Sunday, 6 January 2019

462--549

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(08_01_2019)
హరిః ಓమ్

49 వ. శ్లోకము
సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

462) జితక్రోధః - ఓం జితక్రోధాయనమః

కోపమును జయించిన వాడు అని అర్థము. " క్రోధమూలాని
పాపాని". మానవుడాచరింౘు సమస్తపాపములకునూ " క్రోధమే" మూలకారణము
క్రోధము నరకద్వారముగా గీతలో చెప్పబడింది (గీ 16_21).

రజోగుణము వలన కలిగే కోపము ఆధ్యాత్మిక సాధనకు
పరమ శత్రువు. కావున దానిని జయింపుమని గీతాశాస్త్ర ప్రబోధము (గీ3_37_4)
ఈ సందర్భంగా క్రోధమనగా కోపమొక్కటే కాదనియూ దాని
సహచరులగు కామ, లోభ, మద, మాత్సర్యములు (అరిషడ్వర్గములు) అనియు,
ఈ దుర్గుణములు లేనివాడే శ్రీమన్నారాయణుడు. కాన "జితక్రోధః" అను దివ్య
నామముచే సంకీర్తనీయుడు అగుౘున్నాడు.
సాధకులు కోపమును జయింపవలెను. సాత్వికాహార

విహారములవలననూ, సత్సాంగత్యము వలననూ, సదా హరిచింతనము వలననూ ఇది సాధ్యమగును. ఈ స్తవరాజము అనుష్ఠాన వేదాంతమునే తెలుపుౘున్నదని పాఠకులు గమనింౘగలరు.

462) వీరబాహుః- ఓం వీరబాహవేనమః

శక్తివంతములయిన బాహువులు గలవాడని యర్థము.
తన అవతారముల యందు దేవవిరోధులగు రాక్షసులమూకలను సంహరించిన
కారణమున వీరబాహుడని ప్రస్తుతింపబడెను.
వీరబాహుడగు భగవానుని స్మరణమాత్రము చేతనే భక్తుల
మనస్సు లలోనున్న రాక్షసులందరూ (రాక్షసగుణములు) నశింౘు నని పాఠకులు
గమనింపగలరు.

463) విదారణః - ఓం విదారణాయనమః

చీల్చి ౘంపివేయువాడని ఈ నామముయొక్క సామాన్యార్థము.  నృసింహావతారమున శ్రీహరి హిరణ్యకశిపుని తన గోళ్ళతో
చీల్చి సంహరించుటచేత "విదారణః" అని కీర్తిగాంచెను. హిరణ్యాక్షుని సంహరించి
న వరాహావతారమునుకూడా ఈనామము సూచింౘును.

ప్రహ్లాదునివలె భక్తితో ప్రార్థించినచో శ్రీహరి నీలోఉన్న
హిరణ్యకశిపుని (అనగా నీలోఉన్న దురహంకార రాక్షసిని) చీల్చి చెండ చెండాడు
నని ఆంతరంగికార్థమును సాధకులు గుర్తింపగలరు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(09_01_2019)

హరిః ಓమ్
50 వ. శ్లోకము

స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును

465) స్వాపనః- ఓం స్వాపనాయనమః
స్వాపనుడనగా నిద్రపుచ్చువాడని సామాన్యార్థము. భగవానుడు
తన మాయచేత సమస్తలోకములను మోహితులగావింౘును.(నిద్రపుచ్చునని భావము). ఇంద్రాది దేవతలే ఆయనమాయకు వశులుగాగా, ఇతరులగూర్చి
చెప్పనేల ?. మాయను జయింౘ వలెనన్న మాయాధిపతియగు మాధవునే
ఆశ్రయింౘవలెనని భావము. (గీత 7_14).

466) స్వవశః- ఓం స్వవశాయనమః

అనంతకోటి విశ్వములు, విశ్వేశులు, లోకులు, సకల భూత జాలములు ఆ జగన్నాటక సూత్రదారి వశమునందే క్రీడింౘుౘుండును. కావున
"స్వవశః" అను మహత్తర నామముచే మాననీయుడగుౘున్నాడు.

467) వ్యాపీ- ఓం వ్యాపినేనమః

కార్యకారణ రూపమున అంతటనూ వ్యాపింౘి విస్తరించి, విరాజిల్లి న వాడగుటచేత పరమాత్మ. "వ్యాపీ". యను భవ్యనామమున భజనీయుడు. సాధకులు "విశ్వసేవయే విశ్వనాథుని సేవ " యని సర్వభూతహిత
రతులై వర్తింౘవలెనని భావము.

468) నైకాత్మా- ఓం నైకాత్మనేనమః

అనేకరూపములతో విస్తరించి నవాడని భావము. తాను ఒక్కడేయయ్యును, నామరూపాత్మక ప్రపంచమునంతటనూ వివిధ నామ
రూపములతో విరాజిల్లుౘున్న వాడగుటచేత " నైకరూపః" అని ప్రస్తుతింపబడెను.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(10_01_2019)
హరిః ಓమ్
50 వ. శ్లోకము
స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును

469) నైకకర్మకృత్ - ఓం నైకకర్మకృతేనమః

విశ్వమునందుగల సమస్తకార్యకలాపములను, సృష్టిస్థితి, లయములను మఱొక్కరి సాహాయ్యము గానీ సహకారముగానీలేక తానొక్కడే
ౘక్కగా నిర్వహింౘు మహాశక్తి సంపన్నుడు , సర్వకార్యదక్షుడు ఈశ్వరుడే
యగుటచేత "నైకకర్మకృత్" అను శబ్దవాచ్యుడగుౘున్నాడు.

470) వత్సరః - ఓంవత్సరాయనమః

సకలజీవులయొక్క నివాసమునకు ఆధారమైనవాడు లేక నిలయమైన వాడగుటచేత "వత్సరః" అని పిలవబడెను. సర్వభూతములును
ఆయనయందే వసింౘుటచేతను, ఆయన యే సమస్త భూతములయందును
వసింౘుటచేతను "వత్సరః" అని ప్రసిద్ధిగాంచెను..‌‌‌‍‍

471) వత్సలః - ఓం వత్సలాయనమః

వాత్సల్యస్వరూపుడని శబ్దార్థము. తల్లికి తమ బిడ్డలపై ఎంత వాత్సల్యముండునో భగవంతునికి తన భక్తులపై అంతకంటెను ఎక్కువ వాత్సల్యముండునని భావము.కావుననే ఆయన భక్తవత్సలుడని ప్రసిద్ధుడాయెను

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(11_01_2019)

హరిః ಓమ్

50 వ. శ్లోకము

స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వతసరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః।।

ఈ శ్లోకము పది హరినామకుసుమములతోపరిమళింౘును.

472) వత్సీ - ఓం వత్సినేనమః
వత్సములను పాలింౘు వాడు గనుక "వత్సీ" అనబడును. విశ్వమందలి
జనులందరును ఆయనకు వత్సములు (సంతానములు) వంటివారే. భగవానుడు
జగత్పిత , జగన్మాత " త్వమేవ మాతాచ- పితాత్వమేవ". అని భక్తులు ఆ వాత్సల్యరూపుని ప్రార్థింతురు. కాన " వత్సీ" అని ప్రసిద్ధి గాంచెను.

473) రత్నగర్భః - ఓం రత్నగర్భాయనమః

"రత్నరాశులు తనయందు కలిగియున్న కారణమువలన సముద్రమునకు "రత్నగర్భ" యనిపేరు. సముద్రము భగవంతుని విభూతిగదా!
" సరసామస్మి సాగరః " అని గీతావాక్యము (10_24).

రత్నగర్భయగు మహాసాగరములో ప్రవేశించి శ్రద్ధ గా అన్వేషింౘువారికి
వలువైన రత్నములు లభింౘునట్లు ఆధ్యాత్మిక మహాసాగరమున ప్రవేశించి
భక్తిశ్రద్ధలతో అన్వేషణము చేయు తీవ్రసాధకులకు రత్నములకంటెనూ మిక్కిలి విలువగల శాంత్యానందసౌఖ్యములు లభింౘునని భావార్థము.

474) ధనేశ్వరః - ఓంధనేశ్వరాయనమః

ధనరాశులకు అధిపతియని అర్థము. శ్రీహరి లక్ష్మీపతియగుటచేత
ధనకనక వస్తు వాహనాదులకు లోటులేదుకదా, తన్నాశ్రయించిన భక్తులకు వారి
అర్హతలననుసరించి ధనధాన్యములను, పాడిపంటలను, సుఖభోగముల నిచ్చు
వాడు గనుక "ధనేశ్వరః" అనబడెను.
వైరాగ్యసంపన్నులగు ముముక్షువులకు మోక్షధనమును ప్రసాదింౘు వాడును ఆయనయే గదా!

ఈ స్తవరాజమును శ్రద్ధగా పఠనశ్రవణములు గావింౘువారికి
సర్వధనములును సిద్ధింౘునని భావము. "అర్థార్థీ చార్థమాప్నుయాత్" అని
తెలుపబడెనుగదా!

==((**))==


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(13_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

475) ధర్మగుప్ - ఓం ధర్మగుపేనమః

ధర్మ రక్షకుడు, ధర్మస్వరూపుడు అగుటచేత "ధర్మగుప్". అని పేరు
వహించెను. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (4_8). అను
గీతావాక్యము స్మరణీయము.

476) ధర్మకృత్.- ఓం ధర్మకృతేనమః

ధర్మానుష్ఠానము చేయువాడు. ధర్మాధర్మములతో తనకు నిమిత్తము లేకున్ననూ ధర్మసంస్థాపనార్థముగా నవతరించిన భగవానుడు తాను స్వయముగా ధర్మమును అనుష్ఠింౘుౘు లోకమునకు తాను ఆదర్శమూర్తియై
యుండునుగనుక "ధర్మకృత్" అనబడును.

477) ధర్మీ- ఓం ధర్మిణేనమః

మూర్తీభవించిన ధర్మమే భగవానుడగుటచేత "ధర్మీ " యనబడును. " రామో విగ్రహవాన్ ధర్మః " అను రామాయణ వచనము
స్మరణీయము.
475,476,477. నామములు ధర్మ ప్రాశస్త్యమును తెలుపు
నామము లైనందున సాధకులు నిత్య జీవితమున ధర్మానుష్ఠానపరులు
గావలయునని సూచన.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(15_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

478) సత్ - ఓం సతేనమః
సకల భూతములయందునూ శాశ్వతమై, స్థిరమై, నిత్యమై యుండు
పరబ్రహ్మమే "సత్" అను శబ్దముచే స్తవము చేయబడును.
479) అసత్- ఓం అసతేనమః

నామరూపకాత్మకమై నశింౘు స్వభావముగల ప్రపంచ మంతయును "అసత్". అనబడును. "అసత్" దీనినే అపరమ్ అనియును కూడా
వేదాంతశాస్త్రము చెప్పును. "క్షరము - అక్షరము" " పర - అపర "‌ ఇవి రెండును
భగవత్స్వరూపములే యని గీతావాక్యము (7_5).
కాన ఇచ్చట పరమాత్మ "అసత్" నామవాచ్యుడగును.

480) క్షరమ్ - ఓం క్షరాయనమః
" నశింౘు నది". అని ఈశబ్దమునకర్థము. కానవచ్చునదంతయూ
నశింౘునదే యగును. సాగరమునుండి తరంగములు పుట్టి, నాట్యమాడి, తిరిగి
సాగరమందే లీనమగు నట్లు, విశ్వమంతయు ను పరమాత్మ యందే పుట్టి ఆయన
యందే లయముచెందును. నశింౘు జగముగూడా భగవత్స్వరూపమే యగుటచేత " క్షరమ్" అను శబ్దవాచ్యుడగుౘున్నాడు.

481) అక్షరమ్ - ఓం అక్షరాయనమః
నాశనము లేని వాడగుటచేత పరమాత్మ "అకమానసిక అను దివ్యనామ
వాచ్యుడగును.

482) అవిజ్ఞాతా - ఓం అవిజ్ఞాత్రేనమః

" విజ్ఞాత" కానివాడు " అవిజ్ఞాత " అనబడును. జీవుడు వాస్తవము

గా పరమాత్మయే. అయిననూ శరీరమునందు బంధింపబడి మాలిన్యములగు మానసిక సంస్కారములతో కప్పబడి యున్న కారణమున " విజ్ఞాత " అని చెప్పబడును. పరమాత్మ ఇట్టి వాడు కాడు. బంధరహితుడు, మాలిన్యరహితుడు , నిర్లిప్తుడు, నిస్సంగుడు అగుటచేత " అవిజ్ఞాతా" అను ప్రసిద్ధనామమున కీర్తనీయుడగును.

సంగరరహితముగా జీవింౘుమని ఈ నామము యొక్క బోధ.
--((**))--
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(16_01_2019)
హరిః ಓమ్
51 వ. శ్లోకము

ధర్మ గుబ్ధర్మకృ ద్ధర్మీ సదసత్ష్క. రమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాశు ర్విధాతా కృతలక్షణః ।।
ఈ మంగళశ్లోకము ఏకాదశ నామపుష్ప పరిశోభితము.

483) సహస్రాంశుః - ఓం సహస్రాంశవేనమః
వేలకొలది కిరణములతో కూడియున్న వాడని యర్థము. సూర్యుడు తన అనంతకోటి కిరణములతో విలసిల్లి లోకమునంతనూ చైతన్య
వంతము గావింౘుౘున్నాడు. " యదాదిత్య గతం తేజః " (గీత 15_10) సూర్యుని
యందుగల తేజస్సు అంతయును నాదే. అని గీతాచార్యుని వచనము గాన
భగవానుడు " సహస్రాంశుః". అని ప్రసిద్దుడగుౘున్నాడు.

484) విధాతా- ఓం విధాత్రేనమః

సర్వమును ధరింౘు వాడు, సర్వాధారమూర్తి, శేషుడు ,
దిగ్గజములు, పర్వతములు, వీనినిగూడా ధరింౘు వాడు నారాయణుడే
యగుటచేత "విధాతా" అను దివ్యనామ వాచ్యుడగును.

485) కృతలక్షణః- ఓం కృతలక్షణాయనమః

1) అనేక దివ్యలక్షణములతో కూడియున్న వాడగుటచేత "కృతలక్షణః" అని
పిలువబడును.

