Sunday, 28 June 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము

సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము, గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము, ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

నారదుడు పలికెను - ధర్మరాజా! దైత్యబాలకులు ఇట్లు ప్రశ్నింపగా  భాగవతోత్తముడైన ప్రహ్లాదునకు నేను తెలిపిన మాటలు స్మరణకు వచ్చెను. అప్ఫుడతడు పరమానందభరితుడై చిరునవ్వుతో ఇట్లుపలికెను-

ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు నుడివెను- మా తండ్రియైన హిరణ్యకశిపుడు తపస్సుచేయుటకై మందరాచలమునకు వెళ్ళియుండెను. అప్పుడు ఇంద్రాదిదేవతలు దానవులపై యుద్ధమొనర్చుటకు ఉద్యమించిరి. ఇంద్రాదిదేవతలు ఇట్లు పలికిరి- చీమలు ఒక మహాసర్పమును భక్షించినట్లుగా, లోకములను తపింపజేసిన పాపియగు హిరణ్యకశిపుని, దైవవశమున అతని పాపములే తినివేసినవి. ఇంతలో దేవతలు తమతో గొప్ప యుద్దము చేయుటకు ప్రయత్నించుచున్నారను విషయము దైత్య సేనాపతులకు తెలిసెను. అప్పుడు వారి ధైర్యము సడలిపోయెను. దేవతలచే దెబ్బతిని వారు స్త్రీలను, పుత్రులను , మిత్రులను, భవనములకు, పశువులను, గృహోపకరణములను గూర్చి ఆలోచింపక తమ ప్రాణములను రక్షించుకొనుటకై త్వరత్వరగా ఎటు వారటు పారిపోయిరి. విజయమును కోరుకొనుచున్న దేవతలు రాజభవనములోని వస్తువులను చెల్లాచెదరు చేసిరి. ఇంద్రుడు పట్టమహిషియు, నాతల్లియు ఐన కయాధువును గూడ బందీగా చేసెను. నా తల్లి భయపడుచు కురరీ పక్షివలె రోదింపసాగెను. కాని, ఇంద్రుడు ఆమెను బలవంతముగా తీసికొనిపోయెను. అప్పుడు దైవికముగా నారదమహర్షి అచటికి ఏతెంచెను. అతడు మార్గమధ్యమున ఏడ్చుచున్న నా తల్లిని జూచెను.

ఆ దేవర్షి ఇట్లు పలికెను "సురపతీ! ఈమె నిరపరాధి. ఈమెను తీసికొనిపోవుట ఉచితముగాదు. సాధ్వియైన పరసతిని ఇట్లు అవమానించరాదు. ఈమెను వదలివేయుము. వెంటనే వదలి వేయుము.

ఇంద్ర ఉవాచ

ఇంద్రుడు పలికెను- ఈమె గర్భమును దేవద్రోహియైన హిరణ్యకశిపుని వీర్యము గలదు. అది మిక్కిలి ప్రభావము గలది. ప్రసవించువరకు ఈమె నా యొద్ద ఉండగలదు. బాలుడు జన్మింపగనే అతనిని వధించి, నేను ఈమెను వదలిపెట్టెదను.

నారద ఉవాచ

నారదుడు పలికెను- ఈమె గర్భమున ఉదయించువాడు పరమభాగవతుడు. అతడు పుణ్యాత్ముడు, మహాశక్తిగలవాడు. భగవంతుని సేవకుడైన ఇతనిని చంపగల శక్తి నీకు లేదు. 

దేవర్షియైన నారదుని మాటలను విని ఇంద్రుడు మహాసాధ్వియగు నా తల్లిని వదలిపెట్టెను. ఈమె గర్భము నందు భగవద్భక్తుడు కలడని తెలిసికొని, అతడు నా తల్లికి ప్రదక్షిణమొనర్చి, స్వర్గలోకమునకు వెళ్ళపోయెను.

అనంతరము దేవర్షియైన నారదుడు నా తల్లిని తన ఆశ్రమమునకు తీసికొని పోయెను. ఆమెను ఓదార్చి - 'బిడ్డా! నీ భర్త తపస్సు ముగించుకొని తిరిగి వచ్చునంతవరకు నీవు ఇచటనే యుండుము' అని పల్కెను.

'అట్లే' అని పలికి, ఆమె దేవర్షి ఆశ్రమమునందే నిర్భయముగా ఉండసాగెను. మా తండ్రి తీవ్రమైన తన తపస్సునుండి తిరిగి వచ్చునంతవరకు ఆమె అక్కడనే యుండెను.

గర్భవతియైన నా తల్లి ఆమె గర్భస్థుడనై యున్న నా శుభము కొరకును, సరియైన సమయములో క్షేమముగా సంతాన ప్రాప్తికొరకును భక్తి శ్రద్ధలతో నారదునకు శుశ్రూషలు చేయసాగెను.

గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
దేవర్షియైన నారదుడు మిగుల దయాళువు, సర్వసమర్థుడు. అతడు నా తల్లికి భాగవత ధర్మరహస్యములను, విశుద్ధజ్ఞానమును ఉపదేశించెను. ఆయన అట్లు ఉపదేశించునపుడు ఆ మహాత్ముని దృష్టి నాపై పడియుండెను. 

చాల సమయము గడచుటవలనను, స్త్రీ యగుటవలనను నా తల్లికి ఆ జ్ఞానము ఇప్పుడు జ్ఞాపకము లేదు. కాని దేవర్షియొక్క విశేషకృపవలన ఆ ఉపదేశమును నేను ఏ మాత్రమూ మరచిపోలేదు.

నా మాటపై మీకు విశ్వాసమున్నచో, మీకు గూడ ఆ జ్ఞానము లభ్యమగును. ఏలయన, తగు శ్రద్ధవలన దేహాదులయందు అహంభావమును నశింపచేయునట్టి శుద్ధమైన బుద్ధి నాకు లభించినట్లుగానే, స్త్రీలకు, బాలురకు కూడా లభింపగలదు.

కాలస్వరూపుడైన పరమేశ్వరుని ప్రేరణచే వృక్షములకు కాయలుగాయును. అవి కొంతకాలము వరకు ఉండును. అవి  వృద్ధి చెందును, ఫలించును, క్షీణించును, నష్టమగును. అట్లే ఈ శరీరమునకు గూడ జననము, అస్తిత్వము, వృద్ది, పరిణామము, క్షయము, వినాశము అని ఆరు భావవికారములు కలుగుచుండును. కాని, ఆత్మకు ఏవిధముగను వీటితో సంబంధము ఉండదు. ఆత్మ నిత్యము, అవినాశి, శుద్ధము, ఏకము, క్షేత్రజ్ఞము, ఆశ్రయము, నిర్వికారము, స్వయంప్రకాశకము, సర్వకారణము, వ్యాపకము, అసంగము, ఆవరణరహితము - ఐనది. 

పైన తెలుపబడిన పన్నెండును ఆత్మయొక్క ఉత్కృష్టలక్షణములు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనగోరు పురుషుడు అజ్ఞాన కారణముగా దేహాదుల యందు గల నేను-నాది అను మిథ్యా భావమును విడిచిపెట్టవలెను.

గనులయందు బంగారము రాళ్ళతో కలిసియుండును. స్వర్ణకారుడు ఆ బంగారమును వెలికితీయు విధులను తెలిసికొని, ఆ విధులద్వారా బంగారమును సంపాదించు కొనును. అట్లే అధ్యాత్మతత్త్వము తెలిసికొన దలచిన పురుషుడు ఆత్మప్రాప్తి యొక్క ఉపాయముల ద్వారా తన శరీరము అను క్షేత్రమునందే బ్రహ్మపదమును సాక్షాత్కరింపజేసి కొనును.

మూలప్రకృతి, మహతత్త్వము అహంకారము, పంచతన్మాత్రలు అను ఎనిమిది తత్త్వములను ప్రకృతి అని ఆచార్యులు (గురువులు) తెలిపిరి. ఆ ప్రకృతి సత్త్వము, రజస్సు, తమస్సు - అను మూడుగుణములు గలది. పది ఇంద్రియములు, మనస్సు, పంచమహాభూతములు అను పదహారును దాని వికారములు. వీటి అన్నింటియందును ఒక పురుషుడు (ఆత్మ) చైతన్య స్వరూపుడుగా వ్యాపించియుండును.

వీటి అన్నింటి సముదాయమే దేహము. ఇది స్థావరములు, జంగమములు - అని రెండు విధములు. ఇందలి అంతఃకరణము, ఇంద్రియములు మొదలగు అనాత్మ  పదార్థములను ఇదికాదు-ఇదికాదు అని నిరాకరించుచు ఆత్మను అన్వేషింపవలెను.

ఆత్మ అన్నింటియందు వ్యాపించియున్నది. కాని, అది అన్నింటికంటె వేరుగా ఉన్నది. విలక్షణమైనది. ఈ విధముగా శుద్ధమైన బుద్ధితో నెమ్మది-నెమ్మదిగా జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను గూర్చి వివేచన చేయవలెను. ఈ విచారమునందు ఎంతమాత్రము తొందరపాటు పనికిరాదు.

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడును బుద్ధియొక్క వృత్తులు. ఎవరిద్వారా ఈ వృత్తులు అనుభవమునకు వచ్చుచున్నవో, అతడే వీటికి అతీతుడైన సాక్షియగు పరమాత్మ.

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలద్వారా కలిగెడు మార్పులు - చేర్పులు బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందే ఆత్మ అవగతమై యున్నది. అందువలన బుద్ధితో ఏర్పడిన తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మవలననే జరుగుచున్నవా! యని అనిపించును. కావున ఇట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధము అనగా వాసనవలన దానికి ఆశ్రయమైన వాయువును గుర్తించి, గంధమును నిరాకరించినట్లుగా, బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేయునట్టి సాక్షిరూపమున నున్న ఆత్మను తెలిసికొనవలెను.

గుణములచే, కర్మలచే సంబంధము జోడింపబడుటవలన జనన మరణ చక్రములో తిరుగుట తప్పదు. అజ్ఞానమువలన శరీరమందును ఆత్మబుద్ధి కలుగుచున్నది. ఇది మిథ్యయే కాని, సత్యము కాదు. ఐననూ, ఇది స్వప్నమువలె జీవునకు ప్రతీతమగు చుండును.

సోదరులారా! అందువలన మొట్టమొదట మీరు గుణములను అనుసరించుచు కలుగునట్టి కర్మబీజములను నష్టపరచవలెను. దీనివలన బుద్ధియొక్క వృత్తుల ప్రవాహము నివృత్తమగును. దీనినే యోగము, లేక పరమాత్మప్రాప్తి అందురు.

త్రిగుణాత్మకమైన కర్మబీజములను తొలగించుటకును, లేదా బుద్ధివృత్తుల ప్రవాహమును ఆపివేయుటకును వేలకొలది సాధనములు గలవు. భగవంతుని యందు ప్రేమ కలుగుటవలన సహజముగనే అతని స్మరణ జరుగుచుండును. భగవంతుని యెడల ప్రేమ కలుగుటకు ఇదియే సులభోపాయము. ఈ విషయమును భగవానుడే స్వయముగా తెలిపియుండెను.

భక్తితో గురువును సేవించుట, తనకు దొరికిన సకల పదార్థములను భగవంతునకు సమర్పించుట, సాధుపురుషులైన భక్తులతో సాంగత్యము చేయుట, భగవంతుని ఆరాధించుట, ఆ ప్రభువు యొక్క కథలను శ్రద్ధగా వినుట, ఆయన గుణములను, లీలలను శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాదపద్మములను ధ్యానించుట, ఆయన మందిరములోని మూర్తిని దర్శించి, పూజించుట మొదలగు సాధనముల ద్వారా భగవంతుని యందు సహజమైన ప్రేమ (భక్తి) కలుగును.

'సర్వశక్తిమంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలో విరాజిల్లుచున్నాడు' అను భావముచే యథాశక్తి ప్రాణులన్నింటియొక్క అభిలాషలను నెరవేర్పవలెను. హృదయ పూర్వకముగా వారిని గౌరవింపవలెను.

కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అను ఆరు శత్రువులను జయించి, పూర్వోక్త విధముగా సాధనములను  అనుష్ఠించువారికి భగవంతుడైన శ్రీమహావిష్ణు చరణములయందు అనన్య భక్తి కలుగును.

భగవంతుడు తన లీలావతారములయందు ప్రదర్శించిన అద్భుత బలపరాక్రమములను, సాటిలేని ఆ స్వామి గుణములను, కర్మలను వినుట వలన అత్యంత ఆనందాతిరేకముతో మానవుని శరీరము పులకించును. కన్నులలో అశ్రువులు స్రవించి,, కంఠము గద్గదమగును. సంకోచమును విడిచి, అతడు బిగ్గరగా అరచుచు, గానము చేయుచు నాట్యము చేయును. ఒక్కొక్కసారి, గ్రహగ్రస్తుడైన పిచ్చివానివలె నవ్వుచుండును. కరుణా పూరితమైన ఆక్రందనలు చేయుచుండును. ఒక్కొక్కసారి ధ్యానమగ్నుడగును. భగవద్భావముతో జనులకు నమస్కరించుచుండును. భగవంతునియందు తన్మయుడై మాటిమాటికిని దీర్ఘనిశ్వాసములను  విడచుచుండును. బిడియమును విడిచి, హరీ! జగన్నాథా! నారాయణా అనుచు గట్టిగ అరచుచుండును. ఇట్టి భక్తి యోగ ప్రభావమున అతని బంధములన్నియును తెగిపోవును. అతని హృదయము భగవన్మయమగును. అట్టి సమయమున అతని జనన, మరణములకు హేతువులగు వాసనా రూపములగు బీజములన్నియును దగ్ధమైపోవును. అంతట ఆ పురుషుడు భగవత్ప్రాప్తిని పొందును.

భక్తియోగముద్వారా భగవంతుని ఆశ్రయించుటచే జీవుని అమంగళకరమైన సంస్కారములన్నియును నశించిపోవును. దీనివలన సంసార చక్రము నివారింపబడును. ఆ శ్రీహరిచే బ్రహ్మగా, నిర్వాణసుఖముగా మహాత్ములు పేర్కొందురు. కనుక మిత్రులారా! మీరు మీ హృదయములలో అంతరాత్మగా వెలుగొందు భగవంతుని భజింపుడు.

అమరబాలకులారా! మీ హృదయముల యందు భగవంతుడు ఆకాశమువలె నిత్యమై సమానముగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవంతుని భజించుటలో మిక్కిలి ప్రయాస ఏమియు ఉండదు. అతడు సమస్తప్రాణులలో ఆత్మగా నుండు ప్రేమ స్వరూపుడు. అట్టి స్వామిని వదలి భోగ్యసామాగ్రిని సేకరించుటకై తిరుగుట ఎంతటి మూర్ఖత్వము?

సోదరులారా! భార్యాపుత్రులు, బంధువులు, భవనములు, భూములు, సంపదలు, ఇంకను అనేక వైభవములు, జగత్తులోని సమస్తధనము, భోగసామాగ్రి, సర్వమూ, క్షణభంగురములు. నశ్వరములు. ఇట్టి నశ్వరములైన వస్తువులతో శాశ్వతసుఖము లభించునా? అట్టి వాటివలన క్షణికమైన ఆయుష్షుగల మనుజునకు ఎట్టి సుఖముండును?

ఈ లోకమునందలి సంపదలు మనము చూచుచుండగనే నశించుచున్నవి గదా! అట్లే, యజ్ఞములవలన ప్రాప్తించు స్వర్గాది లోకములు గూడ నాశవంతములే. వాటిలో చిన్న-పెద్ద, ఉత్తమ-అధమ తారతమ్యములు ఉండును. తద్ద్వారా పరస్పరముగా స్పర్ధ యేర్పడును. కావున, అవి దోషరహితములు కావు. పరమాత్మ ఒక్కడే. అతడెట్టి దోషములను లేనివాడు. ఆ ప్రభువు నందు ఎవ్వరును దోషములను వినలేదు, కనలేదు. కనుక, అట్టి పరమాత్మ ప్రాప్తికి అనన్య భక్తితో ఆ ప్రభువును భజింపవలెను.

ఈ లోకమున జనులు తామే పండితులమని భావించుచు, సుఖ భోగములను పొందుటకై పదే పదే కర్మలను చేయుచుందురు. వారు వాటిని పొందలేరు సరిగదా, విపరీతఫలములను పొందుదురు. ఇందు సదేహము లేదు.

జనులు కర్మలలో ప్రవృత్తులగుటకు దుఃఖములను దుఃఖములను తప్పించుకొనుట, సుఖములను పొందుట అను రెండు లక్ష్యములు ఉండును. కాని మొదట ఎట్టి కోరికలను లేనివాడు సుఖములో నిమగ్నుడైయుండును. కాని, అతడే  సుఖభోగములను ఆశించుటవలన సర్వదా దుఃఖములనే అనుభవింపవలసి వచ్చును.

