రహింపుడు. ఘోరమైన నరకముపాలు గాకుండా ఈ సంకటమునుండి నన్ను గట్టెక్కించుడు'
అంతట ఆ గోవుయజమాని 'మహారాజా! నాకు ఇదియే కావలయును. దీనికి మాఱుగా ఏమిచ్చినను పుచ్చుకొనను' అని పలికి అచటినుండి వెళ్ళిపోయెను. ఆ రెండవ బ్రాహ్మణుడు 'రాజా! లక్షగోవులనే గాదు, ఇంకను పదివేల గోవులను అదనముగా ఇచ్చినను నాకు అక్కరలేదు. నాకును ఈ గోవేకావలయును' అని నుడివి వెళ్ళిపోయెను.
"దేవదేవా!జగదీశ్వరా! కృష్ణా! అంతట నా ఆయువు ముగిసిన పిమ్మట యమకింకరులు వచ్చి నన్ను యమలోకమునకు తీసికొనివెళ్ళిరి. అచటయమధర్మరాజు నన్ను ఇట్లడిగెను. 'నృగమహారాజా! మొదట నీవు పాపకర్మఫలమును అనుభవించెదవా? లేక పుణ్యకర్మ ఫలితమునా? నీవు చేసిన అంతులేని దానములకు ఫలితముగా నీకు దివ్యలోకము ప్రాప్తించును' అనెను.
అప్పుడు నేను దేవా! మొట్టమొదట నా పాపకర్మఫలమునే అనుభవించెదను అంటిని. అంతట యముడు ఐనచో పడిపొమ్ము' అనెను. తత్ క్షణమే నేను ఊసరవెల్లినై, నీరులేని ఈ బావిలో పడిపోయితిని.. కేశవా! నేను బ్రాహ్మణులకు సేవకుడను. దాతను. నీ దాసుడను. నీ నందర్శనార్థమై ఇచటనే పడియుంటిని. ఇంతవఱకును నీ కృపచే నా పూర్వజన్మస్మృతి తొలగిపోలేదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
* రేపటి కధలో కలుద్దాం...
[
02.06.2021 సాయం కాల సందేశము వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - ఉత్తరార్ధము - అరువది నాలుగవ అధ్యాయము
నృగమహారాజు వృత్తాంతము
అధోక్షజా! కృష్ణప్రభూ! ఉపనిషన్మార్గము ననుసరించి నిన్ను ధ్యానించునట్టి యోగీశ్వరుల నిర్మల హృదయములయందే పరాత్పరుడవైన నీవు గోచరించుచుందువు. అంతేగాదు, సంసారచక్రమునుండి విముక్తి పొందెడి సమయముననే నీ దర్శనము ప్రాప్తించుచుండును. నేనైతే పెద్ద ఆపదచే అధిక దుఃఖముతో వివేకమును కోల్పోయి అంధకారకూపమున పడియున్నాను. అట్టి నా యొక్క కన్నులకు ఎట్లు గోచరుడవైతివి?
దేవదేవా! జగన్నాథా! గోవిందా! పురుషోత్తమా! నారాయణా! హృషీకేశా! పుణ్యశ్లోకా! అచ్యుతా! అవ్యయా! కృష్ణప్రభూ! దేవలోకమునకు వెళ్ళుటకు నన్ను అనుమతింపుము. అక్కడగూడ సర్వదా నీ చరణకమలముల యందే నా చిత్తము నిల్చునట్లు దయజూడుము. నీవు సమస్తకార్యకారణరూపములలో విరాజమానుడవు అగుచుందువు. నీవు అనంతశక్తిమంతుడవైన పరబ్రహ్మవు. నీవు సచ్చిదానందస్వరూపుడవు. సర్వాంతర్యామివి. మహాయోగేశ్వరుడవు. నీకు పదేపదే నమస్కరించుచున్నాను".
నృగమహారాజు ఈ విధముగా శ్రీకృష్ణుని ప్రస్తుతించి, ఆ ప్రభువుయొక్క పాదములకు సాష్టాంగముగా ప్రణమిల్లెను. పిదప ఆ స్వామి అనుమతిని పొంది, విమానమును అధిరోహించి, జనులు ఎల్లరును చూచుచుండగా దివమునకు చేరెను.