2) ఐశ్వర్య, ధర్మ, యశో, వీర్య, జ్ఞాన, వైరాగ్యము లనబడు షడ్గుణైశ్వర్య
సంపన్నుడగచేత కృతలక్షణుడాయెను.

3) శ్రీవత్సలాంఛనము కలిగియున్న కారణమున శ్రీహరి కృతలక్షణుడాయెను.

4) "లక్షణముల" ను శబ్దమునకు వేదాంతశాస్త్రము లనియును అర్థము
గలదు " వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వమ్ జనార్దనాత్ " అను
వచనాను సారముగా సర్వ వేద శాస్త్ర ములును భగవానుడి నుండియే
కలిగిన వనుటచేత "కృతలక్షణః" అని దివ్యగానము చేయబడుౘున్నాడు.

--((**))--



విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(17_01_2019)

హరిః ಓమ్

52 వ. శ్లోకము

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః ।।

486) గభస్తినేమిః- ఓం గభస్తినేమయేనమః
కిరణచక్రము యొక్క. మధ్యభాగమునందు సూర్యరూపమున
విలసిల్లి భాసిల్లువాడు ఆ పరమాత్మయే గదా, కాన "గభస్తినేమిః" అనబడెను.

487). సత్త్వస్థః- ఓం సత్త్వస్థాయనమః

సత్త్వగుణము నందు ప్రతిష్ఠితుడై యున్నవాడని భావము. "సత్త్వాత్ సంజాయతే జ్ఞానమ్" సత్త్వమువలన జ్ఞానము కలుగును (గీత14_15)
దేవుడు జ్ఞానస్వరూపుడని తాత్పర్యము.

మరియొక వివరణము: సత్త్వేషు- సకలభూతములందును, స్థః ఉన్నవాడు అగుటచేత. సర్వభూతాంతరవాసి భగవానుడే గనుక సత్త్వస్థః అని కీర్తింపబడును. సత్త్వగుణమును పెంపొందింౘు కొనవలెను.
శ్రీహరిని అన్నిభూతములలో నున్నవానినిగా ధ్యానింౘవలెను
అని దీనిచే గ్రహింౘవలెను.
488) సింహః

ఓం సింహాయనమః
సింహగర్జనమున అరణ్యమునందలి సకల జంతువులును
పరుగెత్తునట్లు సాధకుల మనఃక్షేత్రములయందు గల సకల దుర్గుణములను
జంతుసంతానములు శ్రీహరి నామ గర్జనమున నశింౘునని భావము. 200 వ
నామముయొక్క వివరణమును గమనింప ప్రార్థన. ఈనామము రెండవ పర్యాయముగా ఇక్కడ గానము చేయబడినది.

200వ. నామము

200) సింహః

ఓం సింహాయనమః

" హింసింౘువాడు " అని ఈ శబ్దముయొక్క సామాన్యార్థము.

1) " మృగాణాంచ మృగేంద్రో√హం ". మృగములలో సింహమును నేనైయున్నాను‌. అని భగవద్వాక్యము.(గీత 10_30). కనుక. భగవానుడు
" సింహః" అని పిలువబడెను

2). దుర్మార్గులను, అవినీతిపరులను హింసిౘువాడు గనుక
". సింహః ". అని పిలువబడుౘున్నాడు. " వినాశాయచ దుష్కృతామ్ ". అని
గీతావాక్యము, ( 4_8 )

3) " సింహః ". అను శబ్దము భగవానుని సూచింౘును గనుక
" సింహః " అను దివ్యనామా‍‌చ్యుడ.
4) సింహము గర్జించినంత మాత్రము చేతనే అరణ్యములో
నున్న మృగములన్నియు పారిపోవునట్లు శక్తివంతమగు భగవన్నామము యొక్క
గర్జనము వలన( అనగా నామ జప తపః కీర్తన ధ్యానాదుల వలన) సాధకుల యొక్క మనస్సు లను భయంకరారణ్యములయందు దాగి యున్న మృగము
లన్నియును (అనగా కామ క్రోధాది దుష్టగుణములు ) నశించిపోవునని ఈ శబ్దము
యొక్క గ్రాహ్యార్థముగా భావింౘ నగును. కావున భగవానుడు " సింహః ". అని
సంకీర్తనీయుడు.

--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(19_01_2019)

హరిః ಓమ్
52 వ. శ్లోకము

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః ।।

ఈ దివ్యశ్లోకము అష్టవిధ. దివ్యనామకుసుమపరాగ పరిమిళితము.
492) దేవేశః - ఓం దేవేశాయనమః

దేవ+ఈశః = దేవేశః దేవతల కందఱకును ప్రభువైనవాడు.
దేవతలకు శక్తిని ప్రసాదింౘువాడు పరమాత్మయే యగుటచేత "దేవేశః" అనబడును.

493) దేవభృద్గురుః - ఓం దేవభృద్గురవేనమః

దేవభృత్ అనగా దేవతలకందఱకును అధిపతియైనవాడు
ఇంద్రుడని అర్థమగును. ఇంద్రునకు కూడా గురువగుటచేత పరమాత్మ "దేవభృద్గురుః " అనబడెను. దేవశబ్దము ఇంద్రియములను సూచింౘును.
దేవేంద్రుడు అనగా ఇంద్రియములకు రాజు మనస్సు అని భావము. మనస్సునకు కూడా అధిపతి "ఆత్మ". యగుౘున్నది. కనుక పరమాత్మ " దేవభృద్గురుః" అను దివ్యనామమున స్తవనీయుడగుౘున్నాడు.

శరీరము జడమైనది. శరీరముకంటే ఇంద్రియములు శక్తివంతములు. ఇంద్రియములకంటే మనస్సు, మనస్సు కంటే ఆత్మయును శక్తివంతములు. కనుక ఆత్మజ్ఞానము బొందినపుడే సర్వేంద్రియ నిగ్రహము సాధ్యమగును. (గీతఅ 3_శ్లో42) 49౦ వ నామమునుండి దేవశ్దము ప్రతి నామము తోనూ సంబంధింపబడి యుండుట గమనార్హము. దేవశబ్దము నకు ప్రకాశింౘు వాడు, జయింౘువాడు, క్రీడింౘువాడు, గమనింౘువాడు, స్తవము చేయబడువాడు అను అర్థములను గ్రహింపవలెను.

--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(20_01_2019)

హరిః ಓమ్
53 వ. శ్లోకము
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।
494) ఉత్తరః - ఓం ఉత్తరాయనమః
సర్వశ్రేష్ఠుడని ఈనామముయొక్క అర్థము. పరమాత్మ అందరి
కంటెను శ్రేష్ఠుడగుట చేత "ఉత్తరః " అను నామమున విఖ్యాతుడగునని
మరియొక అర్థము. సంసార సాగరమునుండి జీవులనుద్దరింౘువాడు గాన
శ్రీహరి "ఉత్తరః" అని ప్రఖ్యాతి గాంచెను. "తేషాంమహంసముద్దర్తా మృత్యు
సంసార సాగరాత్". నా భక్తులను మృత్యురూప సంసార సాగరము నుండి
ఉద్ధరింతునని భగవద్వాక్యము (గీత 12_7).
నామ సందేశము : సంసార తాపత్రయములు నశింౘుట కు ఈశ్వర
చింతనమే సాధనము.
495) గోపతిః - ఓం గోపతయేనమః
ఈనామమునకు గోవులకు అధిపతి లేక గోపాలుడని అర్థము.
1) భగవానుడు కృష్ణావతారమెత్తి నపుడు గోవులమందలను పాలించినాడు గనుక "గోపతి" అనబడెను.
2) గోవులనగా పశువులు జీవులందరునూ పశువులేగదా! పశువులకు
పతి, జీవులందరకును పతియగుటచేత శ్రీహరి "గోపతి" యనబడును.
3) "గో " అనగా భూమి యను అర్థము గలదు. కావున భూమికి పతి
యగుటచేత " గోపతి " యగును.
4) "గో" అనగా వాక్కు, వాక్కునకు పతి, అనగా విద్యాధిష్ఠానమూర్తి
యగుటచేత "గోపతి " యగును.
5) "గౌ" అనగా వేదము అనియునూ అర్థమగును. ఆయన వేదవిదుడు.
వేదకర్తయగుటచేత "గోపతి" యగును. గోసేవ భగవత్ర్రీతికరమగునని గ్రహింౘ
వలయును.
496) గోప్తా - ఓం గోప్త్రేనమః
సంరక్షకుడని శబ్దార్థము. సకల జీవులను కాపాడువాడు, పోషింౘువాడు

రక్షింౘువాడును శ్రీహరియే యగుటచేత "గోప్తా". అనబడుౘున్నాడు.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)
(06_01_2019)
హరిః ಓమ్
49 వ. శ్లోకము

సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

458) సుఘోషః - ఓం సుఘోషాయనమః

1) సుందరమగు మధుర నాదము కలవాడు గాన " సుఘోషః " అనబడును.

2) మనోహరమగు వేదనాదము ఇతనినుండియే వెలువడినదగుటచేత
" సుఘోషః" అనబడెను.

3) తన దివ్యశంఖనాదము చేతనే దేవవిరోధులగు రాక్షసులను సంహరించిన
వాడగుటచేత "సుఘోషః" అనబడెను. పరమాత్మ నామగానముచేత దుష్ట శక్తులు నశింౘు ను. పుణ్యశక్తులు వికసింౘును అని తాత్పర్యము.

459) సుఖదః - ఓం సుఖదాయనమః

"ద" యను అక్షరము రెండు భావములనిచ్చునది యని లోగడ
వివరింపబడినదికదా ! "ద= ఇచ్చువాడు, "ద" = నాశనముచేయువాడు అను 
రెండర్థములను తెల్పును.

"సుఖ + దః". తన భక్తులకు సుఖమునిచ్చువాడని భావము.
మఱియును సుఖ+దః దుర్మార్గులకు సుఖశాంతులను నశింపజేయువాడు
అని భావము. మఱియును మోక్షకాముకులై తన్నారాధింౘు ముముక్షువులకు
ప్రాపంచిక భోగములు ప్రతిబంధకములు గనుక వానిని నాశనముచేసి వైరాగ్యమును కల్గించి మోక్షసుఖమును ప్రసాదింౘు వాడు గావున "సుఖదః" అని
కీర్తనీయుడగుౘున్నాడు.

460) సుహృత్ - ఓంసుహృదేనమః

ప్రత్యుపకారమును కాంక్షింపక పరులకుపకారమును చేయువానికి " సుహృత్" అనిపేరు. భగవానుడు కరుణాసాగరుడు, ప్రేమాంబుధియు నగుటచేత భక్తులకు తనకెట్టి ప్రతిఫలాపేక్షయు లేకయే వరములను , సుఖములను ప్రసాదింౘును.
వర్షింౘుట యే మేఘములకు సహజమగునట్లు , సువాసనలు వెదజల్లడం పూవులకు సహజమగునట్లు, కాంతినిచ్చుటయే సూర్యునకు సహజలక్షణము అగునట్లు భక్తులకభీష్టము లిచ్చుటయే శ్రీపతికి సహజలక్షణము. కాన " సుహృత్" అను భవ్యనామమున భజనీయుడగు ౘున్నాడు . నిర్హేతుక జాయమాన కరుణా కటాక్ష నిధియే భగవానుడు.

ప్రతిఫలాపేక్షలేక సేవా ధర్మమును బూని పరులను సేవింపుము. ఈశ్వరారాధనయే యిదియని ఈనామము యొక్క సాధనా ప్రబోధము.
--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(07_01_2019)
హరిః ಓమ్

49 వ. శ్లోకము

సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః ।।

ఈ శ్లోకము దశనామ పుష్పవిరాజితము.

461) మనోహరః - ఓం మనోహరాయనమః

మనస్సును హరింౘు (దొంగలింౘు) వాడు కనుక భగవానుడు మనోహరుడు అగును. శ్రీకృష్ణుడు గోపికా చిత్తచోరుడు, నవనీతచోరుడు అని భాగవతములో వర్ణింపబడెను. గోవిందుడు దొంగలింౘునవి ధనకనక వస్తువాహనములు కావు. భక్తుల మనస్సులనే హరింౘును. మనస్సు అన గా మలినములగు సాంసారిక వాంఛలు, కోరికలు, మమకారాహంకారములు, రాగద్వేషములు మున్నగునవి. వీనిని గోపాలుడు హరింౘును.
మనస్సు నశించినపుడే మానవుడు మాధవుడగును.

పరమశివునకు అభిషేకము చేయునపుడు స్తేనానాం పతయేనమః
తస్కరాణాం పతయే నమోనమః (అనగా ఓ దొంగలనాయకుడా! నీకు నమస్కారము, ఓ చోరశిఖామణీ నీకు వందనము.) అని నమకములోని మంత్రముల భావమును గ్రహింపుడు. పరమశివుడు హరింౘునది వాసనలతో కూడిన మనస్సు, మోక్షము కావలయునన్నచో " మయ్యేవమన ఆధత్స్వ" 
నీ మనస్సును నాయందుంౘుము (గీత 12_8) మయ్యాసక్తమనాః (7_1)
నాయందాసక్తిగల మనస్సు గలవాడవుగమ్ము, మన్మనాభవ (18_65) నీ మనస్సు నాకిమ్ము .
 అని గీతాచార్యుడు వచింౘును. శ్రీకృష్ణుడు గోపకన్యల చీరలను దొంగలించిన కథాఘట్టము లోని లాక్షణికార్థము, వారి మనస్సు లలోని అహంకార, మమకార, మాలిన్యములను హరింౘు టయే యని అర్థము కదా, కావున "మనోహరః" అను మంగళనామముతో మాననీయుడగు ౘున్నాడు.

మనస్సును దుర్విషయములనుండి మరల్పుము. చిత్తమును భగవత్పరము చేయుము అని దీని ప్రబోధము.


--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(21_01_2019)

హరిః ಓమ్
53 వ. శ్లోకము
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।
ఈ మధురశ్లోకము నవవిధ మధుర నామములతో మాధుర్యవంత
మగుౘున్నది.
497) జ్ఞానగమ్యః
ఓం జ్ఞానగమ్యాయనమః
పరమాత్మ జ్ఞానమువలన మాత్రమే పొందబడువాడగుటచేత
"జ్ఞానగమ్యః" అని పిలువబడును. "జ్ఞానాదేవతు కైవల్యం" జ్ఞానము వలననే
కైవల్యప్రాప్తియని శాస్త్రవాక్యము. కర్మలకంటే జ్ఞానము గొప్పది కనుక దానిని
సాధన చేయుము అని నామ సందేశము.
498) పురాతనః
ఓం పురాతనాయనమః
పూర్వమునుండియే యున్నవాడని యర్థము. పరమాత్మ సనాతనుడు, కాలాతీతుడు, పుట్టువులేనివాడు గాన "పురాతనః" అనబడెను.
499) శరీరభూతభృత్
ఓం శరీరభూతభృతేనమః
శరీర నిర్మాణమును చేయునట్టియును, శరీర పోషణము గావింౘునట్టియును అగు పంచభూతములకును , శక్తిని ప్రసాదింౘువాడు 
పరమాత్మ యగుటచేత " శరీరభూతభృత్" అని ప్రసిద్దుడగుౘున్నాడు.
ఈ దేహ నిర్మాత భగవానుడే యని తెలిసికొని ఆయనను
సేవింపుము.
500) భోక్తా
ఓంభోక్త్రేనమః
ఈనామముయొక్క అర్థము 1) అనుభవింౘువాడు
2) పాలనచేయువాడు.
మన శరీరమునందున్న జీవుడు వాస్తవముగా పరమాత్మయే. పరమాత్మ నిస్సంగుడు, నిర్లిప్తుడు, కర్తయును భోక్తయును కాదు. కానీ జీవుడు
శరీరబద్దుడై, మాయావరణకు లోనై , తానేకర్తనని, తానేకర్మఫలములకు భోక్త
ననియును అజ్ఞానవశమున భావింౘుౘున్నందున " భోక్తా " అను నామమున
కీర్తనీయుడగుౘున్నాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(22_01_2019)
హరిః ಓమ్
53 వ. శ్లోకము

ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః।
శరీరభూత భృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ।।

ఈ మధురశ్లోకము నవవిధ మధుర నామములతో మాధుర్యవంత మగుౘున్నది.

501) కపీంద్రః - ఓం కపీంద్రాయనమః

కపి+ఇంద్రః = కపీంద్రః "కపి" అనగా వరాహము అని అర్థము కపీంద్రుడు అనగా ఆదివరాహమూర్తి. జలమునుండి భూమినుద్దరించిన వరాహావతారమును సూచింౘునామమిది. "కపి". అను నామమునకు "వానరము". అను అర్థముగలదు. "కపీంద్రః" అనగా వానరములకెల్లను ప్రభువైన శ్రీరామచంద్రుడు అని అర్థము. రామావతారమును తెలుపుౘున్న
దివ్యనామమిది. భక్తులకు అవతారములు నిరంతరమును పూజనీయములే అని గ్రాహ్యము.

502) భూరిదక్షిణః - ఓం భూరిదక్షిణాయనమః

విశేషముగా దానములు, దక్షిణలు ప్రసాదింౘు వాడని ఈనామముయొక్క సామాన్య అర్థము. మానవుడు చేయుౘుండు యజ్ఞయాగ వ్రతాది సకల పుణ్యకర్మలకును తగినరీతిగా భగవానుడు తగు ఫలములను ప్రసాదింౘుౘుండును. ఆయన కర్మఫలదాతయునగుటచేత "భూరిదక్షిణః" అని ఖ్యాతి గాంచెను. మానవుడు నిరంతరమును పుణ్యకర్మలనే చేయవలెను. వాని వలననే సకల సుఖములును కలుగును. అని గమనింపవలెను.
--((**))--


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(23_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

503) సోమపః
ఓం సోమపాయనమః

యజ్ఞములయందు సోమరసపానము చేయువాడని ఈ నామముయొక్క
భావము. సారాంశమేమనగా, భగవానుడు యజ్ఞేశ్వరుడు, యజ్ఞభోక్త, మానవు
లాచరింౘు సమస్త పుణ్యకార్యములందును (అనగా వ్రతములు, ఆరాధనలు,
యజ్ఞములు మున్నగునవి) భక్తితో సమర్పింౘు పదార్థములను ప్రీతితో స్వీకరింౘువాడని భావార్థమగును. కావున" సోమపః". అను దివ్యనామ వాచ్యుడగుౘున్నాడు.

సమస్త పుణ్యకర్మలు ను అత్యంత భక్తిప్రపత్తులతో నాచరింపుమని
భావము.

504) అమృతపః
ఓం అమృతపాయనమః

అమృతపానము చేయువాడు, శ్రీహరి అమృతస్వరూపుడు , తన
స్వరూపామృతమునే సదాపానము చేయువాడగుటచేత "అమృతపః" అనబడెను.

దేవదానవులు క్షీరసాగర మథనమునందు బుట్టిన అమృతము శ్రీహరి మోహినీరూపమును ధరించి దేవతలకే అమృతము పంచియిచ్చి తానుకూడా
పావము చేసెనని పురాణగాథ స్మరణీయము.

భగవంతుని శరణాగతిని బొందినవారికి అమృతత్వము సిద్ధిమౘునని గమనింౘవలెను.

5౦5) సోమః
ఓం సోమాయనమః

సోముడనగా చంద్రుడు. " నేను రసస్వరూపుడగు సోముడనై
(చంద్రుడనై) సస్యములను ౘక్కగా ఫలింపజేయుౘున్నానని" భగవద్వాక్యము
(గీత 15_13) మఱియొక అర్థము. "ఉమ" అనగా పార్వతీదేవి. స+ఉమ=సోమ
"ఉమ" తో కూడియున్న వాడగుటచేత ఈశ్వరుడు "సోమః " అనబడుౘున్నాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(24_01_2019)
హరిః ಓమ్
54 వ. శ్లోకము
సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।
ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.
506) పురుజిత్
ఓం పురుజితేనమః
"పురు". శబ్దమునకు శత్రువు అని అర్థము. "జిత్". అనగా జయించిన వాడు . దేవ విరోధులగు రాక్షసగణములను తానొక్కడే జయించిన వాడగుటచేత
శ్రీహరి "పురుజిత్" అనబడుౘున్నాడు.
ఆధ్యాత్మిక సాధనలు చేయుౘున్న తన భక్తుల మనస్సులలో తాండవింౘుౘున్న రాక్షసులను (అనగా కామాది రాక్షస వికారములను) నాశనము
చేసి వారికి శాంత్యానందసౌఖ్యములు నిచ్చువాడు శ్రీపతియే గావున "పురుజిత్"
నామమున భజనీయుడు.
507) పురుసత్తమః
ఓం పురుసత్తమాయనమః
విశ్వరూపుడగుటవలన "పురుః " అనబడెను . సర్వశ్రేష్ఠుడగుటచే
"సత్తమః" అనబడెను. శ్రేష్ఠుడగు విశ్వరూపుడని భావార్థము. మఱియొక అర్థము
"పురులు " అనగా గొప్పవారు, సత్తమణ అనగా శ్రేష్ఠుడని అర్థము. గొప్పవారిలో
కెల్లా శ్రేష్ఠుడని భావార్థము.
508) వినయః
ఓమ వినయాయనమః
వినయము దేవతా లక్షణము. శ్రీరామచంద్రుడు పెద్దలయెడల
గురువులయెడల వినయవిధేయతలతో నున్న విషయము రామాయణమునందు
వర్ణింపబడియున్నది. కృష్ణావతారమునగూడా పెద్దలయెడల బ్రాహ్మణులయెడల
ఆ స్వామి ౘూపిన వినయవిధేయతలు ప్రసిద్ధములు కనుక "వినయః" అను దివ్యనామము చేత ప్రసిద్ధుడగును.
మఱియొక అర్థము
నయవర్థనము లేనివారిని(దుర్మార్గులను ) దండింౘువాడని
శ్రీహరి "వి - నయః" అని కీర్తింపబడును.
తన్నాశ్రయించిన ఆధ్యాత్మిక సాధకులను నయమార్గమున
(ధర్మమార్గమున నడుపువాడు గాన " వి_నయః". అని స్తవనీయుడగును.


( సంగ్రహ తాత్పర్య వివరణము)

(25_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

509) జయః - ఓం జయాయనమః

"జయోస్మి" నేను జయశీలుడను అని భగవద్వాక్యము స్మరణీయము.
(గీ 10_36) సకలపుణ్యకార్యములందును జయమును ప్రసాదింౘువాడు ఈశ్వరుడే.

ఆధ్యాత్మిక సాధకుల చిత్తములలోని మాలిన్యమును హరించి వారికి సాధనలలో విజయమును చేకూర్చినవాడు ఈశ్వరుడే "వాసుదేవపరాయణునకు అపజయముగానీ, పరాభవముగానీ లేదని " ఉత్తర పీఠికయందు పాఠకులు ౘూడగలరు.

510) సత్యసన్ధః - ఓం సత్యసన్ధాయనమః

సత్యస్వరూపుడు భగవానుడు. సత్యసంకల్పుడని శ్రుతి గానము
చేయును. అవతారములయందు ఆయన పలికినపలుకులు , వాగ్దానములు, క్రియలు అన్నియునూ సత్యములే.ఆకాశము పడిపోవునుగాక , హిమాలయములు కృంగిపోవునుగాక , భూమిబ్రద్ధలగునుగాక , నా పలుకులెన్నడును వ్యర్థములు గావు, అవి పరమ సత్యములే యని భగవానుడు పలికిన వాక్యములు వివిధ పురాణములలో స్మరణీయములే గదా! కనుక " సత్యసన్ధః " అని కీర్తిగాంచెను.

511) దాశార్హః- ఓం దాశార్హాయనమః

దానమునకు అర్హుడైన వాడని ఈ శబ్దమునకు అర్థము. యజ్ఞయాగాదులందు భక్తులిచ్చు కానుకలను స్వీకరింౘుటకు అర్హుడైనవాడు భగవానుడొక్కడే యగుటచేత " దాశార్హః " అనబడును. ( దాశః అనగా దానము అని అర్థము).

" దాశార్హ ". వంశమున (యాదవ వంశమున) జన్మించిన కారణాన
శ్రీహరి " దాశార్హః" అని పిలువబడును.

దానమును స్వీకరింౘుటకు అర్హుడు భగవానుడొక్కడే కనుక
బ్రహ్మప్రీతంబుగా దానము చేయవలయును. అదియే సత్పాత్రదానము అగునని భావము.
--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(26_01_2019)

హరిః ಓమ్

54 వ. శ్లోకము

సోమపో√మృతపః సోమః పురుజత్పురుషసత్తమః ।
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః ।।

ఈ మంగళశ్లోకము దశవిధ దివ్యనామ శోభితము.

512) సాత్త్వతాంపతిః - ఓం సాత్త్వతాంపతయేనమః

సత్వగుణ సంపన్నుల కందరికినీ అధిపతియగుటచేత భగవంతుడు
సాత్త్వతాంపతియని భావింప బడుౘున్నాడు. సాత్త్వతవంశస్థులకు(యాదవులకు)
ప్రభుడగుటచేత కూడా శ్రీకృష్ణుడట్టి నామముతో పూజనీయుడగును. సాత్త్వతముులనగా తంత్రములనియు అర్థముగలదు. వానిననుసరింౘువారు
సాత్త్వతులన బడుదురు. వారికికూడా శ్రీహరియే ప్రభువగుటచేత సాత్త్వతాంపతి
యని అర్చనీయుడగును.

త్రిగుణములలో శ్రేష్ఠమైనది సత్త్వగుణము. దానిని బాగుగా
నలవరౘుకొన్నచో ఆత్మజ్ఞానము కల్గునని భావము.

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

513) జీవః- ఓం జీవాయనమః

పరమాత్మయే మనశరీరములందు జీవుడై వెలయుౘున్నాడు.
మాయావశుడై, కర్మబద్ధుడై, కర్తృత్వభోక్తృత్వముల ననుభవింౘుౘు నున్న
జీవుడు వాస్తవముగా పరబ్రహ్మమగుట చేత "జీవ" శబ్ద వాచ్యుడగును.
"క్షేత్రజ్ఞంచాపిమాంవిద్ధి సర్వక్షేత్రేషు భారత ". అన్ని క్షేత్రములయందును నేను
క్షేత్రజ్ఞుడనయి యున్నాను. (గీత 13_2) క్షేత్రజ్ఞుడే జీవుడు.

కర్తృత్వభోక్తృత్వములు తనకు లేవని తలచి నిష్కామకర్మానుష్ఠానము
చేయవలెను. అప్పుడు " జీవ " స్వరూపము నశించి బ్రహ్మతత్త్వమును బొందునని
గ్రహింపవలెను.
--((**))--



విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(28_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

515) ముకుందః
ఓం ముకుందాయనమః

మోక్షము నిచ్చువాడని ఈ నామముయొక్క భావము. సమస్త కర్మ
బంధములనుండి తొలగించి జననమరణ, జరా వ్యాధి క్లేశములను బోగొట్టి
మోక్షమును ప్రసాదింౘువాడు కావున "ముకుందః" అను పవిత్ర నామవాచ్యుడు
అగుౘున్నాడు. "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ అహం త్వాసర్వ
పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ".

సకల ధర్మములను విడనాడి నన్నే శరణుబొందుము. సమస్తపాపముల
నుండియును నిన్ను విముక్తుని గావించెదను. దుఃఖింపకుము అని గీతాచార్యుని
వాగ్దానము స్మరణీయము (అ 18 శ్లో 66).

516) అమితవిక్రమః
ఓం అమితవిక్రమాయనమః

తన అవతారములయందు అనంత బలపరాక్రమములను ప్రదర్శించి
రాక్షస సంహారము గావించిన కారణమున "అమితవిక్రమః" అని అర్చనీయు డగును. మఱియొక వివరణము విక్రమములనగా పాదములని అర్థము. అమిత
విక్రమః అనగా కొలుౘుటకు వీలుగానంత పెద్దవగు పాదవిన్యాసములు గలవాడని
భావము.

కావున బలిచక్రవర్తినుండి మూడడుగులు దానముగా స్వీకరించి
తన పాదములచేత ముల్లోకములందునూ వ్యాపించిన వామనావతారమును
ఈ పవిత్రనామము విశదీకరింౘుౘున్నది అని గ్రహింపనగును.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(29_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

517) అంభోనిధిః
ఓం అంభోనిధయేనమః

(1) మహాసాగరమునకు "అంభోనిధి" యని పేరు. అంభస్సులనగా
జలములు. వానికి నిధి కావున సాగరము "అంభోనిధి" యని పేరు గాంచెను.
"సరసామస్మిసాగరః " జలాశయములలో నేను "సముద్రమును" అని భగవద్వాక్యము స్మరణీయము (10_24).

(2) దేవతలు, పితృదేవతలు,మనుష్యులు, అసురులు. ఈనలుగురకును
అంభస్సులని పేరుగా శ్రుతి వాక్యము గలదు. ఇట్టి అంభస్సులు తనయందు
విహితములై యున్నందున. శ్రీహరి "అంభోనిధి" యని పేరు గాంచెను.

(3] అలంకారిక భాషలో భగవానుడు "సాగరముగా "(అంభోనిధిగా)
ప్రసిద్ధుడయ్యెనని విజ్ఞులు భావింతురు. నిశ్చలత్వమునకును, గాంభీర్యమునకును, స్థితప్రజ్ఞత్వమునకును సాగరము చిహ్నము (భగవద్గీత
2_70).

సాగరము సదాప్రణవము (ఓంకారోపాసనము) చేయునుగాన సాగరుడు
భగవద్విభూతి అయ్యెను.

518) అనంతాత్మా
ఓం అనంతాత్మనేనమః

(1) "దేశ కాల, వస్తు, పరిచ్ఛేదములు లేనివాడగుటచేత అనంతాత్ముడని భజనీయుడయ్యెను.

(2) తానొక్కడే అయిననూ విశ్వమంతయును చిత్ర విచిత్ర రూపములతో వివిధ నామభేద రూపములతో విస్తరించి, వికసించి, విరాజిల్లి వ్యాపించి యున్నవాడు ఈశ్వరుడేయగుటచేత " అనంతాత్మా" అని స్తవనీయుడగుౘున్నాడు.

విశ్వమంతయును విశ్వనాథుని విరాట్స్వరూపమే గాన సర్వభూత
సేవనమే ఈశ్వరసేవ యగునని సాధకులు గ్రహింపవలెను.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(30_01_2019)

హరిః ಓమ్

55_వ. శ్లోకము

జీవో వినయితా సాక్షీ ముకుందో √మితవిక్రమః ।
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయోంతకః ।।

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు దివ్యనామ పరిశోభితమై యున్నది.

519) మహోదధిశయః
ఓం మహోదధిశయాయనమః

1) క్షీరసాగరము నందు ఫణిరాజు శయ్యపై సుఖముగా శయనించినవాడు (శేషసాయి) అని ఈ నామమునకు భావము.

2) ప్రళయ జలరాశిపై వటపత్రముపై పరుండి తన కరారవిందము
చేత పదారవిందమునుబట్టి తనముఖారవిందము నందుంౘుకొని తన స్వస్వరూపామృతమును ఆస్వాదింౘు వాడనియును భావము కావున (వటపత్రశాయి) "మహోదధిశయః" అని వర్ణింపబడెను.

520) అన్తకః
ఓం అన్తకాయనమః

నాశనము చేయువాడని ఈనామముయొక్క సామాన్యార్థము.
అనగా ప్రళయకాలమునందు సమస్తభూతములను లయము గావింౘు పరమేశ్వర స్వరూపమగుటచేత "అన్తకః" అను నామమున శ్రీహరి పేరుగాంచెను.

తన భక్తులలోనుండి కామక్రోధాది దుర్గుణములన్నింటిని
అంతము (నాశనము) చేయువాడగుటచేత కూడా "అన్తకః" అని ప్రసిద్ధుడగును.

మనస్సులోని దుర్గుణములను హరికీర్తనా బలముచే నాశనము
చేయవలెనని గ్రహింౘునది.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(31_01_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

521) అజః
ఓం అజాయనమః

1) పుట్టుక లేని వాడు గనుక పరమాత్మ "అజః" అని ప్రసిద్ధుడు.

2) రజోగుణమునాశ్రయించి చతుర్ముఖబ్రహ్మయై సృష్టిని గావించిన
వాడు పరమాత్మయే గాన "అజః " నామవాచ్యుడగును.

3) "అ". అనగా విష్ణువు అని అర్థము. "జ". అనగా జన్మించిన వాడు.
విష్ణువునకు జన్మించినవాడు మన్మథుడు గదా. మన్మథుడు భగవద్విభూతి గీతలో చెప్పబడెను. (ప్రజనశ్చాస్మి కందర్పః) (గీత 10_28) కనుక అజుడని
ప్రఖ్యాతి గాంచెను.

522) మహార్షః
ఓం మహార్షాయనమః

ౘక్కగా పూజింౘుటకు అర్హుడైనవాడని ఈ శబ్దార్థమైయున్నది.

"త్వమస్యపూజ్యశ్చ". నీవు పూజనీయుడవు. అని గీతావాక్యము
గదా (గీ 11_13).

పూజింపదగినవాడును, కీర్తింపదగినవాడును, స్మరింపదగిన
వాడును ఒక్క భగవానుడేకదా! కావుననే గీతలో _ మన్మనా భవమద్భక్తః _
మద్యాజీ _ మాం నమస్కురు_ మామేవైష్యసి" అని భగవానుడు పలికినాడు.

నాయందు మనస్సునుంౘుము, నన్ను ప్రేమింపుము, నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము, నీవు నన్నే పొందుదువు (గీ_18_65)
అని శ్యామసుందరుని దివ్యవాణి. కనుక భగవానుడు " మహార్షః " అని
కీర్తనీయుడగుౘున్నాడు.

523) స్వాభావ్యః
ఓం స్వాభావ్యాయనమః

నిరంతరమును తన స్వస్వరూపాత్మ భావనయందే యుండు
వాడగుటచేత, అనాదియగుటచేతను " స్వాభావ్యః " అని ప్రస్తుతింపబడెను.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(01_02_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

524) జితామిత్రః
ఓం జితామిత్రాయనమః

జిత+అమిత్రః = జితామిత్రః, జిత= జయింపబడిన, అమిత్రః = శత్త్రువులు గలవాడు, అనగా సర్వశత్రు సంహారకుడని అర్థము.

తన అవతారములలో దేవవిరోధులగు రాక్షసగణములను
సంహరించుటచేత " జితామిత్రః ". అనబడును. ఆధ్యాత్మికసాధకుల మనస్సు
లలో సంక్షోభము కలుగచేయుౘుండు రాక్షసులను (అనగా కామక్రోధాది వికారములను), సంహరింౘువాడు శ్రీహరియేయగుటచేత "జితామిత్రః" అనికీర్తిమపబడెను. అరిషడ్వర్గములను జయింపవలెనని గ్రాహ్యము.

525) ప్రమోదనః
ఓం ప్రమోదనాయనమః

ఆనందమును కల్గింౘు వాడని భావము.
తన్నాశ్రయించిన భక్తులకు ఆనందమును కల్గింౘు వాడగుటచేత
ప్రమోదనః అనబడుౘున్నాడు.

526) ఆనందః
ఓం ఆనందాయనమః

"ఆనందోబ్రహ్మ". పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన అనంతానందములోని ఒక్క అంశమే సకల భూతములకును ఆనందకారణమని శ్రుతి గానము చేయును.


విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(02_02_2019)

హరిః ಓమ్

56_వ. శ్లోకము

అజో మహార్షః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ।।

ఈ పవిత్రశ్లోకము దశవిధ పుణ్యనామ సంభరితము.

527) నన్దనః
ఓం నన్దనాయనమః

తన్నాశ్రయించి న వారలందరకును ఆనందమును గలిగింౘు వాడు ఈశ్వరుడేయగుటచేత " నన్దనః " అనబడెను.

525,526,527. నామములు భగవానుని పరమానందస్ఫూర్తిని
వివరింౘుౘున్నవి. విశ్వమునందుగల ఏ పదార్థములోనూ ఆనందములేదు.
ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఆనందమూర్తి.

యేహి సంస్పర్శజా భోగః దుఃఖయోనయ ఏవతే ।
ఆద్యంతవన్తః కౌంతేయ, నతేషురమతే బుధః ।।

ఇంద్రియ భోగములన్నియునూ దుఃఖములతో కూడియున్నవే యగును. అందలి సుఖములు కేవలము పరిమితకాలము మాత్రమే యుండునవి.
కనుకజ్ఞానులు వానియందనురాగమును బొందరు. . అని భగవద్వాక్యము
(అ 5_శ్లో_22). అక్షయమగు సుఖానందములు ఆత్మయందేగలవు. బాహ్యపదార్థములలో లేవు. కనుక సాధకుడు ఇంద్రియ సుఖములనపేక్షింపక అతర్ముఖుడై తనయందేయున్న అనంతానందామృతమును . ఆస్వాదింపుమని
సారాంశము. " యో వై భూమాతత్సుఖం నాతః సుఖమస్తి" ( ఏది భూమమో అనగా అఖండమో అదియే సుఖప్రదమనియును, పరిమితములగువానియందు
సుఖానందములులేవనియును చాందోగ్యోపనిషత్తు తెలుపును.

528) నన్దః
ఓం నన్దాయనమః

సమస్త సుఖ సిద్ధులతోను కూడిన వాడగుటచేత " నన్దః " అని
పరమాత్మ ప్రశంసనీయుడయ్యెను.

529) సత్యధర్మా
ఓం సత్యధర్మణేనమః

సత్యమునకును ధర్మమునకును మూలమైనవాడు పరమాత్మ. అంతమాత్రమేకాదు ఉత్తమధర్మములయిన, అహింస, కరుణ, ప్రేమ, త్యాగము, శౌచము మున్నగు వానికి విధానము భగవానుడే. కావున రామాయణమున
" రామో విగ్రహవాన్ ధర్మః " రాముడు మూర్తీభవించిన ధర్మమని వర్ణింపబడి యున్నది. సారాంశమేమనగా సత్యధర్మాదులను నిత్యదైనందిన జీవితములో
అనుష్ఠింౘినవానికే మోక్షలక్ష్మి సిద్ధిౘునని తాత్పర్యము. " సత్యంవద ధర్మంచర ".

530) త్రివిక్రమః
ఓం త్రివిక్రమాయనమః

విక్రమములనగా పాదములు. మూడు పాదములచేత ముల్లోకములనూ ఆక్రమించిన వామనావతారము ఈ పవిత్ర నామమున గానము చేయబడుౘున్నది.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(10_02_2019)

హరిః ಓమ్

58_వ. శ్లోకము

మహావరావహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ।।

ఈ మంగళశ్లోకము తొమ్మిది పుణ్యనామములతో విలసిల్లు ౘున్నది.

544) గహనః - ఓం గహనాయనమః

తేలికగా లోనికి ప్రవేశింప శక్యము కానివాడని ఈ నామము యొక్క
భావము. భగవంతుడు చక్షురాది యింద్రియములకగోచరుడు . అంతర్ముఖమైన
యింద్రియముల ద్వారా, యమ, నియమ, ప్రాణాయామాది యోగానుష్టానముల
ద్వారా మిగుల కష్టములతో పొందబడువాడు కావున " గహనః " అని ప్రసిద్ధుడగును.

545) గుప్తః - ఓం గుప్తాయనమః

మనస్సుచేత తెలియబడజాలని వాడగుటచేత " గుప్తః " " ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే " అని శ్రుతివాక్యము.
ఆత్మ సర్వభూతములయందునూ గూఢముగా నున్నందున ప్రకాశించుటలేదని
భావము.

546) చక్రగదాధరః - ఓం చక్రగదాధరాయనమః

చక్రమును, గదను ధరించిన మహావిష్ణువని యర్థము. ధర్మ
సంస్థాపనార్థముగ భగవానుడు చర్రగదాధారియై అవతరింౘు నని పురాణ వర్ణనము. చక్రముపేరు సుదర్శనము, గదపేరు కౌమోదకి. వేదాంత భావమున
చక్రము మనస్తత్త్వమును, " గద " బుద్ధితత్త్వమును సూచింౘునని భావము.
--((**))--

(11_02_2019)

హరిః ಓమ్

59 వ. శ్లోకము

వేధాః స్వాంగో√జితః కృష్ణోదృఢః సంకర్షణో √ చ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ।।

ఈ దివ్యశ్లోకము నందు పదకొండు భగవన్నామములు వర్ణితములు.

547) వేధాః
ఓం వేధసేనమః

వేధాః అనునామమునకు సృష్టికర్తయని అర్థము. నామరూపాత్మక
మగు సృష్టికంతకునూ హిరణ్యగర్భ రూపమున శ్రీహరియే కారకుడగుటచేత
" వేధాః " అను దివ్యనామవాచ్యుడగుౘున్నాడు.

548) స్వాంగః
ఓం స్వాంగాయనమః

సుందరమగు అవయవములతో శోభిల్లుౘున్న వాడని ఈనామము యొక్క భావార్థము. శ్రీరాముడు పుంసాం మోహనరూపుడుకదా. ఇక శ్రీకృష్ణుడా
మన్మథమన్మథుడు. ఇట్టి సుకుమార సుందర మనోజ్ఞములగు అవయవములతో
శోభిల్లు సగుణసాకార పరబ్రహ్మము భక్తులకు ధ్యానయోగ్యమగును. కావున
స్వాంగః అని భావింపబడుౘున్నాడు.

మఱొక అర్థము: సృష్టి కార్యాదులను రచింౘుటకు మఱియెట్టి
యితర సాధనములతోను ( అంగములతోను) నిమిత్తము లేకుండగనే, తనంతటతానే సర్వకార్యనిర్వహణము చేయువాడు పరమేశ్వరుడగుటచేత
" స్వాంగః ". అనుదివ్యనామవాచ్యుడగును.

ఆధ్యాత్మిక సాధకుడు తనసర్వకార్యములను యితరులపై
ఆధారపడక తనంతతానే చేసికొనుౘుండవలెనని గురువులు బోధింతురు.

549) అజితః
ఓం అజితాయనమః

అపజయము లేనివాడని ఈశబ్దముయొక్క అర్థము. అనగా
తనయవతారములయందెన్నడు అపజయము నెఱుంగడు. వాసుదేవుని
ఆశ్రయించినవాడికి ఎన్నడూ అపజయముండదని భావన. భక్తున కెన్నడునూ
పతనము లేదని భగవద్వాక్యము గదా!(గీత 9_31)