ఈ లోకములో మనుష్యులు సకామకర్మలద్వారా దైహిక భోగములను పొందగోరుదురు. కాని, ఆ దేహమే శాశ్వతముగాదు. అది ప్రకృతియొక్క అంశమగుటచే జడమైనది. ప్రాప్తించిన శరీరము ఎప్పటికైనను పోకమానదు. ఈ శరీరముయొక్క స్థితియే ఇట్లు ఉన్నప్పుడు, దీని కంటెను వేరైన భార్యాపుత్రులు, భవనములు, ధనము, సంపదలు, రాజ్యము, కోశాగారములు, వాహనములు, మంత్రులు, సేవకులు, గురుజనులు, ఇంకను 'నావి' అని అనుకొను వస్తువుల విషయము చెప్పనేల?

రాజ్యము మొదలగు వస్తువులు అన్నియును తుచ్ఛములే. శరీరముతో బాటు ఇవి అన్నియును నశించునవియే. ఇవి పురుషార్థములవలె కన్పట్టును. కాని, వాస్తవముగా ఇవి అనర్థదాయకములు. ఆత్మ స్వయముగా శాశ్వతము, పరమానంద సముద్రము.

సోదరులారా! ఈ విషయమును గూర్చి కొంచెము ఆలోచింపుడు. జీవుడు తల్లి గర్భములో పడినప్పటినుండి మృత్యుపర్యంతము తన ప్రారబ్ధకర్మానుసారము కష్టపరంపరను అనుభవించుచునే యుండును. ఈ సంసారమున అతనికి చేకూరు స్వార్థమేముండును?

ఈ జీవుడు శరీరమునే తన ఆత్మగా భావించి, పలువిధములైన కర్మలను ఆచరించును. ఆ కర్మల కారణముగా మరియొక శరీరమును ధరించును. ఈ విధముగా కర్మలు, శరీరములు పరంపరగ సంభవించుచునే యుండును. దీనికి అంతటికిని కారణము అజ్ఞానమే.

శ్రీమహావిష్ణువు సకల ప్రాణులకు ప్రభువు, ఆత్మ, ప్రియతముడు. తనచే సృష్టీంపబడిన పంచమహా భూతములు, సూక్ష్మభూతములు మొదలగు వాటి ద్వారా రుపొందిన ఈ శరీరమునందు జీవుడు అని పిలువబడే ప్రియమున ఆత్మ శ్రీహరియే. అతడే సమస్త జీవులలో అంతర్యామిగా వెలుగొందుచున్నాడు.

దేవతలు, దైత్యులు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు మొదలగువారు ఎవ్వరైనను భగవంతుని పాదపద్మములను సేవించి, మనవలె సకల శ్రేయస్సులకును అర్హులగుదురు.

దైత్యబాలకులారా! శ్రీహరిని ప్రసన్నునిగా చేసి కొనుటకు బ్రాహ్మణుడుగా, దేవతగా, ఋషిగా జన్మించుట, సదాచారమును కలిగియుండుట, పెక్కు శాస్త్రముల యందు జ్ఞానమును సంపాదించుట, అట్లే దానము, తపము, యజ్ఞములు, శారీరక, మానసికశౌచము, శ్రేష్ఠములైన వ్రతములను అనుష్ఠించుట మొదలగునవి చాలవు- భగవంతుడు కేవలము నిష్కామభక్తి చేతనే ప్రసన్నుడగును. ఇవి యన్నియును ఆ భక్తికి సహాయకములే. 

దానవులారా! కనుక, సకల ప్రాణులను మీ ఆత్మలుగా భావించి, సర్వత్ర విరాజిల్లుచున్న సర్వాత్మయు, సర్వశక్తిమంతుడు ఐన పరమేశ్వరునియెడ భక్తి కలిగియుందురు.

భగవద్భక్తి ప్రభావముచే దైత్యులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గోపాలురు (గొల్లలు), పక్షులు, మృగములు ఇంకను పెక్కుమంది పాప జీవులు గూడ భగవద్భావమును పొందిరి.

ఈ ప్రపంచమున మానవశరీరమును పొందిన జీవుని ఒకే పరమార్థము (పరమప్రయోజనము) భగవంతుడైన గోవిందునియందు అనన్య భక్తిని కలిగియుండుటయే. సర్వదా, సర్వత్ర, సకలవస్తువులలోను భగవంతుని దర్శించుటయే ఆ భక్తియొక్క నిజస్వరూపము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమోఽధ్యాయః (7)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***

28.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము

గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

7.1 (ప్రథమ శ్లోకము)

ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతోఽసురః|

ఉవాచ స్మయమానస్తాన్ స్మరన్ మదనుభాషితమ్॥5855॥

నారదుడు పలికెను - ధర్మరాజా! దైత్యబాలకులు ఇట్లు ప్రశ్నింపగా  భాగవతోత్తముడైన ప్రహ్లాదునకు నేను తెలిపిన మాటలు స్మరణకు వచ్చెను. అప్ఫుడతడు పరమానందభరితుడై చిరునవ్వుతో ఇట్లుపలికెను-

ప్రహ్లాద ఉవాచ

7.2 (రెండవ శ్లోకము)

పితరి ప్రస్థితేఽస్మాకం తపసే మందరాచలమ్|

యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి ॥5856॥

7.3 (మూడవ శ్లోకము)

పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః|

పాపేన పాపోఽభక్షీతి వాదినో వాసవాదయః॥5857॥

7.4 (నాలుగవ శ్లోకము)

తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః|

వధ్యమానాః సురైర్భీతా దుద్రువుః సర్వతో దిశమ్॥5858॥

7.5 (ఐదవ శ్లోకము)

కలత్రపుత్రమిత్రాప్తాన్ గృహాన్ పశుపరిచ్ఛదాన్|

నావేక్ష్యమాణాస్త్వరితాః సర్వే ప్రాణపరీప్సవః॥5859॥

7.6 (ఆరవ శ్లోకము)

వ్యలుంపన్ రాజశిబిరమమరా జయకాంక్షిణః|

ఇంద్రస్తు రాజమహిషీం మాతరం మమ చాగ్రహీత్॥5860

7.7 (ఏడవ శ్లోకము)

నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ|

యదృచ్ఛయాఽఽగతస్తత్ర దేవర్షిర్దదృశే పథి5861॥

ప్రహ్లాదుడు నుడివెను- మా తండ్రియైన హిరణ్యకశిపుడు తపస్సుచేయుటకై మందరాచలమునకు వెళ్ళియుండెను. అప్పుడు ఇంద్రాదిదేవతలు దానవులపై యుద్ధమొనర్చుటకు ఉద్యమించిరి. ఇంద్రాదిదేవతలు ఇట్లు పలికిరి- చీమలు ఒక మహాసర్పమును భక్షించినట్లుగా, లోకములను తపింపజేసిన పాపియగు హిరణ్యకశిపుని, దైవవశమున అతని పాపములే తినివేసినవి. ఇంతలో దేవతలు తమతో గొప్ప యుద్దము చేయుటకు ప్రయత్నించుచున్నారను విషయము దైత్య సేనాపతులకు తెలిసెను. అప్పుడు వారి ధైర్యము సడలిపోయెను. దేవతలచే దెబ్బతిని వారు స్త్రీలను, పుత్రులను , మిత్రులను, భవనములకు, పశువులను, గృహోపకరణములను గూర్చి ఆలోచింపక తమ ప్రాణములను రక్షించుకొనుటకై త్వరత్వరగా ఎటు వారటు పారిపోయిరి. విజయమును కోరుకొనుచున్న దేవతలు రాజభవనములోని వస్తువులను చెల్లాచెదరు చేసిరి. ఇంద్రుడు పట్టమహిషియు, నాతల్లియు ఐన కయాధువును గూడ బందీగా చేసెను. నా తల్లి భయపడుచు కురరీ పక్షివలె రోదింపసాగెను. కాని, ఇంద్రుడు ఆమెను బలవంతముగా తీసికొనిపోయెను. అప్పుడు దైవికముగా నారదమహర్షి అచటికి ఏతెంచెను. అతడు మార్గమధ్యమున ఏడ్చుచున్న నా తల్లిని జూచెను.

7.8 (ఎనిమిదవ శ్లోకము)

ప్రాహ మైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్|

ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహమ్॥5862॥

ఆ దేవర్షి ఇట్లు పలికెను "సురపతీ! ఈమె నిరపరాధి. ఈమెను తీసికొనిపోవుట ఉచితముగాదు. సాధ్వియైన పరసతిని ఇట్లు అవమానించరాదు. ఈమెను వదలివేయుము. వెంటనే వదలి వేయుము.

ఇంద్ర ఉవాచ

7.9  (ఎనిమిదవ శ్లోకము)

ఆస్తేఽస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః|

ఆస్యతాం యావత్ప్రసవం మోక్ష్యేఽర్థపదవీం గతః॥5863॥

ఇంద్రుడు పలికెను- ఈమె గర్భమును దేవద్రోహియైన హిరణ్యకశిపుని వీర్యము గలదు. అది మిక్కిలి ప్రభావము గలది. ప్రసవించువరకు ఈమె నా యొద్ద ఉండగలదు. బాలుడు జన్మింపగనే అతనిని వధించి, నేను ఈమెను వదలిపెట్టెదను.

నారద ఉవాచ

7.10 (పదియవ శ్లోకము)

అయం నిష్కిల్బిషః సాక్షాన్మహాభాగవతో మహాన్|

త్వయా న ప్రాప్స్యతే సంస్థామనంతానుచరో బలీ॥5864॥

నారదుడు పలికెను- ఈమె గర్భమున ఉదయించువాడు పరమభాగవతుడు. అతడు పుణ్యాత్ముడు, మహాశక్తిగలవాడు. భగవంతుని సేవకుడైన ఇతనిని చంపగల శక్తి నీకు లేదు. 

7.11 (పదకొండవ శ్లోకము)

ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః|

అనంతప్రియభక్త్యైనాం పరిక్రమ్య దివం యయౌ॥5865॥

దేవర్షియైన నారదుని మాటలను విని ఇంద్రుడు మహాసాధ్వియగు నా తల్లిని వదలిపెట్టెను. ఈమె గర్భము నందు భగవద్భక్తుడు కలడని తెలిసికొని, అతడు నా తల్లికి ప్రదక్షిణమొనర్చి, స్వర్గలోకమునకు వెళ్ళపోయెను.

7.12 (పండ్రెండవ శ్లోకము)

తతో నో మాతరమృషిః సమానీయ నిజాశ్రమమ్|

ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః॥5866॥

అనంతరము దేవర్షియైన నారదుడు నా తల్లిని తన ఆశ్రమమునకు తీసికొని పోయెను. ఆమెను ఓదార్చి - 'బిడ్డా! నీ భర్త తపస్సు ముగించుకొని తిరిగి వచ్చునంతవరకు నీవు ఇచటనే యుండుము' అని పల్కెను.

7.13 (పదమూడవ శ్లోకము)

తథేత్యవాత్సీద్దేవర్షేరంతి సాప్యకుతోభయా|

యావద్దైత్యపతిర్ఘోరాత్తపసో న న్యవర్తత॥5857॥

'అట్లే' అని పలికి, ఆమె దేవర్షి ఆశ్రమమునందే నిర్భయముగా ఉండసాగెను. మా తండ్రి తీవ్రమైన తన తపస్సునుండి తిరిగి వచ్చునంతవరకు ఆమె అక్కడనే యుండెను.

8.14 (పదునాలుగవ శ్లోకము)

ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ|

అంతర్వర్త్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛాప్రసూతయే॥5868॥

గర్భవతియైన నా తల్లి ఆమె గర్భస్థుడనై యున్న నా శుభము కొరకును, సరియైన సమయములో క్షేమముగా సంతాన ప్రాప్తికొరకును భక్తి శ్రద్ధలతో నారదునకు శుశ్రూషలు చేయసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

29.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము

గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.15 (పదునైదవ శ్లోకము)

ఋషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః|

ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్॥5869॥

దేవర్షియైన నారదుడు మిగుల దయాళువు, సర్వసమర్థుడు. అతడు నా తల్లికి భాగవత ధర్మరహస్యములను, విశుద్ధజ్ఞానమును ఉపదేశించెను. ఆయన అట్లు ఉపదేశించునపుడు ఆ మహాత్ముని దృష్టి నాపై పడియుండెను. 

7.16 (పదునారవ శ్లోకము)

తత్తు కాలస్య దీర్ఘత్వాత్స్త్రీత్వాన్మాతుస్తిరోదధే|

ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్స్మృతిః॥5870॥

చాల సమయము గడచుటవలనను, స్త్రీ యగుటవలనను నా తల్లికి ఆ జ్ఞానము ఇప్పుడు జ్ఞాపకము లేదు. కాని దేవర్షియొక్క విశేషకృపవలన ఆ ఉపదేశమును నేను ఏ మాత్రమూ మరచిపోలేదు.

7.17 (పదునేడవ శ్లోకము)

భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః|

వైశారదీ ధీః శ్రద్ధాతః స్త్రీబాలానాం చ మే యథా॥5871॥

నా మాటపై మీకు విశ్వాసమున్నచో, మీకు గూడ ఆ జ్ఞానము లభ్యమగును. ఏలయన, తగు శ్రద్ధవలన దేహాదులయందు అహంభావమును నశింపచేయునట్టి శుద్ధమైన బుద్ధి నాకు లభించినట్లుగానే, స్త్రీలకు, బాలురకు కూడా లభింపగలదు.

7.18 (పదునెనిమిదవ శ్లోకము)

జన్మాద్యాః షడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః|

ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా॥5872॥

కాలస్వరూపుడైన పరమేశ్వరుని ప్రేరణచే వృక్షములకు కాయలుగాయును. అవి కొంతకాలము వరకు ఉండును. అవి  వృద్ధి చెందును, ఫలించును, క్షీణించును, నష్టమగును. అట్లే ఈ శరీరమునకు గూడ జననము, అస్తిత్వము, వృద్ది, పరిణామము, క్షయము, వినాశము అని ఆరు భావవికారములు కలుగుచుండును. కాని, ఆత్మకు ఏవిధముగను వీటితో సంబంధము ఉండదు.

7.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఆత్మా నిత్యోఽవ్యయః శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః|

అవిక్రియః స్వదృగ్ హేతుర్వ్యాపకోఽసంగ్యనావృతః॥5873॥

ఆత్మ నిత్యము, అవినాశి, శుద్ధము, ఏకము, క్షేత్రజ్ఞము, ఆశ్రయము, నిర్వికారము, స్వయంప్రకాశకము, సర్వకారణము, వ్యాపకము, అసంగము, ఆవరణరహితము - ఐనది.

7.20 (ఇరువదియవ శ్లోకము)

ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః|

అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్॥5874॥

పైన తెలుపబడిన పన్నెండును ఆత్మయొక్క ఉత్కృష్టలక్షణములు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనగోరు పురుషుడు అజ్ఞాన కారణముగా దేహాదుల యందు గల నేను-నాది అను మిథ్యా భావమును విడిచిపెట్టవలెను.

7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్|

క్షేత్రేషు దేహేషు తథాత్మయోగై- రధ్యాత్మవిద్బ్రహ్మగతిం లభేత॥5875॥

గనులయందు బంగారము రాళ్ళతో కలిసియుండును. స్వర్ణకారుడు ఆ బంగారమును వెలికితీయు విధులను తెలిసికొని, ఆ విధులద్వారా బంగారమును సంపాదించు కొనును. అట్లే అధ్యాత్మతత్త్వము తెలిసికొన దలచిన పురుషుడు ఆత్మప్రాప్తి యొక్క ఉపాయముల ద్వారా తన శరీరము అను క్షేత్రమునందే బ్రహ్మపదమును సాక్షాత్కరింపజేసి కొనును.

7.22 (ఇరువది రెండవ శ్లోకము)

అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః|

వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్॥5876॥

మూలప్రకృతి, మహతత్త్వము అహంకారము, పంచతన్మాత్రలు అను ఎనిమిది తత్త్వములను ప్రకృతి అని ఆచార్యులు (గురువులు) తెలిపిరి. ఆ ప్రకృతి సత్త్వము, రజస్సు, తమస్సు - అను మూడుగుణములు గలది. పది ఇంద్రియములు, మనస్సు, పంచమహాభూతములు అను పదహారును దాని వికారములు. వీటి అన్నింటియందును ఒక పురుషుడు (ఆత్మ) చైతన్య స్వరూపుడుగా వ్యాపించియుండును.

7.23 (ఇరువది మూడవ శ్లోకము)

దేహస్తు సర్వసంఘాతో జగత్తస్థురితి ద్విధా|

అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్॥5877॥

వీటి అన్నింటి సముదాయమే దేహము. ఇది స్థావరములు, జంగమములు - అని రెండు విధములు. ఇందలి అంతఃకరణము, ఇంద్రియములు మొదలగు అనాత్మ  పదార్థములను ఇదికాదు-ఇదికాదు అని నిరాకరించుచు ఆత్మను అన్వేషింపవలెను.

7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

అన్వయవ్యతిరేకేణ వివేకేనోశతాత్మననా|

సర్గస్థానసమామ్నాయైర్విమృశద్భిరసత్వరైః॥5878॥

ఆత్మ అన్నింటియందు వ్యాపించియున్నది. కాని, అది అన్నింటికంటె వేరుగా ఉన్నది. విలక్షణమైనది. ఈ విధముగా శుద్ధమైన బుద్ధితో నెమ్మది-నెమ్మదిగా జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను గూర్చి వివేచన చేయవలెను. ఈ విచారమునందు ఎంతమాత్రము తొందరపాటు పనికిరాదు.

7.25 (ఇరువది ఐదవ శ్లోకము)

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః|

తా యేనైవానుభూయంతే సోఽధ్యక్షః పురుషః పరః॥5879॥

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడును బుద్ధియొక్క వృత్తులు. ఎవరిద్వారా ఈ వృత్తులు అనుభవమునకు వచ్చుచున్నవో, అతడే వీటికి అతీతుడైన సాక్షియగు పరమాత్మ.

7.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రియోద్భవైః|

స్వరూపమాత్మనో బుధ్యేద్గంధైర్వాయుమివాన్వయాత్॥5886॥

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలద్వారా కలిగెడు మార్పులు - చేర్పులు బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందే ఆత్మ అవగతమై యున్నది. అందువలన బుద్ధితో ఏర్పడిన తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మవలననే జరుగుచున్నవా! యని అనిపించును. కావున ఇట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధము అనగా వాసనవలన దానికి ఆశ్రయమైన వాయువును గుర్తించి, గంధమును నిరాకరించినట్లుగా, బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేయునట్టి సాక్షిరూపమున నున్న ఆత్మను తెలిసికొనవలెను.

7.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః|

అజ్ఞానమూలోఽపార్థోఽపి పుంసః స్వప్న ఇవేష్యతే॥5881॥

గుణములచే, కర్మలచే సంబంధము జోడింపబడుటవలన జనన మరణ చక్రములో తిరుగుట తప్పదు. అజ్ఞానమువలన శరీరమందును ఆత్మబుద్ధి కలుగుచున్నది. ఇది మిథ్యయే కాని, సత్యము కాదు. ఐననూ, ఇది స్వప్నమువలె జీవునకు ప్రతీతమగు చుండును.

7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్|

బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః॥5882॥

సోదరులారా! అందువలన మొట్టమొదట మీరు గుణములను అనుసరించుచు కలుగునట్టి కర్మబీజములను నష్టపరచవలెను. దీనివలన బుద్ధియొక్క వృత్తుల ప్రవాహము నివృత్తమగును. దీనినే యోగము, లేక పరమాత్మప్రాప్తి అందురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

29.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము

గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః| 

యదీశ్వరే భగవతి యథా యైరంజసా రతిః॥5883॥

త్రిగుణాత్మకమైన కర్మబీజములను తొలగించుటకును, లేదా బుద్ధివృత్తుల ప్రవాహమును ఆపివేయుటకును వేలకొలది సాధనములు గలవు. భగవంతుని యందు ప్రేమ కలుగుటవలన సహజముగనే అతని స్మరణ జరుగుచుండును. భగవంతుని యెడల ప్రేమ కలుగుటకు ఇదియే సులభోపాయము. ఈ విషయమును భగవానుడే స్వయముగా తెలిపియుండెను.

7.30 (ముప్పదియవ శ్లోకము)

గురుశుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ|

సంగేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ॥5584॥

7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణామ్|

తత్పాదాంబురుహధ్యానాత్తల్లింగేక్షార్హణాదిభిః॥5885॥

భక్తితో గురువును సేవించుట, తనకు దొరికిన సకల పదార్థములను భగవంతునకు సమర్పించుట, సాధుపురుషులైన భక్తులతో సాంగత్యము చేయుట, భగవంతుని ఆరాధించుట, ఆ ప్రభువు యొక్క కథలను శ్రద్ధగా వినుట, ఆయన గుణములను, లీలలను శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాదపద్మములను ధ్యానించుట, ఆయన మందిరములోని మూర్తిని దర్శించి, పూజించుట మొదలగు సాధనముల ద్వారా భగవంతుని యందు సహజమైన ప్రేమ (భక్తి) కలుగును.

7.32 (ముప్పది రెండవ శ్లోకము)

హరిః సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః|

ఇతి భూతాని మనసా కామైస్తైః సాధు మానయేత్॥5886॥

'సర్వశక్తిమంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలో విరాజిల్లుచున్నాడు' అను భావముచే యథాశక్తి ప్రాణులన్నింటియొక్క అభిలాషలను నెరవేర్పవలెను. హృదయ పూర్వకముగా వారిని గౌరవింపవలెను.

7.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఏవం నిర్జితషడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే|

వాసుదేవే భగవతి యయా సంలభతే రతిమ్॥5887॥

కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అను ఆరు శత్రువులను జయించి, పూర్వోక్త విధముగా సాధనములను  అనుష్ఠించువారికి భగవంతుడైన శ్రీమహావిష్ణు చరణములయందు అనన్య భక్తి కలుగును.

7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాణి లీలాతనుభిః కృతాని|

యదాతిహర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి॥5888॥

7.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసత్యాక్రందతే ధ్యాయతి వందతే జనమ్|

ముహుః శ్వసన్ వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః॥5889॥

7.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తదా పుమాన్ ముక్తసమస్తబంధనస్తద్భావభావానుకృతాశయాకృతిః|

నిర్దగ్ధబీజానుశయో మహీయసా   భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజం॥5890॥

భగవంతుడు తన లీలావతారములయందు ప్రదర్శించిన అద్భుత బలపరాక్రమములను, సాటిలేని ఆ స్వామి గుణములను, కర్మలను వినుట వలన అత్యంత ఆనందాతిరేకముతో మానవుని శరీరము పులకించును. కన్నులలో అశ్రువులు స్రవించి,, కంఠము గద్గదమగును. సంకోచమును విడిచి, అతడు బిగ్గరగా అరచుచు, గానము చేయుచు నాట్యము చేయును. ఒక్కొక్కసారి, గ్రహగ్రస్తుడైన పిచ్చివానివలె నవ్వుచుండును. కరుణా పూరితమైన ఆక్రందనలు చేయుచుండును. ఒక్కొక్కసారి ధ్యానమగ్నుడగును. భగవద్భావముతో జనులకు నమస్కరించుచుండును. భగవంతునియందు తన్మయుడై మాటిమాటికిని దీర్ఘనిశ్వాసములను  విడచుచుండును. బిడియమును విడిచి, హరీ! జగన్నాథా! నారాయణా అనుచు గట్టిగ అరచుచుండును. ఇట్టి భక్తి యోగ ప్రభావమున అతని బంధములన్నియును తెగిపోవును. అతని హృదయము భగవన్మయమగును. అట్టి సమయమున అతని జనన, మరణములకు హేతువులగు వాసనా రూపములగు బీజములన్నియును దగ్ధమైపోవును. అంతట ఆ పురుషుడు భగవత్ప్రాప్తిని పొందును.

7.36 (ముప్పది ఆరవ శ్లోకము)

అధోక్షజాలంభమిహాశుభాత్మనః  శరీరిణః సంసృతిచక్రశాతనమ్|

తద్బ్రహ్మనిర్వాణసుఖం విదుర్బుధాస్త భజధ్వం హృదయే హృదీశ్వరమ్॥5891॥

భక్తియోగముద్వారా భగవంతుని ఆశ్రయించుటచే జీవుని అమంగళకరమైన సంస్కారములన్నియును నశించిపోవును. దీనివలన సంసార చక్రము నివారింపబడును. ఆ శ్రీహరిచే బ్రహ్మగా, నిర్వాణసుఖముగా మహాత్ములు పేర్కొందురు. కనుక మిత్రులారా! మీరు మీ హృదయములలో అంతరాత్మగా వెలుగొందు భగవంతుని భజింపుడు.

7.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

కోఽతిప్రయాసోఽసురబాలకా హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్సతః|

స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం  సామాన్యతః కిం విషయోపపాదనైః॥5892॥

అమరబాలకులారా! మీ హృదయముల యందు భగవంతుడు ఆకాశమువలె నిత్యమై సమానముగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవంతుని భజించుటలో మిక్కిలి ప్రయాస ఏమియు ఉండదు. అతడు సమస్తప్రాణులలో ఆత్మగా నుండు ప్రేమ స్వరూపుడు. అట్టి స్వామిని వదలి భోగ్యసామాగ్రిని సేకరించుటకై తిరుగుట ఎంతటి మూర్ఖత్వము?

7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

రాయః కలత్రం పశవః సుతాదయో గృహా మహీ కుంజరకోశభూతయః|

సర్వేఽర్థకామాః క్షణభంగురాయుషః కుర్వంతి మర్త్యస్య కియత్ప్రియం చలాః॥5893॥

సోదరులారా! భార్యాపుత్రులు, బంధువులు, భవనములు, భూములు, సంపదలు, ఇంకను అనేక వైభవములు, జగత్తులోని సమస్తధనము, భోగసామాగ్రి, సర్వమూ, క్షణభంగురములు. నశ్వరములు. ఇట్టి నశ్వరములైన వస్తువులతో శాశ్వతసుఖము లభించునా? అట్టి వాటివలన క్షణికమైన ఆయుష్షుగల మనుజునకు ఎట్టి సుఖముండును?

7.40 (నలుబది ఒకటవ శ్లోకము)

ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ క్షయిష్ణవః సాతిశయా న నిర్మలాః|

తస్మాదదృష్టశ్రుతదూషణం పరం భక్త్యైకయేశం భజతాత్మలబ్ధయే॥5895॥

ఈ లోకమునందలి సంపదలు మనము చూచుచుండగనే నశించుచున్నవి గదా! అట్లే, యజ్ఞములవలన ప్రాప్తించు స్వర్గాది లోకములు గూడ నాశవంతములే. వాటిలో చిన్న-పెద్ద, ఉత్తమ-అధమ తారతమ్యములు ఉండును. తద్ద్వారా పరస్పరముగా స్పర్ధ యేర్పడును. కావున, అవి దోషరహితములు కావు. పరమాత్మ ఒక్కడే. అతడెట్టి దోషములను లేనివాడు. ఆ ప్రభువు నందు ఎవ్వరును దోషములను వినలేదు, కనలేదు. కనుక, అట్టి పరమాత్మ ప్రాప్తికి అనన్య భక్తితో ఆ ప్రభువును భజింపవలెను.

7.41(నలుబది రెండవ శ్లోకము)

యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః|

కరోత్యతో విపర్యాసమమోఘం విందతే ఫలం ॥5895॥^

ఈ లోకమున జనులు తామే పండితులమని భావించుచు, సుఖ భోగములను పొందుటకై పదే పదే కర్మలను చేయుచుందురు. వారు వాటిని పొందలేరు సరిగదా, విపరీతఫలములను పొందుదురు. ఇందు సదేహము లేదు.

7.42 (నలుబది రెండవ శ్లోకము)

సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః|

సదాఽఽప్నోతీహయా దుఃఖమనీహాయాః సుఖావృతః॥5896॥

జనులు కర్మలలో ప్రవృత్తులగుటకు దుఃఖములను దుఃఖములను తప్పించుకొనుట, సుఖములను పొందుట అను రెండు లక్ష్యములు ఉండును. కాని మొదట ఎట్టి కోరికలను లేనివాడు సుఖములో నిమగ్నుడైయుండును. కాని, అతడే  సుఖభోగములను ఆశించుటవలన సర్వదా దుఃఖములనే అనుభవింపవలసి వచ్చును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

30.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము

గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.43 (నలుబది మూడవ శ్లోకము)

కామాన్ కామయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః|

స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ॥5897॥

7.44 (నలుబది నాలుగవ శ్లోకము)

కిము వ్యవహితాపత్యదారాగారధనాదయః|

రాజ్యం కోశగజామాత్యభృత్యాప్తా మమతాస్పదాః॥5898॥

ఈ లోకములో మనుష్యులు సకామకర్మలద్వారా దైహిక భోగములను పొందగోరుదురు. కాని, ఆ దేహమే శాశ్వతముగాదు. అది ప్రకృతియొక్క అంశమగుటచే జడమైనది. ప్రాప్తించిన శరీరము ఎప్పటికైనను పోకమానదు. ఈ శరీరముయొక్క స్థితియే ఇట్లు ఉన్నప్పుడు, దీని కంటెను వేరైన భార్యాపుత్రులు, భవనములు, ధనము, సంపదలు, రాజ్యము, కోశాగారములు, వాహనములు, మంత్రులు, సేవకులు, గురుజనులు, ఇంకను 'నావి' అని అనుకొను వస్తువుల విషయము చెప్పనేల?

7.45 (ఏబది ఒకటవ శ్లోకము)

కిమేతైరాత్మనస్తుచ్ఛైః సహ దేహేన నశ్వరైః|

అనర్థైరర్థసంకాశైర్నిత్యానందమహోదధేః॥5899॥

రాజ్యము మొదలగు వస్తువులు అన్నియును తుచ్ఛములే. శరీరముతో బాటు ఇవి అన్నియును నశించునవియే. ఇవి పురుషార్థములవలె కన్పట్టును. కాని, వాస్తవముగా ఇవి అనర్థదాయకములు. ఆత్మ స్వయముగా శాశ్వతము, పరమానంద సముద్రము.

7.46 (నలుబది ఆరవ శ్లోకము)

నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహభృతోఽసురాః|

నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః॥5900॥

సోదరులారా! ఈ విషయమును గూర్చి కొంచెము ఆలోచింపుడు. జీవుడు తల్లి గర్భములో పడినప్పటినుండి మృత్యుపర్యంతము తన ప్రారబ్ధకర్మానుసారము కష్టపరంపరను అనుభవించుచునే యుండును. ఈ సంసారమున అతనికి చేకూరు స్వార్థమేముండును?

7.47 (నలుబది ఏడవ శ్లోకము)

కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా|

కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః॥5901॥

ఈ జీవుడు శరీరమునే తన ఆత్మగా భావించి, పలువిధములైన కర్మలను ఆచరించును. ఆ కర్మల కారణముగా మరియొక శరీరమును ధరించును. ఈ విధముగా కర్మలు, శరీరములు పరంపరగ సంభవించుచునే యుండును. దీనికి అంతటికిని కారణము అజ్ఞానమే.

7.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః|

భజతానీహయాఽఽత్మానమనీహం హరిమీశ్వరమ్॥5902॥

సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః|

భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః॥5903॥

శ్రీమహావిష్ణువు సకల ప్రాణులకు ప్రభువు, ఆత్మ, ప్రియతముడు. తనచే సృష్టీంపబడిన పంచమహా భూతములు, సూక్ష్మభూతములు మొదలగు వాటి ద్వారా రుపొందిన ఈ శరీరమునందు జీవుడు అని పిలువబడే ప్రియమున ఆత్మ శ్రీహరియే. అతడే సమస్త జీవులలో అంతర్యామిగా వెలుగొందుచున్నాడు.

7.50 (ఏబదియవ శ్లోకము)

దేవోఽసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ చ|

భజన్ ముకుందచరణం స్వస్తిమాన్ స్యాద్యథా వయమ్॥5904॥

దేవతలు, దైత్యులు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు మొదలగువారు ఎవ్వరైనను భగవంతుని పాదపద్మములను సేవించి, మనవలె సకల శ్రేయస్సులకును అర్హులగుదురు.

7.51 (ఏబది ఒకటవ శ్లోకము)^

నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః|

ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా॥5905॥

7.52 (ఏబది రెండవ శ్లోకము)

న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ|

ప్రీయతేఽమలయా భక్త్యా హరిరన్యద్విడంబనమ్॥5906॥

దైత్యబాలకులారా! శ్రీహరిని ప్రసన్నునిగా చేసి కొనుటకు బ్రాహ్మణుడుగా, దేవతగా, ఋషిగా జన్మించుట, సదాచారమును కలిగియుండుట, పెక్కు శాస్త్రముల యందు జ్ఞానమును సంపాదించుట, అట్లే దానము, తపము, యజ్ఞములు, శారీరక, మానసికశౌచము, శ్రేష్ఠములైన వ్రతములను అనుష్ఠించుట మొదలగునవి చాలవు- భగవంతుడు కేవలము నిష్కామభక్తి చేతనే ప్రసన్నుడగును. ఇవి యన్నియును ఆ భక్తికి సహాయకములే. 

7.53 (ఏబది మూడవ శ్లోకము)

తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః|

ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే॥5907॥

దానవులారా! కనుక, సకల ప్రాణులను మీ ఆత్మలుగా భావించి, సర్వత్ర విరాజిల్లుచున్న సర్వాత్మయు, సర్వశక్తిమంతుడు ఐన పరమేశ్వరునియెడ భక్తి కలిగియుందురు.

7.54 (ఏబది నాలుగవ శ్లోకము)

దైతేయా యక్షరక్షాంసి స్త్రియః శూద్రా వ్రజౌకసః|

ఖగా మృగాః పాపజీవాః సంతి హ్యచ్యుతతాం గతాః॥5908॥

భగవద్భక్తి ప్రభావముచే దైత్యులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గోపాలురు (గొల్లలు), పక్షులు, మృగములు ఇంకను పెక్కుమంది పాప జీవులు గూడ భగవద్భావమును పొందిరి.

7.55 (ఏబది ఐదవ శ్లోకము)

ఏతావానేవ లోకేఽస్మిన్ పుంసః స్వార్థః పరః స్మృతః|

ఏకాంతభక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణమ్॥5909॥

ఈ ప్రపంచమున మానవశరీరమును పొందిన జీవుని ఒకే పరమార్థము (పరమప్రయోజనము) భగవంతుడైన గోవిందునియందు అనన్య భక్తిని కలిగియుండుటయే. సర్వదా, సర్వత్ర, సకలవస్తువులలోను భగవంతుని దర్శించుటయే ఆ భక్తియొక్క నిజస్వరూపము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమోఽధ్యాయః (7)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

Saturday, 27 June 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం , సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము ఓం నమో భగవతే వాసుదేవాయ
***
ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు నుడివెను మిత్రులారా! ఈ లోకమున మానవజన్మ దుర్లభమైనది. దీనిద్వారానే శాశ్వతుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగును. కాని, ఈ మానవజన్మ ఎప్పుడు ముగియునో తెలియదు. బుద్ధిమంతుడైనవాడు ముసలితనముపై, యౌవనముపై విశ్వాసమును ఉంచక, బాల్యము నుండియే భగవత్ప్రాప్తికై సాధనలను చేయవలెను.

ఈ మానవజీవితము భగవంతుని చరణములను శరణుపొందుటవలననే సఫలమగును. ఏలయన, భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు. సుహృదుడు, ప్రియతముడు, ఆత్మస్వరూపుడు.

దితి వంశీయులారా! జీవులకు ఏ జన్మలోనైనా, ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో, అట్టి దేహసంబంధమైన ఇంద్రియములవలన లభించెడు సుఖములు సహజముగనే కలుగును. అట్లే ప్రారబ్ధమును అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నము లేకుండగనే లభించుచుండును.

అందువలన సాంసారిక సుఖముల కొరకు ప్రయత్నింపనవసరము లేదు. ఏలయన, తనంతట తానే లభించువస్తువు కొరకు శ్రమించుట, కేవలము తన ఆయువును, శక్తిని వ్యర్థము చేసికొనుటయే యగును. ఇంద్రియ భోగముల వెంటపడిన వానికి పరమ కల్యాణస్వరూపుడైన భగవంతుని పాదపద్మములు ప్రాప్తింపవు.

మానవ జీవితము పుష్కలమైన భయములతో నిండియుండును. భగవత్ప్రాప్తియే దీని లక్ష్యము. కనుక, ఈ శరీరము రోగ శోకాదులచే గ్రస్తమై మృత్యు ముఖమున ప్రవేశింపకముందే, బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నింపవలెను.

మానవుని ఆయుర్దాయము నూరు సంవత్సరములు. జితేంద్రియుడుకాని వాని ఆయువు సగభాగము చూచుచుండగనే నిష్ఫలముగ గడచిపోవును. ఏలయన, అజ్ఞాన కారణముగా రాత్రులయందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడచిపోవును.

బాల్యమునందు మానవునకు మంచిచెడుల వివేకము ఉండదు. కౌమారదశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును. ఈ విధముగా తెలియకుండగనే ఇరువది సంవత్సరములు గడచిపోవును. ఇంతలో వృద్ధాప్యము ఆవహించుటచే దేహము సడలిపోయి ఏమిచేయుటకు శక్తి సరిపోవక మరొక ఇరువది యేళ్ళు గడచిపోవును. 

ఇంక మిగిలిన ఆయుర్ధాయము స్వల్పముగనే యుండును. అందులో మానవుడు మోహములో చిక్కుకొని, ఎప్పటికిని పూర్తికాని కోరికలయందును, గృహకృత్యముల యందును ఆసక్తుడై యుండును. అందువలన తన కర్తవ్యము, అకర్తవ్యముల జ్ఞానము అతనికి ఉండదు. ఈ విధముగా మిగిలిన ఆయువుగూడ చేజారిపోవును.

ఇంద్రియములకు వశుడైనవాడు గృహకార్యముల యందే ఆసక్తుడై మాయ, మమత అను బలమైన బంధములకు వశుడైయుండును. అట్టివాడు వాటినుండి విముక్తి పొందుటకు ఉత్సహింపడు.

చోరుడు, సేవకుడు, వ్యాపారి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణముల నొడ్డియైన ధనసంపాదనకు పాటు పడును. ధనము పైగల ఈ పేరాశను ఎవరు విడిచిపెట్టగలరు?

మానవుడు తన ప్రియపత్నితో ఏకాంతవాసము చేయును. ప్రేమపూరితములైన ఆమె మాటలు, చెవులకు ఇంపు గొలుపు ఆమె సూచనలను పాటించుచు తన జీవితమునే వ్యర్థముగా గడుపును. బంధుమిత్రుల స్నేహపాశములచే, పిల్లల చిలుక పలుకులచే ఆకర్షితుడగును. ఇంక వాటినుండి అతడు ఎట్లు బయటపడగలడు? వివాహితలైన తన కుమార్తెలను, సుతులను, సోదరులను, దీనులైన తల్లిదండ్రులను, అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇంఢ్లను, వంశపరంపరాగతమైన తమ జీవన సాధనములను, పశువులను, సేవకులను నిరంతరము స్మరించుచునే యుండును. అట్టి వాటిని అతడెట్లు వదులు కొనగలడు?

మానవుడు జననేంద్రియ, రసనేంద్రియ సుఖములనే సర్వస్వమని భావించును. భోగసుఖముల వాసనలకు అతడు ఎప్పుడును తృప్తిపడడు. లోభకారణముగా కర్మలపై కర్మలను చేయుచు సాలెపురుగువలె అతడు ఇంకను బంధములయందు కూరుకొనిపోవును. అతని వ్యామోహములకు అంతూపొంతూ ఉండదు. అట్టివాడు వాటియందు ఎట్లు విరక్తుడగును? వాటిని ఎట్లు త్యజింపగల్గును?

కుటుంబముపై గల మోహముచే దాని పోషణయందే తన అమూల్యమైన ఆయువును పోగొట్టుకొనును. అతడు ఎన్నడును  తన జీవిత పరమార్థమును గూర్చి ఆలోచింపడు. అంతులేని ప్రమాదములలొ పడిపోవును. ఇట్టి అభిలాషల వలన అతనికి ఎట్టి సుఖమూ లభింపకపోగా, అతనిని దైహిక, దైవిక, భౌతిక తాపత్రయములు వెంటాడుచునే యుండును. ఐనను, అతనికి వైరాగ్యము అబ్బదు. కుటుంబము పైగల మమకారముచే బద్ధుడై ధనసంపాదన చింతలోనే మునిగియుండును. ఇతరుల సొత్తులను దొంగిలించుట వలన లౌకిక, పారలౌకిక దోషములు కలుగునని తెలిసినను కోరికలకు లోబడి, తన కర్తవ్యమును మరచి, భోగలాలసుడై ధనమును అపహరించు చుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము , ఓం నమో భగవతే వాసుదేవాయ
***

సోదరులారా! మానవుడు  ఈ విధముగా తనకుటుంబ పోషణయందే నిబద్ధుడైనవాడు, ఎన్నడును భగవంతుని సేవింపుడు. అతడు విద్వాంసుడేయైననూ అతనికి భగవత్ప్రాప్తి కలుగదు. ఇది నాది, ఇది ఇతరులది అను భేదభావము ఉండుటవలన అతనికిని అజ్ఞానులవలె తమోగుణ ప్రధానమైన అధోగతులే లభించును.

అతడు కామినుల మనస్సులను రంజింపజేయునట్టి కీలు బొమ్మయగును. అట్టి పాపకృత్యముల ఫలితముగా కలిగిన సంతానము, అతని పాదములకు సంకెల యగును.  అట్టి దీనుడు ఎప్పుడైనను, ఎప్పుడైనను, ఏవిధముగనైనను ఆత్మోద్ధరణకై ప్రయత్నింపలేడు.

సోదరులారా! అందువలన మీరు విషయాసక్తులైన దైత్యుల సాంగత్యమును దూరముగ పారద్రోలుడు. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణువేడుడు. ఏలయన, సాంసారిక విషయముల యందు ఆసక్తిలేని మహాత్ములకు ఆ ప్రభువే ప్రియతముడు. అతడే పరమగతి. 

మిత్రులారా! భగవంతుని ప్రసన్నునిగా జేసికొనుటకు ఎక్కువ పరిశ్రమ లేక ప్రయత్నములు చేయనవసరము లేదు. అతడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై సర్వత్ర వ్యాపించియున్నాడు.

చెట్టు చేమలు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు, సకల ప్రాణుల యందు ఆ ప్రభువు వ్యాపించియున్నాడు. అంతేగాదు, పంచభూతములయందును, వాటిచే నిర్మితములైన వస్తువులయందును, సూక్ష్మతన్మాత్రలయందును, ఆ పరమాత్మ విరాజిల్లుచున్నాడు. మహత్తత్వము నందును, త్రిగుణములయందును, వాటి సామ్యావస్థలయందును, తద్వ్యతిరేకావస్థలయందును ఆ స్వామి శాశ్వతముగా నెలకొనియున్నాడు. అతడు సమస్త సౌందర్యమాధుర్య ఐశ్వర్యములకు నిధి.

ఆ శ్రీహరి ప్రాణులలో అంతర్యామియై ద్రష్టరూపమునను, దృశ్యమైన జగద్రూపమునను విరాజిల్లుచున్నాడు. ఆ స్వామి సర్వధా అనిర్వచనీయుడు. ఆ పరమపురుషుని స్వరూపము ఇట్టిది అని వర్ణింపజాలము. వికల్పరహితుడైనను అతడు ద్రష్టగను, దృశ్యముగను, వ్యాప్య, వ్యాప్యక రూపములలోను ప్రకటితుడు అగుచుండును. కాని, వాస్తవమునకు అతడు ఉన్నది ఒక్కడే అయినను ద్రష్ట, దృశ్యము, వ్యాప్యము, వ్యాపకములన్నియును పరమాత్మను ఆశ్రయించియే యుండును. అతని లోనే విలీనమగును. అతనిలో ఎటువంటి వికల్పములు - భేదములు లేవు. ఉన్నది పరమాత్ముడు ఒక్కడే అని ఎరుగవలయును.

పరమానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు అనుభవైకవేద్యుడు. నిరంజనుడు. త్రిగుణమయమైన మాయచేతనే అతని ఐశ్వర్యము (మహత్త్వము) కప్పబడి యున్నది. ఆ మాయనుండి బయట పడినవానికి, ఆ ప్రభువు యొక్క దర్శనము కాగలదు.

అందువలన, మీరు దైత్య లక్షణమైన అసురీస్వభావమును విడనాడి నిర్హేతుక సుహృద్భావమును కలిగి సమస్త ప్రాణులయందును దయతో మెలగుడు. వాటికి మేలు చేయుడు. అప్పుడే, ఆ భగవంతుడు ప్రసన్నుడగును.

ఆది పురుషుడగు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైనచో మనము పొందజాలనిదంటూ ఏముండును? మనము ఆ భగవంతుని పాదారవిందముల అమృతమును గ్రోలుతూ ఆయన నామ, గుణ, లీలాసంకీర్తనాదులను చేయుచు, అందలి పరమానందములోనే ఓలలాడెదము. ఈ జగత్తులో సత్త్వరజస్తమోగుణముల పరిణామమువలన తమంతట తాముగా లభించెడు ధర్మార్థకామమోక్షములతోగానీ, అందరునూ కోరుకొనెడు గుణాతీతమైన మోక్షముతోగానీ, మనకేమి పని?

శాస్త్రములయందు ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములు వర్ణింపబడినవి. అంతేగాక, ఆత్మవిద్య, కర్మకాండము, తర్కశాస్త్రము, దండనీతి, జీవనోపాధి సాధనములు గూడ వేదములయందు ప్రతిపాదింపబడినవి. కాని, మనందరికి అత్యంత ఆత్మీయుడు, పరమహితైషియగు పురుషోత్తమునకు తమ సర్వస్వమును సమర్పించుటయే పరమసత్యము - సార్థకము అని నేను తలంతును.

సోదరులారా! నేను మీకు తెలపిన నిర్మలజ్ఞానము బహుదుర్లభమైనది. పూర్వము దీనిని నరనారాయణులు నారదునకు ఉపదేశించియుండిరి. భగవంతునియెడ అనన్యభక్తి గలిగి, అకించనులైన భాగవతోత్తముల పాదధూళియందు స్నానమొనర్చినవారికి ఈ జ్ఞానము లభ్యమగును.

విజ్ఞానసహితమైన ఈ జ్ఞానము పవిత్రభాగవత ధర్మములను ప్రతిపాదించును. దీనిని పూర్వమునేను నారద మహర్షినుండి వినియుంటిని. ఆ దేవర్షి భగవంతుని దర్శనమును కలిగించుటలో సమర్థుడు.

దైత్యపుత్రా ఊచుః

దైత్యబాలురు వచించిరి - ప్రహ్లాదా! ఈ ఇద్దరు గురుపుత్రులను దప్ప మఱి ఏ గురువును నీవు గాని, నేనుగాని ఎఱుగము. వీరే బాలురమైన మన అందరిని శాసించువారు. ప్రియమిత్రమా! నీవు ఇంకను చిన్న వయసు వాడవు. పుట్టినప్పటినుండియు రాజభవనమున తల్లికడ ఉన్నవాడవు. కనుక, నీవు మహాత్మడైన నారదునితో కలియుట   అసంభవమని మాకు తోచుచున్నది. ఈ విషయమున మాకు నమ్మకము కలుగుటకు తగిన కారణమున్నయెడల, మా ఈ సందేహమును తీర్చుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠోఽధ్యాయః (6)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ప్రహ్లాద ఉవాచ

6.1 ప్రథమశ్లోకము)

కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ|

దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదమ్॥5825॥

ప్రహ్లాదుడు నుడివెను మిత్రులారా! ఈ లోకమున మానవజన్మ దుర్లభమైనది. దీనిద్వారానే శాశ్వతుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగును. కాని, ఈ మానవజన్మ ఎప్పుడు ముగియునో తెలియదు. బుద్ధిమంతుడైనవాడు ముసలితనముపై, యౌవనముపై విశ్వాసమును ఉంచక, బాల్యము నుండియే భగవత్ప్రాప్తికై సాధనలను చేయవలెను.

6.2 (రెండవ శ్లోకము)

యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణమ్|
.
యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్॥5826॥

ఈ మానవజీవితము భగవంతుని చరణములను శరణుపొందుటవలననే సఫలమగును. ఏలయన, భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు. సుహృదుడు, ప్రియతముడు, ఆత్మస్వరూపుడు.

6.3 (మూడవ శ్లోకము)

సుఖమైంద్రియకం దైత్యా దేహయోగేన దేహినామ్|

సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః॥5827॥

దితి వంశీయులారా! జీవులకు ఏ జన్మలోనైనా, ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో, అట్టి దేహసంబంధమైన ఇంద్రియములవలన లభించెడు సుఖములు సహజముగనే కలుగును. అట్లే ప్రారబ్ధమును అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నము లేకుండగనే లభించుచుండును.

6.4 (నాలుగవ శ్లోకము)

తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్|

న తథా విందతే క్షేమం ముకుందచరణాంబుజమ్॥5828॥

అందువలన సాంసారిక సుఖముల కొరకు ప్రయత్నింపనవసరము లేదు. ఏలయన, తనంతట తానే లభించువస్తువు కొరకు శ్రమించుట, కేవలము తన ఆయువును, శక్తిని వ్యర్థము చేసికొనుటయే యగును. ఇంద్రియ భోగముల వెంటపడిన వానికి పరమ కల్యాణస్వరూపుడైన భగవంతుని పాదపద్మములు ప్రాప్తింపవు.

6.5 (ఐదవ శ్లోకము)

తతో యతేత కుశలః క్షేమాయ భయమాశ్రితః|

శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలం॥5829॥

మానవ జీవితము పుష్కలమైన భయములతో నిండియుండును. భగవత్ప్రాప్తియే దీని లక్ష్యము. కనుక, ఈ శరీరము రోగ శోకాదులచే గ్రస్తమై మృత్యు ముఖమున ప్రవేశింపకముందే, బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నింపవలెను.

6.6 (ఆరవ శ్లోకము)

పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః|

నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేఽన్ధం ప్రాపితస్తమః॥5830॥

మానవుని ఆయుర్దాయము నూరు సంవత్సరములు. జితేంద్రియుడుకాని వాని ఆయువు సగభాగము చూచుచుండగనే నిష్ఫలముగ గడచిపోవును. ఏలయన, అజ్ఞాన కారణముగా రాత్రులయందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడచిపోవును.

6.7 (ఏడవ శ్లోకము)

ముగ్ధస్య బాల్యే కౌమారే క్రీడతో యాతి వింశతిః|

జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః॥5831॥

బాల్యమునందు మానవునకు మంచిచెడుల వివేకము ఉండదు. కౌమారదశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును. ఈ విధముగా తెలియకుండగనే ఇరువది సంవత్సరములు గడచిపోవును. ఇంతలో వృద్ధాప్యము ఆవహించుటచే దేహము సడలిపోయి ఏమిచేయుటకు శక్తి సరిపోవక మరొక ఇరువది యేళ్ళు గడచిపోవును. 

6.8 (ఎనిమిదవ శ్లోకము)

దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా|

శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి॥5832॥
ఇంక మిగిలిన ఆయుర్ధాయము స్వల్పముగనే యుండును. అందులో మానవుడు మోహములో చిక్కుకొని, ఎప్పటికిని పూర్తికాని కోరికలయందును, గృహకృత్యముల యందును ఆసక్తుడై యుండును. అందువలన తన కర్తవ్యము, అకర్తవ్యముల జ్ఞానము అతనికి ఉండదు. ఈ విధముగా మిగిలిన ఆయువుగూడ చేజారిపోవును.

6.9 (తొమ్మిదవ శ్లోకము)

కో గృహేషు పుమాన్ సక్తమాత్మానమజితేంద్రియః|

స్నేహపాశైర్దృఢైర్బద్ధముత్సహేత విమోచితుమ్॥5833॥

ఇంద్రియములకు వశుడైనవాడు గృహకార్యముల యందే ఆసక్తుడై మాయ, మమత అను బలమైన బంధములకు వశుడైయుండును. అట్టివాడు వాటినుండి విముక్తి పొందుటకు ఉత్సహింపడు.

6.10 (పదియవ శ్లోకము)

కో న్వర్థతృష్ణాం విసృజేత్ప్రాణేభ్యోఽపి య ఈప్సితః|

యం క్రీణాత్యసుభిః ప్రేష్ఠైస్తస్కరః సేవకో వణిక్॥5834॥

చోరుడు, సేవకుడు, వ్యాపారి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణముల నొడ్డియైన ధనసంపాదనకు పాటు పడును. ధనము పైగల ఈ పేరాశను ఎవరు విడిచిపెట్టగలరు?

6.11 (పదకొండవ శ్లోకము)

కథం ప్రియాయా అనుకంపితాయాః సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్|

సుహృత్సు తత్స్నేహసితః శిశూనాం కలాక్షరాణామనురక్తచిత్తః॥5835॥

6.12 (పండ్రెండవ శ్లోకము)

పుత్రాన్ స్మరంస్తా దుహితౄర్హృదయ్యా  భ్రాతౄన్ స్వసౄర్వా పితరౌ చ దీనౌ|

గృహాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ  వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్॥5837॥

మానవుడు తన ప్రియపత్నితో ఏకాంతవాసము చేయును. ప్రేమపూరితములైన ఆమె మాటలు, చెవులకు ఇంపు గొలుపు ఆమె సూచనలను పాటించుచు తన జీవితమునే వ్యర్థముగా గడుపును. బంధుమిత్రుల స్నేహపాశములచే, పిల్లల చిలుక పలుకులచే ఆకర్షితుడగును. ఇంక వాటినుండి అతడు ఎట్లు బయటపడగలడు? వివాహితలైన తన కుమార్తెలను, సుతులను, సోదరులను, దీనులైన తల్లిదండ్రులను, అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇంఢ్లను, వంశపరంపరాగతమైన తమ జీవన సాధనములను, పశువులను, సేవకులను నిరంతరము స్మరించుచునే యుండును. అట్టి వాటిని అతడెట్లు వదులు కొనగలడు?

6.13 (పదమూడవ శ్లోకము)

త్యజేత కోశస్కృదివేహమానః  కర్మాణి లోభాదవితృప్తకామః|

ఔపస్థ్యజైహ్వ్యం బహు మన్యమానః  కథం విరజ్యేత దురంతమోహః॥5837॥

మానవుడు జననేంద్రియ, రసనేంద్రియ సుఖములనే సర్వస్వమని భావించును. భోగసుఖముల వాసనలకు అతడు ఎప్పుడును తృప్తిపడడు. లోభకారణముగా కర్మలపై కర్మలను చేయుచు సాలెపురుగువలె అతడు ఇంకను బంధములయందు కూరుకొనిపోవును. అతని వ్యామోహములకు అంతూపొంతూ ఉండదు. అట్టివాడు వాటియందు ఎట్లు విరక్తుడగును? వాటిని ఎట్లు త్యజింపగల్గును?

6.14 (పదునాలుగవ శ్లోకము)

కుటుంబపోషాయ వియన్నిజాయుర్న  బుధ్యతేఽర్థం విహతం ప్రమత్తః|

సర్వత్ర తాపత్రయదుఃఖితాత్మా  నిర్విద్యతే న స్వకుటుంబరామః॥5838॥

6.15 (పదునైదవ శ్లోకము)

విత్తేషు నిత్యాభినివిష్టచేతాః విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః|

ప్రేత్యేహ చాథాప్యజితేంద్రియస్త- దశాంతకామో హరతే కుటుంబీ॥5839॥

కుటుంబముపై గల మోహముచే దాని పోషణయందే తన అమూల్యమైన ఆయువును పోగొట్టుకొనును. అతడు ఎన్నడును  తన జీవిత పరమార్థమును గూర్చి ఆలోచింపడు. అంతులేని ప్రమాదములలొ పడిపోవును. ఇట్టి అభిలాషల వలన అతనికి ఎట్టి సుఖమూ లభింపకపోగా, అతనిని దైహిక, దైవిక, భౌతిక తాపత్రయములు వెంటాడుచునే యుండును. ఐనను, అతనికి వైరాగ్యము అబ్బదు. కుటుంబము పైగల మమకారముచే బద్ధుడై ధనసంపాదన చింతలోనే మునిగియుండును. ఇతరుల సొత్తులను దొంగిలించుట వలన లౌకిక, పారలౌకిక దోషములు కలుగునని తెలిసినను కోరికలకు లోబడి, తన కర్తవ్యమును మరచి, భోగలాలసుడై ధనమును అపహరించు చుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

28.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము

అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

6.16 (పదహారవ శ్లోకము)

విద్వానపీత్థం దనుజాః కుటుంబం పుష్ణన్ స్వలోకాయ న కల్పతే వై|

యః స్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః॥5840॥

సోదరులారా! మానవుడు  ఈ విధముగా తనకుటుంబ పోషణయందే నిబద్ధుడైనవాడు, ఎన్నడును భగవంతుని సేవింపుడు. అతడు విద్వాంసుడేయైననూ అతనికి భగవత్ప్రాప్తి కలుగదు. ఇది నాది, ఇది ఇతరులది అను భేదభావము ఉండుటవలన అతనికిని అజ్ఞానులవలె తమోగుణ ప్రధానమైన అధోగతులే లభించును.

6.17 (పదు నేడవ శ్లోకము)

యతో న కశ్చిత్క్వ చ కుత్రచిద్వా  దీనః స్వమాత్మానమలం సమర్థః|.

విమోచితుం కామదృశాం విహారక్రీడామృగో యన్నిగడో విసర్గః॥5841॥

అతడు కామినుల మనస్సులను రంజింపజేయునట్టి కీలు బొమ్మయగును. అట్టి పాపకృత్యముల ఫలితముగా కలిగిన సంతానము, అతని పాదములకు సంకెల యగును.  అట్టి దీనుడు ఎప్పుడైనను, ఎప్పుడైనను, ఏవిధముగనైనను ఆత్మోద్ధరణకై ప్రయత్నింపలేడు.

6.18 (పదునెనిమిదవ శ్లోకము)

తతో విదూరాత్పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు|

ఉపేత నారాయణమాదిదేవం  స ముక్తసంగైరిషితోఽపవర్గః॥5841॥

సోదరులారా! అందువలన మీరు విషయాసక్తులైన దైత్యుల సాంగత్యమును దూరముగ పారద్రోలుడు. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణువేడుడు. ఏలయన, సాంసారిక విషయముల యందు ఆసక్తిలేని మహాత్ములకు ఆ ప్రభువే ప్రియతముడు. అతడే పరమగతి. 

6.19 (పందొమ్మిదవ శ్లోకము)

న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోఽసురాత్మజాః॥

ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః॥5843॥

మిత్రులారా! భగవంతుని ప్రసన్నునిగా జేసికొనుటకు ఎక్కువ పరిశ్రమ లేక ప్రయత్నములు చేయనవసరము లేదు. అతడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై సర్వత్ర వ్యాపించియున్నాడు.

6.20 (ఇరువదియవ శ్లోకము)

పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాదిషు|

భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ॥5844॥

6.21 (ఇరువది యొకటవ శ్లోకము)

గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా|

ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోఽవ్యయః॥5845॥

చెట్టు చేమలు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు, సకల ప్రాణుల యందు ఆ ప్రభువు వ్యాపించియున్నాడు. అంతేగాదు, పంచభూతములయందును, వాటిచే నిర్మితములైన వస్తువులయందును, సూక్ష్మతన్మాత్రలయందును, ఆ పరమాత్మ విరాజిల్లుచున్నాడు. మహత్తత్వము నందును, త్రిగుణములయందును, వాటి సామ్యావస్థలయందును, తద్వ్యతిరేకావస్థలయందును ఆ స్వామి శాశ్వతముగా నెలకొనియున్నాడు. అతడు సమస్త సౌందర్యమాధుర్య ఐశ్వర్యములకు నిధి.

6.22 (ఇరువది రెండవ శ్లోకము)

ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్|

వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యోఽవికల్పితః॥5846॥
 
ఆ శ్రీహరి ప్రాణులలో అంతర్యామియై ద్రష్టరూపమునను, దృశ్యమైన జగద్రూపమునను విరాజిల్లుచున్నాడు. ఆ స్వామి సర్వధా అనిర్వచనీయుడు. ఆ పరమపురుషుని స్వరూపము ఇట్టిది అని వర్ణింపజాలము. వికల్పరహితుడైనను అతడు ద్రష్టగను, దృశ్యముగను, వ్యాప్య, వ్యాప్యక రూపములలోను ప్రకటితుడు అగుచుండును. కాని, వాస్తవమునకు అతడు ఉన్నది ఒక్కడే అయినను ద్రష్ట, దృశ్యము, వ్యాప్యము, వ్యాపకములన్నియును పరమాత్మను ఆశ్రయించియే యుండును. అతని లోనే విలీనమగును. అతనిలో ఎటువంటి వికల్పములు - భేదములు లేవు. ఉన్నది పరమాత్ముడు ఒక్కడే అని ఎరుగవలయును.

6.23 (ఇరువది మూడవ శ్లోకము)

కేవలానుభవానందస్వరూపః పరమేశ్వరః|

మాయయాంతర్హితైశ్వర్యః ఈయతే గుణసర్గయా॥5847॥

పరమానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు అనుభవైకవేద్యుడు. నిరంజనుడు. త్రిగుణమయమైన మాయచేతనే అతని ఐశ్వర్యము (మహత్త్వము) కప్పబడి యున్నది. ఆ మాయనుండి బయట పడినవానికి, ఆ ప్రభువు యొక్క దర్శనము కాగలదు.

6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదమ్|

ఆసురం భావమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః॥5848॥

అందువలన, మీరు దైత్య లక్షణమైన అసురీస్వభావమును విడనాడి నిర్హేతుక సుహృద్భావమును కలిగి సమస్త ప్రాణులయందును దయతో మెలగుడు. వాటికి మేలు చేయుడు. అప్పుడే, ఆ భగవంతుడు ప్రసన్నుడగును.

6.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తుష్టే చ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్ధాః|

ధర్మాదయః కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం నః॥5849॥

ఆది పురుషుడగు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైనచో మనము పొందజాలనిదంటూ ఏముండును? మనము ఆ భగవంతుని పాదారవిందముల అమృతమును గ్రోలుతూ ఆయన నామ, గుణ, లీలాసంకీర్తనాదులను చేయుచు, అందలి పరమానందములోనే ఓలలాడెదము. ఈ జగత్తులో సత్త్వరజస్తమోగుణముల పరిణామమువలన తమంతట తాముగా లభించెడు ధర్మార్థకామమోక్షములతోగానీ, అందరునూ కోరుకొనెడు గుణాతీతమైన మోక్షముతోగానీ, మనకేమి పని?

6.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ధర్మార్థకామ ఇతి యోఽభిహితస్త్రివర్గ ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా|

మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః॥5850॥

శాస్త్రములయందు ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములు వర్ణింపబడినవి. అంతేగాక, ఆత్మవిద్య, కర్మకాండము, తర్కశాస్త్రము, దండనీతి, జీవనోపాధి సాధనములు గూడ వేదములయందు ప్రతిపాదింపబడినవి. కాని, మనందరికి అత్యంత ఆత్మీయుడు, పరమహితైషియగు పురుషోత్తమునకు తమ సర్వస్వమును సమర్పించుటయే పరమసత్యము - సార్థకము అని నేను తలంతును.

6.27 (ఇరువది ఏడవ శ్లోకము)

జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖః కిల నారదాయ|

ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవిందరజసాఽఽప్లుతదేహినాం స్యాత్॥5851॥

సోదరులారా! నేను మీకు తెలపిన నిర్మలజ్ఞానము బహుదుర్లభమైనది. పూర్వము దీనిని నరనారాయణులు నారదునకు ఉపదేశించియుండిరి. భగవంతునియెడ అనన్యభక్తి గలిగి, అకించనులైన భాగవతోత్తముల పాదధూళియందు స్నానమొనర్చినవారికి ఈ జ్ఞానము లభ్యమగును.

6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

శ్రుతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్|

ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్॥5852॥

విజ్ఞానసహితమైన ఈ జ్ఞానము పవిత్రభాగవత ధర్మములను ప్రతిపాదించును. దీనిని పూర్వమునేను నారద మహర్షినుండి వినియుంటిని. ఆ దేవర్షి భగవంతుని దర్శనమును కలిగించుటలో సమర్థుడు.

దైత్యపుత్రా ఊచుః

6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ప్రహ్లాద త్వం వయం చాపి నర్తేఽన్యం విద్మహే గురుమ్|

ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ॥5853॥

6.30 (ముప్పదియవ శ్లోకము)

బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః|

ఛింధి నః సంశయం సౌమ్య స్యాచ్చేద్విశ్రంభకారణం॥5854॥

దైత్యబాలురు వచించిరి - ప్రహ్లాదా! ఈ ఇద్దరు గురుపుత్రులను దప్ప మఱి ఏ గురువును నీవు గాని, నేనుగాని ఎఱుగము. వీరే బాలురమైన మన అందరిని శాసించువారు. ప్రియమిత్రమా! నీవు ఇంకను చిన్న వయసు వాడవు. పుట్టినప్పటినుండియు రాజభవనమున తల్లికడ ఉన్నవాడవు. కనుక, నీవు మహాత్మడైన నారదునితో కలియుట   అసంభవమని మాకు తోచుచున్నది. ఈ విషయమున మాకు నమ్మకము కలుగుటకు తగిన కారణమున్నయెడల, మా ఈ సందేహమును తీర్చుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠోఽధ్యాయః (6)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

Friday, 26 June 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ

నారదుడు పలికెను- దైత్యులు పూజ్యుడైన శుక్రాచార్యుని తమ పురోహితునిగా నియమించుకొనియుండిరి. అతనికి  శందుడు, అమర్కుడు అను ఇరువురు కుమారులు గలరు. వారు రాజభవనమునకు సమీపమునందే నివసించుచుండిరి. హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు నీతికోవిదుడైన ప్రహ్లాదునకును, ఇంకను ఇతర దైత్యబాలురకును రాజనీతి, అర్థనీతి శాస్త్రములను నేర్పుచుండిరి.

ప్రహ్లాదుడు గురువు నేర్పిన పాఠమును వినుచుండెను. యథాతథముగ వినిపించుచుండెను. కాని, అవి అతని మనస్సునకు నచ్చకుండెను. ఏలయన, ఆ పాఠములు స్వ-పరభేదములను తెలుపుచుండెను.

ధర్మరాజా! ఒకనాడు హిరణ్యకశిపుడు తనపుత్రుడైన ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో చేర్చుకొని, ఇట్లు ప్రశ్నించెను. 'కుమారా! నీవు నేర్చిన వాటిలో నీకు మంచిదని తోచిన ఒకదానిని వినిపింపుము'.

ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు పలికెను - "నాయనా! ఈ జగత్తున మానవులు 'నేను, నాది' అను మాయలోబడి మిథ్యావిషయములను పట్టుకొని సర్వదా ఉద్విగ్నులగుచుందురు. ఇదే వారి అధఃపతనమునకు మూలకారణము' - అని నేను తలంతును. గృహము గడ్డితో కప్పబడిన అంధకార మయమైన బావి వంటిది. జనులు దానిని త్యజించి, వనములలో సాధుపురుషుల సాంగత్యమును నెఱపుచు శ్రీహరిని శరణు వేడుటయే మేలు"

నారద ఉవాచ

నారదుడు పలిచెను- ప్రహ్లాదునినోట శత్రువుల యొక్క ప్రశంసను విని, హిరణ్యకశిపుడు బిగ్గరగా నవ్వి ఇట్లనెను- 'శత్రుపక్షపాతము గలవారు బాలుర బుద్ధులను వక్రమార్గమును పట్టింతురు. గురువు గారి ఇంటిలో కొందరు విష్ణు పక్షపాతము గల బ్రాహ్మణులు మారు వేషములతో నివసించుచున్నారని నేను అనుకొందును. ఈ బాలుని బుద్ధి అపమార్గము పట్టకుండ చక్కగా శిక్షణ గరపవలెను".

దైత్యులు ప్రహ్లాదుని మరల గురువుల ఇంటికి చేర్చిరి. అప్పుడు వారు ప్రహ్లాదుని బుజ్జగించుచు మధురముగా అనునయవచములను పలికిరి-

"కుమారా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక! నిజము పలుకుము. నీ బుద్ధి ఇట్లు ఏల వక్రించినది. ఇతర బాలకుల బుద్ధి ఇట్లు లేదుగదా! వంశోద్ధారకా! నీ బుద్ధిని ఇతరులు ఎవరైనను ఇట్లు వక్రమార్గమును పట్టించిరా? లేక సహజముగనే నీకు తోచినదా! గురువులమైన మేము తెలిసికొనగోరుచున్నాము. తెలుపుము.

ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు పలికెను - "భగవంతుని మాయకు వశులైన మనుష్యులయొక్క బుద్ధి మోహగ్రస్తమగుచుండును. దానివలన వారు స్వ-పర భేదమునకు లోనగుచుందురు. అట్టి మాయాధీశుడగు ఆ భగవంతునకు నమస్కారము. పశుబుద్ధి కారణముగనే మానవులకు 'ఇది నేను, ఇది నాకంటెను వేరైనది' అను భేదబుద్ధి కలుగును. భగవంతుని కృపకలిగిన నాడు ఈ పశుబుద్ధి తొలగిపోవును. ఈ ఆత్మయే ఆ పరమాత్మ. అజ్ఞానులు ఇది - నేను, ఇతడు పరాయివాడు అను భేదముతో ఆ ఆత్మనే వర్ణింతురు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనుట మిగుల కష్టము. బ్రహ్మాది వేదజ్ఞులు గూడ ఆ విషయమున మోహితులగు చుందురు. ఆ పరమాత్మయే నా బుద్ధి వక్రించినది అని మీతో పలికించుచున్నాడు. గురువులారా! అయస్కాంతము వైఫు ఇనుము స్వయముగా ఆకర్షింపబడును. అట్లే చక్రధారియైన ఆ శ్రీహరివైపు నా మనస్సు తనంతటతానే భక్తిప్రపత్తులతో ఆకృష్టమైనది.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ

నారదుడు ఇట్లు పలికెను- పరమజ్ఞానియైన ప్రహ్లాదుడు తన గురువుతో ఇట్లు పలికి మిన్నకుండెను. ఆ పురోహితుడు రాజునకు సేవకుడు, పరాధీనుడు. అతనిలో కోపము ముంచుకొనివచ్చెను. అపుడు ఆ పురోహితుడు ప్రహ్లాదుని మందలించుచు ఇట్లు పలికెను-

"అరే, ఎవ్వరైనను ఒక బెత్తమును తీసికొనిరండు. ఈ బాలుడు మా కీర్తికి కళంకమును తెచ్చుచున్నాడు. తమ వంశమునకు చిచ్చు పెట్టుచున్నాదు. ఈ దుర్బుద్ధిని బాగుచేయుటకు చతురుపాయములలో నాల్గవదియైన దండనయే సరియైనది. దైత్యవంశమనెడి చందనవనమునందు ఇతడు ఒక ముండ్ల పొదవలె జన్మించినాడు. విష్ణువు ఈ వనమును భేదించునట్టి  గొడ్డలివంటివాడు. ఈ ఆర్భకుడు అతనికే తోడ్పడుచున్నాడు"

ఈ విధముగా గురువు పలు విధములుగా మందలించుచు ప్రహ్లాదుని భయపెట్టెను. ధర్మార్ధకామముల యందు అతనికి శిక్షణను ఇచ్చెను.

ప్రహ్లాదుడు సామదానభేద దండోపాయములను గూర్చి చక్కగా తెలిసినవాడని గురువు గ్రహించెను. అపుడు అతడు ప్రహ్లాదుని అతని తల్లి దగ్గరకు తీసికొనిపోయెను. తల్లి మిక్కిలి వాత్సల్యముతో అతనిచే స్నానము చేయించి, మంచి వస్త్రాభరణములను అలంకరింప జేసినది. పిమ్మట ఆమె అతనిని హిరణ్యకశిపుని కడకు తీసికొని పోయెను.

ప్రహ్లాదుడు తన తండ్రిపాదములకు నమస్కరించెను. హిరణ్యకశిపుడు అతనిని ఆశీర్వదించి తన రెండు చేతులతో లేవనెత్తి అక్కున జేర్చుకొనెను. ఆ సమయమున ఆ దైత్యరాజుయొక్క హృదయము ఆనందముతో నిండిపోయెను.

హిరణ్యకశిపురువాచ

ధర్మరాజా! హిరణ్యకశిపుడు ప్రసన్నముఖుడైన ప్రహ్లాదుని తన యొడిలోనికి చేర్చుకొని శిరమును మూర్కొనెను. అతని నేత్రములనుండి జాలువాఱిన ఆనందాశ్రువులు ప్రహ్లాదుని శరీరమును తడిపివేసేను.పిమ్మట హిరణ్యకశిపుడు తన పుత్రునితో ఇట్లు పలికెను "చిరంజీవీ! ప్రహ్లాదా! ఇంతవరకును గురువునొద్ద నీవు అభ్యసించిన విద్యలో శ్రేష్ఠమైన విషయమును వివరింపుము"

ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు వచించెను తండ్రీ శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగు వానిని వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామ రూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మనివేదనము చేయుట. ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తియని వ్యవహరింతురు.

ప్రహ్లాదుని ఈ వచనములను వినగనే హిరణ్యకశిపుడు క్రోధావిష్టుడు అయ్యెను. పెదవులు వణక సాగెను. పిదప గురుపుత్రునితో ఇట్లనెను- "ఓరీ! బ్రాహ్మణాధమా! నీవు కుబుద్ధివి. ఇదియేనా నీవు నేర్పిన విద్య? నన్ను ఏమాత్రమూ లక్ష్యపెట్టక మా కుమారునకు ఇట్టి సారరహితమైన విషయములను నేర్పితివి. నీవు నా శత్రుపక్షమును వహించినట్లున్నది. లోకములో మిత్రులవలె నటించుచు శత్రువుల కార్యములను నెరవేర్చు దుష్టులకు కొదువలేదు. కాని, రహస్యముగ పాపకృత్యములను ఒనర్చిన వారి పాపములు సమయము వచ్చినప్ఫుడు రోగముల రూపములో బయటపడినట్లు ఈ దుష్టాత్ముల దుర్బుద్ధి ఏదేని యొక సమయమున బహిర్గతము కాక తప్ఫదు.

గురుపుత్ర ఉవాచ

గురుపుత్రుడు పలికెను ఇంద్రశత్రూ! మీ పుత్రుడు పలుకుచున్న మాటలు నేనుగాని, మరెవ్వరైనగాని నేర్పినవి కావు. ప్రభూ! ఇతనికి ఈ బుద్ధి జన్మతః అబ్బినది. కోపమును వీడి శాంతి వహింపుము. మాపై దోషారోపము చేయవద్దు.

నారదుడు వచించెను- ధర్మరాజా! గురువు ఈ విధముగా సమాధానము ఇచ్చినంతనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరల ఇట్లు ప్రశ్నించెను- 'బాలకా! ఇట్లు అమంగళకరమైన ఈ దుర్బుద్ధి గురువునుండి నీకు ప్రాప్తింపనిచో, మరి ఎట్లు అబ్బినది?'

ప్రహ్లాద ఉవాచ

ప్రహ్లాదుడు నుడివెను- తండ్రీ! ప్రపంచములో జనులు ఇంద్రియములకు వశులై అనుభవించిన విషయ సుఖములనే మరలమరల అనుభవింపగోరుదురు. ఇవి చర్విత  చరణములే (నమలిన వాటినే మరల నమలుటవంటిది). అట్టివారు సంసార రూప ఘోరనరకమున పడియుందురు. అట్టి గృహాసక్తులైన వారి బుద్ధి సహజముగా గాని, ఇతరులు నేర్పుటవలనగాని శ్రీహరియందు కుదురుకొనదు. ఇంద్రియములకు గోచరించు బాహ్యవిషయములే పరమార్థములని భావించునట్టి మూర్ఖులు, అంధుని మార్గనిర్దెశములో నడచునట్టి అంధునివలె గోతులలో పడుదురు. వారు వేదములో వర్ణింపబడు కామ్యకర్మలచే బంధింపబడుదురు. అట్టి వారికి స్వార్థపరమార్థములు శ్రీమహావిష్ణువు  అని తెలియదు. అట్లు అజ్ఞానులను ఆశ్రయించుట వలన పురుషార్థములు ఎట్లు సిద్ధించును?

శ్రీహరిపాదపద్మముల యందే నిమగ్నమైన బుద్ధిగల వారిని జనన మరణరూప అనర్థములు అన్నియును పూర్తిగా వదలిపోవును. కాని, భగవద్భక్తులైన అకించనుల పాదధూళిలో స్నానమొనర్పనివారు, కామ్యకర్మలను ఎంతగా సేవించినను వారి బుద్ధి భగవచ్చరణారవిందములయందు లగ్నముకాదు.

ప్రహ్లాదుడు ఈ విధముగ పలికి మిన్నకుండెను. హిరణ్యకశిపుడు మాత్రము క్రోధాంధుడై అతనిని తనయొడి నుండి నేలపై పడద్రోసెను.

ప్రహ్లాదుని వచనములకు హిరణ్యకశిపుడు కోపావిష్టుడయ్యెను. అతని కనులు ఎర్రబారెను. వెంటనే అతడు ఇట్లుపలికెను- "దైత్యులారా! వీనిని ఇప్ఫుడే ఇచటి నుండి గొనిపోయి చంపివేయుడు. ఇతడు వధార్హుడు.

హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను

ఈ బాలుడు తన తోడివారిని, స్వజనులను కాదని, తన పినతండ్రిని చంపిన విష్ణుని పాదములనే ఒక సేవకునివలె పూజించుచున్నాడు. నా సోదరుని చంపిన విష్ణువే ఈ రూపమున వచ్చినట్లున్నది.

ఇతడు విశ్వాసపాత్రుడు కాడు. ఐదు సంవత్సరముల వయస్సులోనే విడదీయరాని మాతాపితరుల ప్రేమానురాగాలను మరచిపోయినాడు. ఇంతటి కృతఘ్నుడైన ఇతడు ఆ విష్ణువునకు మాత్రము ఎట్టి మేలు చేయగలడు.

పరాయివాడైనను ఔషధమువలె మేలు చేకూర్చినచో, అతడొక విధముగా పుత్రుడేయగును. కాని, తన కుమారుడే కీడుతలపెట్టినచో, అతడు రోగమువలె శత్రువేయగును. శరీరములోని ఒక అంగము వలన శరీరమంతటికిని హాని జరిగినచో, వెంటనే దానిని ఖండింపవలెను. అట్లొనర్చినచో, మిగిలిన శరీరము సురక్షితముగును. అప్పుడు ఆ వ్యక్తి హాయిగ జీవింపగలడు.

స్వజనునివలె నటించుచున్న వీడు నిజముగా నాకు శత్రువే. భోగలాలసుడైన యోగికి అతని యింద్రియములే నష్టము కలిగించునటులు, పుత్రుడైన ఇతడే నాకు ద్రోహమును తలపెట్టినాడు. కనుక, భుజించు సమయమునగాని, నిద్రించునపుడుగాని, కూర్చొనియున్నప్పుడుగాని, ఏదైనా ఒక ఉపాయముచే ఇతనిని చంపివేయుడు".

హిరణ్యకశిపుడు ఇట్లు ఆదేశింపగనే దైత్యులు త్రిశూలములను చేబూని కొట్టుడు, చంపుడు అని బిగ్గరగా అరవసాగిరి. ఆ దైత్యుల కోరలు వాడిగా నుండెను. ముఖములు భయంకరముగా నుండెను. గడ్డములు, మీసములు, కేశములు రాగి వన్నెలో ఉండెను. ప్రహ్లాదుడు మాత్రము మౌనము వహించి యుండెను. వారు అతని ఆయువుపట్టులను శూలములతో పొడుచుచుండిరి.

ఆ సమయమున ప్రహ్లాదుడు తన చిత్తమును పరబ్రహ్మమునందే నిలిపియుండెను. ఆ పరమాత్మ అవాఙ్మానస గోచరుడు, సకల ప్రాణులలో విలసిల్లుచుండు వాడు. ఆ ప్రభువు సమస్త శక్తులకును ఆధారమైనవాడు. కనుక ఆ దైత్యుల ప్రహారములు అన్నియును అదృష్టహీనుని కార్యములవలె నిష్ఫలములయ్యెను.

ధర్మరాజా! శూలములచే పొడుచుటవలన ప్రహ్లాదుని శరీరముపై ఎట్టి గాయము కలుగకపోవుటను జూచి, హిరణ్యకశిపునకు గొప్ప సంశయము గలిగెను. అప్పుడు అతడు ప్రహ్లాదుని వధించుటకై పలు  ఉపాయములను పన్నసాగెను.

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మద గజములచే త్రొక్కించెను. విషసర్పములచే కరిపించెను. కృత్య అను రాక్షసిచే బాధింపజేసెను. పర్వత శిఖరములనుండి పడద్రోయించెను. శంబరాసురుని మాయోపాయములను ప్రయోగించెను. చీకటి కొట్లలో బంధించెను. విషమును త్రాగించెను. భోజనమును లేకుండజేసెను. మంచు తిన్నెలపై నిలిపెను. తీవ్రమైన గాలులతో బాధించెను. అగ్ని కుండములలో పడద్రోయించెను. సముద్ర జలములలో ముంచెను. పర్వతముల క్రింద నలిగి పోవునట్లు    చేసెను. కానీ, ఈ ఉపాయములలో దేనిచేతను గూడ నిర్దోషియైన తన పుత్రుని చంపలేకపోయెను. అప్పుడు అతడు దీర్ఘముగా ఆలోచింపసాగెను. ప్రహ్లాదుని చంపించుటకు ఎట్టి ఉపాయమూ తోచలేదు.

అతడు ఇట్లు ఆలోచింపసాగెను- 'ఇతనిని ఎన్నియో పరుషోక్తులాడితిని, చంపించుటకు పెక్కు ప్రయత్నములు చేసితిని. కాని, నేను చేసిన అపచారములు, దుష్టప్రయత్నములు, అతని తేజస్సుముందు ఏమాత్రమూ పనిచేయకుండెను.

ఇతడు బాలుడేయైనను గొప్పతెలివి గలవాడు. నా సమీపముననే నిర్భయముగానుండెను. ఇతనిలో  ఏదో తెలియని ఒక అద్భుతశక్తి యున్నది. పూర్వము శునశ్శేపుడు తన తండ్రి చేసిన కార్యము ఫలితముగా అతనికి విరోధియయ్యెను.అట్లే ఇతడు గూడ నా దుష్కార్యములను మరచిపోడు. ఇతడు  ఎవరికి భయపడుట లేదు. ఇంతగా ప్రయత్నించినను మృతుడు కాలేదు. ఇతని శక్తి ఎంతటిదో అర్థమగుటలేదు. ఇతని యెడ శత్రుత్వము వహించుట వలన ఇతని వలననే నాకు చావు తప్పనట్లున్నది.

శునశ్శేపుని వృత్తాంతము (సంక్షిప్తముగా - పూర్తికథ నవమస్కంధమునందు ఏడవ అధ్యాయమునందు వచ్చును. ఇక్కడ కూడా ప్రత్యేక సందేశముగా నీయబడినది)

శునశ్శేపుడు అజీగర్తుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు. వరుణయాగమునందు బలియిచ్చుటకై అతని తండ్రి హరిశ్చంద్రుని పుత్రుడైన లోహితాస్యునకు అమ్మివేసెను. అప్పుడు అతని మామయైన విశ్వామిత్రుడు అతనిని రక్షించెను. అంతట అతడు తన తండ్రికి విరోధియై విశ్వామిత్రుని పక్షమున చేరెను.

ఇట్లు చింతించుటవలన హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. అంతట అతడు తలవంచుకొని యుండుటను శుక్రాచార్యుని కుమారులైన శండామార్కులు చూచిరి. వారు ఏకాంతముగా ఆయనతో ఇట్లు పలికిరి-"ప్రభూ! నీవు ఒక్కడవే ముల్లోకములను జయించితివి. నీవు కోపముతో బొమముడి వైచినంతనే లోకపాలురు గడగడలాడెదరు. ఈ బాలుని విషయములో నీవు ఏమాత్రము చింతింపవలదు. పిల్లల విషయములో మంచి చెడులను గూర్చి అంతగా మథనపడవలసిన పనియేలేదు. మా తండ్రియైన శుక్రాచార్యుడు ఇచటికి రానంత వరకును ఇతడు భయపడి ఎక్కడికిని పారిపోడు. కనుక ఇతని వరుణపాశముతో బంధింపుడు. వయస్సు పెరుగుచున్న కొలదియు గురువుల సేవల ప్రభావమువలన ఇతని బుద్ధి మారవచ్చును.

'సరే! మంచిది!. అని పలికి హిరణ్యకశిపుడు గురుపుత్రుల సూచనను మన్నించెను. పిదప, గృహస్థులైన రాజులు పాటించునట్టి ధర్మములను ఇతనికి ఉపదేశింపుడు' అని పలికెను.

ధర్మరాజా! అంతట పురోహితులు ప్రహ్లాదుని తీసికొని తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. అతనికి క్రమముగ ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములలో శిక్షణను ఇచ్చిరి. ప్రహ్లాదుడు అచట మిక్కిలి వినమ్రుడై సేవకునివలె ఉండసాగెను. కాని, గురువుల ఉపదేశము ప్రహ్లాదునకు నచ్చలేదు. ఏలయన,అది కేవలము ధర్మార్థకామములకు సంబంధించినది మాత్రమే అయియుండెను. ఆ విద్య రాగద్వేషాది ద్వంద్వములలో విషయభోగములకు మాత్రమే ప్రయోజనకరము.

ఒకనాడు గురువు ఇంటి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళియుండెను. అవకాశము దొరికినందులకు సమవయస్కులైన బాలురు తమతో  ఆడుకొనుటకు పిలిచిరి. ప్రహ్లాదుడు పరమ జ్ఞాని. తనయెడ వారికిగల ప్రేమనుజూచి అతడు మధుర వచనములతో వారిని తన యొద్దకు పిలిచెను. వెంటనే ప్రేమపూర్వకముగా వారికి అతడు ఉపదేశింప సాగెను.

ధర్మరాజా! వారు ఇంకను పిన్నవయస్కులే. కావున రాగద్వేషములతో, విషయ భోగలాలసులైన పురుషుల ఉపదేశముల వలనను, చేష్టల వలనను వారి బుద్ధులు ఇంకనూ కలుషితములు కాలేదు. ప్రహ్లాదునిపై గల గౌరవభావముతో వారు తమ ఆట వస్తువులను త్యజించి, అతని చుట్టును చేరిరి. ఏకాగ్రచిత్తముతో అతని ఉపదేశములను వినుచు ప్రేమ పూర్వకముగ అతని వైఫు చూడసాగిరి. పరమభాగవతుడు, సుహృదుడు ఐన ప్రహ్లాదుడు వారిపై కరుణచూపుచు ఇట్లు పలుకసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమోఽధ్యాయః (5)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)

5.1 (ప్రథమ శ్లోకము)

పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురైః|

షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజగృహాంతికే॥5768॥

5.2 (రెండవ శ్లోకము)

తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదమ్|

పాఠయామాసతుః పాఠ్యానన్యాంశ్చాసురబాలకాన్॥5769॥

నారదుడు పలికెను- దైత్యులు పూజ్యుడైన శుక్రాచార్యుని తమ పురోహితునిగా నియమించుకొనియుండిరి. అతనికి  శందుడు, అమర్కుడు అను ఇరువురు కుమారులు గలరు. వారు రాజభవనమునకు సమీపమునందే నివసించుచుండిరి. హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు నీతికోవిదుడైన ప్రహ్లాదునకును, ఇంకను ఇతర దైత్యబాలురకును రాజనీతి, అర్థనీతి శాస్త్రములను నేర్పుచుండిరి.

5.3 (మూడవ శ్లోకము)

యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేఽనుపపాఠ చ|

న సాధు మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయం॥5770॥

ప్రహ్లాదుడు గురువు నేర్పిన పాఠమును వినుచుండెను. యథాతథముగ వినిపించుచుండెను. కాని, అవి అతని మనస్సునకు నచ్చకుండెను. ఏలయన, ఆ పాఠములు స్వ-పరభేదములను తెలుపుచుండెను.

5.4 (నాలుగవ శ్లోకము)

ఏకదాసురరాట్ పుత్రమంకమారోప్య పాండవ|

పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్॥5771॥

ధర్మరాజా! ఒకనాడు హిరణ్యకశిపుడు తనపుత్రుడైన ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో చేర్చుకొని, ఇట్లు ప్రశ్నించెను. 'కుమారా! నీవు నేర్చిన వాటిలో నీకు మంచిదని తోచిన ఒకదానిని వినిపింపుము'.

ప్రహ్లాద ఉవాచ

5.5 (ఐదవ శ్లోకము)

తత్సాధు మన్యేఽసురవర్య దేహినాంసదా సముద్విగ్నధియామసద్గ్రహాత్|

హిత్వాత్మపాతం గృహమంధకూపం  వనం గతో యద్ధరిమాశ్రయేత॥5772॥

ప్రహ్లాదుడు పలికెను - "నాయనా! ఈ జగత్తున మానవులు 'నేను, నాది' అను మాయలోబడి మిథ్యావిషయములను పట్టుకొని సర్వదా ఉద్విగ్నులగుచుందురు. ఇదే వారి అధఃపతనమునకు మూలకారణము' - అని నేను తలంతును. గృహము గడ్డితో కప్పబడిన అంధకార మయమైన బావి వంటిది. జనులు దానిని త్యజించి, వనములలో సాధుపురుషుల సాంగత్యమును నెఱపుచు శ్రీహరిని శరణు వేడుటయే మేలు"

నారద ఉవాచ

5.6 (ఆరవ శ్లోకము)

శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః|

జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః॥5773॥

5.7 (ఏడవ శ్లోకము)

సమ్యగ్విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః|

విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైర్న భిద్యేతాస్య ధీర్యథా॥5774॥

నారదుడు పలిచెను- ప్రహ్లాదునినోట శత్రువుల యొక్క ప్రశంసను విని, హిరణ్యకశిపుడు బిగ్గరగా నవ్వి ఇట్లనెను- 'శత్రుపక్షపాతము గలవారు బాలుర బుద్ధులను వక్రమార్గమును పట్టింతురు. గురువు గారి ఇంటిలో కొందరు విష్ణు పక్షపాతము గల బ్రాహ్మణులు మారు వేషములతో నివసించుచున్నారని నేను అనుకొందును. ఈ బాలుని బుద్ధి అపమార్గము పట్టకుండ చక్కగా శిక్షణ గరపవలెను".

5.8 (ఎనిమిదవ శ్లోకము)

గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః|

ప్రశస్య శ్లక్ష్ణయా వాచా సమపృచ్ఛంత సామభిః॥5775॥

దైత్యులు ప్రహ్లాదుని మరల గురువుల ఇంటికి చేర్చిరి. అప్పుడు వారు ప్రహ్లాదుని బుజ్జగించుచు మధురముగా అనునయవచములను పలికిరి-

5.9 (తొమ్మిదవ శ్లోకము)

వత్స ప్రహ్లాద భద్రం తే సత్యం కథయ మా మృషా|

బాలానతి కుతస్తుభ్యమేష బుద్ధివిపర్యయః॥5776॥

5.10 (పదియవ శ్లోకము)

బుద్ధిభేదః పరకృత ఉతాహో తే స్వతోఽభవత్|

భణ్యతాం శ్రోతుకామానాం గురూణాం కులనందన॥5777॥

"కుమారా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక! నిజము పలుకుము. నీ బుద్ధి ఇట్లు ఏల వక్రించినది. ఇతర బాలకుల బుద్ధి ఇట్లు లేదుగదా! వంశోద్ధారకా! నీ బుద్ధిని ఇతరులు ఎవరైనను ఇట్లు వక్రమార్గమును పట్టించిరా? లేక సహజముగనే నీకు తోచినదా! గురువులమైన మేము తెలిసికొనగోరుచున్నాము. తెలుపుము.

ప్రహ్లాద ఉవాచ

5.11 (పదకొండవ శ్లోకము)

స్వ: పరశ్చేత్యసద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః|

విమోహితధియాం దృష్టస్తస్మై భగవతే నమః॥5778॥

5.12 (పండ్రెండవ శ్లోకము)

స యదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే|

అన్య ఏష తథాన్యోఽహమితి భేదగతాసతీ॥5779॥

5.13 (పదమూడవ శ్లోకము)

స ఏష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిర్దురత్యయానుక్రమణో నిరూప్యతే|

ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం॥5780॥

5.14 (పదునాలుగవ శ్లోకము)

యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్షసన్నిధౌ|

తథా మే భిద్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్ఛయా॥5781॥

ప్రహ్లాదుడు పలికెను - "భగవంతుని మాయకు వశులైన మనుష్యులయొక్క బుద్ధి మోహగ్రస్తమగుచుండును. దానివలన వారు స్వ-పర భేదమునకు లోనగుచుందురు. అట్టి మాయాధీశుడగు ఆ భగవంతునకు నమస్కారము. పశుబుద్ధి కారణముగనే మానవులకు 'ఇది నేను, ఇది నాకంటెను వేరైనది' అను భేదబుద్ధి కలుగును. భగవంతుని కృపకలిగిన నాడు ఈ పశుబుద్ధి తొలగిపోవును. ఈ ఆత్మయే ఆ పరమాత్మ. అజ్ఞానులు ఇది - నేను, ఇతడు పరాయివాడు అను భేదముతో ఆ ఆత్మనే వర్ణింతురు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనుట మిగుల కష్టము. బ్రహ్మాది వేదజ్ఞులు గూడ ఆ విషయమున మోహితులగు చుందురు. ఆ పరమాత్మయే నా బుద్ధి వక్రించినది అని మీతో పలికించుచున్నాడు. గురువులారా! అయస్కాంతము వైఫు ఇనుము స్వయముగా ఆకర్షింపబడును. అట్లే చక్రధారియైన ఆ శ్రీహరివైపు నా మనస్సు తనంతటతానే భక్తిప్రపత్తులతో ఆకృష్టమైనది.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

26.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

5.15 (పదునైదవ శ్లోకము)

ఏతావద్బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః|

తం నిర్భర్త్స్యాథ కుపితః సుదీనో రాజసేవకః॥5782॥

నారదుడు ఇట్లు పలికెను- పరమజ్ఞానియైన ప్రహ్లాదుడు తన గురువుతో ఇట్లు పలికి మిన్నకుండెను. ఆ పురోహితుడు రాజునకు సేవకుడు, పరాధీనుడు. అతనిలో కోపము ముంచుకొనివచ్చెను. అపుడు ఆ పురోహితుడు ప్రహ్లాదుని మందలించుచు ఇట్లు పలికెను-

5.16 (పదునారవ శ్లోకము)

ఆనీయతామరే వేత్రమస్మాకమయశస్కరః|

కులాంగారస్య దుర్బుద్ధేశ్చతుర్థోఽస్యోదితో దమః॥5783॥

5.17 (పదునేడవ శ్లోకము)

దైతేయచందనవనే జాతోఽయం కంటకద్రుమః|

యన్మూలోన్మూలపరశోర్విష్ణోర్నాలాయితోఽర్భకః॥5784॥

"అరే, ఎవ్వరైనను ఒక బెత్తమును తీసికొనిరండు. ఈ బాలుడు మా కీర్తికి కళంకమును తెచ్చుచున్నాడు. తమ వంశమునకు చిచ్చు పెట్టుచున్నాదు. ఈ దుర్బుద్ధిని బాగుచేయుటకు చతురుపాయములలో నాల్గవదియైన దండనయే సరియైనది. దైత్యవంశమనెడి చందనవనమునందు ఇతడు ఒక ముండ్ల పొదవలె జన్మించినాడు. విష్ణువు ఈ వనమును భేదించునట్టి  గొడ్డలివంటివాడు. ఈ ఆర్భకుడు అతనికే తోడ్పడుచున్నాడు"

5.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఇతి తం వివిధోపాయైర్భీషయంస్తర్జనాదిభిః|

ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం॥5785॥

ఈ విధముగా గురువు పలు విధములుగా మందలించుచు ప్రహ్లాదుని భయపెట్టెను. ధర్మార్ధకామముల యందు అతనికి శిక్షణను ఇచ్చెను.

5.19 (పందొమ్మిదవ శ్లోకము)

తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయం|

దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతమ్॥5786॥

ప్రహ్లాదుడు సామదానభేద దండోపాయములను గూర్చి చక్కగా తెలిసినవాడని గురువు గ్రహించెను. అపుడు అతడు ప్రహ్లాదుని అతని తల్లి దగ్గరకు తీసికొనిపోయెను. తల్లి మిక్కిలి వాత్సల్యముతో అతనిచే స్నానము చేయించి, మంచి వస్త్రాభరణములను అలంకరింప జేసినది. పిమ్మట ఆమె అతనిని హిరణ్యకశిపుని కడకు తీసికొని పోయెను.

5.20 (ఇరువదియవ శ్లోకము)

పాదయోః పతితం బాలం ప్రతినంద్యాశిషాసురః|

పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిం॥

ప్రహ్లాదుడు తన తండ్రిపాదములకు నమస్కరించెను. హిరణ్యకశిపుడు అతనిని ఆశీర్వదించి తన రెండు చేతులతో లేవనెత్తి అక్కున జేర్చుకొనెను. ఆ సమయమున ఆ దైత్యరాజుయొక్క హృదయము ఆనందముతో నిండిపోయెను.

5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభిః|

ఆసించన్ వికసద్వక్త్రమిదమాహ యుధిష్ఠిర॥5788॥

హిరణ్యకశిపురువాచ

5.22 (ఇరువది రెండవ శ్లోకము)

ప్రహ్లాదానూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం|

కాలేనైతావతాఽఽయుష్మన్ యదశిక్షద్గురోర్భవాన్॥5789॥

ధర్మరాజా! హిరణ్యకశిపుడు ప్రసన్నముఖుడైన ప్రహ్లాదుని తన యొడిలోనికి చేర్చుకొని శిరమును మూర్కొనెను. అతని నేత్రములనుండి జాలువాఱిన ఆనందాశ్రువులు ప్రహ్లాదుని శరీరమును తడిపివేసేను.పిమ్మట హిరణ్యకశిపుడు తన పుత్రునితో ఇట్లు పలికెను "చిరంజీవీ! ప్రహ్లాదా! ఇంతవరకును గురువునొద్ద నీవు అభ్యసించిన విద్యలో శ్రేష్ఠమైన విషయమును వివరింపుము"

ప్రహ్లాద ఉవాచ

5.23 (ఇరువది మూడవ శ్లోకము)

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం॥5790॥

5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా|

క్రియేత భగవత్యద్ధా తన్మన్యేఽధీతముత్తమమ్॥5791॥

ప్రహ్లాదుడు వచించెను తండ్రీ శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగు వానిని వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామ రూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మనివేదనము చేయుట. ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తియని వ్యవహరింతురు.

5.25 (ఇరువది ఐదవ శ్లోకము)

నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా|

గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః॥5792॥

5.26 (ఇరువది ఆరవ శ్లోకము)

బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతాసతా|

అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే॥5793॥

5.27 (ఇరువది ఏడవ శ్లోకము)

సంతి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్ఛద్మవేషిణః|

తేషాముదేత్యఘం కాలే రోగః పాతకినామివ॥5794॥

ప్రహ్లాదుని ఈ వచనములను వినగనే హిరణ్యకశిపుడు క్రోధావిష్టుడు అయ్యెను. పెదవులు వణక సాగెను. పిదప గురుపుత్రునితో ఇట్లనెను- "ఓరీ! బ్రాహ్మణాధమా! నీవు కుబుద్ధివి. ఇదియేనా నీవు నేర్పిన విద్య? నన్ను ఏమాత్రమూ లక్ష్యపెట్టక మా కుమారునకు ఇట్టి సారరహితమైన విషయములను నేర్పితివి. నీవు నా శత్రుపక్షమును వహించినట్లున్నది. లోకములో మిత్రులవలె నటించుచు శత్రువుల కార్యములను నెరవేర్చు దుష్టులకు కొదువలేదు. కాని, రహస్యముగ పాపకృత్యములను ఒనర్చిన వారి పాపములు సమయము వచ్చినప్ఫుడు రోగముల రూపములో బయటపడినట్లు ఈ దుష్టాత్ముల దుర్బుద్ధి ఏదేని యొక సమయమున బహిర్గతము కాక తప్ఫదు.

గురుపుత్ర ఉవాచ

5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

న మత్ప్రణీతం న పరప్రణీతం  సుతో వదత్యేష తవేంద్రశత్రో|

నైసర్గికీయం మతిరస్య రాజన్
నియచ్ఛ మన్యుం కదదాః స్మ మా నః॥5795॥

గురుపుత్రుడు పలికెను ఇంద్రశత్రూ! మీ పుత్రుడు పలుకుచున్న మాటలు నేనుగాని, మరెవ్వరైనగాని నేర్పినవి కావు. ప్రభూ! ఇతనికి ఈ బుద్ధి జన్మతః అబ్బినది. కోపమును వీడి శాంతి వహింపుము. మాపై దోషారోపము చేయవద్దు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

26.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

గురుణైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురః సుతమ్|

న చేద్గురుముఖీయం తే కుతోఽభద్రాసతీ మతిః॥5796॥

నారదుడు వచించెను- ధర్మరాజా! గురువు ఈ విధముగా సమాధానము ఇచ్చినంతనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరల ఇట్లు ప్రశ్నించెను- 'బాలకా! ఇట్లు అమంగళకరమైన ఈ దుర్బుద్ధి గురువునుండి నీకు ప్రాప్తింపనిచో, మరి ఎట్లు అబ్బినది?'