దేవకీసుతుడైన శ్రీకృష్ణభగవానుడు ధర్మాత్ముడు, బ్రాహ్మణుల యెడ ఆదరాభిమానములు గలవాడు. నృగమహారాజు వెళ్ళిపోయిన పిదప ఆ స్వామి అచటగల రాజన్యులకును, పరిజనులకును ధర్మసూక్ష్మములను బోధించుచు ఇట్లువచించెను-
మిత్రులారా! అగ్నివలె తేజోమూర్తులైనవారు కూడా బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచముగా అపహరించినను దానిని వారుజీర్ణించుకొనలేరు. ఇంక తమను తామే ప్రభువులము అని విర్రవీగుచున్న గర్వాంధుల విషయము చెప్పనేల? నేను హాలాహలమును విషముగా భావింపను. బ్రాహ్మణుని సంపద విషముకంటెను ప్రమాదకరమైనది. ఏలయన, విషమనకు విరుగుడు గలదు. కాని, బ్రాహ్మణుని సొత్తును అపహరింపదలచినందువలన కలిగెడి పాపములకు ప్రాయశ్చిత్తములేదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
03.06.2021 ప్రాతః కాల సందేశము వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - ఉత్తరార్ధము - అరువది నాలుగవ అధ్యాయము
నృగమహారాజు వృత్తాంతము
విషము, భుజించిన వానిని మాత్రమే హతమార్చును. అగ్ని జలములతో చల్లాఱును. కాని బ్రాహ్మణుని సొత్తు అనెడి అరణివహ్ని వాని వంశమునే సమూలము దహించివేయును.
అరణి వహ్ని అనగా అరణిని మథింపగా పుట్టెడి అగ్ని.న విషం విషమిత్యాహుః బ్రహ్మస్వం విషముచ్యతే| విషమ్ ఏకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకమ్॥ (నీతిశాస్త్రము)
విషము అంతగా ప్రమాదకరమైనది కాదు. బ్రాహ్మణుని సొత్తు నిజముగా ప్రాణాంతకమైనది. విషము దానిని తిన్నవానినే చంపును. విప్రుని సొత్తు అనెడి విషము దానిని అపహరించిన వారి పుత్రులతో సహా, వారి వారి వంశములనే నశంపజేయును.
బ్రాహ్మణుని సొమ్మును అతని అనుమతిలేకుండా అనుభవించినచో, వారి మూడుతరముల వారిని అది నశింపజేయును. రాజాశ్రయము యొక్క బలము చూచుకొని, బలవంతముగా లాగికొని అనుభవించినచో వారికి సంబంధించిన పదితరముల పూర్వీకులను (పితృపితామహాదులను) నరకమున పడవేయును. అంతేగాక వారి తరువాత పదితరములవారిని (పుత్రపౌత్రాదులను) నశింపజేయును.
రాజ్యాధికారముచే కన్నుమిన్నుగానక ఏ రాజులైతే మూర్ఖులై బ్రాహ్మణుని సొత్తునుగూడ అపహరింతురో, వారు తమకు పతనావస్థ తప్పదని ఎఱుగరు. అట్టివారు నరకమున ఘోరయాతనల పాలగుట తథ్యము.
రాజులు నిరంకుశులై తమ వృత్తులపై (జీవనాధారములపై) దెబ్బతీసినప్పుడు ఉదారచరితులు, గృహస్థులు ఐన బ్రాహ్మణులు మిగుల దుఃఖింతురు. వారి కన్నీటి బిందువులకు ఎన్ని భూరేణువులు తడియునో అన్ని సంవత్సరములు, బ్రాహ్మణుల సంపదలను అపహరించిన ఆ రాజులు, వారి వంశములవారు కుంభీపాకనరకములో బడి తీవ్రవేదనల పాలగుదురు.
బ్రాహ్మణులకు తాముగాని, ఇతరులుగాని ఇచ్చిన భూములను, లేక ఆ భూములద్వారా సమకూరిన ధనధాన్యాదికములను ఎవ్వరును హరింపరాదు. లోభబుద్ధితో అట్లొనర్చినవారు అరువేదివేల సంవత్సరములు మలమునందు క్రిములై జీవింతురు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment