* శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
151వ నామ మంత్రము 24.5.2022
ఓం నిరంతరాయై నమః
సర్వాంతర్యామి-సర్వవ్యాపి. సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ కృత్యములు నిర్వహించు కాలస్వరూపిణి. అభిన్నమైన, శాశ్వతమైన అఖండస్వరూపిణి. అటువంటి పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరంతరా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరంతరాయై నమః అని ఉచ్చరించుచూ, జగన్మాతను ఉపాసించు సాధకుడు అనంతమైన, శాశ్వతమైన ఆత్మానందమును అనుభవించుటయే గాక, లౌకిక పరమైన శాంతిసౌఖ్యములుగూడా పొందును.
అంతర అను శబ్దమునకు అవకాశము (సందు లేదా ఖాళీ), అవధి (హద్దు), పరిధానము (గూఢముగా అర్థము వచ్చునట్లు పలుకుట), అంతర్థి, భేదము, తాదర్థ్యము, ఛిద్రము, ఆత్మీయము, బాహ్యప్రదేశములేనిది, అవసరము, మధ్యము, అంతరాత్మ అను అర్థములు అమరమునందు గలవు. వీటిలో ఇక్కడ అవసరమైన నాలుగు అర్థములు తీసుకున్నచో అవకాశము (ఖాళీ), అవధి (హద్దు), భేదము, ఛిద్రము అను అర్థములు గ్రహించవచ్చును. జగన్మాత భక్తితో ఆరాధించు వారిని అనుగ్రహించదు అను అవకాశము ఇసుమంతయును లేదు. ఆ తల్లి అనుగ్రహమునకు అవధులు లేవు. ఆ తల్లి దృష్టిలో తనను ధ్యానించువారు, తనను గూర్చి కఠోరమైన తపస్సు చేయువారు, వారిని అనుగ్రహించుటలో భేదము చూపక, కేవలం అంతర్ముఖారాధనకే సంతృప్తిచెంది అనుగ్రహించును. ఆ తల్లిని నమ్మి ఆరాధించువారు ఏవిధమైన మానసిక ఛిద్రములు లేక ఆనందముగా జీవింతురు. అనగా ఆ తల్లి అవకాశములకు, అవధులకు, భేదములకు, ఛిద్రములకు అతీతమైనది. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి. పరమాత్మ. జీవాత్మవలె గాక పరమాత్మ అయిన జగన్మాత అవకాశములకు, అవధులకు, భేదములకు, ఛిద్రములకు అతీతమైనది. దేహంవేరు, ఆత్మవేరు అను ద్వైత భావమును దూరంచేసి ఆత్మానందాన్ని కలుగజేస్తుంది. ఆ తల్ఞి సర్వాంతర్యామి. సర్వవ్యాపి. ఆ తల్లి అనుగ్రహానికి హద్దులు చూపనిది. అందుకే ఆ తల్లి నిరంతరా యని స్తుతింపబడుచున్నది.
య యేతస్మిన్నుదరమంతరం కురుతే, అథ తస్య భయం భవతీ (సౌభాగ్యభాస్కరం 350వ పుట)
పరమాత్మకాక వేరొకరు గలరనెడి భేదము కలిగియుండునో అట్టివారి జీవనము భయకంపితమే అగునని శృతియందు చెప్పబడినది.
ఇటువంటి భేదభావనలను తన భక్తులనుండి దూరము చేయును గనుక ఆ తల్లి నిరంతరా యని అన బడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరంతరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
152వ నామ మంత్రము 25.5.2022
ఓం నిష్కారణాయై నమః
సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యముల నిర్వహణలో తనకంటూ కారణములు ఏవియూ లేక ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తిస్వరూపిణియై, సర్వానికి తానే కారణమై తేజరిల్లు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిష్కారణా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిష్కారణాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు భక్తులకు సర్వాభీష్ట సిద్ధికలుగును మరియు ఆత్మానందానుభూతితో జన్మతరించినది యని సంతోషింతురు.
జగన్మాత జగత్తులో ప్రాణికోటికి కావలసినవన్నీ అనుగ్రహించడానికి కారణములేవియు ఉండవు. తానే అన్నిటికీ కారణమైయున్నది. ఇంకనూ యోచనచేసిచూడ కారణములకే అధిష్ఠానదేవత ఆ జగన్మాత. సమస్త విశ్వనిర్మాణంలో కారణాల నిమిత్తంలేనిది జగన్మాత. ఎందుకంటే ఆ తల్లి పరమాత్మ. పరబ్రహ్మస్వరూపిణి. ఆ తల్లి సహస్రారంలో ఉన్నది సహస్రారాంబుజారూఢా (105వ నామ మంత్రము) - బ్రహ్మరంధ్రానికి దిగువన వేయిదళముల పద్మమందు ఉన్నది. సహస్రారమునే మహాపద్మవనమని కూడా అందురు. మహాపద్మాటవీ సంస్థా (59వ నామ మంత్రము) - గొప్పపద్మములు గల అడవి (సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళపద్మము) యందు ఉన్నది. వీటన్నిటికీ కారణములు ఏమియు ఉండవు. అందుకే తల్లి నిష్కారణా యని అనబడినది.
ఆత్మస్వరూపిణియైన జగన్మాత దేనికైనా కారణమౌతుంది గాని పరమాత్మయైన ఆ తల్లికి కార్యకారణము లేవియు ఉండవు. గాన జగన్మాత నిష్కారణా యను నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్కారణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
153వ నామ మంత్రము 26.5.2022
ఓం నిష్కళంకాయై నమః
సకల పాపాలకు దూరమైనది. గుణరూపభావములకు అతీతురాలు. కళంకరహితురాలై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిష్కళంకా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిష్కళంకాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులు పాపచింతనలకు, పాపకర్మలకు దూరముగా ఉంటూ, సదా ధర్మచింతనయే తమ పరమావధిగా జీవించుచూ, ఆత్మానందానుభూతిని గలిగి తరింతురు.
సాధారణంగా వాడుకభాషలో కళంకము అనేది ఒక అపఖ్యాతిగా చెబుతుంటారు. మచ్చ, దోషం, లోపము, పాపము అనునవి కూడా ఈ కళంకము అను పదమునకు అర్థములు గలవు. పరమాత్మ స్వరూపమైన జగన్మాతకు ఇలాంటివి ఏమియు ఉండవు. పుట్టినప్పుడు మనిషి మనసు కళంకరహితమైనది. కపట చింతన ఉండదు. పిల్లలు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. అందుకే పిల్లలు, దేవుడు ఒకటి అన్నారు. దేవుడు అంటే పరమాత్మ. పరమాత్మ అంటేనే నిష్కళంక. అలాగే పిల్లలుకూడా. కానీ ఎదిగినకొలదీ వారిలో అరిషడ్వర్గములు ఒకటొకటిగా చేరి, జ్ఞానదంతములు వచ్చేసరికి అరిషడ్వర్గములు పూర్తిగా ఆవహించి జ్ఞానమునకు బదులుగా అజ్ఞానము వృద్ధి చెందుతుంది. అప్పుడు పాపచింతనలు, దుష్కృత్యములు చేయుటయందు ఆలోచనల పరంపరలు తెరలుతెరలుగా వస్తాయి. వారు చేయు దుష్కృత్యములద్వారా అప్రతిష్టవచ్చి వారిపై దుష్టులు అను ముద్ర ఒకటి పడును. దీనినే కళంకము అంటారు. పరమాత్మయైన జగన్మాతకు ఇటువంటి కళంకములుండవు. అందుకే నిష్కళంకా యని అనబడుచున్నది.
రావణుడు బ్రహ్మజ్ఞాని. సకలవేదశాస్త్రపారంగతుడు. పరమశివభక్తుడు. కాని కేవలం పరస్త్రీవ్యామోహంతో కళంకము ఏర్పడినది. ఆ కళంకముతోనే నిర్మూలింపబడినాడు. మహిషాసురుడు, భండాసురుడు వంటి రాక్షసప్రవృత్తి గలవారందరూ గూడా కళంకము ఉన్నవారే. సాక్షాత్తు పరాశక్తిపైనే క్షుద్రశక్తిపూరితమైన అస్త్రములతో జగన్మాతను ఎదుర్కొన్నారు. జగన్మాత వేదసమ్మతమైన మంత్రములతో, వేదమంత్రపూరితమైన అస్త్రములతో భండాసురాది రాక్షస ప్రవృత్తి గలవారిని సంహరించినది. జగన్మాత పరమాత్మగనుకనే వేదములందు కొనియాడబడినది. వేదమంత్రములు ఆ తల్లి చెప్పినట్లు వినినవి, దుష్టశిక్షణలో తోడ్పడినవి. కళంకరహితులు అనగా ధర్మవర్తనులు కూడా ఇదేవిధముగా వేదములు కొనియాడిన పరాశక్తిచే రక్షింపబడుదురు. జగన్మాత వారిని నిష్కళంకులుగా అనుగ్రహిస్తుంది. జగన్మాత తాను నిష్కళంక మరియు తన భక్తులను కూడా నిష్కళంకులుగా అనుగ్రహిస్తుంది. కాబట్టి జగన్మాత నిష్కళంకా యని స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్కళంకాయై నమః యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
154వ నామ మంత్రము 27.5.2022
ఓం నిరుపాధయే నమః
ఉపాధి అనగా శరీరము. శరీర సంబంధం వలన అజ్ఞానము, ద్వైదీభావన వంటి అవిద్యాలక్షణములెన్నియో ఏర్పడును. వీటన్నిటికి అతీతురాలైన పరబ్రహ్మస్వరూపిణియగు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరుపాధిః యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరుపాధయే నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు జ్ఞానసంపన్నుడై, ద్వైదీభావము విడనాడి ఆత్మానందానుభూతితో తరించును.
ఉపాధి అనగా శరీరము. శరీరమునకు అవిద్యా (అజ్ఞాన) సంబంధమైన భేదభావము లెన్నియో కలుగును. ఉపాధి తన సమీపములో ఉన్నవాటిపై తన ప్రభావము చూపుట అని కూడా అర్థం తీసుకోవచ్చును. తెల్లని స్ఫటికం ప్రక్కన ఎర్రని మందార పుష్పం ఉంచినట్లైతే ఆ స్ఫటికము ఎర్రని రంగులో గోచరిస్తుంది. దీనినే ఉపాధి అందురు. ఆత్మకు శరీరం ఉపాధి. శరీర సంబంధంవల్ల శరీరంలోని ఆత్మకు భేదభావన, అజ్ఞానము కలుగుతాయి. అందువలన అరిషడ్వర్గములు ఆవహించుతాయి. అంతటితో ఆ శరీరమునావహించిన ఆత్మ అజ్ఞానపరమైన దుష్కృత్యము లెన్నియో ఒనర్చి, వాటి ఫలితంగా మరుజన్మలో ఆ ఆత్మ అనేకములైన శరీరములలో ప్రవేశించి మరింత అజ్ఞాన ప్రభావితమవుతుంది. అదే ఆ శరీరంపై శరీరంలోని ఆత్మ ఆధిపత్యము వహిస్తే శరీరసంబంధమైన అవిద్యాపరమైన అవలక్షణాలు ఆపాదింపబడక ధ్యానముతోను, అంతర్ముఖ సమారాధనతోను పరమాత్మకు మరింత దగ్గరై పరమాత్మనుండి విద్యాపరమైన భగవధ్యానము, ధర్మార్దకామముల సక్రమనిర్వహణ, దేవుడు మరియు జీవుడు ఒకటే అని చెప్పు అద్వైత తత్త్వము తనపరముగావించుకొని ఉత్తమగతులు లభింప జేసుకొనును. ఆరునెలలు అయితే వారు వీరు అవుతారు అంటారు. అంటే ఒక మంచివాడు చెడ్డవాడిని చేరదీస్తే చెడ్డవాడు మంచివాడైనా కాగలడు లేదా చెడ్డవాడు మంచివాడైనా కాగలడు. అది ఆధిపత్యప్రభావంపై ఉంటుంది. ప్రభావం పొందినదానికి, ప్రాభావితము చేసినది ఉపాధి అవుతుంది. ఇది శరీరధారులకే కాని పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతకు కాదు. పరమాత్మను ప్రభావితం చేయునవేమియును లేవు. అందుకే ఆ తల్లిని నిరుపాధి అన్నారు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరుపాధయే నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
155వ నామ మంత్రము 31.5.2022
ఓం నిరీశ్వరాయై నమః
అధికులుగాని, సమములుగాని లేక సృష్టి మొత్తానికి తానే ఈశ్వరియై, వేరొక ప్రభువుగాని, ప్రభ్విగాని లేని నిరీశ్వరియైన తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరీశ్వరా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరీశ్వరాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి కరుణచే భౌతికపరమైన శాంతి సౌఖ్యములు పొందుచూ, ఆధ్యాత్మికంగా సమున్నతమైన స్థానమును పొంది పలువురికి మార్గదర్శకుడై తేజరిల్లును.
జగన్మాత సమస్త సృష్టిరచనకు కారణమై, ఆ సృష్టికి సర్వేశ్వరియై విరాజిల్లుతున్నది. సకల లోకములకు తానే అధినేత్రియై, అన్ని లోకములకు తానే పాలకులను నియమించి, అట్టి పాలకులకే మహాసామ్రాజ్ఞిగా, సర్వేశ్వరిగా తేజరిల్లుతున్నది తప్ప తనకెవ్వరు ప్రభువులు (ఈశ్వరులు) లేని నిరీశ్వరి. అందుకే జగన్మాత నిరీశ్వరీ యని నామ ప్రసిద్ధియైనది. మీమాంస శాస్త్రము, సాంఖ్యశాస్త్రము అను రెండు శాస్త్రములలో సాంఖ్యశాస్త్రము అనగా ప్రజలయొక్క సామాజికవర్గముల యొక్క సాంఘికార్థిక పరిస్థితులను గురించి క్రమపద్ధతిలో విషయములను సేకరించు శాస్త్రము. ఈ శాస్త్రము ఈశ్వరుడులేడని చెప్పబడుతోంది.
మీమాంస శాస్త్రము అనగా వేదార్థము ఇట్టిది అని నిశ్చయింపదగిన న్యాయమును తెలుపునట్టి శాస్త్రము. ఇందు కర్మకాండము పూర్వమీమాంస అనియు, బ్రహ్మకాండము ఉత్తరమీమాంస అనియు ద్వివిధము అయి ఉండును. వీనినే కర్మమీమాంస, బ్రహ్మమీమాంస అని అందురు. ఈ శాస్త్రము ఈశ్వరుడుఉన్నాడని చెబుతున్నది.
జగన్మాత సాంఖ్యశాస్త్ర, మీమాంసశాస్త్రముల రూపములు రెండుటిని కలిగియున్నది జగన్మాత. ఎలాగంటే మీమాంసశాస్త్రము స+ఈశ్వర అనగా సేశ్వర అనగా ఈశ్వరుడు ఉన్నాడని చెబుతున్నది. గనుక అమ్మవారు నిరీశ్వరీ యని అనబడుచున్నది. జగన్మాత సర్వేశ్వరి మరియు తనకంటే అధికులు లేరు. గనుక, ఆ తల్లిని నిరీశ్వరీ అని అన్నాము. పరమేశ్వరి సర్వేశ్వరి. అనగా అధికారము గలిగినది. అలాగే తాను లోకపాలకులను నియమించి వారికి అధికారములిచ్చినది. తానే సర్వాధికారిణి. శ్రీచక్రేశ్వరి, సామ్రాట్టులను తానే నియమించిన మహాసామ్రాజ్ఞి. తనకు అధికారము ఇచ్చేశక్తి ఎవ్వరికీలేదు. తల్లి ఏదో ఒక లోకమునకు గాని, లోకములో భాగమునకు గాని అధికారిణి కాదు. బ్రహ్మాండములకే అధికారిణి. తనకన్నా ఈశ్వరత్వము (సార్వభౌమత్వము) కలిగిన వారు ఎవరూ లేరు.అందుచే అమ్మవారు నిరీశ్వరీ యని అన్నాము.
జగన్మాతకు నమస్కరించునపుఙాడు ఓం నిరీశ్వరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
156వ నామ మంత్రము 1.6.2022
ఓం నీరాగాయై నమః
రాగము అనగా కోరిక. దీని వలన అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఉద్భవిస్తాయి. ఫలితంగా ద్వేషము, పగ, హింస వంటి చెలరేగుతాయి. ఇవి అన్నీ భౌతికశరీరధారులకు మాత్రమే. వీటన్నిటికీ అతీతురాలైన పరమాత్మ స్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నీరాగా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నీరాగాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు, ఆ తల్లి కరుణచే అరిషడ్వర్గములను జయించును. భౌతికముగా సుఖసంతోషములనుభవించుచూ, పరమాత్మస్వరూపిణి పాదసేవలో పునీతుడై తరించును.