ప్రహ్లాద ఉవాచ

5.30 (ముప్పదియవ శ్లోకము)

మతిర్న కృష్ణే పరతః స్వతో వా   మిథోఽభిపద్యేత గృహవ్రతానామ్|

అదాంతగోభిర్విశతాం తమిస్రం  పునః పునశ్చర్వితచర్వణానామ్॥5797॥

5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

న తే విదుః స్వార్థగతిం హి విష్ణుం  దురాశయా యే బహిరర్థమానినః|

అంధా యథాంధైరుపనీయమానా  వాచీశతంత్యామురుదామ్ని బద్ధాః॥5798॥

ప్రహ్లాదుడు నుడివెను- తండ్రీ! ప్రపంచములో జనులు ఇంద్రియములకు వశులై అనుభవించిన విషయ సుఖములనే మరలమరల అనుభవింపగోరుదురు. ఇవి చర్విత  చరణములే (నమలిన వాటినే మరల నమలుటవంటిది). అట్టివారు సంసార రూప ఘోరనరకమున పడియుందురు. అట్టి గృహాసక్తులైన వారి బుద్ధి సహజముగా గాని, ఇతరులు నేర్పుటవలనగాని శ్రీహరియందు కుదురుకొనదు. ఇంద్రియములకు గోచరించు బాహ్యవిషయములే పరమార్థములని భావించునట్టి మూర్ఖులు, అంధుని మార్గనిర్దెశములో నడచునట్టి అంధునివలె గోతులలో పడుదురు. వారు వేదములో వర్ణింపబడు కామ్యకర్మలచే బంధింపబడుదురు. అట్టి వారికి స్వార్థపరమార్థములు శ్రీమహావిష్ణువు  అని తెలియదు. అట్లు అజ్ఞానులను ఆశ్రయించుట వలన పురుషార్థములు ఎట్లు సిద్ధించును?

5.32 (ముప్పది రెంఢవ శ్లోకము)

నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం  స్పృశత్యనర్థాపగమో యదర్థః|

మహీయసాం పాదరజోఽభిషేకం  నిష్కించనానాం న వృణీత యావత్ *॥5799॥

శ్రీహరిపాదపద్మముల యందే నిమగ్నమైన బుద్ధిగల వారిని జనన మరణరూప అనర్థములు అన్నియును పూర్తిగా వదలిపోవును. కాని, భగవద్భక్తులైన అకించనుల పాదధూళిలో స్నానమొనర్పనివారు, కామ్యకర్మలను ఎంతగా సేవించినను వారి బుద్ధి భగవచ్చరణారవిందములయందు లగ్నముకాదు.

5.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఇత్యుక్త్వోపరతం పుత్రం హిరణ్యకశిపూ రుషా|

అంధీకృతాత్మా స్వోత్సంగాన్నిరస్యత మహీతలే॥5800॥

ప్రహ్లాదుడు ఈ విధముగ పలికి మిన్నకుండెను. హిరణ్యకశిపుడు మాత్రము క్రోధాంధుడై అతనిని తనయొడి నుండి నేలపై పడద్రోసెను.

5.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఆహామర్షరుషావిష్టః కషాయీభూతలోచనః|

వధ్యతామాశ్వయం వధ్యో నిఃసారయత నైరృతాః॥5801॥

ప్రహ్లాదుని వచనములకు హిరణ్యకశిపుడు కోపావిష్టుడయ్యెను. అతని కనులు ఎర్రబారెను. వెంటనే అతడు ఇట్లుపలికెను- "దైత్యులారా! వీనిని ఇప్ఫుడే ఇచటి నుండి గొనిపోయి చంపివేయుడు. ఇతడు వధార్హుడు.

5.35 (ముప్పది ఐదవ శ్లోకము)

అయం మే భ్రాతృహా సోఽయం హిత్వా స్వాన్ సుహృదోఽధమః|

పితృవ్యహంతుర్యః పాదౌ విష్ణోర్దాసవదర్చతి॥5802॥

హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను

ఈ బాలుడు తన తోడివారిని, స్వజనులను కాదని, తన పినతండ్రిని చంపిన విష్ణుని పాదములనే ఒక సేవకునివలె పూజించుచున్నాడు. నా సోదరుని చంపిన విష్ణువే ఈ రూపమున వచ్చినట్లున్నది.

5.36 (ముప్పది ఆరవ శ్లోకము)

విష్ణోర్వా సాధ్వసౌ కిం ను కరిష్యత్యసమంజసః|

సౌహృదం దుస్త్యజం పిత్రోరహాద్యః పంచహాయనః॥5803॥

హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను

ఇతడు విశ్వాసపాత్రుడు కాడు. ఐదు సంవత్సరముల వయస్సులోనే విడదీయరాని మాతాపితరుల ప్రేమానురాగాలను మరచిపోయినాడు. ఇంతటి కృతఘ్నుడైన ఇతడు ఆ విష్ణువునకు మాత్రము ఎట్టి మేలు చేయగలడు.

5.37 (ముప్పది ఏడవ శ్లోకము)

పరోఽప్యపత్యం హితకృద్యథౌషధం స్వదేహజోఽప్యామయవత్సుతోఽహితః|

ఛింద్యాత్తదంగం యదుతాత్మనోఽహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్॥5805॥

హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను

పరాయివాడైనను ఔషధమువలె మేలు చేకూర్చినచో, అతడొక విధముగా పుత్రుడేయగును. కాని, తన కుమారుడే కీడుతలపెట్టినచో, అతడు రోగమువలె శత్రువేయగును. శరీరములోని ఒక అంగము వలన శరీరమంతటికిని హాని జరిగినచో, వెంటనే దానిని ఖండింపవలెను. అట్లొనర్చినచో, మిగిలిన శరీరము సురక్షితముగును. అప్పుడు ఆ వ్యక్తి హాయిగ జీవింపగలడు.

5.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

సర్వైరుపాయైర్హంతవ్యః సంభోజశయనాసనైః|

సుహృల్లింగధరః శత్రుర్మునేర్దుష్టమివేంద్రియం॥5805॥

హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను

స్వజనునివలె నటించుచున్న వీడు నిజముగా నాకు శత్రువే. భోగలాలసుడైన యోగికి అతని యింద్రియములే నష్టము కలిగించునటులు, పుత్రుడైన ఇతడే నాకు ద్రోహమును తలపెట్టినాడు. కనుక, భుజించు సమయమునగాని, నిద్రించునపుడుగాని, కూర్చొనియున్నప్పుడుగాని, ఏదైనా ఒక ఉపాయముచే ఇతనిని చంపివేయుడు".

5.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

నైరృతాస్తే సమాదిష్టా భర్త్రా వై శూలపాణయః|

తిగ్మదంష్ట్రకరాలాస్యాస్తామ్రశ్మశ్రుశిరోరుహాః॥5806॥

5.40 (నలుబదియవ శ్లోకము)

నదంతో భైరవాన్నాదాన్ ఛింధి భింధీతి వాదినః|

ఆసీనం చాహనన్ శూలైః ప్రహ్లాదం సర్వమర్మసు॥5807॥

హిరణ్యకశిపుడు ఇట్లు ఆదేశింపగనే దైత్యులు త్రిశూలములను చేబూని కొట్టుడు, చంపుడు అని బిగ్గరగా అరవసాగిరి. ఆ దైత్యుల కోరలు వాడిగా నుండెను. ముఖములు భయంకరముగా నుండెను. గడ్డములు, మీసములు, కేశములు రాగి వన్నెలో ఉండెను. ప్రహ్లాదుడు మాత్రము మౌనము వహించి యుండెను. వారు అతని ఆయువుపట్టులను శూలములతో పొడుచుచుండిరి.

5.41 (నలుబది ఒకటవ శ్లోకము)

పరే బ్రహ్మణ్యనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని|

యుక్తాత్మన్యఫలా ఆసన్నపుణ్యస్యేవ సత్క్రియాః॥5808॥

ఆ సమయమున ప్రహ్లాదుడు తన చిత్తమును పరబ్రహ్మమునందే నిలిపియుండెను. ఆ పరమాత్మ అవాఙ్మానస గోచరుడు, సకల ప్రాణులలో విలసిల్లుచుండు వాడు. ఆ ప్రభువు సమస్త శక్తులకును ఆధారమైనవాడు. కనుక ఆ దైత్యుల ప్రహారములు అన్నియును అదృష్టహీనుని కార్యములవలె నిష్ఫలములయ్యెను.

5.42 (నలుబది రెండవ శ్లోకము)

ప్రయాసేఽపహతే తస్మిన్ దైత్యేంద్రః పరిశంకితః|

చకార తద్వధోపాయాన్ నిర్బంధేన యుధిష్ఠిర॥5809॥

ధర్మరాజా! శూలములచే పొడుచుటవలన ప్రహ్లాదుని శరీరముపై ఎట్టి గాయము కలుగకపోవుటను జూచి, హిరణ్యకశిపునకు గొప్ప సంశయము గలిగెను. అప్పుడు అతడు ప్రహ్లాదుని వధించుటకై పలు  ఉపాయములను పన్నసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

27.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

5.43 (నలుబది మూడవ శ్లోకము)

దిగ్గజైర్దందశూకైశ్చ అభిచారావపాతనైః|

మాయాభిః సన్నిరోధైశ్చ గరదానైరభోజనైః॥5810॥

5.44 (నలుబది నాలుగవ శ్లోకము)

హిమవాయ్వగ్నిసలిలైః పర్వతాక్రమణైరపి|

న శశాక యదా హంతుమపాపమసురః సుతమ్|

చింతాం దీర్ఘతమాం ప్రాప్తస్తత్కర్తుం నాభ్యపద్యత॥5811॥

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మద గజములచే త్రొక్కించెను. విషసర్పములచే కరిపించెను. కృత్య అను రాక్షసిచే బాధింపజేసెను. పర్వత శిఖరములనుండి పడద్రోయించెను. శంబరాసురుని మాయోపాయములను ప్రయోగించెను. చీకటి కొట్లలో బంధించెను. విషమును త్రాగించెను. భోజనమును లేకుండజేసెను. మంచు తిన్నెలపై నిలిపెను. తీవ్రమైన గాలులతో బాధించెను. అగ్ని కుండములలో పడద్రోయించెను. సముద్ర జలములలో ముంచెను. పర్వతముల క్రింద నలిగి పోవునట్లు    చేసెను. కానీ, ఈ ఉపాయములలో దేనిచేతను గూడ నిర్దోషియైన తన పుత్రుని చంపలేకపోయెను. అప్పుడు అతడు దీర్ఘముగా ఆలోచింపసాగెను. ప్రహ్లాదుని చంపించుటకు ఎట్టి ఉపాయమూ తోచలేదు.

5.45 (నలుబది ఐదవ శ్లోకము)

ఏష మే బహ్వసాధూక్తో వధోపాయాశ్చ నిర్మితాః|

తైస్తైర్ద్రోహైరసద్ధర్మైర్ముక్తః స్వేనైవ తేజసా॥5812॥

అతడు ఇట్లు ఆలోచింపసాగెను- 'ఇతనిని ఎన్నియో పరుషోక్తులాడితిని, చంపించుటకు పెక్కు ప్రయత్నములు చేసితిని. కాని, నేను చేసిన అపచారములు, దుష్టప్రయత్నములు, అతని తేజస్సుముందు ఏమాత్రమూ పనిచేయకుండెను.

5.46 (నలుబది ఆరవ శ్లోకము)

వర్తమానోఽవిదూరే వై బాలోఽప్యజడధీరయం|

న విస్మరతి మేఽనార్యం శునఃశేప ఇవ ప్రభుః॥5813॥

5.47 (నలుబది ఏడవ శ్లోకము)

అప్రమేయానుభావోఽయమకుతశ్చిద్భయోఽమరః|

నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా న వా॥5814॥

ఇతడు బాలుడేయైనను గొప్పతెలివి గలవాడు. నా సమీపముననే నిర్భయముగానుండెను. ఇతనిలో  ఏదో తెలియని ఒక అద్భుతశక్తి యున్నది. పూర్వము శునశ్శేపుడు తన తండ్రి చేసిన కార్యము ఫలితముగా అతనికి విరోధియయ్యెను.అట్లే ఇతడు గూడ నా దుష్కార్యములను మరచిపోడు. ఇతడు  ఎవరికి భయపడుట లేదు. ఇంతగా ప్రయత్నించినను మృతుడు కాలేదు. ఇతని శక్తి ఎంతటిదో అర్థమగుటలేదు. ఇతని యెడ శత్రుత్వము వహించుట వలన ఇతని వలననే నాకు చావు తప్పనట్లున్నది.

శునశ్శేపుని వృత్తాంతము (సంక్షిప్తముగా - పూర్తికథ నవమస్కంధమునందు ఏడవ అధ్యాయమునందు వచ్చును. ఇక్కడ కూడా ప్రత్యేక సందేశముగా నీయబడినది)

శునశ్శేపుడు అజీగర్తుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు. వరుణయాగమునందు బలియిచ్చుటకై అతని తండ్రి హరిశ్చంద్రుని పుత్రుడైన లోహితాస్యునకు అమ్మివేసెను. అప్పుడు అతని మామయైన విశ్వామిత్రుడు అతనిని రక్షించెను. అంతట అతడు తన తండ్రికి విరోధియై విశ్వామిత్రుని పక్షమున చేరెను.

5.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

ఇతి తచ్చింతయా కించిన్మ్లానశ్రియమధోముఖమ్|

శండామర్కావౌశనసౌ వివిక్త ఇతి హోచతుః॥5815॥

5.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

జితం త్వయైకేన జగత్త్రయం భ్రువోర్విజృంభణత్రస్తసమస్తధిష్ణ్యపమ్|

న తస్య చింత్యం తవ నాథ చక్ష్మహే న వై శిశూనాం గుణదోషయోః పదమ్॥5816॥

5.50 (ఏబదియవ శ్లోకము)

ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా|

బుద్ధిశ్చ పుంసో వయసార్యసేవయా యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి॥5817॥

ఇట్లు చింతించుటవలన హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. అంతట అతడు తలవంచుకొని యుండుటను శుక్రాచార్యుని కుమారులైన శండామార్కులు చూచిరి. వారు ఏకాంతముగా ఆయనతో ఇట్లు పలికిరి-"ప్రభూ! నీవు ఒక్కడవే ముల్లోకములను జయించితివి. నీవు కోపముతో బొమముడి వైచినంతనే లోకపాలురు గడగడలాడెదరు. ఈ బాలుని విషయములో నీవు ఏమాత్రము చింతింపవలదు. పిల్లల విషయములో మంచి చెడులను గూర్చి అంతగా మథనపడవలసిన పనియేలేదు. మా తండ్రియైన శుక్రాచార్యుడు ఇచటికి రానంత వరకును ఇతడు భయపడి ఎక్కడికిని పారిపోడు. కనుక ఇతని వరుణపాశముతో బంధింపుడు. వయస్సు పెరుగుచున్న కొలదియు గురువుల సేవల ప్రభావమువలన ఇతని బుద్ధి మారవచ్చును.

5.51 (ఏబది ఒకటవ శ్లోకము)

తథేతి గురుపుత్రోక్తమనుజ్ఞాయేదమబ్రవీత్|
 .
ధర్మా హ్యస్యోపదేష్టవ్యా రాజ్ఞాం యో గృహమేధినాం॥5818॥

'సరే! మంచిది!. అని పలికి హిరణ్యకశిపుడు గురుపుత్రుల సూచనను మన్నించెను. పిదప, గృహస్థులైన రాజులు పాటించునట్టి ధర్మములను ఇతనికి ఉపదేశింపుడు' అని పలికెను.

5.52 (ఏబది రెండవ శ్లోకము)

ధర్మమర్థం చ కామం చ నితరాం చానుపూర్వశః|

ప్రహ్లాదాయోచతూ రాజన్ ప్రశ్రితావనతాయ చ॥5819॥

5.53 (ఏబది మూడవ శ్లోకము)

యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితం|

న సాధు మేనే తచ్ఛిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం॥5820॥

ధర్మరాజా! అంతట పురోహితులు ప్రహ్లాదుని తీసికొని తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. అతనికి క్రమముగ ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములలో శిక్షణను ఇచ్చిరి. ప్రహ్లాదుడు అచట మిక్కిలి వినమ్రుడై సేవకునివలె ఉండసాగెను. కాని, గురువుల ఉపదేశము ప్రహ్లాదునకు నచ్చలేదు. ఏలయన,అది కేవలము ధర్మార్థకామములకు సంబంధించినది మాత్రమే అయియుండెను. ఆ విద్య రాగద్వేషాది ద్వంద్వములలో విషయభోగములకు మాత్రమే ప్రయోజనకరము.

5.54 (ఏబది నాలుగవ శ్లోకము)

యదాచార్యః పరావృత్తో గృహమేధీయకర్మసు|

వయస్యైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణైః|

5.55 (ఏబది ఐదవ శ్లోకము)

అథ తాన్ శ్లక్ష్ణయా వాచా ప్రత్యాహూయ మహాబుధః|

ఉవాచ విద్వాంస్తన్నిష్ఠాం కృపయా ప్రహసన్నివ॥5822॥

ఒకనాడు గురువు ఇంటి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళియుండెను. అవకాశము దొరికినందులకు సమవయస్కులైన బాలురు తమతో  ఆడుకొనుటకు పిలిచిరి. ప్రహ్లాదుడు పరమ జ్ఞాని. తనయెడ వారికిగల ప్రేమనుజూచి అతడు మధుర వచనములతో వారిని తన యొద్దకు పిలిచెను. వెంటనే ప్రేమపూర్వకముగా వారికి అతడు ఉపదేశింప సాగెను.

5.56 (ఏబది ఆరవ శ్లోకము)

తే తు తద్గౌరవాత్సర్వే త్యక్తక్రీడాపరిచ్ఛదాః|

బాలా న దూషితధియో ద్వంద్వారామేరితేహితైః॥5823॥
5.57 (ఏబది ఆరవ శ్లోకము)

పర్యుపాసత రాజేంద్ర తన్న్యస్తహృదయేక్షణాః|

తానాహ కరుణో మైత్రో మహాభాగవతోఽసురః॥5824॥