జగన్మాత నీరాగా అనగా కోరికలు లేనిది. ఆ తల్లి పరమాత్మ. భక్తజనుల ఇష్టకామ్యములను సిద్ధింపజేయును. ఆ తల్లి నిరీశ్వరా అని అన్నాముగదా! ఆ తల్లి లోకేశ్వరి. తానొక మహాసామ్రాజ్ఞి. సమస్త ప్రాణికోటిని తన బిడ్డలవలె సాకుచూ, ప్రేమానురాగాలతో బిడ్డలకేమి కావలెనో తల్లివలె అడగకముందే అన్నీ ఇస్తూ ఆనందభరితులను చేస్తుంది. తానే ఈశ్వరి. తనకెవరూ అధికులు గాని, సమములుగాని ఉండరు. అందుకే నిరీశ్వరి అయింది. అటువంటి నిరీశ్వరికి కోరికలు ఏమి ఉంటాయి? అందుకే ఆ తల్లిని నీరాగా అని అన్నాము.
కోరికలు ఉంటే అరిషడ్వర్గములు ఉద్భవిస్తాయి. అరిషడ్వర్గములు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము.
కామము అనగా కోరిక. అది ఏదైనా కావచ్చు. ధనముకావచ్చు, అన్యస్త్రీ వ్యామోహము కావచ్చు...ఇంకేదైనా కావచ్చు.
కోరిక తీరక పోతే క్రోధము రావచ్చు. అందుకు ద్వేషము ఏర్పడవచ్చు. ఆ పైన పగ, హింస ఒకదాని వెంబడి మరొకటి వరుసకట్టి ఆవహిస్తాయి. అలాగే తాను కోరినది మరొకరు కోరకూడదనే లోభము చోటుచేసు కుంటుంది. ఆ కోరుకునే మరి ఒకరిని నిరోధించడంలో పగ, ద్వేషం పొడసూపుతాయి. తాను కోరిన కోరిక మూలంగా అదే దృష్టికలిగి ఆ కోరిన కోరికపై మోహము ప్రబలుతుంది. ఆ కోరికను తీర్చుకొనుటకు తనకున్న బలము, పలుకుబడిని తలచుకుంటూ ఉండే మదము అనేది బయటపడుతుంది. ఏకారణం చేతనైనా తాను కోరినది వేరొకరు కోరడంగాని, వేరొకరు పొందియుండుట జరిగితే మాత్సర్యము చెలరేగుతుంది. ఇది రాగము (కోరిక) యొక్క పర్యవసానము, దశలు. ఇవి మనసుకు సంబంధించినవి. ఆత్మకు ఉండవు. పరమాత్మస్వరూపిణి వీటన్నిటికీ అతీతురాలు గనుక నీరాగా యని అనబడుచున్నది. జగన్మాతను ఈ నామముతో ఆరాధిస్తే, సాధకులు నిశ్చయంగా అరిషడ్వర్గములను అధిగమించి జగన్మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు అనుటలో సందేహము లేదు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నీరాగాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
157వ నామ మంత్రము 1.6.2022
ఓం రాగమథన్యై నమః
అనుభవించు కొలదీ వ్యామోహము పెంచెడి కోర్కెలయందు వైరాగ్యము కలిగించి, రాగద్వేషములను నశింపజేయు పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాగమథనీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం రాగమథన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు రాగద్వేషకారకమైన కోర్కెలయందు వ్యామోహము తగ్గించి శాశ్వతమైన పరబ్రహ్మతత్త్వమును తెలిసికొను మార్గమునుజూపును.
జగన్మాత రాగద్వేషములకు అతీతురాలైనది. నీరాగా అను నామముతో స్తుతింపబడుచున్నది. కోరికలు కళ్ళెము లేని గుర్రముల వంటివి. అరిషడ్వర్గ ప్రభావముతో అనంతమైన కోర్కెల వలయములో చిక్కిన జీవుడు కోర్కెలు తీరక మరల మరల జన్మలు ఎత్తుచునేయుండును. వివిధ శరీరములు ధరించుచు జననమరణచక్రములో పరిభ్రమించుచునేయుండును. కోరికలు అనుభవించినంత మాత్రమున తీరునవి కాదు. అగ్నికి ఆజ్యము ఎటువంటిదో అనుభవించుట అనేది కోర్కెలకు అటువంటిది. అనుభవించుకొలదీ కోర్కెలపై వ్యామోహము అధికమగుచుండును. జగన్మాత తన భక్తులకు వైరాగ్యమును కలిగించి దేహాదులందనురాగము పోగొడుతుంది. రాగద్వేషములనేవి క్లేశములవంటివి. అటువంటి రాగద్వేషములను మథించి శాశ్వతమైన బ్రహ్మానందమును లభింపజేస్తుంది జగన్మాత. ఇంద్రియములను బుద్ధికి వశముకాకుండా జగన్మాత కాపాడుతుంది. జగన్మాత తన భక్తుల బుద్ధిని ఆత్మకు వశముచేయు బ్రహ్మవిద్యవైపు మరల్చుతుంది. దీనినే రాగమథనము అని అంటారు. గాన జగన్మాతకు రాగమథనీ యను నామము సార్థకమైనది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రాగమథన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
158వ నామ మంత్రము 31.5.2022
ఓం నిర్మదాయై నమః
కులమదము, బలమదము, ధనమదము, రూపమదము, యౌవనమదము, విద్యామదము, అధికారమదము, తపోమదము వంటి మదములు మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. అటువంటి మదములు ఏమియు లేక నిర్మదయై విరాజిల్లు పరమాత్మ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
లలితా సహస్ర నామావళి యందలి నిర్మదా యను మూడక్షరాల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్మదాయై నమః అని ఉచ్చరించుచూ, భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు నిశ్చయంగా అరిషడ్వర్గములకు అతీతంగా విరాజిల్లుచూ పరమేశ్వరీ పాదసేవలో తరించును.
అరిషడ్వర్గము లనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. అరిషడ్వర్గములు కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు కాదు. పరమేశ్వరి పరమాత్మ. ఆ తల్లికి ఇవేమియు (మదము వంటివి) ఉండవు. కాబట్టి ఆ తల్లి నిర్మదా యని నామ ప్రసిద్ధమైనది.
మనసున్న ప్రతీ జీవికి పలుకోరికలు ఉండడం సహజం. కోరిక అనగా కామము. కోరిక వెనుక క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఒకదాని వెంట ఒకటి ఆయా సందర్భములలో వచ్చేస్తాయి. అరిషడ్వర్గములలో మదము ఒకటి. మదము అనగా పలు అర్థములు గలవు. పొగరు, ఒళ్ళుకొవ్వెక్కడం, పరవశం అనగా తనను తను మరచిపోవడం. ఇక మదం ఉంటే దర్పం ఏర్పడుతుంది.
మదం అనేది శారీరక మదం (కండబలం) తనే బలవంతుడను, తనను మించిన వాడు లేడనే గర్వం అను లక్షణం , ధనమదం - నేనే ధనవంతుడను, ఏదైనా ధనంతో కొనవచ్చు, ధనహీనులనిన అసహ్యించుకోవడం, అవమానించడం ఇలా ఏధైనా కావచ్చు, అధికారమదం - తనకధికారం వస్తే, తనవద్దనున్నవారిని తూలనాడడం, పగసాధించడం కోసం వారిని హింసించడం, అధికార దుర్వినియోగంతో అక్రమంగా సంపాదించడం వంటి లక్షణములు కావచ్చు, విద్యామదం - తనకేదైనా విద్యలో పరిపూర్ణత సాధించుకున్నప్పుడు ఆ వ్యక్తిలో మార్పుకొందరికి వచ్చేస్తుంది. గర్వం ఏర్ఫడుతుంది. వినయేన శోభతే విద్యా అనునది మరచిపోయి తక్కువ విద్య ఉన్నవారిని అల్పులని మాటతూలడం లేదా వారు ఏదైనా విషయం చెపితే తిరస్కార భావంగా చూడడం, సూటిపోటి మాటలతో విమర్శించడం, సద్విమర్శలు చేయక హేళన చేయడం ఇలాంటి లక్షణములు, భాగ్యమదం - పుట్టుకతోనే భాగ్యవంతుడై ఉండడం, తన్మూలంగా భాగ్యహీనులను అవమానించడం వంటి లక్షణములు. ఇవన్నియు మదమునకు ఉన్న లక్షణములు. ఒళ్ళుతెలియక మాటలు తూలడం, ఎదుటి వారిని అవమానించడం, హింసించడం, ఎదుటి వారు బాధపడుతుంటే వికటాట్టహాసం చేయడం జరుగుతుంది. మదము అనేది జాగ్రస్వప్న అవస్థలయందే ఉంటుంది. సుషుప్తిలో ఉండదు. డంభము, దర్పము, దురభిమానము వంటి రాక్షస లక్షణములు మదము అని అంటారు. ఒళ్ళుతెలియక పరిమితులు దాటి మాట్లాడుతారు. ఇవన్నీ కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. పరమేశ్వరి పరమాత్మస్వరూపిణి. గనుక ఆ తల్లికి అరిషడ్వర్గములలోని మదము ఉండదు. అందుకే ఆ తల్లి నిర్మదా యను నామముతో స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్మదాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
159వ నామ మంత్రము 1.6.2022
ఓం మదనాశిన్యై నమః
డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములను నాశనము చేసి సాధకుని సన్మార్గమందు ముందుకు నడిపించుచూ అమృతత్త్వస్థితికి చేర్చు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మదనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మదనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునిలో ఏమైనా డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములేవైనా ఉంటే, అటువంటివి అన్నియు మటుమాయమై, సన్మార్గమునందు నడచుచూ, అమృతత్త్వస్థితికి చేరి తరించుననుటలో సందేహము లేదు.
ఇంతకు ముందు 158వ నామ మంత్రములో జగన్మాత పరమాత్మయనియు, అట్టి పరమాత్మ అరిషడ్వర్గములకు అతీతురాలని తెలిసియున్నాము. ఈ నామ మంత్రములో (మదనాశనీ) ఆ తల్లి తన భక్తులను కూడా డంబము, దర్పము, మదము వంటి అసురీలక్షణములకు అతీతులను చేయును. కాబట్టి ఆ తల్లిని మదనాశినీ అని అన్నాము.
మదము అంటే పొగరు. తనకు మించిన వారు లేరనేది తలబిరుసు. ఆ తలబిరుసులో మంచి వారినికూడా దుర్భాషలాడును. రావణాబ్రహ్మ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. కైలాసాన్ని తనభుజస్కంధములతో పైకెత్తేసిన భుజబలశాలి. తన ప్రేగులతో వీణానాదము సృష్టించి శివస్తుతి చేసి తరించాడు. కాని బలమదముతో, విద్యామదముతో (బ్రహ్మజ్ఞాని కదా) అధికారమదముతో (లంకాధిపతి అయిన కారణముతో) నాశనమయాడు. జగన్మాత తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి నారాయణుని దశావతారములు సృజించి (కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః) అతని మదమును నాశనము చేసినది. అంతేనా? కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనాది కౌరవులు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, కార్తవీర్యార్జునుడు మొదలైన మదమే తమస్వరూపమైన ఎందరో అసురలక్షణములున్నవారిని వారిమదమును నాశనము చేసినది. కాని జగన్మాత తన నామమును అంతర్ముఖసమారాధనతో స్మరించిన భక్తులలో మదము మరియు ఇతర అరిషడ్వర్గములను నాశనము చేసి సన్మార్గములో నడిపించి అమృతత్త్వస్థితికి చేర్చుతుంది.
మదము నశించినప్ఫుడు సమదృష్టి ఏర్పడుతుంది. అసురలక్షణములు అంతరించి దైవస్వరూపులౌతారు. వినయ విధేయతలు, విశ్వజనీనత వికసిస్తుంది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మదనాశిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
160వ నామ మంత్రము 2.6.2022
ఓం నిశ్చింతాయై నమః
కలత, బాధ, నిరాశ, నిస్పృహ వంటి విచారకరమైన విషయములే చింతలు. ఇవి అన్నియూ మనసుకు సంబంధించినవేగాని ఆత్మకు సంబంధించినవి కావు. అట్టి చింతలు లేని తల్లియైన పరమాత్మస్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిశ్చింతా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిశ్చింతాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఏవిధమైన చింతలు లేక భౌతిక సుఖసంతోషములతోబాటు, ఆత్మానందానుభూతితో జీవించును.
చింత అనేది మనసుకు సంబంధించినది. తానొకటి తలంచితే, జరిగేది వేరొకటై, ఆ జరిగినది తనతలంపుకు వ్యతిరేకమైనది అయితే నిరాశ ఏర్పడుతుంది. మానసికంగా సంఘర్షణ ప్రారంభమవుతుంది. మనసు పరిపరి విధములైన ఆలోచనలతో నిండిపోతుంది. పరధ్యానం ఏర్పడుతుంది. దీనినే చింత అంటారు. నమ్మిన మిత్రుడు మోసంచేసినా, ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకులు పెళ్ళితరువాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆ కన్నవారికి అవసానదశపై మానసిక సంఘర్షణ (చింత) ఏర్పడుతుంది, ప్రేమించిన భార్య తనను నిర్లక్ష్యంచేస్తూ, మానసిక ప్రశాంతతలేకుండా వివాదాలు కల్పిస్తుంటే మానసిక సంఘర్షణ (చింత) ఏర్పడుతుంది. సంపాదన చాలకపోయినా, పిల్లలు చదువులో వెనుకబడినా, ఎదిగిన ఆడపిల్లకు మంచి సంబంధం తేవడానికి ఆర్ధికంగా తాహతు చాలకున్నా...ఇవే చింతలు అంటాము. మనసు తీవ్రమైన సంఘర్షణకు గురియవుతుంది. ఇదంతా మనసుకు సంబంధించినది. ఆత్మకు కాదు. పరమాత్మయైన జగన్మాత ఇటువంటి చింతలకతీతురాలు. అందుకే ఆ తల్లి నిశ్చింతా యని నామ ప్రసిద్ధమైనది. ఈ చింత అనేది సుషుప్తిలో ఉన్నప్పుడు ఉండదు. అప్ఫుడు ఆత్మమాత్రమే పనిచేస్తుంది. ఏ చింతా ఉండదు. అందుకే మానసిక వేదనతో ఉన్నవారిని ప్రశాంతంగా నిద్రపుచ్చడానికి వైద్యులు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ మానసిక ప్రశాంతత జగన్మాతను అంతర్ముఖంగా ధ్యానించడమే. అన్నీ మరచి ధ్యాననిమగ్నతలో ఉంటే తప్పకుండా అమ్మవారు తన భక్తులను అన్నిరకాల చింతలనుండీ దూరం చేస్తుంది.
చింత అనునది కపటము అని అర్థం చేసుకుంటే జగన్మాత తనపై భక్తులకు గల భక్తికి హెచ్చుతగ్గులు పరికించదు. అంతర్ముఖంగాధ్యానం చేయువారిని, దీక్షగా ఉపాసన చేయువారిని కూడా భక్తులుగానే పరిగణిస్తుంది. కపటరహితంగా తన భక్తులను పరిగణిస్తుంది గనుక జగన్మాత నిశ్చింతా యని స్తుతింపబడుచున్నది.
చింతా చితా సమాజ్ఞేయా చింతా వై బిందునాఽధికా|
చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితమ్ ॥ (సౌభాగ్యభాస్కరం, 356వ పుట)
చింత అను శబ్దములో మధ్య బిందువును తొలగించితే చిత అవుతుంది గదా! చిత అంటే చితి. చితి కేవలం ప్రాణంలేని కట్టెనే (మృత కళేబరమునే) కాల్చుతుంది. కాని చింత ప్రాణమున్న జీవుడినే దహిస్తుంది. చింత అనేది మనసుకు సంబంధించిన వ్యాధి అనగా మనోవ్యాధి. మనోవ్యాధికి కేవలం జగన్మాత నామ మంత్ర స్మరణ తప్ప వేరే మందు లేదు. జగన్మాత తనభక్తులను నిశ్చింతులను చేస్తుంది గనుక ఆ తల్లిని నిశ్చింతా యని స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిశ్చింతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*161వ నామ మంత్రము* 3.6.2022
*ఓం నిరహంకారాయై నమః*
సాత్త్విక, రాజస, తామసములను త్రిగుణాత్మకమైన అహంకారము లేక నిరహంకారియై తేజరిల్లు పరమాత్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరహంకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం నిరహంకారాయై నమః* యని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు నేను, నాది, అంతా నావలననే యను అహంకారముపోయి, కేవలం జగన్మాత నామస్మరణేపరమావధిగా జీవించి తరించును. అమ్మవారు అతనికి భౌతికపరమైన సుఖసంతోషములు, ఆత్మానందకరమైన బ్రహ్మజ్ఞాన సంపదలు ప్రసాదించి తరింపజేయును.
తల్లిప్రేగు త్రెంచుకుని భౌతిక ప్రపంచంలోకి రాగానే ఆ పసికందుపై నీళ్ళు జల్లుటతోనే ఆ శిశువు ఏడుపు ప్రారంభించును. శరీరంపై గిల్లుటతోడనే కేర్ మని నొప్పితో ఏడ్చును. అంటే ఆ దేహం తనది, దానికి నొప్పి కలిగిందనిగదా ఏడ్ఛేది. కొంచం ఊహవచ్చే సరికి తన తల్లి, తన తండ్రి, తన పరిసరాలు ఇలా నేను, నాది అనే భావం కలుగుతుంది. మాటలు వచ్చి, ప్రపంచం అంతా చూచుటతోనే తన వస్తువులు, తన ఇల్లు ఇలా తన, పర అనే భేదము తెలుస్తుంది. ఇదంతా అహంకారమే. ఇటువంటి అహంకారములు మూడు విధములు. 1) సాత్త్విక, 2) రాజస, 3) తామసములనెడి త్రిగుణాత్మకమైనది అహంకారము. ఇది నా దేహము అనే భావన వస్తుంది. తన గుండెలపై చేయివేసుకుని నేను అనడం జరుగుతుంది. అహంకారము కొంతవరకూ పరవాలేదు. తనయొక్క భౌతిక పరమైన బాధ్యతా నిర్వణవరకూ అహంకారం ఉండాలి. అది కొంచం ముదిరి అన్నీ తానే, తానే అన్నిటికీ కారణము, తనపైనే సర్వం ఆధారపడి ఉంది. ఈ పొలం నాది. ఈ భూమినాది అనే అహంకారం అది అరిషడ్వర్గముల వలన ఏర్పడుతుంది. నిజానికి పుట్టినప్ఫుడు మొలత్రాడుకూడా ఉండదు. పొయినప్పుడు ఒంటిమీద నూలుప్రోగు కూడా ఉండనీయరు. ఇవన్నీ మధ్యలోవచ్చినవే. అలాంటప్పుడు అహంకారందేనికి? అంటే శరీరం ఉంది కనుక. ఆ శరీరం తనది అని భావించును గనుక. కాని ఆత్మకు ఇవి ఏమియు ఉండవు. నిర్గుణమైనది. ఆత్మ అగ్నికి దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే కదిలించబడదు, మట్టి అంటుకొనదు, నాశనము లేనిది. ఆత్మలకే పరమాత్మయైన జగన్మాత ఈ త్రిగుణాత్మకమైన అహంకారహితమైనది. శరీరంతో సంబంధంలేనిది. కాబట్టి ఆ తల్లి *నిరహంకారా* యని అనబడినది. జగన్మాతను సేవించిన సాధకునికి ఆ తల్లి అహంకార రహితిస్థితిని కలుగజేస్తుంది. అప్ఫుడు ఆ సాధకునికి శరీరంపై మమకారం తొలగిపోయి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు మార్గాన్ని అన్వేషిస్తాడు. తన మార్గం సన్మార్గమవుతుంది. పరబ్రహ్మతతత్వం తెలిసి శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందుతాడు.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరహంకారాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*162వ నామ మంత్రము* 4.6.2022
*ఓం నిర్మోహాయై నమః*
స్వస్వరూప విస్మరణ, చిత్తభ్రాంత్యాది అవలక్షణములు లేక, మోహరహితురాలై తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మోహా* యను మూడక్షరముల (త్ర్రక్షరీ) నామమంత్రమును *ఓం నిర్మోహాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుని ఆ జగన్మాత భౌతికపరమైన మోహపాశములకు దూరముగానుంచి శాశ్వతమైన పరబ్రహ్మతత్త్వమును అన్వేషించు దిశగా నడిపించును.
తల్లిగర్భమునుండి భౌతికప్రపంచములోనికి అడుగిడిన జీవికి మోహము అనేది నిశ్చయముగా ఉంటుంది. విశాలమైన విశ్వంలో అనంతకోటి జీవరాసులు ఉన్నను తను తనవారు, వారితోటే తను అని ఒక పరిధికి లోబడి ఉండడం జరుగుతుంది. తన తల్లి తను, తనకు తన జీవితభాగస్వామి, తన బిడ్డలు, తన సంసారము ఇవన్నీకూడా మోహమునకు సాక్ష్యములే. ఈ లోకంలోకి వచ్చినది తాను మాత్రమే. మళ్ళీ నిష్క్రమించునది కూడా తను మాత్రమే. ఈ మధ్యనే ఈ బంధాలు. జగమే మాయ అనుకుంటే ఈ బంధాలు ఆ మాయ వలన ఏర్పడిన మోహాము వలననే. ఇది శరీరధారులకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణీయైన జగన్మాత ఈ మోహమునకు అతీతురాలు. అందుకే ఆ తల్లిని *నిర్మోహా* యని అన్నాము. మోహము అనగా భ్రాంతి, అజ్ఞానము. అరిషడ్వర్గములలో ఒకటి. కామము (కోరిక) వలన మనసులో మోహం ఉద్భవిస్తుంది. అప్పుడు పురుషార్ధములు ధర్మబద్ధముగా నిర్వహింపబడతాయి కాని మోహము మాత్రము అధర్మయుతంగా నిర్వహింపబడుతుంది. అనగా జ్ఞానం నశించి భ్రాంతిలో మునిగిపోవడం జరుగుతుంది. పుట్టినప్పుడు జానెడు నేలపై పవళిస్తే గిట్టినఫుడు ఆరడగులు పొడవు, మూడడుగుల వెడల్పుగల నేలకావాలి. కాల్చడానికైనా, కప్పెట్టడానికైనా. ఎకరాల ఎకరాల భూమికొనేసి భూస్వామినైపోవాలనే కామము (కోరిక) జనిస్తుంది. అందుకు అధర్మంగానైనా కబ్జాలుచేసైనా ఆక్రమించేయాలని కోరిక జనిస్తుంది. అధర్మం వలన అజ్ఞానం తనలో పేరుకుపోతుంది. కారణం అరిషడ్వర్గాలు మనసును ఆవహించాయి. అరిషడ్వర్గాలలో (కామ,క్రోధ, లోభ, *మోహ*, మద, మాత్సర్యములు) మోహం ఉందిగదా. ఇది మనసుకు సంబంధించినది గదా. ఆత్మకు సంబంధించినది కానేకాదు. శ్రీమాత ఆత్మలకు పరమాత్మ. ఆతల్లి అరిషడ్వర్గాలకు అతీతురాలు గనుక అమ్మవారిని *నిర్మోహా* అని యన్నాము. అనడమేమిటి? *ఓం నిర్మోహాయై నమః* అంటూ స్తుతిస్తూ పూజించుచున్నాము. ఇది ఒక నామ మంత్రము. ఈ నామ మంత్రముతో సాధకుడు ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుంది. ఆ లభించిన జ్ఞానంతో అరిషడ్వర్గాలను జయించుతాడు. తద్వారా మోహాన్ని జయిస్తాడు. జగన్మాతకు నమస్కారం చేయునపుడు *ఓం నిర్మోహాయై నమః* అని అంటే చాలు మోహాన్ని జయించవచ్చును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*163వ నామ మంత్రము* 5.6.2022
*ఓం మోహనాశిన్యై నమః*
సకల లోకములు తన స్వరూపములై, ఎంతటి దుర్ఘటనకూ చలింపక (మోహరహితురాలై), సాధకునిలో అజ్ఞానముచే గలిగిన శోకమునుగూడ నశింపజేయు (మోహరహితులను జేయు) తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మోహనాశినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం మోహనాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు వారిలో గల రాగద్వేషములను తొలగించి, సుఖదుఃఖములు రెండిటినీ సమభావనతో ఆస్వాదిస్తూ, నిత్యమైన, సత్యమైన ఆత్మానందాన్ని అనుభవింపజేయును.
అరిషడ్వర్గములు అనునవి మానసిక సంఘర్షణకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. జ్ఞానస్వరూపిణి అయిన పరమాత్మకు మోహము, దుఃఖము వంటి మానసిక సంబంధమైన వికారములు ఉండవు. తననాశ్రయించిన భక్తులలో ప్రప్రథమంగా వారిలో ఉన్న సమస్త దుఃఖములకు హేతువైన మోహమును తొలగిస్తుంది. తరువాతనే తనభక్తులకు పరబ్రహ్మతత్త్వమును అన్వేషించుటకు కావలసిన సాధనపై దృష్టిని నిలుపుకొనే ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అరిషడ్వర్గములలో అత్యంత ప్రమాదకరమైన మోహమును సాధకునిలో సమూలంగా నాశనంజేస్తుంది కనుకనే ఆ తల్లి *మోహనాశినీ* యని నామ ప్రసిద్ధమైనది. మహాభారతయుద్ధము ప్రారంభమైనది. అర్జునునికి రథసారథి శ్రీకృష్ణుడు. రథమును పార్థసారథి కురుసైన్యములదిశగా పోనిచ్చాడు. కురుసైన్యంలో తనగురువు ద్రోణుడు, తాత భీష్ముడు, తన సోదరులు దుర్యోధనుడు, దుశ్శాశనుడు మొదలైనవారు కనిపించారు. అంతా తనవాళ్ళే. వారితోనే యుద్ధంచేయాలి. వారినే చంపాలి. అంతా తనవాళ్ళే. తన గురువులు, తన బంధువులు...వీరినా నేను చంపాలి. అను మోహము ఒక్కసారి అర్జునిణ్ణి ఆవహించింది. తనవారే కదా అనే భ్రాంతి కలుగజేసింది అతనిలోనున్న మోహపాశం. అంతే రథం దిగిపోయాడు. అస్త్రాలను ప్రక్కనపెట్టేశాడు. యుద్ధముచేయలేనని దిగాలుగా కూర్చుండిపోయాడు. భగవానుఢు కృష్ణపరమాత్మ తన విరాట్స్వరూపాన్ని చూపించాడు (విశ్వరూపం ప్రదర్శించాడు) గీతోపదేశం చేశాడు. అర్జునునిలోనున్న మోహాన్ని పారద్రోలాడు.. అర్జునుడు తనకర్తవ్యాన్ని తాను నిర్వహించాడు. మోహం సర్వనాశనకారి అన్న సత్యం తెలుసుకున్నాడు.
శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటిమహాకవి పద్యంలో ఈ మోహమనే సముద్రంలో జీవుడు కొట్టుమిట్టాడుతూ పరమాత్మను తలవలేకపోతున్నాడని బాధపడతాడు. అందుకు ఆ మహాకవి ఆ పరమేశ్వరునితో ఏమని మొరపెట్టుకున్నాడో పరిశీలిద్దాము:-
*శార్ధూలము*
అంతా మిథ్య తలంచి చూచిన
......నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు
......నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని,
......పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు
......గదా, శ్రీకాళహస్తీశ్వరా!
*భావం*
ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా! మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైనను ధ్యానించడు గదా! ఎంత అజ్ఞానము!
అంటే ఈ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుండి ఈ బంధాలను త్రెంచుకోవాలా? కాదు. చింతాకంతయు నైనను ఆ పరమాత్మను ధ్యానించాలి. ఆ ధ్యానంలో ఈ మోహాన్ని విస్మరించాలని ధూర్జటిమహాకవి భావన. ఆ పరమేశ్వరి పాదచింతన మాత్రమే ఆ సమయంలో ఉంటే ఆ తల్లి ఈ మోహబంధాలను క్రమంగా తప్పించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆ పరమేశ్వరి *మోహనాశినీ* అను నామముతో స్తుతిస్తున్నాము.
పరబ్రహ్మమనేది ఒకటే ఉన్నది. రెండవ మాటలేదు. అలా ద్వీతీయమనునది ఉన్నది అంటే అది అజ్ఞానము. అది ద్వైతభావన. అట్టిద్వైత భావనను లేకుండా చేయుటయే మనలోని మోహమును నాశనము చేయుట. జగన్మాత ద్వైతభావనను లేకుండా చేసి (మోహమును నాశనముచేసి), అద్వైతమననేమియో తెలియగల జ్ఞానమును కలుగజేస్తుంది గనుక ఆ పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను *మోహనాశినీ* అని స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మోహనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*164వ నామ మంత్రము* 6.6.2022
*ఓం నిర్మమాయై నమః*
నేను, నాది యను అహంకారము లేక మమకార రహితురాలై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మమా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం నిర్మమాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తిశ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు నేను, నాది యను మమకారములన్నియు తొలగి సర్వము ఆ పరమాత్మ కరుణయే యను భావముతో మమకార రాహిత్యంతో జీవించి తరించును.
జగన్మాత పరమాత్మ. దేహసంబంధమైన లేదా మనసుకు సంబంధమైన మోహము, మమకారము, చింత వంటి వికారములు లేక *నిర్మమా* (మమకార రహితు రాలు) యను నామముతో స్తుతింపబడుచున్నది. నేను, నాది అను భావము శరీరసంబంధమైనది. జగన్మాత నిర్గుణస్వరూపురాలు అనగా రూపం గానీ, భౌతికపరమైన మరే లక్షణాలు గానీ లేని పరబ్రహ్మస్వరూపిణి. తనకంటె వేరేమియు లేనిది. అంతయూ తానే. జీవులన్నిటిలోనూ తానేయుంటూ భేదజ్ఞానములేనిదగుటచే *నిర్మమా* యని అన్నాము.
తల్లి గర్భమునుండి బాహ్యప్రపంచంలోనికి వచ్చిన తరువాత నేను అనే భావన ఉండుట అతిసహజము. అలాగే నాది అనే భావనకూడా వచ్చేస్తుంది. ఈ ఇల్లు నాది. ఈ వస్త్రమునాది. మమ అనగా ఇంద్రియాలపై భ్రాంతి. జీవించినంత కాలము ఇల్లు, వాకిలి, సంపదలు, వస్తువులు అన్నీ నావి అనడం జరుగుతుంది. తనవనుకున్నవాటిపై మమకారం పెంచుకోవడం జరుగుతుంది. కొన్ని సమయాలలో ప్రాణంకన్నా తనవి అనుకున్నవాటిపై భ్రాంతి పెంచుకోవడం జరుగుతుంది. ఈ హద్దువరకూ నాభూమి, హద్దుదాటితే వాళ్ళది అనే తన, పర భేదం ఏర్పడుతుంది. ఈమె నా జీవిత భాగస్వామిని. ఈ పిల్లలు మా పిల్లలు అని అనడంకూడా సహజమే. వినేవారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా 'అలాగా, సంతోషమండి. పిల్లలు ఆణిముత్యాలులా ఉన్నారు' అని అనేస్తారు. అంతేగాని వేదాంతం మాట్లాడుతారా? అంటే మాట్లాడరు. ఎందుకంటే వారూ, వీరూ కూడా శరీరధారులే. పుట్టుక ఒక్కనిగా, గిట్టుట ఒక్కనిగా అయినను పదుగురిలో. బంధములమధ్య. ఈ బంధముల మధ్యయుండుటచేతనే నాది, నీది యనే మమకారము. ఇవన్నీ శరీరానికి, మనసుకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణియైన జగన్మాత ఇందుగలదందు లేదనే సందేహం లేకుండా సర్వవ్యాపిని. స్వపరభేదాలుండవు. ఈ మమకారములకు అతీతురాలు జగన్మాత. గనుక అమ్మవారిని *నిర్మమా* యని అన్నాము. దివంగతులైన వారిని ఉద్దేశించి *ఆత్మ శాంతించుగాక* అంటూ వేదాంతపరమైన సందేశము ఇస్తాము. అంటే అంతవరకూ ఆ ఆత్మ ఆ శరీరంలో ఉండి, అరిషడ్వర్గములతో సహచరించి, బంధాలు, అనుబంధాలు, మమకారాలు, అహంకారాలు, రాగము, ద్వేషము మొదలైన భౌతిక వికారముల మధ్య ఉంటూ, తీవ్రక్షోభకు గురికాబడినది అనే భావనతో దేహాన్ని విడిచి వెళ్ళిన ఆ ఆత్మకు శాంతికోరుచున్నామని అర్థము. శరీరమును వదలి పయనమైన ఆ ఆత్మ ఎవరి గురుంచి ఘోషించదు. అంతవరకూ తనవారనుకున్నవారి గతి ఏమిటా అనికూడా ఘోషించదు. మమకారము అనేది శరీర సంబంధమైనది. ఆ మమకార భావన అనేది ఆ శరీరము నాశ్రయించిన మనసుది. అంతే గాని శరీరమును విడిచి పయనమయిన ఆత్మది కాదు. ఆత్మకు ఏవిధమైన భౌతిక వికారములు ఉండవు. ఆత్మలలో పరమాత్మ అయిన జగన్మాతకు ఇవేమీ ఉండవు గనుక *నిర్మమా* యని అన్నాము.
జగన్మాతకు గల ఈ నామములన్నియూ మంత్రములే. ఆ నామ మంత్రములు వాటిలోని పరబ్రహ్మతత్త్వాన్ని మనకు తెలియ జేస్తున్నది గనుక మనము పరమాత్మయైన జగన్మాతను నామస్తోత్రములతో కీర్తిస్తూ పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందుచే ఒక్కసారి ఈ వ్యాఖ్యానము చదివినవెంటనే జగన్మాతకు నమస్కరించుదాము. అలా నమస్కారం చేయునపుడు *ఓం నిర్మమాయై నమః* అని అందాము. *శ్రీమాత్రేనమః*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*165వ నామ మంత్రము* 7.6.2022
*ఓం మమతాహంత్ర్యై నమః*
భక్తులయందు గల నేను, నాది అనే అహంకారమును తొలగించు పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మమతాహంత్రీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం మమతాహంత్ర్యై నమః* అని ఉచ్చ రించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులలోని మమకార లక్షణాన్ని పొగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించి తరింపజేయును.
జగన్మాత *నిర్మమా* యను నామ ప్రసిద్ధమైనది. అనగా నేను, నాది అను దేహేంద్రియాదులే నేను అనుకునే మమకారము లేని పరమాత్మ స్వరూపిణి. అలాగే తన భక్తులలోని దేహేంద్రియాదులనే తాను అనుకునే మమకారాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించు అనుగ్రహమూర్తి ఆ జగన్మాత. ఇక్కడ *హంత్రీ* అనగా నాశనము చేయునది. లేకుండా చేయునది. తొలగించునది అని అర్థంచేసుకోగలము. జగన్మాత *నిర్మమా* యని గత నామ మంత్రములో తెలిసియుంటిమి. ఇక్కడ *మమతాహంత్రీ* యనగా భక్తులలో నేను, నాది యను మమకారమును తొలగుటకు కావలసిన స్వస్వరూపజ్ఞానమును ప్రసాదిస్తుంది. భవబంధాలను త్రెంచి మోక్షమార్గమును చూపుతుంది.
ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సంసారములో ఉన్నవాడు అమ్మవారిని పూజించి నాలోని భవబంధాలను తొలగించు తల్లీ అంటే ఆ తల్లి తొలగించేస్తుందా? తాను సంసారములో ఉన్నాడు. సంసారం తనతో పెనవేసుకుపోయింది. అప్పుడు తనపాటికి తను అన్నీ త్రెంచుకుపోతే అది సన్యాసం స్వీకరించినట్లు అవుతుంది. తనతో ఉన్నవారిని నట్టేట్లో ముంచినట్లవుతుంది కదా! గనుక తను ధ్యానం చేసుకునే సమయంలో, పరమాత్మ తప్ప వేరే ధ్యాస ఉండకుండా, ఆ సమయంలో కూడా భౌతిక పరమైన, భవబంధపరమైన ఆలోచనలు లేకుండా, కేవలం పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ ముక్తికి ఒక్కొక్కసోపానమును నిర్మించుకుంటూ పోవడానికి జగన్మాత అనుగ్రహిస్తుంది. *మమతాహంత్రీ* యను నామ మంత్రమునకు ఈ భావం సమన్వయమవుతుందని నా భావన. జీవుడు పరమాత్మను అర్థంచేసుకునే జ్ఞానాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. తద్వారా పురుషార్థములలో ధర్మార్ధకామములను సక్రమమార్గంలో నిర్వహింపజేసి ముక్తికి సోపానములు నిర్మించుకోగలగడం జరుగుతుంది ఇదే పరమపదసోపాన నిర్మాణము. ఈ పరమపద సోపాన మార్గంలో ఏమాత్రం పట్టుతప్పినా, ధ్యాస దిశతప్పి వికారములకు లొంగినట్లైతే ఆ మేరకు అజ్ఞానమనే సర్పదంష్టృడై క్రిందకు జారుతాడు సాధకుడు. అందుకని పరమేశ్వరీ ధ్యానం నిరంతరం చేస్తూ జీవనము కొనసాగిస్తూ పరమపదసోపాన నిర్మాణం చేసుకోవాలి.
జగన్మాతచే అనుగ్రహింప బడిన ఆత్మజ్ఞానంతో సాధకుడు మమకారరహితుడై మోక్షమార్గంలో జీవనయానం కొనసాగించు కోగలడు.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మమతాహంత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*166వ నామ మంత్రము* 8.6.2022
*ఓం నిష్పాపాయై నమః*
అవిద్య, అజ్ఞానము, అన్యులకు అకారణముగా దుఃఖకారణమగుట వంటి పాపహేతు లక్షణములు లేని పాపరహితురాలైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్పాపా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్పాపాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులను తెలిసిగాని, తెలియకగాని, అజ్ఞానముచేగాని వారు చేసిన పాపకర్మలవలన లభించిన దోషములను తొలగించి సత్కర్మలను వారిచే చేయునట్లుగా అనుగ్రహించి తరింపజేయును.
జగన్మాత పరమాత్మ స్వరూపిణి. అజ్ఞానము, అవిద్య సంబంధిత పాపహేతువులకు సంబంధించిన లక్షణములు ఉండవు. ఆతల్లి పాపరహితురాలు.
మానవుడు చేసే ప్రతీ పనివలన పాపహేతువైనదైనా కావచ్చు, పుణ్యకార్యమైనా కావచ్చు. భక్తరామదాసు శ్రీరామాలయం నిర్మించి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించినది పుణ్యకార్యమే. అయినా ఆయన చెరసాలజీవితం అనుభవించారు. కారణం? రామచిలుకను పెంచి, ప్రేమమాటలు నేర్పించారు. కాని దానిని పంజరంలో బంధించారు. అలాగే చేసుకున్నవారికి చేసుకున్నంత. పాపకర్మలకైనా, పుణ్యకర్మలకైనా ఫలితం ఈ జన్నలోనే ఇప్పుడైనా కావచ్చు, లేదా మరుజన్మకు సంచితమైనా కావచ్చు. మంచి కర్మలు చేస్తే తరువాత జన్మ మంచిది అవుతుంది. పాపకర్మలు చేస్తే ఆ జన్మ పిల్లిగా గాని, బల్లిగాగాని మరియేదైనా పశువులు, పక్షులు, క్రిమికీటకాలుగా నైనా కావచ్చు. చేసేపాపం భౌతికముగా గాని మానసికంగా గాని ఎలా చేసినా అది పాపమే. అందుకు ఫలితం తథ్యం.
చేసిన పాపం కట్టి కుడుపుతుంది అంటారు. నిజమే. అది ఈ జన్మలోనే జరగడం సాధారణం.
అలాగే మనం చేయవలసిన సత్కర్మలు అనేకం ఉన్నాయి. అవి నిర్వర్తించక పోవడం కూడా *మహాపాపమే* అవుతుంది.
దైవికముగా ఆధ్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో విధిగా చేయవలసిన కార్యములు అని అర్ధము. అవి మూడు
త్రిఋణాలు అనగా మనిషికి జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి
*1) దైవ ఋణములు, 2) పితృ ఋణములు, 3) ఋషి ఋణములు*
ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.
*దైవ ఋణాలు:*
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తీర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైదిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండములో అగ్నికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతులో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలి.
*పితృ ఋణములు:*
భౌతికంగా మనిషికి జన్మనిచ్చిన జననీ జనకులకు, వారికి జన్మనిచ్చిన వారి పితృదేవతలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృఋణము. తల్లి దండ్రులను అవసాన దశలో కంటికి రెప్పలా కాపాడుకోవడం, వారు శయ్యపైనే ఉండిపోతే (తమ పసితనంలో తల్లి, దండ్రి తమ మలమూత్రాలను భరిస్తూ, తమకు విద్యాబుద్ధులు చెప్పించి, చేయిపట్టి నడిపించి, ఒక ఇంటివాడిని చేయువరకూ వారు పడిన తపన గుర్తుంచుకొంటూ) సేవచేసి, మరణించిన పిదప అంత్యక్రియల నుండి కర్మకాండల వరకు, తరువాత ప్రతి అమావాస్యకు పితృదేవతలకు తర్పణవిధి, ప్రతిసంవత్సరము శ్రాద్ధకర్మలాచరించడం ద్వారా పితృఋణం తీరుతుంది.
*ఋషి ఋణములు:*
ఋషులు అనగా మనకు జ్ఞాన సంపదను అందించిన మన గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవాంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు. పైన ఉదహరించిన శాస్త్రాల్ని అభ్యసించడం ద్వారాను జ్ఞాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను.
మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం.
ఈ ఋణములు సక్రమంగా తీర్చుకోకపోవడం కూడా ఒక *మహాపాపమే* ఈ పాపానికి నిష్కృతి లేదు. జగన్మాతకూడా వీటిని క్షమించదు.
*శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే*
శ్రీశైలశిఖర దర్శనం చేసుకున్నవారికి పునర్జన్మ ఉండదు. అంటారు. అందుకు ఒక కథ ఉన్నది.
ఒకసారి భ్రమరాంబ, మల్లికార్జునులు భక్తులను పరీక్షింపదలచారు.
మల్లికార్జునుడు వృద్ధబ్రాహ్మణునిగాను, భ్రమరాంబ ఆయనభార్యవృద్ధ బ్రాహ్మణ ముత్తైదువగానూ కొండ దిగువకు వచ్చారు. వృద్ధబ్రాహ్మణుడు ఒక ఊబిలో దిగబడిపోతున్నాడు. ఆ బ్రాహ్మణ ముత్తైదువు ఒడ్డున నిలబడి "అయ్యా! అమ్మా! నాభర్త ఊబిలో దిగబడిపోయారు. మీలో పాపంలేనివారు ఎవరైనా ఉంటే చేయి అందివ్వండి. ఆయన పైకి వచ్చేస్తారు. నా భర్త నాకు దక్కుతారు" అంటూ జాలిగా గోలపెడుతున్నది.
వచ్చేపోయేవారు అందరూ ఒకరి ముఖములు ఒకరు చూచుకుంటున్నారు. పెదవులు విరుస్తున్నారు. "అసలే మానవ జన్మ. పాపకర్మలు తప్ప పుణ్యకార్యములు చేసేది ఉండదు. మనం ఎలా చేయి అందిస్తాము అనుకుంటున్నారు"
ఆ బ్రాహ్మణ ముత్తైదువ ఆక్రందన మరింత ఎక్కువ అయినది.
ఇంతలో ఒక వేశ్య ఆ ఆక్రందన విన్నది.
"శ్రీశైల శిఖరం చూచినవారికి పాపాలు ఉండవుకదా. మరి నాకు పాపం ఎలా ఉంటుంది?" అని మనసులో అనుకొంటూ, "శ్రీశైల శిఖరం చూచాను. ఇంకనాకు పాపాలు లేవుగదా! పట్టవయ్యా బ్రాహ్మణోత్తమా నాచేయి. ఊబినుంచి పైకి రావయ్యా! నీ భార్య నీకోసం దుఃఖిస్తోంది" అంటూ ఆ వేశ్య చేయి అందించి ఆ బ్రాహ్మణరూపంలో ఉన్న మల్లికార్జున స్వామిని లాగింది. భ్రమరాంబా మల్లికార్జునులు ఆవేశ్యా స్త్రీకి మరింత పుణ్యఫలం ప్రసాదించి ఆమెకు ఉత్తమ గతులు కలిగించారు.
ఇలా మనకు తెలియకనే పుణ్యమూ చేస్తాము, పాపమూ చేస్తాము. అందుచే జగన్మాత నామస్మరణ మాత్రమే తెలిసి చేయు పుణ్యకారణమైన సత్కర్మ.
మానవునికే ఇన్ని చిక్కులు. మానవునికే కాదు ప్రతీ శరీరధారికి రాసిపెట్టినవే. పాపంచేయడానికి ఎన్ని అవకాశములు ఉన్నవో పుణ్యములు చేయడానికి కూడా అన్ని అవకాశములు ఉన్నాయి. కాని ఆత్మకు కాదు. పరమాత్మకు అసలేకాదు. అందుకే జగన్మాత *నిష్ఫాపా* అని నామ ప్రసిద్ధమయినది.
గనుక జగన్మాతకు నమస్కరిస్తూ *ఓం నిష్పాపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
169వ నామ మంత్రము 11.6.2022
ఓం క్రోధశమన్యై నమః
కోపము శత్రువు వంటిది. కోపము అజ్ఞానమునకు చిహ్నము. కోపము గలవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలములు. తన భక్తులలో అట్టి కోపమును నశింపజేయు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి క్రోధశమనీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం క్రోధశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంతభక్తి తత్పరతతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే తొలుత తనలో తనకు శత్రుసమానముగా ఉండు కోపము నశించును. పిదప జగన్మాత నామ స్మరణపై నిమగ్నత అధికమై ఆత్మానందానుభూతిని పొందును. సుఖసంతోషములతో జీవించును. అంత్యమున జన్మరాహిత్యత కూడిన మోక్షము లభించును.
కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము ఈ ఆరింటిని అరిషడ్వర్గములు అందురు. వర్గము అంటే కూటమి. అరి అంటే శత్రువు. అరిషడ్వర్గము అంటే ఒక శత్రువు ఏవిధంగా సంహరిస్తాడో అలాగే ఈ వర్గములో ఏలక్షణమైనా శత్రువుతో సమానమే. అందునా క్రోధము చాలా ప్రమాదమైన శత్రువు. క్రోధము వలన ఫలితం వెంటనే తెలిసిపోతుంది. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. కాబట్టి మనసుకు సంబంధించినది మరియు శరీరధారులకు ఉండే క్రోధము జగన్మాతకు ఉండదు. అందుచే ఆ తల్లి నిష్క్రోధా అనగా కోపము లేనిది అను నామ మంత్రముగలిగినది. తను నిష్క్రోధా యనబడుచున్నది గనుక తన భక్తులకు కూడా క్రోధము ఉండ కూడదు. అందుకు తన భక్తులలోని క్రోధాన్ని నశింపజేస్తుంది.
క్రోధయుక్తో యద్యజతి యజ్జుహోతి యదర్చతి|
సతస్య హరతే సర్వం ఆమకుంభో యథోదకమ్॥ (సౌభాగ్యభాస్కరం, 360వ పుట)
పచ్చికుండలో ఉదకము (నీరు) నిలబడనట్లు క్రోధము ఉన్నవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలాన్ని ఇస్తాయి. క్రోధము ఉన్నవాడు అజ్ఞానితో సమానం. క్రోధము ఉన్నవాడు తనకు తెలియకుండానే అయినదానికి, కానిదానికి ఊగిపోతూ ఉంటాడు. అది ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. రెండవది కోపం అనేది విచక్షణాజ్ఞానంలేకుండా చేస్తుంది. గనుక ఎదుటవారిని మానసిక మరియు భౌతికపరంగా హింసించడం జరుగుతుంది. దాని వలన క్రోధం కలిగి ఉండడం ఒక పాపమయితే, ఆ కోపంలో తాను చేయు హింసవలన మరింత పాపం సంచిత మౌతుంది. అపఖ్యాతిని మూటగట్టుకుంటాడు. లేదా తనను తానే శిక్షించుకొను రీతిలో తన యునికిని తానే పోగొట్టుకొని, తనతో పాటు, తనపై ఆధారపడినవారినికూడా ఇక్కట్లపాలు చేయడం జరుగుతుంది. అందుకే తన కోపము తనకే శత్రువు అని అన్నారు పెద్దలు.
క్రోధస్య దుష్టత్వం ఆపస్తంబేనోక్తం క్రోధముయొక్క దుష్టత్వాన్ని ఆపస్తంబుడు చెప్పడం జరిగింది (ఆయన చెప్పడం ఏమిటి? అందరికీ స్వానుభవమే! కాదంటారా? ఎవ్వరూ అనరు.) అయినా.
జగన్మాత తన భక్తులలోని ఇంతటి ప్రమాదకరమైన క్రోధమును నశింపజేయును గనుకనే క్రోధశమనీ యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం క్రోధశమన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